లవంగం (మన్మథుడు లో బ్రహ్మానందం) ఇంటికి మాత్రం వెళ్లకు..." అని ఒకళ్లు.. "పారిస్ లో ఎస్కలేటర్లు మాత్రం మా బెమ్మి చెప్పినట్టే ఎక్కు ,.. అసలే పారిస్ ఇండియా ని టేప్ లో 30 సంవత్సరాలు ఫార్వార్డ్ చేస్తే ఎలా ఉంటుందో అంత ముందు ఉంటుంద"ని ఒకరు... "పారిస్ వాళ్లకి కూడా నీళ్లంటే భయం అందుకే బ్రిడ్జులు కట్టార" ని ఒకరూ.. "పారిస్ లో బూట్లు కొనద్దు ... ఈజీ మెథడ్లు ఉంటాయని ఒకరూ.. తిరిగి వచ్చేప్పుడు సామాన్లు ఎక్కువైతే ఎక్కడైనా పెట్టేయ్.. సంవత్సరం తర్వాత వచ్చినా అక్కడే ఉంటుందని అప్పుడు తెచ్చుకోవచ్చని ఒకరూ.. సలహాలిచ్చారు.. పారిస్ కి సెలవలకి వెళ్తున్నానని తెలిసి.... తెగ నవ్వుకున్నాం.
పారిస్... ఐరోపా సాంస్కృతిక రాజధాని.. కళాకారుల కలల నగరం.. ఫాషన్ ప్రపంచ రాజధాని కూడా కదా .. ఎన్ని నవలల్లో చదివాం.. ఎన్ని రకాలు గా ఊహించుకున్నాం.. ఐదు రోజులు పారిస్ లో ఉంటామనగానే ఒక రకమైన ఉద్విగ్నత.. మూడు నెలల క్రితమే టికెట్లు కొనేసాం... హోటల్ గదులూ బుక్ చేసేసాం.. ఇంటర్నెట్ అంతా గాలించి, శోధించి, సమాచారాన్ని పుంఖాను పుంఖాలు గా ప్రింట్ అవుట్లు తీసి భద్రపరచుకున్నాం...
ఇదంతా ఒక ఎత్తు.. బాసు గారి దగ్గర సెలవు ప్రస్తావన తేవాలంటే బోల్డంత బెరుకు.. అంతకన్నా.. 'మీ సిస్టం పాస్ వర్డ్ అర్జెంట్ గా ఇస్తారా?' అడిగితేనే బెటరేమో.. ఎలాగా అని కొట్టుకుపోతుంటే నా పూర్వ జన్మ లో ఏ దాహం తో సొమ్మసిల్లిన వాడికి నీళ్లు పోసానో.. దేవుడు నన్ను కరుణించి.. ఆ పూట నా బాసు గారికి బోల్డు అర్జంట్ పనులతో ఊపిరి సలపకుండా చేసాడు.. నా తో 1:1 మీటింగు లో ఆయన.. ఎప్పుడు నేను లేచి వెళ్తానా అన్నట్టు ఉన్నారు. మామూలు గా అయితే... నేనే అలా అనుకుంటాను.. ఈయనేంటి. ఇంకా వదలడు...' అని. కాసేపు.. అవీ ఇవీ.. మాట్లాడి.. ఆయన అసహనం గా.. వేరే ఈ మెయిల్స్ చూస్తూ వినీ విననట్టు ఉన్నారని గమనించగానే.. 'అన్నట్టు మే లో విదేశాలకి వెళ్తున్నాను.. కరెక్ట్ డేట్లు కన్ఫర్మ్ కాగానే అప్లై చేస్తాను .. ' అన్నాను. ఆయన అన్య మనస్కంగా 'ఆ ఆ' అన్నారు. 'ఆహా.. వచ్చిన పని అయింది ' అని నేనూ వచ్చేసాను.
కానీ సిస్టం లో అప్లై చేస్తే వెంటనే రిజెక్ట్ చేయగల ఘనుడాయన.. కానీ ౧౦ రోజులు కస్టమర్లతో ఆయనకి చాలా బిజీ అని తెలుసుకొని కరెక్ట్ గా ఆరోజే ఇరవై రోజులకి అప్లై చేసి ఊరుకున్నాను.. తర్వాత ఆయనా బిజీ.. ఎవ్వరి లీవూ అప్రూవ్ చేయలేదని తెలుసుకుని ..'హమ్మయ్య ' అని నా గొడవలో నేనూ బిజీ..
ఆఖరి వారం లో చూసి.. 'అదేంటి.. ఇలా చేసావ్? ' అని ఒకటే గొడవ.. మిమ్మల్నడిగేగా నెల రోజుల క్రితం అప్లై చేసింది ? అని నేనూ కాస్త దబాయించి బయట పడ్డాను..
"పారిస్ కి వెళ్తున్నాం..సెలవలకి ..." అనగానే..పైన మన్మథుడి లో హాస్యం తో బాటూ.. తెలిసిన వారు అందరూ తలా ఒక సలహా ఇచ్చారు.. 'అదేంటి? ఒక్క పారిస్ మాత్రమే నా? ఇంకా అన్ని ఐరోపా దేశాలూ తిరిగి రావచ్చు కదా? ' 'పారిస్ లో ఏముంది? ఆ శిల్పాలూ, చిత్రాలూ తప్పితే..అదే ఈజిప్ట్ అయితే పిరమిడ్లు, స్విట్జర్లాండ్ అయితే ప్రకృతి అందాలు.. వాటికన్ నగరం లో ఇవీ.. లండన్ లో అవీ..' అనీ... ఇంకొక కొ వర్కర్ అయితే 'ఎందుకండీ కృష్ణ గారూ.. అన్ని లక్షలు పోసి..పారిస్.. సినిమాల్లో చూస్తూనే ఉన్నాం.. ఏదైనా ఆఫీస్ ట్రిప్ వేసుకుని దోవ లో ఆగండి.. చక్కగా.. ఈ డబ్బు తో బంగారం కొని పెట్టండి..మీకు అసలే ఆడపిల్లలు! రేపు అవసరాలుంటాయి.." అని. ఒళ్లు మండింది కానీ.. ఆతను శ్రేయోభిలాషి అని తెలుసు.. నవ్వి ఊరుకున్నాను.
అంతకు ముందు చూసి వచ్చినవారిలో 'మోనాలిసా ని మాత్రం చూస్తే చేష్టలుడిగి అలాగే నిలబడిపోతాం' అని ఒకరు, 'అంత కష్టపడి మ్యూజియం అంతా తిరిగి తిరిగి వెళ్తే ఐదు మీటర్ల దూరం లో పైగా గాజు ఫ్రెం లో ఉంటుంది.. దాని బదులు ఇంటర్ నెట్ లో చూడటం మేలు..' అని ఒకరు.. టూరిస్ట్ పాకేజ్ తీసుకొమ్మని ఒకరు.. అంత దండగ వేరే లేనే లేదు.. అన్నీ గూగుల్ చేసి పెట్టుకొమ్మని ఒకరు.. గది లో వండుకొమ్మని ఒకరు,.. అక్కడ ఉన్న భారతీయ రెస్టారెంట్ విషయాలు కొందరు, అంత దూరమూ వెళ్లి ఇండియన్ ఫుడ్ ఏంటి? హాయిగా ఫ్రెంచ్ కుజీన్ తినక ..అని మరి కొందరు..
అందరి అభిప్రాయాలూ విన్నాక చెప్పలేనంత కన్ఫ్యూషన్ ఏర్పడింది. ఇంతకు ముందర మేము లండన్ అవీ వెళ్లినప్పుడు కేవలం మేము భార్యా భర్తలమే చర్చించుకున్నా, చొక్కాలు చించుకున్నా.. చివరకి ఒక నిర్ణయానికి అంటూ వచ్చేవారం. ఇప్పుడు పిల్లల అభిప్రాయాలు..వాళ్లు మా ప్రయాణం గురించి అందరికీ నెల ముందే అందరికీ చెప్పేయటం వల్ల వారందరి అభిప్రాయలకీ విలువ ఇవ్వాల్సిన పరిస్థితి! పెద్దమ్మాయి కాస్త కళాత్మక హృదయం కలిగినదైతే, చిన్నదానికి థ్రిల్ రైడ్లూ, మంచి భోజనమూ గట్రా ఉంటే చాలు. మాకు కొన్నింటికి 'ఇదిగో.. ఈ కట్టడం కూడా చూసాం..' అని ఫోటో,వీడియో ప్రూఫులూ, కొన్నింటిని నిజం గా చూడాలనే ఉత్సాహమూ ఉన్నాయి.. కాకపొతే కరెక్ట్ గా..ఇద్దరి ఇష్టాలూ వ్యతిరేకం.
చివరకి అందరి ప్రయారిటీ లిస్టులేసి.. అందరికీ న్యాయం జరిగేలా ప్లాన్ వేసాం. మా చెల్లీ,మరిదీ ఒకటే నవ్వు.. 'పారిస్ లో తినటానికి .. ఫ్రెష్ గా కొత్తావకాయ పెట్టానూ..' అంటే.. వీలున్నప్పుడు ఒకపూట హోటల్లో వండుకుని.. ఒక్కోరోజూ బయట ఒక్కో రకం తిండీ తిందామని నిర్ణయం. సామాన్లు పెద్దగా లేవు గా.. అందుకని రైస్ కుక్కర్, అన్ని పొడులూ,పచ్చళ్ళూ, నూనె,నెయ్యి, ఉప్పు, మాగీ పాకెట్, లాంటివి పాక్ చేసుకుని విమానమెక్కేసాం.
ఇక మా ట్రావెల్ ఏజెంట్ పుణ్యమా అని.. పారిస్ లో దిగగానే టాక్సీ డ్రైవర్ వచ్చి హోటల్ రూమ్ లో పడేశాడు. మా పెద్ద అమ్మాయి హోటల్ రూమ్ లోకి వెళ్తూనే కర్టెన్లు తీసి.. 'ఈఫిల్ టవర్!! అదిగో.... ' అని అరిచి తెగ సంబరపడింది. మాకు గుర్తేలేదు. ట్రావెల్ ఏజెంట్ ఈఫిల్ టవర్ కిటికీ లోంచి కనపడేలా గది ఇస్తానన్న విషయం. ప్రయాణం అలసట అంతా ఉఫ్ఫ్ఫ్ మని ఊడినట్టు ఎగిరిపోయింది. గబగబా తయారయి ఇంటి నుండి తెచ్చుకున్న చపాతీలు తినేసి మెట్రో లో ఈఫిల్ టవర్ కి ప్రయాణం కట్టాం.
రెండేళ్ల క్రితం ఇదే మే లో లండన్ వెళ్తే చలికి గడ గడ లాడాం కదా అని స్వేటర్లూ అవీ తీసుకుని బయటకి వచ్చాక తెలిసింది.. 'నమ్మ బెంగుళూరు' లానే ఉందని.. రాత్రి ౧౦.౩౦ కి సూర్యాస్తమయం. మా చిన్నది కాస్త డిజప్పాయింట్ అయింది. 'నా కొత్త స్వెటర్ వేసుకోటానికి లేదు ' అని. పోన్లే ఒకసారి వేసుకుని చటుక్కున ఫోటో తీసి మళ్లీ లోపల పెట్టేద్దాం అని ఓదార్చాను. చిన్నపిల్లల అభిప్రాయాలు వింటే ఆశ్చర్యం వేసింది. 'పారిస్ లో బొట్లు పెట్టుకోవద్దు.. మీ అమ్మని కూడా సల్వార్ కమీజ్ వేసుకోవద్దని చెప్పు.. అక్కడ ..you need to like you are one of them.. else you would land in to trouble' అన్నారు ట. అలాగే.. పిల్లలకి ఆసియా,ఆఫ్రికా ఖండాల్లో జనాలు మాత్రమే 'అన్నమో రామచంద్రా' అని అలమటిస్తూ ఉంటారు. ఐరోపా, అమెరికా వాస్తవ్యులు డబ్బులో ములిగి తేలుతూ ఉంటారని ఒక నమ్మకం.
మా పెద్దమ్మాయికి మెట్రో స్టేషన్ కి చేరుతూనే రెండు అభిప్రాయాలూ పటా పంచలయ్యాయి. అడుక్కుని తినే వారు, సావనీర్లని 'యూరోకి ఐదు.. యూరోకి ఆరిస్తా తీసుకో.. ' అని గుంపులు గుంపులు గా మీద మీద కి వచ్చి బస్తాల్లో సామాన్లు పెట్టుకుని అమ్ముకునే ఏషియన్లు, నల్ల జాతి వారు, (వద్దు వద్దు అన్నా.. పోనీ ఎన్ని కావాలి చెప్పండి 'బెహన్జీ' అని వెంట పడే వారు.. వాళ్ల బాధ తట్టుకోలేక ఈఫిల్ టవర్ల బొమ్మలు మెడల్లో వేసుకుని మరీ తిరగాల్సి వచ్చేది..) బస్సుల్లో మన బియ్యం బస్తాల మెటీరియల్ తో చేసిన పేద్ద సంచీల్లో గ్రాసరీలు కొనుక్కుని వెళ్లే ఫ్రెంచ్ వనితలనీ,... మీటర్ల కొద్దీ బట్టని రక రకాలు గా తమ పధ్ధతి లో వంటికి చుట్టుకుని రైళ్లల్లో ప్రయాణాలు చేసే నల్ల జాతి స్త్రీలనీ, పారిస్ సిటీ లో చర్చిల దగ్గరా, ఓప్రా, మ్యూజియం ల దగ్గరా, హోటల్ రూమ్ లోనో, ఇంకెక్కడో పెట్టుకోకుండా.. బాగేజ్ (pull on) ని లాక్కుంటూ, భోజనాల సమయం లో ఏ మెట్ల మీదో, బెంచి మీదో, పెట్టె లోంచి ఇంటి నుండి తెచ్చుకున్న లంచ్ బాక్స్ తీసుకుని తినే ఐరోపా యువత నీ, చూసి 'అమ్మా నువ్వు కరెక్టే.. మా ఫ్రెండ్స్ రాంగ్' అంది. రైటూ, రాంగూ అని కాదు.. అని ఒక పేద్ద లెక్చర్ దానికి బహుమతి గా ఇచ్చాను..
ఏడేళ్ల పిల్ల కి స్నేహితులు చెప్పారుట.. 'ఈఫిల్ టవర్ మీద రెండో అంతస్తులో పారిస్ అందాలు చూస్తూ డిన్నర్ ' చేస్తేనే మజా ఉంటుంది.. మా పదేళ్ల పిల్లకి.. 'పారిస్ చాలా fashionable city.. మంచి డ్రెస్సులూ, కాస్మెటిక్స్ కొనుక్కో ' అని. 'అబ్బా.. వీళ్లు ఇలాంటివి చర్చిస్తారా? ' అని బుగ్గలు నొక్కుకున్నాం.
మొదటి రెండు రోజులూ, కాస్త స్టైల్ గా బయట ఫుడ్ తిన్నాక, పిల్లలు 'Amma.. Can we pack some aavakaayannam today to museum?' అని అడిగారు.. 'కుదిరింది తిక్క' అని మనసు లో అనుకుని.. పైకి మాత్రం సాధ్యమైనంత గంభీరం గా తల ఊపి ఊరుకున్నాను. పైగా.. 'ఏంటమ్మా? ఒక్క బ్రిడ్జ్, బిల్డింగ్..ప్లెయిన్ గా లేదు? ఏది చూసినా.. ఏదో తలకాయలు తొంగి చూడటం, టూ మచ్ గా పూలు, బంగారం పూతలూ, వాళ్ల దేవుళ్ల, రాజుల బొమ్మలు.. ' అని విసుగు. మా చిన్నదైతే.. 'ఏ ఒక్క అమ్మాయి శిల్పానికీ సరిగ్గా బట్టల్లేవు.. నాకు నచ్చలేదు.. ' అని ఖరా ఖండీ గా చెప్పేసింది. లూవ్ర్ మ్యూజియం లో నైతే.. ఏదో ముసలమ్మ లా.. ఒక బెంచి చూసుకుని.. 'మీరు అందరూ, ఈ బొమ్మలూ, చిత్రాలూ, శిల్పాలూ ఏం చూసుకుంటారో చూసుకుని ఇక్కడికే రండి.. నేను సామాన్లు చూసుకుంటా' అంది. అలా ఎలా వదిలేస్తాం.. ఒక్కదాన్నీ? అని బలవంతాన తీసుకెళ్తే మొహం మాడ్చుకుని, విసుగు చూపించటం.. చిరాకేసి.. 'ఇలా కాదు. పిల్లలు కాలేజ్ కెళ్ళాక.. మనమిద్దరమే వచ్చి చూడాలి ఇవన్నీ మళ్లీ..' అన్నాను. వెంటనే మా పెద్దమ్మాయి.. 'అవునవును.. ఛీ ఛీ.. అనుకుంటూ పారిస్ మ్యూజియం లన్నీ తిరగండి..' అని వ్యంగ్యం గా అంది. (సరిగ్గా బట్టల్లేని బొమ్మల్ని చూసి ఛీ ఛీ అంటామని...) ' ఇలాగయితే డిస్నీ లాండ్ కి వెళ్లినప్పుడు నేనూ ఇలాగే చేస్తాను.. ' అన్నానంతే.. దెబ్బకి చక చక లాడుతూ మ్యూజియాలూ, పాలస్ లూ, కాతేడ్రల్ లూ చూసి పెట్టారు.
పాపం వాళ్లని కాస్త కష్టపెట్టినట్టనిపించినా,.. ఒక్కటి గమనించాను.. పెద్దమ్మాయికి చరిత్ర పట్ల ఇంటరెస్ట్ ఉందని. ఎక్కడికెళ్లినా గైడ్ పక్కనే.. ఉండి అన్నీ తెలుసుకుంటూ తిరిగిందని.. అలాగే మ్యూజియం లో హెడ్ సెట్స్ ద్వారా చాలా ఫేమస్ చిత్రాల కథా, కమామీషూ తెలుసుకుని.. నాకు చెప్పింది. చాలా సంతోషం వేసింది.
మొదటి రోజు జాగ్రత్త గా, బెరుగ్గా వెళ్లి మెట్రో మాప్ చూసుకుంటూ ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్లాం. మెట్రో స్టేషన్ లోంచి బయటకి రాగానే చాలా మంది రోడ్ల మీద నుంచుని బొమ్మలమ్ముకుంటున్నారు.. ఒకర్ని ఈఫిల్ టవర్ ఎక్కడుంది? అని అడగగానే.. నవ్వి వెనక్కి చూపించాడు. ఆకాశమంత ఎత్తులో టవర్.. గుగుర్పాటు గా అనిపించింది. దగ్గరగా కనిపించినా.. సావనీర్లు అమ్ముకునేవారిని దాటుతూ, జనాలతో నడుస్తూ, మొత్తానికి పదిహేను నిమషాల నడక అయినట్టనిపించింది. పెద్ద లైన్. నెమ్మది గా నలభై నిమిషాల తర్వాత ఎలివేటర్ లో రెండవ అంతస్తుకి చేరాం. అక్కడ మా పాప కోరిక మేర సాండ్ విచ్ లు తిని పేక మేడల్లా అందం గా చాక్ పీసు ముక్కల రంగుల్లో తీర్చి దిద్దినట్టున్న పారిస్ నగరాన్ని చూసి, కాసేపటికి పై అంతస్తుకి వెళ్లాం. అక్కడనుంచి మళ్లీ కిందకి చూసి.. ఆనందించి 'అమ్మో ౧౦ దాటింది..' అని తిరుగు ముఖం పట్టం. విద్యు ద్దీపాలు ఒక్కసారి గా వెలగటం తో ఎంతో ఆనందం అనిపించింది. కిందకి దిగి మెట్రో స్టేషన్ వైపు నడుస్తుండగా.. ఒక్కసారి గా దీపాలు వెలుగుతూ ఆరుతూ సందడి చేశాయి.
రెండవ రోజు ఉదయాన్నే లేచి హాయిగా సుదీర్ఘ అల్పాహారం (అధికాహారం?) చేసి నెమ్మది గా లూవ్ర్ మ్యూజియం కి వెళ్లే మెట్రో రైలెక్కాం. దిగాల్సిన స్టేషన్ దగ్గర రైలు ఆగలేదు.. 'అదేంటి' అంటే.. రైల్లో వాళ్లు అదొక ఎక్స్ ప్రెస్ బండి అని రెండు స్టేషన్లు దాటితే గానీ ఆగదని చెప్పారు. ఉసూరు మనిపించింది. మెట్రో లోంచి నీరసం గా బయటకి వచ్చి చూస్తే ఏముంది? అకస్మాత్తుగా ఒక టైం మషీన్ లో ఎక్కి మూడు వందల ఏళ్ల క్రితం రోజుల్లోకి వెళ్లామా అని ఆశ్చర్యం వేసింది. చుట్టూ పాతకాలపు రాజరిక చిహ్నాలున్న భవనాలు. అక్కడేదో స్ట్రైక్ లాంటిది చేస్తున్నారు. మేము నడుస్తూ, చుట్టూ భవనాల్ని, షాపులనీ చూస్తూ నెమ్మదిగా మ్యూజియం కి చేరాం.
మళ్లీ పెద్ద లైన్లో నంచున్నాం. ఒక్కసారి టికెట్, ఆడియో టూర్ తీసుకున్నాక, మేము నోట్ చేసుకుని వచ్చిన కళాఖండాలు ఎక్కడ చూడవచ్చో మార్క్ చేసుకుని.. మొట్టమొదట మోనాలిసా దగ్గరికి పరిగెత్తాం. (ఈ మ్యూజియం మరి నెమ్మదిగా చూస్తే వారమైనా పడుతుంది..) సాయంత్రం దాకా ఎంత కాళ్లు నొప్పులు గా అనిపించినా పట్టించుకోకుండా అనుకున్నవన్నీ చూసి...మధ్యలో మా మాగాయన్నం పొట్లాలతో బాటూ, అక్కడ సాండ్ విచ్లూ, కాఫీ, ఐస్ క్రీంలూ తిని.. రాత్రికి అలిసి చేరుకున్నాం.
మర్నాడు మాత్రం ముందు రోజులా పరిగెత్తకూడదని నిర్ణయం తీసుకుని కాస్త నెమ్మదిగా రెస్టారెంట్ లో ముందు రోజులా అధికాహారం తీసుకుని.. ఈసారి సిటీ టూర్ బస్సు లో (hop on, hop off) మొత్తం పారిస్ అంతా తిరిగి చూసాం. ఆడియో లో స్థల మహత్యాన్ని గురించి వినటం, ఎక్కడ కావాలంటే అక్కడ దిగి తిరిగి మళ్లీ వచ్చే బస్ ఎక్కి తర్వాతి స్టాప్ కి వెళ్లటం. ఈ విధం గా.. పారిస్ నగరాన్ని అంతా తిరిగి చూసి.. కాస్త షాపింగ్ చేసి ఇంటికొచ్చి పడ్డాం.
నాలుగో రోజు తీరిగ్గా.. notre dome cathedral లో గంట గడిపి నెమ్మదిగా సీన్ నది మీద ఆడియో టూర్ తో బోట్ విహారం చేశాం. దాదాపు పారిస్ నగర విశేషాలన్నీ సీన్ నదీ తీరం లోనే ఉన్నాయి. ఒక్కో బ్రిడ్జ్ కీ ఒక్కో చరిత్ర.
ఇక ఆఖరి రోజున వేర్సైల్స్ రాజ భవనం చూడటానికి బయల్దేరాం. ఆరు తరాల ఫ్రెంచ్ చక్రవర్తులు నివసించిన ఆ పాలస్ కోసం మెట్రో లో పారిస్ నగర శివార్లలో ఉన్న వేర్సైల్స్ నగరానికి వెళ్లాం. పొరపాటున వై జంక్షన్ లా ఉన్న రైలు స్టాపుల్లో రెంటికీ ఓకే నంబర్ ఉండటం తో చిన్న కన్ఫ్యూషన్.. రైల్లో ఉన్న ఒక మధ్యవయసు జంట ని అడిగితే వాళ్లు మమ్మల్ని రైలు దింపి మాతో వచ్చి మరీ కరెక్ట్ రైలెక్కించారు. పైగా.. మా రైలొచ్చేదాకా నుంచుని..కాలక్షేపం కబుర్లు చెప్పి వెళ్లారు. ఆ రాజ భవనం, వేల ఎకరాల్లో ఉద్యానవనాలూ, బంగారు తాపడాలతో జిగేల్ మంటున్న పాలస్ లొ గైడెడ్ టూర్ తీసుకుని కింగ్ లూయ్ XIV,XV,XVI నివసించిన గదులూ, వారి వ్యవహార శైలుల్లో తేడాలూ, వారి భావనానంకరణ లో అభిరుచులూ, ఫ్రెంచ్ విప్లవానికి దారి తీసిన పరిస్తుతులూ కొద్దిగా చదివి వచ్చినా.. మళ్లీ గైడ్ ద్వారా వింటుంటే బాగా అనిపించింది. రాజుగారి తోట లో మొత్తానికి నా కొత్తావకాయన్నం తిని, అక్కడి కఫే లో మంచి కాఫీ, కేక్ తిని హోటల్ గది కి వచ్చి పడ్డాం.
ఫ్రెంచ్ చక్రవర్తుల పాలస్ లూ, ఫ్రెంచ్ విప్లవాల, వారి యుద్దాల, విజయాల స్మారక చిహ్నాలు, చర్చిలూ, మ్యూజియం లూ, చివరకి సీన్ నది మీద కట్టిన ప్రతి బ్రిడ్జీ, వందలాది ఏళ్ల చరిత్ర ని కళ్ళకి కట్టినట్టు చూపిస్తుండగా.. గాలేరియాలూ, గట్రా.. మనం అడుగు పెడితేనే మాసిపోతాయన్నట్టు.. 'ఏదైనా కొందాం అక్కడ సరదాకి' అనుకున్నాను కానీ.. ధరలు చూసి.. మాట్లాడకుండా బయటకి వచ్చి.. notre dome cathedral పక్కన ఉన్న వీధిలో హాయిగా బంధు మిత్రులకి మా రేంజ్ లో సావనీర్లు కొనుక్కుని..సంతృప్తి పడ్డాము. కానీ నాకైతే కనీసం పిల్లలకి మంచి ఫాషనబుల్ బట్టలు ఒక్క జత అయినా కొని ఉండాల్సింది.. అని పీకుతూనే ఉంది.
ఇంక రేపు ఉదయం విమానమెక్కుతాం కదా .. వెళ్లి ఫాషన్ పేరిట ఎక్కడా చిరుగులు లేని పాంటులూ, కాస్త ఎక్కువ బట్ట ఉన్న చొక్కాలూ తీసుకుని వచ్చేసా..
అక్కడినుండి పిల్లలు "అమెరికా, అమెరికా" అని కంగారు పడ్డారు.. కానీ నాకు మాత్రం పారిస్ మనస్సులో ఉండిపోయింది. ఎంత అందమైన నగరం, ఏమి కట్టడాలు, గాలరీలు, చర్చిలు, రాజ భవనాలు, పుస్తకాల్లో చిన్నప్పుడు చదువుకున్న చరిత్రా, పెద్దయ్యాక ఆంగ్ల నవలల్లో చదివిన వర్ణనలూ ఇన్నాళ్లకి చూడగలగగా, వాళ్ల రోడ్ సైడ్ కఫెలూ, మెట్రో లో ప్రయాణాలూ, ఫైన్ రెస్టారెంట్లూ, ఫాషనబుల్ బట్టల్లో నానా జాతుల వారు, డా విన్సీ, వాన్ గాగ్, మైకేలాన్జిలోలూ, గ్రీక్/రోమన్ దేవతలూ..కట్టడాలూ కళ్లల్లో మెదులుతూ ఉండగానే.. పారిస్ నగరం వదిలి సాన్ ఫ్రాన్ సిస్కో విమానం ఎక్కేశాం.
పారిస్ ఫోటోలు, అమెరికా విశేషాలు వీలుంటే ఇంకో టపాలో..
45 comments:
బాగున్నాయి మీ విశేషాలు.
నాకు పారిస్ చూడాలని ఎప్పటినుండో ఆశ. ఫోటోలు తప్పకుండా పెట్టండి.
మేముకూడా గతవారమే పారిస్ వెల్లి షుమారు మీరు చూసినవే చూసాము. అడిషనల్గా బేసిలికా సాక్రెకౌర్ చూశాం. ఆఖరి రోజు పొంపెడ్యూ మ్యూజియం వెలితే మంగళవారం కనుక బంద్, పికాసో మ్యూజియం రినోవేషన్.
వెర్సైల్స్ గార్డెన్ గురించి రాయలేదు? మాకది బాగా నచ్చింది.
gud post..
@ శ్రీ గారు,
అవును. ఫోటోలు పెట్టాలండీ.. మూడు వారాల ట్రిప్ తర్వాత రెండు రోజుల క్రితమే రావటం వల్ల, మూడు కెమెరాల్లో తీయటం వల్ల, చాలా పని ఉంది. అదంతా ఒక కొలిక్కి రావటానికి..
@ 'ఏది సత్యం' గారు,
అవునా? చాలా బాగుంది. మేమూ దాదాపు ౨ గంటలు గడిపాము ఆ వేర్సైల్స్ గార్డెన్స్ లో. మాకూ చాలా నచ్చింది. చూసారా? మర్చేపోయాను. పారిస్ తర్వాత రెండు వారాలు US వెళ్లటం తో ఎందుకో మరపు వచ్చేసింది.
-కృష్ణప్రియ
క్రిష్ణప్రియ గారు,
మీరు పారిస్ నగరాన్ని వర్ణించిన తీరు బావుంది. మామూలూగా ఫారిన్ అందాల వర్ణనల మూసలో కాకుండా, మీకనిపించినవి నిజాయితీగా రాసినట్టనిపించింది. మీ తాలింపులు కొన్ని ఉన్నాయనుకోండి :)
అక్కడి మనుషుల గురించి మీరు గమనించిన విషయాలు బావున్నాయి. చాలా మంది కొత్త ప్రదేశాల్లో వింతల్నీ విశేషాల్నీ చూస్తారు గానీ మనుషుల్ని అంతగా గమనించరు.
బాస్టిల్లె స్క్వేర్ కి వెళ్ళారా?
btw, I am glad to know that your daughter showed interest in history. hmm.. let me see if I can do something to transform her lukewarm interest into burning passion :)
:)
@ సుభద్ర గారు,
థాంక్స్!
@ కొత్తావకాయగారు,
:)) నేనూ పాలో ఆల్టో ఐకియా దగ్గర ఈసారి మిమ్మల్ని తలచుకున్నాను
@WP,
థాంక్స్.
అవును వెళ్ళాము. అక్కడ ఉన్నది ప్రస్థుతం జూలై కాలం, పక్కన ఓప్రా. దాని ముందు మెట్లమీద కూర్చున్నాం కానీ లోపలకి వెళ్లలేదు. అక్కడ వెనక కొన్ని రిమెయిన్స్, ఇంకా ఫ్లీ మార్కెట్ అవుతుంది వారానికి రెండు రోజులు అన్నారు. కానీ ఆరోజుల్లో అక్కడ మేము లేము.
Very nice.
అన్నట్టు ఆస్ట్రేలియా ఎప్పుడొస్తున్నారు? :)
శారద
మీ personalized travelogue బాగుంది. వివరణలు, వర్ణనల్లో ఒరిజినాలిటీపాటూ, మీ మార్కు సునిశితమైన హాస్యం అల్లారు, its a relief.
చిన్నప్పుడు నాయని కృష్ణకుమారి ‘కాశ్మీరదేశయాత్ర’ అనే ఒక ట్రావెలాగ్ పాఠంలా ఉండేది, అది చదివాక ఎప్పటికైనా కాశ్మీర్ వెళ్ళి దల్ లేక్ లోని షికారాల్లో ఒక షికారు కొట్టాలనిపించేది. ఆ కోరికే ఇంకా తీరలేదు. ఇప్పుడు ,మీరు ఏకంగా పారిస్ అందాల్ని ఊరడించి మరీ వడ్డించారు...ఇక ఈ కోరిక ఎప్పుడు తీరేనో !
ఓహ్ బావున్నాయి మీ పారిస్ ట్రిప్ విశేషాలు . రెండో పార్టు కూడా తొందరగా రాసేయండి .ఇంతకీ మోనాలిసా ని చూసాక మీ అనుభూతి రాయలేదు :)
btw మీ అమ్మాయిలు మాత్రం సూపర్ అండి
నాకూ పారిస్ అనగానే మనమధుడు సినిమాలో బ్రహ్మానందమే గుర్తొస్తాడు. (ఈ సినిమా రాకముందు ఏం గుర్తొచ్చేదో గుర్తు లేదు)
మీ పాప ఫ్రెండ్స్ ఇచ్చిన సలహా నాకేం ఆశ్చర్యమనిపించలా! ఇలాంటి షాకులు మా అమ్మాయి అప్పుడప్పుడు నాకు ఇస్తూ ఉంటుంది. అప్పుడు నేను "నేను మరీ వెనకబడి ఉన్నానేమో పెంచడంలో" అని చింతిస్తూ ఉంటాను. ఫలానా చోట ఫలానా షాపులో షార్ట్స్ బాగుంటాయట, బేలిజా షాపులో క్లిప్పులు తేవేంటి? బార్బీ కొత్త వెర్షన్ వచ్చిన సంగతి ఇంకా చూళ్ళేదా వంటి ప్రశ్నలు వేసినపుడు నా దగ్గర జవాబులుండవు.
మీ పారిస్ పర్యటన, కబుర్లు బాగున్నాయి. పారిస్ వెళ్తే మీ కళ్ళతో చూడాలనిపించేలా ఉన్నాయి
Bonjour Krishna jee!!
శారద గారు,
:) థాంక్స్. ఆస్ట్రేలియా కి కొన్నేళ్ల క్రితం వచ్చాము. ఒక పదిహేను రోజులున్నాము. మళ్లీ వచ్చి తీరాలి ఎందుకంటే మా చిన్నమ్మాయి అప్పుడు పుట్టలేదు సో.. దానికి బోల్డు కోపం...
మహేశ్ గారు,
:) థాంక్స్!
శ్రావ్య,
మోనాలిసా నిజంగా ప్రత్యేకమైన చిత్రం లా అనిపించదు కానీ.. డావిన్సీ కోడ్, గట్రా చదివిన మీద.. పైగా ఆ పెయింటింగ్ మీద ఉన్న కథనాలు, ఆవిడ మిస్టీరియస్ స్మైల్ పట్ల ఉన్న రక రకాల ఊహాగానాలు విన్న మీదట.. నా మటుకు నాకు చాలా గుగుర్పాటు కలిగింది. ఒక అరగంట ఉండిపోయాము మేము. ముందు ఒక ౧౫-౨౦ నిమిషాలు .. తర్వాత వెనక్కి వచ్చేస్తున్నప్పుడు మళ్లీ వెళ్లి ఇంకాసేపు చూసాము.
@ సుజాత గారు,
ధన్యవాదాలు!! పారిస్ లో ఎక్కడికెళ్లినా మా తో బాటూ బ్రహ్మానందం కూడా వచ్చాడు :)
అవును నిజమే.. ఈ తరం పిల్లలకి ఇలాంటివి చాలా తెలుసు. మా చిన్నప్పుడు పండక్కి బట్టలు కొంటేనే గొప్ప. దాదాపు హై స్కూల్ దాకా మాకు పట్టు లంగాలే లేవు. వీళ్లకి మరి అరడజన్ మొదటి పుట్టిన రోజుకే.. అలాగే చెప్పుల జతల నుండీ,తల లో పిన్నుల వరకూ ఎక్కడివి బెటరో, ఎంతలో దొరుకుతాయో కూడా తెలుసు..
@ వెంకట గణేశ్,
నా బ్లాగ్ లో బహుకాల దర్శనం! :)
బాగా రాశారు. పారిస్ వెళ్ళండి, కాని... నగర సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే కొత్త ఆవకాయ టెంకను తీసుకెళ్ళడం తప్పదంటారు? టెంక చీకుతూ మొనాలిసా దేఖనేకా ఆనందీ కుచ్ ఔర్ హై అంటారు, అంతేనా? :))
అలాగేనండి, చూద్దాం. హైద్రాబాద్ నుంచి 5రోజుల పారిస్ యాత్రకు ఇద్దరికి ఏమాత్రం బడ్జెట్ కావాల్సివుంటుంది, హోటల్ గది అద్దె, ట్రావెల్ ఏజెంట్ల వివరాలు, లోకల్ ట్రాన్స్‌పోర్ట్ వివరాలు చెబితే ఆంధ్రాపారిస్ కూడా చూడని మాలాంటి వాళ్ళకు ఉపయోగంగా వుంటుంది.
ఆ చివరినుంచి 3వ ఫోటోలో ఆ బట్ట తలాయన పిక్చర్ బాగా వచ్చిందండి! :) మంచి టైమింగ్ చూసే దూరాడేమో కదూ? :))
చాలా విషయాలు పంచుకున్నారు కృష్ణప్రియ గారు:) టపా నాకు చాలా నచ్చింది. నాకు కూడా చూడాలనిపిస్తుంది పారిస్‌ని...:) నిజంగా మోనాలిసా బొమ్మ అంత ప్రత్యేకంగా ఉంటుందా?
బావున్నాయి మీ పారిస్ కబుర్లు
సమ్మర్ హాలిడేస్ ట్రిప్ అన్నమాట
బాగున్నాయి మీ పారిస్ విశేషాలు...చాలా బాగా వర్ణించి చెప్పారు .............. హహ్హ పారిస్ అనగానే ఆ సినిమాలో బ్రహ్మానందమే గుర్తుకువస్తాడు ...అన్నట్టు వచ్చేటప్పుడు మీరు ఆల్డా (లవంగం వైఫ్ )ఇంటికి వెళ్లి తీ తాగాలేదా
>>మోనాలిసా నిజంగా ప్రత్యేకమైన చిత్రం లా అనిపించదు కానీ.
అమ్మయ్యా నాకు తోడు ఒకరు దొరికారు. నేను IFP లో పని చేస్తున్నప్పుడు (మల్మైజోన్ , ప్యారిస్ కి 20-25 km) లూవ్రు కి ఒక 5-6 మాట్లు వెళ్ళాను. మోనాలిసా ని అన్ని అంగెల్స్ లోనూ పరీక్ష గా చూశాను . చివరకి కింద పడుకొని కూడా చూశాను. నాకు అంత గొప్పగా అనిపించలేదు. మా బాస్ గారు ఆ చిత్రం ఎలా చూడాలో, దాని గొప్పదనం మీద రెండు క్లాసు లు తీసుకున్నాడు. చివరికి విసుగొచ్చి "నీకు కళా హృదయం లేదు బుద్దావధాన్లు" అనేశాడు. పైగా "పోయి Rue St. Denis, Pigalle లో తిరుగు చాలు, ఆర్ట్ మ్యూసియం లు నీకెందుకు" అని కోప్పడ్డాడు.:):)
yes పారిస్ చాలా మంచి, సుందర నగరం.
మళ్ళీ అన్నీ ఒకమాటు గుర్తుకు వచ్చాయి.
మీ మార్కు టపా ఎప్పటిలాగానే బాగుంది
మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారు మాత్రమె travelog బాగా రాస్తారని అనుకున్తున్దేవాడిని మీ ఈ బ్లాగ్ చదివే దాక . అన్నట్లు మీ బాసు గారికి ఖచ్చితంగా తెలుగు రాదు కదా , పారిస్ రాజా వారి తోటలో మన కొత్తావకాయతో భోజనం.!
మీ travelogue చాలా బాగుందండి.
ఈ టపా గురించి ఎంతో చెప్పొచ్చు. ఐతే ఒకటి మాత్రం చెప్పగలను ఇప్పటికి. జీవితాన్ని ఆస్వాదించడం అనే దానికి నేననుకునే హద్దు ఎంత తక్కువ ఎత్తులో ఉందో తెలుస్తోంది నిన్నూ, నీలాంటి స్నేహితురాళ్ళని చూస్తుంటే :) ఆనందం వైశాల్యం అంతు లేనిదని తెలిసినా ఆ అంచులను తాకే ప్రయత్నం మానకూడదని అర్థమౌతోంది :))
నేను ఇప్పటివరకు చదివిన బ్లాగుల్లో అత్యుత్తమయిన బ్లాగు మీదేనండి.మీ టపాలన్నీ ఒక పుస్తకంగా అచ్చు వేయవచ్చు. చాల చక్కగా వివరించారు.
గుర్తొచ్చానా? ఇలా పాలో ఆల్టో ఐకియా కి వెళ్ళినప్పుడల్లా నేను మిమ్మల్ని, మీరు నన్ను గుర్తు తెచ్చుకు ముసిముసి నవ్వులు నవ్వేస్కుంటుంటే తల్లోయ్.. సామూహిక ఐకియా బహిష్కరణకి లోనౌతామో ఏమో పాడు.
అద్సరే, సెలవుల్లో విదేశీ ట్రిప్ ఉందని ముందు పోస్టులో అంటే, "ఎక్కడికీ?" అని అడక్కూడదని ఊరుకున్నాను. ఇక్కడి దాకా వచ్చి వెళ్ళిపోతారా? ఓ మైల్ కొడితే కనీసం కలిసి ఐకియావాడికి మోక్షం ప్రసాదించేవాళ్ళం కదా!
పారిస్ కబుర్లు మీరిలా రాయగానే అలా ఫోన్లో చదివేసి అటెండన్స్ వేయించేస్కున్నాను. బాగున్నాయ్ యాత్రా విశేషాలు. ప్రతీ ఎస్కలేటర్ దగ్గరా లవంగం గుర్తొస్తాడు నాకు, ఇంక పారిస్ వెళ్ళిన మీరు ఎన్ని సార్లు తలుచుకుని ఉంటారో!
@spArrow,
:) అవును అక్షరాలా అంతే! మోనాలిసా ని చూసి మాగాయన్నం, రాజు గారి తోట లో తొక్కుడు పచ్చడన్నం, ఈఫిల్ టవర్ దగ్గర ఆవకాయన్నం.. మంచి కాంబినేషన్లు..
బడ్జెట్..మనం ఎంత లో కావాలంటే అంతలో చేసుకోవచ్చు. కాస్త చీప్ గా ఉన్నప్పుడు ఎయిర్ టికెట్లు కొనుక్కుని.. ఒక మాదిరి గా ఉన్న హోటల్ లో ఇంటర్ నెట్ ద్వారా బుక్ చేసుకుని ముందు గా రిసర్చ్ చేసి పూర్తిగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాడితే అది ఒక రకం.
ట్రావెల్ ఏజెంట్ ద్వారా వెళ్తూ వారి తో గైడెడ్ టూర్లు, హోటళ్ళు, టికెట్లు అన్నీ బుక్ చేయిస్తే.. ఏ బాదర బందీ లేకుండా.. అంతా వాళ్లే చూసుకుంటారు. అది ఒక ఎత్తు.
మేము మధ్యే మార్గం లో ట్రావెల్ ఏజెంట్ ద్వారా మంచి హోటల్ రూమ్, టికెట్లు, పికప్, డ్రాప్ లాంటివి చేయించుకుని.. మిగతా ట్రిప్ మాకు మేము గా మెట్రో ల్లో తిరిగి. కొన్ని చోట్ల గైడెడ్ టూర్లు, కొన్ని చోట్ల ఆడియో టూర్లు తీసుకోవటం వల్ల..
నలుగురికి కలిపి ౪.౫ లక్షలు రూపాయలు + ౮౦౦ యూరోల పైన ఖర్చూ అయినట్లు తేలింది.
@ అపర్ణ,
:) థాంక్స్! ఇంకేం తప్పక చూసేయండి. మోనాలిసా .. అంత ప్రత్యేకం గా ఉందా? అంటే మనకున్న అభిరుచి ని బట్టి ఉంటుందేమో.. నాకు మరీ గొప్పగా ఏమీ అనిపించలేదు.. ఎందుకంటే.. నాకు చేప బొమ్మ తప్ప ఇంకే బొమ్మా వేయటం రాదు కదా.. ఆర్టిస్ట్ లకి గొప్పగా అనిపిస్తుందేమో..
@లత గారు,
థాంక్స్! అవునండీ సమ్మర్ ట్రిప్.
@ శివరంజని,
:) ఆల్డా నేమనగలం?. మన బంగారమే (బ్రహ్మానందమే) మనల్ని రావద్దన్నప్పుడు..
@ బులుసు గారు,
థాంక్స్ థాంక్స్!!
అన్ని ఆంగిల్స్ లో చూశానన్నారు. 29.4869 డిగ్రీ కోణం లో తల ని వంచి కుడి చేతి కనిష్టిక, మధ్యమ వేళ్ళ మధ్యలోంచి ఎడమ కన్నుని 64% మోసి చూస్తేనే ఆ ప్రత్యేకత కనిపిస్తుంది. మీరు పాపం 5-6 సార్లు వెళ్లినా ఇలా చూడటం మిస్ అయి ఉంటారు :)
@ నరసింహ మూర్తి గారు,
మీకు కృతజ్ఞతలు. మా బాసు గారికి తెలుగు రాదు కానీ.. ఆయనకీ తెలుసు.. నా బ్లాగ్ లో ఏదో రాస్తాను ఆయన గురించి అప్పుడప్పుడూ అని. (ఊర్వశి కృష్ణప్రియ లా నటిమ్చేసా) అని ఒక పోస్ట్ రాసాను ఇదివరకు. అప్పుడు ఆయనకీ ఇలా రాస్తానని చెప్పాను.
@శిశిర,
థాంక్స్ ... బాగున్నారా?
@ లలిత,
:) నువ్వు మరీ.. Anyways thanks a lot!
@ కొత్తావకాయ,
:) అవును. నిజమే.. ఈ సారి వస్తే.. అలాగే చేద్దాం.
ఇక లవంగం అంటారా? ఆయనా మాతో పారిస్ మొత్తం తిరిగారు.
:)ఏంజాయ్:)
మీ పిల్లకి సమ్మర్ హాలిడేస్ ట్రీప్ కి తీసుకువెళ్ళి అక్కడ వున్న ప్రదేశాల మీద అవగాహాన మరియు జనరల్ నాలెడ్జ్ మరియు చరిత్ర పట్ల అవగాహన కల్పించినట్టు అనిపించిది నాకు మాత్రం.
జీవితాన్ని ఏలా ఆస్వాదించలో మీమ్మల్నీ చూసి నేర్చుకోవాలి.
నేను కూడ ఇంచుమించు వీళ్ళు దోరికినఫ్ఫుడల్లా వైరేటిగా ప్లాన్ చేస్తుంటాము మా ప్రయాణాలు.
మీరు రాసీనదాని బట్టి నాకు కూడ చూడలని పిస్తుంది పారిస్.
Wow..చాలా బావున్నాయి విశేషాలు :)
nice post,
అదేంటొ గాని అందరూ పారిస్ అందమైన నగరం ప్రేమికుల నగరం అంటారేఅ గాని నాకు మాత్రం పారిస్ విప్లవాల పుట్టగానే గుర్తు బహుశా చరిత్ర పుస్తకాల ప్రభావం అనుకుంటా, నేను విప్లవం కన్న బిడ్డను అన్న నెపోలియన్ , నా తర్వాత ప్రళయమే అనుకున్న లూయి , మొదటి ప్రపంచ యుధంలో జెర్మనీ మెడలు వంచిన వర్సయిల్స్, అదే వర్సయిల్స్ లో హిట్లర్ కు లొంగి పోయిన పారిస్, చరిత్ర కు సజీవ సాక్ష్యం . ఎప్పుడైనా వెళ్ళాలి మరి.
కృష్ణగారూ! భలే ఉన్నాయ్ మీ ప్యారిస్ విసేషాలు! నాకు చూడాలనిపిస్తోంది మీ ట్రావెలాగ్ చదివితే! మీరు వెళ్ళిన ప్లేసెస్ అన్ని నోట్ చేసుకున్నా! :) చాలా బాగుంది మీరు రాసీన్ విధానం...ఎస్పెషల్లి...మీ పిల్లల్లు ఆవకాయ అన్నం అడిగినప్పుడు...మీరు 'తిక్క కుదిరిందీ అన్నారు చూడండీ..హ్హహ్హహ్హా...నేను పెద్దగా నవ్వేసా :))))))
చాలా డీటైలెడ్గా....నీట్ గా వ్రాసారు! నాకు ఒకటర్ధమయింది....ప్యారిస్ అంటే...చరిత్ర అని :) ఎన్నెన్ని వ్రాసారు బాబోయ్! మీ మెమొరి చాల గ్రేట్!
ఇక మీమీద కొంచెం కోపం కూడా ఉంది! అమెరికా వచ్చి చెప్పలేదు కదా! :((
మా మిషిగన్లో గ్రేట్ లేక్స్ అన్నీ దగ్గరుండి చూపించేదాన్ని కదా! అలాగే ఇటు షికాగో..అటు న్యుయార్క్/న్యు జెర్సి...పక్కనే వాషింగ్టన్! ఇవన్నీ చూపించేదాన్ని! :(( మీరు మరీ ఇలా చేస్తారనుకోలేదు..[కృష్ణగారి మీద అలిగిన ఇందు] :((
@ రంగావఝ్యుల శేషాంజనేయావధాని శర్మ గారు,
ధన్యవాదాలు. ఈ ట్రిప్ ప్లానింగ్ చేసింది మా వారు. నేను సెలవ దొరకదనీ, ఆర్థికం గా కుదురుతుందా అని కాస్త భయపడ్డాను. కానీ ఆయన పట్టుదల తో బాగానే జరిగిపోయింది. మీరూ తప్పక చూడండి..
@ హరేకృష్ణ,
ధన్యవాదాలు
@ ఇందు,
So sweet of you .. You said such nice things.. చాలా సంతోషం.. మా పిన్ని కూతురు షికాగో లో ఉండేది. నేను అక్కడ ఒకసారి 9/11 అప్పుడు వచ్చి పది రోజులు ఇరుక్కుపోయా. అప్పుడు తీరిగ్గా ఇవన్నీ చూసాం.. కానీ.. పదేళ్లయి పోయిందా అప్పుడే అని ఇప్పుడు మీరు ఇలా అంటే అనిపిస్తోంది.
ఈసారి డైరెక్ట్ గా మీ ఊళ్లోనే దిగటం.
@ రాఘవ,
హ్మ్మ్.. బాగా చెప్పారు. వర్సైల్స్ లో లూయి IX,X,XI లు వారి జీవన శైలుల్లో తేడాలు, వారి అభిరుచి కి తగ్గట్టు రాజ భవనం మార్చుకోవటం కనిపిస్తుంది. అలాగే గదుల్లో పై కప్పు ని 14 వ లూయి తన ముఖం తో దేవతల బొమ్మలు వేయించి ఆడంబరం గా అలంకరిస్తే.. X వ లూయి బంగారు పూతలూ, ఆడంబరాలూ ఆపి తెల్లని వెల్ల వేయించటం కొన్ని గదుల్లో అగుపిస్తుంది. అలాగే రాజు ముఖం కడిగినా, స్నానం చేసినా, చివరకి నిద్రించటం కూడా ప్రజలకి చూసే 'అదృష్టం' ప్రసాదిస్తే.. వ్యక్తిగత జీవితానికి ప్రైవసీ ఉండాలన్న భావానికి ప్రాధాన్యత నిచ్చి లోపల ప్రైవేట్ గదిలో పడుకుని ఉదయం మాత్రం పబ్లిక్ 'మేలుకొలుపు ' సంబరానికోసం పడక గది కి వచ్చేవాడని.. గైడ్ చెప్పాడు. అదే విధం గా.. రాణీ గారి గదులూ, ఆ పక్కనే రాజు ని అడ్డం పెట్టుకుని నిజమైన పరిపాలన చేసిన మిస్త్రెస్ లూ, వారి ఆధ్వర్యం లో పారిస్ లో కట్టిన కట్టడాలు, రాజు గారు పుట్టిన గదీ, డైనింగ్ హాలు, వేలాది ఎకరాల తోట,
అన్నిటికన్నా ముఖ్యం గా రాణీ వారి గది నన్ను ఆలోచింపచేసింది. పట్టపురాణి ఒక గది లో మొదటి అంతస్తు లో, రాజ కుమారులు/కుమారిలు గ్రౌండ్ ఫ్లోర్ లో.. ఆవిడ గది లో అలంకరణ లో పుట్టింటివారి potraits అవీ కనిపిస్తాయి. పదిహేనవ లూయి పట్టపు రాణి, రాచరికపు మర్యాదలని కొన్ని పక్కకు నెట్టి తన పిల్లలని రోజూ కలిసేది వారితో సమయం గడిపేది.. అని ఫ్రెంచ్ రాజభవనం లో 'అభాసు పాలు' అయిన విషయం వింటే కాస్త బాధేసింది. ఆఖరి రాణీ గారి కడుపు కోత కథ వింటే కూడా.. అయ్యో అనిపించక మానదు. ఫ్రెంచ్ విప్లవం అప్పుడు ఒక కొడుకు గొంతు కొస్తే, ఇంకో కొడుకు టీ బీ తో మరణించాడని గైడ్ చెప్పాడు.
మళ్లీ అనిపిస్తుంది.. 'సరేలే..కనీసం చరిత్ర లో వీరికొక స్థానం ఉంది. మరి ఎన్ని వేల లక్షల మామూలు మనుషులు ఈ మాడ్ నెస్ లో జీవితాలని పణం గా పెట్తలేదూ ..' అని.
Anyways,... :)
Krishna gaaru,
can you please write some time why you chose to came back to India and what you have faced in the start?
I have been in the US for 10 yrs now. I miss India more than ever now.. But I am always in confusion if I leave, its the right thing for my 3 yr old or not. Thanks. Aruna.
బాగున్నాయండీ మీ కబుర్లు.. నా పారిస్ ప్రయాణం గుర్తొచ్చింది. ఇప్పటిదాకా చూసినంతలో నాకు చాలా చాలా నచ్చి మళ్ళీ తప్పకుండా వెళ్ళాలనిపించిన ప్రదేశాల్లో పారిస్ ది మొదటి స్థానం.. :) మీరన్నట్టు బ్రహ్మీ ని గుర్తు చేసుకోకుండా పారిస్ ప్రయాణమే లేదసలు.. మా ఫ్రెండ్స్ ఒకరిది కెమెరా పోయిందట ట్రైన్లో.. వీళ్ళ కళ్ళెదురుగానే ఒకడు బ్యాగ్ లోంచి తీసుకుని పోయాడంట క్రిక్కిరిసిన ట్రెయిన్లో.. తిరిగొచ్చాక వాళ్ళు ఒకటే చెప్పడం నవ్వడం.. "ఫోటో వచ్చింది.. కెమెరా పోయింది.." అని ;)
అరుణ గారు,
తప్పక రాస్తాను. మూడేళ్ల బాబుకి దేశం మార్పు (నా దృష్టి లో...) పెద్దగా adverse effects ఉండవనే అనుకుంటున్నా.. పైగా ఇంకా.. స్కూల్ కి వెళ్లేముందే వచ్చేస్తే.. పెద్దలం కూడా.. కంపెరిజన్స్ చేయము.. నా ఉద్దేశ్యం లో ఇదే బెస్ట్ సమయం. ఎప్పుడు వచ్చినా.. మొట్ట మొదట కొన్ని ఇబ్బందులు తప్పవు. (ఆరోగ్యం,ట్రాఫిక్,త్వరగా తెమాలని పనులు,చుట్టాల లాంటివి..) తర్వాత హాయిగా అడ్జస్ట్ అయిపోతారు.. All the best!
మధురవాణి గారు,
LOL... నిజంగానే నాకు పిచ్చి పిచ్చి గా నచ్చేసింది. ముందర చెప్పినట్టు అక్కడికి వెళ్తే బ్రహ్మానందానికి కూడా ఒక టికెట్ ఎక్ష్ట్రా కొట్టించాల్సిందే. మిమ్మల్ని తలచుకున్నా.. అక్కడ రైలెక్కితే మీ ఇంటికి వచ్చేయచ్చని ...
>>>>'అంత కష్టపడి మ్యూజియం అంతా తిరిగి తిరిగి వెళ్తే ఐదు మీటర్ల దూరం లో పైగా గాజు ఫ్రెం లో ఉంటుంది.. దాని బదులు ఇంటర్ నెట్ లో చూడటం మేలు..' అని ఒకరు..
వాళ్ళెవరో నాకులాంటివాళ్ళేనండి ,,నాకు ఓ పట్టాన ఏదీ నచ్చదు ...అసలు ఇంట్రెస్ట్ ఉండాలిలేండి ... లేకపోతే మా ఆయనతో కలిసి ఈ పాటికి సగం ప్రపంచ యాత్ర చేసేదాన్ని :)
కాని మీరు కళ్ళకు కట్టినట్లు బాగా రాసారు
ఈ టపా మిస్ అయ్యాను...బావున్నాయి పారిస్ విశేషాలు..మీరు చెబుతుంటే ఊహించుకుంటూ చదివా...మీ పక్కనే యెస్. లవంగం కూడా ఒక ప్రత్యేకమైన ఎక్స్‌ప్రెషన్ తో కనిపిస్తూ వచ్చాడు. :))
ఒకటి చెప్పనా..మొనాలిసా ని చాలా సార్లు, చాలా చోట్ల చూసాను. నాకెందుకో ఏమీ ప్రత్యేకంగా అనిపించదు. పైగా ఇంతకంటే అందగత్తెలు, చక్కని నవ్వు కలవారు ఎందరు లేరు అనిపిస్తుంది. ఆ నవ్వులో అందం నా కళ్ళకు తెలియలేదో ఏమో మరి, నాకు అంత కళాదృష్టి లేదేమో! మీకెలా అనిపించింది?
@ నేస్తం,
:) అవును. అందరికీ అన్నీ ఇష్టం ఉండాలని లేదు కదూ.. అమ్మయ్య! నాకు మోడర్న్ ఆర్ట్ అస్సలూ అర్థం కాదు. చుట్టూ అందరూ వహ వా లు అంటుంటే.. ఎందుకైనా మంచిదని నేనూ ఎంజాయ్ చేస్తున్నట్టు మొహం పెట్టి వచ్చేసా.. వచ్చే ముందు 'ఒబామా తో ఫోటో తీసుకున్తున్నంత ' ఎక్స్ ప్రెషన్ ఇచ్చి ఫోటోలు తీసుకోవటం మాత్రం మర్చిపోలే :)
@ సౌమ్య,
:)) మీరంటుంటే నాకూ ఆయన కళ్ళ ముందు ఏ స్థంభం చాటు నుంచి తొంగి ముక్కు మీద వేలేసుకుని తల ఊపుతూ కనిపిస్తున్నాడు.
ఇక మోనాలిసా ని చూస్తే.. అన్ని రకాల ఒపీనియన్లు విని వెళ్లి ఉండటం తో చాలా కుతూహలం గా ఉండి.. అలాగే డాన్ బ్రవున్ చేసిన హైప్ వల్ల కూడా ఆ పెద్ద హాల్ లోకి వెళ్లగానే.. వందలాది మంది మధ్యలోంచి చూడటం తో 'ఇందిరా గాంధీ' ని చూసినంత గుగుర్పాటు కలిగింది.
అవి లేకుండా ఉండి ఉంటే మీరన్నది నిజమే..పెద్ద ప్రత్యేకత ఏమీ లేదు.
మేము నవంబర్ లో వెళ్ళాము. చలి చాలానే ఉంది. మా చిత్రమైన అనుభవాలు ఈ లింక్ లో పెట్టాను. చూడండి.
http://radhemadhavi.blogspot.com/2012/02/blog-post.html
పారిస్ లోని 'కరిగిపోతున్న భవనపు' రహస్యం: http://radhemadhavi.blogspot.com/2012/02/blog-post_06.html
మేము నవంబర్ లో వెళ్ళాము. చలి చాలానే ఉంది. మా చిత్రమైన అనుభవాలు ఈ లింక్ లో పెట్టాను. చూడండి.
http://radhemadhavi.blogspot.com/2012/02/blog-post.html
పారిస్ లోని 'కరిగిపోతున్న భవనపు' రహస్యం: http://radhemadhavi.blogspot.com/2012/02/blog-post_06.html
Post a Comment
మీ అభిప్రాయం...
Note: Only a member of this blog may post a comment.