Wednesday, June 8, 2011

మళ్లీ మొదలు.. :)

ఏప్రిల్ అంతా హాయిగా తాతగారింట్లో వేసవి సెలవలు గడిపారా పిల్లలు? ...


మళ్లీ మొన్న విదేశాలలో సెలవలు గడిపి రకరకాల అనుభూతులతో విమానం తిరిగి బెంగుళూరు కెళ్లే విమానం ఎక్కామా? .. పిల్లలు గంభీరం గా.. ముందర నిద్రేమో అనుకున్నా.. లేదే.. అలాగ అనిపించట్లేదు. పెద్దగా 'తమలో రేగే భావ పరంపర ని తమలోనే దాచుకుని పైకి శుష్కమైన నవ్వు ' చూపించేంత నాటకీయత వాళ్లకి లేదు కాబట్టి 'వాళ్లే చెప్తార్లే' అని నేను నిద్ర లోకి జారుకునేంతలో..

మా పెద్దమ్మాయి "అమ్మా.. ఇంకా వారం ఉంది కదా.. స్కూళ్లు తెరవటానికి.. ఇంటికెళ్లగానే మమ్మల్ని హైదరాబాద్ లో అమ్మమ్మా వాళ్లింట్లో దింపేసి వెళ్తావా?" అంది. చిన్నది ఆశగా చూస్తోంది నా వైపు. ఆశ్చర్యం వేసింది. అలాగే చాలా ఆనందం గా అనిపించింది. వీళ్లకి ఇంకా అలాంటి కోరికలు ఉన్నందుకు. . నెల రోజులు హైదరాబాద్ లో తాతగారింట్లో గడిపాక కూడా.. ఇంకా వాళ్లకి అక్కడికి వెళ్లాలని అనిపించినందుకు..

పుస్తకాలు, అట్టలు, లేబుళ్లు ఎలాగూ తప్పవు.. ఇంక కొత్త స్కూల్ డ్రెస్సులు ఎందుకు? చాల్లే .. వీళ్లకి పొదుపు నేర్పిద్దాం అనుకున్నాం మేము. మా చిన్నప్పుడు ఒకటే పెన్ను ని ఎంత జాగ్రత్త గా వాడుకునే వాళ్లమో, లాంటి లెక్చర్ ఇచ్చాను.. వాళ్లకి ఎంత వరకూ అర్థమైందో తెలియదు. పుస్తకాలు కొని అట్టలేసి, లేబుళ్ళు అతికించి రెడీ గా పెట్టాం. స్కూల్ దుస్తులు అన్నీ ఇస్త్రీలు చేసి పెడితే.. పిల్లలూ అంత కన్నా ఆసక్తి గా ఇంగ్లిష్ లో ఉప వాచకం (non-detailed) కథలు అన్నీ చదివేసి వారం ముందే రెడీ..



ఐదు రోజుల ముందు ఆఫీస్ నుండి రాగానే :
"అమ్మా... అనూష కొత్త బ్యాగ్ కొంది. ఎంత బాగుందో.. ఎన్ని అరలున్నాయో.. ఆలివ్ గ్రీన్ నా ఫేవరేట్ రంగమ్మా... అసలు ఆ బ్యాగ్ ని చూస్తూ అలా ఉండిపోవాలనిపిస్తోంది"..... "నాన్నా.. గౌరి లంచ్ బాక్స్ మీద హానా మోంటానా ఉంది. అది ఎంత లక్కీ!" అని ఆకాశం లోకి చూస్తూ.. అరమోడ్పు కన్నులతో...

మా వారికి ఇంక నా మీద కోపం వచ్చింది. "నీ వెధవ పొదుపు చాలు.. మరీ అతి చేయకు.. వాళ్లకి అన్నీ కొత్తవి ఉండాలి పదండమ్మా.. " అని వాళ్లని తీసుకెళ్లిపోయారు. అంతే! అన్నీ కొత్తవి తెచ్చుకుని వచ్చేసారు.




నాలుగు రోజుల ముందు :

"నాన్నా!!!!" .. (చూసారా? ఇంక అమ్మా అన్నది లేదు.. నేనెలాగూ .. లెక్చర్లు ఇస్తానని... చాలా కంత్రీలు...వీళ్లు!!) "మా స్కూల్ డ్రెస్ లు చాలా పాతగా.. లేవూ? తెల్ల చొక్కా, స్కర్ట్ అయితే మరీ సర్ఫ్ వాడని మదర్స్ పిల్లల బట్టల్లా లేవూ?

మా తెల్ల బూట్లు మాసిపోయి లేవూ.. మట్టి రంగు బూట్లల్లా?" అంతే.. ఆ తండ్రి హృదయం ద్రవించి ఏరులై ప్రవహించింది.

"పిల్లలకి అన్నీ కొత్తవే ఉండాలి.. ఉండి తీరాలి.. అస్సలూ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు.. కృష్ణా.. ఇదే చెప్తున్నా.. మొదటి రోజున అన్నీ కొత్తవే కనపడాలి. పిల్లలు ఆనందం గా వెళ్లాలి.... " అని అల్టిమేటం ఇచ్చేసారు.

'హుహ్..' అనుకుని ఊరుకున్నాను. అంతే .. పాత స్కూల్ డ్రస్సులు నన్ను వెక్కిరిస్తూ మూలనున్న గూట్లోకి వెళ్లిపోయాయి..



మూడు రోజుల ముందు :

"హమ్మయ్య.. ఇంక కొనేవి అయిపోయాయి..అంతా రెడీ.." అనుకుని తృప్తి గా నిట్టూర్చానో లేదో... "ఈ సంవత్సరం స్కూల్ బస్ లో వెళ్లను.. సైకిల్ మీద వెళ్తాను... హరిణి వెళ్తోంది.. శ్రీయ వెళ్తోంది.. శ్వేత వెళ్తోంది".. అని అందరి లిస్టూ చదివేసింది మా అమ్మాయి.. మా ఇంటికి స్కూల్ పట్టుమని పది నిమిషాల ప్రయాణం. నానా రకాల తర్జన భర్జనలు పడి ఒప్పుకున్నాం.

అయితే "నాకు కొత్త సైకిల్ కొను.." అని మొదలు. వీల్లేదని నేను. మొత్తానికి పాత సైకిల్ కి మళ్లీ హంగులన్నీ అమర్చేట్టు గా.. ఒప్పందం కుదిరింది. మా చిన్నది ఊరుకుంటుందా? "నాకూ కావాలి!!!" అని .. ఇద్దరికీ సైకిళ్లకి మళ్లీ రెండు వేలు వదిలాయి. ప్రాక్టీసులు .. హడావిడి..



రెండు రోజుల ముందు :

అన్నీ రెడీ... ఇంక గుడి కి వెళ్లి దణ్ణం పెట్టుకోవటం, ఆఖరి ఫ్రీ రోజులు అని ఎమోషనల్ గా మాట్లాడి పిజ్జాలు, కొత్త పెన్సిల్ బాక్సులు, కొత్త రైన్ కోట్, వాచీ, వట్టి చేతులతో బయటకి వెళ్లటం.. చేతినిండా సంచీలతో వెనక్కి రావటం.. అదేదో జీవితం లో ఇక ఆనందం గా ఉండే రోజులకి ఇదే 'శుభం' కార్డ్ అన్నట్టు ప్రవర్తన...



రేపు బడి తెరుస్తారనగా..

చాలా బుద్ధిగా ఏడింటికి అన్నం తినేసి.. హోటల్ రూముల్లో పరిచినట్టున్న పక్క మీదకి ఎక్కి.. దేవుడిని తలచుకుని.. మర్నాటికి ఆరింటికి అలారం పెట్టమని ఒకరు.. 'అబ్బే.. ఆరు దాకా ఆగను. ఐదుకే పెట్టమని.. ' ఒకరు... ఎనిమిదిన్నరకే పడుకున్నారు. పక్కన బల్ల మీద మర్నాటికి బట్టలు, ఆ పక్క స్కూల్ స్నాక్ లు, చివరగా.. స్కూల్ బ్యాగులు.. కాస్త గదికి అవతల స్కూల్ బూట్లు, పక్కన సాక్సులు. బాత్ రూమ్ లో తువ్వాలు ...

'ఆహా.. వీళ్లు నా పిల్లలేనా? ' అని ఆనంద భాష్పాలు.. 'almost' రాలబోయాయి..



Da D-day...

నాలుగు గంటలకే లేచి తెల్లారిందా లేదా ? అని చూసుకోవటం... తొమ్మిది గంటల స్కూల్ కి ఏడుమ్బావు కల్లా తయారయి పాలు తాగేసి, ఇడ్లీలు తినేసి పువ్వుల్లా కూర్చున్నారు. నేనే కాస్త వాళ్ల టిఫిన్ బాక్సులు కట్టటానికి అవస్థ పడ్డా..

కాలనీ అంతా.. కొత్త బట్టల్లో .. మెరిసిపోతూ పిల్లలు.. గల గలా.. బస్సు సమయానికి గంట ముందే రోడ్డు మీద సందడి.

అమ్మాయి సైకిల్ మీద ప్రయాణం అనగానే.. చాలా గుబులు గా.. దూకుడు గా వచ్చే కాల్ సెంటర్ టాక్సీలు, వీధి కుక్కలు, మనో వైకల్యాల బాధితులు, కళ్లముందు బారులు తీరి...

అనకూడదు కానీ.. చచ్చేంత రిలీఫ్. 'అమ్మయ్య.. స్కూల్స్ తెరిచారు' అని. చిన్నమ్మాయి ని బస్సు ఎక్కించటానికి వెళ్తే.. అందరు తల్లుల కళ్ళూ మెరుస్తూ...

పిల్లలు త్వరగా స్కూళ్ళకి వెళ్లిపోవటం తో నేనూ త్వరగా ఆఫీస్ కి. మా బాసు గారికి దాదాపు గా గుండెపోటు వచ్చినంత పనైంది...

మద్యాహ్నం పిల్లలని వదిలే సమయానికి స్కూల్ ముందు వందలాది తల్లిదండ్రులు ... కంగారుగా, కేమేరాలతో... వార్నీ.. మా చిన్నప్పుడు ..ఇంత ఉందా? అనిపించింది.

మొదటి రోజు కదా.. ఇంటికి వచ్చాక కూడా.. అన్నీ పధ్ధతి గా.. చక చకా.. హోం వర్క్ లు చేసేసి.. ఎక్కడివి అక్కడ పెట్టేసి.. వహ్ వా అనిపించారు.. స్కూల్ విషయాలు బోల్డు చెప్తూ... వెనక వెనక తిరుగుతూ...

రెండు రోజులు గడిచాయి కదా.. ఉదయం.. అరుస్తూ.. గొడవ గొడవ గా లేపటం,.. బట్టలు, పుస్తకాలు, టిఫిన్లు, జడలు, ఒకటేమిటి అష్టావధానం చేస్తూ.. సగం వస్తువులు ఇంట్లో మర్చిపోయి, రోడ్డెక్కుతూ నోట్లో ఏదో కుక్కుకుంటూ పరుగులెట్టటం... పిల్లలు వెళ్లాక.. 'అయ్యో వాళ్లని మరీ మోటు గా తిట్టామా? సరిగ్గా తిన్నారా? నిద్ర సరిపోలేదేమో? హోం వర్క్ పుస్తకం అయ్యో మర్చిపోయిందే... ' ఇలా... కాసేపటికి నాకు నేనే సద్ది చెప్పుకోవటం... , స్కూల్లో పెన్నులూ, పెన్సిళ్ళూ పారేసుకుని రావటం, ఇంటికి వచ్చాక, వస్తువులన్నీ తెగ విసిరి ఒక పట్టాన తినటానికి రాకపోవటం,.. స్కూల్ పని అంటే బద్ధకించటం. అన్నీ సగం లో వదిలేసి ఆటలకి పరిగెత్తటం..

మా చిన్నది సౌర కుటుంబం గురించి చదివింది సాంఘిక శాస్త్రం లో.. ఇక దానికి ఒక ఆలోచన వచ్చింది...

ఆలోచన ఏంటంటే.. సూర్యుడు మండే అగ్నిగోళం కదా.. కొన్నాళ్లకి మంట ఆగిపోతే ఇంకా డే టైం ఉండదు. అప్పుడు స్కూల్ ఉండదు కదమ్మా? అంది. 'నా తల్లే' అనుకున్నాను.

గెలీలియో.. 'Father of Science' అని సోషల్ స్టడీస్ లో చెప్పారుట. 'వీళ్లకి అసలు బుద్ధి లేదు. ఆయన సైన్స్ కి తండ్రి అయితే సోషల్ లో చెప్పటమేమిటి వాళ్ల తలకాయ' అనేసింది.

మా పెద్దది స్కూల్లో అప్పుడే ఫ్రెండ్స్ తో గొడవలు పడి వచ్చేసింది.

అయితే.. మళ్లీ మామూలైపోయింది.. రొటీన్ లో పడ్డామన్నమాట.. అమ్మయ్య.. అనిపించింది.



కానీ.. మద్యాహ్నానికి స్కూల్ మా పెద్దమ్మాయి (సైకిల్ మీద కదా?) ఐదు నిమిషాలు రావటం లేట్ అయిందో లేదో... వందలాది ఆలోచనలు,.. ఊహలు!! కాళ్లూ, చేతులూ చల్లబడిపోవటం!

ఎందుకో మా అమ్మ గుర్తొచ్చింది.. ఒక్కసారి గా చెంప మీద పెళ్ళున కొట్టినట్టు.. కాలేజ్ మూడుకి వదిలి పెడితే.. స్నేహితురాళ్లతో బలాదూర్ గా తిరిగి ఆరుకి చేరితే.. గుమ్మం దగ్గర, టెన్షన్ తో ఎప్పుడూ నుంచుని ఉండేది.. నన్ను సందు చివర చూస్తూనే.. నేను దెబ్బలాడతానని లోపలకి వెళ్లిపోయేది. ఎప్పుడైనా... 'ఎందుకు లేటయింది? ఎంత భయపడ్డానో తెలుసా? ' అని బేలగా, కోపం గా, దుఃఖం గా అడిగితే.. 'హాట్..హుట్ అని హంగామా చేసి.. 'నీకు మరీ.. టెన్షన్ ఎక్కువ.. ఇలా అయితే కష్టం.. ' అని విసుక్కోవటం గుర్తొచ్చింది...

అమ్మకి సారీ చెప్పాలి.. ఎంతలా ఏడిపించాను? వస్తువులన్నీ చిందర వందర గా విసిరేయటం.. తన కష్టాన్ని విద్యార్థి గా ఉన్నప్పుడు ఏనాడూ గుర్తించక పోగా.. విసుక్కోవటం...... చా...

లేచి నా సెల్ ఫోన్ అందుకుని అమ్మ వాళ్ల నంబర్ కొట్టాను... దశాబ్దాలు గడిచిపోతేనేం? 'It is never too late...'

37 comments:

భాను said...

mugimpu baagundandee...

కృష్ణప్రియ said...

భాను గారు,
థాంక్స్! మీ కామెంట్ చూసాకే గమనించాను.. అనుకోకుండా నా డ్రాఫ్ట్ పబ్లిష్ చేసేశానని..ఏవో పిక్చర్లు పెడుతూ..

Anyways..now it is complete...

మధురవాణి said...

చాలా బాగున్నాయి కృష్ణ గారూ మీ పిల్లల స్కూల్ కబుర్లు.. మీ పోస్టులేవైనా సరే అలా అలా వెళ్ళిపోతూనే ఉంటాయి చదువుతుంటే.. వంద పేజీలైనా చదివెయ్యొచ్చు అలవోకగా.. :) బోల్డు స్కూల్ జ్ఞాపకాలని కదిలించారు. చివరికొచ్చేసరికి నాకూ మా అమ్మ గుర్తొచ్చింది. నేను ఇల్లు వదిలి హాస్టల్ కి వెళ్ళాక నాకు చాలా సార్లు అమ్మని విసుక్కున్నది గుర్తొచ్చి చాలా ఏడుపొచ్చేసేది.. అసలా విసుక్కున్న జ్ఞాపకాలు ఎప్పుడు గుర్తొచ్చినా నా మీద నాకు చాలా కోపం వస్తుంది. :( ఎనిమిది, తొమ్మిది తరగతులకి వచ్చాక కూడా పొద్దున్నే స్కూలుకి రెడీ అయి వెళ్ళడానికి గగనం అయ్యేది నాకు. అన్నీ అమ్మే ఎదురు చేసి పెట్టేది.. హుమ్మ్.. అర్ధరాత్రి అమ్మని గుర్తు చేసారు. అలా ఆలోచిస్తూ పడుకుంటా! :)

Kathi Mahesh Kumar said...

ఎండింగ్ లో ఎమోషన్ పిండేసారు. టపా బాగుంది.
:) :) :)

Sravya V said...

బాగా రాసారండి !మీ పిల్లలకి ఇప్పటినుంచే పొదుపు నేర్పేద్దామనే :)
అ చివరి మూడు పేరాలు ఐతే హ్మ్ ఏమి చెప్తాం హిస్టరీ repeats అన్నమాట !

లత said...

అమ్మ అయ్యాకే ఆ టెన్షన్ ఏమిటో అర్ధం అవుతుంది క్రిష్ణ గారూ, ఇప్పుడు మన పిల్లలు మనని అంటారు చిన్నపిల్లలమా ఎందుకు కంగారు అని
హిస్టరీ రిపీట్స్ అంతే.బాగా రాశారు

చైతన్య.ఎస్ said...

బాగుందండి.

siri said...

క్రిష్నప్రియ గారు,

బావుందండీ, ఐతే మళ్ళీ మొదలన్నమాట స్కూల్ సందడి.

నేనూ మీలాగే పిల్లల్ని విసుక్కుంటే, ఆ తర్వాత అంతా బాధ పడుతుంటాను. 5 ని.లు ఆలస్యమైతే చాలు విపరీతమైన టెన్షన్. నా భయం చూసి పిల్లలు వెక్కిరిస్తుంటారు. అమ్మగా మారాక ఎక్కువ సెంటిమెంటల్గా మరింత ఎమోషనల్గా ఐపోతాం కదా.

శ్రీరాగ

Anonymous said...

" అమ్మకి సారీ చెప్పాలి.. ఎంతలా ఏడిపించాను? వస్తువులన్నీ చిందర వందర గా విసిరేయటం.. తన కష్టాన్ని విద్యార్థి గా ఉన్నప్పుడు ఏనాడూ గుర్తించక పోగా.. విసుక్కోవటం...... చా...

లేచి నా సెల్ ఫోన్ అందుకుని అమ్మ వాళ్ల నంబర్ కొట్టాను... దశాబ్దాలు గడిచిపోతేనేం? 'It is never too late...'"----
Excellent !!

కృష్ణప్రియ said...

@ మధురవాణి గారు,
మొదటగా ధన్యవాదాలు! I am thrilled. మీకు ఈ జ్ఞాపకాలన్నీ నా పోస్ట్ తట్టి లేపిందంటే.. నాకు గర్వం గానే ఉంది. నేను పెళ్లవక ముందు తండ్రి పార్టీ.. కానీ పెళ్లయ్యాక మాత్రం అమ్మ పార్టీ.. :)

@ మహేశ్ గారు,
థాంక్సండీ.

@శ్రావ్య,
:-( ఏం నేర్పడమో.. చూసారు గా.. ఎంత గొప్పగా ఫలితాలిచ్చాయో.... అన్నీ సాధించుకున్నారు..
థాంక్స్!

కృష్ణప్రియ said...

@ లత గారు,
మీరు చెప్పింది అక్షరాలా నిజం.

@చైతన్య గారు,

థాంక్స్! నా బ్లాగ్ కి స్వాగతం!

@ శ్రీ రాగ గారు,
కరెక్ట్ గా చెప్పారు. మీకూ నా బ్లాగ్ కి స్వాగతం!

మనసు పలికే said...

టపా చివరికొచ్చే వరకూ చదువుతూ చదువుతూ మధ్య మధ్యలో సున్నితమైన హాస్యం చక్కిలిగింతలు పెడుతూ ఉంటే ఎంజాయ్ చేసాను. చివర్లో రాసిన లైన్లు మాత్రం నన్ను ఎక్కడికో తీసుకెళ్లాయి:( ఎక్కడికో అంటే, మా అమ్మ దగ్గరికే.. ఒక్క సారిగా పాత ఙ్ఞాపకాలు చుట్టుముట్టాయి. చిన్నప్పుడు (ఇప్పుడేం తక్కువ కాదు) ప్రతి దానికీ విసుక్కోడం అమ్మని, నీకేదీ తెలీదని అరవడం. చ. ఏంటో, ఏదీ మన దాకా వచ్చేవరకూ తెలియదు కదూ..

తృష్ణ said...

అయ్యో పొద్దున్న కామెంట్ రాసాను ఏమైంది...:(((

కృష్ణప్రియ said...

@లక్ష్మీ ఫణి బాబాయి గారు,
ధన్యోస్మి! థాంక్స్...

@ అపర్ణ,
చాలా సంతోషం... మా అమ్మకీ చెప్పాను ఇప్పుడే ఫోన్ చేసి.. నా కొత్త బ్లాగ్ పోస్ట్ చూడమని.

@ తృష్ణ గారు,
అవునా? నాకైతే అందలేదు.. కానీ ఏం రాసి ఉంటారో ఊహించగలననుకుంటా.. మీరు మళ్లీ రాస్తే కన్ఫర్మ్ అవుతుంది .... :)

బులుసు సుబ్రహ్మణ్యం said...

Yes, It is never too late.

Brilliant, nothing less.

హరే కృష్ణ said...

ఫాదర్ ఆఫ్ సైన్స్ హ హ్హ :))
ఇద్దరమ్మాయిలు సూపర్ అసలు
చివరి లైన్ కి వచ్చాక ఆలోచించేలా చేసింది.. థాంక్స్ :)
ఇంటికి చాలా మంది కాల్ చేస్తారు ఈ పోస్ట్ చదివాక :)

మాలా కుమార్ said...

పిల్లల స్కూల్స్ మొదలైనాయా ? ఏమిటో ఈ సంవత్సరం మేము స్కూల్ సందడి మిస్సింగ్స్ :)
చాలా బాగా రాసారు .

Siri said...

ఎప్పటిలాగే చాలా బాగా రాసారు. మా పాప ఈ యేడు మొదటిసారిగా స్కూల్ కి వెళ్ళింది.

కృష్ణప్రియ said...

బులుసుగారు,

థాంక్స్! థాంక్స్!

@ హరేకృష్ణ,

:) అవునా?

@ మాలాకుమార్ గారు,

థాంక్స్! అవునండీ! ప్రాణానికి తెరిపి గా ఉంది. :) మీ వాళ్ళెవ్వరూ ఈ సంవత్సరం స్కూల్ కి వెళ్ళట్లేదా?

@ స్నేహ,
థాంక్స్.. అయితే.. ఫోటోలూ, వీడియోలూ, భావోద్వేగ పూరితం గా జరిగి ఉండవచ్చు.. ఒక్క పోస్ట్ రాయాల్సింది మీరు..

Siri said...

కృష్ణప్రియ గారు,

వీడియోలు గట్రా హడావుడి ఏమి లేదండి. ఎలా ఉంటుందో అని నేను బెంగ పడుతుంటే ఇంటికి రాగానే అమ్మా ఈరోజు ఎందుకు హోంవర్క్ ఇవ్వలేదు అని అడుగుతోంది. గత రెండేళ్ళుగా వాళ్ళ అన్నని చూస్తోంది మరి. అన్నట్టు నాకు బ్లాగ్ లేదండి. ఒకానొక కాలంలో ఉండేది విసుగొచ్చి డిలీట్ చేసేసా.

kiranmayi said...

పొద్దున్నే అమ్మని గుర్తు చేసారు. ఇప్పుడు ఫోన్ చేసానంటే వర్క్ కి లేట్ అయ్యిపోతుంది. డే కేర్ కి కూడా లేట్ అయ్యిపోతుంది.
నీ మొహం కామెంట్ పెట్టె టైం లో అమ్మకి ఫోన్ చెయ్యొచ్చుగా?

lalithag said...

ఈ టపా నీ పాత టపాలను గుర్తు చేసింది.
ఫ్లో బావుంది, విషయం సరదాగా సాగిపోయింది.
మన పెద్ద వారిని క్షమాపణ అడిగే అవగాహన మనకి వచ్చేసరికి వారు క్షమాపణలు అవసరం లేని ఎత్తుకి ఎదిగిపోతారు.
నా మటుకు నాకు ఇలాంటి కొన్ని టపాలు చదువుతుంటే అర్థమయ్యిందేమిటంటే మా పిల్లల అల్లరిని లైట్ తీసుకోవాలని :)

ఇందు said...

నాకు చిన్నప్పటి సంగతులన్నీ గుర్తొచ్చాయి! ఎందుకో మనం అలా విసుక్కుంటాం తల్లితండ్రుల మీద!వాళ్ళు మన మంచే కోరుకుంటారు...మనకి మంచే చెప్తారు! అయినా చిరాకు....విసుగు! అరుపులు... కేకలు.... అలకలు.... :(((( నేనేమీ తక్కువ తినలేదు. సాధ్యమైననతవరకు మా అమ్మని పీల్చిపిప్పి చేసా! పాపం అమ్మ :(((( మీ టపా చూసి....ఇలా ఏవో ఆలోచనల్లోకి వెళ్ళిపోయి.... కనీసం కామెంటకుండానె వెనుదిరిగా! మళ్ళి ఇవాళ కామెంటుతున్నా!

హ్మ్! ఏటో కదా లైఫ్!!

జ్యోతి said...

ఈ జంఝాటాలన్నీ అనుభవించి , ఈది, మునిగి, తేలి ఒడ్డున పడ్డాను. మే, జూన్ అనగానే భయమేట్లేదు..:) .. కొన్నేళ్లకు మళ్లీ మొదలవ్వొచ్చేమో కాని అందులో వేలు కూడా పెట్టకూడదని ఎప్పుడో డిసైడ్ అయ్యాను..

కృష్ణప్రియ said...

@ స్నేహ,

అవును చూశాను. మీ బ్లాగ్ లేదని :) అందుకే అన్నాను..రాయచ్చుకదా అని. మీరు డిలీట్ చేసారని తెలియదు...

అప్పుడే మీ పాప కి హోం వర్క్ కావాలా :) So cute...

@ కిరణ్మయి గారు,

:) ముందుంది గా వారాంతం.... తీరిగ్గా చేయండి... మా అమ్మ కి నిన్న ఫోన్ చేసి బ్లాగ్ చదవమని చెప్పాను. ఇవ్వాళ్ల తను చేసి 'చదివాను ' అంది. అంతే... అంతకన్నా పెద్దగా మాట్లాడలేదు.

పద్మవల్లి said...

కృష్ణ ప్రియ గారూ,

మీరు అమ్మ గురించి రాసిన దాంట్లో, మొత్తం (వస్తువులు చిందర వందరగా విసిరేయటం తప్ప) మీతో నిజాయితీగా ఏకీభవించడం తప్ప, ఇంకేం చేసినా మా అమ్మకి అన్యాయం చేసినట్టే. ఇద్దరు పిల్లల తల్లిగా" నీ పిల్లలు వచ్చాక గాని నీకు తెలీదు" అన్న మురిపెంతో కూడిన నిష్టూరాన్ని గుర్తు చేసుకోకుండా, మనసులోనే సారీ చెప్పుకోకుండా నాకు ఒక్కరోజు కూడా గడవదు.

మీ బ్లాగ్ మొదటినించి చదువుతూనే ఉన్నా ఎప్పుడూ కామెంట్ పెట్టలేదు. మీ రాతలన్ని చాలా బాగుంటాయి అంటే అది చాలా చిన్నపదం.

కృష్ణప్రియ said...

@ లలితా,

థాంక్సు... క్షమాపణలు పెద్ద పదమేలే.. ఎంత విసుక్కున్నా..పొగిడినా.. పెద్దగా ఫరక్ ఉండదేమో.. మదర్స్ ఆర్ మదర్స్!

@ ఇందు,

:) మా అమ్మని అలా ఏడిపించాననే నాకు నాలాంటివారిని ఇద్దర్నిచ్చాడు ఆ భగవంతుడు! సో.... మీకు కూడా.. చేసుకున్నడానికి డబుల్ ట్రబుల్ అవైటింగ్.... (నా ఆశీర్వాదం...)

@ జ్యోతి గారు,

చూశాను. మీ అమ్మాయి పెద్దదైపోయి ఆర్తికల్సూ అవీ రాస్తుండటం. మొత్తానికి మీరు ఒడ్డున పడ్డారన్నమాట..

జ్యోతి said...

కృష్ణప్రియ, ఒడ్డున పడి చాలా కాలమైంది.. అందుకే రాతలో పడ్డాను. ఈ మధ్యే అమ్మాయి పెళ్లి కూడా ఐపోయింది. ఇక తనకు మొదలవుతుంది ఈ తంటా.. మీ ఊరే వచ్చింది.. J. P . Nagar..

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగుంది కృష్ణప్రియ గారు.. ముగింపు మరింత అందాన్నిచ్చింది..

కృష్ణప్రియ said...

@ పద్మవల్లి గారు,

ధన్యవాదాలు!! మీ వ్యాఖ్య నాకు చాలా సంతోషాన్నిచ్చింది.

@ జ్యోతి గారు,

అయితే మీరు అప్పుడప్పుడూ ఇంకా బెంగుళూర్ కి వస్తూ ఉంటారన్నమాట.. ఈసారి మీరు వచ్చి, మా ఇంటికి రావటం కుదిరితే ఒక్క మెయిల్ కొట్టండి.. నా ప్రొఫైల్ లో ఈ మెయిల్ అడ్రస్ ఉంది.

@ వేణూ శ్రీకాంత్ గారు,

ధన్యవాదాలు....

వాత్సల్య said...

" అధ్భుతం"...ఇంతకు మించి ఏమీ చెప్పలేనండీ.

కృష్ణప్రియ said...

@ రిషి,

:) ధన్యవాదాలు! చాలా రోజులకి ఇటుకేసి వచ్చినట్టుంది.

తృష్ణ said...

ఏం రాసానని మీరేం ఊహించుకున్నారో అని తెలుసుకోవాలనుంది..:)

ఏం రాసానంటే,
నేను కూడా రెండేళ్ళ క్రితం బ్లాగు మొదలెట్టిన మొదట్లో మాపాప స్కూల్ మొదలవగానే "నేనిప్పుడు UKG?! "(http://trishnaventa.blogspot.com/2009/06/ukg-text-books_11.html) అని టపా రాసానండి.
ఇక అమ్మకి సోరీ చెప్పటం గురించి..చాలాసార్లు నా బ్లాగ్లో రాసేసాను....))

కృష్ణప్రియ said...

@ తృష్ణ గారు,

:) ఇప్పుడే మీ టపా చూసి వస్తున్నా.. ఇంచు మించు గా నేనూ అదే అనుకున్నా.. 'Same Story No difference, Only names changed' అన్నారేమో అని...

మాలా కుమార్ said...

మా మనవడు , మనవరాలు అమెరికా వెళ్ళిపోయాక స్కూల్ హడావిడి చాలా మిస్ అవుతున్నానండి , ఇప్పుడా అప్పుడా 35 ఏళ్ళ నుంచీ వున్న హడావిడి . అందుకే కాస్త బోర్ కొడుతోంది , ముచ్చటగా మీకు యూనీఫాం వేసి స్కూల్ పంపుతానండి అంటే మావారు వినటము లేదండి :(

kiran said...

చాల బాగుంది కృష్ణ ప్రియ గారు..:)
మీ అమ్మగారి రెస్పాన్స్ ఏంటి..?? :)

కృష్ణప్రియ said...

@ మాల గారు,
:))) ఈ ఐడియా బానే ఉంది. భవిష్యత్తు లో వాడుకుంటాను.

@ కిరణ్ గారు,
:) థాంక్స్! మా అమ్మ రెస్పాన్స్ 'ఊఉ ఊఉ ' అంతే!

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;