మొన్న ఆఫీస్ కి స్కూటర్ మీద తీరిగ్గా బయల్దేరాను.. అసలు ఇంటి నుండే పని చేద్దామనుకున్నా.. కానీ అత్యవసరం గా రమ్మంటే.. ఉన్న పళాన బయల్దేరాల్సి వచ్చింది. అవుటర్ రింగ్ రోడ్డు మీద బోల్డు ట్రాఫిక్! టక్క్మని శబ్దంవచ్చింది.. ఏంటా అని చూస్తే.ఏమీ ప్రత్యేకం గా తేడా గా అనిపించలేదు.. ముందర ఆఫీస్ బ్యాగ్ అయితే ఉంది. సరే రోడ్డు మీద ఏదైనా రాయో రప్పో లే అనుకుని నా దారిన నేను పోతుంటే..
పక్కన కార్ డ్రైవర్ హారన్ కొట్టి కొట్టి ఇబ్బంది పెడుతున్నాడు.. కొద్ది సేపు ఇగ్నోర్ చేసి.. తర్వాత కోపం గా చూసే టప్పటికి అర్థమైంది.. వాళ్ళేదో చెప్పటానికి ప్రయత్నిస్తున్నారని.. వాళ్ళు రోడ్డుకి మధ్యన అడ్డంగా కార్ ని రాయల్ గా ఆపేసి.. నన్ను రమ్మని సైగ చేస్తే.. నేనూ అయోమయం గా వాళ్ల పక్కకి వెళ్లి నిలుపు కున్నాను...
జనాలంతా ఏదైనా అయిందేమో అని చుట్టూ ఆసక్తి గా చూస్తున్నారు... చెత్త ట్రాఫిక్ లో ఏదైనా మసాలా దొరకచ్చు అని! కార్ లో వాళ్ళు.. 'నీ మొబైల్ పడిపోయింది ..బ్రిడ్జ్ మీద.. ఒక సైకిల్ అబ్బాయి వెంటనే తీసుకుని పారిపోయాడు..' అని చెప్పారు..
ఈలోగా 'ఏ ఫోన్...ఎలా? ఎక్కడ పెట్టుకున్నావు? ....' అని పక్క నున్నవాళ్ళు ఊదర కొట్టటం..
మంచి ఖరీదయ్యినదైతే 'అయ్యో...' వాల్యూ ఎక్కువ కదా! .. నేను షాక్ లోంచి బయటకొచ్చేసరికి.. జనాలు చుట్టూ అడుగుతున్నారు.. ఆశ్చర్యమేంటంటే.. ట్రాఫిక్ లో అరక్షణం వేస్ట్ చేయలేని మోటార్ సైక్లిస్స్టులు, బస్సుల మధ్యలోంచీ, ఫుట్ పాతుల మీద రాళ్ళమీదనుండీ. కరెంట్ స్తంభాల మధ్య ల్లోంచీ దూకుడు గా హారన్ కొడుతూ దూసుకెళ్ళే వారంతా .. ఏ మాత్రం తొందర లేకుండా.. నింపాది గా ఎదురు చూస్తున్నారు.
'అంత ఖరీదైనది కాదని అన్నాను.. అంతే..
వాళ్ళని నేనేదో బొట్టు పెట్టి పిలిచినట్టు.. వాళ్ళని నేను డిజాప్పాయింట్ చేసినట్టు నిరసన గా.. అంతా వెళ్ళిపోయారు. సిగ్గేసింది. కనీసం ముప్ఫై వేల రూపాయల ఫోన్ పోగొట్టుకుంటే.. కాస్తైనా ఇజ్జత్ ఉండేది ఇలాకా లో.. ఈసారి మంచి ఖరీదైంది పారేసుకోవాలి .. అని ముందర గట్టి నిర్ణయం తీసుకుని.. అప్పుడు పోయిన సెల్ ఫోన్ కోసం బాధ పడటం మొదలు పెట్టాను. ఒకటి రెండు సార్లు ఫోన్ చేస్తే ఎత్తాడు కానీ.. తర్వాత సిం కార్డ్ విసిరేసుంటాడు.. చాలా cheated గా, నీరసం గా అనిపించింది.
ఫోన్ లో రికార్డ్ చేసిన పిల్లల విన్యాసాలు,.. తీసిన వందలాది ఫోటోలు.. ఐదేళ్ల నుండీ మేరు పర్వతం లా పెరిగిన కాంటాక్ట్ లిస్టూ... కళ్ళ ముందు రీల్స్ గా తిరగటం మొదలయింది.. చా.. సినిమాలు తగ్గించాలి.. మరీ రింగురోడ్డు మీద రింగులు రింగులు గా వెళ్లి పోవటం.. బాగుండదు కదా.. అని ఎలాగో వచ్చి పడ్డాను ఆఫీసుకి..
అప్పుడు .. చూడాలి కష్టాలు.. మా వారి నంబర్ అయితే గుర్తుంది, మాట్లాడాను కానీ.. ఇంకెవ్వరి నంబర్లూ గుర్తు లేవు. ఇంటి నంబర్ తో సహా.. తనని అడగ వచ్చు కానీ ఆమాత్రం తెలియదా అని గేలి చేస్తారేమోనని ఒకటి రెండు సార్లు తప్పు నంబర్లకి చేసి.. మొత్తానికి ఇంటి నంబర్ కి చేయగలిగా!!!...
సాయంత్రం ఎవరికో ఫోన్ చేయాలంటే ఆ నంబర్లు లేవు. ఫోన్ లేకపోవటం తో ఎప్పుడూ సీట్ లోనే కూర్చోవాల్సి రావటం అన్నింటికన్నా పెద్ద కష్టం లా తోచింది.ఎవ్వరు ఫోన్ చేసినా ఉండాలని..
సెల్ లేనిదే అస్సలూ నడవదు కదా.. ఇంట్లోంచి బయటకెళ్ళేముందు కార్ లో కూర్చుని.. నేను తాళాలేసుకునే లోపలే 'మంచి నీళ్ళు తీసుకురా.. స్టడీ రూం లోంచి ఫలానా పుస్తకం తీసుకురా ' అని ఫర్మాయిష్ లు కూడా ఈ మొబైల్ ఫోన్ ద్వారా నడుస్తూ ఉండటమే!..సూపర్ మార్కెట్ లో ఒక ఐల్ నుండి రెండో ఐల్ లోకీ ఫోన్ కాల్స్!! రెండు నిమిషాలు లేటైతే కాల్స్.. మూడు నిమిషాలు ముందు వచ్చానని కాల్స్.. వంకాయ పులుసు లో పోపెలా పెట్టాలని కాల్స్.. అడ్రస్ కనుక్కోవటానికి కాల్స్.
మొన్నీ మధ్య ట్రైన్ జర్నీ ముందు గా ఒక పిచ్చి ట్రైన్ లో చేసుకుని.. తర్వాత తత్కాల్ లో మాకు కావలసిన ట్రైన్ లో చేసుకున్నాం. మా వారు ..రైలెక్కాక.. 'అన్నట్టు... టికెట్ కాన్సెల్ చేసావు కదా?' అని అడగగానే.. గుండె లటుక్కుమంది. అసలే మమ్మల్ని ఎక్కించటానికి కూడా వచ్చారు మావాళ్ళు.. మర్చిపోయానూ అంటే.. ఎంత అప్రతిష్ట! ' అని 'యా.. చేసేసా' అన్నాను. రైల్లో పిల్లి లా వెళ్లి తన జేబు లోంచి ఐఫోన్ తీసి.. రెండు నిమిషాల్లో కాన్సెల్ చేసేసి.. మళ్ళీ జేబు లో పెట్టేసి.. 'హమ్మయ్యా' అనుకున్నా..
ధనుస్సు లేని రాముడినీ, వేణువు లేని కృష్ణుడినీ, త్రిశూలం లేని శివుడినీ అయినా ఒక్కోసారి ఊహించవచ్చు.. 'సెల్లు' అనే మంత్రదండం లేని మనిషి ని ఈరోజుల్లో ఊహించగలమా? మా పనమ్మాయి మేరీ దగ్గర్నించీ.. మా బాసు దాకా అంటా సిట్యుయేషన్ ని ఆనందం గా వాడేసుకున్నారు. .. మేరీ రాలేదు.. ఫోన్ చేసి అడుగుదామంటే నంబర్ లేదాయే.. వచ్చినప్పుడు 'ఏంటి ... చెప్పా పెట్టకుండా మానేయటమేనా? ' అని నిలదీస్తే.. 'ఫోన్ పన్నిటా.. ఎంగ పోయిటాంగ నీంగ మాడం ? ' అని చిలిపి గా, అమాయకం గా అడిగినట్టు అడిగింది.. ఏం చేస్తాం? నంబర్ ఒక కాగితం మీద రాసుకున్నా.. (ఆ కాగితం గంట లోపలే పారేసుకున్నానను కొండి)
బాసు గారేమో.. 'I called your desk number multiple times.. Looks like you were away.. ' అని కాస్త ప్రోబింగ్ గా అడిగారు.. రెండో రోజు డ్రైవర్ నంబర్ తీసుకోవటం మర్చిపోయి హడావిడిగా ఆఫీస్ లోపలకి పరిగెట్టేసరికి సాయంత్రం.. ఎనిమిది అంతస్స్థుల్లో కార్ ఎక్కడ పెట్టాడో తెలియక లాప్ టాప్ బ్యాగ్ తో తిరగాల్సి వచ్చింది.
అంటే ఎంత టైం వేస్ట్? అసలు ఎంత కష్టం...? అని నా మీద నేను తెగ జాలి పడిపోయి.. ఇలా కాదని.. ఎలాగయినా.. ఇన్స్ట్రుమెంట్ కొని తీరాలని అనుకున్నా.. కానీ.. ఇల్లూ.. పనులూ గుర్తొచ్చి..మళ్ళీ పోస్ట్ పోన్ చేసేసా.. ఇంటికొచ్చాక చాలా కాలానికి మా లాండ్ లైన్ ఫోన్ ఏ మూల ఉందో చూసి దుమ్ము దులిపి.. కొత్త ఫోన్ వచ్చేదాకా ఇదే కదా గతి అని అనుకునేంతలో.. రింగ్ అవుతొంది...
అమ్మ..
'ఎక్కడికెళ్ళావు? ఈరోజంతా లేవు.. ఇంటి ఫోన్ కీ అందాకా.. సెల్ కీ అందక? భయపడి చచ్చాను..!!!' హ్మ్.. అనుకున్నా.. ఈ ఫోన్ పోవటం వల్ల .. కాస్త ఇంపార్టెంట్ గా ఫీల్ అయ్యా... కానీ పాత విషయం గుర్తొచ్చింది..
మా స్కూల్ రోజుల్లో హైదరాబాద్ లో ఉండే వాళ్ళమేమో.. ఊర్ల నుండి వచ్చిన చుట్టాలని ఎక్కడికి తీసుకెళ్లాలన్నా, మా సర్వీస్ ల అవసరం మా తల్లిదండ్రులకుండేది. అలా వెళ్ళినప్పుడు చుట్టాల ఇళ్ళల్లో ఒక్కోసారి రాత్రి కి ఉండిపొమ్మంటే ఉండిపోయేవాళ్ళం. మా ఇంట్లోనూ ఫోన్ ఉండేది కాదు.. మా వాళ్ళిళ్ళల్లో అంతకన్నా ఉండేవి కావు! ఇంటికి రాత్రి ౧౦ దాటినా రాలేదంటే బహుశా అక్కడ ఉండిపొమ్మన్నారేమో అనుకునేవాళ్ళు మా పెద్దవాళ్ళూనూ..
ఆ రోజుల్లో ఉన్న 'ఏమీ కాదన్న' నమ్మకం ఈరోజు ఉందంటారా? అప్పట్లో ఒకసారి మా చెల్లి, సడెన్ గా మత కల్లోలాలయ్యాయని కర్ఫ్యూ విధించినప్పుడు ఇంటికి దాదాపు 20 కి. మీ. దూరం లో ఉండిపోయింది. అప్పుడు ఫోన్ అవసరం.. దాని ప్రాముఖ్యత తెలిసి వచ్చి మా ఇంట్లో.. ఎక్కువ డబ్బు ఇచ్చైనా పెట్టిన్చుకోవాలనే పట్టుదల వచ్చేసింది.అప్పటిదాకా మాకు లాండ్ లైన్ ఫోనే లేదు! తర్వాతైనా.. ఫోన్ కాల్స్ అంటే అత్యవసర పరిస్థుతులకోసం..
ఏమాట కామాటే చెప్పుకోవాలి.. ఫోన్ లేకపోవటం వల్ల withdrawl symptoms కనిపించినా (అంటే రెండు చేతులూ వాడుతూ పని చేస్తున్నప్పుడు కాస్త తల భుజం మీద కి వంచి.. ఫోన్ అటెండ్ చేస్తున్న పోజు లో ఉండటం.. చేతులు ఫోనుని ఫ్లిప్ ఫ్లాప్ చేసున్న ఆక్షన్ చేస్తూ ఉండటం.. కనులు మూసినా ఫోన్.. తెరిచి చూసినా ఫోనే ... ఇలాగ ఆఫోన్ గురించి కన్నీరు కారుస్తూ ..బెంగ పెట్టుకుంటే.. ఎందుకో తట్టింది..
నాకు ఫోన్ లేదని ఆఫీస్ లో వీకెండ్ సపోర్ట్ డ్యూటీ విముక్తి లభించిందని.. వీకెండ్ అంతా ఎక్కడో ఉన్న మనుషులతో కాకుండా హాయిగా చుట్టూ ఉన్న మనుషులతో మాట్లాడటానికి వీలైంది.. ఫోన్ లేనప్పుడు ఇలా ఉండేవాళ్ళమా అని ఆశ్చర్యం వేసింది! సూపర్ మార్కెట్ లో ఇక్కడ కలుద్దాం ఒకవేళ తప్పిపోతే అని ముందస్తు గా అనుకోవటం.. ఈ టైం కి వస్తానని చెప్పుకుని.. కాస్త అటూ ఇటూ అయితే కంగారు పడద్దని అనుకోవటం.. కొద్దిగా అనిశ్చత లో థ్రిల్, కొద్దిగా ఆరాటం లో ఉన్న భావోద్వేగం.. ఎదురు చూపు లో దాగున్న అభిమానాన్ని అసలు ఈ సెల్ ఫోన్లు ఎప్పుడు కబళించి వేసాయి? అని ఆశ్చర్యపడి .. ఆ తృప్తి ని తనివి తీరా అనుభవించాను..
మొత్తానికి ఏదో ఒక పాత ఫోన్ లో టెంపరరీ గా సిం కార్డ్ వేయించుకున్నా.. పాత కాలం టైప్ రైటర్ కి బలం గా నొక్కినట్టు నొక్కితేనే కానీ నంబర్ వెళ్ళని అరకిలో బరువున్న గుండ్రాయి లాంటి ఫోన్. అన్ని కాంటాక్ట్ లూ పోయాయి. ఐదేళ్ళ నుండీ సంపాదించిన నంబర్లు!!! ఎక్కడెక్కడ పట్టుకోను మళ్ళీ ?
ఇంక ఆఫీస్ లో కో వర్కర్స్, చుట్టు పక్కల వారు చుట్టాలు .. చివరికి పిల్లల దగ్గర్నించీ ఆంతా చెప్పేవారే.. కాస్త జాగ్రత్త గా బ్యాగ్ లో పెట్టుకోవాల్సింది...జిప్ వేసి పెట్టుకోవాలి.. రోడ్ మీద ప్రయాణాలప్పుడు!! (అదే మరి.. వినే వాడు వెంగళప్ప అయితే చెప్పేవాడు మహాజ్ఞాని అవుతాడు)
అప్పుడప్పుడూ కాంటాక్ట్స్ కంప్యూటర్ లోకి ఎక్కించుకోవా నీవు? (ఏదో రోజూ పళ్ళు తోముకోవా? ' అన్నంత ఎక్స్ప్రెషన్ ఇచ్చి మరీ అడగటం.. )
కొంత మందైతే మరీ.. స్కూటర్ నడపడం మానేయి అసలు.. అలాగే ఎత్తుకుపోతారు.. రేప్పొద్దున్న నీ ఆఫీస్ బ్యాగ్ ఎత్తుకుపోతెనో? (ఆహా.. అంత వంటి మీద స్పృహ లేని దాన్నా?)
ఇంకా అందరూ వాళ్ల పెద్దత్తగారి చిన్న కోడలి బావ ఫోన్ ఎలా పోయింది? దగ్గర్నించీ.. స్కూటర్ మీద వెళ్తున్న వాళ్ల ఆడపడచు వాళ్ల బాబాయి గారి కూతురి మెదలోంచి మంగళ సూత్రం ఎంత లాఘవం గా లాగేసారో.. కూలంకషం గా వర్ణించి చెప్పి నా బ్రెయిన్ వాష్ చేసేసారు.. (మనలోమాట.. నేనూ ఇలాంటి చాన్స్ వస్తే.. అస్సలూ తగ్గను ! ౩-౪ ఇలాంటి కథలు అనర్గళం గా చెప్పేస్తాను మామూలు గా.. ఇప్పుడు విక్టిమ్స్ మనం కదా.. అందుకే పెద్దగా సొక్కలేదన్నమాట)..
ఇదిగో.. సెల్ ఫోన్, లాప్ టాప్..పర్సూ అవీ .. జాగ్రత్త.. పారేసుకోకు.. (చా..సెటైర్లు.. ఒకసారి పోగొట్టుకున్నంత మాత్రాన.. ఎలా కనపడుతున్నాను?)
ఏం చేస్తాం..ఇలానేను ఎలా చేసి ఉండవల్సిందీ.. నేను చేసిన ప్రాథమిక తప్పిదాలేంటి అన్న విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవటం ఒక ఎత్తు.. ఫోన్లు ఎత్తటం మరో ఎత్తు.. కొంతమంది కాల్స్ స్క్రీన్ చేయటానికి లేదు. ప్రతి వాళ్ళు చేసిన ఫోన్లూ ఎత్తాల్సి వచ్చింది. బాస్ తో కస్టమర్ ఇస్ష్యూ గురించి మాట్లాడుతుంటే.. దూరం చుట్టాలావిడ కాల్.. ఏమైనా అర్జంటా? అంటే.. 'అబ్బే ..చాలా కాలం అయింది కదా అని ఊరకే చేశా ' అంది.. 'నా తల్లే ' అనుకుని.. సాయంత్రం మాట్లాదతానని వాగ్దానం చేసి బయటపడ్డాను.
అలా అని జరిగిన మరో మేలు ఉంది లెండి.. ఒక స్నేహితురాలు చేసిన పని మీద కోపం వచ్చి తన కాల్స్ తీసుకోవట్లేదు... కానీ నంబర్ చూపించక పోవటం తో.. ఎవరో ఏంటో అనుకుని ఎత్తి.. . మాట్లాడి మనస్పర్థలు దూరం చేసుకోవటమైంది. చాలా తేలిగ్గా అనిపించింది మనస్సంతా..
కొత్త ఫోన్ కొనాలి.. అనగానే..ఒక్కసారి బజార్ల లో వెరైటీ చూస్తే కళ్ళు తిరిగినంత పని అయింది. కళ్ళు మూసుకుని ఈసారి మినిమం ఫీచర్లున్న ఫోన్ కొనాలా? ఫోన్ పోయినా అంత బాధ పడకుండా.. లేక ఐఫోన్.. ఆన్డ్రైడ్ లాంటి హై ఎండ్ ? తర్జన బర్జన.. పిల్లలు ఐఫోన్..ఐఫోన్.. అని.. మా బాంక్ పాస్ బుక్కేమో.. కొద్దిగా చవకైన ఫోన్ అనీ.. హ్మ్..
ప్రతి సంవత్సరం అకాడెమిక్ ఇయర్ మొదలయ్యేముందు.. పుస్తకాలన్నింటికీ అట్టలేసి..జాగ్రత్తగా.. మొదటి వారమంతా అందంగా ఎలా నోట్స్ రాస్తామో.. జనవరి ఫస్ట్ నుండీ.. టెంత్ దాకా ఎలా డైరీ రాసి జిమ్ కెళ్ళి వస్తామో.. అలాగ నేనూ మొదట కొన్ని రోజులు రెగ్యులర్ గా సిస్టం లో ఫోన్ నుండి బాక్ అప్ చేసుకుంటా..
ఈలోగా.. మీ ఫోన్ నేను పొరపాటున ఎత్తక పొతే 'ఏదో పాత ఫోన్ కదా.. సిగ్నల్ సరిగ్గా దొరక లేదేమో అనుకొండే? ' ..