Tuesday, July 12, 2011

గేటెడ్ కమ్యూనిటీ కథలు - I am ok, You are not ok!













ఆగస్ట్ పదిహేను మళ్లీ వచ్చేస్తోందా? ఈలోగా మొన్నటి చబ్బీస్ జనవరి గురించి మాట్లాడుకుపోతే.. మరీ కొత్తావకాయ పెట్టాక పాత సంవత్సరం ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి, ఎండిన, రంగు మారిన ఆవకాయ లాంటి కబుర్లయిపోతాయి కదా.. అసలే ఇప్పటికే లేట్ లెండి.

మొన్న క్రిస్ మస్ సెలవలకి ముందుగా ప్లాన్ చేసుకున్న కుటుంబాలు ఎంచక్కా వెకేషన్లకి పరిగెడితే.. కాలనీ బోసిపోయింది. ఎక్కడికీ టికెట్లు దొరకక ఉద్యాన నగరి లోనే ఉండిపోయిన వారు క్రెడిట్ కార్డ్ మాగ్నెటిక్ స్ట్రిప్ గీతలు పడేంత వరకూ గీకి గీకి అస్సలూ అవసరం లేని వస్తువులన్నీ తెగ కొనేసి, రిలీజ్ చేసిన సినిమాల్లో కాస్త 'గుడ్డిలో మెల్ల ' అనిపించినవి చూసి తలనొప్పులు తెచ్చుకుని కచ్చ గా తీరిగ్గా ఉన్నారేమో.. గొడవలు అక్కడ రాజుకున్నాయి.


ముప్ఫయ్యవ నంబర్ ఆయన కి కాలనీ లో సీనియర్ సిటిజన్లకీ మొదటి గొడవ.. రాత్రుళ్లు గాట్టిగా మాట్లాడుతూ వాకింగ్ చేస్తున్నారు. దాని వల్ల పడుకోవటానికి కష్టం గా ఉంది.. అని. ఇదేమైనా బౌద్ధుల/జైనుల ఆశ్రమమా మౌనం గా నడవటానికి? అంతగా కష్టం గా ఉంటే చెవిలో దూది పెట్టుకుని పడుకోండి.. అని పెద్దవాళ్లు విసుక్కున్నారు. కాలనీ మెయిలర్ భగ భగ మంది. ఈ-మేయిలాస్త్రాలు విసురుకున్నారు..


నాలుగో నంబర్ ఆవిడ పూల తీగ విరగ బూసి ఎండుటాకులూ, పూలూ ఐదో నంబరాయన వాకిట్లో పడుతున్నాయట. సరే అని ఆవిడ రోజూ పనమ్మాయి ని అటువైపు కూడా చీపురు వేయమని పురమాయించింది. కానీ.. మాకు చీకటవుతోంది.. కాస్త అరటి చెట్లు కొట్టించేయండి.. అన్న మాట వింటూనే గయ్యి మని లేచిందీవిడ. మీ ఇంట్లో పాలు తాగి పిల్లి మా ఇల్లు పాడు చేస్తోంది. అని ఎదురు దాడి చేసింది. దానికి 'మేము మాత్రమే దానికి పాలు పోస్తున్నామని రుజువేంటి.. వేరే ఏ ఇంట్లోనూ అది తిండి ముట్టదని ప్రూవ్ చేస్తే నేనే వచ్చి అంతా శుభ్రపరుస్తాను. అని ఈయనా చాలెంజ్ విసిరాడు. ఫలితం.. మాటలాగిపోయాయి. పిల్లి మీదా, కాకి మీదా పేర్లు పెట్టుకుని కాస్త వాగ్యుద్ధాలు..

ఇరవై ఎనిమిదో ఆయనకి పండక్కైనా, తద్దినానికైనా షార్ట్స్ లోనే తిరగటం అలవాటు. ఆగస్టు పదిహేనుకీ అవే కురుచ వస్త్రాలతో జండా వందనం చేశాడని, ఇరవయ్యొకటవ ఇంటాయన మనోభావాలు దెబ్బదిన్నాయి. కనీసం గణతంత్ర దినోత్సవం రోజున పధ్ధతి పాటించాలని ప్రతిపాదిస్తూ ఒక మెయిల్. 'చాట్! నన్నంటాడా? అయినా ఆయనకేం దేశభక్తి ఉండేడ్సింది? నాది RSS. నేను క్రమశిక్షణ కలిగిన స్వయం సేవక్ ని. నన్నింత మాటన్నాక నేను రాను. మీరే చేసుకోండి.. పధ్ధతి గా ..' అని అలిగి అటకెక్కాడు.


పిల్లల నాటకాల్లో వాళ్ల పిల్లలకి ప్రాముఖ్యత లేని పాత్ర లిచ్చారనీ, నాట్యం లో వెనక వరస లో నిలబెట్టారనీ.. స్పీచ్ అవకాశం వాళ్ల పిల్లలకి ఇవ్వలేదనీ.. ఇలాగ తల్లుల గొడవలు.



పిల్లలకి మ్యూజిక్ బాండ్ ఏర్పాటు చేసారు. మా కాంప్లెక్స్ లో ఒకప్పటి ఒక కాలేజ్ సూపర్ స్టార్, ప్రస్తుతపు మామూలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్/తండ్రి. అందరూ ఎంతో ఉత్సాహం గా మొదలు పెట్టారు. రోజూ ప్రాక్తీసే. ఇంకో రెండు రోజుల్లో ఫంక్షన్ అనేసరికి మూడు మైకులు ఉంటాయనగానే.. మైక్ నాకు ఉండాలని, అబ్బే నా గొంతు బాగుంది నాకే ఉండాలని పిల్లల కస్సు బస్సులు. తల్లుల రికమెండేషన్, గొడవలూ..


పెసిడెంట్ గారికీ తొమ్మిదో నంబర్ ఆయన కీ పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందని ప్రతీతి. తొమ్మిదో నంబర్ ఆయన పూల కుండీలు తెప్పించి ఇంటి బయట రోడ్డుకి దగ్గర గా పెట్టించి తోటమాలి లేడని ఆఫీస్ కెళ్లి వచ్చేసరికి 'ఎన్నాళ్ళకి దొరికావు !' అని ఆనందంగా ఆ కుండీలు తీయించి లోపల పెట్టించి పెద్ద మెయిల్ పంపారాయన. దానికి తొమ్మిదయన నిప్పులు దొక్కిన వాడిలా చిందులేస్తూ.. ఆవేశపడి వెళ్తే పెసిడెంట్ గారు ఊర్లో లేరని తెలిసింది. దానితో ఆయన కుతకుత లాడుతున్నాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.


ఇలాగ హై వోల్టేజ్ ట్రాన్స్ ఫార్మర్ పక్కన ఉన్నట్టు .. కాలనీ లో గంభీర మైన వాతావరణం. కొంత మంది మరీ సెన్సిటివ్ తల్లి దండ్రులు పిల్లల్ని కూడా కలవనీయకుండా అడ్డుకుని గొడవల్ని ఇంకో ఎత్తుకి తీసుకెళ్లారు.

ఈ పండుగ ప్రిపరేషన్లకి మాత్రం నన్ను ఎంత మంచి మనసున్న దానిననీ, అద్భుతమైన నైబరనీ, అత్యంత రుచికరమైన వంటలు చేస్తాననీ, అందర్నీ కలుపుకుపోయే స్వచ్చమైన స్వభావమనీ, ఇంకా ఎన్నో రకాలు గా కృష్ణ సహస్ర నామాలు చదివినా.. నేను దీపావళి దెబ్బ నుండి ఇంకా కోలుకోకపోవటం తో.. అస్సలూ లొంగలేదు.. (ఏ మాట కామాటే చెప్పుకోవాలి.. లోపల లోపల సంతోషించి మా బాసూ, మా ఇంట్లో వాళ్లూ కూడా ఇలాగే అనుకుంటే ఎంత బాగుండు? అనుకున్నాను లెండి..)


ఇక ఆరోజు అందరం ఎనిమిది కల్లా జండా కర్ర దగ్గర సమావేశం అయ్యాం. ఒక కాలనీ కి చెందిన వారిలా, కలిసి ఉత్సాహం గా కబుర్లు చెప్పుకుంటూ కోలాహలం గా ఉండే వారు.. ఏదో అఖిల పార్టీ సమావేశం లో జగన్ కి ఒక పక్కన కిరణ్ కుమార్,ఇంకో పక్క చంద్రబాబు,ఆయన పక్కన లక్ష్మీ పార్వతి కూర్చున్నట్టు,

ఇంకోవరస లో చిరంజీవి కి ఒకపక్క రోజా, ఇంకో పక్క మోహన్ బాబు కబుర్లాడుకుంటున్నట్టు, పోనీ అని ఆయన పక్కకు తప్పుకుని ఒక చోట కూలబడితే అక్కడ జీవితా రాజశేఖర్ లు తగిలినట్టు..  పోనీ అటుపోదాం అంటే.. వీజీ శాంతి  పక్కన తప్ప ఖాళీ సీట్ లేనట్టు.


కొద్ది దూరం లో గంగా భవాని, నన్నపునేని రాజకుమారి ఒక పక్క కూర్చున్నట్టు... తటస్థులు బిక్కు బిక్కు మంటూ ఒక మూల కూర్చుని కాసేపు.. లాభం లేదని కాస్త హడావిడి చేస్తున్నాం.

ప్రత్యేకం గా టీ పెట్టాలంటే వేన్నీళ్ళు కాచక్కరలేదు. కుర్చీల మధ్యనుండి అలా కెటిల్ తీసుకెళ్తే చాలు. పొగలు కక్కే చాయ్ తయార్!

ప్రోగ్రాం మొదలైంది. జండా వందనం, పిల్లల ఆటపాటలు, నృత్యాలు,.. స్కిట్స్.. బాగానే నడుస్తున్నాయి.

పెసిడెంట్ గారు, తొమ్మిదో నంబర్ ఆయనా మంచి వాగ్యుద్ధం చేసుకున్నారు. అందరికీ సాంస్కృతిక కార్యక్రమాల కన్నా.. అదే ఎక్కువ రంజింపచేసిందని వేరే చెప్పక్కర్లేదనుకుంటాను?

నెమ్మదిగా అందరూ పిల్లల పాటలు, డాన్సులు సరదాగా చూస్తున్నారు. పెద్ద పెద్ద డ్రం సెట్లు తెచ్చి మైక్ అదీ పెడుతూనే..పిల్లల కేరింతలు కొట్టేస్తున్నారు.బయట నుండి అద్దెకి తెచ్చిన స్పీకర్లు పెట్టి కరెంట్ కనెక్షన్లు ఇచ్చి తెగ హడావిడి, కోలాహలం లో ఎప్పుడు మబ్బులు కమ్ముకున్నాయో గమనించనే లేదు. నీటి చుక్కలు టాప్ టాప్ మని గుండె లటుక్కుమంది. అద్దెకి తెచ్చిన ఎలక్ట్రిక్ సామాన్లు, మా కాలనీ వాసుల సరదా కోసం తెచ్చిన ఖరీదైన డ్రమ్స్, మైక్స్ అలాగ అన్నీ!!!

పిల్లలు అరుపులు. ఒక రెండు క్షణాలు నిశ్చేష్టులై ఉండి పోయినా.. సద్దుకుని అందరూ పరుగులు తీసారు లాన్ లోకి. ఒకళ్లు మోటార్ సెట్ మీద కప్పే టార్పాలిన్ షీట్ తెచ్చి కప్పటానికి ప్రయత్నిస్తే..ఇంకోరు మధ్యలో కర్రలు పెట్టి గొడుగు లా నిలపటానికి..

ఈలోగా పెద్దాయన హడావిడి లో వైర్ కాలికి తట్టుకుని పడిపోబోయారు. ముప్ఫయ్యవ నంబర్ ఆయన ఆపి చేత్తో నడిపించి గొడుగు కిందకి తెచ్చారు.

నాలుగో నంబర్ ఆవిడా, ఐదో నంబర్ ఆయనా కలిపి ఒక కర్ర ని అడ్డం గా పైకి పట్టుకున్నారు. మరి గొడుగు ఎత్తు పెంచాలా?

ఇరవై ఎనిమిదవ నంబర్ ఆయన పండగ బహిష్కరించినా, వాళ్ల పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనటం తో ఆయన వర్షం లో ఇరుక్కున్న కుటుంబం కోసం వస్తూ.. ఇరవై ఒకటవ ఆయన చేతినుండి ఇంకో నాలుగు కర్రలు అందుకుని రాటల్లా నిలబెట్టారు...

కాలనీ ఆడవారంతా పిల్లలు తడవకుండా, ఇన్స్త్రు మెంట్లు ముట్టుకోకుండా కాపాడారు. ఇంత చేసినా ఒక పక్క టార్పాలిన్ కి చిల్లు పడితే.. పెసిడెంట్ గారు.. తొమ్మిదో నంబర్ ఆయన ని.. 'అదిగో నా కార్ పైన వేసిన కవర్ లాక్కు రావయ్యా.. ఇక్కడ ఎలెక్ట్రిక్ కనేక్షన్లకి ప్రమాదం.. అని అరిచాడు. ఇద్దరూ నీరు పడకుండా ఆపారు.

వర్షం పెరగటమే కానీ తగ్గదే? పిల్లలు మాత్రం ఖుష్! గెంతులే గెంతులు. పెద్దలు కూడా కొద్దిగా తడుస్తూ, వణుకుతూ.. జోకులేసుకుంటూ వృద్ధులనీ, పిల్లల్నీ సంరక్షిస్తూ ..



ఈ పిల్లా మేకా (మైకూ) వర్షం బారీన పడకుండా ఒక కృష్ణుడు కాదు ఒక యాభై కృష్ణుళ్ళు ఉన్నారా అన్నట్టు. ఒక విధమైన తృప్తి.. ఆనందం!!


ఆ వర్షం మా కమ్యూనిటీ జనుల మనసు లో గడ్డ కట్టిన చిన్న చిన్న మనస్పర్థలని, ముందర తడిపి, మెత్తపరచి, నెమ్మదిగా చిత్తడి చేసి, కరిగించింది. వర్షం నీళ్ళల్లో కలిసి ప్రవహించి మా rain water recycling plant 's reservoirs లోకి చేరింది. మళ్లీ ఆ నీరు తాగి మేము కొత్త గొడవలు పెట్టుకునేంత వరకూ మేమంతా 'I am ok, you are ok, We are all Ok' :)

38 comments:

Anonymous said...

"ప్రత్యేకం గా టీ పెట్టాలంటే వేన్నీళ్ళు కాచక్కరలేదు. కుర్చీల మధ్యనుండి అలా కెటిల్ తీసుకెళ్తే చాలు. పొగలు కక్కే చాయ్ తయార్!"--Excellent !!

ఆ.సౌమ్య said...

Excellent కృష్ణ ప్రియగారూ!
చిన్న చిన్న విషయాలన్నీ ఎంత బాగా రాస్తారో మీరు!

ఒక కాలనీలో గొడవలు రావడం చాలా మామూలే...కానీ ఆ గొడవలని వివరిస్తూ, అంతర్లీనం గా ఒక విశ్లేషణ చేస్తూ...బలే రాసారు.

చివర రాసిన ముగింపు వాక్యాలు...అదుర్స్!

ramesh said...

భలే చెప్పారు. ఏంటో, ఇంత బాగా ప్రముఖ పత్రికలలో కూడా చెప్పడం లేదు, కధలు.

Mauli said...

చిర౦జీవి :))

ఏదైనా పత్రిక్కి పమ్పకపోయారా (మినిస్టర్స్ కాలని అని మార్చెయ్య౦డి .హ హ )

మురళి said...

నాకు నచ్చిన వాక్యమే హరేఫల గారికీ నచ్చిందండీ.. గేటెడ్ కమ్యూనిటీలలో చేరగానే మనుషులు 'నెంబర్లు' గా మారిపోవడం మాత్రం భలే చిత్రం.. పని మనిషి, పాలవాళ్ళ మొదలు అందరూ అలాగే రిఫర్ చేయడం.. అపార్ట్మెంట్లలో అయితే ఫ్లాట్ నంబర్...

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఫణి బాబు గారి కామెంటు కి డిటో.
మీకు మీరే సాటి.
మీ పద్ధతిలోనే రెండు దరహాసాలు.

కొత్త పాళీ said...

brilliant.

కృష్ణప్రియ said...

@harephala,

ధన్యవాదాలు!

@ సౌమ్య,
థాంక్స్! చాలా సార్లు ఇలాంటి గొడవలు ఒక కుటుంబం లో కావచ్చు, ఒక కాలనీ లో కావచ్చు, ఇంకా పెద్ద ఎంటిటీ లో లో కావచ్చు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి కదా. కానీ ప్రతి సిస్టం లో కూడా.. అనుకొని ఒక ఉత్పాతం వచ్చినప్పుడు మాత్రం అనూహ్యం గా అందరూ కలిసి కట్టు గా పని చేయటం చూస్తూనే ఉంటాం కదా..
కుటుంబం లో అయితే ఒకరికి పెద్ద ఆరోగ్యం సమస్య, లేదా చావు.. రాష్ట్రం లో కొంత కాలం క్రితం వరదలు, అప్పుడెప్పుడో కార్గిల్ యుద్ధం..

ముగింపు వాక్యాలు :) థాంక్స్!

@ రమేశ్,
ఇంకా నయం. నేనెంత? ఎనీ వె థాంక్స్!

కృష్ణప్రియ said...

మౌళి గారు,

చిరంజీవి :))
పత్రిక కా? మీరేనా? ఇంతకూ మునుపు నా జీవిత చరిత్ర కి అనుబంధం గా వేయమన్నారు?

@ మురళి గారు,
:) అవునండీ.. నంబర్లతోనే ముడి పడ్డ ఐడెంటిఫికేషన్..

@ బులుసు సుబ్రహ్మణ్యం గారు,
థాంక్సండీ.. మీకు మూడున్నర దరహాసాలు!

@ కొత్త పాళీ గారు,

ధన్యవాదాలు!

Sravya V said...

హ హ బావుంది బాగా రాసారు !
ప్రతిసారి ఈ కామెంట్ రాయాలంటే బోర్ గా ఉంది , ఇసారి ఇలా కాకుండా నాకు నచ్చనిది రాసేయండి కాసేపు వాదించు కోవచ్చు :P
సరదా గా అన్నానండి ఆ పనిచేసేరు మీ అభిమానులు అందరు కలిసి నా పని పడతారు :)))

మంచు said...

మీ గేటెడ్ కమ్యూనిటి కధలు వేటికవే అన్నీ సూపర్ :-) మీ చేతిలొకి పడ్డాకా అలా మారుతుందో లేక నిజంగానే మీ కాలనీ అంతేనో కానీ ముఖ్యంగా ఈ పొస్ట్ చూసాక నేను కమ్యూనిటీ తీవ్రంగా కన్సిడర్ చేస్తున్నా... :-)

మీ బ్లాగులొ బ్యాక్ లాగ్ పొస్ట్లు చాలా ఉండిపొయాయి ...ఇక లాభం లేదని రివర్స్ క్రానొలాజికల్ ఆర్డర్ లొ వెళ్ళాలని ముందు ఇక్కడితొ మొదలు పెట్టాను :-)))

మాలా కుమార్ said...

కురచ బట్టల ముసలాయన బొమ్మ సూపర్ అండి :)
మీరెంతో మంచి మనసున్న అమ్మాయని నేనూ అనుకుంటానండి . మీ వంటలు తినిపిస్తే అద్భుతం గా వంటలు చేస్తారని కూడా మెచ్చేసుకుంటాను .
బాగా రాసారు .

Kathi Mahesh Kumar said...

కథలో నూతనత్వం, కథనంలో సినిసితమైన హాస్యం, అంతేలోతు ఆలోచన, శైలిలోని చురుకుదనం , కొత్త అలోచనల్ని పాత (classic) భాషాప్రయోగాలతో రక్తికట్టించే విధానం ఇవన్నీ మీకొక బ్రాండ్ ని క్రియేట్ చేసిపెట్టాయి.

నియోరిచ్ అర్బన్ గేటెడ్ కమ్యూనిటీ అనుభవాల్ని కొత్తతరం అనుభవించడమేగానీ, ఆ అనుభవాల్ని అందరికీ అర్థమయ్యే సాహిత్యం రూపంలో ఇంతవరకూ ఎవరూ (తెలుగులో) ప్రచురించడం జరగలేదు. ప్రవాసాంధ్రుల డ్యాస్పొరా సాహిత్యం తరువాత, అంతటి సామాజిక ప్రాధాన్యత ఉన్న మార్పుని అక్షరబద్దంచేస్తున్న ప్రయత్నం ఇది. దీన్ని బ్లాగులకే పరిమితం చెయ్యకుండా జనబాహుళ్యానికి అందించడం ద్వారా ఒక నూతనకోణాన్ని అందించినవారౌతారని నా ప్రఘాడ విశ్వాసం.

Indrasena Gangasani said...

అద్బుతం అనే మాట అతి సామాన్య పదం మీ టపాని మెచ్చుకోవడానికి, ఇంటి నెంబర్లు మాత్రమె చెప్తూ మానవ స్వభావాన్ని అతి చక్కగా వివరిస్తూ, చివరిలో ఏకత్వం గురించి రాసిన మీ శైలి నభూవో నః భవిష్యతి. మీ ఈ టపాలు చేయి తిరిగిన రచయిత లకి ఎంత మాత్రం తీసిపోవు. మీ టపాలు చదవడం ఒక చక్కని అనుభూతి. రాస్తూనే ఉండండి మేడం.

Ruth said...

I second Katti gaaru ! very pleassant read !

thrill said...

krishna priya garu ..
ee gate lu comunity lu .. ivanni samsarula vishayalu .. so sannasi (samsarri ki sanyasi ki madya unnavadu ) ni nenu commet cheyyadhaluchukoledu (avi naku peddaga pattavu )... but as usual as every one say/ornot mee rachana saili tirugulenidi ...adbhutham ... etra veedu ekkuva pogidestunnadu anukuntunnara ..daaniki oka balamaina karanam undi .. kathi mahesh kumar garu cheppinatlu mee rachalanallin blogs ke parimitham cheyyakundaa.. oka 100 post lu okko book ga chesi printe cheste baguntundani .. aa printing n copy rights naku istharani aasatho ee sariki mimmalni pogadalani nirnayinchukunnanu ....

itlu
bakara bala satti

నేస్తం said...

భలేరాసారు క్రిష్ణప్రియగారు... ఇండియాలో మా అపార్ట్మెంట్ గుర్తొస్తుంది..అత్తయ్యా వాళ్ళు కూడా పేర్లతో పిలుచుకోరు 201 ఆవిడ వచ్చిందా? 206 ఆమెతో కలిసి మార్కెట్కు వెళ్ళాను అని నెంబర్స్ తో మాట్లాడుతారు .. ఇండియావెళితే అదే అపార్ట్మెంట్లో ఉండాలి అనిపిస్తుంది..అప్పుడయితే బోలెడు పోస్ట్లు రాయచ్చు నేను కూడా :) చాలా బాగుంది మీ శైలి

కృష్ణప్రియ said...

@ శ్రావ్య,
:) బాగుంది. మీసంగతి తెలియదు కానీ.. నా టపాలకి ఇంకా శ్రావ్య కామెంట్ రాయలేదు. ఏమైందో ఈ అమ్మాయికి ? క్షేమంగా నే ఉంది కదా? అనుకునే స్థితి కి వచ్చాను.
Thanks for your encouragement!

@ మంచు,

థాంక్స్! :) ఇంచుమించు అన్ని కాలనీలూ ఇలాగే ఉంటాయి కదా? నేను నా టపా లో చెప్పిన ప్రతి ఒక్క సంఘటనా ఇంటి నంబర్ల తో సహా జరిగాయని కాదు. స్థూల రూపం లో... Yes. కొద్దిగా తాళింపు తగిలించాలి గా ? ఈ పోస్టుల్లో కాస్త మసాలా పాలు కూడా ఉంది :)

@ మాల గారు,
:) గూగుల్ మహిమ! అమ్మయ్య.. నన్ను పొగిడారు కాబట్టి నా వంటలు ఇప్పుడు మీరు తిని తీరాలి :) సిద్ధమేనా?

కృష్ణప్రియ said...

@మహేశ్ గారు,

మీ అనాలసిస్ కి చాలా చాలా ధన్యవాదాలు! మీరన్నంత గొప్పగా ఉన్నాయి ఈ పోస్టులు అంటే ధన్యురాలిని.

@ ఇంద్రసేనా గంగసాని గారు,

ధన్యోస్మి!

@ Ruth,

చాలా థాంక్స్!

@ నేస్తం,
:) థాంక్స్! మీకు పోస్టులకి టాపిక్స్ తక్కువా? ఎంత చక్కగా బోల్డు విషయాలు రాస్తారు?
కైదీల్లా నంబర్ల తోనే పిలుచుకోవటం :) ఈమధ్య మేము ఆ అలవాటు ని బ్రేక్ చేయటానికి ప్రయత్నిస్తున్నాము.

Mauli said...

మీటపాలు ఇ౦త బావు౦టాయని అప్పుడు తెలిదు క్రిష్ణప్రియ గారు (మహేష్ బాబులాగ అన్నమాట )

అ౦టే అన్నామ౦టారు కాని, దీపావళి భోజన౦ ఏర్పాట్లు టపా, ఈ టపా మీ కమ్యూనిటీ వాళ్ళకి చూపి౦చ౦డి. ఈ టపా చూసి వాళ్ళు కూడా ఫక్కున నవ్వేస్తారు.

(అమ్మయ్య బాగా కవర్ చేస్కున్నా కదా)

నిజానికి ఈ పోష్టు చదువుతు౦టే ఏదో మాగజైన్ లో చదువుతున్నట్లు అనిపి౦చి౦ది. :) ప్రత్యేక౦గా కాలనీ గురి౦చి వ్రాయక్కరలేదు. ఏ౦ వ్రాసినా రిలేట్ అయ్యేలా వ్రాస్తారు కదా.

మీరొక కాలమ్ వ్రాయడ౦ మొదలుపెడతారేమో ము౦దు ము౦దు.

జయ said...

చాలా బాగుందండి. నాక్కూడా అక్కడే ఉండాలనిపిస్తోంది. ఎన్ని విషయాలు తెలుసుకోవచ్చో కదా.... నాకైతే అంతమంది రకరకాల మనుషుల మధ్య ఉంటే ఎంత మజా వస్తుందో కదా అనిపిస్తోంది. .

ఇందు said...

కృష్ణగారూ..సుపరూ...

హ్హహ్హహ్హ! మీరు రాసిన విషయాలకి బొమ్మలు అచ్చుగుద్దినట్టు భలే సరిపోయాయి :))))

చాలా బాగుందండీ..అప్పుడెప్పుడో ఆగిపోయింది ఈ గేటెడ్ కథల పర్వం! ఇప్పుడు మళ్ళి మొదలు...ఇక సిరీస్ లాగ కంటిన్యు చేసేయండీ...మేమూ చదివి ఆనందిస్తాం కదా!

Sravya V said...

కృష్ణప్రియ గారు so sweet of you :)
i wish I could meet you on some day in person possibly in the early part of next year :)))

వేణూశ్రీకాంత్ said...

టీ డైలాగ్ సూపర్ అండీ :-) టపా చాలాబాగుంది.. చిన్న చిన్న విషయాలను నిశితంగా పరిశీలించి భలే రాస్తారు.. నిజమే ఏదైనా ఉపద్రవం వచ్చినపుడు అందరూ ఎలా కలిసిపోతారో కదా.. భారతంలో డైలాగ్ గుర్తొస్తుంది.. “మాలో మేము తగవులాడుకునేప్పుడు వాళ్ళు నూర్గురు మేము ఐదుగురము కానీ మాపై ఎవరైనా దండెత్తితే మేము నూటైదుగురము” అని.. మనవాళ్ళంతా అచ్చంగా అలానే బిహేవ్ చేస్తారు..

అన్నట్లు మీ గేటెడ్ కమ్యూనిటీకథలను పుస్తకంగా ఎప్పుడు ప్రచురించబోతున్నారు.. ముందుగానే చెప్తే నా కాపీ రిజర్వ్ చేసిపెట్టుకుంటాను ఆలశ్యమైతే దొరకకపోవచ్చు...

Pavani said...

శంకరమంచి గారి "అమరావతి కథలు" గుర్తుకొస్తున్నాయి మీ టపాలు చూస్తుంటే. కొన్ని కేరెక్టర్స్ ని ప్రతి పొస్ట్లో పరిచయం చేస్తూ ఉండండి అవ్వే బ్రాండ్స్ ఐ కూర్చుంటాయ్.

కృష్ణప్రియ said...

@ మౌళి,
పర్వాలేదు. కవరింగ్ బాగానే ఉంది :)
థాంక్స్!

@ జయగారు,
వచ్చేయండి మరి. త్వర పడండి.. మంచు గారు ఆల్రెడీ పక్కిల్లు బుక్ చేసేసుకున్నారు. మీ వ్యాఖ్య కి థాంక్స్!

@ ఇందు,
థాంక్స్!

@ శ్రావ్య,
:) Sure!

@ వేణూ శ్రీకాంత్,
థాంక్స్! Exactly... వరదలప్పుడు కుల,మత, ప్రాంతీయతలకు అతీతం గా పని చేయటాన్ని చూసి అలాగే అనిపించింది.
నా బుక్ వస్తే కొనే వారేవరండీ బాబూ. బ్లాగర్లే. ఇంకెక్కడా డిమాండ్ లేదు.

@ thrill,
:)

@ Pavani,
థాంక్స్! ఈ ఐడియా రాలేదు. తప్పక ఆలోచిస్తాను.

రంగావఝ్యల శేషాంజనేయాధాని శర్మ said...

హహహ
చాలా బావుంది కృష్ణప్రియ గారు కానీ నాకు ఓక్కటే అర్ధం కాలేదు.
ఒక్కటో నంబరు అంటీ ఇరవైవ నంబరు అంకుల్ ఏంటండి
చివరి లైన్లు మాత్రం సూపర్ :):):):):):)

ఏమైన సరే బ్లాగు రాయడంలో మీకు మీరే సాటి సూపర్ గా రాస్తారు.

చాణక్య said...

కృష్ణప్రియ గారు.. నేను ఇదే మొదటిసారి మీ బ్లాగ్ చదవడం. కామెంట్ రాయడానికి కూడా చాలా సేపు ఆలోచించాను. ఎలా పొగిడినా తక్కువైపోతుందేమో అని. ఒకటే మాట. మీరు నన్ను అభిమానిగా పొందే ఛాన్స్ కొట్టేశారు. పండగ చేస్కోండి. :-p

మహీధర రెడ్డి said...

వర్షం సినిమాలో ప్ర భాస్,త్రి ష లను వర్షం కలిపినట్టుగా మీ కాలనీ వాస్త వ్యులను కూడా కలిపింది కదా వర్షం. నాకో సందేహం, ఆ శుద్ధి చేసిన నీళ్ళు మీరంతా ఈ పాటికి తాగేసుంటారు కదా మరి ఇపుడెలా వుంది అక్కడి వాతావరణం ? ఈసారి స్వతంత్ర్య దినోత్స వానికి సిద్ధ మైపోయారా? ఎప్పటిలాగానే ఈ సారి కూడా మీ పోస్టు అదిరింది. మీరు ఇదే వేగంతో ఇంతే సరదాగా వ్రా స్తూ నే వుండగలరని నా మనవి.

కృష్ణప్రియ said...

రంగావఝ్యల శేషాంజనేయాధాని శర్మ గారు,

ధన్యవాదాలు! :))
నంబర్లు ఎందుకు రాసానంటే.. మనుషుల పేర్ల కంటే బొత్తి గా కైదీలని గుర్తు పెట్టుకున్నట్టు వాళ్ల ఇంటి నంబర్లతో సంభోదించుకునే సంస్కృతీ వచ్చిందని చెప్పటం కోసం..

@ చాణక్య,

:) అవునా? ఎంత చాన్స్ కొట్టేశాను? తప్పక సెలబ్రేట్ చేసుకోవాలి .. On a serious note.. చాలా చాలా థాంక్స్!

@ మహీధర్,

:) యెస్. 'ఆ వర్షం సాక్షి గా..' Rain water recycling plant ఫిల్టర్ చేసి పారేసినట్టుంది.. ఇంతవరకూ తర్వాత గొడవలు రాలేదు. కాకపొతే కొత్త అసోసియేషన్ కథా కమామీషూ త్వరలో రాస్తాను.

చాణక్య said...

: ))))))))))))

తృష్ణ said...

కృష్ణ ప్రియ గారూ, కొద్దిగా ఆలస్యంగా జన్మదిన శుభాకాంక్షలు.

తృష్ణ said...

చాలా బావుందండీ టపా.

"ప్రత్యేకం గా టీ పెట్టాలంటే వేన్నీళ్ళు కాచక్కరలేదు. కుర్చీల మధ్యనుండి అలా కెటిల్ తీసుకెళ్తే చాలు. పొగలు కక్కే చాయ్ తయార్!
ఈ వాక్యం సూపర్ !

"ఇరవై ఎనిమిదో ఆయనకి పండక్కైనా, తద్దినానికైనా షార్ట్స్ లోనే తిరగటం అలవాటు."
మగవాళ్ళేమిటండి ఆడవాళ్ళు కూడా వయోభేదం లేకుండా గుళ్ళకు కూడా ఇలాంటి డ్రెస్సుల్లో వచ్చి భయపెట్టేస్తూంటేనూ..:))

కృష్ణప్రియ said...

@ తృష్ణ గారు,
ధన్యవాదాలు.
నిజమే :) ఎవరైనా ఎక్కడికైనా ఎప్పుడైనా.. షార్ట్స్ తోనే రెడీ..

Naveen Choudary said...

ముందుగా అంధ్రజ్యొతి కి ధన్యవాధాలు మిమ్మల్ని మాకు పరిచయం చెసినందుకు, మీ బ్లాగ్ చాల బాగుంది. ఈ రొజు సాయంత్రం అంత మీ బ్లాగ్ చదువుతునె వున్నా.

బాల గోపాల్ said...

కృష్ణ ప్రియగారూ,
చాలా సరదాగా వ్రాసారు. ఒక్క request, బొమ్మలని text మధ్యలో కాకుండా sideలో పెడితే చదివేప్పుడు flow break అవకుండా ఉంటుందని నా అభిప్రాయం.

Many thanks

teresa said...

It's a pleasure reading your posts!
Love the illustartions :)

కృష్ణప్రియ said...

@ నవీన్ చౌదరి గారు,
స్వాగతం! ధన్యవాదాలు. చాలా లేట్ గా సమాధానం చెప్తున్నాను. ఏమీ అనుకోవద్దు..
@ బాల గోపాల్ గారు,
ఇకపై తప్పక మీ సలహా పాటిస్తాను.
@ teresa,
thanks a bunch!

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;