గత ఐదేళ్లు గా ఉద్యాన నగరి నుండి భాగ్య నగరి కి కార్ లో, విమానం లో బస్సు లల్లో ఎన్ని సార్లు వెళ్లామో లెక్కేలేదు. దేని అందం దానిదే నైనా.. రైల్లో ప్రయాణం మాత్రం నా ఫేవరేట్... వెళ్లిన ప్రతి సారీ ఏదో ఒక కొత్త వింత తెలుసుకునే లా చేస్తుంది. మళ్లీ ఒక్కసారి కూడా కలవలేకపోయినా ప్రయాణం లో కలిసిన సాటి ప్రయాణికుల ముద్ర హృదయం లో ఎక్కడో శాశ్వతం గా వేసేస్తుంది...
వేసవి సెలవలా? పిల్లలు.. 'అమ్మమ్మ ఇల్లో' అని ఒకటే గొడవ.. వాళ్ళని హైదరాబాదు నగరం లో దింపి ప్రతి వారాంతం మేమూ వెళ్లి వస్తూనే ఉన్నాం. ఈ హడావిడి తో టపాలూ రాయలేదు.. ఈ నెల.. ఒక బ్లాగు పుట్టినరోజు టపా వదిలి..
ఇవ్వాళ మాత్రం కాస్త ఖాళీ.. ఏప్రిల్ మాసం లో నాలుగు సార్లు వెళ్లి వచ్చాగా.. ప్రతి సారీ కొత్త అనుభవాలు.. సరదాగా బ్లాగ్మిత్రులతో పంచుకుందామనీ..
ఏప్రిల్ మొదటి వారం : ఉద్యాన నగరి ->భాగ్య నగరి.. ఆఖరి పరీక్ష రోజున..
పరీక్ష హాల్ లోంచి తెలుగు సినిమా ఆడే థియేటర్ కి వెళ్లి పోయేవాళ్లం.. మరి ఇప్పుడో .. ఆఖరి పరీక్ష రోజున కూడా టార్చర్ క్లైమాక్స్ ఎందుకని.. ఆ పధ్ధతి మానేశాం లెండి.. ఇలాగ ఎగ్జాం రాసి అలాగ రైలెక్కేసాం.. మా అమ్మాయిలు అసలు ఆఖరి పరీక్ష రాసాక.. ఇక జీవితం లో సాధించాల్సింది ఏమీ లేదన్నట్లు మొహాలు పెట్టి.. ఈ పరీక్షలు రాసి పెట్టాం.. మీ సంతోషం కోసం.. ఇక మేము చేయాల్సింది ఏదీ మిగల్లేదు అన్నట్టు.. అదేదో పది మంది సంతానం ఉన్న తల్లిదండ్రులు ఆఖరి పిల్ల పెళ్లి చేసాక అనుభవించేంత రిలీఫ్..
రైల్లో కనపడిన వస్తువల్లా కొనుక్కుని తిని ఆటలు పాటలతో వాళ్లు చుట్టు పక్కల ఎవ్వర్నీ పెద్దగా పట్టించుకోలేదు.. కానీ.. వృద్ధ దంపతులు.. మా ముందు సీట్లో.. ప్రతి చిన్న విషయం ఒకరితో ఒకరు చర్చించుకుంటూ.. ఒక పెద్ద సంచీ నిండా తెచ్చిన చిరుతిళ్లు ఒక్కోటి గా పధ్ధతి గా తీసుకుని తింటూ.. అంటే పకోడీలూ, బజ్జీల్లాంటివి కాదు పళ్ళు, మజ్జిగల్లాంటివి.. ఒకరి ఆరోగ్యం గురించి ఒకరు బోల్డు శ్రద్ధ తీసుకుంటూ..
తొమ్మిది దాటింది.. బెర్తులు దించేద్దామా అనుకుంటుండగా.. ఆయన మా ఆవిడ ఇంజెక్షన్ తీసుకున్నాక అరగంట ఇంకా మెలకువ గా ఉండాలి.. ఒక అరగంట ఆగి పడుకుంటారా? అని అడిగారు.. దానికేం భాగ్యం? అని వాళ్ల తో కబుర్లు.. మొదలు పెడితే.. చాలా చాలా ముచ్చట అనిపించింది.. పిల్లల పెళ్ళిళ్ళు అయ్యాక ఇద్దరూ ఒకరికి ఒకరు గా.. గత నలభై ఐదేళ్లు గా.. బోరింగ్ గా కాకుండా.. ప్రపంచం లో ఉన్న ప్రతి చిన్న విషయమూ చర్చిస్తూ.. ఒకరికోసం ఒకరుగా.. సామాన్య మైన ఆర్ధిక స్థితి, అయినా బోల్డు సంతోషం గా..
మేముండగలమా అలాగ ఒక ముప్ఫై ఏళ్ల తర్వాత? వీళ్ల లానే ఉండాలి అని కూడా అనిపించింది.. చాలా ఇన్స్పైరింగ్ జంట!
వాళ్లు దిగుతున్నప్పుడు 'వాళ్లిద్దరూ ఉన్నంత కాలం ఆనందంగా ఆరోగ్యం గా ఉండాలని ఇద్దరిలో ఒక్కరే మిగిలిపోయే సందర్భం రాకూడదని ఎందుకో కోరుకోవాలి అనిపించింది...
భాగ్యనగరి -> ఉద్యాన నగరి మళ్లీ రిజల్ట్ రోజున..
రైలెక్కాక పిల్లలకి భయమే.. 90% దాటితే ఏదో కొంటానన్నాను.. 'అమ్మా.. 80% కూడా మంచి మార్కులే.. కొంటావా? అని.. బేర సారాలు మొదలు.. ఈలోగా ఎదురుగా ఉన్న ఒకాయన మాట్లాడుతూ.. తన హాబీ గురించి చెప్తే గమ్మత్తు గా అనిపించింది.. ఆయనకి HAM Radio membership ఉందిట.. చాలా ఆక్టివ్ గా ఉంటారట..
మాకూ ఇంటరెస్ట్ కలిగింది.. వివరాలు కనుక్కున్నాం. ఉదయం దిగేముందు ఫ్రీక్వెన్సీ కి ట్యూన్ అయి.. అక్కడ అప్పటికే ఉన్న సభ్యులతో మాట్లాడుతూ.. "రైల్లో ఉన్నాను.. నా ముందు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు". అని మా ఇద్దరు పాపలనీ పరిచయం చేసారు. వాళ్లూ ఉత్సాహం గా మాట్లాడారు... అనుకోకుండా.. ఒక కొత్తదనం.
మీకూ తెలుసుకోవాలనుకుంటే..
http://www.indianhams.com/home.asp
ఉద్యాన నగరి -> భాగ్య నగరి కి మళ్లీ (రిజల్త్స్ తర్వాత)
పొలోమని స్టేషన్ కి పరుగు... యశ్వంత పుర కి ..మరీ మధ్యాహ్నం రెండింటికే.. పిల్లలకి సరదా.. పెద్దలకి ప్రాణ సంకటం.. :-(
ఒక పక్క ఆఫీసు లో కస్టమర్ ఇష్యూ తో కుస్తీ.. బాసు గారు .. ఇలా వదిలేసి వెళ్తే ఎలా? అని గొడవ.. 'నాయనా.. ఇలాగ రేపు హైదరాబాద్ లో ఉదయం ఐదు కి దిగటం.. కస్టమర్ తో మాట్లాడతా.. ఈలోగా.. ఫోన్ లో మాట్లాడండి.. (స్టేషన్ కీ స్టేషన్ కీ మధ్య కనెక్షన్ కలిసి ఏడిస్తే అని మనసులో అనుకుంటూ).. ఆయన విసుక్కుంటూ ఒప్పుకున్నారు.. వేరే దారేదీ? నేను తప్ప ఆ ఇష్యూ మీద పని చేసే వారు లేరు.. నేనా.. ప్రయాణం పోస్ట్ పోన్ చేసే ప్రసక్తే లేదు..
ముందర పాత టపా ' (లాప్) టాబ్భూషణం భూషణం ' లో చెప్పినట్టు.. అరటి గెలా, అత్తగారూ, అల్లరి పిల్లలూ, గుడ్డ సంచీలూ (మరి ప్లాస్టిక్ వద్దని కదా) , స్టీల్ లంచ్ బాక్సుల్లో ఆవకాయన్నాలూ .. తలకి నూనెలూ, మొహాన బొట్లూ.. 'అబ్బే.. ఎవ్వరికీ ఆనేలేదు.. ' కాస్త దూరం వెళ్ళాక.. మా కంపెనీ బ్యాగూ, అందులోంచి లాప్ టాప్ దీసి పిల్లల ఆటలూ చూశాక కొద్దిగా ప్రవర్తన లో మార్పు,..
ఒక చిన్నారి పాపాయి తల్లి దండ్రులు అన్నం తింటూ.. మాకు ఇచ్చేసారు.. ఇంకేం.. బోల్డు కాలక్షేపం!! రైలు లేటైనా.. 'అయ్యో అప్పుడే వచ్చేసామా' అనిపించేలా.. పాపాయి అసలు తల్లి దండ్రుల దగ్గరకి వెళ్తే గా? భాగ్య నగరి-> ఉద్యాన నగరి... పిల్లల్ని దింపేసి.. ఒక్కదాన్నే..
ఒక్కదాన్నే వచ్చానేమో.. పుస్తకాల లో మునిగి తేలి.. ఈదుతూ.. మధ్యలో గమనించాను.. ఎదురుగా ఉన్న (దాదాపు అరవై ఏళ్ల) ఆడవాళ్లంతా ఒక్కలానే ఉన్నారని..
కుతూహలం గా అడిగా.. ఏంటి ? అని.. వాళ్లు నవ్వేసి.. మేము ఆరుగురం అక్కచెల్లెల్లం మేము.. మాలో ఒక్కరే హైదరాబాద్ లో ఉంటుంది.. తన కొడుకు నిశ్చితార్థం అని వెళ్లి వచ్చాం... అన్నారు ఆశ్చర్యం వేసింది.. అందరూ బెంగుళూరులో బాంక్ ల్లో ఆఫీసర్లు, లెక్చరర్లు, అలాగ పని చేస్తున్నారు. వాళ్ల పెద్ద అక్క ఏమంటే అదే అన్నట్టున్నారు.. అసలు ఇలాగ గీసిన గీత దాటకుండా.. ఎంత చక్కగా ఉన్నారు? ఒకరిని మించి ఒకరు జోకులేస్తూ.. ఒకటే స్టీల్ కారియర్ తీసి భోజనం చేసి....
ఆశ్చర్యం వేసింది... ఆనందం గా అనిపించింది.. 'అయ్యో బెంగుళూరొచ్చేసిందా? ' అని నిట్టూర్చి దిగేసాను.
మళ్లీ భాగ్య నగరానికి... భార్యా భర్తలం..
రైలు ఇక కదులుతుందనగా భార్యా భర్తలు, ఒక టీనేజర్ కొడుకు వచ్చి ఎక్కారు. రొప్పు తగ్గక.. ఆయాస పడుతున్నారు. 'సాయి లీల .. వచ్చి ఎక్కాం అని తమిళం లో అనుకుంటున్నారు.. ' ఓహో చాలా సాయి బాబా భక్తుల్లా ఉన్నారు.. అనుకున్నాము..
కాస్త సెటిల్ అవగానే.. ముగ్గురూ, మఠం వేసి.. సత్య సాయి భజనలు మొదలు పెట్టారు.. ఇదేంట్రా.. ఇంత గట్టిగా మొదలు పెట్టారు అని విసుగేసింది.. కానీ.. ఒక పావు గంట దాటాక అనిపించింది. ఆవిడ శ్రావ్యం గా.. ఆయన భక్తిగా.. పిల్లవాడు ఉత్సాహం గా పాడుతున్నట్టు గమనించాము.
పెద్దవాళ్లు సరే, టీనేజర్ అంతలా పాడుతున్నాడంతే ఆశ్చర్యమే.. అనిపించింది. ఒక గంట కి పైగా పాడి.. ఇంక ఆపారు.. 'అమ్మయ్య.. ఇక చదువుకుంటా నా పుస్తకం ' అనుకోగానే.. పిల్లవాడు 'ఆంటీ.. అంకుల్.. మూసేయండి.. లాప్ టాప్స్ అలాగే పుస్తకాలు ' అని చనువు గా.. 'ఏదైనా డైలాగులు చెప్పండి అంకుల్.. అని తనని అడిగితె.. ఆయన.. చాలా చాకచక్యం గా..
'అబ్బే నాది ఆఫీస్ పని.. అంటీ కి ఇవన్నీ ఇష్టం.. తెగ పాడుతుంది.. ' అని నన్ను ఇరికించేసారు. ఎందుకన్నా మంచిదని నా తో ఐ కాంటాక్ట్ లేకుండా చూసుకున్నారనుకోండి..
మొదట విసుగనిపించి ..'ఏంటి ఈ అబ్బాయి ఇలాగ?' అని తెలుగు లో అనుకుంటుంటే ఆవిడ.. ' సారీ, మీకు ఇబ్బంది అయితే వద్దులెండి.. ' అంది ముభావం గా.. 'అయ్యో ' అని నొచ్చుకుని.. అసలు పాడటమంటే నాకు ఉన్న ఆసక్తీ.. చాన్స్ ఇలాగ దొరికితే ఊరుకోను అని ఆవిడని నమ్మించి.. 'ఎలాగోలా నేనూ రెండు మూడు పాటలు పాడి... ఆ అబ్బాయి చదువు కబుర్లూ, సాయి బాబా గారి కబుర్లూ, వారికి ఆయన పట్ల నమ్మకం, భక్తీ ఎలా ఏర్పడిందో.. చెప్తుంటే వింటూ కూర్చున్నాము.
పుట్టపర్తి లో ఎవరికో ఫోన్ చేసి కనుక్కుంటూనే ఉన్నారావిడ సాయి బాబా గారి పరిస్థితి..
"సాయి బాబా ఇంక నేడో రేపో అన్నట్టుంది.. అన్నారు కదా?" అనగానే.. కుటుంబం అంతా ఏకగ్రీవం గా తీవ్రం గా ఖండించారు.. అంతా మీడియా వల్ల ఇలాగ అనుకుంటున్నారు. ఆయన కి మరణం లేదు.. ఇంకో పదేళ్ల తర్వాత ఐచ్చికం గా సమాధి అవుతారని చెప్పారు. నేను 'ఓకే.. ఓకే' అని వదిలేసాను.
టాపిక్ మార్చి మీరేం చేస్తారు అని అడిగాను.. ఆశ్చర్యం వేసింది. చాలా చాలా చదువుకున్న కుటుంబం. ఆవిడ బెంగుళూరు విశ్వవిద్యాలయం లో ఒక విభాగం లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మరియు డీన్.. అలాగే సాయి బాబా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ లో ఆవిడ ఒక డైరెక్టర్ ట.. మీటింగ్ కని ప్రతి నెలా వస్తారుట..
ప్రశాంతి నిలయం నెక్స్ట్.. దిగుతారా? అని అడిగాను.. వారికి ఈ రూట్ లో పుట్టపర్తి వస్తుందని తెలియదట. దానితో చాలా సంతోషించారు.. నాకు పెద్దగా బాబా గురించి తెలియదు. ఆయన వల్ల చాలా మంది స్ఫూర్తి చెంది డాక్టర్లు ఉచిత సేవ చేస్తారని, ఆయన ట్రస్ట్ త్రాగు నీరు ఎన్నో ప్రాంతాలకి అందించారనీ, ఆయన ట్రస్ట్ విద్యా సంస్తలనీ నిర్వహిస్తుందని తెలుసు.
అలాగే ఎన్నో సార్లు ఆ స్టేషన్ మీదుగా వెళ్లినా పెద్దగా ఆసక్తి గా అనిపించలేదు.. కానీ ఈ మధ్య టీ వీ ల్లో చూసి చూసి.. స్టేషన్ రాగానే నేనూ కుతూహలం గా పుట్టపర్తి లో దిగాను... ఒక రకమైన గుగుర్పాటు గా అనిపించింది. వందలాది జనం.. ఆ ప్లాట్ ఫాం మీద సాష్టాంగ పడి సాయి బాబా.. కోలుకోవాలని 'ఓం సాయి రాం..' అని జపిస్తున్నారు.
నేనూ అప్రయత్నం గా.. ఇంతమంది అభిమానాన్ని దోచుకున్న సాయి బాబా.. కోలుకుంటే బాగుండును అని మనస్పూర్తి గా అనుకున్నా..
ఈలోగా.. వాళ్లబ్బాయి 'అమ్మా.. అక్కడ జనరల్ కంపార్ట్ మెంట్ లో అందరూ సాయి భజన లు చేస్తున్నారు.. వెళ్దాం పద' అనగానే.. ఆనందంగా కాస్త సామాన్లు మమ్మల్ని చూస్తో ఉండమని వెళ్లి పోయారు. వాళ్లు వచ్చే లోపల పడుకున్నాము కానీ.. ఉదయం మళ్లీ వారి సాయి భజనల తో మెలకువ వచ్చేసింది...
రెండో రోజు సాయి బాబా మరణించారు .. నేను ఆవిడ కి SMS రూపం లో సంతాపం ప్రకటించాను.. ఆవిడ రైలు టికెట్ కాన్సెల్ చేయించి కార్ లో ఆఖరి దర్సనం చేసుకోవటానికి వెళ్ళాం అని సమాధానం ఇచ్చారు..
ఉద్యాన నగరి -> భాగ్యనగరి మూడు రోజుల క్రితం.. బస్సు లో..
రైలు టికెట్ లేదు గా.. సరే అని బస్సు లో ప్రయాణం.. నేనేక్కినప్పుడు ప్రభాస్ సినిమా 'డార్లింగ్' నడుస్తోంది.. ఏదో సరదాగానే ఉన్నట్టుందని చూస్తున్నా.. ఒక గంట లో అయింది.. ఈసారి 'ఎక్ నిరంజన్ ' వేసాడు.
అబ్బా.. ఏంటీ.. ఈ ప్రభాస్ మోత.. అని విసుక్కుంటూనే చూసా.. అసలే బోల్డు డబ్బు పోసి కొన్నాం టికెట్.. అని.. అంతే.. ఉదయం నిద్ర లేస్తూనే హైదరాబాద్ పొలిమేరల్లో.. నా స్టాప్ రాగానే దిగిపోయాను.
భాగ్య నగరి -> ఉద్యాన నగరి నిన్న.. మళ్లీ కాచిగూడా ఎక్స్ ప్రెస్ లో...
ఒవైసీ, పహల్వాన్ కాల్పుల గొడవల తర్వాత హైదరాబాద్ బంద్.. పైగా వర్షం.. అని ఎందుకైనా మంచిదని ముందు బయల్దేరితే.. మరీ రైలు టైము కి రెండు గంటల ముందే వచ్చి చేరాం.. బోల్డు పుస్తకాలు కొనుక్కుని రైల్లో సెటిల్ అయ్యాక చూస్తె.. పిల్లలు కొద్దిగా బెంగ గా.. మరి అమ్మమ్మ గారింటినుండి వచ్చే పిల్లలంతే గా?
ఏవో పేక ముక్కలతో మాజిక్ చేస్తానని మా అమ్మాయి గొడవ. ,.. నాకేమో పుస్తకం చదవాలనీ.. అన్యమనస్కం గా వహ్వా లు చెప్తూ పుస్తకం చూస్తుంటే.. ఎదురుగా కూర్చున్న ఒకాయన 'ఏదీ నాకు చూపించు నీ మాజిక్? ' అని దాన్ని అడిగారు.. 'అమ్మయ్య.. ఇక నా పని చూసుకోవచ్చు.. కాసేపు.. ' అని పుస్తకం తెరిచా.. ఈలోగా చిన్నమ్మాయి.. ఏవో కబుర్లు చెప్తోంది. సరే లెమ్మని పుస్తకం మూసి వింటున్నా. మాటల్లో అర్థమైంది. ఆయన ఒక సర్జన్ అని. కుతూహలం గా ఆయన పక్కన కూర్చున్న ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో కబుర్లు చెప్తుంటే వింటూ కూర్చున్నా..
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చేతిలో తెలుగు పత్రికలని చూసి.. తెలుగు బ్లాగుల గురించి చెప్పి.. అగ్గ్రగేటర్ల లంకెలు ఆయన పత్రికల మీద రాసాను..
Doctor Subbarao V Kanchustambam
మా అమ్మాయితో ఆడే ఆయన ఒక Liver Transplant Surgeon. అపోలో ఆసుపత్రి లో చేస్తారట.. (ఆయన తన గురించి అంతే చెప్పుకున్నా.. వచ్చాక google చేస్తే తెలిసింది ఆయన గురించి..
దేశం లో కాలేయ మార్పిడి శాస్త్ర చికిత్సా నైపుణ్యం లో ఆయన కి ఆయనే సాటి అని.. ఆంద్ర ప్రదేశ నుండి ఆయన ఈ ఫీల్డ్ లో ప్రథముడనీ.. 2006 లో ఉత్తమ వైద్య బిరుదాన్కితుడనీ.. మూడు రోజులు వరసగా ఈ సర్జరీలు చేసిన ఏకైక వైద్యుడిగా ఘనత దక్కించుకున్నవారనీ.. ఇలాగ.. వీలయితే ఈ లంకే చూడండి.. ఆయన news paper clippings, ఆయన చదువు, వృత్తి వివరాలన్నీ ఉన్నాయి..
http://www.liversurgeonindia.com/index.html
నాకున్న అనుమానాల గురించి అడగాలనిపించింది... కొన్ని ప్రశ్నలు మీ ఫీల్డ్ గురించి అడగాలని ఉంది .. పరవాలేదా? అని అడిగాను. ఆయన చిరునవ్వుతో.. 'Please go ahead' అన్నారు. సరే మొదలు పెట్టాను ఇంటర్వ్యూ...
రెండేళ్ల క్రితం ఒక సహోద్యోగిని తండ్రికి కాలేయం పూర్తిగా చెడిపోయిందనీ కాలేయం లో 30% కుటుంబ సభ్యులు దానం చేయగలిగితే చాలు అని అంటే నలుగురు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు ఉన్నప్పటికీ ఒక్కరు తప్ప అందరూ ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకున్నారు. ఆ మిగిలిన ఒక్కరూ కూడా కాలేయ దానం ఇవ్వటానికి ఒప్పుకున్నారని కాదు. ఆవిడ యాభై ఏళ్ల మానసిక వికలాంగురాలు. అందరూ ఆవిడ దగ్గరినించి దానం తీసుకుంటే మంచిదని మిగిలిన వారంతా ఏకగ్రీవం గా అంగీకరించినా..
ఆ కుటుంబం లో ఒక్కరికి మాత్రం అది అన్యాయమనీ.. నోరు తెరచి తన బాధ నైనా చెప్పుకోలేని మనిషి దగ్గర్నించి ఇలాగ అవయవ దానం స్వీకరించటం అమానుషం అని ఒక అమ్మాయి అందరినీ ఆలోచింపచేసింది. ఈ విధం గా తాత్సారం చేస్తుండగా ఆయన మరణించారు.
అవయవ దానం గురించి ఈ మధ్య అవగాహన అందరికీ బాగానే ఉంది కదా.. నాకు తెలిసిన కుటుంబాల్లోనే ఎంతో మంది కుటుంబ సభ్యులకి మూత్రపిండాలని దానం చేసిన వారిని, అలాగే ఇంకా bone marrow లాంటివి వింటూనే ఉన్నాను. అలాగే చనిపోయాక శరీరాన్నే దానం చేయాలని మా అమ్మగారు విల్ కూడా రాసారు మరి. మిగిలిన అవయవ దానాలు.. ఒక పూర్తి పార్ట్ ఇవ్వటం తెలుసు .. మరి ఈ కాలేయం 30% ఇవ్వటం ఏంటో.. అర్థం కాలేదు మరి..
ఆయన నవ్వి ఆయన రైలు టికెట్ ప్రింట్ అవుట్ తీసి వెనక బొమ్మ వేసి చూపారు. కాలేయం లో 8 భాగాలు ఉంటాయని.. ప్రతి పార్ట్ ఒక అపార్ట్ మెంట్ బిల్డింగ్ లో ఒక్కో ఫ్లాట్ కీ వాటి కరెంట్, నీరు సప్లై విడి విడి గా ఉన్నట్టు రక్త నాళాలు ఉంటాయని.. కొన్ని ఫ్లాట్లని ఎలాగైతే జాగ్రత్త గా తీసి అసలంటూ పూర్తిగా కాలేయం పాడయిన వారికి అమర్చవచ్చని చెప్పారు. 60 % కాలేయాన్ని దానం చేసినా.. కొద్ది నెలల్లో మళ్లీ యధాస్థితి కి వస్తుందని చెప్పారు. అలాగే లివర్ కి మాత్రం ప్రత్యామ్నాయం లేదని చెప్పారు.
నేనూ అది విన్నట్టే గుర్తు.. హృదయానికి వెంటి లేటర్లూ, మూత్రపిండానికి బదులు గా డయాలసిస్ లాంటివి ఉన్నాయి.. కానీ కాలేయం లేకపోతే ఇక అంతే..
ఈ కాలేయం మార్పిడి వల్ల దాత లకి ఏమైనా రిస్క్ ఉందా? అని అడిగితే 6000 మార్పిడులలో ఒక్క 15 మంది మాత్రం వివిధ కారణాల వల్ల మరణించారని చెప్పారు. ఒక్కోసారి ఈ చికిత్స జరిగాక ఎక్కడో లోపల ఉన్న వేరే ఏదో సమస్య బయట పడి బాధ పడిన వారున్నారని,
అలాగే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న ఒక సీనియర్ తెలుగు నటి భర్త కి ఇలాగే కాలేయ మార్పిడి కి తమ పని మనిషి దగ్గర్నించి దానం తీసుకుంటే.. కాస్త ఎక్కువ శాతం తీసేసారట పాపం అతని దగ్గర్నించి. దానితో ఆతను మరణిస్తే .. పెద్దవాళ్లు కదా కేస్ కాకుండా తప్పించుకున్నారని చెప్పారు. బాధేసింది.. ఏం చేస్తాం?
ఈ మార్పిడి కి 6-7 గంటల శాస్త్ర చికిత్స కనీసం ఐదుగురు వైద్యుల బృందం నిర్వహిస్తుందని వివరించారు. దీనికి కనీసం 25-30 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని కూడా చెప్పారు. Brain death అయ్యాక నాలుగు గంటల్లో ఈ మార్పిడి చేయవచ్చని చెప్పారు. బోల్డు లైన్ ఉంటుంది ..కాలేయాలకోసం ఎదురు చూస్తూ ఆసుపత్రిలలో చికిత్స పొందేవారి తో.. అని ఒక వ్యక్తీ చనిపోతే వారి సమీప బంధువులు ఒప్పుకుని సహకరిస్తేనే ఇది సాధ్యమవుతుందని అన్నారు.
మీరు సగటున వారానికి ఎన్ని సర్జరీలు చేస్తారు? అని అడిగితె
వారానికే? అని నవ్వేశారు... నెలకి మూడు నుండి నాలుగు దాకా చేస్తానని చెప్పారు. ఇంకా ఎన్నెన్నో ప్రశ్నలకి వివరం గా సమాధానాలు చాలా ఓపిగ్గా చెప్పారు..
మచ్చుకి..
మాంసాహారం తింటే ఎక్కువ రిస్క్? - లేదు
ఆల్క హాల్? - 90% కాలేయం సమస్యలకి మూలం ఇదే
శాకాహారం లో? - పిండి పదార్థాలు తగ్గించాలి
అలాంటివి ఎన్నో అనుమానాలు తీర్చారు.. ఆయన ప్రజలకి కాలేయం మీద అవగాహన పెరగటానికి ఒక సంస్థని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
చివరగా.. మీకు ఈ వృత్తి వల్ల ఎంతో సంతృప్తి గా ఉండి ఉండవచ్చు కదా.. మీకు ఎప్పుడైనా విసుగ్గా.. కష్టం గా అనిపిస్తుందా? అని అడిగితె.. ఆపరేషన్ అప్పుడు anxiety ఉంటుంది..
అలాగే అన్ని లక్షలు పోసాం కాబట్టి సక్సెస్ అయి తీరాలని బంధువులు అనుకుని దీంట్లో ఉన్న రిస్కుల గురించి అస్సలూ ఎంత చెప్పినా అర్థం చేసుకోరని అన్నారు.. నిజమే కదా అనుకున్నాను..
ఇంక నా ప్రశ్నల పరంపర ని ముగించే ముందు.. ఆఖరు గా ఒక్క ప్రశ్న.. ఇలాగ ఏదో సరదాగా రైల్లో వెళ్తుంటే.. నాలాంటి వాళ్లు ఇలాగ మీ వృత్తి సంబంధమైన విషయాలే చర్చిస్తుంటే మీకెలా అనిపిస్తుంది? అని అడిగితే
ఆయన నవ్వేసి..'పర్వాలేదు.. ప్రశ్నలకి సమాధానం చెప్పటం కూడా ఒక పనేనా? ' అన్నారు. ఉదయం రైలు దిగుతూ.. మీరు చెప్పిన విషయాలు నా బ్లాగ్ లో వేసుకుంటాను అని అడిగాను. ఆయన.. 'అలాగే ' అని లింక్ మెయిల్ చేయమని చెప్పారు.
అవండి!!! మా ఏప్రిల్ మాసపు ప్రయాణాల కబుర్లు.. అన్నీ టీవీలూ, పత్రికలూ, గూగుల్ నుంచే కాకుండా.. ఇలాగ అనుకోకుండా.. గొప్పవారిని కలవగలగటం.. విషయాలు తెలుసుకోగలగటం... నేనైతే చాలా హాపీస్! మే నెల లో మా ఇంటర్ నేషనల్ విహార విశేషాలతో మళ్లీ కలుస్తాను..
23 comments:
బావున్నాయండి మీ ట్రైన్ కబుర్లు :)
మరీ ముఖ్యం డాక్టరు గారు కబుర్లు చాలా నచ్చాయి ! ఇంతకీ మీ అమ్మాయిలకి ఎంత percentage వచ్చింది గిఫ్ట్లు కొనిపెట్టారా లేదో చెప్పలేదు :D
చాలా బాగున్నాయి మీ ప్రయాణాల కబుర్లు. ఓపిగ్గా రాసినందుకు మిమ్మల్ని తప్పకుండా అబినందించాలి.
ఇవన్నీ చదూతుంటే నాకూ ఆప్రయాణాలు చేసినట్లుగా ఉంది. బాగా రాసారు.
amazing as usual.
Esply, conversation with Dr. Kanchustambham. Kudos to him!! love his name :)
BTW, recently finished reading the novel "Cutting for Stone" by Indian-Ethipian-American doctor/writer Abraham Verghese - There's a lot of interesting stuff about liver transplant in that.
@ శ్రావ్య,
థాంక్స్.. అవును.. అలాంటి పెద్ద డాక్టర్లు మనతో కనీసం మాట్లాడటానికి దొరుకుతారా? హాస్పిటల్స్ లో ఆ గది నుండి ఈ గది కి నడుస్తున్నప్పుడు వెనక పడితే కానీ కనీసం మన వంక చూడరు.. రైలు పుణ్యమా అని అన్ని గంటలు మాట్లాడటానికి, చర్చించటానికి అవకాశం దక్కటం .. నా అదృష్టం అనుకుంటాను...
@ తృష్ణ,
:) థాంక్సండీ..
@ నాగేస్రావ్,
ధన్యవాదాలు!
@ కొత్త పాళీ గారు,
థాంక్స్! నిజమే నాకూ ఆయన పేరు తెగ నచ్చేసింది.. ఆయన కి ఎన్ని డిగ్రీలున్నాయో, అంత ప్రసన్నత ఉంది మొహం లో.. అలాగే ఆయన విజిటింగ్ కార్డ్ చూసినప్పుడు ఆయన చాలా గొప్ప డాక్టర్ అని అర్థమయినా.. గూగుల్, మరియు ఆయన వెబ్ సైట్ ద్వారా అర్థమైంది.. ఆయన.. చాలా చాలా పెద్ద డాక్టర్ అని!
మీరు చెప్పిన నవల గురించి ఇప్పుడే సర్చ్ చేసి చూస్తున్నాను..
:) :) :)
అప్పుడే అయిపొయాయా కబుర్లు. :-)
అయినా మొదటి కామెంట్ ఎప్పుడూ శ్రావ్య గారికే వస్తుందేంటండీ.. :-(
అక్కా .. చాలా బాగున్నాయి మీ కబుర్లు ..
వృద్ద దంపతుల గురించి రాసింది చాల ఇన్స్పైరింగ్ గా ఉంది ..
సాయి బాబా భక్తుల గురించి రాసింది ఏమో .. చదువు భక్తీ .. సెపరేట్ అని అన్నట్టు .
ముక్యంగా .. డాక్టర్ సంభాషణ హైలెట్ .. నిజంగా లివర్ గురించి అన్ని విషయాలు తెలియవ్ ..
బయటవాళ్ళే కాదు కుటుంబం లో కూడా అలాంటి వాళ్ళు ఉంటారా .. :( ... చాల నచ్చింది పోస్ట్ ..
@ మహేశ్ కుమార్,
హ్మ్.. మళ్లీ మూడు స్మైలీల రేటింగ్.. థాంక్స్!
@ మంచు,
:) అంటే..? అసలే చాలా చాలా పెద్ద పోస్ట్ అయిందనుకుంటుటే?
@ కావ్య,
థాంక్స్.. అవును.. వృద్ధ దంపతుల ని చూస్తె ఎంత ఆశ్చర్యం కలిగిందో.. సినిమాల్లో చూపించే ప్రేమకీ.. దీనికీ అసలు సంబంధం లేదు :) మందుల గురించీ, పథ్యాల గురించీ.. అంత చక్కగా నవ్వుకుంటూ, ఆనందం గా మాట్లాదుకోవచ్చని మొన్ననే తెలిసింది :)
సాయి బాబా భక్తులు.. అవును.. వాళ్ల జీవితం లో జరిగే ప్రతి చిన్న యాదృచ్చిక సంఘటనకి కూడా సాయి లీల, ఆయన కరుణా కటాక్షాల వల్లే జరిగిందని నమ్ముకుంటూ ఉన్నారు.
ఇక డాక్టర్ గారి తో పరిచయం.. ఇంకా చర్చ.. I was plain lucky!
మీ పోస్ట్ చదివాక నాకు ఒకే మాట చెప్పాలని అనిపిస్తుందీ..
"అద్భుతం"... అంతేనండీ. వేరే మాటల్లేవ్ నాకు.
ట్రావెలాగ్ ఎంచక్కా రాసేసుకున్నారు. బావుంది. Informative n entertaining as well. :)
@ రాజ్ కుమార్,
నా బ్లాగ్ కి ఇదే అనుకుంటా మీరు రావటం... స్వాగతం! మరియు.. థాంక్స్!
@ కొత్తావకాయ,
:) ధన్యవాదాలు!
Priya Garu
Coming one International Travel Experience Ohhhh when National travel experience this much informative then we are much Expecting on INTERNATIONAL Tour :)
Can't you given clue Which country your family going to visit.
Your family most welcome to SINGAPORE since we are following your blog from here :)
Regards
Anil krishna
From S'Pore
ట్రెయిన్లో పక్క ప్రయాణీకులతో మాట్లాడితే ఇంత నాలెడ్జ్ దొరుకుతుందని ఎప్పుడూ వినలేదు మేడమ్. మీరు లక్కీ.
అదేంటో, నాకెప్పుడూ నసగాళ్ళూ, ఆపకుండా ఆరున్నొక్కరాగం సాధన చేసే పిల్లలే తగుల్తారు :)
మేడం కృష్ణ ప్రియ గారు..మీ ట్రైన్ కబుర్లు చాల చాల బావున్నాయి....ఏంటో చాల చిత్రంగా ఉంది...ఈ బ్లాగుల ద్వార మన అబిప్రాయలకు దగ్గర గా ఉన్న వాళ్ళ మనకు తారస పడటం...ఏవో కొన్ని కవితలు వ్రాసి బ్లాగ్ లో పెట్టిన నేను మీ బ్లాగ్ చూశాక బ్లాగ్ ని ఇలా కూడా ఉపయోగించ వచ్చుకదా అనిపించింది...చాల థాంక్స్ మేడం గారు..నమస్తే.
mee blogs anni oka roju lo chadivesanu !! anni ayipoyaka apude ayipoyaya anipinchindi !! chala baaga rastunaru !! Long way to go !! Gud luck !!
@ AK41/Anil Krishna,
చాలా థాంక్స్! మేము పారిస్ మరియు, US వెళ్లామండీ. మీకు చాలా లేట్ రెస్పాన్స్ ఇస్తున్నాను..క్షమించండి. మూడు వారాల తర్వాత మళ్లీ రెండు రోజుల క్రితమే వచ్చి మళ్లీ ఇంట్లో పడ్డాము. ఇప్పుడే బ్లాగ్ లని సరిగ్గా చూస్తున్నాను.
@ RG,
:) LOL నిజమే .. పూర్వం మంచి కంపెనీ దొరికేది. ఈ మధ్య రైళ్ళల్లో ఎవరి లాప్ టాప్ లోకి వాళ్ళు చూస్తూనో, సెల్ లో మాట్లాడుతూనో కనిపిస్తున్నారు లెండి.
@ lokanth kovuru గారు ,
చాలా థాంక్స్! రాయండి. మీ బ్లాగ్ ఇప్పుడే చూస్తున్నా..
@MyMemories,
ఓహ్.. మీ అభిమానానికి థాంక్స్!
చాల థాంక్స్ అండీ...నాది ఇంకా సరిచేయాల్సిన బ్లాగ్ మాడం.
Blogger మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి కాలేయమార్పిడి జరిగింది
ఆ పాప కూడా నా బెస్ట్ ఫ్రెండ్ చెప్పాలంటే వాళ్ళ
మమ్మీ కన్నా అదే నాకు బెస్ట్ ఫ్రెండ్...
అది జరిగిన చాల రోజులకు కూడా
ఆ డాక్టర్ వాళ్ళకు ఫోన్లో టచ్ లో ఉంటూ
అను నిత్యం వాళ్ళకు సలహాలు వోదార్పునిస్తూ ఉంటాడని
ఆయన మంచితనం గురిని ఆమె పదే పదే చెప్తుండటం
నమ్మశక్యం కానట్టే ఉండేది అంటే నమ్మండి..
మీ బ్లాగ్లో డాక్టర్ గురించి చదివాకా నాకు ఆ విషయం గుర్తుకొచ్చి
అరె...ఈ కాలేయమార్పిడి చేసే డాక్టర్స్ అంత ఇలానే
ఉంటారు కాబోలు అనుకుంటూ చాల ఆశ్చర్య పోయాను
ఒక సారి మీ బ్లాగ్ ఆమెకు చూపించాను మీ పోస్ట్ మొత్తం చదివి
అరెరే ఈయన మా సుబ్బారావ్ డాక్టరెర అంది...
అదండీ సంగతి మీరు గుర్తించిన
మనిషి సామాన్యులు కాదండీ మనుషులలో దేవుళ్ళు కదండి..
సుబ్బారావ్ గారికి నా వందనాలు..
ప్రియమైన కృష్ణ గారికి నమస్కారాలు..
@ loknath kovuru,
మీరు చెప్పిన విషయం విని నాకు ఎంత ఆనందం గా గర్వం గా అనిపించిందో నాకే తెలియదు. ఆ పాప కీ, పాప తల్లికీ నా అభినందనలు.
నిజంగానే సుబ్బారావు గారు చాలా చాలా గొప్ప మనిషి కూడా! చాలా సంతోషం.
అలాగే ఈ విషయం తిరిగి బ్లాగ్ లో పంచుకున్నందుకు మనః పూర్వక ధన్య వాదాలు!!!
Post a Comment
మీ అభిప్రాయం...
Note: Only a member of this blog may post a comment.