Sunday, May 2, 2010

భాగ్యనగరం లో స్కూటర్ పై సాహసాలు..

మా చెల్లెలు.. మృదు స్వభావానికి పెట్టింది పేరు.. ఎక్కువగా మాట్లాడదు. మాట్లాడినా.. మంధ్ర స్థాయి లోనే,..చిరునవ్వుతో 'నో' అని చెప్పటం దాని దగ్గర్నించి నేర్చుకోవాల్సిందే.. అందరూ మీ చిన్నమ్మాయి చాలా నెమ్మది, అనేవాళ్ళు.

దానితో ఒకసారి స్కూటర్ మీద హిమాయత్ నగర్ వెళ్ళాను. ఒకడెవడో సెల్ లో మాట్లాడుతూ బైక్ నడుపుతూ ..వెనగ్గా వస్తూ చిన్న గా.. కొట్టుకున్నాడు మా స్కూటర్ కి..

అంతే.. అపర కాళి లా నేనెప్పుడూ, కనీ,వినీ ఎరగని భయంకరమైన భాషలో రెండు తిట్లు వదిలింది. నేను బిత్తర పోయాను.. నా చెల్లెలేనా ఇది లేక 'అపరిచితుడు ' ఆవహించాడా? అని .. వాడు వెనక్కి తిరిగి దీనికి రెట్టింపు డోసు లో అందుకుంటే.. మన గతేంటి.. అని. భయపడ్డాను. అతను 'సారీ' చెప్తూ పారిపోయాడు.

నా భయం చూసి.. మళ్ళీ 'రూల్స్ రామనుజం ' రూపం లోకెళ్ళి ఒక మందహాసం నా మొహాన పడేసి .. 'హైదరాబాద్ లో మెతక గా ఉంటే బైక్ నడపలేం అక్కా!!! మనం ఇంతకన్నా ఏ మాత్రం తక్కువ గా రియాక్ట్ అయినా.. వాడు తప్పు నీదే అని దబాయిస్తాడు.. పైగా.. నడపడం రాకపోతే.. వెనక కూర్చో.. ఎందుకమ్మా మా ప్రాణాలు తీయటానికి వస్తారు రోడ్ల మీదకి అని..' అంది. 'అఘోరించావు లే ' అనుకున్నాను.

ఇంటి కొచ్చి పడే దాకా నాకు గుండె దడ తగ్గలేదు.ప్రాణాలకొడ్డి, ఎప్పుడు ఎక్కడనుండి ఏ వాహనాయుధాన్నయినా ఎదుర్కుని విజయాన్ని పొందగలమన్న అచంచల విశ్వాసం, అట్టి నమ్మకం గురించి తమ జీవితాన్ని పణం గా పెట్టగల గుండె ధైర్యం లేకపోతే మన భాగ్య నగరం లో 2 వీలర్ నడపటం కాస్త కష్టమే..

కాలిఫోర్నియా లో నా కొలీగ్ ఒకతను ఒకసారి సెలవలకి భారతదేశానికి వెళ్ళి వచ్చాడు. కాఫెటేరియా లో లంచికి మా గ్యాంగంతా కలిసాం. తన వెకేషన్ కబుర్లు చెప్తున్నాడు. 'నా హైదరాబాదీనెస్ పడిపోయిందోయ్.. మొన్న బెగంపేట లో నా బండికి బుస్ టక్కర్ ఇచ్చింది. ఒక్క దూకులో బండి దిగి బుస్ ఎక్కి డ్రైవర్ గల్లా పట్టినా.అప్పుడేమైందో తెలుసా?' అని అందర్నీ.. నిశితం గా.. సాధ్యమయినంత స్లో గా తల తిప్పుతూ.. ప్రశ్నించాడు.

భోజనం తింటూ ఉండటం తో .. ఆయన చాలెంజ్ ని మేము పెద్దగా రెసిస్టన్స్ లేకుండానే ఓడిపోయినట్టు గా 'తెలియదన్నట్టు ' గా తల అడ్డం గా ఆడించాం. ఒకింత బాధ గా..

"కాలేజ్ దినాల్లో.. గల గలా జారిపోయేవి బోల్డు తిట్లు.. ఆరేళ్ళ ఈ చప్ప కాలిఫోర్నియా లైఫ్ స్టైల్ తో.. ఒక్కటంటే ఒక్కటి .. కనీసం ఒక్క తిట్టు కూడా నాకు గుర్తు రాలేదు.." అని చాలా సిగ్గు గా చెప్పాడు.. తల దించుకుని. మేము కూడా.. మాకు తోచినట్టు .. 'జగన్ ' మొహం పెట్టి ఓదార్చాం.

"డ్రైవర్ కాలర్ పట్టాక 'ఏంది బే .. ' తర్వాత.. బోల్తీ బంద్!!! నాకు ఒక్క పదం రాలే.." "డ్రైవరే కాదు బస్ లో కూడా అందరూ నవ్వటమే..' అన్నాడు..

కాలేజ్ రోజుల్లో లూనా మీద, మా నాన్న గారు చూడకుండా.. ఆయన చేతక్ మీదా.. ఆబిడ్స్, కోఠీ మొదలుకుని దిల్ షుక్ నగర్, పంజాగుట్టా, అమీర్ పేట్ సైర్లు ఎన్ని సార్లు కొట్టామో లెక్క లేదు.

పదిహేనేళ్ళ క్రితం ఒకసారి ఇంటికి వస్తుంటే కళ్ళజోడు పగిలిపోయింది. పైగా వర్షం. అయినా ధైర్యం గా 5 కిలొమీటర్లు నడిపి వచ్చేసాను. ఇంకోసారి ఉస్మానియా యూనివర్సిటీ లో మా స్నేహితురాలి తో పాటూ, దాని ఇద్దరు చెళ్ళెళ్ళనీ.. కూడా చిన్న స్కూటీ మీద తెచ్చేసాను ఒకసారి తార్నాకా చౌరాస్తా దాకా. ట్రాఫిక్ పోలీస్ వేసిన ఫైన్ వల్ల 2 సినిమాల నష్టం!

ఒకసారి ఒక గతుకుల రోడ్ గల్లీ లో వెళ్తున్నాను.. ముందాయన బహుశా తన భార్య తో స్కూటర్ మీద వెళ్తున్నాడు. హాంక్ కొట్టినా నెమ్మదిగానే వెళ్తున్నాడు. విసుగొచ్చి దొరికిన మొదటి అవకాశం లోనే ఆయనకి కట్ కొట్టి భుజాల మీదుగా ఒక లుక్ పడేసి గతుక్కు మన్నాను. ఆయన మా ఫామిలీ డాక్టర్. వాళ్ళావిడ కి ఎనిమిదవ నెల.

వారం తర్వాత చిన్న ఆక్సిడెంట్ అయి చిన్న చిన్న దెబ్బల తో వెళ్ళాను. ఆయన 'వెల్కం.. ఎప్పుడో ఈరోజు వస్తుందని తెలుసు.. కానీ ఇంత త్వరగా వస్తుందనుకోలేదు.' అని ఆయన వ్యంగ్యోక్తులతో మమ్మల్నలరించారు :-)

ఇంటర్ చదువుతున్నప్పుడు మా చెల్లి ఫైనల్ పరీక్షలకి వెళ్తూ నిర్మానుష్యమైన రోడ్ లో ఫైనల్ పరీక్షలకి వెళ్తూ ఆగిపోతే బండి పక్కన పడేసి ఇంటికో ఫోన్ కొట్టి, ఎవరో లక్కీ గా ఆపితే ఆయన పాప తో అడ్ జస్ట్ అయి ఎగ్జాం సెంటర్ కెళ్తే.. తిట్టుకుంటూ మెకానిక్ దాకా తోసుకెళ్ళటం.. తలచుకుంటే... ఇప్పుడు అలాంటి సాహసం చేయగలమా? అని ఆశ్చర్యం వేస్తుంది.

పదేళ్ళు విదేశీ వాసం తర్వాత బెంగుళూరు లో ఆక్టివా నడిపినా నాకు హైదరాబాద్ లో మాత్రం భయమే.అయితే ఏం.. మే ఎండల్లో మా చెల్లెలి వెనక కూర్చుని హాయిగా వేడి వేడి కాలుష్యపు గాలి పీలుస్తూ, దోవలో కొన్న జామ/అల్లనేరేడు పళ్ళని దుమ్ము లయెర్ ని చున్నీ తో తుడిచేసి తింటూ, షాపింగ్ బ్యాగుల్ని అన్ని వైపులా తోరణాల్లా వేలాడతీసుకుని, ట్రాఫిక్ జాముల్లో చిక్కుకుని.. గజం దూరం ఎదురుగా దొరికితే ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందం తో ముందుకెళ్ళటం లో ఆనందం ....

7 comments:

Rishi said...

నాకయితే భాగ్యనగరం లో 2 వీలర్స్ నడిపే ఆడవాళ్ళని చూస్తోంటే ముచ్చటేస్తుంది.అసలు ఎంత చక్కగా బ్యాలన్సు చేస్తారు.అలాగే మా అమ్మ వాళ్ల ఊళ్ళో పొద్దున్నే పెద్ద పెద్ద సైకిళ్లకి క్యారేజీలు,కూరగాయలు తగిలించుకుని
హైవే మీద ఒక పక్కగా ఒడుపుగా సైకిలు తొక్కే ఆడవాళ్లని చూస్తే కూడా నిజంగా వాళ్ళు గ్రేట్ అనిపిస్తుంది.

>> 'జగన్ ' మొహం పెట్టి ఓదార్చాం.
ఇది హైలైట్.ఎవరొచ్చినా అలా తల పక్కకి వాల్చి ఒకే ఎక్స్ ప్రెషన్ పెట్టడం ఆయనకే చెల్లింది లెండి.

కొత్త పాళీ said...

హ హ .. బాగా రాశారు. హైదరాబాదు రోడ్డు మీద టూవీలర్ సంగతి దేవుడెరుగు, నడవడం కూడా కష్టమే!

అరుణ పప్పు said...

హైదరాబాదొచ్చిన రెండేళ్లదాకా కాలర్ పట్టుకున్నాక ‘బే’ తప్ప ఏం తిట్టాలో తెలిసేది కాదు. దానికిలానే నవ్వుల పాలయ్యాం నేనూ మా తమ్ముడూ. ఇప్పుడు ‘అపరిచితులం’ అయిపోయాంలెండి. ఫ్లయ్యోవర్ల మీద టర్నింగులు తిరిగేవాళ్లను చూసినప్పుడు మాత్రం అశ్వధాటీ స్త్రోత్తం ధారాళంగా వర్షిస్తుంది నా నోటి నుంచి!!

చదువరి said...

'జగన్ ' మొహం పెట్టి ఓదార్చాం. - :)

Week-end Politician said...

మీ పోస్టులన్నీ చదివాను. మీ రచనా శైలి చక్కగా ఉంది. కొన్ని పద ప్రయోగాలైతే నాకు తెగ నచ్చేశాయి. ఉదాహరణకు..జగన్ మొహం పెట్టడం, బక్కపలచని ముసలాయన, కొవ్వు లేకుండా చువ్వలా ఉండడం

Krishna said...

ధన్యవాదాలు!! 'జగన్ మొహం పెట్టి ' అని రాసే ముందు చాలా ఆలోచించాను.. ఒక పోస్ట్ రాయటానికి పట్టే సమయం.. ఒక్క ఆ ఫ్రేజ్ రాయటానికి పట్టిందంటే నమ్మండి..

(no offense to yuva congress nEta.. Jagan gaaru..)

కొత్త పాళీ said...

Even if you meant some offense, that's quite okay!! That's what blogs are for. However, don't put your picture here or disclose your home address :)

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;