Monday, January 21, 2013

ప్రాజెక్ట్ 2012-13 (part 1 of 2)

‘నీవల్ల నాకు 5% మార్కులు తగ్గుతాయి. నువ్వు నాకు సహాయం చేయకపోతే!! ’ కాస్త ఉక్రోశం, బాధ కలిసిన గొంతు తో మా అమ్మాయి గట్టిగా చెప్పింది... ఇప్పటికి పదోసారి నన్ను ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పించడానికి ప్రయత్నిస్తోంది.

“పోవే..అక్కడేదో, 95% మార్కులు నీకు ఆల్రెడీ పడిపోయినట్లు..’ ఈజీ గా తీసి పడేస్తూ..అన్నాను.. దానికి ఇంక కోపం వచ్చినట్టుంది. దబ దబా అడుగులేసుకుంటూ గది లోంచి అవతలకెళ్లి పోయింది.

“పోనీ,.. ఎలాగోలా దాని ప్రాజెక్ట్ చేసేస్తే ?”... నసుగుతూ మా వారు.. ‘నథింగ్ డూయింగ్’ అని నేను నిరంకుశం గా ప్రతిపాదన ని ఖండించాను..

ఈ సంభాషణ చదివి ‘అమ్మో..ఈవిడ బాగా గయ్యాళి లా ఉంది. కన్నబిడ్డ కి మార్కులు తగ్గుతాయన్నా కూడా లీశమాత్రం కనికరం లేకుండా, మిల్లీలీటర్ అయినా కరగని కిరాతకురాలు..’ అనుకుంటున్నారు కదూ.. నాకు తెలుసు!

ఎంతమంది నన్ను ఎన్నేసి రకాలు గా తిట్టుకున్నా, ఈసడించుకున్నా, దుర్బాష లాడినా, కత్తి మెడ మీద పెట్టి బెదిరించినా..’ అబ్బే కుదరదు. నేను ఈ ప్రాజెక్ట్ లో సహాయం చేయను గాక చేయను..

మళ్లీ రెండు నిమిషాలకే మళ్లీ వచ్చింది మా పిల్ల.’అమ్మా.. వై? ఎందుకు నువ్వు ఆడవు? ఒక్కసారి ఆక్ట్ చేస్తే ఏమవుతుంది? ఎందుకంత రిజిడ్ నువ్వు?’ అని దీనం గా అడిగింది.

‘అదొక పెద్ద కథ’ అని నిట్టూర్చాను.

అదేం ప్రాజెక్ట్? ఎందుకంత వెగటు నాకు? అరమార్కు తగ్గితే, ఆరుగంటల నిద్ర కూడా, ఇంకా అరగంట తగ్గించేసి,.. అదీ కుదరకపోతే అన్నం నోట్లో పెట్టేసి తిండి తినే సమయం కూడా ఆదా చేసేసి, స్కూల్ బస్సులో కూడా ఇయర్ ఫోన్లలో, పాఠాలు చెప్పించే రోజుల్లో ఈ మొండి దనం వెనక రహస్యమేమిటి ? అనుకుంటున్నారు కదూ.. మా అమ్మాయీ అదే క్యూరియాసిటీ తో నా వైపు వంగి తన ఆటల సమయం త్యాగం చేసి మరీ కూర్చుంది. ఖాళీ గా ఏం పనీ, పాటా లేకుండా కూర్చున్నానేమో.. నాకు మాంచి కిక్ వచ్చింది.

దాని క్లాస్ లో permutations & combinations, probability theory చెప్తున్నారట. అందుకని ‘నువ్వూ, నీ తల్లిదండ్రులూ మేము చెప్పిన పేకాట ఆడుతూ వీడియో తీసి దాని సీ డీ బర్న్ చేసి సబ్మిట్ చేయవలెను..’ అని వాళ్లు ఇచ్చిన ప్రాజెక్ట్. కావాలంటే రకరకాలు గా నేర్పించవచ్చు. ఎన్నో సాధనాలుండగా తల్లిదండ్రులతో పేకాడటమేమిటి? దాన్ని మళ్లీ వీడియో తీయడమేమిటి.. అది సీ డీ గా బర్న్ చేసి స్కూల్ లో ఇవ్వమనడం అన్యాయం. అంటే అన్ని సెక్షన్లకీ కలిపి ఎన్ని సీ డీ లు ఎలక్ట్రానిక్ వేస్ట్ లోకి పడుతున్నాయి? అసలు probability నేర్చుకునేది కేవలం 10%. మిగిలిన సమయమంతా ఆ వీడియో తీయడానికి, సీడీ బర్న్ చేయడానికి వృధా కదా? అయినా ఏడో కలాసు పిల్లకి ఇలాంటి చెత్త ప్రాజెక్టులు ఇవ్వడం.. చేయకపోతే ఐదు మార్కులు పోతాయనడం! దీని కన్నా బట్టీ చదువులే బెటరు. దీనికేదో ఒక ఉపాయం చేయాలి..తప్పదు..

మా అత్తగారు టీవీ లో కళ్యాణ్ రాం సినిమా చూస్తున్నారు. ఆయన వారసత్వ హక్కులు వెండితెర మీద చూపించుకోడానికిలావుంది.. పెద్దాయన కటౌట్ కి దండ, పాలాభిషేకం, కొబ్బరి కాయ కొడుతున్నాడు..ఇంట్రో సీన్ ? అనుకుంటా. ఇంకేం.. నాకు అష్ట దిక్కులా నుండీ ఐడియాలు కుప్పలు కుప్పలు గా కురవడం మొదలైపోయింది.

‘గాడిద గుడ్డేం కాదూ..నేను పేక ముట్టను.’ అన్నాను. ‘అదే! ఎందుకు?’ అని రెట్టించింది మా అమ్మాయి.

‘ఆహా.. ఎన్నాళ్లో వేచిన ఉదయం..’ అని మనసు లో పాడుకున్నా. ఏళ్ల తరబడి చూస్తున్నా.. తొడకొట్టే వంశం వారు,కంటి చూపుతోనే కాల్చేసే వారు, మా తాత, మా వంశం అని గర్వంగా చెప్పుకునే నందమూరి వారు,. మొగలుతుర్రు మామయ్య అని పాడుకునే అల్లు వంశం వారు, అన్నయ్య, బాబాయి, ఆహా, ఒహో అని మెగా ఫామిలీ వారు.. ఇక డిసిప్లిన్ ఉన్న మంచు వంశం వాళ్లు.. ‘సామ్రాట్టు లతో కళకళ లాడుతున్న అక్కినేని వారు.. అబ్బో.. ఒకరా ఇద్దరా..

దేశ రాజధాని లో ఒకపక్క ఇంచుమించు నా వయసు వాడు గాంధీ-నెహ్రూ వంశంలో పుట్టి పట్టాభిషేకం చేసుకున్న రాహులుడు.. ఇక్కడ రాష్ట్రం లో లోకేశుడూ కిరీటం కోసం ఏదో పార్టీ శ్రేణుల్ని బలోపేతం చేస్తున్నాడట.. ఇంకో పక్క అపర భగీరథుని బిడ్డ జైల్లో మగ్గుతున్నాడు.. మరి నా వంశం గురించి నాకూ చెప్పుకునే అవకాశమే లేదు. చెప్పుకున్నా వినే నాధులూ లేరు. దొరక్క దొరక్క దొరికిన చాన్సు వదులుకునే ప్రసక్తే లేదు.

మా వంశానికి పేకాట ఒక పెద్ద శాపం.. అన్నాను. ఇంద్ర/నరసింహ నాయుడు/సమరసింహారెడ్డి/సింహాద్రి ల్లాంటి ఎక్స్ప్రెషన్ తో ఎఫెక్ట్ ఎక్కువుంటుందని కళ్లుమూసుకుని తల వెనక్కి వంచి చెప్పి చూస్తే.. కిసుక్కుని నవ్వుకుంటున్నారు తండ్రీకూతుళ్లు. అంత ఆసక్తిదాయక మైన గిన్నిస్ బుక్ కెక్కిన నందమూరి హీరో కళ్యాణ్ రాం సినిమా చూస్తూ కూడా నా డైలాగు ప్రభావానికి మా అత్తగారూ, లౌక్యం గా చెంగు తో నవ్వాపుకున్నారు.

అయ్యవారిని చేయబోతే కోతి అయినట్లు.. చిరంజీవినీ, బాలకృష్ణనీ అనుకరించబోతే.. మరీ MS,బ్రాహ్మీ ల్లా అయినట్టుంది. అయినా కింగ్ సినిమాలో లాగా బొట్టు శీను, ఖైరతాబాదు జ్ఞానన్నలే తమ తమ వంశాచారాలనీ, అలవాట్లనీ గర్వం గా చెప్పుకుంటుంటే మనకేం తక్కువట అసలు?

నేను తగ్గలేదు. మరి మా తాతల, తండ్రుల సాహిత్యం, అమ్మమ్మ వైపు సంగీతం గురించి తర్వాత చెప్పుకుందాం..అని (లేకపోతే మా వంశం అంటే మా వారికీ, అత్తగారికీ చులకనైపోదూ?) .ఈ పేకాట మా వంశస్థులని ఎలా శాపగ్రస్తులని చేసిందో.. తెలుసుకోవాలంటే చక్రాలు తిప్పుకుంటూ వెళ్లాల్సిందే,.. నా తెలుపు నలుపు ప్రపంచం లోకి.

ఓ ముప్ఫై సంవత్సరాల క్రితం సంఘటన.. వేసవి సెలవలు.. రోహిణీ కార్తె.. ఉదయం తొమ్మిది కొట్టేటప్పటికి కాసేపు బయట ఆడుకోండీ.. అని ఇంట్లో పెద్దవాళ్లు గడ్డం పుచ్చుకుని బ్రతిమలాడుకున్నా వినకుండా ఇంట్లోకి వచ్చే కాలం. కరెంట్ ఉంటే ఫాను. లేదంటే అంతే సంగతులన్నట్టుందా? అలాంటి భయంకరమైన మండే కాలం లో పల్లెటూర్లో పెళ్లని మా అమ్మావాళ్లు ఊర్లో తెచ్చి పడేశారు. ఆ ఊళ్లో కరెంట్ లేదు. పెద్ద ఆస్బెస్టాస్ షీట్ల పందిరి పైన మామిడాకులు శాస్త్రానికి కట్టి చేస్తున్న పెళ్లి. పదకొండు గంటలకి ముహూర్తం. పెద్దగా ఉన్నవాళ్లు కాదు. పెళ్లింట్లో పట్టుమని పది విసెనకర్రలు. అవీ మగ పెళ్లి వాళ్లకిచ్చేశారు. మరి మర్యాదలు చేయాలి గా? ఇక ఆడపెళ్లివాళ్లు ఎలాగో చెంగులు, కాగితాలు, ఇలా ఏది దొరికితే దాంతో విసురుకుంటూ.. అయినా సరే.. పట్టుచీరల్లోనే ఉస్సూరు మంటూ హోమాలని చూస్తూ, ఇంకా వేడి గా ఉన్న తియ్యటి చాయ్ ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ మంటూ ఆపసోపాలు పడుతూ తాగుతూ ముచ్చట్లు చెప్పుకుంటే..

ఎంచక్కా మగవాళ్లు మాత్రం పంచెలు లుంగీలు మోకాళ్ల మీదకి ఎగ్గట్టి, ఈ హోమాలకి దూరం గా ఓ గడ్డింట్లో తుంగ చాప మీద కింగుల్లా సగం పడుకుని పేకాట లో నిమగ్నమై.. ఆహా.. అప్పుడే మొట్ట మొదట సారి మగవాళ్లెంత హాయిగా సుఖం గా ఉంటారో అనుకుంది నేను. కాస్త ముక్క నలగ్గానే పక్కకి పెట్టేసి కొత్త ముక్కలు తీసుకుని మరీ ఆడుతున్నారు వాళ్లు. పిల్లలు ఆ ముక్కలు తీసుకుని చిన్న వాళ్లయితే చుక్కాటా, కాస్త పెద్దవాళ్లు రమ్మీ, మూడుముక్కలాటా.. ఆడేసుకుంటున్నారు. ఇదే బాగుందని నేనూ, మా చెల్లీ కూడా ఈ గుంపు లో జొరబడి పేకాడటం నేర్చుకున్నాం.

ఇక ఆ పెళ్లి నుండి వచ్చేటప్పుడు బ్యాగు లో మూడు సెట్లు పేక ముక్కలు తీసుకుని రైలెక్కేసాం. ఆ వేసవంతా చుట్టాలతో అమ్మ బిజీ గా ఉంటే మేము ఉదయం, మధ్యాహ్నం పేకాట లో ఇంకా యమా బిజీ అయిపోయాం.ఈ పేకాట వ్యసనం ఎంత వరకూ వచ్చిందంటే ఉన్న పేకల సెట్లు పాడైపోయాకా, కొత్తవి కావాలని మా నాన్నగారిని అడిగేదాకా.. ఇక ఉగ్ర నరసింహావతారం ఎత్తి ఆయన ‘ఏంటీ మీరు పేకాట ఆడటానికి నేను కొత్త పేక సెట్టు కొనిపెట్టాలా? పిచ్చి కానీ పట్టిందా? అసలే పేకాట వ్యసనం వల్ల మా పెదనాన్న ఊరు ఊరంతా వల్ల కాడు అయిపోయింది. ఎవ్వడిని చూస్తే వాడు చీట్ల పేక ఆడటం, తిండి, పని అన్నీ మానేసి చేతిలో ఏదుంటే అది పెట్టి ఆడటం.చేసే బంగారం లాంటి జీవితాలని నాశనం చేసుకున్నారు.. అన్నప్రాశన రోజున భగవద్గీత, బంగారం తో బాటు పేక ముక్కలు కూడా పెట్టే ఊరది.ఒకసారి ఆ వ్యసనం అంటుకుంటే ఇంక వదలదు...

మా బాబాయిగారొకాయన అలాగే ముప్ఫై ఏళ్లు ప్రతి రోజూ పేకాడి పేకాడి పిల్లల పేర్లు కూడా జ్ఞాపకం లేని పరిస్థితి లోకి వెళ్లి పోవడం చూసి చూసి వాళ్ల పిల్లలు పాపం సరైన గైడెన్స్ లేక ఎలా అల్లల్లాడి పోతున్నారో వివరించారు. (అదే కథ, ఇంకో పరిస్థితి లో అయితే.. వాళ్ల నాన్న చూడు..పేకాట లో కొట్టుకుపోయి పేర్లు కూడా జ్ఞాపకం పెట్టుకోకపోయినా, ఎంత బుద్ధి గా చదువుకుంటున్నారో, మీకు ఎంత చేస్తున్నాం... అని రివర్స్ లో బాగా వాడుకునేవారు హహ్.. )

ఇలాంటి ఎన్నో రకాల దృష్టాంతాలని ఉదాహరించి నానా రకాల ప్రమాణాలు మాచేత వేయించారు

మేమూ రెండు రోజులపాటు ఆగినా, ఆగలేక అట్ట ముక్కల మీద కూడా బొమ్మలు వేసి ఆడటం మొదలు పెట్టాం.

ఎంతో రసవత్తరం గా సాగుతున్న నా కథనానికి లా పాయింట్ తెచ్చి అడ్డుకట్ట వేసింది మా అమ్మాయి. ‘మరి ప్రామిస్ చేశావు కదా. నీ చిన్నప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్లు ప్రామిస్ లు బ్రేక్ చేసేదానివా అమ్మా?’ సాధ్యమైనంత అమాయకం గా మొహం పెట్టడానికి విఫల ప్రయత్నం చేస్తూ..

మళ్లీ పక్కనుంచి రెండు కిసుక్కులు. ‘వార్నీ.. ఫ్లో లో కొట్టుకు పోయి ఆడియన్స్ కి రాంగ్ మెసేజ్ ఇస్తున్నట్టున్నాను.. ‘ సర్దుకుని..’అబ్బే.. అట్ట ముక్కల యాభై రెండు తయారు చేయడం మాటలా? ఏవో కొద్దిగా మినీ పేక సెట్ అంతే. అదీ పూర్తిగా అదేరకం ఆటా కాదు’ అని కాస్త కవరప్ చేసుకుని..

కొన్నాళ్లకి వాటినీ కనిపెట్టి మా నాన్నగారు అంతకన్నా భీకర ప్రతిజ్ఞ చేయించారు. అప్పటినుంచీ ఎప్పుడూ పేక ముట్టలేదు లేను. అని షార్ట్ కట్ లో కథ ముగించేశాను.

‘మరి కంప్యూటర్ లో కార్డ్ గేమ్స్ ఆడటం చీటింగ్ కాదా? Are n’t you breaking a promise?’ కళ్లెగరేసి మరీ అడిగింది మా అమ్మాయి.

‘అంటే.. టెక్నికల్ గా ముక్కలు ముట్టుకోవడం లేదు గా?’ అని సమాధాన పరిచాను.చేసేది లేక, వెళ్లిపోయింది.

ఆ పేక ముక్కల వ్యసనం చెస్ లోకి ఎలా రూపాంతరం చెందిందో, ఆటలాడుతూ ఓడిపోయినప్పుడో, రూల్స్ పాటించడం లేదనో కొట్టుకుంటుంటే గోడవతలకి చెస్ బోర్డ్, పావులు విసిరేసినప్పుడల్లా ఎలాగ మేము పెంట కుప్పల మీద నుంచి తెచ్చుకుని కడుగుకుని మరీ, పోయిన పావులకి బదులు గా కారం బోర్డ్ కాయిన్లు, చెక్క ముక్కలు, కూరగాయ తొడిమలూ పెట్టి ఆడి, గొడవలు అమ్మ దగ్గరికెడితే మొదటికే మోసమని, 'మౌన పోరాటాలు ' చేసుకునే వాళ్లమో..

ఇదంతా ఐదు చెస్ బోర్డులుండీ, డబ్బా విప్పటానికి కూడా ఖాళీ లేనంత హోం వర్కులు, ప్రాజెక్టులున్న పిల్లలకి చెప్పీ లాభం లేదనిపించింది.

ఇదింకా నయం.. ఈ స్కూలు ప్రాజెక్టుల వల్ల జీవితం లో అబద్ధాల కోరు లా అయిపోయిన వైనం, తెలంగాణా లో ఫ్లోరైడ్ బెల్ట్ దాకా తవ్వినా నీళ్లు రానట్టు, నాలో లేని కళల కోసం తవ్వుకుని తవ్వుకుని పడిన తంటాలూ, వెజిటేరియన్ అయుండీ మొట్ట మొదటి సారి మాంసం కొట్టు కెళ్లాల్సి వచ్చిన ఉదంతం..ఎల్లుండి. చెప్తాను...

(ఇంకా ఉంది)



6 comments:

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

??

నవజీవన్ said...

చదువుతుంటే చాలా ఆసక్తిదాయకంగా ఉంది మేడం మీ టపా. అస్సలు పేక ఆడటం వ్యసనం అని ఎవరు అన్నారు. అయినా దానిని వ్యసనంగా మార్చుకుంటే ఏమి చేయలేము. అయినా మీ అమ్మాయి మీరు పేక ఆడుతుంటే వీడియో తీసి ప్రాజెక్ట్ కు సబ్మిట్ చేయడమనే అంశం కొంచెం విడ్డూరంగా ఉంది .

Found In Folsom said...

Hahaha....Krishna Priya garu...awesome post..inchu minchu ilantide raayalemo nenu kooda..maa pinni koduku chinnappudu 5 yrs kooda undavu..selavulaki vachi peka nerchadu..mukkalu aata...maa ammamma kacha ki tuppuk ani ummeste..vadu velli kadukuni tuduchukuni mari aade vadu ...haahahah

వేణూశ్రీకాంత్ said...

సరదా సరదాగా నవ్విస్తూ చదివించేస్తూనే కొన్ని చిన్న చిన్న సీరియస్ విషయాలు కూడా కవర్ చేయడంలో మీకు మీరే సాటి. టపా బాగుంది రెండో పార్ట్ కోసం ఎదురు చూస్తున్నా :-)
అన్నట్లు కొత్తిల్లు చక్కగా డిగ్నిఫైడ్ గా బ్లాగ్ టైటిల్ కి కరెక్ట్ గా సరిపోయేట్లు బాగుందండోయ్.

Anonymous said...

I have read your posts so many times and keep reading them and forwarding them for a long time. But never commented for each post. SOme are very hilarious and some are amazing. Some are thought provoking. Very versatile. I don't think I never read any of my text books or novels/stories the way I read your posts. Felt like cheating you as I never commented but enjoying myself :)
Keep going.

SJ

కృష్ణప్రియ said...

@ WP,

!! అర్థం కాలేదు మీ ప్రశ్న..

@ నవజీవన్,

అవును. ఏదైనా ఒక మోతాదు వరకూ ఓకే. తర్వాతే వ్యసనం అయి కూర్చుంటుంది కదా.

ఆప్రాజెక్ట్ అందుకే మేము చేయలేదు..

@ Found In Folsom,

:)) అవును. వ్యసనం ఇచ్చే మత్తు అది.

@ SJ,

థాంక్స్. మీ ఇనిషియల్స్ తో తెలిసిన వాళ్లున్నారు... Do I know you by any chance?

@ వేణూ శ్రీకాంత్ ,

థాంక్స్. రెండో పార్ట్ అదిగో రాసేశా :) ఒక బ్లాగ్మిత్రురాలి సలహా మేరకు వెతికీ, వెతికీ, సంపాదించాను. ఈ టెంప్లేట్ లో కొద్దిగా జంక్ ఉంది.అలాగే వెడల్పు లేదు.
కానీ html ఎడిట్ చేసి తీయాలంటే భయం. కొండనాలిక కి మందేయాలని చూస్తే .. ఉన్న నాలిక ఊడుతుందేమోనని ..

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;