Monday, June 11, 2012 20 comments

అగ్వగ్వాగ్వాగ్వ! మీకు పండగ, మాకు దండగ...

తెలుగు కవిత్వం చెప్పాలంటే, మగవారికి, థళ థళ లాడే తెల్లని ధోవతి, కుర్తా, కండువా, ఆడవారికి హుందా తనం ఉట్టిపడే చీరలు,..గట్రా... బాసంపెట్లు వేసుకునో, లేక ఎటో అలౌకికావస్థ తో, తీరిగ్గా ప్రశాంతత నిండిన ముఖం తో, ఉండాలేమో, అనే స్టీరియో టైపింగ్, మనసులోకి వచ్చేస్తుంది నాకు.. నిత్య జీవితం లో దాక్కున్న కవిత్వం ఎన్నో సందర్భాల్లో, తొంగి చూసినా, కొన్ని సార్లు కొన్ని చిత్రాలు ఇలాగ మస్తిష్కం లో నిలిచిపోతాయి.


ఈ మధ్య భాగ్య నగరం లో కొన్ని ప్రాంతాలకి వచ్చి వారానికో సారి సంత పెడుతున్నారు గా.. ఆకు కూరల దగ్గర్నించీ, ఇనప మూకుళ్ళదాకా! అప్పడాల నుండీ, సమోసాల దాకా కూడా అమ్మేస్తూ.. మా అమ్మగారింటి దగ్గర ప్రతి మంగళవారం పెట్టుకునే ‘మంగళవారం మండీ’ గురించి ఎన్నోసార్లు విన్నాను, చూశాను, కానీ ఎప్పుడూ, మంగళ వారం సాయత్రం హైదరాబాదు లో అమ్మగారింట్లో, తీరిగ్గా గమనించే అవకాశం రాలేదు. ఈసారి వేసవి కాలం లో హైదరాబాదు కెళ్లినప్పుడు కాస్త తీరిక చేసుకుని, కాస్త షాపింగ్ చేశాను. కొద్ది మందిని అడిగి నాలుగు ఫోటోలు తీశాను.. మా పిన్ని నాకు మోడలింగ్ కూడా చేసింది గా :)


మంగళ వారం అయ్యేసరికి, మా కళ కళ లాడే కూరగాయల మార్కెట్ కి చిన్ని కవితలూ,సరదా పిలుపులూ, స్లోగన్లూ, పెట్టని తోరణాలు..

మధ్యాహ్నం రెండు దాటడమేంటి! ఇళ్ల ముందు రోడ్డు బ్లాక్ చేసి పట్టాలు పరవటం మొదలు పెట్టారు. మా స్కూటర్లు అవీ కూడా లోపల పెట్టేసాం. మా ఇంటి ముందు గోరు చిక్కుడు కాయలమ్ముకునే లక్ష్మి, తన బిడ్డని అలవాటు గా మా ఇంట్లో పడుకో పెట్టి వెళ్లి కూర్చుంది. మేమూ, ఓ సంచీ వేసుకుని సంత లోకి దూరిపోయాము.

‘అగ్వగ్వాగ్వాగ్వాలూ బీస్కుదో కిల ..బీస్కుదో కిల..’

‘ఏంటండీ? అంటున్నాడూ!’ అంటోంది ఒకావిడ కొత్తగా వచ్చినట్టుంది భాగ్యనగరానికి.. కాస్త కోస్తా యాస తో ..

‘ఇరవై కి రెండు కిలోల్.. బామ్మగారూ.. బంగాళా దుంపల్ చవ్కా.. చవ్కా! గింత చవ్కాగా ఎక్కడ దొర్కాద్!’ అని స్లోగన్ మార్చి పిలిచాడు, ఆలుగడ్డలమ్ముకునే అబ్బాయి.



మామిడి కాయలమ్ముకునే ఈ కవి హృదయం చూసే జనాలు అయస్కాంతానికి ఆకర్షించబడే ఇనప రజను లా వచ్చి చేరుతున్నారంటే నమ్మండి...

‘పప్పులకూ, ఉప్పులకూ,

చట్నిలకూ, పుల్సులకూ,’

‘రైసులకూ, షర్బత్తులకూ’

ఏడుకొక్కటి, పదికి రెండు,

‘తియ్యంగ కావాల్నా! రాండ్రి.. పుల్లంగ కావాల్నా! రాండ్రి,

చప్పని కాయ కావల్నంటే ఈడ కష్టం, ఆ యేన్క మీ ఇష్టం!’

అని అందర్నీ పిలుస్తుంటే, కాయ ఎలా ఉన్నా కోనేయాలనిపించి సంచీ నింపేసా.



‘పది కి మూడు, దస్కూ తీన్’ అంటూ అమ్ముకుంటున్న ఆకుకూరలమ్మి ని వెళ్లి ‘పది కి ఐదిస్తావా?’ అని అడిగి ‘పోమ్మా! ఎప్పుడైనా కూరలు కొన్న ముఖమేనా? చేయి తీయి నా ఆకు కూర మీద !’ అనిపించుకుని, ‘అందరికి నాలుగిస్తున్న, కళ్లజోడు ఆంటీ బిడ్డవి కద! నువ్వు ఐదు తీస్కో పో’ మని కూడా ఇంకో చోట కాస్త తగ్గింపు ధర సాధించుకుని, ‘బోణీ బేరం.. తీస్కోమ్మా బేరం వద్దు’ అని అప్పటికే కనీసం పది మందికి నా కళ్లముందే ముందుగా అమ్మినా సెంటిమెంట్ తో కొట్టి కొనిపించిన వారిని వారించలేక, సంచీలు నింపుకుంటూ,.. తిరుగుతూ ఉన్నాను..

‘దస్కూ చార్ దస్కూ చార్.. మీకు పండగా.. మాకు దండగా.. దస్కూ చార్..’ అని ములక్కాడల వ్యాపారి కవితా ధోరణి లో పిలిచాడు. ములక్కాడ అప్పుడు కొనాలనుకోక పోయినా, ‘మీకు పండగా.. నాకు దండగా..’ లైన్ నచ్చి ఓ నాలుగు కొనేశాను.

బంగారం.. బంగారం.

బంగారం, బంగారం, రేపు ప్రియం, ఇయ్యాల నయం.. పది కి కిల బంగారం.. బంగారం.

బజార్లో ముప్ఫై వేలకి తులం అంటున్నారు, ఇతను పది కి కిలో అంటున్నాడు అని చూస్తే బంగారు ముద్దల్లాంటి దోసకాయలు.. నిజమే! బంగారం పెట్టుకున్న దగ్గర్నించీ, వంటి మీద బరువు, ప్రశాంతత కరువు! (బాబోయ్.. నాకూ కవిత్వం వచ్చేస్తోంది!!) అదే దోస కాయలైతే, చలవ, హాయి,.. ఆహా.. ఓహో అనుకుని ఓ కిలో అవీ పడేశా సంచీ లో.


కుంపట్లు, మూకుళ్ళు,. కవ్వాలు, ఇనప పెనాలు, కొలత పాత్రలు,.. చెక్క గరిటెలు, జల్లెడ లూ, కత్తులు, పట్టకార్లు,.. ఆహా  చూస్తేనే,  నాకు కడుపు నిండిపోయింది.



‘కళకి భాషా బేధాల్లేవు..’ అని ‘సినీ’ కళాకారులు ఇచ్చే స్టేట్ మెంట్లు చూసి.. నవ్వుకుంటూ ఉంటాను కానీ, వ్యాపారం విషయం లో మాత్రం, ఒకటే సూత్రం.. ‘ఏ భాషైనా.. వస్తువు అమ్మ గలగాలి, అది అమ్మేమనిషి బాధ్యతే’

‘మల్లే పూల్ , మల్లే పూల్! అంటూ సైకిల్ మీద అమ్మేసుకుంటున్న ఆసామీ, బుర్ఖా వేసుకున్న ఆడవారి కోసం, ఒక్కసారి గా, ‘మొగ్రా, మొగ్రా,.. లేలో, జీ మొగ్రా..’ అని భాష మార్చాడు. ఆంగ్ల భాష లో సంభాషణ జరుపుతూ, వెళ్తున్న కాలేజీ అమ్మాయిలు పక్కన కనపడేసరికల్లా, మళ్లీ ‘ఫాట్ జాస్మిన్స్, ఫ్రెష్, ఫాట్ జాస్మిన్స్.. టేక్ మాడం..’ అని మార్చేశాడు. ఘటికుడే!

వాగ్ధాటి లేని వ్యాపారుల దగ్గర అయ్యో ఒక్కరూ లేరే!


వంకాయల వ్యాపారికి మాత్రం, అతని వాగ్ధాటికీ, వ్యాపార చతురత కీ, నేను మొదటి స్థానం ఇచ్చేస్తాను.

ఓ రాజ శేఖర రెడ్డి లా, ఓ చంద్రబాబు నాయుడిలా, రకరకాల మోడ్యు లేషన్ల తో, ‘అమ్మ్మా! మా వంకాయలు కొని, మీ కుటుంబం లో కలతలొస్తే నాకు సంబంధం లేదు.. లేత గున్నయ్ గదా, పాలు కారుతున్నయ్ అని, నువ్వు మసాల బెట్టి, కమ్మగ వండి, మొగునికి పెట్టకుండ, అత్త,మామకి వాసనైన చూపకుండ, బిడ్డలని కనికరమైన చేయకుండ, పొయ్యి మీదకెల్లి తీసి, అంత నువ్వే తింటే, అది మా తప్పు కాదు. మమ్ముల్ని అడిగితే, మాకు తెల్వదు. మా మీదకు రావొద్దు! లేత వంకాయల్’ అని అందర్నీ ఆకర్షిస్తున్న అతని ముందున్నవి అన్నీ, ఎండిపోయిన, వడలిపోయిన కాయలు. చాలా వరకూ పుచ్చులు కూడా ఉండవచ్చు..

గల గల లాడుతూ, ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ, ఎకసెక్కాలు చేసుకుంటూ,..

చీకటి పడిపోతోంది.. త్వర త్వరగా అమ్ముకుని ఇళ్లకి వెళ్దామనుకునే తొందర లో, లైట్ల వెలుగు లో,..

కిలో ఇంతకి’ అని అమ్ముకునే వారల్లా, కుప్ప ఐదుకి, కుప్ప పదికి,.. అని ఖాళీ సంచులు సద్దుకుని, అమ్మిన మేరా, కాస్త తుడిచేసి, పిల్లల్ని, పైసల్ని జాగ్రత్త గా పట్టుకుని, వాళ్ల కార్రియర్ బండ్లు ఎక్కేసి, గొడవ గొడవ గా.. వెళ్లి పోయారు. కూరగాయల మార్కెట్ కవిత్వం, మాత్రం, నన్ను ఇప్పటిదాకా వెంటాడుతూనే ఉంది.. మళ్లీ బెంగుళూరు లో సూపర్ మార్కెట్ లో ‘డల్’ గా రోల్ లోంచి కవర్లు చింపుకుని, కూరగాయలు, పండ్లు నింపుకుని వస్తున్నప్పుడల్లా, ముఖం మీద చిరునవ్వు తెప్పిస్తూనే ఉంది.

Monday, June 4, 2012 29 comments

ఎవెంజర్లూ, రివెంజర్లూ..



 

ఈ వేసవి సెలవల్లో..



‘Ammaa! I am bored.. What should I do?’ పిల్లలు ఈ ప్రశ్న కి రోజూ వారీ సెంచరీ పూర్తి చేసేశారు..



వేసవి సెలవలనేసరికి అమ్మమ్మ ఊరికి పరిగెత్తటం, లేదా, కొత్త ప్రదేశాలకి వెళ్లి రావటం తప్ప, గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవటం, చుట్టుపక్కల ఎవ్వరూ పిల్లలు లేకపోవటం, అనేదే మా పిల్లలకి తెలియదు.

ఈసారేమో.. ఒక నెల రోజులు వాళ్ల అమ్మమ్మగారింట్లో గడిపినా, వాళ్లూ ఉత్తర దేశయాత్రలకి బయల్దేరటం తో, బెంగుళూరికి వచ్చి పడ్డారు..

భాగ్య నగరం లో ఎండలు మండినా, .. అమ్మమ్మ, తాత గార్లు, కదలకుండా కూర్చోబెట్టి ఎక్కాలు వల్లె వేయించి, పట్టు పట్టి తెలుగు పద్యాలు, పాటలు నేర్పించినా.. పిజ్జాలూ, నూడిల్సూ, కుదరదని, ఇడ్డెన్లూ, మినపరొట్టెలూ, పెసరట్లు,.. పెట్టినా, స్విమ్మింగ్ పూళ్ళూ, ఎలెక్ట్రానిక్ ఆట సామాగ్రికీ దూరం ఉంచి, కొబ్బరి నూనె రాసి నున్నగా జడలేసి, అష్టా చెమ్మా, పులీ మేకా, కారమ్స్ కి పరిమితం చేసినా.. మాళ్ళూ, ఎమ్యూజ్ మెంట్ పార్కులూ కాదని చార్మినార్లూ, సాలార్ జంగ్ మ్యూజియం లు బస్సులెక్కించి తిప్పినా, వేసవి సెలవల్లో అమ్మమ్మ గారింటికి ఉన్న చార్మ్, ఇంక దేనికీ లేదు కదా..

బెంగుళూరు కి రావటమేమిటి? ఇదిగో ఈ ‘బోర్’ మంత్రం.. పక్కన లైబ్రరీ లో పుస్తకాలన్నీ చదివేసింది పెద్దది. అప్పటికీ ఒక ఇరవై పుస్తకాలు కొని పెట్టాను. అన్నీ అయిపోయాయి. చిన్నదానికి అబ్బే ..పుస్తకాలు అంతగా ఎక్కవు. స్విమ్మింగ్, యోగా, బాడ్మింటన్,..తిరుగుళ్లు, షికార్లు, టీవీలు, అయినా బోరే..

ఈ ‘బోర్,బోర్’ అన్న గొడవ పడే కంటే.. అదిగో పరీక్షలకి దగ్గరుండి చదివించటమే సులువేమో.. కనీసం ఏం చేయాలో తెలుసు.

ఏమయితేనేం? వేసవి సెలవల కోసం ఎదురు చూసినంత సేపు పట్టలేదు! .. వచ్చినట్టే వచ్చి, ఇట్టే అయిపోయాయి.. వచ్చేవారం స్కూళ్లు మళ్లీ తెరుస్తున్నారంటే, ఇంకా వారమే సెలవలు అని ఒక బెంగ మొదలైపోయింది.

సాయంకాలం సినిమా కెడదామా అనుకునేసరికి ఇంట్లో రెండు పార్టీలు తయారు. మా వారు,నేను గబ్బర్ సింగ్ అని, పిల్లలు ‘అవెంజర్స్’ అనీ!

ఎవెంజర్లు!


‘పోన్లే పాపం పిల్లలు ఎవెంజర్స్ అంటున్నారు.. గబ్బర్ సింగ్ లేదు, దమ్ము లేదు.. ఎవెంజర్స్ సినిమా కి వెళ్తున్నాను.. ఎవరొస్తారు నాతో?’ అని మా వారు ఆర్డర్ పాస్ చేసేశారు. . కళ్ళుమూసి తెరిచే లోపల పిల్లలు గాయబ్. ఒకళ్ల చేతిలో నీళ్ల సీసా.. ఇంకోల్ల చేతిలో బండి తాళాలు.. ‘అదేంటి? ఇప్పుడా! మా క్లాస్ మేట్ కర్ణాటక సంగీత కచేరీ కి వెళ్దాం అనుకున్నాం కదా..’ కంగారు గా అన్నాను..



‘ఓ పని చేద్దాం.. ఇంగ్లిష్ సినిమా గంటా, గంటన్నర కి మించి ఉండదు.. అది చూసి, పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి అప్పుడు సంగీత కచేరీ కి వెళ్దాం..’ అప్పుడు అందరూ హాప్పీ... సరేనా?’ అని మావారు అనడగగానే, ‘ఇది బాగానే ఉంది.. ‘అనుకుని, నేనూ చక చకా రెడీ అయపోయా..

దారి పొడుగునా “ఆరుగురు సూపర్ హీరోలు.. ఒక్క సినిమా లో..” అని అరమోడ్పు, కన్నులతో, అత్యంత పారవశ్యం గా.. పిల్లలు.. హల్క్, మెటల్ మాన్.. అదీ ఇదీ అని ఏవేవో విశేషాలు చెప్తూనే ఉన్నారు. నాకేమో కార్టూన్ సినిమాలు పట్టవు. సూపర్ మాన్, స్పైడర్ మాన్, బాట్ మాన్ సినిమాలే చిరాకు అనుకుంటే ఒక్క సినిమా లో ఆరుగురే! ఇదెక్కడి గొడవ? అదే కళ్యాణ్ బాబైతే.. వెయ్యి సూపర్ హీరోలకి పెట్టు.. పైగా.. ఒక్క సూపర్ హీరోకి అయినా ప్రేమ వ్యవహారాలూ, డ్యూయేట్లూ ఉంటాయో ఉండవో,.. అని విసుక్కుంటూ, హాల్లో సీట్లు సంపాదించుకుని కూలబడ్దాం..

ఒక కంటికి గంత కట్టుకుని సామ్యూల్ జాక్సన్ గారు, ప్రపంచాన్ని రక్షించే బాధ్యత నెత్తి మీద వేసుకున్నారు.. యోకీ అన్న గ్రహాంతర వాసి అనుకుంటా.. వచ్చి దొరికిన వాడిని దొరికినట్టు కొట్టి, ప్రపంచాన్ని నాశనం చేయగల రసాయన స్పటికం లాంటిది కొల్లగొట్టి పారిపోయాడు. రెండువారాలే సమయం ఉంది. మన సూపర్ హీరోలందరినీ రప్పించి యోకీ ఎక్కడున్నాడో కనిపెట్టి, రేడియో ఆక్టివ్ మూలకాన్ని తెచ్చి మళ్లీ భద్రపరచాలని.. తెగ సీరియస్ గా ప్లానింగ్ జరుగుతోంది.. ఆవలింతలు.. పక్కన చూస్తే.. పిల్లలు.. సీట్లో స్టిఫ్గా కూర్చుని.. ముందుకు ఒరిగి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్నారు. హాల్లో అందరూ దాదాపు అదే అలౌకికావస్థ లో ఉన్నారు.

‘హాఆఆఆఆఅయ్’ నాకు ఆవలింతలు..

నెమ్మదిగా సీట్లో జాలబడి ఓ రెండు నిమిషాలు నా మొబైల్ ఫోన్ లో సరిగ్గా రాని ఫోటోలు తీసేయటం, పాత SMSలు తొలగించటం లాంటివి చేసుకున్నాను.

మళ్లీ ఆవలింతలు..! హిందీ లో డైలాగు వినబడింది.. కుతూహలం గా నేనూ చూడటం మొదలు పెట్టాను.



ఒక సూపర్ హీరో దారిద్ర్యం తో మగ్గుతున్న కోల్కోతా వీధుల్లో, మురిక్కాలవ లో ఒక సంవత్సరం మురగ బెట్టి రెండు వేల చిరుగుల కర్టెన్ వేసిన కొంప లో, భయానక అంటు వ్యాధి తో, (కలరా? ప్లేగ్?) మ్రగ్గుతున్న ముసలి వాడికి వైద్యం చేస్తూ, రెండు ఇంచిల మేర మురికి పట్టిన, తైల సంస్కారం లేని జుట్టు తో, ఈసురోమంటూ, (స్లం డాగ్ పిల్లలు?) ఓ అమ్మాయి, మా నాన్నకు మందియ్యి ప్లీజ్.. నా దగ్గర డబ్బుంది.. అని దీనం గా ప్రాధేయపడుతోంది.. ఒళ్లు మండింది.. మురికి వాడలవెంబడి పరుగులెత్తి హైన్యం కోరుతున్న ఒక ఇంట్లో కి వెళ్లాడు.. ‘నీ అవసరం ఉంది.. ప్రపంచాన్ని రక్షిద్దాం.. పద’ మని ఓ ఏజెంట్ తీసుకుపోయింది.. అంటే.. కోల్కోత్తా లో ప్రపంచం లో భాగం కానట్టు.. వాళ్ల మాన్హాటన్, మాత్రమే ప్రపంచం అన్నట్టు..

లోహపు మనిషి (మెటల్ మాన్) ఎగురుతూ వచ్చి నూరంతుస్థుల మేడ మీద లాండ్ అవటం తోనే, ఒక్కోటి గా ఆయన కవచ కుండలాలు విడిపోయి, వెళ్లి తమ తమ స్థానాల్లో చేరిపోవటం,.. కళ్ళ ముందు హెల్మెట్ గ్లాస్ లాంటి దాని మీద సిక్స్త్ సెన్స్ లా ప్రతీదీ కనపడటం, దాన్ని చేతి కదలికలతో కంట్రోల్ చేయటం.. ‘ ఈ అమెరికన్లు ఎంతైనా సరి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని భలే వా... డుకుం టారు ‘హాఆఆఆయ్’ .. ఆవలింతలు..

చల్ల గా మల్టీప్లెక్స్ లో మెత్తటి సీట్ మీద హాయిగా సుషుప్తావస్థ లోకి జారుకున్నాను.

‘అమ్మా! ఇంత మంచి సినిమా లో నిద్ర పోతావా? ‘ అని కోపం చూస్తో మా పిల్లలు అరుస్తుంటే మెలకువ వచ్చింది.. ఇంటర్వెల్ ట.. సరే.. లేచి పాప్ కార్న్ కోసం బయట పడ్డాం. మా వారు నెమ్మది గా ‘అండాళ్ళూ.. నీకేమైనా అర్థమైందా?’ అని సణిగారు. ‘ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు.. ‘ అంటున్నానో లేదో, పక్కన గబ్బర్ సింగ్ నడిపిస్తున్న స్క్రీన్ లోంచి ‘కెవ్వు కేకా’ అని పాటా, ఈలలూ, హంగామా.. అక్కడికెడితే ఎంత హాయిగా ..ఈ పాటికి తిట్టుకుంటూనో, నవ్వుకుంటూనో, ఆనందంగానో, చూసేవాళ్లం కదా.. ఈ గొరిల్లా యోధుడెంటో! వీళ్లంతా, ఈ ప్రపంచ రక్షణ చేయటమేమిటో, తల రాత! అని విసుక్కుంటూ మళ్లీ మా బుట్ట పేలాల పొట్లం తీసుకుని సీట్లో కూలబడ్డాను. ఎంతకీ అవదే? నా ఖర్మ కాలి రెండున్నర గంటల సినిమా ట!

సెకనుకు ముగ్గురు కొత్త యోధులు గ్రహాంతర వాసుల అంతరీక్ష నౌక నుంచి పుట్టుకొచ్చి మాన్హాటన్ నగరాన్ని .. సారీ వాళ్ల ఉద్దేశంలో ప్రపంచం కదూ, సర్వ నాశనం చేస్తుంటే,.. ఒకడు కత్తితో, ఒకడు బాణాలతో, ఒకడు భవంతుల మీద నుంచి స్పైడర్ మాన్ లంఘించి దూకి, ఇంకోడు గోడ్జిల్లా లాగా శత్రుసైన్యాన్ని చేతుల తో ఎత్తి నేలకి కుదేసి మ్రోది,.. కష్టపడుతుంటే,.. న్యూయార్క్ వాసులు, హాహా కారాలు చేస్తూ, రోడ్ల మీద పరుగులు తీయటం... మొత్తానికి సినిమా ముగిసింది.. హాల్లోంచి పిల్లలు ఆనందంగా.. నేను, మావారు ఒక విధమైన చిరాకు తో, కూడిన విసుగు సమేతమైన నిస్సహాయ స్థితి నుండి ఉద్భవించిన తల నొప్పి తో బయట పడ్డాం..

రివెంజర్లు..

ఇంటికి వెళ్లి పిల్లలని దింపే సమయం లేదు. విశ్వవిద్యాలయం లో నాతో కలిసి చదువుకున్న మోహన్ సంగీత కచేరీ.. ఎప్పుడో లల్లాయి పదాలు, పాత సినిమా పాటలు, పాడుతుండగా ఇరవై ఏళ్ల క్రితం విన్న నా స్నేహితుడి సంగీతం ప్రోగ్రాం.. వదులుకునే సమస్యే లేదని కారాఖండీ గా చెప్పేశా.. పిల్లలు దోవ పొడుగునా, సణుగుతూనే ఉన్నా పెద్దగా పట్టించుకోలేదు.. ‘ఏం? మీ అవెంజర్లు చూసినప్పుడు మా పరిస్థితీ ఇంతేగా? మీరూ వచ్చి తీరాలి.. వేరే మార్గం లేదు’ అని దటాయించి ‘బెంగుళూరు గాయన సమాజ‘ భవంతి ఎదురు గా కారు ఆపి దిగి చూస్తే, ఒక శాల్తీ లెక్క తక్కువైంది.. చూస్తే మా చిన్నది రెండు చేతులూ కట్టుకుని ‘రానని’ కార్ లోనే భీష్మించుకుని కూర్చుంది. సామ దాన బేధ, దండోపాయాదులని ఉపయోగించి అమ్మాయిని దారిలోకి తెచ్చుకుని నలభై రూపాయల టికెట్లు కొట్టించుకుని హాల్లో కి ప్రవేశించాం. ఐదు వందల మంది పట్టే హాల్లో, అక్కడక్కడా.. నలుగురూ, ఐదుగురూ,.. ముసలి వారు ఉన్నారు. యాభై ఏళ్లకి తక్కువ వయసువారు బహుశా మేము కాకుండా మా మొహనుడి భార్య మాత్రమే నేమో.. . మోహన్ స్టేజ్ మీద నించే పలకరింపుగా చేయి ఊపి అభివాదం చేశాడు.

ఏమాట కామాట చెప్పద్దూ, మా పిల్లలు ఉప్పొంగిపోయారు. ఒక విద్వాంసుడు, స్టేజ్ మీద నుంచి నన్ను పలకరించాడని.. సీట్లల్లో కూలబడ్డాకా, మా అమ్మాయి.. ‘అమ్మా! నీకొక ఫన్నీ తింగ్ చెప్తా..’ అంది..

‘ఇప్పుడు కాదు..’ అని వారిస్తున్నా, వినకుండా.. ‘చూడు.. మగవాళ్ల జుట్లన్నీ తెల్లగా, పక్కన కూర్చున్న ఆడవాళ్ల జుట్లు కాటుక లా నల్లగా..’ కిసుక్కున నవ్వాను.. కానీ..’ష్... ‘ అని సీరియస్ గా కూర్చున్నాను. ‘ఏం చేస్తాం? ఉన్నదే ఒక యాభై మంది.. సరిగ్గా వినకపోతే, అసహ్యంగా ఉంటుంది మరి..’

‘ఆట తాళ వర్ణం.. ‘ చక్కగా పాడుతున్నాడు . చిన్నదేమో.. ‘మా సినిమా లో నువ్వు నిద్రపోయావు కాబట్టి నేనూ, మీ ఫ్రెండ్ సంగీతం లో నిద్రపోతా.. రివెంజ్..’ అంది. కోపం గా చూశాను. అంతకు మించి ఏం చేయగలం?

తోడి రాగం లో కీర్తన అందుకున్నాడు మోహన్.. ఈలోగా.. మూడు బాత్ రూమ్ బ్రేక్ లు. తీసుకున్నారు పిల్లలు. ఇంకో సారి అడిగితే ఏమవుతుందో తెలుసు వాళ్లకి.. దానితో, వారిలో వారు సైగలు చేసుకుని, మాటలు రువ్వుకుని, నవ్వుకుని, ఏవో గుసగుసలు మొదలు పెట్టారు.

కీర్తన అయింది. ‘మా క్లాస్ మేట్ కి కాస్త చప్పట్లు కొట్టండి! మీ క్లాస్ మేట్ మొన్న పిచ్చి బోరింగ్ జోక్ చెప్తే , నేను హా హా హా ‘ అని నవ్వా కదే! ‘ అని మరుగున పడుతున్న పాత జ్ఞాపకాలని వెలికి దీసి మా వాళ్లతో మా ఫ్రెండ్ కి చప్పట్లు కొట్టించుకున్నా..

‘దుడుకు గల నన్నే దొర కొడుకూ బ్రోతు రా ..’ మొదలు పెట్టాడు. వీళ్లకి దుందుడుకు హెచ్చింది.. గుసగుసల కొట్లాట మొదలు పెట్టారు. ఎంత మంది ఎలా తల కాయలు ఊపుతున్నారో చెప్పుకుంటూ, నవ్వుకోవటం.. ‘ఇంకా ఎంతసేపు?.. ‘ అని విసుగు చూపించటం.. ‘ఆకలేస్తోంది..’ అనటం.. పక్కన వారు ‘షష్ష్.. ‘ అనేంతవరకూ తెచ్చుకున్నారు..

ఈ లోగా, మోహన్ వెనక్కి తిరిగి ఒక ఫ్లాస్క్ లోంచి ఏదో ద్రవం స్టీలు సీసా లోకి వంపుకున్నాడు. ఇక మా పిల్లలు గొడవ.. ‘అమ్మా.. అదేంటి? కాఫీ? చాయ్? నీళ్లేమో?’ అని. “ అంత అద్భుతం గా పాడుతుంటే, మీకొచ్చే డవుట్లు ఇవా?” అని గుస గుస గా చివాట్లు వేసాను. మా చిన్నది.. పోనీ, ఏదో పని ఉన్నట్టు ముందు వరస లోకెళ్ళిస్మెల్ చేసి రానా? తెలిసిపోతుంది?’ అని ఉత్సాహం గా ఆఫర్ చేసింది. పళ్ళు పటపట లాడించా! ‘ఓకే ఓకే.. జస్ట్ కిడ్డింగ్’ అంది.

బొత్తి గా హాల్ గోడనానుకుని బజ్జీల స్టాల్ పెట్టాడేమో? అందునా, ఏసీ ఖర్చు లేకుండా, పక్క తలుపులు తెరిచి ఉంచాడేమో.. ఉల్లి పాయ పకోడీ, అరటి కాయ బజ్జీల వాసన.. హాల్లోకి మత్తుగా, ఆవరించింది. అంతే!

ఇక మా వాళ్లని ఆపలేకపోయాను. ‘రీతి గౌళ’ రాగం అయ్యేంతవరకూ, వేరే రసాస్వాదన లో తన్మయులై లోపలికి వచ్చారు.

‘కదన కుతూహల ‘ రాగాలాపన ఇటు మోహన్ మొదలు పెట్టేసరికి వీళ్ల చిరాకు తారా స్థాయి కి ఎక్కి, వీళ్ల గొడవ భరింప రానిదై కూర్చుంది... ‘షీ ఈజ్ సో మీన్.. కాదు! అదే స్టార్ట్ చేసింది. నన్ను తిట్టింది.. కాదు కావాలని నన్ను ఎల్బో తో తోసింది..’ ఇలాగ అంటూ అంటూ, .. చిత్రం గా, రాగాలాపన ఆపి కృతి ఆరంభించగానే, పిల్లలు వద్దనుకుంటూనే, నెమ్మదిగా పాట లో లీనమైపోయారు.. తెలియకుండానే తాళం వేయటం మొదలుపెట్టారు.. అప్రయత్నం గానే ఈసారి అడక్కుండానే చప్పట్లు కొట్టారు.

ఇక ఇదే ఆఖరు ఇదే ఆఖరు.. అని పోరు పెట్టడం మొదలు పెట్టినా పట్టించుకోకుండా, మొత్తానికి కచేరీ పూర్తి చేసి బయట పడ్డాం. దోవంతా ఎవరి ఆలోచనల్లో వాళ్లముండి పోయాం.

సంగీతం ప్రభావం వల్ల, మనస్సంతా ప్రశాంతత ఆవరించటం తో, నా ఆలోచనలు సినిమా మీదకి పోయాయి.. ‘ఎంత టెక్నాలజీ! పూర్వం సై ఫై సినిమాలకీ, ఎవెంజర్ సినిమా కీ ఎంత తేడా! అంత అద్భుతం గా ఎలా తీయగలిగారు.. అక్కడక్కడా, హాస్యాన్ని కూడా సందర్భానుసారం గా సంభాషణల్లో, బలవంతాన చొప్పించినట్లు కాకుండా.. ఇలాగ ఏదో ఆలోచిస్తూండగా, ఏదో తేడా గా అనిపించి వెనక్కి తిరిగి చూశాను..

చిరంజీవి పాట ‘యమహా.. నగరీ, కలకత్తా పురీ..’ పాట సన్నగా పాడుకుంటూ, ‘అమ్మ ఫ్రెండ్ పాడిన పాట అచ్చం ఇలాగే ఉంది కదూ..! It must be in the same raagaaa.. ’ అని మా రివెంజర్లు మాట్లాడుకుంటూ..



 
;