Monday, October 19, 2015 0 comments

ఇరవయ్యేళ్లిక్కడ - ఉక్కు మహిళ స్నేహ



శుక్రవారం ఉదయం ఆఫీసు కి 9.30 కి చేరుకుని, అలవాట్లో పొరపాటు గా నా గది తలుపు తోయబోయాను. హైరింగ్ ఈవెంట్ కోసం నా గది ఇచ్చినట్లున్నారు.  గది నిండా సీతాకోక చిలకల్లాంటి అమ్మాయిలు. స్మార్ట్ గా ఉన్నారు అందరూ. అబ్బ! ఏదో పెళ్లి కి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. వాళ్లు నన్ను గమనించే లోపల చటుక్కున తప్పుకుని,  ఎవరూ చూడ లేదు కదా అని చుట్టూ ఒకసారి చూసుకుని, ఒక క్వైట్ రూము లో కూల బడ్డాను.

చాలా ఇరుగ్గా, ఇంకో రెండు కిలోలు పెరిగితే ఇంక పట్టనేమో అన్నట్టుంది గది. అయితేనేం? బానే ఉంది.  పని లో పడిపోయాను

లంచ్ టైం  అవుతోంది ..

'కృష్ణా! జాబ్ వదిలేస్తున్నావట ?' స్నేహ పింగ్ చేసింది.  US  లో అర్థరాత్రి అయుంటుంది, అయినా స్నేహ పని రాక్షసి, కదా నిశాచరురాలు, అని నవ్వుకుంటూ,

'అవును.. నేనే పింగ్ చేసి చెప్దామనుకున్నా, ఈలోగా నేవే పింగ్ చేసావ్' అన్నాను.   'నాకలాంటి భ్రమలేమీ లేవు. నువ్వు చెప్పకుండా పారిపోదామని రెడీ అయిపోయావు లే' అని నిష్టూరం గా అంది.   కాసేపు బ్రతిమలాడుకుని, 'సరే, ఇంతకీ టీనా విశేషాలు చెప్పు, మీ బాలయ్య బాబు  ఎలా ఉన్నాడు?' అంటే  ఏవో విశేషాలు చెప్పి, ఇంతకీ, కొత్తగా నేనూ, నా బిడ్డా పెయింటింగ్ క్లాస్ లో జాయిన్ అయ్యాము, నీకు మా పెయింటింగులూ, స్కెచ్చులూ పంపిస్తా' అని పంపింది . 

నాకు ఆర్ట్ అంతగా తెలియదు గుర్తు పెట్టగల్గేలా వేస్తే చాలు 'అబ్బో' అనిపిస్తుంది .  కాసేపు మాట్లాడాకా, బై, బై లు చెప్పుకునే టప్పుడు కొద్దిగా ఎమోషనల్ గా అనిపించింది, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడు కోవటానికి ఉండదు కదా..  కానీ, ఎప్పుడూ టచ్ లోనే ఉంటాము లే అన్న ఆలోచన తో, సెలవు తీసుకున్నాను. ఆఖరి మాట గా 'Bottomline be with me irrespective of where u go at work, life'  అంది . నేను సమాధానం చెప్పకుండా  వదిలేశాను.  

 మా పరిచయం రెస్ట్  రూము  తో మొదలైంది . మొత్తం ఫ్లోర్ లో 200 మంది ఇంజనీర్లు. వారిలో ఒక ఆరుగురు అమ్మాయిలు. 

వారిలో ఇద్దరమ్మాయిలు ఎలివేటర్ లో ఆరు గంటలు వారితో స్టక్  అయినా,పలకరింపు గా నైనా నవ్వుతారో లేదో  తెలియదు. అంతటి స్నేహశీలులు.
 ఇంకో ఇద్దరు చీకటి గా ఉన్న సైడ్, పెద్ద పెద్ద స్క్రీన్ల మీద ASICs, Board circuitary ని చూస్తూ, గంభీరం గా మాట్లాడుకునే వారు. 

మిగిలింది ఇంకో ఆడ మానేజరు.  తుచ్చ ఇంజనీరు ప్రజానీకం తో మాట్లాడటం అంటే ఆవిడకి మా చెడ్డ చిరాకు. ధర్మాసుపత్రి లో ముతక చీర కట్టుకున్నావిడ  ఏడో  పురుడు లోనైనా మగ పిల్లగాడు పుడతాడామ్మా? అని అసలే లంచ్ టైమ్ డిలే అయిన డాక్టర్ ని ఆశగా అడిగితే  ఇచ్చే ఎక్స్ప్రెషన్  ఇచ్చేది.  నేను చాలా చిన్నబుచ్చుకునే దాన్ని. 

నేనేమో అప్పుడప్పుడే అమెరికా కొచ్చానేమో , సాటి ఆడవాళ్లతో  ఫోన్ల మీద కాకుండా ముఖం లోకి చూస్తూ మాట్లాడ టానికి ముఖం వాచిపోయి ఉండేదాన్ని.  ఇంటిదగ్గరా సమయం ఉండదు, ఆఫీసులో ఎవరూ మాట్లాడరు.  రెస్ట్ రూం లో కనపడేది ఆవిడ, నేను అడ్డం వచ్చినప్పుడు ఒక కదిలే  బండ రాయిని తప్పించుకుని వెళ్తున్నట్టు వెళ్తుండేది . నాకు మహా రోషం వచ్చేది కానీ నోర్మూసుకుని వెళ్తూ ఉండే దాన్ని, మగవాళ్ల  రెస్ట్  రూం వైపు నుండి, అట్టహాసాలు, పలకరింపులు, వినిపిస్తూ ఉండేవి. ఆడ వారి వైపు మాత్రం బౌద్ధా శ్రమం లా, కర్తవ్య నిర్వహణ తప్ప వేరే  ఆలోచన లేకుండా .. 

అదే మనదేశం అయితేనా? తస్సదియ్య,  అత్తగార్లు పెట్టే కష్టాలని హృదయ విదారకం గా చెప్పుకుని  కన్నీరు పెట్టుకునేవారు, బాయ్ ఫ్రెండ్స్ తో ఫోన్ల మీద సరసాలు,గారాలు పోయేవారు, భర్తలతో తనివి తీరా కొట్లాడేవారు,..  ఒక్క మనిషి మనతో మాట్లాడకపోయినా పర్వాలేదు ,  అక్షరం ముక్క వదలకుండా బెంగళూరు టైమ్స్ చదివిన ఫీలింగ్ వస్తుంది. 

ఓరోజు, సడన్  గా, గట్టి గట్టి గా నవ్వులు, tamlish లో మాటలు, అబ్బ, నా నోట్లో గరిటెడు సాంబారు పోసిన ఆనందం వచ్చింది . ముఖం వికసించి పోయింది .  చూస్తే , ఒకమ్మాయి విరగబడి నవ్వుతోంది . పక్కన మానేజరు గారు కూడానూ. అదేంటి? ఆవిడకి  పళ్లున్నాయా? అని ఆశ్చర్య పోయా.   ఆ అమ్మాయి తప్పక చెన్నై పిల్లే . తలకాయ ఆల్ఫా లా ఊపేసి complete agreement gesture చూపిస్తోంది .  ఇండియా కి వెళ్లి వచ్చానని, వెకేషన్ విశేషాలు చెప్తోంది . చాలా సంతోషం వేసింది .

నేనూ సిగ్గూ, అభిమానమూ  వదిలేసి వెళ్లి నన్ను నేను పరిచయం చేసుకున్నా . మానేజర్ మాత్రం 'excuse me ' అని వెళ్లి పోయింది . ఈ అమ్మాయి మాత్రం నాలుగు రోజుల్లోనే చక్కగా కలిసిపోయింది. చెన్నై లో సెటిల్ అయిన తెలుగు పిల్ల. ఆ ఫ్లోర్ లో ఆ అమ్మాయి ఎక్కడుంటే అక్కడ కోలాహలం, అందర్నీ ఆదరం గా పలకరించేది .  board design, layout documents చూడటం తప్ప వేరే వ్యాపకం లేదేమో నన్నట్టుండే  అమ్మాయిలూ స్నేహ తో మాటాడేవారు . అబ్బాయిలూ మాట్లాడేవారు . నన్నూ, నలుగురిలో నారాయణ మాదిరిగా నే పలకరించేది .  

ఆవిధం గా నాకు అసంతృప్తి గా ఉండేది . ఆ అమ్మాయి కి ఉన్న పాపులారిటీ, కలివిడి దనం, నాకు బాగున్నా,  తన చుట్టూ ఒక వృ త్తం  గీసుకుని దాంట్లోకి ఎవ్వరినీ, ఆ హద్దు దాటనీయక పోవడం వల్ల నాకు చిరాగ్గా ఉండేది . దాంట్లో జెలసీ పాలు కూడా ఉండేదేమో!

 ఓరోజు చెప్పా పెట్టకుండా  మాయమైంది . హర్టింగ్ గా అనిపించినా, నెమ్మదిగా స్నేహ ని మర్చి పోయా.  ఒక ఆరు నెలల్లో అందరూ అలవాటై పోయారు. ఆఫీసు లో లంచ్ గ్యాంగూ, ప్రాజెక్ట్ గ్యాంగూ  సెట్టయి, ఉత్సాహం గా ఉండేది.  ఓ రోజు మళ్లీ ఊడి పడింది. కాంట్రాక్టర్ ఉద్యోగం అవడం తో, మా సంస్థ లో మళ్లీ చేరాలంటే ఆరు నెలలు వేరే కంపెనీ లో పని చేస్తే కానీ రూల్స్ ఒప్పవు.  అందుకని వెళ్లి పోయి మళ్లీ వచ్చానంది . 

రోజూ  మళ్లీ పలకరింపులూ, రెండు జోకులూ, ఒక డీబగ్ సేషనూ, రోజులు వెళ్లిపోతున్నాయి . ఆరోజు, కాఫీ కి రమ్మని పిలిస్తే వెళ్లా  చాలా మబ్బు గా ఉంది,  

అవీ ఇవీ మాట్లాడుతూ,  'నీకు పెళ్లయిందా? ' అని అడిగాను. 
'అబ్బే ఇంకా లేదు, మా బామ్మ గొడవ చేస్తోంది, చూడాలి, ' అంది కాస్త ఇబ్బంది గా.  
 'ఓహ్ కూల్ ! మీ అమ్మా, నాన్న? సిబ్లింగ్స్?'

'వాళ్ళెవ్వరూ నాకు లేరు' అనేసింది. 'ఓహ్ I am sorry' అనేశాను . 
'పర్వాలేదు లే, చాలా కాలమైంది ' అంది,నిర్లిప్తం గా .  

తను అలాంటి మూడ్ లో ఉంటే, నాకు ఇంకేం ప్రశ్నలు వేయబుద్ధి అవదు.  ఆఫీసు లో ఎవర్నో అడిగా, 'ఏంటి స్నేహ సంగతి?' అని .  'తను ఆర్ఫన్ అనుకుంటా' అన్నాడతను . 

సరే అయితే అయింది, తననే అడిగేద్దామనుకుని ,  ఆరోజు లంచ్ లో అడిగా . 
'మా పేరెంట్స్ ది  ప్రేమ వివాహం, ఎవరి సపోర్టూ లేదు . నేనొక్కదాన్నే. నేను ఎనిమిది లో ఉన్నప్పుడు, నాన్న పోయారు . మా అమ్మ బెంగ పెట్టుకుంది, బాగా మనోవ్యాది పెట్టుకుంది  పదవ తరగతి సెలవల్లో లేవలేదు' అంది 

నాకు షాక్ గా అన్పించింది . 'మరి తర్వాత?' అనడిగాను . 
'ఏముంది? రెండు వైపులా వారూ వచ్చారు, కర్మ కాండలు అయ్యాకా వాళ్లకి తోచినంత చేతిలో పెట్టి, పరిగెత్తుకు పొయారు.    బాధ్యత  తీసుకోవాల్సి వస్తుందని,  ఏ ఒక్కరూ, తర్వాత నీ గతేంటి అని అడగలేదు . ఒక్కదాన్నే మిగిలిపోయాను . అప్పుడు వచ్చింది మా పెద్దమ్మమ్మ . 

'ఇదిగో అమ్మాయ్! నేను నీకు ఏం  ఇవ్వగలనో, ఏం  అందించ లేనో, చెప్తాను . నీకిష్టమైతే నాతో  ఉండు .  రెండు పూటలా అన్నం పెడతాను . ఏడాదికి రెండు జతలు బట్టలు కొంటాను .  కాలేజీ దాకా దింపి, తీసుకొస్తాను అవసరమైతే, అంతే . ఫీజులు కట్టే స్థోమత నాకు లేదు . ' అంది .   

అంతే , ఆవిడ ఇంటికి వెళ్లిపోయాను . మిగిలిన పిల్లలు ఇంజనీరింగు ఎంట్రన్స్ లకి ట్యూషన్లు తీసుకుంటుంటే, నేను కాలేజి తర్వాత, చిన్నపిల్లలకి ట్యూషన్లు చెప్పాను . అందరూ కార్పోరేటు కాలేజుల్లో  చదువుతుంటే, నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజు లో చదివినా,  గవర్నమెంట్ ఇంజనీరింగు కాలేజి లో సీటు సంపాదించాను . 

ఆ ఆరేళ్ళూ మరి నేనెలా చదివానో, గ్రానీ నాకు ఎంత చేసిందో, గల్లీల్లో పోకిరీ కుర్రాళ్ల గోల తప్పించడానికి, తన నోరు ఎలా వాడిందో, ట్యూషన్లు, కాలేజీ మధ్య ఎలా చదువుకున్నానో మాకే తెలుసు.  ఇన్నాళ్ల కి సాఫ్ట్ వేర్ పుణ్యమాని అమెరికా కి వచ్చి నా జీవితం మొదలు పెట్టాను . 

'మరి అమ్మమ్మగారు? ' 
'మా చుట్టాలావిడ పిన్ని వరస, ఆవిడని  భర్త వదిలేస్తే,  తనకి తోడుంటుంది ' 
చాలా భారం గా అనిపించింది . అయితే, అదొక మంచి గా భారంగా, దుఃఖం తో కాదు . 

తర్వాత, నా పని లో పడి, ఎప్పుడైనా కన్పిస్తే హలో , హాయ్  తప్ప నిజంగా మాట్లాడింది లేదు . పెళ్లి కుదిరిందని విన్నాను, కానీ తను నాకు చెప్పలేదు, నేననడగా లేదు .  అబ్బాయి  మా ఆఫీసే!  బానే ఉంటాడు  నెమ్మదస్తుడు  మాతో పాటే పని చేస్తాడు . స్నేహ కీ, అతనికీ పది రోజుల్లో పెళ్లి అని తెలిసినా, నాకు మాట వరసకి  రమ్మని చెప్పలేదు . తన స్వభావం తెలుసు కాబట్టి నేనూ, పట్టించుకోలేదు. 

స్నేహ పెళ్లి ఎలా జరిగిందో తెలుసుకుందామనుకున్నా  కానీ, ఇండియా ప్రయాణం, తర్వాత, ప్రాజెక్టు గొడవల వెనక  ఆ ఆలోచన మరుగున పడి పోయింది .  ఓ రోజు ఆ అబ్బాయి కనిపించాడు , నన్ను చూసి, తల వంచుకుని వేరే వైపుకి వెళ్లి పోయాడు . ' అదేంటి? ' స్నేహ కి కాల్ చేయాలని చూస్తే , తనూ ఎత్తలేదు . తర్వాత ఒక వారానికి కనిపించినా తన పెళ్లి విషయం మాట్లాడలేదు . వేరే వారిద్వారా ఆగిపోయిన విషయం తెలిసి కాస్త బాధ పడ్డాను . 

ఇంకో ఏడాదికి  ఓ రోజు వచ్చి, 'లాస్ట్ వీక్, నా పెళ్లయింది, అబ్బాయి నీకు తెలుసు, సారీ ముందుగా చెప్పలేక పోయా' అంది. 
నేను సంతోషం చూపించాను . అయితే, తర్వాత రాజుని కాకుండా  ఒక మళయాళీ అబ్బాయి జేసన్ ని చేసుకుందని తెలిసి ఆశ్చర్యం వేసింది .  అతనూ చాలా మంచి వాడు, మాతో పని చేసిన అబ్బాయే .  నేను నా ఆశ్చర్యం బయటకి వెళ్ల బుచ్చలేదని గమనించి,  తనే చెప్పింది . 

' రాజు తో నా పెళ్లి నేనే ఆపేశా .  నేను గట్టి గా నవ్వకూడదట , ఆడ వారితో తప్ప కాఫీ తాగకూడదట ,  నా చాట్ విండో లు చూస్తాడు, ఫోన్లు వస్తే అనుమాన పడతాడు . ఇండియా ప్రయాణం రేపనగా, పెళ్లి రద్దు చేసేసుకున్నా' అంది . 

'నీ నిర్ణయం మీద నాకు పూర్తి  నమ్మకం ఉంది ' అని ఊరుకున్నాను .  'నీ ప్రేయర్స్ లో నన్ను ఇంక్లూడ్ చేసుకోవా?' అంది .  అప్పుడే జేసన్ లాగా మాట్లాడు తున్నావే, అనగానే పాక పకా నవ్వేసింది .  

'వచ్చేవారం అమ్మమ్మ వస్తుంది అమెరికా కి ' అని ఉత్సాహం గా చెప్పింది . 
నాకూ ఆవిడ ని చూడాలని అనిపించింది. 'నేనొకసారి వస్తా కలవడానికి' అన్నాను కానీ,  నెల రోజుల తర్వాత, అమ్మమ్మగారు  దూరమయ్యారని తనని ఓదార్చ డానికి  వెళ్ళాల్సి వస్తుందనుకోలేదు .

 జేసన్, స్నేహా ఎప్పుడూ, కలిసి ఆఫీసుకొచ్చే వారు, కలిసి భోజనం, కలిసి కాఫీ బ్రేక్లు,    'అబ్బా, స్నేహా, వదిలి పెత్తవొయ్.. పాపం జేసన్కి  ఊపిరాడ నివ్వట్లేదు '  అని మేము సరదాగా ఏడిపిస్తే ,   'నా జీవితం లో అమ్మమ్మ గారి తర్వాత, మళ్లీ వెలుగు జేసనే! నేను వదిలి పెట్టను ' అని తనూ అంటూ ఉండేది . 

ఇల్లు కొనేసారు, ఒక పక్క జీసస్ పటం, కాండిల్స్, ఇంకో పక్క పిళ్ళయార్, ధూపం, దీపం, చక్కటి పాపాయి టీనా,  మా గ్యాంగు అంతా  అభినందించి వస్తుంటే,  'నాకెందుకో, ఒకటి వస్తే, జీవితం లో ఒకటి పోతుంది, అసలే ఉద్యోగాలు ఎడాపెడా  తీసేస్తున్నారు, భగవంతుడు ఈసారి ఉద్యోగం మీద కన్నశాడేమో ' అంది నవ్వుతూ . 

'అంత  సీన్ లేదు లే , నేను వచ్చేనెల నేను ఇండియా వెళ్లి పోతున్నా , ఒకే కంపెనీ కాబట్టి, తప్పక ఏదో ఒక ప్రాజెక్టు లో కలిసి పని చేస్తాం ' అని వచ్చేశాను. 

ఓ రెండేళ్ల  తర్వాత పెద్ద lay off లో, చాలా మంది ని తీసేసినప్పుడు, అమెరికా కౌంటర్ పార్ట్ లో ఆ టీం ని అందరినీ  తీసి పడేశారు . 

మళ్లీ కొత్తవారికి అప్పగించారు  వాళ్ల తో ఫస్టు మీటింగ్ . కాన్ఫరెన్స్ కాల్ లో, విన్న గొంతు లా ఉంది , అనుకోగానే, 'This is snEhaa' అని పరిచయం చేసుకుంది . అలా తిరిగి కలుసుకుని, ఇద్దరం చాలా కాలానికి మళ్లీ ఒక ఏడాది కలిసి పని చేశాం . 'ఎప్పుడు నిద్ర పోతావు? నా Day time అంతా కనిపిస్తావు, మళ్లీ పడుకుని లేచేసరికి పది మెయిల్స్ ఉంటాయి ' అంటే నవ్వేసేది .  ప్రతిదానికీ నవ్వే . 

వేసవి సెలవల్లో సరదాకి, కుటుంబం తో అమెరికా కి ప్రయాణం కట్టాను . ఇన్ని సార్లు స్నేహ తో మాట్లాడినా, ఆఫీసులోనే తప్ప, ఇంటిదాకా ఎప్పుడూ తీసుకురాలేదు మేము .  ఈసారి మాత్రం అలా కాదు, వాళ్లింట్లో  ఒక పూట ఉండాలి, పిల్లలు ఒకే వయసు వారు కాబట్టి పరిచయం చేయాలి, అలా ప్రణాళిక లేసుకున్నాం . 

అమెరికా లో దిగాకా, నా పనులయ్యాకా, అనుకున్న రోజు కి ముందు రోజు కాల్ చేస్తే ఎత్తట్లేదు .  కనీసం కాన్సిల్ చేస్తున్నాను, బిజీ గా ఉన్నాను అని చెప్పచ్చు కదా, తానెప్పుడూ అంతే నని కోపం వచ్చింది . తనకోసం, తన పాప కోసం తెచ్చిన బహుమతులు అలాగే ఉండిపోయాయి . రేపు వచ్చేస్తున్నాన గా , ఈమెయిల్ చేసింది.  'Sorry, Got in to a medical situation' అని. 

ఆఫీసుకి ఇంకా ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్లి నప్పుడు, జేసన్ కూడా కన్పించలేదు . తన కోసం తెచ్చిన వస్తువులు స్నేహ  ఆఫీసుకొచ్చాక  ఇవ్వమని, తెలిసిన ఇంకో కొలీగ్ కి ఇచ్చేసి వచ్చేశా . ప్రాజెక్ట్ కూడా మారాకా, మళ్లీ పూర్తిగా టచ్ పోయింది .  కనీసం నేనిచ్చినవి బాగున్నాయని కూడా చెప్పలేదు . 

నాలుగు నెలల తర్వాత పింగ్ చేసింది . అప్పటికి నాకూ కోపం తగ్గిపోయింది . 'ఏమైంది? ఆల్ ఓకే?' అని ఆత్రం గా అడిగా. 

'లేదు , జేసన్ కి కాన్సర్  ఆఖరి స్టేజ్' అంది . చాట్ లో చెప్తే, ఒక విధం గా ఎంత కష్టం కల్గించే మాట ఒక్కమాటు గా చెప్పిందో, దానికి నా ప్రతిస్పందన సరిగ్గా ఇవ్వలేక పోయాను . 

ప్రతి నెలా, అడిగినప్పుడల్లా కొద్ది కొద్దిగా క్షీణిస్తూ ఉందని చెప్పెది. జేసన్ కోసం ప్రేయర్స్ చేయమని అర్థించేది, అయితే పైవాడు తనపని తాను  చేసుకుపోయాడు. తన తల్లిదండ్రులనీ, అక్కనీ, స్నేహనీ , టీనా నీ వదిలేసి జేసన్ వెళ్లి పోయాడు .  స్నేహ తన సంతోషాన్ని  పంచుకున్నంత ఈజీ గా కష్టాన్ని పది మందితో పంచుకోదు . అమెరికా లో మా ఫ్రెండ్స్ గ్రూప్ కి నేనే వార్త  అందించా . 

 ఫ్యునరల్ అప్పుడు, తనే దగ్గరుండి అన్నీ చేసిందనీ , ముఖం మీద నవ్వు చెదరనీయ లేదనీ మా కామన్ ఫ్రెండ్ చెప్పాడు . అయితే అతను  స్నేహ తో మాట్లాడేటప్పుడు, ' నాకు ఇండియా నుండి కృష్ణ ఫోన్ వచ్చేదాకా తెలియలేదు ఈ వార్త .. అనగానే, అక్కడే కూలబడింది . ఇద్దరం ఏడ్చాము ' అని  చెప్పినప్పుడు  స్నేహ మనసు లో నా స్థానం అర్థమైంది . 

 ఒకే ఒక్క సారి మాత్రం మాట్లాడింది. జేసన్ తో ఆఖరి రోజు ఎలా గడిచిందో చెప్పింది. చాలా సేపు మాట్లాడకుండా కామ్ గా ఉన్నాకా మళ్లీ  కొద్దిగా గద్గదంగా,   'ఓకే నేను దురదృష్ట వంతురాల్ని, పాపాత్మురాలిని, అనాథ ని, జీవితం లో నా దగ్గర కొచ్చిన వారంతా, వెళ్లి పోతారు.  టీనా ఏం  తప్పు చేసింది? దానికి పితృ ఛాయ  ఎందుకు లేదు?' అని దుఃఖ పడింది .  నాకూ ఏమనాలో తోచలేదు .  అంతలోనే సద్దుకుని, 'టీనా కి నేనున్నాను, నాయనమ్మ, తాతయ్యా, అత్త కుటుంబం ఉన్నారు, నేను మళ్లీ పని లో చేరుతున్నాను . సెలవలన్నీ  అయిపోయాయి, పెట్టేస్తున్నా' అని ఫోన్ పెట్టేసింది . 

నేను చలించిపోయాను . కానీ ఏమీ చేయలేని పరిస్థితి .  ఈలోగా ఆఫీసు పని మీద నా ప్రాజెక్ట్ మేట్  అమెరికా కి వెళ్తుంటే  ఏదో సరదాకి స్నేహ కి చిన్న వస్తువు పంపాను . యథా ప్రకారం స్నేహ అది అందిందనీ చెప్పలేదు, అందలేదనీ అనలేదు .  అయితే ఓ నెల తర్వాత మళ్లీ పింగ్ చేసి,   'మీ ఫ్రెండ్ చాలా అడ్వెంచరస్ ' అని నవ్వింది .  'అంటే ?' అన్నాను అయోమయం గా . 

'నాకు ఎలాగూ  భర్త లేడు, వాడు రెండు నెలలకని  వచ్చాడు కదా? కాస్త నాతో  టైమ్ పాస్ చేద్దామను కున్నాడు, నేను బుద్ధి చెప్పి పంపిం చేశా' అంది కూల్  గా . 

నాకు తల కొట్టేసినట్లయింది. నాతొ ఎంత నంగి గా మాట్లాడ తాడు?  'చాలా చాలా సారీ' అన్నాను అపాలజెటిక్ గా. 
'పర్వాలేదు, వీడొక్కడే  కాదు లే, మనతో మాట్లాడేవాళ్లు  బోల్డు మంది  గుర్తున్నారా?' అని ఒక పది పేర్లుచెప్పింది.  'అవును. అందరూ మంచి వాళ్లలానే ఉండేవారు కదా?' అన్నాను అనుమానం గా. 

వాళ్లంతా  పాపం నన్ను ఉద్ధరిద్దామనుకున్నారు. వాళ్ల పెళ్లాలకి  చెప్తాననో, ఆఫీసులో HR notice ఇప్పిస్తాననో  అంటే కానీ వదల్లేదు ' అని నవ్వేసింది .  నాకు ఏమనాలో తోచలేదు .  ఏదో వాగి ఊరుకున్నా .  ప్రాజెక్ట్ మేట్  మళ్లీ ఇండియా కి వచ్చినప్పుడు కడిగి పడేసా . 

మా  జేసన్ తల్లి, స్నేహ తో ఉండిపోయింది .  తనకి అండ లా నిలిచి పోయింది కానీ, ఆవిడ కి స్నేహ కి ఇంకా మంచి జీవితం ఇచ్చి తీరాలనే పట్టుదల బాగా ఉండి, తను మళ్లీ మా ఆఫీసు లోనే, ఇంటి బాధ్యతలన్నీ తీరేదాకా పెళ్లి వద్దనుకుని బ్రహ్మచారి గా మిగిలిన బాలాజీ తో పెళ్లి జరిపేదాకా , మొండికేసి, మళయాళీ క్రిష్టియన్లైనా, హైందవ పధ్ధతి ప్రకారం కన్యాదానం చేసి మరీ వెళ్లింది . 

బాలాజీ బంగారం లాంటి వాడు . టీనా కి తండ్రి స్థానం తీసుకున్నాడు . జేసన్ కి ఫ్రెండు.  స్నేహ కి పదేళ్ల  వయసప్పటి నుంచీ తెలుసతను. జీవితం లో స్నేహతో సమం గా ఆటు పోట్లు అనుభవించిన వాడు . 

ఈ విషయం కూడా వాళ్లూ , వీళ్లూ  చెప్తేనే నేను విన్నాను.  విషయం తెలిసిన రోజు, ఒక చాక్లెట్ పాకెట్ కొని, ఆఫీసు పక్కన సాయి బాబా గుడి వాళ్ల స్కూల్ పిల్లలకి ఇచ్చి నా సంతోషాన్ని వ్యక్తపరచుకున్నాను . 

మళ్లీ ఏదో re-org అయి కాన్ఫెరెన్స్ కాల్ లో దొరికింది . అప్పుడు ఈ వార్త చెప్పింది . ఈ వార్త నేను  విన్నానని చెప్పాను, 

'నేను ఆరోజు నీతో అన్నాను గుర్తుందా? దేవుడు కాస్త ఆనందం ఇస్తే, ఏదో ఒకటి నాదగ్గర్నించి లాక్కుంటాడని  .. గుర్తుందా?
 అని అడిగింది చాట్ లో . 

'అవును. ' అన్నాను. 

'లేదు కృష్ణా! అది తప్పు . నాకర్థమవలేదు అప్పుడు.  Actually it is the reverse. He always gives me something else, when he needs to take away something from me' అంది . 

కళ్లు చెమర్చాయి.  'ఇంకింతే .. నీ కోటా అయిపోయింది . వెంకీ, టీనా ఉంటారు నీతో, ఫరెవర్' అనేశాను. 

'నువ్వూనూ' అంది . 'అలాగే' అనేశాను . 

 ఇప్పుడేమో  ఇలా .. విడిపోతున్నాం  మళ్లీ కలుస్తామనుకోను. రోజూ మాట్లాడు కోక పోయినా, కనీసం ఏడాది కోసారైనా పధ్ధతి గా మంచి చెడ్డలు కనుక్కోక పోయినా,  పద్దెనిమిదేళ్ల స్నేహ బంధాన్ని అలాగే నిలుపుకున్నాము మేము. మళ్లీ నేను తనని కలవాలంటే నేను అమెరికా కెళ్లాలి, లేదా, తను బెంగుళూరికి  రావాలి, వచ్చినా, సమయం సందర్భం కుదరాలి. అంతా  అయ్యే పనో కాదో, 

అయితే, ఇంకోటి కూడా ఉంది  తన జీవితం లో ఎవరో ఒకరు కొత్తగా వచ్చినప్పుడు, ఒకరు వెళ్లి పోవడం జరుగుతుందన్నది నిజమే అయితే, నాలాంటి వాళ్ల ని కోల్పోతేనే బెటర్ .  ఎందుకంటే తను స్నేహమయి, తనకి కావాల్సింది ఎనిమిదిన్నర వేల దూరం లో ఉన్న నాలాంటి వాళ్లు కాదు . నాలాంటి వాళ్లు ఎంతమందైనా దొరుకుతారు తనకి.  వెంకీ, టీనా, జేసన్ తల్లి, ఇంకా అక్కడ తన స్నేహితులూ,.. వాళ్ల అవసరం తనకి ఎంతైనా ఉంది. 

తనన్నట్లు, Bottomline .. I will be with her, irrespective of where I go at work, life' 
Thursday, October 15, 2015 0 comments

ఇరవయ్యేళ్లిక్కడ - తెలుగు పిల్లల ఇంటర్వ్యూ కబుర్లు


పదిన్నర కల్లా ఇంటర్వ్యూ హోస్ట్  చేయాలని తొమ్మిది కే బయల్దేరి కారెక్కేసా.  ఇంటర్వ్యూ చేయాల్సిన అబ్బాయి వివరాలు చూసుకుంటే పదకొండేళ్ల అనుభవం, చదువుల్లో అన్నీ తొంభైలు తప్ప కనీసం ఎనభైలు కూడా ఎరగని వాడిలా ఉన్నాడు. వంక పెట్టడానికి లేని రెస్యూమే.

ఎందుకో అనిపించింది, ఈ అబ్బాయి కి ఉద్యోగం దొరకదని. నేననుకున్నది కరెక్టే అయింది. అబ్బాయి ని చూడగానే నా తల్లిదండ్రులు గుర్తొచ్చారు. (ఇలాగ లేమనే ఎప్పుడో దెప్పుతూ ఉండేవారు కదా అని)  మిల మిలా మెరిసే కళ్లు, చక్కటి భాష, మంచి బట్టలు, బోరు కొట్టించకుండా సరదాగా మాట్లాడే తత్త్వం,.. అయితేనేం, నా అంచనా నిజమే అయింది.  కోడింగ్ పర్వాలేదు కానీ, విషయ జ్ఞానం మాత్రం చాలా తక్కువ.  తెలుగబ్బాయి, అనే అభిమానం తో,  చెప్పేసా..

 'మీకు ఈ ఉద్యోగం రాదు. నన్ను దాటుకుని వెళ్లినా వేరే వాళ్లు చీల్చి చెండాడేస్తారు.  మీ ఇష్టం!  నా సలహా, మీరు వెళ్లిపోండి, మీకు తగ్గ గ్రూప్ కాదు మాది.

ఆ అబ్బాయి ముఖం నల్లబడింది కానీ, నేను అన్నది మాత్రం బాగానే అర్థం చేసుకున్నాడు. ఒక్క నిమిషం లోనే తెరిపినబడి, వెళ్ల డానికి లేచాడు. ఆఫీసు గుమ్మం దాకా దిగబెట్టి వచ్చేసాను.

ఎందుకో ఇదివరకు ఇంటర్వ్యూలు చేసిన తెలుగబ్బాయిలు గుర్తొచ్చి చిరునవ్వు ముఖం మీదకి వచ్చేసింది.

మూడేళ్ల క్రితం ఒకబ్బాయి, చక్కగా ఉన్నాడు, అయితే అతన్ని ఎందుకో ధైర్య లక్ష్మి వరించలేదు. ముఖం దించుకుని, నూతి లోంచి మాట్లాడినట్లు సన్నని గొంతు! నాకు చెవుడు రాలేదు కదా అని అనుమానం వచ్చింది.

మా సంస్థ లెక్చరర్లని సాధారణం గా ఇంటర్వ్యూలకి సైతం తీసుకోదు. అతను టీచింగ్ లో ఉన్నాడు. ఎలాగూ బండి ముందు కెళ్లదు, అలాంటప్పుడు ఇప్పుడే పంపిస్తే సరిపోతుందనిపించింది. అయినా ఎందుకైనా మంచిదని ఇంకా ప్రశ్నలు సంధిస్తున్నా.

గొంతు పెంచమని ఏడెనిమిది సార్లు చెప్పి చెప్పీ విసిగి పోయి, ఇంటర్వ్యూ చాలించా. బయటకి పంపిస్తూ, 'మీరు కాన్ఫిడెన్సు పెంచుకోవాలండీ! eye  contact  ఉండాలి, స్పష్టం గా, ముక్కుసూటి గా, కాస్త వినిపించేట్టు మాట్లాడాలండీ ' అని చెప్పేసా.  

వెనక్కి తిరిగి వెడుతుంటే, 'మాడమ్!' అని పిలిస్తే ఆగాను. ' IT సంస్థల్లో పని చేసాకా, కుటుంబ పరమైన సమస్యలతో, రెండేళ్లు గోదావరి జిల్లాల్లో చాలా మంది ధనికులు, మోతుబరులూ, వ్యాపారస్తులూ ఉండే ఊరు లో ఆడవాళ్ల ఇంజనీరింగు కాలేజీ లో పని చేశాను మాడమ్. అక్కడ కళ్లల్లో కళ్లు పెట్టి చూడటాలూ, గట్టి గా మాట్లాడటాలూ చేస్తే పుచ్చెలు లేచిపోతాయి మాడమ్' అన్నాడు.

నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాలేదు, అలాంటప్పుడు నవ్వేస్తే బెటర్ అని హాయిగా నవ్వేసుకున్నా.  ఇంకో సారి శనివారం బలవంతం గా ఆఫీసు వాళ్లు రప్పించి ఇంటర్వ్యూలు చేయిస్తున్నారు. విసుగ్గా ఉంది. దానికి తోడు, ఆ అబ్బాయి ని చిన్న ప్రోగ్రామ్ రాయవయ్యా బాబూ అంటే,  అడిగిన ఒక్క ప్రశ్న కి వంద డౌట్లతో వేధించుకు తింటున్నాడు.  ఈలోగా ఇంటినుండి ఫోన్లు.. 'అమ్మా, అక్క నన్ను ఇడియట్ అంది.' 'అమ్మా, అదే నన్ను కావాలని పుష్ చేసింది' అంటూ.  కాస్త అపాలజెటిక్ గా 'సారీ, మై కిడ్స్ ' అన్నాను.

'ఏంటీ మీకు పిల్లలా! అదీ ఇద్దరా! ఇంత యంగ్ గా కనపడుతున్నారు, నమ్మలేకపోతున్నా మాడమ్ !'
వార్నీ, ఇంత పాత చింతకాయ డైలాగు కి నేను పడిపోయేంత సిల్లీ గా కనిపిస్తున్నానా? లేక ప్రపంచ జ్ఞానం అతనికి శూన్యమా?' అనుకుని,

'మీరు ఈమాత్రానికే కనుక్కోలేకపోతే రేపు మా కస్టమర్ల బగ్గులు ఎలా కనిపెడతారు?' వెర్డిక్టు పాస్ చేసి పడేసా

ఇంకో తెలుగబ్బాయి, మాంచి సూటూ బూటూ, దొరబాబు లా తయారయి వచ్చాడు. బానే ఉంది.  'కాస్త ఈ కోడు రాసి పెట్టుదూ' అని చిన్న సి ప్రోగ్రామ్ ఇచ్చా.  ఒక గంట ప్రయత్నించి విఫలమై మంచి డైలాగు చెప్పి విరమించాడు.
'I am trained to kill elephants! Please don't make me kill ants'

'ఓహో అలా వచ్చారా? మాకు కళ్లు షార్ప్ గా ఉండి చీమలు చంపగలిగిన వారే కావాలి' అని ఒక థాంక్సు పడేసి బయట పడ్డాను.

ఇంటర్వ్యూ ల్లో ఎక్కువ పర్సనల్ గా ఉండద్దు, ప్రొఫెషనల్ గా ఉండండని గైడ్ లైన్లున్నా, నాకెందుకో, మనుషుల్ని కదా మనం పిల్చింది!  మరమనుషుల్లా ఎలా ట్రీట్  చేస్తామని, అవసరం లేకుండా ఉచిత సలహాలివ్వడమో, దయగా, కాస్త మంచి నీళ్లు పుచ్చు కుంటారా అని మర్యాదలు చేయడమో చేసి భంగ పడిన పరిస్థుతులూ లేకపోలేదు.

ఓసారి ఒకబ్బాయి మరీ చెమటలు కక్కుతూ వచ్చాడు, కాస్త రిఫ్రెష్ అవుతాడని, పాంట్రీ వైపు తీసుకెళ్లా, మంచి నీళ్లు తెచ్చుకుని కుర్చీల్లో కూర్చోగానే.. టెక్నికల్ పీపుల్ చేయరా ఇంటర్వ్యూ? డైరెక్టు గా HR మాట్లాడ తారా ??  అని అడిగాడు.

మంచి నీళ్లు అడిగితేనే నేను  టెక్నికల్ కాదని తేల్చేశాడు.
'అయిపోయావు ఇవ్వాళ్ల నా చేతిలో ' అనుకుని, నాకు తెలిసిన క్లిష్టమైన ప్రోగ్రాములన్నీ అడిగి, కడిగి పంపించేసాకా కానీ తృప్తి గా అనిపించలేదు మరి :)


ఓసారి ఏదో ట్రైనింగ్ కానీ వేరే భవనం వెళ్లాల్సి వచ్చింది. బ్రేక్ సమయం లో, కిటికీ లోంచి రింగు రోడ్డు మీద ట్రాఫిక్కు చూస్తూ  ఫోన్ కాల్ చేసుకుంటున్నా. వెనకెవరో తచ్చాడుతున్నట్టు అనిపించింది.  పట్టించుకోలేదు మొదట. కానీ ఎక్కడికెళ్లినా అక్కడికి ఫాలో అవుతున్నట్టు అర్థమైంది.

తెలిసిన అబ్బాయేమో నాకే గుర్తు లేదేమో నని అనుకుని క్రీగంట గమనించా. ఎప్పుడూ చూసిన జ్ఞాపకం లేదు.

బ్రేక్ పూర్తవడం తో నేనో క్లాస్ లోకి వెళ్ళిపోయా. మళ్లీ రెండు గంటల తర్వాత బయటకి వస్తే అక్కడే తచ్చాడుతున్నాడు.  తలెత్తి సూటి గా చూసి, 'ఏంటి సంగతి? ' అన్నట్టు తలెగరేసా.

'మీకు నేను గుర్తున్నానా? ' అని అడిగాడు.  మొహమాటం గా 'సారీ, గుర్తురావడం లేదు' అని చెప్ప్పాను.

'ఆరు నెలల క్రితం? శనివారం వాకిన్ ఇంటర్వ్యూల్లో..' అని గుర్తు చేశాడు.  గుర్తు రాలేదు కానీ, బాగుండదని, 'ఓహ్.. చేరిపోయారా? బాగుంది. కంగ్రాట్సు' అన్నాను.

'అబ్బే! మీరు సెలెక్టు చేయలేదు గా? ' నిష్టూరం గా అన్నాడు. 'బాబోయ్, అయితే ఇప్పుడేంటి? ' అనుకున్నా. 

'ఆరోజు మీరు నన్ను గేటు దగ్గర దిగబెట్టి, ఎంతలేసి మాటలన్నారు? ' అని పౌరుషం గా అన్నాడు. 
అప్పుడు గుర్తొచ్చింది.  ఈ అబ్బాయి మంచి తెలివైన వాడు, కానీ ఇంగ్లీషు ముక్క రాదు. వేరే దేశాల వారితో మాట్లాడాలంటే కష్టం అని అందరూ రిజెక్ట్ చేశారు. నాకు బానే నచ్చాడు.  బోడి ఇంగ్లిష్ దేముంది? రెండు నెలల్లో నేర్చుకుంటాడు ' అని నేనెంత రికమెండ్ చేసినా ఒప్పుకోలేదెవ్వరూ. 

సరే మనకి నోరెక్కువ కదా, నేను దింపుతాను లెమ్మని, గేటు దగ్గర నుంచోపెట్టి ఇంగ్లిష్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో ఒక పది నిమిషాలు అనర్గళం గా మరి చెప్పా కదా. దానికి రివెంజు అని అర్థమైంది.

'సారీ, ఏదో మీకు మంచిదని అలా కాస్త ఓవర్ గా చెప్పినట్లున్నాను' అటెటో చూస్తూ అన్నాను. 

'పర్వాలేదు, మీరు నాకు అలా చెప్పినందుకు వారం రోజులు బాధ పడ్డాను. అయితే తర్వాత నాకూ పట్టుదల వచ్చింది. ఎలాగైనా ఈ సంస్థ లోనే ఉద్యోగం సాధించి మీ ముందే మెడ లో బాడ్జి వేసుకుని తిరగాలని, కష్టపడి ఇంగ్లీషు ప్రాక్టీసు చేసి, మూడు వేర్వేరు గ్రూపుల్లో ఉద్యోగం సాధించా' అన్నాడు. గర్వమా? అతిశయమా?  పొగరా? ఆత్మాభిమానమా ? ఏంటిది? అనుకుంటూ అతని వైపు చూస్తే, కళ్లు నిర్మలం గా ఉన్నాయి. 

'పోన్లే, మన కామెంట్ వల్ల ఒకరికి కొంత ఉపయోగం అయిందంటే ఈరోజు చాలా మంచి రోజు క్రింద లెక్క ' అనుకుని నేను మాత్రం సంశయం లేకుండా చాలా గర్వం గా ఆ రోజంతా గడిపేశా.

ఒక పైత్యం ఫెల్లో ని ఓసారి ఇంటర్వ్యూ చేశా.  

ముటముటలాడే  ముఖం!   ఏదో ప్రశ్న అడగ్గానే, ముట ముట మీటర్ లెవెల్ పెరిగిపోతుంది. ముఖం మీద పేడేసి కొట్టినట్లు సమాధానాలు.  సర్లెమ్మని నేనూ, నా పని చేసుకుంటూ పోతున్నా. రెండు ప్రోగ్రామ్లు  రాయిద్దామని, ఒక ప్రశ్న ఇచ్చి లాప్ టాప్ లోకి తల దూర్చానో లేదో..  'అసలీ ప్రశ్న కి మీకైనా సమాధానం తెలుసా? ' అని హుంకరించాడు.  

'నాకు తెలియని ప్రశ్న ని అడిగానని ఎందుకనుకుంటున్నారు? ' అని నేనూ ఎర్రబడిన ముఖం తో అడిగా. ఒక పావుగంట హోరాహోరీ గా వాదించుకున్నాకా, నా ప్రశ్న వేరే కాంటెక్స్టు లో అర్థమైందని తెలిసింది.  కనీసం సారీ కూడా లేదు. 

 ఇంటర్వ్యూ అయ్యాకా, మా బాసు గారితో, 'అబ్బే! లాభం లేదండీ. ఆటిట్యూడ్ అస్సలూ బాలేదు. నేను అస్సలూ రికమెండ్ చేయను.'  అని చెప్పేశా. 

'అతను చాలా హై రికమెండేషన్ తో వచ్చాడు. IIT లో చదివిన వాడు..' అని నా నోరు మూయించి మా గ్రూపు లోకి చేర్పించారు.  పుండు మీద కారం జల్లినట్లు పైగా, మా ఇద్దర్నీ ఒకే ప్రాజెక్టు లో వేశారు.  ఇంక వేరే మనిషి తో పని లేకుండా ఒక ఆరునెలలు కలిసి పని చేసాం. 

రెండు దశాబ్దాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అతనంత గొప్ప టీమ్ ప్లేయర్ ని నేను చూడలేదు. అతని తో పని చేసినప్పుడు పెట్టిన దీక్ష, ఫీలయ్యినంత చాలెంజ్ ఎప్పుడూ ఎక్కడా అనుభవానికి రాలేదు.  మాట్లాడిన విషయాలు తిరిగి తలచుకుని తలచుకుని నవ్వినట్లు, వేరే ఎక్కడా దాఖలాలు లేవు. 

తర్వాత మా స్నేహం కుటుంబాలకీ విస్తరించి, ఈనాడు నాకున్న సన్నిహితులలో ఒక్కరు గా నిలచాడు. 'మరి ఇంటర్వ్యూ రోజు ఎందుకలా? ' అని అడిగితే 'నాకు చాలా టెన్షన్. స్టేజి ఫియర్, చెమటలు పట్టేస్తాయి' అనేవాడు. 

తర్వాత ఎప్పుడూ నాకు తొలుస్తూనే ఉంటుంది. ఎంత మందిని నేను సరిగ్గా తెలుసుకోలేక రిజెక్ట్ చేశానో, కొద్దిగా స్పేస్ ఇచ్చి చూస్తే, బాగా చేసి మా సంస్థ లో, మా గ్రూపు లో రాణించేవారో నని. అలా అని నేనేదో, రాకెట్ టెక్నాలజీ చేశాననీ కాదు, వాళ్ల ఇంటర్వ్యూ ఫలితం అంతా నా చేతిలో ఉందనీ కాదు.

గత పదిహేనేళ్లలో వందలాది మందిని రొటీన్ గా ఇంటర్వ్యూ  చేసినా, తెలుగు పిల్లల్ని ఇంటర్వ్యూలు చేస్తే మాత్రం, చాలా డిఫరెంట్ గా అనిపించేది. తెలియకుండానే వీళ్లని గెలిపించాలి అనిపించేది. గెలవకపోతే, వచ్చేసారి ఏం చేస్తే గెలుస్తారో కాస్త కోచ్ చేయాలనిపించేది.

ఈ అబ్బాయి చూడండి..భలే రాశాడు గత వారం స్క్రీన్ చేసిన బయో డాటా లోంచి కట్టింగ్ ..



అదీ నా తెలుగు పిల్లల ఇంటర్వ్యూ గోల.


కొత్త గా జాయిన్ అయిన ముగ్గురు పిల్లల్ని భోజనానికి తీసుకెళ్లవలసింది గా ఏలిన వారి ఆన.
లంచ్ లో తెగ ఉత్సాహం గా మాట్లాడుతున్నారు,  సంస్థ లో వారు చేయబోయే పని గురించి ఆసక్తి గా తెలుసుకుంటూ తినడమే మర్చిపోయారు. నేనూ గంభీరం గా, కొద్దిగా సరదాగా వాళ్లతో కబుర్లు చెప్పి, ముగించేసాను.

పాత నీరు, కొత్త నీరు.  కాల చక్రం తిరుగుతూనే ఉంటుంది. 
'కొత్త డైరెక్టర్ బాబు ఆఫీసు కోసం చూస్తున్నారు. టీమ్ కి దగ్గర గా పని చేయాలని వారి కోరిక. మరి నీ ఆఫీసు .. ' అని మొహమాటం గా మా బాసు గారు ఆపేసారు. 

'ఆఫ్ కోర్స్.. సాయంత్రానికల్లా, కొత్త ఆఫీసు, కొత్త డైరెక్టరు గారికి రెడీ..'  అని చెప్పి వచ్చేశాను. 
నా ఆఫీసు లో పేరుకున్న కీ బోర్డులూ, మౌసులూ, మానిటర్లూ నా టీమ్ లో అవసరమైన వారికి పంచేసి, చెత్త తీసేసి,  ఆఖరి సారి నా ఆఫీసు చూసుకుని, వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేశాను. రేపటినుంచీ వెళ్లినా ఏదో ఒక క్యూబు లో కూర్చోవడమే.  :)

రేపు నేనిచ్చిన ఇంటర్వ్యూల కబుర్లు ..

(సశేషం)

Wednesday, October 14, 2015 0 comments

ఇరవయ్యేళ్లిక్కడ - IT ఇండస్ట్రీ లో ఆఖరి ముప్ఫై రోజులు..


ఇరవయ్యేళ్లిక్కడ - IT ఇండస్ట్రీ లో ఆఖరి ముప్ఫై రోజులు..

చిన్నప్పటి నా కలల్లో నేను పెద్దయి  డాక్టరో, ఇంజనీరో, టీచరో, సినిమా ల్లో హీరోయినో మాత్రమే కాదు, దేశం కోసం క్రికెట్ ఆడినట్లూ, (మగవాళ్ల జట్టు లో), అంతరీక్షం లోకి వెళ్లినట్టో..షెర్లాక్ హోమ్స్ లా రకరకాల మిస్టరీ కేసుల్ని సాధిస్తున్నట్లో, అబ్బో ఒకరకం కాదు ఎన్ని రకాల ఉద్యోగాలు చేశానో, ఊళ్లేలానో!

అయితే, ఒక్కసారి కూడా ఒక డబ్బా ముందు కూర్చుని ఇరవయ్యేసి యేళ్లు కీ బోర్డు టిక్కూ టిక్కూ లాడిస్తూ గడుపుతానని, ఈ డబ్బా చదువే అన్నం పెడుతుందని, విమానాలెక్కిస్తుందనీ, వివిధ దేశాలు తిప్పుతుందని, విభిన్న జాతుల వారితో కలిసి పని చేసే అవకాశం ఇస్తుందని, ఒకరకం గా విశాల భావాల్ని పెంచుకుని ఎదిగేలా, మరో రకం గా, సంకుచిత్వాన్ని కంచు కవచం లో సంరక్షించు కునేలా చేస్తుందనీ అనుకోలేదు.

చాలా మందిలా, నలభయ్యేళ్ల కి రిటైర్ అయిపోవాలని అనుకున్నా, ఆచరణ రూపం లోకి వచ్చేసరికి మూడేళ్లు పట్టింది. (అయ్యో నా వయసు చెప్పేసినట్లున్నానే :-((( )

ఇరవయ్యేళ్ల IT కెరీర్ ని ఈరోజు నుండి కరెక్టు గా నెల రోజుల్లో ముగిస్తుంటే కొద్దిగా బాధగా, బెంగగా, కష్టం గానూ, కొద్దిగా ఆనందం గా, ప్రశాంతం గా, తృప్తి గానూ అనిపిస్తోంది.  దాదాపు గుండె మీద బండరాయి పెట్టుకునే రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేశా. జీవితమంతా మరి IT కే అంకితమిస్తే, వేరే వ్యాపకాలకో? అన్న ఉద్దేశ్యమే  నా ఐచ్చిక పదవీ విరమణకి ప్రధాన కారణం.

ఇప్పటి వరకూ చదివిన ఎన్నో తెలుగు కథల్లో మగవారి రిటైర్మెంటు తర్వాత వాళ్ల జీవితం లో వచ్చే మార్పులూ, చేర్పులూ చూసా కానీ, ఆడవారి రిటైర్మెంటు గురించి చదివిన గుర్తు నాకు లేనే లేదు. (అలాంటి కథలు, నవలలూ చాలా వచ్చి నేను చూడలేదేమో తెలియదు).

ఇరవయ్యేళ్లు కొన్ని విధాలు గా ఎంత  ఎక్కువనిపించాయో, మరి కొన్ని విధాలు గా అంత నెమ్మది గా అంతు తెగని టీవీ  లా సాగి, తెగ విసుగ్గానూ అనిపించాయి. అందరికీ అంతేనేమో, అయితే నా అనుభవాలు మాత్రమే నాకు తెలుసు. సాధ్యమైనంత నిజాయితీ గా, నాతో కలిసి పని చేసిన, చేయని వారి వ్యక్తిగత విషయాలని టచ్ చేయకుండా వారి గౌరవానికి భంగం కలగకుండా రాద్దామని చిన్న కోరిక ..

సమయం సరిపోక, ఫేసుబుక్కుకీ , బ్లాగుకీ దూరం గా ఉండిపోయా. ఎందుకో నిన్న మెయిల్స్ చూస్తుంటే, జ్యోతి వలభోజు గారు దాదాపు రెండు వారాల క్రితం పంపిన ఈ మెయిల్ కనపడింది.

నవ తెలంగాణా పత్రిక లో దాదాపు నాతో మాట్లాడినట్లు, ఇంటర్వ్యూ చేసినట్లు వచ్చిన ఆర్టికల్ ని అది. ఏమనుకోవాలో అర్థం కాలేదు కానీ,  ఒకవిధం గా నాకు మళ్లీ బ్లాగు రాసేలా, చిన్న పుష్ ఇచ్చింది.

http://www.navatelangana.com/article/maanavi/114739

 వారికి,  నా ధన్యవాదాలతో, ..

'30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ' పృథ్వి గారికి వారి డైలాగు ని టైటిల్ గా వాడుకుంటూ క్రెడిట్ ఇస్తూ 

రేపు ..విరమణ ముందు ముప్ఫైయ్యవ రోజు..
(సశేషం ..) 

 
;