Saturday, May 22, 2010

సామాన్ల లక్ష్మి ...

పదేళ్ళ క్రితం సంగతి..

'మా గుమ్మడి వడియాలు రాలేదండీ.. ' అంది ఫోన్ చేసి మా ఫ్రెండ్ ఫ్రెండ్ ఫ్రెండ్ ట లక్ష్మి. నాకు నీరసం వచ్చింది. ఇండియా నుండి ఏ సీజన్ లో వచ్చినా ఈ గొడవ తప్పదు కదా అని మళ్ళీ వెతుకులాట ప్రారంభం.. పొద్దున్నే ఇంకో ఆవిడ 'మా అమ్మగారు ఏదో స్పెషల్ స్వీట్ పంపిస్తానన్నారు..మీరిచ్చిన పాకెట్ చూస్తే బందరు లడ్డూ..' మా పాకెట్ వేరే ఉంటుంది చూడండి.. నీలం రంగు సంచీ లో పెట్టిందిట మా అమ్మ ' అని...

అనుమానం వేసింది.. ఇంకో లక్ష్మి కి ఇవ్వలేదు కదా అని.. కనుక్కుంటే 'నిజమే.. మేం పొద్దున్నే వేయించుకుని తినేసాం. అలాగే .. ఆ స్వీట్లు కూడా ఇంతకుముందు ఎప్పుడూ తినలేదు.. బాగున్నాయి.. ఇంకా మా వాళ్ళే పంపారేమో అనుకున్నాం' ఇప్పుడు వాళ్ళకేం చెప్పాలా అని తల పట్టుకుని కూర్చుండిపోయాం మేమిద్దరం. ఎంత జాగ్రత్త గా సద్దినా.. ఆఖరి నిమిషం లో వరదలా వచ్చి పడే మిగతా వారి సామాను తో మాకు వాళ్ళ పాకింగ్ విప్పటం.. అక్కడా ఇక్కడా పేర్లు రాసి తోయటం.. ఇంటికొచ్చాక.. ఇలాంటి పంపకాలల్లో పొరపాట్లూ తప్పేవి కావు.

అయినా వడియాలూ, స్వీట్లూ, అంత పొద్దున్నే అన్నీ తినేయాలా? కనీసం మావేనా అని వెరిఫై చేసుకోవక్కర్లేదా అని విసుగేసింది.

ఇండియా ట్రిప్ అంటేనే అదొక ఆరాటం.. అబ్బో.. నెల రోజుల ముందు నుండీ ప్రయత్నాలు.. లిస్టులూ, షాపింగులు, ఎంతలో కొనాలు, ఎంతమందికి కొనాలి, ఏమి కొనాలి.. ప్రణాళికలూ, ఇండియాలో వాళ్ళ కోరికలు, మా ఇద్దరి దెబ్బలాటలు.. ఇదంతా ఒక ఎత్తైతే.. బంధుమిత్రుల 'చిన్న్న్న్న్న్న్న్న ' పాకెట్ల రవాణా.. ఇంకో ఎత్తు.

మామూలప్పుడు పర్వాలేదు కానీ అమెరికాకీ భారతదేశానికీ మధ్య ప్రయాణాలప్పుడు మాత్రం మాకు లక్ష్మి పేరు చెప్తే హడల్. తనకి ఎప్పుడూ ఒక ' ఎటర్నల్ నీడ్' ఉండేది ఇండియా నుండి అమెరికాకీ, అమెరికా నుండి ఇండియాకీ సామాన్లు రవాణా చేయటానికి.

పిన్నీసుల దగ్గర్నించీ, ఎలక్ట్రానిక్ సామాన్ల దాకా అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడ చేర్చటమే తన జీవిత ధ్యేయం గా అనిపించేది నాకు.

ఇండియానుండి వచ్చేప్పుడు పచ్చళ్ళు, పొడులూ, స్వీట్లూ, ఇతర ఆహార పదార్థాలూ, బట్టలూ, మందులూ, చెప్పులూ, నగలూ, ఒకటి రెండు సార్లు.. చిన్న రోలూ, సుమీత్ మిక్సీ, కుక్కర్లూ,ఇంకా రకరకాల గిన్నెలూ, అలంకార సామాగ్రీ, ..

ఒకసారి తన సామానులో మగపిల్లల బట్టలూ, పూజా సామాగ్రీ చూసాను. 'అదేంటి? నీకు మగపిల్లలు లేరు.. నువ్వు పెద్దగా పూజలూ గట్రా చేసింది నేనరగను.. ' అని అడిగాను. తన కోసమే కాదు తనకి తెలిసిన వాళ్ళకోసం కూడా తెప్పించేది అని అప్పుడర్థమైంది.

ఎప్పుడూ ఎవరు వెళ్ళి వస్తున్నారు అన్నది తన దగ్గర పెద్ద డేటా బేస్ ఉండేది. ఎవరు ఎంత సామాన్లతో వెళ్తున్నారు.. వాళ్ళ సామాన్లలో ఎంత ఖాళీ ఉండొచ్చు అన్నది.. తెలుసుకోవటం తనకి హాబీ.


ఒకసారి మా వారు హైదరాబాద్ లో ఉదయం 4.30 ఫ్లైట్ కి రెడీ అవుతున్నారు. అర్థరాత్రి 2 గంటలకి కాలింగ్ బెల్. ఈసమయం లో ఎవరని భయపడుతూ చూస్తే.. ' మేమేనండీ ' అని లక్ష్మి తల్లిదండ్రులు. ఖంగుతిన్నారు మా అత్తగారూ వాళ్ళూ..

' మాకు లక్ష్మి చెప్పింది మీరు మూడు రోజులకే అనుకోకుండా వచ్చారని. కానీ.. అనుకోకుండా ఊరెళ్ళవలసి వచ్చి మెసేజ్ రాత్రి 10 గంటలకి చూసుకున్నాం. చుట్టుపక్కల షాపులన్నీ మూసేసారని.. ఇంట్లోనే కాస్త పిండివంటలూ అవీ చేసి తెచ్చాం.' అన్నారు.

' మా బాగేజెస్ అన్నీ బరువు లన్నీ చూసి పక్కన పెట్టేసాం. ఇంక ఏమీ పెట్టలేము. సారీ ' అంటే ఇంక వాళ్ళు శత విధాలు గా ప్రయత్నించి బ్యాగులను తెరిపించి.. మా అత్తగారు కొని పెట్టిన (చింతపండు అనుకుంటా) వస్తువులేవో తీయించి.. జంతికలు పెట్టించి, ఆనందం గా వెళ్ళిపోయారు.

ఇక అమెరికా నుండి వచ్చేటప్పుడు ఒకసారి నేనూ, మావారూ,పిల్లలూ తలా ఒక బాగ్ తో ఇండియా వద్దామని అనుకున్నాం. ఈ విషయాన్ని ఎంత గోప్యం గా ఉంచినా.. ఎలగోలాగ కనిపెట్టి నాలుగు బాగేజిల సబ్బు బిళ్ళలూ, షాంపూలూ, పనికి మాలిన సామాన్లతో నింపి మా చేత పంపించిన ఘనత తనకి ఉంది.

ఇంకోసారి పెద్ద వెదురు హాట్ ఇచ్చి పెట్టుకెళ్ళమంది తన తమ్ముడి కోసం. నేను పోన్లే అనుకున్నప్పుడు మావారికీ.. ఆయన 'వదిలేయ్' అన్నప్పుడు నాకూ చిరాకు వేసేది.

ఒకసారి ఎందుకో మా చుట్టాల అమ్మాయికి ఒక అత్యవసరం గా ఏదో అరుదైన మందు కావాలని ఫోన్ చేస్తే.. అది కొన్నాక.. కొరియర్ ద్వారా పంపుదామనుకుంటే.. ఆరోజుకి మూసేసారు. లక్ష్మికి తెలిసి ఇంటికి వచ్చి మరీ మందు తీసుకెళ్ళి అదే పూట తన భర్త ఆఫీస్ వాళ్ళెవరితోనో పంపింది, అఫ్ కోర్స్ కొన్ని గోళ్ళ రంగులూ, లిప్ స్టిక్లూ కూడా తోసేసి.., నాకైతే కళ్ళు చెమర్చాయి అంత చొరవగా సహాయం చేసినందుకు..

మేము ఇండియాకొచ్చాక, కొద్ది నెలల్లో వాళ్ళూ వచ్చేసారు. ఇంక ఈ సరఫరాల బాధ తప్పిందనుకున్నాం. కానీ.. మొన్నీమధ్య హైదరాబాద్ నుండి వస్తుంటే కాచిగూడా స్టేషన్ కి వచ్చి బెంగుళూరు లో వాళ్ళ వాళ్ళకి ఏదో ఇవ్వమని ఒక సంచీ ఇచ్చింది.

అంతెందుకు..అలవాటైన ప్రాణం కదా... వాళ్ళింటికెళ్ళి వెనక్కి వస్తుంటే కూడా పోస్ట్ చేయమని ఉత్తరమో.. వాళ్ళింటికెళ్తుంటే షాప్ లోంచి ఏదో ఒకటి తెమ్మంటుంది..వాళ్ళకో, వాళ్ళ పక్కవాళ్ళకో..

ఇప్పటికీ అప్పుడప్పుడూ ఫోన్ చేసి అడుగుతుంది.. ఎవరైనా మా ఆఫీస్ లో యూ యెస్ , ఇండియాల మధ్యలో ఎవరైనా తిరుగుతున్నారా అని..

అసలే ఆవకాయల సీజన్ కదా... మీకైనా సరే ఏమైనా పంపాలంటే లక్ష్మి ని తప్పక అడిగి చూడండి..

3 comments:

Badri said...

ఇండియా ట్రిప్ అంటేనే అదొక ఆరాటం.. అబ్బో.. నెల రోజుల ముందు నుండీ ప్రయత్నాలు.. లిస్టులూ, షాపింగులు, ఎంతలో కొనాలు, ఎంతమందికి కొనాలి, ఏమి కొనాలి.. ప్రణాళికలూ, ఇండియాలో వాళ్ళ కోరికలు,//
chaala kastamandi baaboo ivaanni. andulo naa laanti lazy fellows ki inkaa :-)

btw, ippude okadini flight ekkinchi vachaa, india lo dorakavani frozen green peas dabbalu luggage lo pettukelladu ;-)

జయ said...

నిజమేనండి. ఇక్కడ మా వాళ్ళను చూస్తూనే ఉంటాను. ఇటువంటి ఇబ్బందులు చాలానే ఫేస్ చేస్తూ ఉంటారు.

teresa said...

ఇన్నేళ్ళలో ఎప్పుడూ మాకోసమంటూ ఒక్క పచ్చడి పాకెట్టు తెచ్చుకోని వాళ్ళం మొన్న నా అన్న ఫ్రెండుట, తన కూతురికి 6 పాకెట్లు పచ్చళ్ళు పంపితే తేవడం గాకుండా మిషిగన్లో ఉండే మేము కాలిఫోర్నియాలో ఉండే ఆ అమ్మాయికి ఆవి మయిల్‌ చేసేప్పటికి 3 వారాలు పట్టింది. ఆ పచ్చళ్ళ ఖరీదుకంటే మాకు వదిలిన మైలింగ్‌ చార్జిలే ఎక్కువ!! ప్రతి ఊళ్ళోనూ ఓ లక్ష్మి ఉంటుందనుకుంట :)

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;