Saturday, December 22, 2012 29 comments

యుగాంతం రోజు.. (21.12.2012)

యుగాంతం,.. Dooms day,.. क़यामत का दिन.. ఏమో వీటి మీద ఇంటి చుట్టుపక్కల వాళ్ల చర్చలు, ఆఫీసు లో కబుర్లు.. Dec. 21 sales, .. టీవీల్లో షోలు,


ఉదయం లేస్తూనే.. ఆఫీసుకి వెళ్లాలంటే రోజూ లాగే బద్ధకం.. బయట అంతా కొద్దిగా పొగమంచు... పిల్లలకి స్కూలు లేదు. క్రిస్ మస్ కార్నివాల్, తల్లిదండ్రులు-టీచర్ల మీటింగు అయితే ఉంది పదిన్నర కి. సరే సగం రోజు సెలవ పెట్టి మధ్యాహ్నం ఇంటి నుండి పని చేద్దాం అని నిర్ణయం తీసుకుని.. నా చాయ్, నిన్నటివి, ఇవ్వాల్టివీ న్యూస్ పేపర్లూ నేనూ వెచ్చ వెచ్చగా హాయిగా కూర్చుని మొదటి పేజీ తీశాను...



దేశ రాజధాని లో మెడికో పై సామూహిక అత్యాచారం మీద కవరేజ్. వెచ్చదనం కాస్తా సెగలు గా.. దేశ రాజధాని లో అర్థ రాత్రి కూడా కాదు.. తొమ్మిదింటికి సినిమా చూసి వస్తే.. రోడ్డు మీద ఉన్న ప్రతివారికీ జవాబు చెప్పాలా? చెప్పకపోతే.. కొట్టేసి అత్యాచారం చేసి.. ఎదిరించిన పాపానికి పొట్టలో చిన్న ప్రేగుల దాకా నాశనం చేస్తారా? బస్సులోంచి తోసేసి వెళ్లిపోతారా? టీ మరీ చేదు గా,.. భయంకరమైన పశు ప్రవృత్తి.. ఢిల్లీ అంతే.. మహిళలకి అస్సలూ సేఫ్ కాదు. ఛీ.. అనుకున్నాను. ఏదో మిగిలిన ప్రాంతాలన్నీ మహా సేఫ్ అన్నట్టు.



ఈ సంవత్సరం మహా నగరం లో నమోదయిన అత్యాచారాల సంఖ్య 530+ ట. క్రితం ఏడు 630+. ఒక వంద తక్కువ అత్యాచారాలు అయ్యాయని సంతోషించాలా? ఇవన్నీ కేవలం రిపోర్ట్ చేసిన సంఘటనలే. ఇంక వెనక ఎన్ని అవుతున్నాయో.. ఎవరికెరుక? అయినా ఒక దేశ రాజదాననే ఏముంది.. ఆడ,మగ, వయసు తో సంబంధం లేకుండా.. ఒక సామాజిక భద్రత ఉంది, రాత్రి తల దాచుకోవడానికి చిన్నో, పెద్దో ఇల్లు అంటూ ఉన్న మధ్యతరగతి, లేదా ఆర్థికం గా ఉన్నత వర్గాల వ్యక్తులకి కూడా రోడ్డు మీద రక్షణ లేదు. ఫుట్ పాత్ మీద పడుకునే కుటుంబాల మాట, అర్థరాత్రి పొట్ట కూటి కోసం ఉద్యోగాల చేసి వెనక్కి వచ్చే అమ్మాయిల విషయం చెప్పనే అక్కర్లేదు. చిన్న సైజ్ పట్టణాల్లో.. 



ఒక మహా నగరం లో దేశ రాజధాని లో ఒక చదువుకున్న అమ్మాయికి జరిగిన ది కాబట్టి ఇంత వెలుగులోకి వచ్చి దేశాన్ని కుదిపేసింది.. మీడియా, విద్యార్థులు, సంఘ సేవ చేసే వాళ్లు, అందరూ ధ్వజమెత్తి నిరసిస్తున్నారు. వీధుల్ని నినాదాలతో దద్దరిల్లేలా చేస్తున్నారు... ఉదయం నుండీ ఏ చానల్ చూసినా గొంతులు చించుకుని మరీ దులిపేస్తున్నారు.. మంచిదే. యువత నిరసన ప్రదర్శించడం మంచిదే. వీరిలో చైతన్యం ప్రశంసనీయమే. మరి మిగిలిన ఐదు వందల సంఘటనలో? టైమ్స్ లో బెంగుళూరు, హైదరాబాదు, ఇంకా చిన్న పట్టణాల్లో గణాంకాలు కూడా ఇచ్చారు. ఎనిమిదేళ్ల పిల్లలు, ఐదేళ్ల పిల్లలు... వాళ్ల గురించి ఒక కార్నర్ లో చిన్న వార్త తప్ప, ఎంతవరకూ ప్రజలని ఎఫెక్ట్ చేసింది..



మా అమ్మాయి వచ్చి పేపర్ చదవడానికి కూర్చుంది. సాధారణంగా రోజూ పేపర్ చదవదని దెబ్బలాడతాను. ఈరోజు మాత్రం.. వద్దు.. ఆటల పేజీలు, కార్టూన్లు చదువు చాలు అని మెయిన్ పేపరు ఇవ్వలేదు. ఇలా మెయిన్ పేపర్ ఎన్నాళ్లు దాచాలి? అసలు దాచాలా? జాగ్రత్తలు చెప్పాలా? ఏరకమైన జాగ్రత్తలు చెప్పాలి? అభద్రతా భావం, సాటి మనిషన్నవాడిని ఎవ్వర్నీ నమ్మరాదని చెప్పాలా? అన్నీ నాకు ప్రశ్నలే. ఎవర్నడగాలో తెలియదు. ఎవరికైనా ఖచ్చితమైన సమాధానం తెలుసని నేననుకోను.

http://www.youtube.com/watch?v=hY8CyTeegrM , http://www.ted.com/talks/sunitha_krishnan_tedindia.html

ఈ మధ్య మనసు కలచి వేసేలా చేసిన ఈ వీడియోలు గుర్తొస్తూనే ఉన్నాయి. ఇంకోసారి చూసి కన్నీరు పెట్టుకుని,.. ఇంక కార్నివాల్ సమయం అయిందని లేచి రెడీ అయిపోయాం అందరం.



యుగాంతం రోజున ఆఫీసు లో ఒంటరి గా ఈ సువిశాల అంతరిక్షం లో ఒక ధూళి రేణువు లా కలిసిపోలేను.. కుటుంబం తో కలిసి నాలుగు రేణువుల సమూహం లా మిగిలిపోతాను. ఉదయం స్కూల్లో పని కాబట్టి సెలవ కావాలి. మధ్యాహ్నం ఇంటి నుండి పని చేస్తాను... అని మెయిల్ కొట్టాను.



స్కూల్లో కార్నివాల్ సరదాగా గడిచిపోయింది..కానీ ఏదో ముల్లులా గుచ్చుకుంటోంది. ఏంటో అర్థం కాలేదు. కాసేపటికి పిల్లలు ఏవో ఆటలాడుతుంటే పక్కనే నుంచుని ఆలోచిస్తున్నాను.ఒకమ్మాయి.. ‘Maam.. please go out and stand. NOW.. just get going .. We need space.. come on.. move...’ అని స్టాల్ లోంచి బయటకి తరిమింది. వెళ్తూ గొణిగాను. ‘బయట చాలా వేడి గా ఉంది. మా అమ్మాయి గోరింటాకు పెట్టించుకోవడానికి ఇంకో ఐదు నిమిషాలు పడుతుంది. మళ్లీ వెతుక్కోవాలి కదా..’ ఇంకా ఏదో అనేలోగానే.. ‘That’s not my problem Mam. You need to handle it. We need space. Please move’ అంది. ‘వార్నీ.. ఎంత మాట సొగసు. అక్కడికి వచ్చే వాళ్లు విద్యార్థుల తల్లిదండ్రులని తెలుసు.. తను ఒక విద్యార్థి .. బహుశా.. ఎనిమిదో/తొమ్మిదో తరగతి అయ్యుండచ్చు.. అనుకుంటూ.. బయటకి నడిచాను. అప్పుడర్థమైంది.. ముల్లు ఎక్కడుందో.. స్టేజ్ మీద ముగ్గురమ్మాయిలు.. ముగ్గురబ్బాయిలు డాన్సు వేస్తున్నారు. చుట్టూ పెద్దలు, పిన్నలు, చేరి చప్పట్లతో ఉత్సాహ పరుస్తున్నారు. వాళ్ల పాటలు..



‘Radha on the dance floor, Radha likes to party.. Radha wants to move that ... Radha body’,

‘సారొచ్చారొచ్చారే .. వచ్చాదోచ్చాడే’

‘ఆకలేస్తే అన్నం పెడతా..(కి తమిళ్/కన్నడ వర్షన్.. సరిగ్గా అర్థం కాలేదు. నా పిచ్చి గానీ కొన్ని తెలుగు పాటలే నాకు అర్థమయి చావవు..)

ఏజెంట్ వినోద్ లో పాట ప్యార్ కీ పుంజీ బజాదే..

Why this kolaveri Di’..



వయసుకి తగని పాటలకి డాన్స్ చేయడం నచ్చక, అక్కడ నుంచుని చప్పట్లు కొడుతున్న టీచర్ కి ఒకావిడ కి చెప్తే,.. ‘మా చేతుల్లో లేదు. మా సూపర్ వైజర్ ఇష్టం. ఆవిడకి రాత పూర్వకం గా మీరు కంప్లైంట్ ఇవ్వండి’ అంది. సర్లే.. మధ్యాహ్నం పని పూర్తి చేసుకోపోతే మళ్లీ వారాంతం లో పని చేసుకోవాలి.. ఎందుకొచ్చింది అని .అక్కడ నూడిల్సు, ఫ్రైలు, బర్గర్లు తినేసి ఇంటికొచ్చి పడ్డాము..



2012 సినిమా చూడలేక పోయానే.. ఎంత మిస్సయ్యానో.. అని నిన్నంతా తెగ బెంగ పడిపోయాను.. స్కూల్లో ఫంక్షన్ లో ఒక్కసారి గా నిలబెట్టిన వినైల్ హోర్డింగ్ గాలిలో, పరిగెట్టుకు వచ్చిన పిల్లల మూక తోసినందుకో, రెండూ జరిగినందుకో.. ఢామ్మని పడిపోయింది. ఇంకేం.. జనాలు.. బాబోఓఒయ్ అని పరుగులు ఒక నిమిషం తర్వాత తేరుకుని నవ్వుకున్నాం.

పక్కింట్లో కూడా పైన్నుంచి ఏదో కుర్చీ పిల్లలు పడేస్తే,.. పిల్లలు అంతా వచ్చి చూసి..’ఓస్ ఇంతేనా..అని బ్హాగా నిరాశ చెందారు..



ఒక స్నేహితురాలితో నా ఉదయం బాధని gchat ద్వారా పంచుకుని కాస్త శాంతించి... రాత్రి రోజూ లాగే శుభ్రం గా తినేసి, పుస్తకాలు చదువుకుంటూ అందరం పడుకున్నాకా, పాలు ఫ్రిజ్ లో పెట్టలేదని గుర్తొచ్చి లేచి వచ్చాక టీవీ పెడితే.. స్టార్ ప్లస్ లో 2012. నేనైతే కూర్చుని పూర్తిగా చూశాను. సాంకేతికం గా బాగా నచ్చింది. భలే తీశాడనిపించింది. అమెరికన్ల ప్రపంచం,వాళ్ల “ఉదారత” ..నవ్వొచ్చింది..



సినిమా చూస్తుండగా ఇంకో ఫ్రెండ్ ‘కర్ణాటక సంగీతం పాడే నిత్యశ్రీ భర్త ఆత్మహత్య వివరాలు చెప్తే బాధ వేసింది. ఇద్దరు అమ్మాయిలట. భర్త ఆత్మహత్య తర్వాత, తనూ ఆత్మహత్యా ప్రయత్నం చేసిందిట. నిన్న రాత్రి అత్తగారు చనిపోయిందట. అసలు పాపం ఏమవుతోంది తన జీవితం లో?


 చాలా ఏళ్ల క్రితం నాకు చెన్నై లో శ్రీమతి పట్టామ్మాల్ గారి కోడలు (లలిత గారనుకుంటా) శిష్యురాలితో పరిచయం ఉండేది. ఓరోజు బీచ్ కి వెళ్లి వస్తూండగా ఆ అమ్మాయి ‘హమ్మో.. నాకు క్లాస్ సమయమైంది. చూసుకోలేదు.. ఎలా’ అని కంగారు పడి ‘పోనీ నువ్వు నాతో వస్తావా? పట్టమ్మాళ్ ఇంటికి తీసుకెళ్తాను వస్తావా?’ అనడిగింది. నేను ఏదో ఒక పిచ్చి పాత నూలు సల్వార్ కమీజ్ లో ఉన్నాను. పైగా ఇసుక రాలుతోంది. అయినా.. carnatic musical trinity లో ఒకరైన పట్టమ్మాళ్ ని చూసే అదృష్టమే!! నాకు నోట మాట రాలేదు. అలా వెళ్లిపోయాం. అక్కడ నిత్యశ్రీ ని చూపించి.. ‘ఈ అమ్మాయే.. మా మాడం కూతురు. తనూ బాగా పాడుతుంది.కచేరీలు చేస్తుంది.’ అని పరిచయం చేసింది.



నా స్నేహితురాలు క్లాస్ లో కూర్చుంటే.. నిత్యశ్రీ తో నేనూ పిచ్చాపాటీ మాట్లాడుతూ కూర్చున్నాను. చాలా సరదాగా మాట్లాడింది. ‘అంత పెద్ద విద్వాంసురాలి మనవరాలు కదా.. మీకు చాలా గర్వం గా ఉండి ఉండవచ్చు కదా..’ అంటే.. ‘అవును. చాలా గర్వం గా ఉంటుంది. అలాగే చాలా అదృష్టం నాది’ అనిపిస్తుంది.. అంది. ‘మీరూ చాలా అదృష్టవంతులు..’ అంది.

‘అవును.పట్టమ్మాళ్ మనవరాలితో మాట్లాడే అవకాశం దక్కినందుకు.. కదూ’ అన్నాను.

‘చనువు గా ఒక్కసారి భుజం మీద చరిచి పక్కున నవ్వుతూ.. ‘కాదు. మీకు తెలుగు తెలుసు. తెలుగు వారు. త్యాగరాజ కృతుల్నినేర్చుకోవడానికి ఎంత ఈజీ మీకు? నాకు మా అమ్మ తెలుంగు నేర్పిస్తుంది..’ అంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం గురించి ఆసక్తి గా అడుగుతూంది.

‘సబాపతిం..’ అని రాగం తానం.. పల్లవి అంటూ ఏదో పాడి వినిపించింది. అప్పట్లో నాకర్థం కాలేదు.. విని మొహమాటానికి బాగుందని చెప్పాను. ఈలోగా, మా నాయనమ్మ ని చూడాలంటే పక్క వీడు కెళ్ళాలి అంది.



అంత పెద్ద కళాకారిణి ఇంటికెడుతూ కనీసం ఒక మూర పూలు, ఒక స్వీట్ ముక్క,కనీసం మంచి బట్టలు కూడా వేసుకోలేదు  అనుకుని చాలా మొహమాటం గా వెళ్లాను. పట్టమాళ్ నాతో ఎవరో అమ్మమ్మ మాట్లాడినంత ప్రేమ గా మాట్లాడి ఊరూ, పేరూ తెలుసుకుని ఒక మూర మల్లెపూలు చేతిలో పెట్టి, ‘పెట్టుకో. నా ప్రోగ్రాం ఉంది. త్యాగరాయ సభలో.. వస్తావా? ‘ అని అడిగింది. నాకు నోట మాట రాలేదు. పట్టు చీరల్లో పట్టమాళ్, లలిత గారు, నిత్యశ్రీ, పక్కన దిష్టి బొమ్మల్లా నేనూ, నా ఫ్రెండూ.. పట్టమ్మాళ్ కొడుకు నాచేతికి ఒక ఎలక్ట్రానికి తంబూరా ఇచ్చి కాస్త పట్టుకోమ్మా.. అని కార్ లోకి ఇచ్చారు. అప్పుడు చూసుకున్నాను. హవాయి చెప్పులు..చింపిరి జడ.. కానీ పట్టమాళ్ ఇచ్చిన మల్లెమాల.. నిత్యశ్రీ కార్ లో కూర్చుని నేను వెళ్లటమేమిటి? అని.



రెండు కార్లు వెళ్లి ఆ సభ దగ్గర ఆగుతూనే, చాలా మంది ఆవిడకి పుష్పగుచ్చాలతో స్వాగతం పలుకుతుంటే, ఆ వెనక మేము ఎలా వెళ్లామో, మొదటి వరస లో కూర్చుని ఏం విన్నామో.. దేవుడికెరుక. ప్రోగ్రాం అవుతూండగానే హాస్టల్లో మళ్లీ రానీయరని. స్టేజ్ మీద పాడుతున్న పట్టమాళ్ కి నమస్కారం చేసి, నాయనమ్మకి సహకారం ఇస్తున్న నిత్యశ్రీ కి బై అన్నట్టు చేయి ఊపేసి, నందనం బస్సెక్కేసాం...



జీన్స్ లో ‘కన్నులతో చూసినదీ’ పాటా,..చంద్రముఖి లో ‘వారాయ్’ అన్న పాట పాడి తెలుగు సినిమా ప్రేక్షకులకి చేరువ అయినప్పుడూ .. కర్ణాటక సంగీత సీడీ లు అమ్మే ప్రతి షాపు లోనూ తన సీడీ లు ఎప్పుడు చూసినా గర్విస్తూ ఉంటాను.. ఇదంతా ఇంకోసారి గుర్తు చేసుకుని..నిద్రపోయాను...



ఈరోజు లేచి చూస్తే.. నరకం లో నూనె లో కాల్చబడుతూనో, స్వర్గం లో కుర్చీల్లో కూర్చుని రంభా వాళ్ల డాన్సులు చూడకుండా,.. పాల పాకెట్లు మళ్లీ చింపుకుని స్టవ్ మీద పెట్టుకుని రోజు మొదలు పెట్టాల్సి వచ్చినందుకు సంతోషం గానే ఉన్నా,.. ఏమూలో ఒక చిన్న, mild disappointment.

Saturday, December 8, 2012 29 comments

గేటెడ్ కమ్యూనిటీ కథలు... రాధా మామియార్, సెంథిల్ మామ




“రాధా మామీ వస్తోంది.. లోపలకి పోదాం. లేకపోతే అరగంట దాకా వదలదు!! పద పద.. “..అని గబుక్కున ఇంట్లోకి లాక్కెళ్లి పోయింది రెండో నంబరావిడ.. అతి లాఘవం గా మిగిలిన జనాలు కూడా ఆవిడకి కనబడకుండా అందరూ భాగో అని తలుపులేసేసుకున్నారు..

(రాధక్క - మైత్రి)

‘అరే.. ఎవరబ్బా..ఆవిడ.. అంతలా హడిలిపోతున్నారు జనాలు’ అనుకుని కర్టెన్ లోంచి నెమ్మది గా తొంగి చూశాను. జుట్టుకి మైదాకు పెట్టి పెట్టి ఎర్రగా ఉంది. కాస్త భారీ మనిషి ముసలావిడ.. రోడ్డు మీద కొద్దిగా బాలన్స్ చేసుకుంటూ నడుస్తోంది.. నాకెప్పుడూ ఆవిడ తో మాట్లాడే సందర్భం రాలేదు.. నేను ఇక్కడ దిగే సమయానికి ఆవిడ కోడలి డెలివరీ కి అమెరికా వెళ్లిందట. అందువల్ల పరిచయ భాగ్యం కలగలేదు.

తర్వాత తీరిగ్గా కాస్త తెహ్కీకాత్ చేస్తే బయట పడ్డ విషయాలు.. రాధా మామియార్ కి కనీసం అరవయ్యయిదు వయసు. ఆవిడ భర్త సెంథిల్ గారికి ఓ డెబ్భై ఉంటుంది. కొడుకులు ముగ్గురూ ఖండానికొక్కరు గా వెళ్లి సెటిల్ అయ్యారు. ప్రతి సంవత్సరం,.. లండన్ కో, ఆస్టేలియాకో, అమెరికా కో ప్రయాణం కడుతూనే ఉంటారు భార్యా భర్తలు. కాలనీ లో ఉన్నప్పుడు వాళ్లని భరించడం మానవ జాతి తరం కాదు.

సెంథిల్ మామ రహస్యం చెప్తే మా నలభై ఇళ్లవాళ్లకీ మైక్ లో చెప్పినట్టు ఉంటుంది. ఇక గళమెత్తి ఏదైనా పద్యం అందుకుంటే చిన్నస్వామి స్టేడియం వాళ్లు మైకూ, స్పీకరుల్లాంటి ఖర్చులు లేకుండా ఈయన చేతే అక్కడ క్రికెట్ మాచిలకి కామెంటరీలు చెప్పించీగలరు. ఇక రాధా మామియార్ కి తను పెద్దదాన్ని అని ఒప్పుకోవడం ఇష్టం ఉండదు..ఇరవైల్లో, ముప్ఫైల్లో ఉన్న ఆడవాళ్ల తో అక్కా అని పిలిపించుకోవాలని బాగా తహ తహ. విధి వశాత్తూ రోజు లో ఏ సమయం లో ఎక్కడ కనిపించినా.. ఇక కనీసం ఒక గంట ఇంక ఆవిడ వదలరు.. గడగడా మాట్లాడుతూనే ఉంటుంది.

ఈ విషయాలు విన్నాకా నేను ప్రత్యేకం గా ఆవిడ తో పరిచయం పెంచుకోవాలని ప్రయత్నించలేదు. రోడ్డు మీద కనిపించినప్పుడు పలకరింపు గా ఒక చిరు నవ్వు., ఎవరో తోస్తే వంచినట్టు తలని అరక్షణం దించి, ఏదో పని మీద వెళ్తున్నట్టు ఉరుకులూ పరుగులూ పెట్టడం. మావారు మేనేజ్మెంట్ కమిటీ లో ఉండటం వల్ల సెంథిల్ మామ మాత్రం ఆ సంవత్సరం కోశాధికారి గా పనిచేయడం వల్ల చాలా సార్లు ఇంటికి వచ్చి ఏవో డబ్బుల లెక్కలు మాట్లాడుకోవడం మాత్రం జరిగేది. ఆయన మొదట్లో వచ్చి మాట్లాడేప్పుడు మావారి ని ఎందుకు అంతలా అరుస్తున్నారు అని ఒకటి కి పది సార్లు తొంగి చూసి, కొన్నాళ్లకి ఆయన తీరే అంత అని అర్థమయ్యాకా పట్టించుకోవడం మానేశాను.

ఈలోగా పంద్రాగస్తు వచ్చేసింది. మరి పొద్దున్నే ఖచ్చితం గా ఎనిమిది కల్లా జండా ఎగరేద్దామని నిర్ణయించుకుని అందరం ఠంచన్ గా తొమ్మిదీ, తొమ్మిదీ పదికి బద్ధకం గా జండా కర్ర దగ్గర నుంచున్నాము. ఈలోగా గున గునా నడుస్తూ రాధా మామీ.. ఆవిడని చూసి అప్పడిదాకా ముఖం గంటు పెట్టుకున్న వాళ్లు ఆవిడని చుట్టు ముట్టేసి ‘బాగున్నారా మామీ.. కనిపించడం మానేసారే? ‘ అని కుశలం అడుగుతుంటే ముక్కున వేలేసుకోవడం నా వంతైంది. ఆవిడ తీవ్రం గా ‘ఎనిమిది గంటలకి రమ్మంటే సంవత్సరానికి రెండు సార్లు కూడా స్నానాలు చేసి ఇక్కడకి రాలేరా? నేను ఇది మూడోసారి రావడం.. ఒక్కరూ లేరని వెనక్కి పోవడం.. ఏంటమ్మా? ఒక్క పూట కాస్త ఉదయమే లేవ లేరా? మీరే ఇలాగైతే మీ పిల్లలకి ఏం క్రమశిక్షణ నేర్పుతారు? ‘ అని అందరి మీదా విరుచుక పడింది.


నాకు భలే కిక్ వచ్చింది. నేనూ పిల్లలకి అల్పాహారం పెట్టేసి హడావిడి లో ఉదయం చాయ్ కూడా మానుకుని జెండా కర్ర దగ్గర పడిగాపులు కాస్తుంటే.. నాకూ ఇంచుమించు అదేస్థాయి అసహనం వచ్చింది. కానీ ఆవిడ లా బయట పడక నోరు మూసుకుని కృత్రిమ చిరునవ్వు అతికించుకుని తిరుగుతున్నాను. ఆవిడ వాక్ప్రవాహానికి అడ్డు వేయడానికే అన్నట్టు జండా ఎగరేసే కార్యక్రమం మొదలై పోయింది. పదకొండు గంటలకి మళ్లీ అందరూ కలవాలనీ, అప్పుడు అంత్యాక్షరీ, క్రికెట్ కార్యక్రమాల తర్వాత భోజనాలనీ నిర్ణయించుకుని అందరూ ఎవరిళ్ళకి వాళ్లు బయల్దేరారు. పిల్లలు, మావారు క్రికెట్ వైపు వెళ్లడం తో, నేనూ ఏదైనా టిఫిన్ తినేసి హాయిగా మాంచి పుస్తకమో, లేక టీవీ లో సినిమాయో చూద్దామని ఉత్సాహం గా ఇంటికేసి అడుగులేస్తుంటే, వెనక నుంచి ‘కృష్ణా.. ఉదయపు కాఫీ తాగలేదన్నావు కదా ఇంకా? నీతో ఈ రోజు పరిచయం సందర్భం గా ఫిల్టర్ కాఫీ పెడతాను మా ఇంటికి పద..’ అని మొహమాట పెట్టేసింది రాధా మామీ.


సరిగ్గా పని చేయనప్పుడు కాబిన్ లోకి .మేనేజర్ వెనక వెళ్తున్న ఉద్యోగి వెళ్తుంటే మిగిలిన వాళ్లు చూసినట్లు కొంతమంది జాలిగా, కొంతమంది ‘బాగా అయ్యింది దీనికి’ అన్నట్టు చూస్తున్నారు. నాకూ కొద్దిగా బెరుకు గా అనిపించింది.. ఇంట్లోకి వస్తూనే గమనించింది.. హాల్లో రకరకాల పత్రికలు చిందర వందర గా.. ఒక పక్క బల్ల నిండా మందులే. ఇంకో పక్క తాగేసిన కాఫీ కప్పులు.. మడత పెట్టాల్సిన బట్టలు. వంటింట్లో కి నడిస్తే అక్కడ సింక్ నిండా అంట్లు, పొయ్యి మీద ఉదయం పొంగిన పాల తాలూకు మరకలు, రాత్రి మూకుడు లోంచి ఎగిరి తప్పించుకున్న తాళింపు గింజలు.. అరుగు నిండా సామాన్లు.. ఆవిడ ఏమాత్రం సిగ్గు పడకుండా ఫిల్టర్ కాఫీ కప్పులోకి పోసి ‘పద..హాల్లో కూర్చుందాం.. ఇక్కడ చాలా సఫోకేటింగ్ గా ఉంది.. ‘ నన్ను సోఫాల్లోంచి పత్రికలని ఓ వైపు తోసుకొమ్మని, ఆవిడ బట్టల మూటని దీవాన్ మీదకి పెట్టి కబుర్లు చెప్పడం మొదలు పెట్టింది. చక్కటి ఆంగ్లం.

ఐదు నిమిషాల్లోనే ఆవిడ అద్భుతమైనభాషా జ్ఞానం నాకు అవగతమైంది. ఇంకో పది నిమిషాలకి ఆవిడకి సంగీతం లో ప్రవేశం ఉందనీ, మొక్కలంటే ప్రాణమనీ, ఈ వయసు లో పది కిలోమీటర్లు వెళ్లి సంగీతం నేర్చుకుంటుందనీ, చిన్న స్కూల్లో ఆంగ్లం, లెక్కలూ చెప్తుందనీ, అప్పుడప్పుడూ ఆడపిల్లల సంక్షేమ హాస్టల్ లో వాలంటీరింగ్ చేస్తుందనీ అర్థమైంది.

వచ్చేసేముందు అన్నాను... 'రాధా మామీ,.. ఇంత చక్కటి ఇంగ్లిష్ ఎలా మాట్లాడుతున్నారు? ఒక పక్క తమిళ్, ఇంగ్లిష్ పెద్ద పెద్ద నవల్లు చదువుతున్నారు.. ఒక పక్క భజన సంఘాలు, పూజలు..కిట్టీ పార్టీలు, సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో ఆసక్తి.. ఇదంతా చేయటానికి ఎంత ఓపిక, ఆసక్తి ఉండాలి.. మీరు చాలా యూనీక్ పర్సన్ '

వెంటనే.. ఆవిడకి ముఖం లో అప్రసన్నత ఆవహించింది. 'నన్ను మామీ అనద్దు. పేర్లతో పిలుచుకుందాం. నన్ను రాధా అని పిలువు. లేదా.. నీకన్నా పెద్ద కాబట్టి రాధక్కా /రాధాజీ అని పిలిచినా ఓకే.. ' నేను ‘అలాగే అలాగే ‘అని కంగారు గా అనేశాను. ఆవిడ కూడా తగ్గి ‘నేను సింగపూర్ లో పుట్టి పెరిగాను. నాకు 18 ఏళ్లు వచ్చేసరికి మా నాన్నగారికి జబ్బు చేసి అర్జెంట్ గా పెళ్లి చేసేస్తే బాధ్యత అయిపోతుందని మెడిసిన్ చదువుతున్న నన్ను బలవంతం గా మీ అంకుల్ కి ఇచ్చి పెళ్లి చేసేశారు. ఆయన ఇండియా కి వచ్చేసి ‘నువ్వు వస్తే రా.. నేను మాత్రం విదేశాల్లో ఉండే ప్రసక్తే లేదు..’ అనడం తో చదువు ఆపేసి వచ్చేయాల్సివచ్చింది. ఈలోగా వరసగా ముగ్గురు పిల్లలు.. ‘ అనేసి ఆపేసింది.

తర్వాత ‘చూడు ఇల్లు.. It’s all mess. Clean & neat house is a sign of a wasted life’ అని నమ్ముతాను. నాకున్న ప్రతి క్షణాన్నీ నాకిష్టం వచ్చినట్లు గడపటానికి ఇష్టపడతాను’ అందావిడ.

ఆరోజు అంత్యాక్షరీ లో ఎవ్వర్నీ పాడనీయకుండా ఆవిడే అన్నీ పాడేసిందనీ, ఎవ్వరికీ మాట్లాడే చాన్స్ ఇవ్వకుండా ఆవిడే మాట్లాడేస్తోందనీ అందరూ విసుక్కుంటూనే ఉన్నారు. తర్వాత ఆవిడ నన్నూ ఎప్పుడూ వదిలేది కాదు. ఎప్పుడో స్కూల్లో కడుపు నొప్పి సాకు తర్వాత, మళ్లీ ఆవిడ తో కబుర్లకి ‘మీటింగ్ ఉంది.. పిల్లలకి పరీక్షలు.. చుట్టాలొస్తున్నారు.. ‘ లాంటి సాకులు చెప్పి తప్పించుకోవడం లో Expert అయిపోయాను. తోట పని చేసుకుంటున్నా, ఎవరితోననైనా కబుర్లు చెప్తున్నట్టు కనిపించినా అంతే సంగతులు. ఖాళీ గానే ఉన్నావు కదా అని ‘రాధక్క’ నుంచి అలా కబుర్లు జీవనది ప్రవహిస్తూనే ఉండేది. అప్పుడప్పుడూ కొత్తరకం సాంబారు. పోరియల్, కేకులు, పాస్తా లూ తెచ్చి ఇస్తూ ఉండేది.  నాకు ఆవిడ ని తప్పించుకు తిరిగే ప్రణాళికలేయడం దినచర్య లో భాగమైపోయింది.


(సెంథిల్ మామ - ధాత్రి)
ఈలోగా సెంథిల్ గారిమీద అందరూ విసుక్కోవడం విపరీతమైపోయింది. ఆటోలో మోటారు బాగుచేయించుకుని వచ్చిన కాలనీ సిబ్బంది ని ‘ఆటో ఫేర్ కి రసీదు ఇస్తే కానీ బిల్లు పాస్ చేయననీ, అలాగే కాలనీ లో నాలుగు మొక్కలేస్తే.. ఛీప్ గా వస్తున్నాయని రాసీదులివ్వని చోట కొన్నారని తెలిసి డబ్బులు రిలీజ్ చేయలేదని ఒక గొడవ.. అంతకుముందు పని చేసిన కోశాగారాధికారి రిజిస్టర్ లో బాలన్స్ షీట్ సరిగ్గా టాలీ అవలేదని.. కాలనీ వాసులు నీళ్లు ఎక్కువ వాడేస్తున్నారని విమర్శిస్తున్నాడని ఎప్పుడూ ఆయన నిరంకుశ ధోరణి చర్చలే. అన్నింటికీ మించి ఆయన కసురుకున్నట్టు మాట్లాడటం మాత్రం తెల్ల కాలర్ ఉద్యోగులెవ్వరికీ కిట్టక అంతా లబలబ లాడిపోయారు.


ఆయన టర్మ్ అయ్యేసరికి ఆయనకి కాలనీ నిండా విరోధులే. ఆవిడ ని చూస్తే చాలు పరుగున ఇంట్లోకెళ్ళి తలుపులేసుకునే వారే ఎక్కువ. నేను మాత్రం ప్రతి ఆగస్టు 15 కీ, జనవరి 26 కీ ఆవిడ ఇంట్లో ఫిల్టర్ కాఫీ కార్యక్రమం మాత్రం వదల్లేదు. ఆవిడ పుస్తక పరిజ్ఞానం, సంగీతం విజ్ఞానం, సామాజిక స్పృహ .. వహ్వా..వహ్వా.. కానీ ఇలాగ అందరినీ ఊదరకొట్టకుండా ఉంటే ఎంత బాగుండు? అని రోజూ అనుకునేదాన్ని.

ఈలోగా.. ఓరోజు రాధా మామీ కింద పడిందని, కాలు ఎత్తలేక పోతోందని విన్నాను. ఆవిడ ఉంటే విముఖత వదిలి అందరూ తండోపతండాలు గా వెళ్లి పలకరించి వచ్చాం. నాకు ఎక్కువ కుదరకపోయినా.. చాలా మంది ఆవిడకి వంటావిడ కుదిరేలోపల కూరో, కుమ్మో అన్నంతో ఇచ్చి రావడం అలవాటు చేసుకున్నారు. ఆవిడ ధోరణి లో మార్పు లేదని, ఇంకా కబుర్లతో వాయిస్తూనే ఉందని విన్నాను. నేనూ సాయంత్రం నడక చివ్వర్లో ఓ నిమిషం ఆగి పలకరించి పరిగెత్తుకొచ్చేసేదాన్ని. ఆవిడ ఎలాగైనా లేచి నడవాలని ఒక పట్టుదల తో ఉండేవారు. భయంకరమైన విల్ పవర్. ఓసారి వెళ్లినప్పుడు ‘ఇంకో నిమిషం ఉందా నీ దగ్గర కృష్ణా’ అని అడిగారావిడ. ‘ష్యూర్ చెప్పండి అక్కా..’ అంటే.. లోపల అల్మారా లో ఒక పాకెట్ లో చీరలున్నాయి. ఇలా తీసుకురా.. అందావిడ. సరేనని తెచ్చాను.. అన్నీ పరవమంది. పరిచాకా, నువ్వొకటి తీసుకో.. అంది.

‘బానే ఉంది. నాకెందుకు? అస్సలూ వద్దు’ అనేశాను. ‘లేదు. మీ అందరికీ ఇద్దామని.. తెప్పించాను..’ నా పిల్లలెవ్వరూ రాలేదు.. మీరే కదా నాకు ఇంత సహాయం చేశారు! మేము ఇక్కడినుంచి వెళ్లిపోతున్నాము.. వచ్చేవారం.’ అంది. ‘అయ్యో మనిపించింది.’ కానీ వాళ్లు వెళ్లేది సిటీ మధ్యలో అపార్ట్మెంట్ లో మొదటి అంతస్తు లోకి.. ఎదురుగా డాక్టర్, బొక్కెన కి తాడు కట్టి కిందకి వదిలితే కూరగాయలు, పచారీ కొట్టు సామాన్లు, చప్పట్లు కొట్టి పిలిస్తే ఆటో సదుపాయం,.. అపార్ట్ మెంట్ లో బోల్డు మంది సీనియర్ సిటిజన్లు..ఎదురింట్లో ఆవిడ అక్కగారి కొడుకు..

నిజమే అదే కదా కావాలి వాళ్లకి ఈ వయసులో.. రెండు కిలో మీటర్లు నడిస్తే కానీ బస్సు/ఆటో దొరకని చోటు, డాక్టర్ కావాలంటే అరగంట వెళ్ళాల్సి వస్తే.. ఉప్పు కి అరకిలో మీటర్, కాయగూరలకి రెండు కిలో మీటర్లు వెళ్లాల్సి వచ్చే చోట, తన అనుభవ సారాన్ని రంగరించిన కబుర్లు వినేందుకు మనిషి లేని చోటు.. ప్రేమ గా అదిలిస్తే, క్రమశిక్షణ, సిన్సియారిటీ ని బోధిస్తే ‘shouting/interfering ’ అనుకుని విసుక్కునే చోటు..

అది నందనవనమైతే ఏంటి? ఇల్లు విశాల భవనమైతే నేంటి..కాలుష్య రహితమైతే నేంటి.. “Good Decision, we will miss you Radhakkaa..’ అన్నాను.. మనస్పూర్థి గా.. ఆవిడ ఒకింత సిగ్గు గా.. ‘You are like my daughter.. Call me Radha maaami.. No akkaa business’ అనేసింది. సెంథిల్ మామ దగ్గర్నించి కూడా సెలవు తీసుకుని కొద్దిగా బరువు గా అనిపిస్తుండగా వచ్చేశాను.

ఇప్పుడు మా కమ్యూనిటీ లో శబ్ద కాలుష్యం తక్కువైంది బాబూ.. ఎవ్వరూ వచ్చి ఆపేసి కబుర్లు చెప్పేయరు. సమయపాలన గురించి లెక్చర్లు ఇవ్వరు. అకౌంట్లు మెయింటెయిన్ చేయడం గురించి నిలదీయరు.. కాలనీ నీళ్లు వృధా చేస్తే అడిగే వాళ్లుండరు. ఏంటో...చుట్టూ ప్రశాంతతే! అది తినూ, ఇది తాగూ.. అని బలవంత పెట్టేవారు లేరు. నాకు ఈసారి జనవరి 26 న కమ్మటి కాఫీ చేతికిచ్చి ఎవ్వరూ మిల్టన్ పొయెట్రీ, త్యాగరాయ కృతుల చర్చలు చేయరు. టీవీ లో ఏదో ఒక చానెల్ లో సుత్తి ప్రోగ్రాం హాయి గా ఎంజాయ్ చేయవచ్చు...

 
;