Saturday, June 11, 2011

సినిమాలు : మనవీ - వాళ్లవీ

నాకు ఎప్పటికైనా కనీసం ఒక పుస్తక సమీక్ష, ఒక నాటకం/ఒక సినిమా/కార్యక్రమం సమీక్ష వ్రాయాలని ఉండేది.


మన తోటి బ్లాగర్ వీ.బీ. సౌమ్య ద్వారా తెనుగీకరింపబడిన 'సినిమాలు మనవీ-వాళ్లవీ' పరిచయం చేయగలుగుతున్నందుకు చాలా ఆనందం గా ఉంది. ఈ పుస్తకానికి ఆంగ్ల మూలం సత్యజిత్ రే రాసిన "Our films, their films" అన్న పుస్తకం.

ఈ పుస్తకం సత్యజిత్ రే అడపా దడపా వివిధ పత్రికలలో ప్రచురించిన వ్యాసాల మరియు ప్రసంగ పాఠాల సంపుటి. నాకు సత్యజిత్ రే సినిమాలనగానే.. చిన్నప్పట్నించీ ఆయనొక ఆర్ట్ సినిమాలు తీసే వాడనీ, భారత దేశపు పేదరికాన్ని విదేశాల్లో చూపించి డబ్బు చేసుకుందామనుకునే వాడనీ లేదా పేరు తెచ్చుకున్దామనుకునే వాడనీ (దుర) అభిప్రాయాలు ఉన్నాయి. ఎన్నోసార్లు సినిమాకి వెడమనుకున్నప్పుడు అసలు ఆయన సినిమాలు ఒక 'చాయిస్' లాగా కూడా నేనెప్పుడూ అనుకోలేదు. 'పథేర్ పాంచాలి' ఒక పక్క, 'ఖతర్ నాక్ ' థియేటర్ల లో ఆడుతున్నా.. ఏదో ఒకటి చూస్తేనే కానీ ఇంట్లోకి అడుగుపెట్టకూడదన్న నియమం పెట్టుకున్న రోజున.. రవితేజ సినిమా నే ప్రిఫర్ చేసిన గుర్తు.

ఈ పుస్తకం చేతిలో తీసుకున్నప్పుడు నాకు సహజం గానే ఆయన రాసిన విషయాలమీద ఒక Prejudice ఉంది.

సత్యజిత్ రాయ్ ఈ పుస్తకం గురించి రాసిన రెండు పారాలు చదివాక, రచయిత రాసిన పరిచయం చదవటం మొదలుపెట్టాను. ఒక సినిమా రూపొందటం లో దర్శకుని పాత్ర ని వివరిస్తూనే, దర్శకులు తమ అనుభవాల గురించి ఎక్కువ గా రాయకపోవటం వల్లనే దర్శకుని ప్రాముఖ్యత కి అంతగా ప్రాచుర్యం లభించట్లేదని అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. అలాగే సినిమాల పట్ల ఆయన ఆసక్తి, అనురక్తి, జీవితపు తొలి అంకం లో చదువు, భుక్తి కోసం చేసిన వాణిజ్య ప్రకటనల సంస్థ లో ఉద్యోగం చేస్తూనే ఎలా ఎన్నో భాషల్లో సినిమాలు చూసారో, ఏవిధం గా తన ఆలోచనలి పదును చేసుకున్నారో, తొలి స్క్రీన్ ప్లే రాసుకుని రెడీ చేసుకున్నారో, సినిమా తీయటానికి అవకాశాలు వచ్చినట్టే వచ్చి ఎలా చేజారిపోయాయో, వాళ్లు మొదలు పెట్టిన ఫిల్మ్ క్లబ్ గురించీ ,చాలా ఆసక్తి దాయకం గా వివరించారు.

ఈ పరిచయం చదివాక,ఆయన పుస్తకం లో ఏం చెప్తారో చదవాలని తప్పక క్యూరియాసిటీ పుడుతుంది.

ఈ పుస్తకం లో రెండు భాగాలున్నాయి. పుస్తకం శీర్షిక వల్ల మొదటి భాగం లో భారతీయ సినిమాల గురించి వివరిస్తున్నట్టు, రెండవ భాగం లో అంతర్జాతీయ సినిమా గురించి చెప్పినట్టు అనిపిస్తుంది కానీ మొదటి భాగం లో తన పర్సనల్ అనుభవాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని నాకనిపించింది. ఒక సగటు భారతీయ సినిమా ప్రేక్షకురాలిగా, కాంటెస్ట్ ఎక్కువ ఉండటం తో, మొదటి భాగం రెండో భాగం కన్నా ఎక్కువ ఆసక్తికరం గా అనిపించింది.

మన సినిమా:


1920 ల్లోంచి మొదలుకుని మన దేశ సినిమా కి ఒక సృజనాత్మకత, శైలి, నిజాయితీ మెరుగుపరచవలసి ఉందని, సంఖ్యాపరం గా ప్రపంచం లో హాలీవుడ్ సినిమాల తర్వాత స్థానం, మనదే అయినా నాణ్యతా పరం గా పోల్చలేమని, అందుకు కారణాలని విశ్లేషించారు. తొలిసారి దర్శకత్వం చేపట్టినప్పుడు చేసిన చిన్న చిన్న తప్పిదాలు, నేర్చుకున్న పాఠాలు వివరిస్తూ, ఆ సంబంధం గా, కాశీ నగరం లో ఆయన తొలి రోజుల్లో సినిమా షూట్ చేస్తున్నప్పుడు రాసుకున్న డైరీ వివరాలు రాసారు.
ఒకటి రెండు అధ్యాయాల్లో ఆయన ప్రాజెక్ట్ మానేజ్ మెంట్ అనుభవాలు సాఫ్ట్ వేర్ ప్రాజెక్ట్ ఎగ్జిగ్యూషన్ లో నా అనుభవాలతో కంపేరబుల్ గా అనిపించింది. కొంత తెలియని దానం, కొంత 'అంతా తెలుసులే ' అన్న నిర్లక్ష్యం, ఒకసారి మొదలు పెట్టాక 'అయ్యో.. ఈ విషయం మర్చేపోయాం..' అనుకోవటం, అలాగే..అనుకోని సమస్యలు ఎదుర్కోవటం, గొప్ప ఆశయాలతో ప్రారంభించినా వివిధ కారణాల వల్ల పడవలసిన రాజీ ల్లాంటివి.. ప్రేక్షకులకి (సాఫ్ట్ వేర్ కేస్ లో కస్టమర్లకి) నచ్చుతుందని గట్టిగా నమ్మితే అది నిజం కాకపోవటం,.. ఒక ప్రాజెక్ట్ అయ్యాక ఫలితానితో సంబంధం లేకుండా భావోద్వేగాలకి అతీతం గా ఉండగలగటం ఎంత కష్టమో రాస్తే.. నేనైతే చాలా కోరిలేట్ చేసుకోగలిగాను.
ఆయన చెప్పిన వాక్యం ఒకటి నాకు నచ్చింది 'You are a better man for having made it'. మరో అధ్యాయం లో హిందీ, మరియు దక్షిణభారత సినిమాలకి ఉండే ఎడ్వాంటేజ్ లు, బెంగాలీ సినిమాలకి లేకపోవటం వల్ల బెంగాలీ దర్శకులకి పరిమితమైన కొన్ని సమస్యల గురించి చర్చించారు.

మన సినిమా మీద ఆయన రాసిన వ్యాసాల్లో జల్సాఘర్ సినిమా గురించి ఆయన రాజ భవనం గురించి వెతకటం,.. క్లైమాక్స్ నాకు చాలా ఆసక్తికరం గా అనిపించింది. ఇంకో అధ్యాయం లో ఆయన సినిమాలు ఎందుకు తీద్దామనుకుంటున్నారో, ఒక సినిమా తీస్తున్నప్పుడు దురదృష్టవశాత్తూ క్రేన్ కింద నలిగిన ఒక కార్మికుడి మృతి గురించి చెప్పి, ఒక ఆసక్తిదాయకమైన విషయం చెప్పారు.. 'మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వారెవరు?' అని అడిగినప్పుడు సాధారణం గా చెప్పే సమాధానాల ఫార్స్.. :) అలాగే భారత సినిమా తీసేవాళ్ళు ఎదుర్కోవలసిన అదనపు సవాళ్లు వివరించారు.

13 చిత్రాలు తీసిన సత్యజిత్ రాయ్, 11 సినిమాలు నవలల లేక కథల మీద ఆధారం గా నే తీసారని, ఆవిధం గా తీయటం లో సాధక బాధకాలు వివరిస్తే.. 'ఓహ్ నిజమే కదా' అనిపించింది.

ఆయన దర్శకత్వం లో వివిధ కోణాలు వివరిస్తూ.. ప్రతి విభాగం లోనూ ఆయన సూచనిచ్చిన దాన్ని బట్టి నాకు ఆయన చాలా చాలా పొదుపు గా సినిమాలు తీసారని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని అర్థమైంది.
సినిమాల్లో పాటల గురించి ఆయన అభిప్రాయం కూడా చదివించేలా చెప్పారు. ముఖ్యం గా కాపీ రాయళ్ల ప్రతిభ ని ఆయన ముచ్చట గా మెచ్చుకోవటం నవ్వొచ్చింది. జైసల్మర్ మహారాజు గారితో ఆయన పరిచయం, వారి పాలస్ లో ఆయన షూటింగ్ అనుభవాలు కూడా ప్రత్యేకం గా మన సినిమా గురించి కొత్త విషయాలు చెప్పినట్టు అనిపించలేదు.. ఈ చాప్తర్లు లైట్ గా చదివేట్టు గా ఈజీ ఫ్లోతో ఉన్నాయి. ఆయన చూసిన ఐదు సినిమాల విశ్లేషణ, కొత్త వేవ్ దర్శకుల గురించి ఒక అధ్యాయం రాసారు.

మొదటి భాగం లో ఆయన ఆయన సమకాలీన భారతీయ సినిమా గురించి ఒక ఎకడిమిక్ స్టడీ లా చేప్తారనుకున్నా... కానీ మొత్తానికి మన సినిమా పట్ల ఆయన అభిప్రాయాలు, ఆయన నేర్చుకున్న విషయాలు, పరిశీలనలు, సినిమా తీయటం లో ఆయన అనుభవాలను, ఆయన కలిసిన విశిష్ట వ్యక్తులను ఎక్కువ గా వర్ణించారని నాకనిపించింది. అందుకే అది లైట్ రీడింగ్ గా హాయిగా సాగిపోయింది..వాళ్ల సినిమా

కలకత్తా నగరం లో "The River" అన్న నవల పై బెంగాల్ నేపధ్యం లో సినిమా తీయటానికి వచ్చిన రెన్వా ట్రిప్ ని నిశితం గా కవర్ చేసి రెన్వా గురించి, ఆయన ట్రిప్ గురించి చాలా విషయాలు చెప్పారు.

ఇటాలియన్ సినిమా గురించి మాట్లాడినప్పుడు అదేదో ఇటాలియన్ సినిమా చరిత్ర గురించి చెప్పటం తన భుజాల మీద వేసుకున్నట్టు కాకుండా ఆయన చూసిన సినిమాలు, ఆయన తెలుసుకున్న విషయాల బేసిస్ మీదే మాత్రమే రాసినట్టు కాస్త మాడేస్టీ చూపించినా మంచి అవగాహన ఉన్నట్టు ఈజీ గా అర్థమవుతుంది. అలాగే హాలీవుడ్, బ్రిటిష్, రష్యన్, జపాన్ సినిమాల గురించి చెప్పినప్పుడు నాకైతే హాలీవుడ్, బ్రిటిష్ సినిమాల గురించి మాత్రమే అసోసియేట్ చేసుకోగలిగి మిగిలిన అధ్యాయాలు కొద్దిగా బోర్ గా అనిపించాయి. సినిమా ఒక స్టడీ గా ఎకడిమిక్ ఇంటరెస్ట్ ఉన్నవాళ్ళకి ఆసక్తిదాయకం గా ఉండవచ్చు. నిశ్శబ్ద చిత్రాల మీద సమీక్ష కూడా ఇంటరెస్టింగ్ గానే ఉంది.

మాస్కో, జపాన్ లాంటి ప్రదేశాల కి వెళ్లిన అనుభవాలు పని లో పని గా ఆయన ట్రావెలాగ్ లాగా కూడా ఆయా ప్రాంత సినిమాల గురించి చర్చించినప్పుడు కాస్త లైట్ రీడింగ్ గా అనిపించి ఆసక్తి దాయకం గా ఉంది.

చార్లీ చాప్లిన్ గురించి ఆయనకి ఉన్న అభిమానం 'గోల్డ్ రష్' అన్న సినిమా గురించి అధ్యాయం లోనూ, అలాగే చార్లీ చాప్లిన్ ఆటో బయాగ్రఫీ మీద రాసిన చాప్టర్ లోనూ తెలుస్తుంది. వీలుంటే చార్లీ చాప్లిన్ జీవిత చరిత్ర కూడా చదువుదామని బుర్ర లో ఒక బుక్ మార్క్ పెట్టుకున్నాను.
అలాగే అకిరా కురసవా, జాన్ ఫోర్డ్ గురించి కూడా ఈ వ్యాసాల ద్వారానే తెలుసుకున్నాను. హిచ్ కాక్ గురించి ముందర తెలిసినా సత్యజిత్ రాయ్ చెప్పిన విషయాలు కూడా ఆసక్తిదాయకం గా చదివించేలా ఉన్నాయి.

ఈ పుస్తకం చదివాక.. నెమ్మదిగా ఒక్కొక్కటీ ఆయన సినిమాలు చూద్దామని అనుకుంటున్నాను.చివరగా.. అనువాదకురాలి గురించి, పబ్లిషర్ల గురించి రెండు ముక్కలు..
సాధారణం గా అనువాదాలు చదివినప్పుడు ఎందుకో ఒరిజనల్ చదివితే వచ్చిన ఫీల్ లేకుండా చప్పగా ఉంటాయి. ప్రజ్ఞా వంతుల అనువాదాలు చదువుతున్నప్పుడు అసలు విషయం గురించి తప్ప వేరే ఆలోచన ఉండకుండా చదువుతూ పోతాం కదా.. ఈ పుస్తకం రెండవ కాటగేరీ లోకి వస్తుంది. పుస్తకం మూసేసాక మాత్రమే ఇది అనువాద రచన అని గుర్తొచ్చింది. Good Job Sowmya!

నవతరంగం పబ్లిషర్లు చేసిన ఈ ప్రయత్నం ప్రశంసనీయమైనది. వారికి ముందుగా నా హార్థిక అభినందనలు. వారు మరిన్ని మంచి పుస్తకాలని ప్రచురించాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను.

ఒకటి రెండు చిన్న సూచనలు /అభిప్రాయాలు .... అనువాదకురాలి పేరు పుస్తకం కవర్ మీద వేస్తే బాగుండేదని నాకనిపించింది. అలాగే ఈసారి ఒరిజనల్ రచనలని ప్రచురిస్తారని ఆశిస్తున్నాను.


పుస్తకం ప్రతులకి :

 
వెల : 150 రూ. నవ తరంగం పబ్లిషర్లని సంప్రదించవచ్చు.

పుస్తకావిష్కరణ సభ వివరాలు : http://navatarangam.com/2011/06/invitation-2/
సత్యజిత్ రే రాసిన ఆంగ్ల మాతృక (Our films, their films) వివరాలు..

Ray, Satyajit. Our films, their films. 1st U.S. ed. New York, Hyperion Books, 1994 / Bombay, Orient Longman, 1976. ISBN 0861256379 / 0863113176 / 0861251768 / 0786861223
A collection of articles written by Ray. Discusses Indian, European, Asian, Russian and Hollywood cinema; aspects of his craft; his encounters with Renoir and Kurosawa; New wave and old masters & Silent films.

13 comments:

బద్రి said...

Thanks for intro..

I am looking for some one who is travelling from Hyd to get this book for me ..

S said...

Thanks for the review and the kind words!! :)

-Sowmya

సత్యప్రసాద్ అరిపిరాల said...

ఎప్పటికైనా ఒక పుస్తక సమీక్ష వ్రాయాలన్న మీ కోరిక తీరటమే కాదు.. ఈ పుస్తకానికి మొదటి సమీక్ష వ్రాసిన ఘనత కూడా కొట్టేశారు. చాలా బాగా వ్రాసారు. అభినందనలు. రేపటి పుస్తకావిష్కరణ సభలో కలుస్తారని ఆశిస్తున్నాము - నవతరంగం తరఫున అరిపిరాల సత్యప్రసాద్

కృష్ణప్రియ said...

@ బద్రి,

థాంక్స్! పబ్లిషర్స్ ఏమైనా పంపించగలరేమో..

@ సౌమ్య,

:)

@ సత్యప్రసాద్ గారు,

ధన్యవాదాలు! లేదండీ.. నేను హైదరాబాద్ లో ఉండను. All the best anyways..

Kathi Mahesh Kumar said...

@బద్రి & కృష్ణప్రియ: బెంగుళూరు, చెన్నై నుంచీ పుస్తకానికి కొంత డిమాండ్ వచ్చింది. దాన్ని దృష్టిలోపెట్టుకుని అక్కడికి కొన్ని కాపీలు పంపాలనుకుంటున్నాము. వచ్చేవారంలో వివరాలు తెలుపుతాము.

Srikanth said...

బావుంది మీ సమీక్ష...సౌమ్య గారికి అభినందనలు..మీ బ్లాగ్ముకంగా......

cbrao said...

తొలి సమీక్షలా అనిపించలేదు. బాగుంది. మరిన్ని పుస్తకాలు పరిచయం చెయ్యండి. ఈ పుస్తకం ఇచ్చిన ప్రొత్సాహంతో సౌమ్య నుంచి ఇంకొన్ని అనువాదాలు ఆశించవచ్చా?

తృష్ణ said...

చాలా బాగా రాసారు.

కృష్ణప్రియ said...

థాంక్స్! సి బీ రావు గారు, శ్రీకాంత్ గారు, తృష్ణ గారు...!

Arun Kumar said...

బావుంది మీ సమీక్ష

కొత్త పాళీ said...

very nice review

కృష్ణప్రియ said...

@ అరుణ్ కుమార్ గారు,

థాంక్స్!

@ కొత్త పాళీ గారు,

నిజమా? మీరు పుస్తకం చదివారని, సూచనలిచ్చారని సౌమ్య తన బ్లాగు లో అన్నారు.
మీ వ్యాఖ్య చూసాక 'అమ్మయ్య ..అయితే బాగానే రాసానన్నమాట' అనిపించింది..

ధన్యవాదాలు!

Anonymous said...

Фотонейл арт, nt05 c заказать Крыловская

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;