Wednesday, June 15, 2011

ఈ రోజు..

అన్ని రోజులూ ఒక్కలా ఉండవు. అలా అని అద్భుతాలు జరుగుతాయని కాదు. చిన్న చిన్న చమక్కులు, చెణుకులు, ఛలోక్తులు, చిట పటలు..కొద్దిగా ఉరుకులూ,పరుగులూ ఆపి చూస్తే....ఎన్నో కనిపిస్తాయి కదూ?


ఉదాహరణ ఈరోజే...


రేడియో నన్ను లేపిన విధానంబెట్టిదనిన..ఆరు గంటలకి రేడియో అలారం మొదట సుప్రభాతం తో లేపటానికి ప్రయత్నించి కుదరలేదని, పది నిమిషాలాగి ఏసు ప్రభువు పాటలతో ప్రయత్నించి ఇక చేతులెత్తి కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పాట తో ట్రై చేస్తోంది. దిగ్గున లేచి పిల్లల్ని లేపి రోజూ వారీ పనుల్లో దూకి.. పిల్లల్ని స్కూళ్లకి పంపి కూలబడ్డాను.

ఉదయం చాయ్?


టీ, పేపర్, తీసుకుని గార్డెన్ లో కాసిన మూడు సీతా ఫలాలని 456 వ సారి లెక్కపెట్టుకుంటూ... తీరిగ్గా..

బ్రేక్ ఫాస్ట్, వంట ....

ఇడ్లీల్లోకి కారప్పోడీ, నెయ్యీ, పచ్చడీ, నంచుకుని తీరుబడిగా తిని.. పెద్దగా తొందర పడకుండా.. నింపాది గా గోంగూర పప్పు, గుమ్మడి, చిలగడ దుంపలు, వంకాయ,ములక్కాడల తో పులుసు గ్యాస్ పొయ్యి మీద మరిగించి .. అర మట్టు గిన్నెడు నూనె తో ఇంగువ పోపు, గుండు (ఎండు ) మెరప, ఆవాలు, కర్వేపాకు తో పెట్టి.. ఎంచక్కా రెండు డబ్బాల్లో 'కళాత్మకం ' గా సద్దుకుని

తయారవుతున్నా..

గుంటగలగరాకు తో మరిగించిన కేరళ కొబ్బరి నూనె రాసి నున్నగా దువ్వుకుని, జడేసుకుని, మామిడి పండు రంగు సల్వార్ కమీజ్ వేసుకుని, మువ్వల పట్టీలు కాళ్లకి పెట్టి కారెక్కా! సాధారణం గా అలా పట్టీలు పెట్టిన రోజున మువ్వల్ని గట్టిగా చెప్పు బెల్ట్ కింద నొక్కి పెట్టేస్తా, శబ్దం వినపడకుండా.. మరి అమావాస్యకీ, పున్నమి కీ కాస్త వేరేగా అన్నమాట.

ఆఫీసులో

కార్ ఎక్కి ఆఫీసులో పడ్డాను. పనులు, పనులు పనులు. మధ్యలో ఘల్లు ఘల్లు మంటూ బ్రేక్ రూమ్ కెళ్లి టీ తెచ్చుకున్నా.. కాస్త లేట్ అవుతుంది నాకు అంటే మా వారు 'సరే నేను వెయిట్ చేస్తాను..' అన్నారు. పర్వాలేదు బస్సు లో వస్తా.. మీరెళ్ళండి... అనేసాను.

ఫ్రెండ్ తో గొడవ..

చాన్నాళ్లకి ఒక మంచి ఫ్రెండ్ తో కచ్చగా చిన్న పిల్లల్లా కొట్లాడి మళ్లీ మాట్లాడేసా.. ఫ్రెండ్.. నువ్వు ఈ పోస్ట్ చదువుతావని తెలుసు. Thanks for fighting with me :)

ఇంటికి ప్రయాణం..


MNC ల్లో కృత్రిమ డబ్బా ఆఫీసుల్లోంచి బయట ఏమవుతుందో తెలియట్లేదు.. బయటకి వస్తుంటే అర్థమైంది. కూపస్థ మండూకాల్లా ఎలా (కోడ్) టిక్కూ టిక్కూ అంటూ కొట్టుకున్తున్నామో.. ఆకాశమంతా మేఘావృతం అయి ఉంది. మబ్బు మబ్బుగా.. అర్రేర్రే... ఇలా వాతావరణం ఉందని ఎమాత్రం హింట్ ఉన్నా.. బద్ధకం గా కూర్చునేవాళ్ళం ఎంత పని జరిగింది? అని నొచ్చుకుని.. ఇక కాళ్లు కాంటీన్ వైపుకి లాక్కెళ్ళుతుంటే..  మొహమాటం గా నేనూ వెళ్లాను.. హాయిగా కిటికీ సీట్ దగ్గర అరటి కాయ బజ్జీ ఆర్డర్ చేసి.. కూర్చున్నా..

నా మొహం లానే ఉంది... కొబ్బరి పచ్చడి. కన్నడ వాళ్ళకి ఓకే.. మనకి అంత చప్ప చట్నీ ఆనుతుందా? పోన్లే.. 'దంచినమ్మకి బొక్కినంత' అనుకుని తృప్తి గా తిని చినుకులు పడుతుంటే.. మొహం లో కాస్త ఆదుర్దా చూపిస్తూ (మరీ బాగుండదు కదా) నెమ్మదిగా నడుస్తూ బస్సెక్కా..

హెంత పని జరిగింది హే భగవాన్!!!


బస్ స్టాప్ లో పెద్దగా వేచి ఉండక్కర్లేకుండానే బస్సోచ్చేసింది. బోల్డు ఆఫీస్ అమ్మాయిలు బిల బిల లాడుతూ ఎక్కేసారు. స్టాండింగ్.. బాగుంది బాగుంది.. అని ఒక రాడ్ కి ఆనుకుని చూస్తున్నా.. 'అరే.. ఆంటీ జీ బైటియే...' అని వినపడింది.. పక్క నుంచి.. 'అబ్బో.. ఈ కాలం పిల్లలు ముసలి వారిని గౌరవించి సీట్లు ఇస్తున్నారు..' అని మన యువత బాధ్యతా రాహిత్యాన్ని దుమ్మెత్తి పోసే అందరికీ ఈ విషయం చెప్పాలని మెంటల్ నోట్ ఇలా చేసుకుని.. ఆ అబ్బాయి వైపుకి తిరిగానా? షాక్!!!
అంత 'గౌరవం ' ఇచ్చేది నాకా? 'ఆంటీ, ఆంటీ, ఆంటీ...' తెలుగు సినిమాల్లో లాగా రెండు చెవులూ డ్రమాటిక్ గా మూసుకుని బాధ పడదామంటే.. ఒక చేతిలో లంచ్ బ్యాగ్,.. ఇంకో చేత్తో రాడ్ గట్టి గా పట్టుకున్నా.. అప్రయత్నం గా కూర్చున్నా.. కానీ చచ్చేంత నవ్వొచ్చింది. నవ్వుతూనే ఉన్నా.. చెల్లికి, ఫ్రెండ్ కి ఫోన్ చేసి విషయం చెప్పా..

జాగ్రత్త గా నా స్కిల్స్ అన్నీ ఉపయోగించి అతి లాఘవంగా అతనికి అనుమానం రాకుండా, నా జీవితం లో మొట్ట మొదట సారి వృద్ధుల సీట్ ఆఫర్ చేసిన మహానుభావుడి ఫోటోలు తీసుకున్నా సెల్ కామెరాతో.. చూడండి మీరూ..

నా కుటుంబం..

బస్సు దిగి నడుస్తున్నానా.. ఎదురుగా సర్ప్రైజ్.. మా కార్ లా ఉందే..? పిల్లలు 'అమ్మా అమ్మా..' అంటూ.. అయ్యో వచ్చేసే దాన్ని గా.. 'ఎందుకు వచ్చారు?' అని అన్నాను.. లోపల ఆనందం గానే ఉన్నా.. 'వర్షం కదా..ఎలా వస్తావు.. ' అని మావారు...
ఓకే... బస్సులో సీట్ ఇచ్చిన అబ్బాయి ఫోటో అందరికీ చూపించా.. 'నిజంగా అంత ముసలిదాన్లా ఉన్నానా?' అని అడిగా.. 'లేదు.. లేదు. అసలు ఊరకే మొదట కనపడ్డావు కదా అని సీట్ ఇచ్చుంటాడు..' అన్నారు కాస్త భయం భయం గా.. 'ఆహా? మొదట కనపడిన వాళ్లని ఆంటీ జీ అని పిలిచి వృద్ధుల సీట్ ఇస్తాడా?' అని అడిగా పౌరుషం గా.. 'వాడే గొడవ లో ఉన్నాడో... వాడి గురించి వదిలేయ్...' మిర్చీ బజ్జీ తెచ్చాను తిందాం... ' అని టాపిక్ చేంజ్....

వేసవి కాలం లో అయిస్ క్రీం ఏ ఎదవ అయినా తింటాడు..

అని ఏదో సినిమా లో తరుణ్ అంటే విన్నా.. బయట వర్షం.. మా చిన్నది, తన ఫ్రెండ్ నేసుకొచ్చింది.. నన్ను 'రెడ్ హాన్దేడ్ గా పట్టుకుంది.. పెద్ద కప్పు నిండా బూస్ట్ తింటుంటే.. 'ఏం చేస్తాం? ముగ్గురం పంచుకోవాల్సి వచ్చింది.. డబ్బా ఖాళీ చేసేసాం. పనిలో పని గా పిక్చర్ తీసా చూడండి..


పిల్లలు ...


తీక్షణం గా.. కిటికీ లోంచి చూస్తోంది.. పెద్దమ్మాయి. 'ఏంటమ్మా? చూస్తున్నావు? ' బయట బిల్డింగ్ కడుతున్నారు.. కార్మికులకి కాంట్రాక్టర్ అందరికీ బూట్లు పంచుతున్నాడు. 'చూడమ్మా.. వాళ్లు ఆ బ్లూ బ్యాగ్స్ లోంచి షూజ్ తీసి ఎంత హాపీ గా ఉన్నారో చూడు .. కొంత మంది వేసేసుకుంటున్నారు. కొంతమంది దాచుకుంటున్నారు.. Don' t you feel like just watching them forever?' అంది. నాకు గుండె నిండిపోయింది.

స్కూల్ విషయాలు చెప్తూ మా చిన్నది చెప్పింది... 'ఇవ్వాళ్ళ స్కూల్లో హిందీ పద్యం చెప్పలేదని...' అని ఆగింది. నేను ఆత్రం గా.. 'ఆ ఆ ..చెప్పు ఏమైంది ? టీచర్ కొట్టిందా?' అని అడిగాను. 'లేదు. లేదు.. She just said.. 'Can you please come and stand on this bench? ' .. అబ్బా? చా!! అంత మర్యాద గా బెంచీ ఎక్కిన్చిన్దా? అని నవ్వుకుని పైకి గంభీరం గా.. తల పంకించాను.
మళ్లీ ఉంటుంది. నాకు 6 years అప్పుడు మా స్కూల్ పక్కన ఒక wishing tree దగ్గర I asked for a wish and it never came true..' అంది. 'హ్మ్.. ' అని 'ఏంటి ఆ విష్?' అని అడిగితే.. 'ఒక మాజికల్ గాల్ అవ్వాలనుకున్నా.. ఒక్క మాజిక్ కూడా రాలేదు ' అంది నిట్టూరిస్తూ.. మాజిక్ స్కూల్లో చేర్పిస్తాను.. అని మాటిచ్చా.. చూడాలి బెంగుళూరు లో ఎక్కడైనా నేర్పిస్తారేమో..

అసుర సంధ్య వేళ..

రాత్రి మీటింగ్ తప్పించుకోవాలి ఎలా? అని అనుకుంటుంటే.. మా సింగం మెయిల్.. కాస్త తలనొప్పి గా ఉంది అని..
'పాపం సింగం లేకుండా మీటింగ్ ఏంటి ? రేపు పెట్టుకుందాం..' అని ఏడుకే, ఒక అరగంట పడుకుని లేచి .... ఫ్రెష్ గా.. రాస్తున్నా.. పోస్టు.41 comments:

Weekend Politician said...

Nice. Refreshingly diffferent post.. :)

snigdha said...

బాగుందండీ మీ ఒక రోజు చమ్మక్కులు,అనుభూతులు..మీరు కూడా బూస్ట్ తినే పార్టి నా.. :)..అది మాత్రం చాలా క్యూట్ గా ఉందండీ....మొత్తం మీద ఈ రోజు...అదిరింది..

mayukha said...

Good one. I follow your blog regularly but this is my first comment here :)
Keep posting.

SHANKAR.S said...

బావుందండీ బామ్మ గారూ మీ పోస్ట్ (అంటే రేపో ఎల్లుండో ఇంకెవరో అనేయకుండా ముందు నేనే అనేశానోచ్) :))).
అవునూ ఫోటోలో ఎంచక్కా ఏడు సీతాఫలాలు కనబడుతుంటే మీరు మూడే అంటారు? మీకు చత్వారం వచ్చేసింది బామ్మగారూ...మళ్ళీ :)))))

కొత్తావకాయ said...

:) attendance sake :) 1st comment

ఇందు said...

మీరేంచేసినా సూపరండీ కృష్ణగారూ!! హ్హహ్హహ్హా ఆ అబ్బాయి ఫొటో భలే తీసరే! :))) పాపం జీవుడు..జోకర్ అయిపోయాడు :))

మీ శీతాఫలం చెట్టు బాగుంది :) మీ గార్డెన్లో మొక్కలు,చెట్లు,పూలు ఫొటోలు పెట్టి ఇంకో టపా వేయండీ!!

ఫైనల్గా పోస్ట్ ఎంతో సహజంగా,హాయిగా ఉంది :)

కొత్తావకాయ said...

ధూర్తుడు, ఆంటీ అనేసాడా? పోన్లెండి. సీట్ ఇచ్చినందుకు కాస్త క్షమించేద్దాం. ఫోటో తీసి కచ్చ తీర్చేస్కున్నారు గా! శభాష్ సిస్టర్!

సిస్టర్ అని ఎందుకన్నానంటే.. ఆ మధ్య ఇండియా వచ్చానా! నా దోస్తు ఒకడు "గాల్ ఫ్రెండుని పరిచయం చేస్తాను. ఆ పిల్లని చూసి మార్కులేసి చెప్పు. పెళ్ళాం పోస్టుకి పనికొస్తుందో, లేదో." అని ఓ గురుతరమైన భాద్యత నా భుజాలమీద వేసి కాఫీ షాప్ కి తీసుకెళ్ళాడు. పొన్లే పాపం నా కాలేజీ రోజుల్లో సినిమాలకి, షికార్లకి తిప్పిన వాడు, బండి మీద ఎక్కించుకు తిరిగిన వాడూ అని దయతో వెళ్ళాను. పరిచయాలయ్యాక "మీరేం తీస్కుంటారు ఆంటీ!" అని అడిగింది ఆ పిల్ల. విననట్టు నటించేసా. నా కాఫీలో రెండో చెంచా పంచదార వేస్కొనేసరికి నేనేదో సరదాగా సయనైడ్ తినేస్తూంటే చూడలేకపోతున్నట్టు మొహం పెట్టి, "మీరు జీరో కాలరీ షుగర్ వేస్కుంటే కేలరీస్ ప్రాబ్లం ఉండదుగా ఆంటీ" అంది మళ్ళీ.

ఇంక భరించలేక అడిగా " నీకంటే పదేళ్ళు పెద్దవాడితో నీకు డేటింగ్ ఏంటి అమ్మాయ్" అని. "రాజా నాకన్న ఫోర్ ఇయర్సే కదా పెద్ద" అంది. "అవునా, మరి రాజా నీకు అంకుల్ అవనప్పుడు, రాజా క్లాస్మేట్ ఆంటీ ఎలా అవుతుంది బేబీ" అని.

కృష్ణప్రియ said...

@ WP,
థాంక్స్!
@ స్నిగ్ధ,
అబ్బే.. బూస్ట్ అనే కాదు. హార్లిక్స్, బోర్న్ వీటా తో కూడా adjust అయిపోతా.. :) కానీ బూస్ట్ కే ఫస్ట్ రాంక్.

@ మయూఖ,
ధన్యవాదాలు! మొత్తానికి కామెంట్ పెట్టిన్చాదన్నమాట బస్సులో మహానుభావుడు..

కృష్ణప్రియ said...

@ SHANKAR.S గారు,
అబ్బా.. దెబ్బ కొట్టారండీ.. :))ఇంక ఫోటో షూట్ కి ఎప్పుడొస్తారో చెప్తే.. నేను రెడీ గా ఉంటా..

@ కొత్తావకాయ,
:) అదేమరి! ఆంటీ అనేస్తే అనేసాడు. సీట్ ఇచ్చి ఆఫీస్ అమ్మాయిలందరికీ కూడా అందరికీ ఈవిడ ఆంటీ అని స్టికర్ పెట్టి వెళ్లాడు కదా.. అయినా ఓకే. కుదుపుల రోడ్డు కనీసం సీట్ దొరికింది.. అని తృప్తి పడతాను.

'సరదాగా సాయనైద్ తినేస్తుంటే ...' LOL. మీ నారేషన్ బాగుంది. మీరిచ్చిన రిటార్ట్ కూడా బాగుంది. మా తమ్ముడి ఫ్రెండ్స్ నన్ను అంటే అని యూనివర్సిటీ లో ఉన్నప్పుడే పిల్చేసారు... కానీ మరీ సీట్ ఆఫర్ చేయటం ఇదే ప్రథమం..

కృష్ణప్రియ said...

@ ఇందు,

థాంక్స్!
:) నాకు సీట్ ఆఫర్ చేస్తాడా.. అడ్డంగా తీసేసా అతని పిక్చర్..

మా గార్డెన్ లో మొక్కలతో వేస్తా టపా.. పెండింగ్ అది చాలా కాలం నుండీ.. సీతాఫలాలు రెండేళ్ల నుండీ కాస్తున్నాయి. రోజూ లెక్క పెట్టుకుంటున్నా.. ౨ నెలల నుండీ... చూద్దాం.. ఎన్ని పండ్లయి చేతికి వస్తాయో...

ఇందు said...

శంకర్గారూ..ఎనిమిది ఉన్నాయి శీతాఫలాలు ;) ఒకటి కొమ్మల్లో,ఆకుల్లో దాక్కుని ఉంది :)))

సో కృష్ణగారూ...ఇప్పుడు మీ చాన్స్...అస్సలు తగ్గొద్దు :))

లత said...

క్రిష్ణ గారూరోజు మొత్తాన్నీ సూపర్ గా రాశారు.ఎవరు ఎవరికైనా యూనివర్సల్ ఆంటీలే, ఈ ఆంటీ అంకుల్ పిలుపులు వచ్చాక సో ఫీల్ అవకండి

sbmurali2007 said...

ఎంత ఇంట్రస్టింగ్ గా వుందండీ మీ రోజు! ఐ రియల్లీ ఎన్వీ యూ!
శారద

sbmurali2007 said...

ఎంత ఇంట్రస్టింగ్ గా వుందండీ మీ రోజు! ఐ రియల్లీ ఎన్వీ యూ!
శారద

prabandhchowdary.pudota said...

Baagundhandi.

Tejaswi said...

'కొత్తావకాయ'గారి రిటార్ట్ అదిరిపోయింది...Diplomaticగా. కృష్ణప్రియగారూ మీ itinerary బాగుంది.

Snkr said...

అరే! ఆరోజు నేను సీట్ ఆఫర్ చేసింది మీకేనా!?! నమ్మలేకుండా వున్నాను! ప్చ్.. గుర్తుపట్టలేదు, ఏమనుకోకండే... మీరింతలా ఫీలౌతారని తెలిస్తే చచ్చిన్ సీటిచ్చి వుండేవాడిని కాదు. :)) :P

కృష్ణప్రియ said...

@ ఇందు,

ఆహా ఎంత సపోర్ట్ ఇచ్చారు.. ఇంక తగ్గేది లేదు. శంకర్ గారు, మరి చెప్పాలి ఎనిమిదో సీతాఫలం కనిపించట్లేదు మీకు... ఎందుకబ్బా?

@ లతగారు,

:) నిజమే.. మా పాల అబ్బాయి దగ్గర్నించీ, పిల్లల స్కూల్ డ్రైవర్ దాకా 'ఆంటీ' అని పిలవటమే.. మరీ వృద్ధుల సీట్ ఆఫర్ నాకు ఆఫర్ చేయటం ఇదే మొదలు...
అదీ అలవాటైపోతుంది లెండి

ఆ.సౌమ్య said...

బావున్నాయి మీ "రోజు" ముచ్చట్లు. :)
అంతేనండీ అంతే ఈ లోకం ఇంతే పాడు లోకం అందరినీ ఆంటీలనేస్తుంది.ఏం చేస్తాం చెప్పండి...సర్దుకుపోదాం. :D

మట్టుగిన్నె అన్న పదం విని ఎంతకాలమయిందో....ఈరోజు మీరాపదం వాడేసరికి మా ఊర్లో, మా ఇంట్లో నా చిన్నప్పటి కాలానికి వెళ్ళి పడ్డాను. thanks!

అది సరేగానీ ఫొటోలన్నీ అలా అడ్డగా పెడితే ఎలాగండీ, మెడనొప్పెట్టిందనుకోండి....కాస్త మా సౌకర్యం కూడా చూసుకోవాలి మీరు ;)

కొత్త పాళీ said...

బ్లాగుకి డైరీ అని పేరుపెట్టుకున్నందుకు ఇవ్వాళ్ళ సార్ధకం చేశారు.
అయ్యయ్యో పాపం బస్సులో వేళ్ళారా?
ఇంతట్లో ఆ డిప్పకాయవెధవ ఆంటీ అనేశాడా? ఎంత ఘోరం జరిగిపోయింది!! కొత్తావకాయగారితో ఏకీభవిస్తున్నా. వాడూ వొట్టి ధూర్తుడు కాదు, ఖలుడు!!
పెద్దకప్పులో బూస్టు వేసుకుని తిన్నారా? నా తల్లే! పిల్లదానికి పట్టుబడ్డారా? మా బాగా అయింది!:)

It was a delight to read.

snigdha said...

కృష్ణ గారు ,ఫస్ట్ కామెంట్ నాదే అనుకున్నాను...జస్ట్ మిస్సయ్యింది..
కొత్తావకాయ గారు ఇచ్చిన రిటార్ట్ అదిరిందండీ... ఈ సారి మీ ఇంట్లో బూస్ట్ పార్టి చేసుకుంటే పిలవడం మర్చిపోకండే...
:)
తోట గురిచి కూడా త్వరగా ఓ టపా వెయ్యండి...

కృష్ణప్రియ said...

@ శారద గారు,

:) చెప్పాగా.. "ఈరోజు" ఇంట్రస్టింగ్ గా ఉండాలని.. కాస్త తీరిగ్గా అరగిన్నెడు నూనె తో పోపు పెట్టి పులుసు మరిగించి, తలకి నూనె దట్టించి, కాళ్లకి పట్టీలు బిగించి, బస్సులేక్కి, బజార్ లో బజ్జీలు తిని, పిల్లల తిండి తిని, ఎటూ కాని వేళ నిద్రపోయి, .. అలా అన్నమాట! ఎనీ వె ధన్యవాదాలు!

@ prabandhchowdary.pudota గారు,
థాంక్స్! మొదటి సారి ఈ బ్లాగు వైపుకి వచ్చినట్టున్నారు. సుస్వాగతం!
@ తేజస్వి గారు,
:) థాంక్స్. కొత్తావకాయ ఘాటు తెలియక 'ఆంటీ' అంది ఆ అమ్మాయి..

కృష్ణప్రియ said...

@ Snkr గారు,

గ్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్.. మీరా!మీరా! మీరేనా!!! (చంద్రముఖి స్టైల్లో..) మీరు హిందీ బాగా మాట్లాడతారే.. నార్త్ లో పెరిగారా? కాస్త గూని కూడా ఉన్నట్టుంది? సాక్స్ ఎన్నాళ్లకోసారి ఉతుక్కుంటారు? ఏం లేదు.. ఏ సి బస్సు కదా.. వాసన ఉండిపోతేనూ...

@ ఆ. సౌమ్య,
:) అవునా? అంతే నంటారా? సరే.. మీరు చెప్తే ఓకే!! మట్టు గిన్నె లోనే మా అమ్మా వాళ్లింట్లో ఇప్పటికీ నూనె పెడతారు. నా దగ్గర లేదు. ఏదో టప్పర్ వేర్ గిన్నె నే నా తృప్తి కోసం మట్టు గిన్నె అనుకోవటం...

మరి కాక? అంత అవమానం చేసిన వాడిని 'అమ్మ తోడు!!! అడ్డం గా.... ' కనీసం ఫోటో తీద్దామని ... ఇదిగో.. ఇలా
మీ మెడ నొప్పి కి కారణ భూతురాలినయ్యాను.. క్షంతవ్యురాలిని!

కృష్ణప్రియ said...

కొత్త పాళీ గారు,

థాంక్స్! థాంక్స్!
ధూర్తుడు, ఖలుడు.. :) అంటారా? బాగు బాగు.

అవునండీ పట్టు బడ్డాను. ఈసారి కాస్త పకడ్బందీ గా ఏర్పాట్లు చేసుకోవాలి.. గొళ్ళాలు అవీ బిగించి...

@ స్నిగ్ధ,
తప్పక బూస్ట్ పార్టీ మా ఇంట్లో.. బెంగుళూరికి వస్తే ఒక్క మెయిల్ కొట్టండి.. టల్లోస్, ఒరిజినల్ చుంబరస్కాలతో పాటుగా బూస్టు కూడా తిని సెలబ్రేట్ చేసుకుందాం.
తోట గురించి రాస్తా త్వరలో.. నా తోట లో ప్రతి చిన్న మొక్కా నేనే తవ్వి వేసుకుని.. పెంచుతున్నాను. టపా పెద్దదవుతుంది మరి.. మీ ఓపికను బట్టి. ....

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఈ వేళ కొత్త లెఖ్ఖల సూత్రం కనిపెట్టాను. 456 మాట్లు లేఖ్ఖపెడితే ఎనిమిది మూడు అవుతుందని. ఇది సీతాఫలాలకేనా మిగతా వాటికి కూడానా అన్నది నిర్ధారించాలి.
hyd. లో తాతగారూ అంటారు కానీ బస్ లో సీటు ఇవ్వరు. సీటు ఇచ్చి ఆంటీ అన్నందుకు అడ్డం గా పడవేశారా పాపం పసివాడిని. :))

హరే కృష్ణ said...

:-)))
Don' t you feel like just watching them forever?
Touching! చాలా బావుంది

SHANKAR.S said...

ఏంటండి ఇందు గారూ మీరు మరీనూ...ఆ ఏడు లెక్క పెట్టినందుకు నాకు ఫీజ్ అవసరం లేదా. అందుకే దాన్ని నా ఖాతాలో వేసుకుని ఆ ఒక్కటీ బామ్మగారికి చెప్పకుండా దాచానన్నమాట. ఇలా సీక్రెట్లు లీక్ చేసేయకూడదు మీరు. :)))))))

(బాగా కవర్ చేశా కదా - ఇక్కడ చిత్రం భళారే విచిత్రం లో బ్రహ్మానందం ఎక్స్ప్రెషన్ అన్నమాట)

వేణూ శ్రీకాంత్ said...

హ హ హ చాలా బాగుందండీ.. టపా ఆలోచన సూపర్ :) జరిగిన సంఘటనలు డూపర్ :-) హ్మ్ ఆంటీ/అంకుల్ పిలుపుఎప్పటికైనా తప్పదులెండి.. సీట్ ఇచ్చాడు కాబట్టి క్షమించేద్దాం :)
సీతాఫలాలు, మీ మెనూ, మువ్వలపట్టీలు, మామిడిపండు రంగు సల్వార్, ఓనేస్తం తో గొడవ, వర్షంలో నడక, బూస్ట్, మీ పాప స్పందన “Don' t you feel like just watching them forever?”.. అబ్బ దేనికవే అద్భుతం అనిపించాయి నాకైతే :-)
నేను ఆఫీస్ నుండి వచ్చేప్పుడు ఎన్ని సార్లు గొడుగు బ్యాగ్ లో దాచేసుకుని “అర్రే ఈ రోజు గొడుగు మర్చిపోయానే ఎలా?” అని నేస్తాలకో సాకు చూపించి నింపాదిగా చిరుజల్లులలో తడిచానో లెక్కేలేదు :-)

Snkr said...

హ్వా హ్వా హ్వా!
పాపం గూని వాడికి సీట్ ఇవ్వాల్సింది పోయి, సీట్ లాగేసుకున్నారా?! ప్చ్.. ఏదోలేండి, మీరు accept చేశారంటేనే పెద్దరికం ఒప్పేసుకున్నట్టు, అంతే!
నేనిలా ఓ సారి ఓ చైనీస్ పెద్దావిడకు ట్రైన్లో సీటిస్తే తిరస్కారంగా అక్కరలేదన్నట్టు హావభావాలు ప్రదర్శించింది. ఏది ఏమైనా సీట్ ఇంకోరికి ఇవ్వడమనేది ఓ ఆర్ట్, సైకాలజీ తెలిసుండాలని అప్పుడుగాని తెలిసిరాలేదు. :) సీటు అపాత్రదానం చేయను. :)

కృష్ణప్రియ said...

@ బులుసు సుబ్రహ్మణ్యం గారు,
:) బాగుంది.తాతకే లెక్కలు నేర్పించిన ఆంటీ నయ్యానన్నమాట. నాకు బస్సులో సీట్ ఇచ్చిన వాడిని అవును.. అడ్డం గా (అప్ లోడ్) వేసేసా..

@ హరే కృష్ణ,
:) My Favourite part of the day! Happy to see you too feel the same :)

@ SHANKAR.S,
అబ్బా.. అలాగ కవర్ చేసారా? నిజానికి ఎనిమిదవది ఇందు గారికి ఎలా కనిపించిందో.. నాకు ఇంకా కనపడలేదు. :-(

మాలా కుమార్ said...

మీ ఈరోజు బాగుందండి :)

కృష్ణప్రియ said...

@ వేణూ శ్రీకాంత్,

ధన్యవాదాలు! మీ వ్యాఖ్య చూస్తే భలే ఆనందం వేసింది. మీరూ గొడుగు దాచేసుకునే టైపే అన్నమాట! బాగుంది.

@ Snkr,
:))) చూసారా? గూని వాడనగానే బయట పడిపోయారు. ఆ అబ్బాయి కే గూనీలేదు. మీరు చెప్పిన ఇన్సిడెంట్ చెప్తే గుర్తొచ్చింది. ఏదో ఆంగ్ల సినిమాలో బిల్డింగ్ లో బందీ లయితే negotiator ముందు గా పిల్లల్నీ, ఆడవారినీ వదిలేస్తానని ఆ టెర్రరిస్ట్ చేత అనిపిస్తాడు. ఒకావిడ.. 'చాట్!! నేనేమీ మగవారి కన్నా తీసి పోలేదని ఇగో చూపించి తీవ్రవాది చేతిలో మరణిస్తుంది..

నేను మాత్రం అలా కాదబ్బా.. సీట్ తీసుకుని తీరిగ్గా తిట్టుకుంటా.. :)

@ మాలా కుమార్ గారు,
థాంక్స్! :)

Kathi Mahesh Kumar said...

:) :) :) :)

ఇందు said...

కెవ్వ్వ్! కృష్ణగారూఉ...దెబ్బకొట్టేసారండీ!! అంత మాట అనేసారు :(( మీ ఫొటోని జూంచేయండీ! ఎనిమిదే కాదు..దానిపక్కన దాక్కున తొమ్మిదో కాయ కూడా నాకు కనిపిస్తోంది మరి :((

కృష్ణప్రియ said...

@ మహేశ్ కుమార్,
థాంక్స్!

@ ఇందు,

:)) నిజానికి నా చిన్న సీతాఫల మొక్క కి 20 పైనే కాయలున్నాయి. మంచి సీతాఫల విత్తనం కావాలని, నేను ఎక్కడా మొక్క కొనలేదు. మూడేళ్ల క్రితం సీజన్ లో సీతాఫలాలు తింటూ, తియ్యగా మంచిగా ఉన్న పండ్ల గింజలు ఫ్రంట్ యార్డ్ లో ఉమ్మేసాం. ఆ గిన్జల్లోంచి వచ్చిన మొక్కలు మూడు. అన్నింటికీ కలిపి దాదాపు 30 కాయలు వచ్చాయి ఈ సారి.

Sravya Vattikuti said...

బావుంది మీ ఆ రోజు :)
ఇంతకీ మనలో మనమాట నిజం చెప్పండి , అతనెవరో ఆంటీ అన్నాడని డిప్రెషన్ లోకి వెళ్లి బూస్ట్ తిన్నారు కదూ , నేను నమ్మను చల్లని వాతావరణం లో బజ్జీలు వదిలి బూస్ట్ తిన్నారంటే :P

కృష్ణప్రియ said...

@ శ్రావ్య,

:) థాంక్స్.. అబ్బా.. శ్రావ్య రాయనే లేదు కామెంట్..ఎంటబ్బా? ఊర్లో లేరేమో అనుకున్నా!
డిప్రెషన్ వచ్చి బూస్ట్ తిన్నానంటారా ? కావచ్చు..

కానీ బజ్జీలు వదిలేసి.. అంటే ఆల్రెడీ నాలుగు అరటి కాయ బజ్జీలు పేఏఎద్ద్దవి తినటం వల్ల.. ఇంకా తినలేకపోయానన్నమాట!

నేస్తం said...

అబ్బా డైరీని కూడా ఇంత అందంగా రాసుకోవచ్చా అనిపించింది ..భలే రాసారు

కృష్ణప్రియ said...

@ నేస్తం,

థాంక్స్! మీకన్నానా?

మంచు said...

అబ్బబ్బ .. బెంగళూరు లొ ఆంటీ అంకుల్ అని పిలవడం కామెన్లెండి.. బెంగళూర్లొ మా పనమ్మాయిని నన్నెప్పుడూ అంకుల్ అని పిలిచేది. నేను ఆవిడను ఆంటీ అనే పిలిచేవాడిని.... :-)))

మీ డైరీ అయితే చాలా బావుంది.

కృష్ణప్రియ said...

@ మంచు,
:) ఊర్కే సరదాకి. చెప్పాగా..మా తమ్ముడి ఫ్రెండ్స్ నన్ను 18 కే ఆంటీ చేసేసారు..

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;