ఇంకో కాలెండర్ చెత్త బుట్టలోకి.., ఇంకో ‘యాప్పీ న్యూ ఇయరు..’ పది పేజీలు రాసి వదిలేసే ఇంకో డైరీ, రెండు రోజులు ఆచరించి మూలన పెట్టిన రెసొల్యూషన్లు.. ఈసంవత్సరం పోగేసిన ఇంకో నాలుగు పౌండ్లు.. మూడు వందల అరవై రోజులు,.. అంతేనా? ఒక సంవత్సరం కొందరి జీవితాల్లో ఓడల్ని బళ్లు గా .. బండ్లని ఓడలు గా మారుస్తుందేమో, . కొంత మంది జీవితాల్లో ఎక్కడి గొంగళి ని అక్కడే ఉంచేస్తుందేమో, వయసు పెరిగిన కొద్దీ, నలభైలకి దగ్గర కొస్తున్నకొద్దీ జీవితం గానుగెద్దు జీవితం లా అలాగే ఉంటుందనీ, పెద్దగా కూర్పు, మార్పు,చేర్పులుండవనీ, విసుగెత్తిపోతుందనీ.. ఎన్నో విన్నాను. మానసికం గా రెడీ అవ్వాలనుకుంటూ కూడా ఆలోచిస్తూన్నాను ఒకప్పుడు.. కానీ నాకైతే 2011 బాగా పాళ్లు కుదిరిన ఉగాది పచ్చడి లా.. కొద్దిగా తియ్యగా, పుల్లగా, చేదుగా,కమ్మగా,కారంగా, వగరు గా, అన్ని రకాలు గా.. జయోపజయాలు, కష్ట సుఖాలు, శాశ్వతమనుకున్న కొన్ని పరిచయాలు స్నేహాలు, ముందు రోజు జాజుల్లా వడలిపోగా, కొన్ని పరిచయాలు ఆకులు దూసేసిన మల్లె తీగలా కొత్త చిగుర్లు తొడగటాలు,.. ఎవరిదో బ్లాగ్ టాగ్ లైన్ లా ‘సహస్ర వర్ణ శోభితమీ జీవితం’ అన్న మాట కి అర్థం తెలిసేలా..
కమ్మగా,..కొబ్బరి పలుకుల్లా..
భలే పుస్తకాలు చదివాగా..
ప్రొ. బైరప్ప గారు రాసిన పర్వ, డా. కేశవరెడ్డి గారు రచించిన ‘మునెమ్మ’, ‘అతడు అడవిని జయించాడు’, యండమూరి రాసిన ‘డేగ రెక్కల చప్పుడు’, యార్లగడ్డ రాసిన ‘సత్యభామ’, మధురాంతకం వారి కథల కలెక్షన్, శ్రీపాద వారి పుల్లం పేట జరీ చీర, మార్గదర్శి కథల సంకలనాలు, నాలుగు కాలక్షేపం ఆంగ్ల నవలలు, అరడజను తెలుగు నవలలు,నవలికలూ..
నచ్చిన కొత్త రుచులు!
ఉలవచారు మీగడ తో, కిసాన్ వారి కొత్త క్రీం చీజ్ లు, శొంఠి, కర్వేపాకు కాడల చారు, డామినోస్ వారి చాకో లావా కేక్, హైడ్ & సీక్ – కిస్ ఆఫ్ కాఫీ బిస్కట్లు,
హం చేసుకున్న కొత్త పాటలు..
శంకర్ మహాదేవన్ - గణేశాయ ధీమహి, Mr Perfect - చలి చలిగా, JNDB- సేనోరిటా, రావన్ -చమ్మక్ చల్లో..
చేసుకున్న కొత్త అలవాటు..
ఒకటి రెండు ఇంట్లో శుభ కార్యాలకి తప్ప, సింథటిక్,పట్టు బట్టల వాడకం దాదాపు లేకపోవటం. అన్నీ నూలు బట్టలే నా వార్డ్ రోబ్ ని ఆక్రమించటం..
వ్యవసాయ విజయాలు..
చెప్పుకోదగ్గ పంటలు (కొద్దిగా పెద్ద పదం వాడినట్టున్నాను).. సంక్రాంతికి పసుపు కొమ్ములు తవ్వుకోగలగటం, ౨౦ గ్రాముల కందిపప్పు పండించుకోగలగటం, ఓ నాలుగు కిలోల చేమగడ్డలు, ఎనిమిది గెలల అరటి పండ్లు,.. బ్రహ్మ కమలాలు
తియ్య తియ్యని కొత్త బెల్లం లాగా.. మంచి బ్లాగ్ జ్ఞాపకాలు..
బ్లాగు లో దాదాపు అన్ని టపాలూ, విహంగ లో ఒక రచన, మాలిక పత్రికలో ఒక రచన, ఒక పుస్తకానికి తొలి రివ్యూ, ఒక సినిమా కి నవతరంగం లో ఏ-వ్యూ, నమస్తే ఆంధ్ర లో నా బ్లాగ్ టపా, బ్లాగ్ పరిచయం.. కృష్ణప్రియం టపా, స్ఫురిత వేసిన నా బ్లాగ్ ప్రొఫైల్ బొమ్మ, బోల్డు ఈ-ఉత్తరాలు..
అందుకున్న ప్రశంసలు..
నా తో అనారోగ్యకరమైన పోటీ తత్వం తో బాధపడుతున్న ఒక వ్యక్తి, ఒక బలహీన క్షణం లో నా బాటే కరెక్ట్ అని అంగీకరించటం, ,
కొన్ని బ్లాగర్ల ఈ-మెయిళ్ళు
చేసిన తప్పులు..
అబ్బా..ఇది కష్టం బాబూ.. చాలా చేశాను. అయినా.. కొన్ని .. స్కూటర్ మీద వెళ్తూ కూలీల పిల్లలిద్దరు ‘లిఫ్ట్’ అని అడిగితే కొంపలు మునిగే పని లేక పోయినా..సినిమా హాల్లో పార్కింగ్ దొరకదేమో నన్న బెంగ తో ఎక్కించుకోకపోవటం.. తర్వాత సినిమా చూస్తున్నంత సేపూ, అయ్యో అని వగచటం.
ఇస్త్రీ చేసే కుర్రాడు, నా బిడ్డ వయసు వాడు.. కేవలం పండగలకీ, పబ్బాలకీ స్వీట్లూ, అవీ ఇస్తాననీ,స్కూల్ ఫీజు కడుతున్నానన్న (ఎక్కడో మస్తిష్కం లో దాక్కున్న) గర్వం తో, ఒక విషయం లో సరిగ్గా పని చేయలేదని కొద్దిగా అవమానకరం గా మాట్లాడటం, సంవత్సరం అంతా.. మానని గాయం లా అది బాధించటం.
ఆఫీసులో కొంత పనిని కావాలని తప్పించుకోవటం, ఆఫీస్ సమయం లో వ్యక్తిగత పనులు చేసుకోవటం, .కొన్ని సార్లు హాస్యం శృతి మించి ఎదుటి వారిని గాయపరచటం.. ఒకరిద్దరిని ‘అవాయిడ్’ చేయటం..
మనస్సుకి నచ్చిన ఒక రోజు..
ఉదయపు అల్ఫాహారం, తోట పని, తలంట్లు అయ్యాక ఒకానొక ఆదివారం, పిల్లలు ఏదో ప్రాక్టీసులకని, శ్రీవారు ఆఫీసు పనికనీ,వెళ్తే.. నచ్చిన పుస్తకం చదువుకుంటూ, ఆవకాయన్నం తిని, ఒక కునుకు తీసి, చిరు చీకటి సమయం లో దీపాలు పెట్టకుండా.. పురందర దాసు రచించిన కాపీ రాగ కృతి ‘జగదోద్ధారణ’ పాడుకుంటుంటే, పక్కింటావిడ (బోంబే జయశ్రీ పెద్దమ్మ కూతురు) తన శృతి పెట్టే తెచ్చుకుని మరీ వచ్చి, నాతో కూర్చుని బోల్డు పాటలు పాడటం..
చిరు విజయాలు
ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ‘లైవ్’ హరికథ, దూర్ దర్శన్ పుణ్యమాని టీవీ లో మళ్లీ అప్పుడప్పుడూ చూసిన ప్రక్రియని ఆంగ్లం లో ‘దాక్షాయణి’ కథ ని ‘నాదా తనుమనిశం శంకరం’ , ‘నటనం ఆడెనే’, ‘శివాష్టకం’ లాంటివి పాడుతూ కర్ణాటక సంగీతం కృతులతో, పద్యాలతో కూర్పు చేసుకుని, నా పెద్ద కూతురి గాత్ర సహకారం తో కాంప్లెక్స్ వాసులకి చెప్పటం..
అన్ని వైపుల నుండీ వచ్చే ఒత్తిడులకి చెదరకుండా, బెదరకుండా, రెండు పెద్ద కస్టమర్ ఇష్యూలకి చెక్ పెట్టటం, నా కారీర్ లో ఇంకో ప్రాజెక్ట్ కొత్త బాక్స్ మీద సంవత్సరపు ఆఖరి రోజున పని చేయించగలగటం..
పిజ్జా, పాస్టా లే తిండి పదార్థాలు, ఆలుగడ్డ వేపుడు, ఉత్తర భారతీయులు చేసుకునే మీగడల, పనీర్ కూరలు మాత్రమే , తినాలి అనుకునే మా పిల్లల తో,.. పెసరపచ్చడి, నెయ్యన్నం, కాబేజ్, కాప్సికం, ముఖ్యం గా వంకాయ పులుసు అలవాటు చేయటం.
ఏకైక తమ్ముడికి పెళ్లి కుదిర్చటం లో ప్రముఖ పాత్ర వహించి, మరదల్ని తెచ్చుకోవటం.
సుమన్ బాబు సినిమాలకి ‘టెంప్ట్’ అవటమో, రాత్రి పూట మీటింగ్ లు నడుస్తుంటే పది దాటాక వేసే తెలుగు/హిందీ సినిమాలు చూడటం, అప్పుడప్పుడూ వేరే పనేదో చేసుకుంటూ చూసిన ఆంగ్ల సినిమాలు తప్పితే, టీవీ వ్యామోహం నుండి దూరమవగలగటం..
ఇంట్లో Wii,DS ల్లాంటివి ఉంచుకుని కూడా పిల్లలకి వాటి వైపు ధ్యాస పోకుండా ఆటపాటల్లో, పుస్తక పఠనం ఎక్కువ సమయం గడిపేలా చేయగలగటం.
మహాభారతం కథ విశదం గా చెప్పి, ఆఖర్న కొన్ని కథలు సగం సగం వదిలి, తద్వారా, మా పెద్దమ్మాయి తో డా. రాజ గోపాలాచారి గారి భారతం, దేవదత్త పట్నాయక్ రచించిన ‘జయ’ చదివేలా చేయగలగటం, అలాగే ఇడ్లీలు, దోశలు, పచ్చడి,మాగీ,సాండ్ విచ్ లు చేసుకోవటం అలవాటు చేయటం.
అపజయాలు..
నా దగ్గర చేరిన BITS BTech intern చేత పని చేయించుకోలేకపోవటం..
సంగీతం నేర్చుకోవటం ఆపేయటం.,
కార్ డ్రైవింగ్ టెస్ట్ కి ఈ సంవత్సరం కూడా వెళ్లకపోవటం...
యోగా వదిలేయటం.
స్నేహితులు..
ఇరవయ్యేళ్ల తర్వాత, కలిసిన నలుగురు స్నేహితులు, పదహారేళ్ల తర్వాత కలిసిన ఇంకో స్నేహితురాలు.. Thank you facebook, Linked in!
కేవలం నాలుగేళ్లు కనుమరుగమవటం వల్ల, పల్చబడ్డ పదిహేనేళ్ల స్నేహాలు రెండు మూడు..
కొత్తగా ఏర్పడ్డ మూడు స్నేహాలు..
ప్రయాణాలు..
బెంగుళూరు కి దగ్గర ఊళ్లకి వారాంతం ట్రిప్ లు..మేకెదాటు, రామ నగర, దొడ్డ మలూర్, కాలి నడకన తిరుపతి వెంకన్న దర్శనం, అమెరికా, పారిస్ పర్యటన, ఒక ఎనిమిది సార్లు హైదరాబాద్ ట్రిప్పులు, ఒక కడప ప్రయాణం..
దుఃఖాలు.. వ్యక్తిగతం గా పెద్దగా లేనట్టున్నాయి. పేపర్లలో పడ్డ కొన్ని సంఘటనలు, దేవానంద్ మరణం,
‘వా హ్’ అనుకున్న సెలెబ్రిటీ .. అన్నా హజారే
‘వార్నీ’ అనుకున్న దొంగలు : గాలి జనార్థన్. కనిమొళి
కొత్తగా సంపాదించిన చరాస్తులు.... నా బ్లాక్ బ్యూటీ (నల్ల హోండా ఆక్తివా బండి), ఒక జత బంగారు గాజులు.
బాగా కాయకష్టం చేసి అలిసిన రోజు.. వెంకన్న దర్శనం కోసం కాలి బాటన వెళ్లటాన్ని వదిలేస్తే, ఇంటి వెనక తోటంతా శుభ్రపరచిన రోజు..
‘అమ్మయ్య’ అనుకున్నరోజులు... తమ్ముడి పెళ్లయి ఇంటికి వచ్చిన రోజు, పిల్లల పరీక్షలైన రోజు, నిరోష్ఠ బ్లాగాయణం టపా అయిందనిపించినరోజు..
ముప్పైల్లో అందులో ఆఖరి సంవత్సరం ఇంత ఇంటరెస్టింగ్ గా గడుస్తుందని ఎప్పుడూ అనుకోలేదు రోలర్ కోస్టర్ రైడ్ లాంటి బిజీ జీవితం లో చిన్న సర్ప్రైజ్ లు చిలకరించి మనసు లోతుల్లో, ఎక్కడో ఆటక పైన పెట్టిన దుమ్ము పెట్టిన అట్ట పెట్టెల్లో దాచిన పాత పరిచయాలు, అప్పుడప్పుడూ ఒక్కోటి గా దింపి, నెమరు వేసుకునేలా చేసిన ఘనత మాత్రం ఫేస్ బుక్, బ్లాగ్, లింకేడ్ ఇన్ లకే ఇస్తాను. మళ్లీ మనుషులని కాస్త దగ్గర చేయటానికి విత్తనం అయితే వేయబడింది. ఇక వాటిని నీళ్లు పోసి, జాగ్రత్తలు చేసి నిలుపుకోవటం, వదిలేయటం నా చేతుల్లోనే ఉంది.
ఇంకో ఐదు రోజులుంది కొత్త సంవత్సరాగమనానికి... ఇంకెన్ని రంగులున్నాయో, రుచులున్నాయో, ఇంకెన్ని పరిమళాలు నా కోసం వేచి ఉన్నాయో,. చూద్దాం!