Wednesday, October 19, 2011

పండగ, సకల జన సమ్మె, పెళ్లి పిలుపులు


                         మా ఇంటి పక్క వారి ఇంటి ముందు పెట్టిన బతుకమ్మలు.
తమ్ముడి పెళ్లి.. పిల్లలకి ఎలాగూ దసరా సెలవలు..వారం సెలవ పెట్టా. హైదరాబాద్ అంతా తెలంగాణా సకల జన సమ్మె అని బస్సులు నడవట్లేదు, రైల్ రోకోలు, ఆఫీసులు లేవు, స్కూళ్లు బందు. ముందే చేసుకోవాల్సింది పనులు అనచ్చు కానీ ముందు అంతా మూఢాలు. కనీసం పెళ్లి పత్రిక అయినా అచ్చేయించటానికి లేదు. అసలు పెళ్లి పిలుపులు ఎలా జరిపించాలో, ఒక వేళ పిలవగలిగినా, పిలిచిన బంధువులు ఎలా వస్తారో.. అమ్మా వాళ్లకి ఒకటే కంగారు. ఈ బస్సుల బంద్, అవీ విన్నాక ఒక వారం రోజులు హైదరాబాద్ నుంచి పని చేస్తానని బాసు గారికి ఈ-మెయిల్ చీటీ రాసి పది రోజుల ముందే రైలెక్కేసా. మా వారు తర్వాత వస్తానన్నారు. ఉన్న నలుగురికీ రెండు భోగీల్లో సీట్లు. దానికే కష్టం గా ఉంటే.. ఆటోలు నడవకపోవచ్చు అని రైల్లో రూమర్. ముందు రోజు బంద్ ట.

సాధారణం గా నేను హైదరాబాద్ కి వస్తే ఎవ్వరూ స్టేషన్ కి రావటం జరగదు. ఎవ్వర్నైనా అసలు ‘ఆటోలు తిరుగుతున్నాయా’ అని అడిగినా స్టేషన్ కి వచ్చేస్తారు. ఎందుకు ఇబ్బంది పెట్టటం.. అని ఊరుకున్నా. కానీ అందరూ ‘అయ్యో మీకు ఎవ్వరూ రారా? ‘ అని అడుగుతుంటే కాస్త భయమేసింది. ముసలి అత్తగారు, చిన్నపిల్లలు, లగేజ్ లో నగలు, పట్టు చీరలు,.. సరే, ‘మొహమాటం తో స్టేషన్ కి రాడు’ అని నమ్మకమున్న ఫ్రెండ్ కి ఫోన్ చేసి అసలు పరిస్థితి ఏంటి? అని అడిగాను. ‘ఏమీ లేదు.. బంద్ జరిగింది ఈరోజు! రేపు అంతా ఓకే. బోల్డు ఆటోలు తిరుగుతాయి. అంతగా ఏమీ తిరగక పోతే ఏముంది ఈ నంబర్ కి కాల్ చేయి టాక్సీ వచ్చేస్తుంది.. అని అన్నాడు. ‘హమ్మయ్య’ అనుకుని పడుకున్నా. ఉదయాన్నే ఫోన్ మోగుతోంది. ఎత్తితే,.. ‘ఏ డబ్బా లో ఉన్నావు?’ అని నా ఫ్రెండ్! ‘వార్నీ!’ అనుకున్నా. కానీ చాలా రిలీఫ్ గా అనిపించింది.

స్టేషన్ లోంచి బయటకొస్తుంటే.. మామూలు గానే ఆటోల వాళ్లు చుట్టుముట్టటం .. పర్వాలేదు అనిపించింది. రోడ్డంతా మామూలుగానే,.. దుకాణాలూ తెరిచే ఉన్నాయి. ఏ గల్లీ చూసినా దుర్గా దేవి విగ్రహాలు. ఆశ్చర్యం వేసింది. ఏది ఆగినా పండుగ మాత్రం ఆగలేదన్నమాట. ఇంటికొచ్చాక మద్యాహ్నం మళ్లీ స్కూటర్ మీద బయల్దేరాను సిటీ లోకి ఏదో పెళ్లి పని తో.. సాధారణం గా బస్సులతో, బస్సుల కోసం ఎదురు చూసే ప్రయాణికులతో కళ కళ లాడే వీధులు విశాలంగా, బోసి పోయి.. కార్లు, మోటార్ సైకిళ్లు మాత్రమే నడుస్తూ.. ట్రాఫిక్ సగమైంది అనిపించింది. అసలీ రోడ్లు ఇంత ఖాళీ గా చూసి దశాబ్దాలు అయ్యాయి అనిపించింది. ఇరవై ఏళ్ల క్రితం ఇలాగ ఖాళీ వీధుల్లో తిరిగాం, తర్వాత మళ్లీ ఇప్పుడు.. కానీ అప్పుడు బస్సులు రోడ్డు నింపితే ఇప్పుడు కార్లు నింపాయనిపించింది.


బతుకమ్మలు ఆడుతూ మా ఏరియాలో ఆడవారు.

మన సంస్కృతి,సాంప్రదాయాలు నశిస్తున్నాయని, మన పండుగలు జరుపుకోవటం తగ్గిపోయిందని బాధపడే జనాల్లో నేనూ ఒకదాన్ని. దసరా ముందు బజారు కి వెళ్దామని బయలుదేరాం. దోవలోనే ‘కృష్ణా! రండి బతుకమ్మ ఆడదాం.. ‘ అని ఆటో స్టాండ్ కి వెళ్లే వీధి లో తెలిసిన వారు ఆపేశారు. ఎన్నేళ్లు అయిందో. ఎప్పుడో కరీం నగర్ లో ఆరో తరగతి లో ఆడిన గుర్తు. తర్వాత మళ్లీ ఆడలేదు. తెలంగాణా ఎఫెక్ట్ తో చాలా చోట్ల మానేసిన వాళ్లు కూడా ఈ సంవత్సరం మొదలు పెట్టారు మా ఏరియా లో. ఒక పక్క రావణ దహనం, ఇంకో పక్క కలకత్తా కాళి విగ్రహాలు వినాయకుడి తీరు లో పెట్టేసారు. ఇంకో పక్క గుజరాతీ వారి గర్భా, కోలాటాలు.. అన్ని ఇళ్ల ముందూ మంచి ముగ్గులు, అందరూ పట్టు చీరలు అవీ.. జమ్మి చెట్టు పత్రి పంచుకుని వీధిలో జనాలు కౌగలించుకుని మైత్రి చాటుకుంటుంటే.. (అర్జునుడు అజ్ఞాత వాసం ఆఖరి లో, విరాట రాజు రాజ్యం లో జమ్మి చెట్టు మీద దాచుకున్న ఆయుధాలు మళ్లీ కౌరవుల పైన యుద్ధం కోసం ఈరోజే తీశాడని ఒక నమ్మకం. అందుకే ఆరోజు జమ్మి పత్రీ ని బంగారం అంటూ పంచుకుంటారు.. కొన్ని ప్రాంతాల్లో..) అసలు ఇన్ని రకాల ఉత్సవాలు చూసి ఎన్నాళ్ళైందో,.. ఇళ్లల్లో బొమ్మల కొలువులు అవీ ఎలాగూ ఉన్నాయనుకోండి.


కొద్దిగా లేట్ అయ్యాం.. రావణుడు కాలిపోయాడు.

జమ్మి ఆకులు..


పండగ పూట మా అమ్మాయి స్వహస్తాలతో వేసిన ముగ్గు
విజయ దశమి రోజున పగలల్లా పనులతో అలిసినా.. అర్థ రాత్రి పూట అందరం కులాసాగా పెళ్లి పందిరి లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే.. ధన, ధన ధన మని చెవులు చిల్లులు పడేలా బాలీవుడ్ సంగీతం, పక్క వీధిలోంచి.. చూద్దాం.. అని గుంపు గా బయల్దేరాం. గమ్మత్తు గా అనిపించింది. కలకత్తా కాళీ ప్రతిమ ని ఊరేగిస్తున్నారు. బాగానే ఉంది. గుజరాతీ కోలాటాలు, గర్బా చేస్తూ ఆడా, మగా, పిల్లా, పీచూ, అదీ సరే.. కాస్త పాశ్చాత్య ధోరణి, సూటూ, బూటూ వేసిన డీ జే, డిస్కో లైట్లు, గర్భాలకి ఇదంతా మామూలే.. అనుకుంటే.. ఒక్క సారిగా ‘బీటు మార్చండే హా..’ అని ‘మాయదారి మైసమ్మో మైసమ్మా.. మనం మేడారం పోదమే మైసమ్మా!, నువ్వు పెద్దపులి నువ్వు పెద్దపులి నువ్వు పెద్దపులి నేక్కినవే మైసమ్మా’ ఇంత cultural integration, cosmopalitan culture మా వీధి లోనా! అని కన్నీళ్లు తుడుచుకున్నంత పని చేశాను. కాకపోతే అర్థరాత్రి ఉత్సవాల వల్ల కష్టపడే ముసలి వారు, పిల్లలు, వ్యాధిగ్రస్తుల మాట..  ఆలోచించలేదు.



మా వీధి కాళీ మాత



మాయదారి మైసమ్మో మైసమ్మా.. చిందులేస్తున్న కుర్రకారు..
బజారు లో జనాలు తక్కువ గా ఉంటారు లెమ్మనుకుంటే.. అబ్బే ఎక్కడా! ఏ బ్రదర్స్ షాపు చూసినా వందలాది ఆడవాళ్లు గుంపులు గుంపులు గా చీరలు కొనేస్తున్నారు. ఏది ఆగినా దసరా సందడి మాత్రం అలాగే ఉందని అర్థమైంది.

సకల జన సమ్మా మజాకా! అందరికీ బోల్డు తీరిక, ఓపిక,.. పిల్లా, మేకా ఈ పండుగ జరిపినంత ఈ మధ్య కాలం లో ఏదీ జరపలేదేమో  బజార్లకి పరిగెత్తాలంటే.. ఆటో వాళ్లకి భయపడి ప్రాణాల మీదకి వస్తే తప్ప ఇల్లు కదలక పోవటం.. అంతే కాదు.. సింగరేణి కార్మికుల సమ్మె పుణ్యమా అని ఉదయం ఎనిమిది కే కరెంట్ కట్. ముప్పై మంది ఉన్న పెళ్లింట్లో, అందరికీ ఒక డిసిప్లిన్ వచ్చిందంటే.. సకల జనుల సమ్మె వల్లే. ఎనిమిది తర్వాత వేన్నీళ్లు బంద్.. అనేసరికి పిల్లా, మేకా, గొడ్డూ గోదా.. అంతా ఎనిమిదిన్నరకల్లా స్నాన పానాదులు చేసి రెడీ.. వంటింట్లో పచ్చళ్లు రుబ్బుడు కార్యక్రమాలు అన్నీ డన్! పగటి పూట నాలుగు గంటల కరంట్ కట్ వల్ల పిల్లకాయలు, పెద్దవారూ, ముసలి వారూ కార్టూన్లు, వార్తలు, సీరియళ్ల, TTD,భక్తి చానళ్ల కోసం యుద్ధం చేసుకోకుండా, ఇంటర్ నేట్టూ, షాపింగులూ, అనకుండా సామరస్యం గా పెద్దలు పాత తరహా లో వాళ్ల చిన్నప్పటి ముచ్చట్లు చెప్తూ, పిల్లలు తమ స్కూళ్లల్లో నేర్పిన పాటలూ పద్యాలూ ఇతరులకి వినిపిస్తూ,.. ఆహా.. ఏమదృష్టం? ఇక మేమంతా వంట వారు ఉన్నా, వేరే పనీ పాటా లేక పులిహార నుండీ పిజ్జా దాకా, అరిసెల నుండీ, కేకుల దాకా చేసుకున్నాం.. సరదా గా తిన్నాం. (ఇక ఇంకా ఇంకా సరదాగా వర్క్ అవుట్ చేయాలనుకోండి.. నెమ్మదిగా..)

అమ్మా వాళ్లకా.. కారు లేదు. ఎక్కడా.. బస్సుల్లేవు కాబట్టి ఆటోలూ అవీ బోల్డు అడుగుతున్నారు. అసలు పిలుపులన్నీ ఫోన్ మీదే.. హైదరాబాద్ లో లేని వారికి పోస్ట్ ద్వారా, ఇంకా కొరియర్ ద్వారా, ఫోన్ ద్వారా ... అని ఏవో లెక్కలేసుకున్నా, కనీసం బంధువుల్లో వాళ్ల జెనరేషన్ వారిని, పెద్దవారిని మాత్రం వెళ్లి పిలవాలని .. కారు మాట్లాడుకుని విజయ దశమి పూట నలుగురం బయల్దేరాం. ఇంతకు ముందు ఇలాగే మా కజిన్ చెల్లి పెళ్లి పిలుపులకి వెళ్తే ఎవరూ కాఫీ కి మించి ఇచ్చిన పాపానికి పోలేదు, అని మా అమ్మ ఒక సంచీ నిండా గారెలు, అల్లం పచ్చడి, పులిహార పోట్లాల్లాంటివి పెట్టి పంపింది. ఈ పెళ్లి పిలుపులకి వెళ్లటం నా జీవితం లో ఒక మర్చిపోలేని అధ్యాయం! మళ్లీ నా పిల్లల పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయో.. తెలియదు. ముందస్తుగా వస్తున్నట్టు ఎవ్వరికీ చెప్పలేదు. బంధువులు దండి గా ఉన్న ఏరియా కి వెళ్లి వారింటి కి దగ్గర్లో ఉన్నప్పుడు ఫోన్ చేయటం.. ఉంటే ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి పిలవటం, లేదా పత్రిక గుమ్మం లో పెట్టి రావటం!

పిల్లలు అమెరికా లకో, ఆస్ట్రేలియాలకో, వెళ్లిపోతే బిక్కు బిక్కు మంటూ లంకంత ఇళ్లల్లో, అడుగడుగునా సమస్త రాజ భోగాలతో, వృద్ధాప్యం లో భక్తి టీవీలు చూస్తూ, అమృతాంజన్ వాసనలు పీలుస్తూ, కాలక్షేపం చేస్తున్న తల్లిదండ్రుల ఇళ్లకి వెళ్లాం.. పండగ పూట శాస్త్రానికి కొద్దిగా పని మనుషులకీ, పక్కవారికీ ఇవ్వటానికి పిండి వంటలు చేయించి అలాగ ఈసురోమంటూ కూర్చుని ఉన్న ఆ పెద్దలని చూసి నిట్టూర్చి పిలిచి వచ్చేశాం.. భర్త చనిపోయిన భార్య ఎలాగో బతుకుతుంది కానీ భార్య చనిపోయిన భర్త జీవితం నరకం .. అని విన్నాను, అదీ పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోయాక.. ఒకరిని పిలవటానికి వెళ్లి ఆయన ఇల్లు, విధానం చూసి చలించిపోయాను. ఫ్రిజ్ లోంచి తెచ్చిన ప్లాస్టిక్ నీళ్ల బాటిల్ మూత దగ్గర మురికి, ఇల్లు అంతా దుమ్ముతో, ఏదో చెప్పలేని తేడా.. భోజనం సంగతి ఏంటని అడిగితే ‘ఓపిక ఉంటే వంట, లేదంటే తంటా.. ‘ అని చమత్కరించినా.. (కేవలం వంట అని కాదు కానీ...) వాళ్లావిడ, పిల్లలూ ఉన్న రోజుల్లో డాక్టర్ గారైన ఆయన జీవన విధానం గుర్తొచ్చి కొద్దిగా బరువు గా అనిపించింది.

అలాగే.. ఉద్యోగస్తులైన కొడుకూ, కోడళ్ల తో కలిసి ఉన్న వృద్ధ దంపతులు.. గొంతు లో జీర తో.. ‘ఎంత సద్దుకుపోదామన్నా మా ఉనికి భరించలేనిదయ్యింది.. మా కొడుక్కీ, కోడలికీ’ అని అంతలోనే టాపిక్ మార్చేస్తూ నవ్వేస్తూ...

మా అత్తగారూ, ఇలాగే అనుకోవట్లేదు కదా.. ఒక చిన్న ఆత్మ విమర్శ మనస్సు లో..

తల్లీ తండ్రీ పోయినా, ఓకే ఏరియా లో నివసిస్తూ, నెలకోసారి కలిసి భోజనం చేసే తొమ్మిది మంది అక్క చెల్లెళ్లు, అన్నదమ్ములు, వారి బిడ్డలందరినీ పండుగ భోజనాలు చేస్తుండగా కలిసి ఒకేసారి పిలిచాం. ఒకేసారి గా ఆనందం, ఈర్ష్య, గర్వం లాంటి భావాలు కలగా పులగం గా ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే.. అక్కడినించి వచ్చేశాం.

మా చిన్నప్పుడు ఒక హీరోలా, మోటార్ సైకిల్ మీద ఫీట్స్ చేస్తూ, పెద్దలనెదిరించి ప్రేమ వివాహం చేసుకుని.. ఆ రోజుల్లో, మా టీనేజర్ల దృష్టి లో హిమాలయాలంత ఎత్తు లో ఉన్న ఒక దూరపు చుట్టం ఇంటికి వెళ్లాం.. నేనూ చాలా ఉద్వేగం గా, ఉత్సాహం గా, ఎలా ఉంటుందో ఇల్లు, కుటుంబం ఎలా ఉంటుందో.. అని రకరకాల అంచనా లతో వెళ్లి చూసి ఒక విధమైన దిగ్భ్రాంతి కి గురయ్యాను. ఆయన బట్టతల తో, మాసిన గడ్డం తో, చిరుగులు పడ్డ, పాత బడ్డ గుడ్డలతో, ఇల్లు పెయింట్ గట్రా లేకుండా, ఊడిన తలుపులు, వాకిలి నిండా పిచ్చి తుప్పలు, ఇంటి నిండా ఉతకాల్సిన, ఉతికబడి మడతలు పెట్టాల్సిన బట్టల కుప్పలతో, పండుగ పూట పదకొండైనా.. స్నానాలు, గట్రా లేకుండా, నూనె, షాంపూలు వాడని వారికి మల్లే, ఎండిన తలకాయల తో ముగ్గురు పిల్లలు టీవీ చూస్తూ,.. ‘ఇంకా వెళ్ళరేమన్నట్టు చూస్తూ’ .. ఆఫీస్ లో ఏదో ఫ్రాడ్ లో ఇరుక్కుని ఉద్యోగం నుండి సస్పెండ్ అయ్యాడని చెప్పాడు. రెండు నిమిషాల తర్వాత వచ్చేస్తూ ‘దౌలత్ ఔర్ జవానీ ఎక్ దిన్ ఖోజాతే హై’ .. పాట గుర్తు చేసుకుంటూ మౌనం గా వస్తుంటే చెంప దెబ్బ కొట్టినట్టు ఒక్కసారి గా ఒక ఆలోచన వచ్చింది. ఆదివారాలు మేమూ నెమ్మదిగా స్నానాలు చేయకుండా, మందం గా ఉంటాం ఇంట్లో.. ఎవరైనా వస్తే అది ఎంత చిరాగ్గా అనిపిస్తుందో అర్థమైంది. ఒక మెంటల్ నోట్ చేసుకుని బయల్దేరాం.

ఏ ఇంటికి వెళ్లినా స్కూళ్లు, కాలేజీలు లేక, వేలాడే మొహాలేసుకున్న చదువుకునే పిల్లలు.. కానీ మా పిల్లలు మాత్రం ఆశ గా హైదరాబాద్ కి వచ్చేద్దామమ్మా అని అడిగారు. కొత్త గా అపార్ట్ మెంట్లు కొన్న వారి ఇళ్లకి వెళ్లి వారి ఇంట్లో ఇంచ్ ఇంచ్ గొప్పదనాన్ని విని తరించాము. అందుకే కాబోలు కొత్తగా ఇల్లు కట్టిన వారింటికీ, కొత్తగా పిల్లలు పుట్టిన వారింటికీ వెళ్తే ఇంతే అంటారు అనుకుని నవ్వుకున్నాను.

చిన్న ఉద్యోగం చేస్తూ, ఇరుకైన అపార్ట్ మెంట్ లో ఉంటూ, పండుగ పూట మొదటి సారి వచ్చానని, ఆప్యాయత తో బొట్టు పెట్టి, జాకెటు ముక్క పెట్టి కాళ్లకి పసుపు రాసి పంపిన వారు, చెవి పిండి మరీ పండగ వంటలు బలవంతాన కుక్కిన వారు, ‘ఫోన్ చేశారు కదే.. ఎందుకూ.. ఇలా కష్టపడ్డారు.. మేమెలాగూ వచ్చేసేవారం..’ అని ప్రేమ తో మందలించిన వారు, ‘ఇంటికొచ్చి పిలిచారు కాబట్టి వస్తున్నాం.. లేకపోతే మానేద్దామనుకున్నాం’ అని వేళాకోళాలాడినవారు, పోనీలే కనీసం ఈ వంకనైనా మా గుమ్మం తొక్కావు అని నిష్టూరాలాడిన వారు.. వెరసి నా వాళ్లు.. వెనక్కి వస్తూ అలసట గా జాలబడి కళ్లు మూసుకుని అనుకున్నాను.. ‘అమ్మో.. నయమే.. ఏం వెళ్తాం లె పిలుపులకి ‘ అనుకుని ఇంట్లో ఉండిపోయాను కాను.. ‘.

దాదాపు పది, పదిహేనేళ్లు అయిందేమో.. వెళ్లి! ఇంటికి చుట్టుపక్కల వారిని పిలుస్తుంటే అర్థమైంది.. అన్ని కుటుంబాల్లో,.. ఇంచుమించు గా ఒకటే కథ.. రెక్కలొచ్చిన పిల్లలు, ఒంటరి తల్లిదండ్రులు.. లేదా బిక్కు బిక్కు మంటూ, IIT,medicine లకి చదువుకుంటున్న మనవలకి disturbance లేకుండా కాలం గడుపుతున్న పెద్దలు. కొన్న ఇళ్లకి అప్పులు తీర్చటం కోసం.. పరుగులు తీసే నడి వయస్కులు, చదువుల ప్రపంచం లో పిల్లలు, పక్కింట్లో ఎవరున్నారో, ఏం జరుగుతుందో కూడా తెలియని మనుషులు..



పోస్ట్, కొరియర్లు సరిగ్గా పని చేయకపోవటం తో, శుభలేఖలందక, బస్సుల్లేక, ఆరోగ్యం, ఆర్ధిక సామర్థ్యం లేని జిల్లాల్లో బంధువులు, కావలసిన వారు అసలు ఎలా వస్తారో, రాగలరో అర్థం కాక, పెళ్లి పందిరి లో చతికిల బడ్డాము. కానీ సుమోలు, క్వాలిస్ లు కట్టించుకుని, ఎలాగైతేనేం.. కుటుంబానికి ఒక్కరైనా రావాలని బిలబిల లాడుతూ వచ్చి తమ్ముడిని ఆశీర్వదించి వెళ్లిన బంధువులని, తృప్తి గా పంపించి రైళ్లు కాన్సెల్ అవటం తో అత్యవసరమైన సామాన్లు మాత్రం తీసుకుని ఎలాగోలా మా బెంగుళూరు కి వచ్చి పడ్డాం.

41 comments:

మాలా కుమార్ said...

పెళ్ళిపనులు , పిలుపులలో అలసిపోయిన ఆడపడుచుగారికి మరదలు వచ్చిన శుభాకాంక్షలు .
ఈ కాలం పెద్దవాళ్ళ పరిస్తితి సరిగ్గా చెప్పారు .

స్నేహ said...

మీ పొస్ట్ గురించి చెప్పడానికేమి లేదు. ఎప్పటి లాగానే బాగా రాసారు. ఇంకొ 10-15 యేళ్ళ తర్వాత ఎలా ఉంటుందో ఊహించడానికి మాత్రం భయం వేస్తోంది.

మైత్రేయి said...

బాగుందండి. మమ్మల్నీ పిలిస్తే వచ్చేద్దుం కదా..
పెద్దవాళ్ళది పెద్ద సమస్యేనండీ. వంటవాళ్ళు, పనివాళ్ళూ కూడా అంతలా దొరకక చాలా ఇబ్బంది పడుతుంటారు మరీ డెబ్బైలు దాటితే కష్టమే. దీనికి సొల్యూషన్ ఏమిటో కాలమే చెప్పాలి. దేశంలో ఉంటే కొంత నయం, అప్పుడప్పుడైనా కనిపెట్టి ఉండవచ్చు. పిల్లలందరూ విదేశాల్లో ఉంటే మరీ కష్టం.

శ్రీధర్. దు said...



>>తల్లీ తండ్రీ పోయినా, ఓకే ఏరియా లో నివసిస్తూ, నెలకోసారి కలిసి భోజనం చేసే తొమ్మిది మంది అక్క చెల్లెళ్లు, అన్నదమ్ములు
:))

>>ఓపిక ఉంటే వంట, లేదంటే తంటా.. అని చమత్కరించినా..
:((

>>సద్దుకుపోదామన్నా మా ఉనికి భరించలేనిదయ్యింది.. మా కొడుక్కీ, కోడలికీ’
:(


>>పెద్దలనెదిరించి ప్రేమ వివాహం చేసుకుని
:((



>> బిలబిల లాడుతూ వచ్చి తమ్ముడిని ఆశీర్వదించి వెళ్లిన బంధువులని,

:))

Krishna said...

జంధ్యాల గారి సిన్మా లాగా వుంది మీ పోస్ట్. ఆహ్లాదంగా :-)
చాల రోజులు అయ్యేసరికి ఎందుకో అనుకున్నాను. పెళ్లి సందడి అన్నమాట.

బంద్ ప్రభావం గురించి చెప్తుంటే గుర్తొచింది, మా చెల్లి కుడా ఈమధ్యనే హైదరాబాద్ కి కాశీ యాత్ర చేసోచ్చింది, వివిధ రకాల ప్రయాణ సాధనాల్లో :-)

Edge said...

సాధారణంగా కనిపించే విషయాలలోని ఆసక్తికర విశేషాలను ఆకర్షణీయంగా వినిపించే మీ రచనా విలాసం గురించి కొత్తగా చెప్పడానికేముంది?

అందుకే ఈ రెండు చిన్న సూచనలు:

"మా ఇంటి పక్క వారి ఇంటి ముందు పెట్టిన బతుకమ్మలు" --> మా పక్కవారింటి ముందు పెట్టిన బతుకమ్మలు

"ముసలి అత్తగారు" --> వయోధికులైన అత్తగారు

Varuna Srikanth said...

Krishna Garu....ee sari chala time teesukunnaru rayataniki...entabba anukunna...pelli hadavudi annamata...
eppatilage adaragottesaru kani...pedda valla gurinchi chadivinappude...elago anipinchindandi...

జ్యోతిర్మయి said...

మీ బ్లాగును చూసి ఎవరైనా డైరీ ఎలా వ్రాయాలో నేర్చుకోవచ్చు. మీతో పాటు మమ్మల్నీ హైదరాబాదుకు ప్రయాణం కట్టించారు. ఆత్మీయులతో కలసి దసరా జరుపుకున్నారు..తమ్ముడి పెళ్లి చేసి వచ్చారు...చాలా సంతోషం.
ఇది బావుంది అని ఒక్క వాక్యం గురించి చెప్పలేను. టపా మొత్తం చాలా చాలా బావుంది. ధన్యవాదములు

Anonymous said...

దూరంగా వుండి అప్పుడప్పుడూ బంధువులని కలుసుకోవటంలోని ఆనందమే వేరు కదా? మీ పోస్టు చదివి నేను చాలా హోం సిక్ ఫీల్ అయాను!
నాకన్నిటికంటే మీ అమ్మాయి వేసిన ముగ్గు మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చేసింది. నా పేరు చెప్పి బుగ్గ మీద గాట్టిఘా ఒకటివ్వండి! :)
Congrats for the family wedding.
శారద

Mauli said...

అవి జమ్మి ఆకులు కాదు :)
సరే కొ౦చె౦లేటుగా ' సెమీ సెమియతే పాపం..' అని జమ్మి ఆకులు ఇచ్చి పుచ్చుకు౦దామ్ :)
శుభాకాంక్షలు !

రసజ్ఞ said...

oka mixed feeling andee mee post chadivaaka! enduko ee jeevitham anipinchelaa inti meeda bengatho! chaduvullo undi inti moham chusi 2yrs avuthondi!

Sujata M said...

Congratulations. It is a super post. :D

I second you, when it comes to cool traffic when SKS was gong on.

Anonymous said...

The post is too long, too many nthings, over indulgence, and self dabbaaa!

edo meelo meeru cheppukunnattu undi ee tapaa. koncham humour miss ayyindi

Anonymous said...

పెళ్ళి పిలుపుల సందడి బావుందండీ. ఇదిగో వస్తున్నాo వచ్చేస్తున్నాం అంటూ నిమిష నిమిషానికీ ఫోన్లు చేసి వెళ్ళేకంటే , ఇలా చెప్పా పెట్టకుండా వెళితేనే మనవాళ్ళ నిజమైన జీవితం కష్ట సుఖాలు తెలుస్తాయేమో . లేదంటే అంతా బోల్డు సుఖపడిపోతున్నారు మనమే కష్టపడ్తున్నాం అనుకొంటాం . సున్నితమైన విషయాలను కూడా బాగా పట్టించుకుని రాసారు . మంచి పోస్ట్ కృష్ణ గారు

కృష్ణప్రియ said...

మాల గారు,
:) థాంక్స్!

@ స్నేహగారు,
నిజమే. భయమే. ఆలోచనా విధానం లో చిన్న మార్పులు చేసుకోవాలేమో. ఎక్స్పె క్టేషన్ల నుండి దూరం గా ఉండాలి, సత్తువ లేని రోజుల కోసం చిన్న ప్రణాళిక వేసుకోవాలి అనుకుంటున్నాను.

@ మైత్రేయి గారు,

నిజమే. డెబ్భైలు దాటాక ఉన్న జంటలు, ఒంటరి తల్లులు/తండ్రులు, పిల్లలు వేరే దేశాల్లో, ఊర్లల్లో,
ఓకే ఊర్లో ఉన్నా, పిల్లల్నీ, ఇంటినీ కనిపెట్టుకునే సత్తువ పోయాక కృష్ణవంశీ సినిమా లాగా అందరూ కలిసి ఉండగలగటం కల్ల. ఏం చేయాలో అందరూ ఆలోచించదగ్గ అంశం.

కృష్ణప్రియ said...

@ శ్రీ,

మీ కామెంట్ బాగుంది, టపా పూర్తిగా చదివారని, అర్థమైంది. థాంక్స్!

@ కృష్ణ,
అవునండీ.. పెళ్లి సందడి. పండగ హడావిడి. మీ పోలిక బాగుంది. హైదరాబాద్ కెళ్ళటం, ఆ రోజుల్లో కాశీ కెళ్ళటం తో సమానమన్న మాట! బాగు బాగు.

@ ఎడ్జ్,
చాలా చాలా సంతోషం మరియు ధన్యవాదాలు! ( మీరూ చెప్పిన సూచనలకి). కరెక్ట్ చేస్తాను.
@ వరుణ శ్రీకాంత్,
అవునండీ.. నా తోటి వాళ్ళంటూ లేరు ఏ బంధువుల ఇళ్లల్లోనూ.. అంతా విదేశాల్లో లేదా, ఉద్యోగం ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి. పెద్దవాళ్ళే రెక్కలు విరిగిన పక్షుల్లా ఉండిపోయారు.

కృష్ణప్రియ said...

@ జ్యోతిర్మయి గారు,
చాలా చాలా థాంక్స్!
@ శారద గారు,
 థాంక్స్! ఇప్పుడే ప్రాక్టీస్ చేయటం. మా కాలనీ లో వేసిన రంగు రంగుల పేద్ద కళాత్మక ముగ్గుల కన్నా.. మా ఇంటి ముందు వేసిన ముగ్గే నాకు గొప్ప గా, అందం గా అనిపించింది...
కాకి పిల్ల ముగ్గు కాకికి...
@ మౌళి,
ఓహ్! అయితే అవి జమ్మి ఆకులు కావా? జమ్మి ఆకులనే ఇచ్చారు మరి మా ఊర్లో  థాంక్స్!

@ రసజ్ఞ,
థాంక్స్! మీ రిసర్చ్ త్వరలో పూర్తయి మీ ఇంటికి వెళ్లి ఒక టపా వ్రాయుదురు గాక!
@ సుజాత గారు,
 థాంక్స్! అవునా! అసలు హైదరాబాద్ లో అంత హాయిగా ట్రాఫిక్ లో తిరిగి చాలా కాలం అయింది.

మైత్రేయి said...

విషయాన్ని మరీ పొడిగిస్తున్నానని, సరదాగా ఉండే మీ బ్లాగ్లో సీరియస్ విషయాలు వ్రాస్తున్నానని మీరు అనుకోకపోతే, మీ అభిప్రాయంకోసం,

మీ లాగే నేను మా ఆడబడుచు పెళ్ళికి పిలవటానికి వెళ్ళి చూసాను, ఒక బంధువుల ఇంట్లో, ఇల్లేమో లంకంత మంచి సెంటర్లో, ఆవిడికేమే జబ్బు, మంచందిగలేదు, గుర్తుపట్టటం లేదు, ఆయన పెద్దవారు. పిల్లలు విదేశాల్లో పెద్ద పొజిషన్ లో. పని వాళ్ళు వంటవాళ్ళు విసుక్కుంటూ అయినంత లాక్కోవటాని రడీగా. పెద్దతనం ఇంట కష్టమా అనిపించింది.
మనకు విదేశాల్లోలా వసతులు ఉండవు. వాళ్ళలా మెంటల్ గా కూడా ప్రిపేర్డ్ గా,ఆరోగ్యం గా ఉండము. (అసలు అమెరికాలో, యూరప్ లో పెద్దవాళ్ళు ఎలా నడిపిస్తారు?) పాత రోజుల్లోలా సర్దుకోని తిట్టుకుంటూనో తిమ్ముకొంటూనో ఒక చోట ఉండట్లేదు. వాళ్ళ సంగతి కాదు, రేపు మన పరిస్థితి ఏమిటంటారు :).

జయ said...

ఉగాది పచ్చడి లాగా రకరకాల రుచులతో, మీ ముచ్చట్లు భలే ఉన్నాయండి. ఇంతకీ ఆ కాళీ మాత ఏ వీధిలోని దండి?బాగుంది.

Sravya V said...

బావున్నాయండి పండుగ , పెళ్లి , బందు
విశేషాలు ! ఇంతకీ ముగ్గుల కళాపోషణ చేసింది ఎవరు పెద్ద పాప లేక చిన్న పాప ?:)

Anonymous said...

మీ తెలంగాణా ప్రాంతంలో జమ్మి ఆకులు బాగా అభివృద్ధిచెంది, రావి ఆకుల్లా వున్నాయి. మావూళ్ళో జమ్మి ఆకులు తుమ్మ ఆకుల్లా, చిన్నగా బాగా వెనకబడి వుంటాయండి. :)

రసజ్ఞ said...

@కృష్ణప్రియ గారూ
మీరెంత మంచివారండీ! నెనర్లు!

Sravya V said...

హ హ శంకర్ గారు awesome ! మీరు అసలు ఎక్కడా తగ్గరే :)))

కృష్ణప్రియ గారు చిన్న చిన్న ఆకులు బంగారం అని ఇస్తారు కదా , మీరు పొరపాటు పడ్డారా? నేను ఇలా ఎవరన్న ఇచ్చినవి నెక్స్ట్ దసరా వరకు దాచేదాన్ని :))))

కృష్ణప్రియ said...

@ శ్రావ్య, snkr,

:)) మా హైదరాబాద్ లో అంతే. వీటినే ఇస్తాం. వీటినే బంగారం అంటాం!

మీరూ, మౌళి గారు అంటే నిజమే అనిపిస్తుంది. కానీ మొన్న అవే పంచారు. నేనా హైదరాబాద్ లో, దసరాకి బంగారం పంచి పదేళ్లు దాటింది.

Sravya V said...

కృష్ణ గారు నేను హైదరాబాద్ సంగతే కదా చెబుతూంటా :))))

కొత్తావకాయ said...

పెళ్ళి పిలుపుల టపా చాలా చాలా బాగుంది. ముఖ్యంగా మీ విశ్లేషణ "నిజమే కదూ!" అనిపించేలా ఉంటుంది. అభినందనలు. ముగ్గు చక్కగా ఉందని చెప్పండేం మీ అమ్మాయికి. :)

Mauli said...

అవి బ౦గారమ్ అని ఇవ్వర౦డీ, అర్జునస్య ధనుర్దారీ, రామస్య ప్రియదర్శిని అని ,శత్రు వినాసిని ..etc అని ఇస్తారు. మీ తెలంగాణ లో జమ్మి చెట్లు ఉ౦డవా పాపం ;-)

కొత్త పాళీ said...

you shd write a novel.

Anonymous said...

శ్రావ్య :D

/మా హైదరాబాద్ లో అంతే. వీటినే ఇస్తాం. వీటినే బంగారం అంటాం! /
తాటాకులు/రావాకులు ఇచ్చి బంగారం అంటారా?! 53ఏళ్ళుగా ఇలా 'అసలే అమాయకులైన' మీ హైద్రాబాదోళ్ళు మా సీమాఆంధ్రోళ్ళను ఏమార్చగలిగారన్న మాట! శ్రీకృష్ణ కమిటీ ఇదే చెబితే మొదట నమ్మలేదు సుమీ! నిజమేనన్న మాట! ఇకముందు అలా జరగదు, కనీసం ఓ గ్రాము అసలు బంగారమైనా ఇవ్వాలి. :))

స్నిగ్ధ said...

ఏంటి చాలా రోజులయ్యింది మీరు టపా వేసి అని అనుకుంటున్నాను...కొత్త టపా వేసేసారు...నేను నిన్నే చదివాను గానీ కామెంటడానికి టైం దొరకలేదు...

పెళ్ళి బాగా జరిగిందా అండి..:)

బతుకమ్మలు బాగున్నాయి....

మీ అమ్మాయి వేసిన ముగ్గు సూపరు...నా ముగ్గు చూసుకున్నట్లు ఉంది (చిన్నప్పటిది):)

పెద్దవాళ్ళ గురించి చదువుతోంటే...మ్మ్మ్మ్మ్
మా నానమ్మ ,తాతగారిని మేము(అంటే అమ్మావాళ్ళు) చూసుకుంటున్నాము...తరువాతిది ఆలోచించాల్సిందే...

లత said...

బావున్నాయండి మీ పండగ,పెళ్ళి ముచ్చట్లు

చాణక్య said...

సారీ అండీ.. ఈసారి కూడా లేట్‌గా చదివాను.

కానీ మాంచి కుటుంబకథా చిత్రం చూసినట్టు ఉంది. సకలజనులసమ్మె ఎవరికీ పనికిరాకపోయినా మీకు మాత్రం బాగా ఉపయోగపడిందన్నమాట.

మీ వీధిలో నయం, మాయదారి మైసమ్మకి చిందులేశారు. మా వీధిలో షీలా కి జవాని లాంటి పాటలు వేశారు. నవ్వాలో, ఏడవాలో అర్థం కాలేదు.

సద్దుకుపోదామన్నా మా ఉనికి భరించలేనిదయ్యింది.. మా కొడుక్కీ, కోడలికీ<<<

హ్మ్మ్.. :(((

ఏది ఏమైనా మీ తమ్ముడి గారికి శుభాకాంక్షలు చెప్పానని చెప్పండి. :)

కృష్ణప్రియ said...

@ అజ్ఞాత,

:) థాంక్స్! సహృదయం తో చేసిన విమర్శ ని గౌరవిస్తున్నాను.
సకల జన సమ్మె సందర్భం గా హైదరాబాద్ లో ఏర్పడిన ఒక స్థబ్దత గురించి నోట్స్ రాసుకోవాలని, అలాగే దసరా పండుగ అన్ని రకాలు మా వీధి లో జరుపుకోవటం ఇదే. పూర్వం అందరూ తెలుగు వారే ఉండటం, అందులో మళ్లీ తెలంగాణా వారు బతుకమ్మ ఆడటం కాస్త మోటు గా ఉంటుందన్నట్టు మానేశారు. ఈసారి తెలంగాణా అంశం కాస్త ‘ హాట్’ అవటం తో, మళ్లీ పూర్వపు వైభవం వచ్చింది. ఇక అపార్ట్ మెంట్ సంస్కృతి వల్ల, ఐ టీ వల్ల, అన్ని ప్రాంతాల వారూ చాలా మంది చేరటం తో అన్ని రకాల సెలబ్రేషన్లు చేరాయి.
ఇక, ఒకేసారి అందరు బంధువుల ఇళ్లు తిరగటం చాలా అరుదు కదా. రెక్కలు వచ్చిన పిల్లలు వెళ్లిపోయాక, అందరు చుట్టాల ఇళ్లల్లో పెద్దవాళ్లు కాలక్షేపం చేస్తున్న విధానం చూసి ఆ విశేషాలు రాయాలనిపించి అన్నీ ఒకే దగ్గర ఇరుకిరుగ్గా రాసేసినట్టున్నాను.
ఇక సెల్ఫ్ డబ్బా అంటారా? :) అవును. ఒప్పుకుంటున్నాను.

కృష్ణప్రియ said...

@ లలితగారు,
ధన్యవాదాలు.
లేదంటే అంతా బోల్డు సుఖపడిపోతున్నారు మనమే కష్టపడ్తున్నాం అనుకొంటాం --- కరెక్ట్ ముక్క చెప్పారు.
@ మైత్రేయి గారు,
ఇంకా నయం. సీరియస్ విషయమే నేనూ రాశాను గా.. మీ వ్యాఖ్య కి చాలా కృతజ్ఞతలు. పట్టించుకునే కుటుంబ సభ్యులు లేకపోతే పెద్దతనం నిజంగా దుర్భరమే. మా ఇంట్లో మా వారి నాయనమ్మగారు ఒక ఆరు నెలలు మంచాన ఉన్నారు. ఆ రోజుల్లో ఒక నర్స్ ని పెట్టాము. ఆ అమ్మాయి ఇరవైలలో ఉంది. ఈ పని ఆనందం తో చేయలేదు. నేనున్నప్పుడు ప్రేమ గానే చేస్తున్నట్టు కనిపించేది. ఆ అమ్మాయి ఎప్పుడైనా బయటకి వెళ్తే నాయనమ్మగారు.. భయం గా, దుఖం గా ‘నర్స్ ఎవ్వరూ లేనప్పుడు నన్ను కొడుతోంది’ అనేవారు. గట్టి గా అంటే వెళ్లిపోతుందేమో అని భయం. అనక పోతే హింసిస్తుందేమో అని భయం. ఇక సాధ్యమైనంత సామరస్యం గా ‘మాకు చాలా ఇష్టం ఆవిడ! నీ చేతుల్లో పెట్టాం. నాకు సంతోషం గా ఉంది.’ అని చెప్తూ, అప్పుడప్పుడూ ఐస్ క్రీం లూ అవీ కొంటూ..  ఎంత చూసినా.. ఎక్కడో అక్కడ విసుక్కుంటూనే, కోపం గా డ్రెస్సింగ్ లు మార్చటం లాంటివి చేసేది. చిల్లర డబ్బులూ, చిన్న చిన్న వస్తువులూ కొట్టేసేది.
అలాంటిది, పూర్తిగా పని వారి మీద వదిలిన పెద్దల పరిస్థితి తలుచుకుంటే కష్టం గా ఉంటుంది.

కృష్ణప్రియ said...

@ జయ గారు,
ధన్యవాదాలు. ఇది బోయెనపల్లి ఏరియా లో కాళీ. ఇంకా అందం గా ఉంది అసలు. నా కామెరా కి చిక్కలేదు.
@ శ్రావ్య,
థాంక్స్! మా పెద్దమ్మాయి కే ఇలాంటి ఓపికలు. ఇలాంటి కళాఖండాలు వేసి మమ్మల్ని తరింప చేస్తుంది.
@ రసజ్ఞ్,
కదా! నేను చాలా మంచి దాన్ని. కానీ ఈ ప్రపంచమే బొత్తి గా అర్థం చేసుకోవట్లేదు. 

కృష్ణప్రియ said...

@ కొత్తావకాయ,
అందరూ ముగ్గు బాగుందని అన్నారని తెలిసిందా? ఇక అంతే సంగతులు. మా అమ్మాయి కాళ్లు ఇక భూమి మీద నిలవవు.  థాంక్స్!

@ మౌళి,
అవును. ‘అర్జునస్య..’ అని ఇస్తారు. కానీ బంగారం అని కూడా కొన్ని ప్రాంతాల్లో పంచుతారు. (ఏ ప్రాంతాలో నాకు తెలియదు  )
మా తెలంగాణా లో ఒక జమ్మేంటి? తుమ్మేంటి? లేని చెట్టు లేదు

@ కొత్తపాళీ గారు,
హమ్మో నవలే! థాంక్స్!

కృష్ణప్రియ said...

@ snkr,
 అవును. అమాయకులమే. ఈసారి రండి. ఒక గ్రామేమిటి రెండు గ్రాముల బంగారం పెడతాను మీకు.

@ స్నిగ్ధ,
అవునండీ. పెళ్లి బ్రహ్మాండం గా జరిగింది.

@ లత గారు,
థాంక్సండీ.
@ చాణక్య,
 మీరు సారీ చెప్పటం ఎందుకు? అసలంటూ చదివారు గా కనీసం
Thanks for the wishes and the comment!

Anonymous said...

meeku evaranna chepparo ledo kani, mee blog template marchadam valla, aksharalu emi kanapdatledu. chadavadaniki chala kashtam ga untondi.

కృష్ణప్రియ said...

అజ్ఞాత,

చూస్తాను. ఇంకా తెల్ల బాక్ గ్రౌండ్ మీద నల్ల అక్షరాలూ. చాలా ఈజీ గా ఉంది అనుకున్నాను.

kiran said...

నాకు ఈ టపా ఎంత నచ్చిందో చెప్పలేను...!!!!
నిజమే మన మన హడావుడిలో పడి..కొన్ని కొన్ని అసలు ఆలోచించం....పక్క వారి పరిస్థతి చూసి కలుక్కుమన్నప్పుడు...మనము అలాగే ప్రవర్తిస్తున్నామా...అని మన మనసు ప్రశ్నిస్తుంది..
నాకు మా పక్కింటి అక్క....వాళ్ళ తమ్ముడి పెళ్లి కబుర్లు..చుట్టాల కబుర్లు చెప్పినట్లనిపించింది (అక్క అని ఎందుకున్నా అంటే ఆంటీ అంటే ఫీల్ అవుతారు గనుక..:P ..(సరదాకే....))
చాలా అలిసిపోయారు..బాగా రెస్ట్ తీస్కోండి కృష్ణ ప్రియ గారు :)

కృష్ణప్రియ said...

@ కిరణ్,
మీరూ, ఇంకా ఒక ఈ మెయిల్ ద్వారా వ్యాఖ్య పంపిన మరో బ్లాగర్ మాత్రం ఈ పాయింట్ ని మెచ్చారు. సంతోషం!

పక్కింటి అక్క – LOL! పర్వాలేదు. పక్కింటి పిన్ని గారు, బామ్మ గారు అన్నా ఓకే :)

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;