Thursday, January 3, 2013

సైడు బెర్తు ఆవిడా, నేనూ


బెంగుళూరు – కాచిగూడా బండి ఎక్కి కూర్చున్నాం. తత్కాల్ లైన్లో మూడు గంటలు పడిగాపులు గాస్తే దొరికిన టికెట్లు.. ఏసీ టూ టయర్. నేనూ, నా పిల్లలూ సామాన్లు సద్దుకుని కూర్చున్నాకా ఎదురు గా చూస్తే నల్లటి గుబురు మీసాలు, పెద్ద బొజ్జ, ఎర్రటి పెద్ద కళ్ళు.. నుదుటన పెద్ద నామాలు.. కొద్దిగా భయం వేసింది. పిల్లలు కూడా ఒకింత గుబులు గా ‘నాన్నా.. నువ్వూ మాతో రావాల్సింది.. అప్పుడు ఈ నాలుగు సీట్లూ మనకే ఉండేవి..’ అంటుంటే గుబురు మీసాలాయన చిన్నగా నవ్వాడు. చేతిలో ఏదో తమిళ పుస్తకం.

రైలు బయల్దేరింది.. చిన్నగా మేమూ తిండీ గట్రా ముగించుకుని ఎవరి పుస్తకాల్లో వాళ్లం తలలు దూర్చేసాం. కానీ నాకెందుకు అనీజీ గా ఉందో కాసేపాగాకా లైట్లు ఆపుచేసి పరదాలు వేసినప్పుడు అర్థమైంది. రోజులు అస్సలూ బాగోలేవు. ఆడ,మగా అని లేదు, వయసు ని చూడటం లేదు.. వాహనాల్లో జరిగే అత్యాచారాల గురించి వార్తా పత్రికలూ, చానెళ్ళూ హోరెత్తిస్తున్నాయి.. చాలా సేపు నిద్రే పట్టలేదు.. ఆలోచనల్లో ఎప్పుడో నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాకా ‘మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మం హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్ ప్లీ ఈ ఈ ఈ జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్, దుబ్బ్ దుబ్బ్..’ శబ్దం.. మంద్రంగా.. భయంకరం గా..

టపక్క్ మని కళ్ళు తెరిచి చూస్తే.. కర్టెన్ చాటు ఒక మనిషి కదలికలు తెలుస్తున్నాయి. అసలేం జరుగుతుందో అర్థమయ్యేలోపల ఒక్కసారి గా కర్టెన్ తో సహా ఒక మనిషి దుబ్బుమని రెండు సీట్ల మధ్యలో పడ్డాడు.. ‘అమ్మ్మా..’ అంటూ! నాకు మతి తోచలేదు. కెవ్వుమని కేకేసి కాళ్లు వేగం గా ఆడించి కిందపడిన మనిషి ని తన్నటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఒక్కటీ తగిలినట్టు లేదు.

ఆ మనిషి ఎందుకొచ్చినట్లు? పై బెర్త్ గుబురు మీసాలాయనా? లేక దొంగా? చేతిలో కత్తా? గన్నుందా?

ఈలోగా లైట్లు వెలిగి టీసీ, ఒకరిద్దరు మనుషులు వచ్చేశారు.. నా కళ్లజోడెక్కడ చచ్చిందో.. టీసీ వచ్చి ‘చిన్న కిడ్.. కంగారు పడకండి..’ అని చెప్తున్నాడు. ‘చిన్న పిల్లా!! అయ్యో మా పాప! పై సీట్లోంచి పడినట్లుంది..’ నేను కర్టెన్ లాగేసి కింద నుంచి శాల్తీని లేపి నా పక్కన కూర్చోపెట్టుకుని లొడ లోడా వాగుతూ వీపు మీద దబ దబా కొడుతూ ఊరడించడం మొదలు పెట్టాను. ఇదేంటి ఇంత గింజుకుపోతోంది.. షాక్ తిందేమో నా చిట్టి తల్లి.. వాగుడు లెవెల్ ఎక్కువైంది..

‘అమ్మా.. ఏమైంది?’ అంటూ పైన్నుంచి పెద్ద పిల్ల అడుగుతోంది. ‘అదేంటి? ఇది పెద్ద పిల్ల కాదా?’ ఎదురు గా కింద సీట్లోకి చూశాను. మా చిన్నమ్మాయీ లేచి చూస్తోంది..

అయితే నేను ‘ఓదార్చేది’ ఎవర్ని? అని చూస్తే ఎర్ర చొక్కా వేసుకున్న ఒక చిన్న పిల్లాడు. మా పెద్దమ్మాయి వయసులోనే ఉన్నాడు.. ఇట్లా కాదు కానీ నా కళ్లజోడు కోసం పర్సు తెరిచి పెట్టుకునేసరికి సీనంతా అర్థమైంది.



పది-పన్నెండేళ్ల కుర్రాడు.. అర్థరాత్రి బాత్రూం కెళ్లి వస్తూ అన్ని సీట్లకీ కర్టెన్లు వేసి ఉండటం తో, పొరపాటున వేరే సైడ్ బర్త్ కర్టెన్ తీసి అమ్మా.. అమ్మా.... అని భుజం మీద కొట్టబోయాడట. ఆవిడ దెబ్బకి భయపడి పిడి గుద్దులు గుద్ది, అదీ చాలక కాళ్లతో తోసేసిందట. దానితో మా సీట్లకి మధ్యలో పడిపోయాడు..

ఆ బాబు ని వాళ్ల తల్లిదండ్రులు తీసుకెళ్లిపోయాకా. మా అమ్మాయిలు ‘అబ్బా..ఎంత భయమైతే మాత్రం.. మరీ అంత గట్టిగా అరవాలా? It was so embarassing you know!’ అనేశారు.. ‘భడవల్లారా! మీరు ఎన్నెన్ని ప్రాంతాల్లో ఎన్నెన్ని వందల సార్లు నన్ను తలెత్తుకోకుండా చేయలేదు?’ అనుకుని గోరంత దీపం లొ సూర్యాకాంతం లా ‘హమ్మ కూతుళ్లో, హమ్మ కూతుళ్లో.. ‘ అని నిట్టూర్చాను.

ఇక నిద్ర పడితే ఒట్టు.. చిన్నది పడుకుంది. కానీ పెద్దమ్మాయి మాత్రం నిద్ర పట్టడం లేదంది. ‘సరే.. రా.. అని దుప్పటీ కప్పుకుని లాప్ టాప్ లోకి డౌన్ లోడ్ చేసిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్ ‘ సినిమా ఇయర్ ఫోన్లు పెట్టుకుని చూపించి మరీ మా అమ్మాయి పరమ గిల్టీ గా ఫీలయ్యేలా చేశా..

ఉదయం రైలు దిగే వేళ ఆ పిల్లవాడి తండ్రి వచ్చి సైడు బర్త్ ఆవిడకి క్షమాపణ చెప్తూనే, ‘మా అబ్బాయి బాగా భయపడ్డాడు. వాడికి గుండె జబ్బు. హైదరాబాదు లో పెద్ద ఆసుపత్రి లో ఆపరేషన్ కోసం తెస్తున్నాం.. అని సమాధానం చెప్పే ఆస్కారం ఇవ్వకుండానే దిగిపోయారు. అది వినగానే ‘ మాకూ గుండెలు కలుక్కుమన్నాయి..

టెర్రరిస్టుల వల్ల ఎలాగూ జనాలు బాగా తిరిగే చోట్ల, ఎవ్వర్నీ నమ్మడం తగ్గించేశాం. బిక్కుబిక్కుమంటూ తిరుగుతున్నాం. వార్తా పత్రికల,ఇంకా టీవీ, ఇంటర్నెట్ లాంటి సాధనాల వలన వరస అత్యాచారాల సంగతులు వినీ వినీ సాటి మనిషిని నమ్మాలన్నా వంద సార్లు ఆలోచించాల్సివస్తోంది...

సైడు బర్తావిడ ‘నేనేం చేయనండీ.. నేనూ పేపర్లు చదువుతున్న మనిషినే. మా ఇంట్లోనూ టీవీ ఉంది. అర్థరాత్రి కర్టెన్ తీసి మనిషి మీద కి వంగి భుజం కుడుపుతుంటే.. నేనేం చేస్తున్నానో నాకే తెలియలేదు..’ అని బెంగపడుతూ దిగింది.. వెనకాలే మేమూనూ..

16 comments:

Chinni said...

కృష్ణప్రియ గారు,
మీ సైడ్ బెర్తావిడ అదేదో కావాలని చేయలేదు కదా, కానీ ఆ అబ్బాయికి గుండెకి పెద్దాపరేషన్ అనగానే బాధేసింది. కానీ మొన్న ఢిల్లీలో జరిగిన సంఘటనకు బస్లో ప్రయాణం అనగానే భయమేస్తోంది. ఇంక ఇలాంటివి జరిగినపుడు అలా స్పందించడం సహజం అనుకోవాల్సిన పరిస్థితి... అంతా మన దౌర్భాగ్యం.

Anonymous said...

ఇది మీ ఇల్లేనా ?
తొంగి చూసి మీది కాదేమో అనుకుని వేల్లిపోబోతూ గోడ మీద మీ పేరు చూసి ఆగిపొయాను.
టెంప్లేట్ మార్చారా ?
:venkat

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

క్రిష్ణప్రియ గారు,

చాలా మంచి టపా. ఆలోచింపచేసే విధంగా వ్రాశారు.

సమాజంలో ఎక్కువశాతం ఉండే మంచి, తక్కువశాతం ఉండే చెడు చేతిలో ఓడిపోవటానికి కారణం ఇదే. మన చుట్టూ ఉన్న మంచి కంటే చెడే మన ఆలోచనల్ని ఎక్కువగా ప్రభావితం చెయ్యగలగటం మన పతనానికి ఒక సూచన.

ఎదుటి మనుషుల మీద మనకున్న నమ్మకాన్నీ మన జీవన విధానాన్నీ ప్రశ్నించి మన ప్రవర్తనలో మనకిష్టంలేని మార్పుల్ని తీసుకురావడం, మనల్ని మనలా కాకుండా, మనలో ఉన్న భయాలకి లొంగిపోయేలా చెయగలగడమే చెడు యొక్క విజయానికి మొదటి మెట్టు :(

సమాజంలో ఉన్న చెడు గురించి భయపడటం, జాగ్రత్త పడటం అవసరమే కానీ ఆ భయాలు మనల్నీ, మన ఆలోచనలనీ, ప్రవర్తననీ శాసించే స్థాయికి చేరడం దురదృష్టకరం.

మంచికి అవకాశల్ని సృష్టించి, భయాలకి లొంగనవసరం లేని వ్యవస్థలనీ, విలువలనీ నిర్మించుకోవడమే, వ్యక్తులుగా మనం గానీ, సమాజంగా మన రాజకీయ వ్యవస్థ గానీ, మన మత బోధనలు గానీ చెయ్యల్సిన అతి మౌలికమైన పని.

ఇదంతా చెప్పడానికి ఉన్నంత సులుగా ఆచరించడనికి వీలు కాకపోవచ్చు. కానీ, దీన్ని అర్థం చేసుకొని కనీసం ఆ దిశలో ఆలోచిస్తే మంచిని గెలిపించడంలో మనం మొదటి మెట్టు ఎక్కినట్టే.

Once again, I really appreciate this post and am really glad to see such thought provoking posts.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

'సైడు బర్తావిడా' అనకుండా 'సైడుబెర్త్ ఆవిడా' అనుంటే ఇంకా బావుండేది ;)

రాధిక(నాని ) said...

:)).... :((

Kottapali said...

True. ఎవర్నీ తప్పుపట్టలేం.
మీ సహజమైన శైలిలో మంచి సస్పెన్సు సినిమా కథలాగా రాశారు!

Mauli said...

మూడవ పేరా చివర భలే నవ్వు వచ్చింది. తర్వాత కండక్టర్ చెప్పాక కూడా మీ కంగారు చూసి, మీరు దబ దబా కొడుతూ ఊరడించినది గుబురుమీసాలాయాన్ని కాదు కదా అని అనుమానం వేసింది (సారీ :) )

ఇక ఆ పై బెర్తు ఆవిడ భలే హైలెట్ . చివరగా పాపం పిల్లాడికి వెంటనే ఊరడింపు దొరికింది (ఎలాగైతే నేఁ :) )

padmarpita said...

\

Padmarpita said...

ఎవరి వే లో వారే కరెక్ట్ అనుకుంటారు....బాగారాసారు.

మాలా కుమార్ said...

గుండెజబ్బు అబ్బాయిని ఒక్కడినే ఎవరూ తోడు రాకుండా ఎందుకు పంపారో . పాపం ఎంత భయపడ్డాడో .

రసజ్ఞ said...

ఎందుకో ఇది చదువుతుంటే నాకు ప్రయాణం సినిమాలో "చూడు బాబూ, నేను రైతుని. ఎన్ని దెబ్బలు తగిలినా మనిషినీ, మట్టినీ నమ్మటం మానలేదు" అనే డైలాగ్ గుర్తొచ్చింది.
సమాజంలో ఒక మంచి జరిగితే అది విని మనం ఎంతవరకు ప్రతీ సంఘటనకీ అన్వయించుకుంటామో తెలియదు కానీ, ఏదయినా ఇలాంటి దారుణమయిన పరిస్థితుల గురించి విన్నప్పుడు మాత్రం అది పదే పదే తరిమి, ప్రతీదానికీ అన్వయించుకోవటం మొదలుపెడతాం అనిపిస్తుంది.

Anonymous said...

నా సూచన మన్నించి,టపా length తగ్గించినందుకు సంతోషం. ఇంక టపా విషయానికొస్తే, ప్రస్తుతం ఉన్న "వాతావరణం"దృష్ట్యా, మీ స్పందన కూడా న్యాయమే. కానీ, ఆ బాబు గురించి తెలిసిన తరువాత మాత్రం "అయ్యో.." అనిపించింది. ఇంక మీ అమ్మాయి reaction అంటారా, we have to live with these for the rest of our lives..

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

Another simple and straight way of looking at it can be...

WE ARE ACTING TOO PRECIOUS

With apologies to anyone who might get offended

కృష్ణప్రియ said...

@ చిన్ని గారు,

కదా!
@ వెంకట్ గారు,
అవును మా ఇల్లే :) వెల్కం
@ WP,
Thanks a lot for a thought provoking comment!

BTW, I corrected the title..

@ రాధిక గారు,

హ్మ్..


@ నారాయణ స్వామి గారు,

ధన్యవాదాలు :) అయితే చెన్నై బండి ఎక్కేయచ్చంటారా?
@ మౌళి,
LOL. నా మొదటి అనుమానం పాపం ఆయన మీదే వచ్చింది.

@ పద్మార్పిత గారు,
ధన్యవాదాలు.

@మాలా కుమార్ గారు,
:-( అదే పాపం అనిపిస్తోంది.

@ రసజ్ఞ,
అవును. కరెక్ట్ గా చెప్పారు.

@ ఫణి బాబు గారు,
ధన్యవాదాలు.
@ WP,

మీ వ్యాఖ్య నాకు అర్థంకాలేదు..

Mauli said...

"WE ARE ACTING TOO PRECIOUS"

WP గారు ,

మీరు మొదట చెప్పిన దాని కన్నా ఇది కాస్త సింపుల్ గా స్ట్రెయిట్ గా ఉంది. డిల్లీ సంఘటన వల్ల ఈ సంఘటన లో వ్యక్తుల కంగారు అలా ఉన్నది అనుకోవడం కూడా అపోహ కావచ్చు. ఇంకొక కారణం, మామూలుగానే, ట్రెయిన్ ప్రయాణం లో నిద్రపోయ్యేముందు చాలా జాగ్రత్తలతో ఆలోచనలతో నిద్రకు జారుకుంటారు. హటాత్తుగా మధ్యలో అలా ఎవరైనా నిద్ర లేపితే గబుక్కన తోసేయ్యడానికి టీవీ న్యూస్ కారణం కానక్కరలేదు. అదికాక 2nd ac లో ప్రయాణీకులకు చాలామందికి (అందరికి కాదు ) ఈ TOO PRECIOUS అనే భావం జీర్ణించుకొని ఉంటుంది .

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

Mouli గారు,

మొదటి కామెంట్లో మాత్రం అంత అర్థం కానిదేముందండీ :)

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;