Friday, August 19, 2011

మామూలు మనిషి(?) - పెద్దక్క










మొదటి సారి ఆవిడని నేను ఇంటర్ లో ఉండగా చూసా! ముందు కూడా చేసే ఉంటాను.. కానీ గుర్తు పెట్టుకోలేదు..


దూరపు చుట్టాల పెళ్లి.. ఎవ్వరూ తెలిసిన వాళ్లు లేరు.. మా అమ్మ ఒక్కత్తే రాలేక నన్ను రమ్మందని వచ్చాను కానీ పెద్ద బోర్. తను ఎవరితోనో మాట్లాడుతుంటే విసుగ్గా.. దిక్కులు చూస్తున్నా.. పెద్ద గుంపు - మధ్యలో ఉందావిడ. ఒక డెబ్భై ఏళ్లయినా ఉంటాయి. గట్టిగట్టిగా ఏవో జోకులేస్తోంది. ఆవిడ వాక్యం ఆపుతూనే అలలు అలలు గా నవ్వులు మొదలు. నవ్వుల ప్రకంపనాలు తగ్గుతూ ఉన్నాయి అనుకుంటుండగానే ఇంకో అల.. మళ్లీ.. తిరిగి ఇంకొంచెం ఎత్తులో వచ్చినట్టు.. ఎవరా అని చాలా కుతూహలం గా ఆ గుంపు వైపు నడిచాను. నల్లగా లావుగా కనీసం ఒక సెంటీ మీటర్ మందం కళ్లద్దాలు, నీటు గా కాశే బోసి కట్టిన తొమ్మిది గజాల జరీ చీర,.. నవ్వుతోంది ఆవిడ. నవ్వుతున్నప్పుడు పొట్ట పైకీ కిందకీ.. ఊగుతూ.. గమ్మత్తుగా.. చుట్టూ గుంపు ని చూశాను.. కొద్ది మంది తలలు నెరసిన వారు, మరి కొందరు ప్రౌఢవయస్కులు, ఇరవైలలో అమ్మాయిలూ, అబ్బాయిలూ, కొందరు టీనేజర్లు.. అయితే ముఖ్యం గా ఆకర్షించింది ఆవిడ చుట్టూ చేరిన అభిమానులలో పదేళ్ల లోపల వారు కూడా.. ఇంత మందికి ఆవిడ ఏం చెప్తే అన్ని వయసుల వారిని కడుపుబ్బ నవ్వించ గలుగు తున్నారో ..






ఎంటబ్బా.. అంతలా ఏమి చెప్తున్నారో.. అని ఒక చెవి అటు పడేసా..


‘ఇదిగో ఆ చారల చొక్కా, ఎర్రంచు పంచె ని పైకి ఎగతోసుకుంటూ, ముక్కు తుడుచుకుంటో, పరిగెడుతున్నాడూ .. వాడే నీ పెళ్లి కొడుకూ అన్నారు.. ఛీ. నేను చేసుకోను వాడినీ... అని ఏడ్చాను.. ఎందుకే? అని అడిగితే.. వాడు నా దగ్గర అన్నీ కొట్టేస్తాడు. నా చేత పనులు చేయిస్తాడు.. మొన్న నాకు మొట్టికాయ వేసాడు.... అని మొండికేసి కూర్చుంటే ’. పెళ్లయ్యాక నువ్వు ఇంతకి అంత పగ దీర్చుకుందువు గాని రామ్మా! నీకు కజ్జికాయలు పెడతా. జడ గంటలు కొనిపెడతా.. పల్లకీ ఎక్కించి ఊరేగిస్తా’ ఇలాగ మభ్యపెట్టి నన్ను వారికి కట్టబెట్టారు... ‘


నవ్వులు.


‘అప్పుడు తాతగారికి ఎంత వయసు? నాయనమ్మ గారూ?’ అని అడుగుతోంది ఒక అమ్మాయి.


‘వారికి పదకొండూ, నాకు ఎనిమిదీ’






మళ్లీ నవ్వులు.


;వారికీ నాతో పెళ్లి ఇష్టం లేదు. ఆ ఊర్మిళ నా ? చస్తే చేసుకోను అనేసారు..’


‘అబ్బా! మీ పేరు ఊర్మిళా! ఎంత మోడర్న్ పేరు.. మా పేర్లు ఇంకా పాత మోడల్ పేర్లు ప్చ్! ‘ అని నిట్టూర్చింది ఒక పిల్ల.


‘అబ్బే .. అంత మోడర్న్ కాదు. ‘తన్హా తన్హా అమ్మాయి’ పెట్టుకుంది కాబట్టి మీకు సడన్ గా గొప్పగా అనిపిస్తోంది. సీత పేరు ఎంత పాతదో.. ఆవిడ చెల్లెలి పేరూ అంత పాతదే!’ అనేసింది.


మళ్లీ..కథ కి వచ్చి..


‘అప్పట్లో శారదా ఆక్టు వచ్చింది కదా బాల్య వివాహాలు నేరం.. !’ అందుకని మా నాన్నగారు పెళ్లి యానాం లో చేయించారు. ‘


‘యానామా? ఎందుకు?’ అడిగింది ఇంకో పిల్ల.


‘ఏం చదువుకున్నావు? చరిత్ర చెప్తున్నప్పుడు వెనక బెంచీ లో కూర్చున్నావా? ‘ అని కాసేపు ఏడిపించి.. యానాం లో ఇంగ్లిషోడి చట్టం లేదు గా.. అది ఫ్రెంచ్ దేశం కదా.. కానీ అక్కడికి వెళ్లేవాళ్లు అందరూ పెళ్లి కోసం వెళ్లే వారే. మా నాన్నగారు అనుమానం రాకుండా విడివిడిగా తీసుకెళ్లి అక్కడ పూస్తే కాస్తా కట్టించి తెచ్చి మళ్లీ మా ఊళ్లో ఇంకోసారి రాములవారి కోవెల కెళ్లి దణ్ణం పెట్టించి...


‘లేదు లేదు నాయనమ్మగారు.. మీరు మరీ అలా ‘కట్టే కొట్టే తెచ్చే’ అనిపించేస్తే మేమొప్పుకోం.. అని గొడవ..


ఇక ఆవిడ పెళ్లి కథ రసవత్తరం గా చెప్తోంది.. ఒక అరగంట పైగా.. చాలా కథల్లో, పాత కాలం నవలల్లో చదివినా.. కొత్తగా అనిపించింది. ఆవిడ కి అద్భుతమైన వాక్చాతుర్యం ఉంది.


ఈలోగా.. మా అమ్మ వచ్చేసింది. ‘పద పోదాం.’ అంటూ.. నేనూ లేచి నా వస్తువులేవో తెచ్చుకుని వచ్చేస్తూ ఉండగా.. ఆ ముసలావిడకి ‘ఓహ్ పిన్నీ..వెళ్ళొస్తా..’ అని చెప్పి రావటం కనిపించింది. బయటకి వస్తున్నప్పుడు చాలా ఆసక్తి గా ‘ఆవిడ ఎవరమ్మా? అంతలా అందరినీ నవ్విస్తోంది?’ అని అడిగాను. ‘అయ్యో నీకు తెలియదా.. ఆవిడే మా పెద్దక్క! ‘ అంది అమ్మ. ‘మీ అక్కా?’ అని అనుమానం గా చూశాను. తను నవ్వేసి..’అబ్బే.. కావలసిన వాళ్లు.. దూరపు చుట్టాలు.. వాళ్ల పేద్ద కుటుంబం లో అందరికన్నా పెద్ద ఈవిడ. అందుకని అందరికీ ‘పెద్దక్క’ అన్న పేరు అలవాటైపోయింది.






ఓహో అనుకుని మళ్లీ మా మాటల్లో పడిపోయాం. మళ్లీ ఆవిడ విషయం ఆలోచించలేదు, అంత సమయమూ లేదు. నా లోకం లో నేను. ఒక రోజు మా బంధువులావిడ పోయిందని ఎవరింటికో వెళ్లాం. అక్కడ మళ్లీ కనపడిందావిడ. ‘అఅరే.. ఊర్మిళమ్మగారు..’ అని ఉత్సాహపడ్డాను. ఒక విధం గా దుఖం గా ఉన్న వాతావరణాన్ని ఆవిడ తేలిక పరిచేసారు. అసలు ఆవిడ వచ్చారని తెలిసి అందరూ లేచి చుట్టూ కూర్చుని ఆ కబురూ, ఈ కబురూ చెప్తూ తేలిక పడ్డారు. ఈలోగా నాకు ఒకటి అర్థమైంది.. ఆవిడ ఎక్కడికెళ్లినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని. చుట్టూ చేరి జనాలు నవ్వుతూ, తేలిక పడతారని. అంతే కాదు. ఆవిడ ఎవ్వర్నీ నొప్పించదని.. ఆవిడ కి కళ్ళు సరిగ్గా సరిగ్గా కనపడవని కూడా అర్థమైంది.


మా మామ కూతురి ఫోటో చూసి.. ‘అబ్బా.. మన శీను కూతురే!!’ ఎంత అందంగా ఉందే! పుత్తడి బొమ్మ.. అచ్చం శీను లా లేదూ..పూరీ జగన్నాదుడి లా ఆ కళ్ళు? ఎంత బాగుంది అసలు?’ అని ఒకటే గొడవ..


ఎవరో కుతూహలం గా చూసి ‘ఏంటి బామ్మ గారూ మీరు మరీనూ! ఫోటో తిరగేసి పట్టుకుని అమ్మాయి బాగుందంటారు?’ అన్నారు నవ్వాపుకుంటూ..


దానికి ఆవిడ లేశ మాత్రం కూడా సిగ్గు పడకుండా..ఫోటో వెనక్కి తిప్పి ..’అబ్బ్బ్బ్!! వెనక్కి తిప్పితే ఇంకా బావుమ్దేవ్!! “ అని.. ఆ బుగ్గలేంటే బాబూ.. ఇడ్లీల్లా!!!’ అందరూ ఒకటే నవ్వు!


ఆశ్చర్యం వేసింది. అసలు అంత రెడ్ హాండెడ్ గా పట్టు బడ్డా ఆవిడకి సిగ్గు గా అనిపించలేదా? అని.. పోన్లే పెద్దావిడ.. అనుకున్నాను.






చావింట్లో అందర్నీ చచ్చేలా, కన్నీళ్ళు వచ్చేట్టు నవ్వించి, వెళ్తూ వెళ్తూ..గంభీరం గా వెళ్లి, పోయినావిడ కూతురి భుజం మీద చేయి వేసి.. గద్గదం గా ‘అమ్మాయ్! మీ అమ్మగారు.. మహా భక్తురాలు, పండితురాలు.. ఆవిడ గురించి ఇంక బెంగెట్టుకోకు.. ఒకరి మీద ఆధారపడను.. అనుకుని, గట్టిగా ఉండి నలుగురికి ఉపయోగ పడే మనసూ, శక్తీ ఉన్నంత వరకూ మాత్రమే ఉండి ‘అబ్బా.. ఎప్పుడు పోతుందీ.. అనిపించుకోకుండా ‘అయ్యో పోయిందా’ అని అయిన వారందరిచేతా.. అనిపించుకుంది. నాకు కుళ్ళు గా ఉంది. నాకీ భాగ్యం వస్తుందా రాదా అని...’


ఇలాంటి మాటలు చెప్తూ ఒక్కటంటే ఓకే నిమిషం ఓదార్చి.. మళ్లీ.. అందరూ ఒక్క క్షణం సీరియస్ అయ్యారని తెలుసుకుని మళ్లీ ‘అన్నట్టు మొన్నేమైందనుకున్నావ్! ‘ అని తన సహజ హాస్య ధోరణి లోకి పడిపోయింది.. నేనూ.. ‘మొన్నేమైందో’ తెలుసుకుందామని ఆవిడ వెంక గుంపు లో చేరిపోయాను..






ఆవిడ చెప్పటం మొదలు పెట్టింది.. ‘అప్పుడు నాకా.. పదిహేను...’






(ఇంకా ఉంది)






ఏంటి? కొత్తగా సీరియల్ స్టోరీ లా? అనుకుంటున్నారా?


కోట్లాది ప్రపంచ జనాభాలో నాకు తెలిసిన మనుషులు, కొన్ని వేల మంది? నేను తెలిసిన వారూ అదే సంఖ్యలో? (కొద్దిగా తక్కువ లెండి.ఉదా: NTR,నాగేశ్వరరావు గార్లు నాకు తెలుసు..వారికి నేను తెలియదు గా? ).. నన్ను ప్రభావితం చేసిన వారు కొందరు. నాకు బాగా తెలిసి వారి లో అతి కొద్దిమంది ఎలాంటి వారంటే అందరికీ మామూలు మనుషులు కావచ్చు! నాకు మాత్రం.....


పది దాటింది బాల్యం ఇంకెక్కడుంది? ఇరవై దాటింది.. ఇక సెటిల్ అయిపోవాలి, ముప్పైల్లో పడ్డాం.. ఇంకేం మిగిలింది? నలభై అయింది జీవితం అయిపొయింది.. అనుకోకుండా.. ౯౦ దాటినా..’నేను, నా జీవితం.. ఈ రోగం నుండి బయట పడితే చాలు.. అన్నీ చూడచ్చు అన్నీ చేయచ్చు...’ అనుకుని జీవితాన్ని పరిపూర్ణం గా ఆస్వాదించిన ఒక వృద్ధురాలి నిజం జీవితమే మా పెద్దక్క కథ!


నా జీవితం లో ఒక ఇరవై ఏళ్లు నాతో ఎంతో సన్నిహితం గా మసలి నన్ను ప్రభావితం చేసిన ఒక మహిళ కాబట్టి, నాకు తెలిసిన విషయాలు చెప్పాలని ప్రయత్నమే ‘మామూలు మనిషి? పెద్దక్క’ కథ.





37 comments:

శరత్ కాలమ్ said...

ఆసక్తికరంగా వుంది. కానివ్వండి (అంటే ఇంకా వ్రాయండి అని)

ఇందు said...

సూపర్బ్ ఎక్సెలెంట్! చాలబగుందండీ :) నేను మొదట 'ఇంకా ఉందీ అని పెట్టారేంటీ? అనుకున్నా :) కానీ,ఆ చివర నాలుగు ముక్కలు ఇంకా ఆసక్తి పెంచాయి :) మరి నెక్స్ట్ పార్ట్ కోసం మేము మండే దాకా ఆగాలా????

విరిబోణి said...

Good one :) Waiting for next post.

Lalitha said...

Krishnapriya,

I remember reading about your Madras Pinni garu in Vihanga.

Now I enjoyed reading about your Peddakka garu.

Thank You for sharing about such wonderful persons.

Best,
Lalitha TS

Mauli said...

మీ బ్లాగు కూడా మీ పెద్దక్కగారి (బ్లాగు)లా ఉ౦టు౦ది సుమ౦డీ. ఊరికే చదవడ౦ మొదలుపెట్టినా స్ప౦దన తెలియచెయ్యకు౦డా వెళ్ళడ౦ కష్టం. అలా వ్యాఖ్యల రూపం లో మీ చుట్టూ చేరిపోతున్నాం :)

పలకరి౦చడనికి వెళితే మాత్రం నేను మీ పెద్దక్క గారిలానే ఉ౦టాను. అన్ని ము౦దే తెలిసినపుడు వారికి కాస్సేపు 'మరపు' తెప్పి౦చడ౦ బావు౦టు౦ది నాకు, చివరికి బయలుదేరేప్పుడు మాత్రం అప్పటిదాకా మనతో మాటల్లో పడిపోతారు కదా! వారికి మనసు తేట పడి, మనికి వీజీ అన్నమాట ఎ౦దుకు ధైర్యం తెచ్చుకోవాలో చెప్పడ౦.

శ్రీ said...

గల గలా నవ్విస్తూ సరదాగా ఉన్నాయి మీ పెద్దక్క కబుర్లు. మా పెద్దమ్మ కూడా ఇలాగే ఉండేది. మిగతా విశేషాలు తొందరగా రాసేయండి....

Sravya V said...

ఓహ్ బావుంది , రాయండి రాయండి మేము మీ పెద్దక్క గారి గురించి తెలుసుకుంటాం !

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

పెద్దక్క గారి Reaction: ఏంటి, మన క్రిష్ణ రాసిందే.. అబ్బో అబ్బో ఎంత బాగా రాసిందే..! ఆ అక్షరాలు చూడూ ఎంత చక్కగా ముత్యాల్లా ఉన్నాయో !
ఓహ్హ్ .. కంప్యూటలోనా .. ఎంత చక్కగా టైపు చేసిందో..నేనిప్పటివరకూ ఇంత అందమైన టైపురాత చూళ్ళేదు
:))

Jokes apart, nice idea to write on normal people.

లత said...

బావుందండీ.పెద్దవాళ్ళయ్యాక ఇలా ఉంటే ఎంత బావుంటుందో.కొందరుంటారు కనపడితే చాలు రోగాలు,సమస్యలు తప్ప చెప్పరు

Kathi Mahesh Kumar said...

జీవితాల్ని మలుపుతిప్పడానికీ, ఆలోచనల్ని మెలితిప్పడానికీ, భావజాలాల పురివిప్పడానికీ అద్భుతమైన ఘటనలూ, అద్వితీయమైన వ్యక్తులూ అవసరం లేదు. ఆశ్చర్యం అనిపించే పరిస్థితులూ, అబ్బురపరిచే మనుషులూ చాలు. అవన్నీ “సామాన్య” జీవితం నుంచే వస్తాయి. వాటి ప్రభావాన్ని బట్టీ వచ్చాకనే అసామాన్యం అయిపోతాయి. మొత్తానికి మీ వ్యక్తిత్వాన్ని ఇలా జీవించేలా ప్రేరేపించిన ఒక వ్యక్తి గురించి పంచుకునే ప్రక్రియ మొదలుపెట్టారన్నమాట. బాగుంది. జీవితంలో ఇది చాలా అవసరం కూడాను.

మనసు పలికే said...

మీరు పెద్దక్క గురించిన టపాలు పూర్తి చేసేలోగా, ఇక్కడ ఎంతోమందిని పెద్దక్క ప్రభావితం చేస్తారని అనిపిస్తుంది కృష్ణప్రియ గారు.. త్వరగా తరువాత భాగం రాసేద్దురూ..

కొత్తావకాయ said...

"బావుంది, బాగా రాసారు, అవును నిజమే" అని ఊరుకోలేను. కొన్ని స్పందనలు మాటల్లో పెట్టేవి కావు.
ఎదురుచూస్తున్నాను, రెండో భాగం కోసం. ఇప్పటికి ఇంతే!

రవికిరణ్ పంచాగ్నుల said...

చాలా బాగుంది.. పెద్దక్కయ్యగారి గురించి ఇంకా (చాలా) తెలుసుకోవాల్నుంది. మీదే ఆలశ్యం..

శిశిర said...

మరో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నానన్నమాట. బాగుందండి. తరువాతి భాగం కోసం ఎదురుచూస్తూ..

ఆ.సౌమ్య said...

అబ్బ...తియ్యటి చలిమిడి నోటి దాక తెచ్చి, నెయ్యి వాసన చూపించి మళ్ళీ వెనక్కి లాగేసుకున్నట్టు ఉందండీ!
చాలా మంచి విషయం రాస్తున్నారు. నాదీ మహేష్ గారి మాటే.....మిగతా భాగాలు కూడా రాయండి.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

>> ఒక్కటంటే ఓకే నిమిషం "ఓదార్చి.."

What nonsense is this ? !!!!

గొడవలై పోతాయ్ ఏమనుకున్నారో ! మీరు, మీ పెద్దక్క అట్లా డిసైడ్ చేస్తారా ? who are you to decide? ఓదార్చడం ఒక్క నిమిషమేంటసలు ? How ?? Tell me, Tell me..

ఓదార్పు అనేది కొన్ని సంవత్సరాలు జరగాలి. దానికొక ప్రత్యేకమైన పద్దతుంది. ఎందుకు ? ఏంటి? ఎలా? లాంటి చచ్చు ప్రశ్నలు నన్నడగొద్దు. You know whom to ask such questions :))))

తార said...

:)

కొత్తగా ఉన్నటున్నది :)

తార said...

:)

కొత్తగా ఉన్నటున్నది :)
మిగతా భాగాలకోసం ఎదురుచూస్తున్నా

sphurita mylavarapu said...

interesting...సాధారణం గా మీ పరిశీలనలు చాలా బావుంటాయి...verity serial అన్నమాట...తరువాయి భాగం ఎప్పుడో కాస్త చెప్పేస్తూ వుంటే నాకులాంటి వాళ్ళకి సౌకర్యం గా వుంటుంది...:)

@weekend politician...LOL

హరే కృష్ణ said...

చాలా బావుంది !
Waiting for the Next parts

మురళి said...

నా జీవితంలోనూ ఇలాంటి వాళ్ళు కొందరున్నారు కాబట్టి, కొంత వరకూ ఊహించగలనండీ వీళ్ళ ప్రభావం.. సరదాగా ఉండడం అనేది ఓ జీవలక్షణం.. కాకపొతే జీవులందరిలోనూ కనిపించదు ఎందుకో :( అందరిలాగే నేనూ తర్వాతి భాగం కోసం వెయిటింగ్..
ఓ చిన్న మాట.. ఏమీ అనుకోకుండా ఫాంట్ సైజు కొంచం పెంచరూ.. అలాగే వ్యాఖ్యలు ఫుల్ పేజికి మారిస్తే ఇంకొంచం సౌకర్యంగా ఉంటుంది, ఈ బ్రౌజర్ చిక్కులు లేకుండా..

కృష్ణప్రియ said...

@ శరత్,
థాంక్స్, రాస్తున్నా..

@ ఇందు,
థాంక్స్! ఎప్పుడు సమయం చిక్కితే అప్పుడు రాసేస్తా. ఆలోచించటానికి ఏమీ లేదుగా..తెలిసిన కథే.

@విరిబోణి,
థాంక్స్!

@ లలిత T.S గారు,
థాంక్సండీ. ఆవిడ లో నాకు కనపడిన మంచి, చెడూ అన్నీ రాద్దామని.. ఆవిడ గురించి నేను నిజాయితీ గా ఎంత రాయాలంటే అంత నిజాయితీ గా నాగురించీ రాసుకోవాలి. ప్రయత్నిస్తాను.

కృష్ణప్రియ said...

@ మౌళి,
హ్మ్..
@ శ్రీ, శ్రావ్య,
థాంక్స్! తప్పకుండా!

@ WP,
Yes, నాకు తెలిసిన మామూలు మనుషుల గురించి రాద్దామనే ఈ ప్రయత్నం. నిజానికి గొప్ప వాళ్లంటే ఏంటి? ఆలోచించ దగ్గ విషయమే

స్నిగ్ధ said...

నెనూ మొత్తం చదివి 'ఇంకా ఉందీ అని రాసారేమిటబ్బా అనుకున్నా..
చివరి భాగం చదివేప్పటికి ఆసక్తికరం గా అనిపించింది...చివరి వాక్యాలు మనసుకి హత్తుకుంది...పెద్దక్కయ్య గారి గురించి తెలుసుకోవాలని ఉంది... వెయిటింగ్....

కృష్ణప్రియ said...

@ లత గారు,
అది కరెక్టే.. చాలా మంది రోగాలు, కష్టాలు అవీ చెప్పటం చేస్తూనే ఉంటారు. వాళ్లని భరించటం కష్టమే. ఈవిడ ఆ టైప్ కాదు . అలా అని.. Ms. Perfect కూడా కాదు.

@ మహేశ్ కుమార్ గారు,
చాలా బాగా చెప్పారు. కాకపొతే 'ఇలా జీవించేలా ప్రేరేపించిన వ్యక్తీ' .. హ్మ్ అది నిజం కాదు. కొంత నేర్చుకున్నాను నిజమే కానీ ఆవిడ వల్లే ఇలా (ఎలా?) జీవిస్తున్నాను అనుకోవట్లేదు. నెమ్మది గా చెప్తూ పోతాను....
@ అపర్ణ,
హ్మ్. చూద్దాం :) రాస్తాను. ఒకటి రెండు రోజుల్లో..
@ కొత్తావకాయ,
గుడ్. రెండో భాగం తో అయిపోతుందనుకోను.. మోస్త్లీ సోమ వారానికి రాసేస్తా..

కృష్ణప్రియ said...

@ శిశిర,
థాంక్స్.. చూద్దాం.. స్ఫూర్తి దాయకమౌతారో లేదో... తరువాయి భాగం లో..
@ సౌమ్య,
థాంక్స్! రాస్తున్నా ..
@ WP,
LOL. పాత కాలం మనిషి కదా అందుకని కొత్త కాలపు దుఖాలు, రీతులు తెలియని మనిషేమో.
@ తార,
థాంక్స్! రాస్తున్నా..

కృష్ణప్రియ said...

@ స్ఫురిత,
:)థాంక్స్!. నా వీలుని పట్టి మొదటి ప్రాధాన్యత దీనికే.
@ హరేకృష్ణ,
థాంక్స్.. రాస్తున్నా..
@ మురళి గారు,
మీరు చెప్పిన విధం గా కామెంట్ బాక్స్ మార్చాను. ఫాంట్ సైజ్ కూడా పెంచాను.
@ స్నిగ్ధ,
తప్పక తెలుసుకోవలసిన మనిషే. రాస్తున్నా..

sri nageswari said...

ఇలా సరదాగా కబుర్లు చెప్పె వరంటె నాకు ఇష్టం. నేను కూడ ఎదొమాట్లాడుతుంట, మీ పెద్దక్క గురించి బాగా రాసారు.

buddhamurali said...

కృష్ణ ప్రియ గారు మీ పెద్దక్క చాలా బాగున్నారు. నాకు కొంత చదివే అలవాటుంది. చరిత్రకుడా కొద్దిగా చదివాను యానం గురించి తెలుసు నిషేధం ఉన్నప్పుడు మనవాళ్ళు అక్కడకు వెళ్లి మందు కొట్టడం కూడా తెలుసు కానీ అక్కడ బ్రిటిష్ చట్టం అమలులు లేదని ఇప్పటివరకు తెలియలేదు. నిజమే కదా ఫ్రెంచ్ వాడి పాలన ఉన్న ప్రాంతం లో బ్రిటిష్ చట్టాలు ఎందుకుంటాయి . బ్లాగ్స్ వల్ల ఇలాంటివి చదివే అవకాశం ఉంటుంది. బ్రిటిష్ వాడి పాలనా కాలం లో మనదేశం లో ఫ్రెంచ్ వాడి పాలన సాగుతున్న ప్రాంతాల్లో ఇలా బాల్య వివాహాల వంటి అంశాలపై మరింతగా రాస్తారని ఆశిస్తున్నాను. అక్కినేని, రామారావు లే గొప్ప కాదండి . మన జీవితం లో మనపై బాగా ప్రభావం చూపిన వారి గురించి రాస్తే చదవడానికి బాగుంటుంది. మీ పెద్దక్కల సరదాగా ఉండే వారిని అంతా ఇష్టపడతారు . వృత్తిలో బాగంగా ఒక రకంగా నేను రోజూ శత్రు శిభిరం లోకి వెళ్ళాలి ఐతే నాకున్న కొద్దిపాటి హాస్య ప్రియత్వం వల్ల శత్రువులుకుడా ఇష్టపడతారు

చాతకం said...

చాలా బాగున్నాయండి మీ పెద్దక్క ముచ్చట్లు.

Anonymous said...

అదరగొట్టారు. మొత్తానికి చాలా బాగా రాస్తున్నారు

కృష్ణప్రియ said...

@ శ్రీ నాగేశ్వరి గారు,
థాంక్స్! సరదా కబుర్లు ఆవిడ లో ఒక కోణం మాత్రమే. ఇంకా రాస్తున్నాను. రెండో భాగం...

@ బుద్దా మురళి గారు,
నాకూ ఆవిడ వల్లే తెలిసింది. అంటే ఆ విషయాని గురించి మనం పెద్దగా పట్టించుకోక పోవటం వల్ల.. అనుకుంటున్నాను.
మీరు చెప్పింది నిజమే అని నేనూ నమ్ముతున్నాను. మనకి ఎవరు బోధించటం ద్వారానో, జీవించి చూపటం ద్వారానో మార్గనిర్దేశం చేస్తారో, వారే మనకీ గొప్ప.
@ చాతకం,
థాంక్స్!
@ ఇల్లు మారిన పక్కింటబ్బాయి,
:) థాంక్స్!

తృష్ణ said...

తరువాతి భాగం ఏదండీ...?
నా లైఫ్లో నన్ను ఇంఫ్లుయెన్స్ చేసిన, గుర్తుండిపోయిన మనుషుల గురించి నేను కూడా నా బ్లాగ్లో 'కొందరు వ్యక్తులు' అనే లేబుల్ లో రాస్తూంటాను.. చూశారా?

కృష్ణప్రియ said...

@ తృష్ణ,

ఏదీ రాద్దామనుకుంటుండగానే కుచ్ కుచ్ హోతా హై, ఊరి ప్రయాణం.. రాసేస్తా త్వరలో. మీరు ఇచ్చిన లేబుల్ లో ఇవ్వాళ్ళే చూస్తున్నాను.

చాణక్య said...

బావుందండి. పెద్దక్క సీక్వెల్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? : )

కృష్ణప్రియ said...

@ చాణక్య,

ఆఫీసు పని ఉప్పెన లా ముంచెత్తి.... బ్లాగ్ వెనక పడింది. త్వర లో రాస్తా

వేణూశ్రీకాంత్ said...

ఓహ్ ఆ మధ్య మొదలెడతానన్నారు వెంటనే మొదలెట్టేశారా... నేనే చదవడం ఆలశ్యం చేశాననమాట :-(
చాలా బాగా రాస్తున్నారండీ.. మీరు ఇచ్చిన ఉపోద్ఘాతం వింటేనే చాలా ఆసక్తి పెరిగింది. ఒకప్పుడు ఇలాంటి వ్యక్తులను తరచుగా చూసేవాళ్ళమేమో కానీ ఈ మధ్యకాలంలో చాలా అరుదుగా కనిపిస్తుంటారు.. మీరు చెప్పే మీ పెద్దక్క గారి కబుర్లు వినడానికి అందరితో పాటు నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను :-)

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;