Thursday, April 29, 2010

అక్షయ పాత్ర పర్సులు..

మా బంధువులావిడ ఒకసారి బొంబాయి నుండి వచ్చిన అన్నయ్య గారి పిల్లల్ని తీసుకుని, అన్నవరం వెళ్తున్నారట. గట్టిగా అరగంట ప్రయాణం.. బస్సులో ఆవిడ మేనకోడలు .. కిందకి దిగటానికి లేస్తుంటే మేకుకి తట్టుకుని పాంటు కి కొర్రు పట్టించుకుందిట. దానితో ఆ అమ్మాయి సిగ్గుపడి బస్సు దిగడానికి కూడా మొహమాట పడిందిట.


ఆవిడ చిరు మందహాసం తో.. తన 'భానుమతీ కా పిటారా' చేతి సంచీ లోంచి ఒక తువ్వాలు తీసి అమ్మాయికి ఫాషన్ గా చుట్టి.. బస్సు దిగనిచ్చి, ఒక చెట్టుకింద నుంచొమ్మని.. తన బ్యాగు లోంచి సూదీ,దారం తీసి చక చకా కుట్లు వేసి సమస్య లోంచి బయట పడేసిందిట..


మేము చాలా ఆశ్చర్య పోయాము... అరగంట ప్రయాణానికి ఇన్ని ఏర్పాట్లా అని..


కానీ తర్వాత గమనించాను.. చాలా మంది హాండ్ బ్యాగు లో ఆఫీసు కెళ్ళటానికి కూడా వందలకొద్దీ అ(న)వసరమైన వస్తువులు మోసుకెళ్ళటం.. ఆడవాళ్ళల్లో ఈ అలవాటు కాస్త ఎక్కువే..


ఆ మధ్య తాజ్ హోటెల్ పై బాంబు దాడి అయినప్పటినించీ.. మా ఆఫీసులో ప్రతి రోజూ సెక్యురిటీ వారి హింస మరీ ఎక్కువయింది. ఉదయం వస్తూనే.. కారు ఆపి బ్యాగుల సోదా చేయటం.. ఎంత చిరాగ్గా ఉంటుందో.. అనుభవిస్తే కానీ తెలియదు.

మా ఆఫీసులో మూడు రకాల సోదాలు. ఒకటి కుక్కలు వాసన చూడటం, రెండోది ఏదో నీటి ఆవిరి సహాయంతో నడిచే యంత్రం (పాత కాలం నాటి వీడియో కామెరా ని పోలినది) జరిపే సోదా, ఇంకోటి పూర్తిగా సెక్యూరిటీ అబ్బాయి/అమ్మాయిలు బ్యాగులు తెరిచి చేసే శోధన.

ఈ మూడిట్లో కొద్ది లో కొద్ది నాకు ఆ యంత్రోపయోగమే నయం అనిపిస్తుంది. కుక్కలు లంచి బాక్సుని నాలుక బయట పెట్టి..వగరుస్తూ, లాలా జలం కారుస్తూ వాసన చూస్తే.. ఎందుకో తినేటప్పుడు గుర్తుకొచ్చి.. కాస్త డయట్ కంట్రోల్ కి దోహదకారి అవుతుంది.

ఇక సెక్యూరిటీ వాళ్ళు బ్యాగు జిప్పులు తెరిచి చూస్తే..చాలా విసుగు. పాపం వాళ్ళకీ కష్టమే అనుకోండి.. మొన్న డ్రైవర్ని ఆఫీసు గుమ్మం నుండే పంపించాల్సి వచ్చింది. ఇంక గేటు దగ్గర మాన్యువల్ చెకింగ్ తప్పలేదు. నా ముందు ఇద్దరు ఉన్నారు. అన్య మనస్కం గా ఏదో ఆలోచిస్తున్నాను.దబ్బున శబ్దం వినిపిస్తే ఏంటో అని చూస్తే.. నా ముందు అమ్మాయి పొరపాట్న బ్యాగుని తిరగదీసి ఎత్తింది. చాలా సామాన్లు నేల మీద పడి చెల్లా చెదురయ్యాయి. అయ్యో.. సహాయం చేద్దామని చూస్తే .. ఆశ్చర్య పోయాను. తలెత్తి చూస్తే అందరి మొహల్లో అదే భావం.ఆ అమ్మాయి వ్యక్తిగత సామాగ్రి లో అధిక భాగం ఎలక్ట్రానిక్ ఉపకరణాలూ , తీగలే..ఐ పోడ్, తలకు పెట్టుకునే ఇయర్ ఫోన్లు, యు యెస్ బీ ద్వారా కంప్యుటర్ కి అప్ లోడ్ చేసుకునే తీగా, రెండు పెన్ డ్రైవులూ, ఒక హార్డ్ డిస్కూ, ఒక మౌసూ, సెల్ ఫోనూ, సెల్ ఫోను చార్జరూ, లాప్ టాప్ చార్జరూ, ఇంకో చార్జరూ,.. ఒక అడుగులు లెక్క పెట్టే యంత్రమూ, ఆఫీసు లాప్ టాపూ, (రిలయన్స్?) డాటా కార్డూ, నల్లగా మెరిసే ఒక చిన్న వాలెటూ .. మాత్రమే నేను గుర్తుపట్టగలిగాను. నాకు తెలియని తీగలూ, ఉపకరణాలూ ఇంకో 3-4 కచ్చితం గా ఉంటాయి.

పూర్వం ఆడవాళ్ళ పర్సులంటే.. లిప్ స్టిక్లూ, బొట్టు బిళ్ళలూ, కాటుక్కాయలూ, పువ్వుల డిజైన్లున్న చేతి గుడ్డలూ, ( వీలైతే సెంటు వాసన తో) లాంటివి ఉంటాయని.. ప్రతీతి. ... ఈ తరం అమ్మాయిల తీరే వేరు.. అనుకున్నాను. ఇంతలో ఇంకో చిన్న పర్సు భుజానికి వేలాడటం చూసాను. దానిలో ఉన్నాయేమో టిపికల్ ఆడవారి వస్తువులనుకుని.. ఆఫీసు లోకి నడిచాను.

నాకెప్పుడూ ఒక డవుటొస్తుంది. ఈ మోడెల్సూ, సినీ తారలూ, కళ్ళజోడు డబ్బా పరిమాణం లో మెరుస్తున్న చిన్న పర్సు పట్టుకుని తిరుగుతూ కనిపిస్తారు.. టీ వీ ల్లో.. దాంట్లో ఏం పడుతుందో.. ఏం పెడతారో..

10 comments:

కొత్త పాళీ said...

ఇప్పుడే మీ బ్లాగు చూడ్డం. అన్ని టపాలూ ఒక్క బిగిని చదివాను. మీ అబ్జర్వేషను శక్తి అమోఘంగా ఉంది. వ్యక్తీకరణ కూడా. ప్రణీత కథ చాలా బాధించింది. Honestly she'd be better off without him. But who would tell her that?

పానీపూరి123 said...

> ఈ మోడెల్సూ, సినీ తారలూ, కళ్ళజోడు డబ్బా పరిమాణం లో మెరుస్తున్న చిన్న పర్సు పట్టుకుని తిరుగుతూ కనిపిస్తారు.. టీ వీ ల్లో.. దాంట్లో ఏం పడుతుందో.. ఏం పెడతారో.
పెద్ద పర్స్‌లు వాళ్ళ అమ్మ/అసిస్టెంట్ లు పట్టుకుంటారు,

> కళ్ళజోడు డబ్బా పరిమాణం లో మెరుస్తున్న చిన్న పర్సు
సెల్‌ఫోన్ అనుకుంట?

Rishi said...

>>కుక్కలు లంచి బాక్సుని నాలుక బయట పెట్టి..వగరుస్తూ, లాలా జలం కారుస్తూ వాసన చూస్తే.. ఎందుకో తినేటప్పుడు గుర్తుకొచ్చి.. కాస్త డయట్ కంట్రోల్ కి దోహదకారి అవుతుంది.
:)).. బాగుందండీ.

Sravya Vattikuti said...

ఒక అడుగులు లెక్క పెట్టే యంత్రమూ >> ఇదేమి యంత్రమండి నా ఊహ కి అందటంలేదు ? ;)

Sravya Vattikuti said...

btw కొద్దిగా ఆ వర్డ్ వెరిఫికేషన్ తీసేయచ్చుకదండి ?

Krishna said...

@Sravya,
అడుగులు లెక్కించే యంత్రం.. పేజర్ పరిమాణం లో ఉంటుంది. నడుం బెల్ట్ కి పెట్టుకుంటే.. మనం వేసే ప్రతి అడుగూ, కౌంటర్ వాల్యూ ని పెంచుతుంది. 6,000 అడుగులు కనీసం వేయాలి రోజూ.. చక్కెర వ్యాదిగ్రస్తులూ, రక్త పీడనం, గుండెజబ్బు వాళ్ళూ, 7,500 అడుగులు వేయాలిట రోజుకి. బరువు తగ్గాలనుకునే వారు 10,000 అడుగులు వేసి తీరాల్సిందే :-)

వర్డ్ వెరిఫికేషన్ అంటే ఏంటండీ? నాకు బ్లాగు ప్రపంచం కొత్త.

Sravya Vattikuti said...

ఓహ్ అర్ధమైందండీ !

వర్డ్ వెరిఫికేషన్ అంటే మీ బ్లాగులో వ్యాఖ్య చేసేటప్పుడు ఒక పదం ఇచ్చి అది పూరిస్తే గానీ వ్యాఖ్య
రాయనివ్వదు. అదే వర్డ్ వెరిఫికేషన్.
అది వ్యాఖ్యలు రాసే వారికి కాస్త విసుగొచ్చే విషయం.
అది మీరు తొలగించలి అనుకుంటే మీ డాష్ బోర్డుకు వెళ్లి మీ బ్లాగు ---- సెట్టింగులు ---- నొక్కండి. అక్కడ మీకు వరుసగా ప్రాధమిక, ప్రచురణ, ఆకృతీ కరణ, వ్యాఖ్యలు....... మొదలైన ఆప్షన్స్ వస్తాయి.

అందులో వ్యాఖ్యలు అనే చోట నొక్కండి. అప్పుడు వ్యాఖ్యలకు సంబంధించిన సెట్టింగులు వస్తాయి. అందులో క్రిందినుండి 3 వ ఆప్షన్ పదనిర్ధారణ చూపాలా వద్దా అని అడుగుతుంది. మీరు వద్దు నొక్కండి. తరువాత క్రింద గానీ పైనగానీ ఉన్న సెట్టింగులను సేవ్ చెయ్యి నొక్కాలి. అంతే !

సిరిసిరిమువ్వ said...

మీ బ్లాగు ఈ రోజే చూసా! టపాలన్నీ చదివేసా. చాన్నాళ్ల తరువాత ఓ మంచి బ్లాగు చూస్తున్నా! చాలా బాగా వ్రాస్తున్నారు..ఇలానే కొనసాగించండి.

శ్రావ్య గారు :) భలే వివరించారు. అన్నట్లు మీకు బ్లాగు ఉందన్న విషయం ఈ రోజే ఈ బ్లాగు ద్వారానే తెలిసింది, డిసెంబరు తరువాత ఏమి వ్రాసినట్లు లేరు!

praseeda said...

అడుగులు లెక్కపెట్టే యంత్రాన్ని పీడోమీటర్ అంటారు. దానికి సంబంధించిన మిగతా వివరాలు కృష్ణప్రియగారు ఇచ్చారు .. :)

కొత్త పాళీ said...

Word verification is an automatic check point to prevent spam comments.
When you remove it, I suggest that you "switch on" comment moderation. This gives you necessary control and protection on which comments appear in the blog.

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;