Saturday, April 17, 2010

నడి వేసవి లో వడగళ్ళ వాన ...

అమ్మా వాళ్ళని రైలెక్కించి స్టేషన్ నుండి కాళ్ళీడ్చుకుంటూ బయటకి వచ్చాను. వెళ్ళేటప్పుడు సామాన్ల బరువు .. తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళతో గడిపిన నెల రోజుల జ్ఞాపకాల బరువు.
డ్రైవర్ కారు దగ్గర వినయం గా నుంచున్నాడు. సరే బయటకి వస్తూండగా "బాబూ .. ఇక్కడ పత్రికల దుకాణం ఉంటుంది.. కాస్త ఆపు " అన్నాను. యశ్వన్తపుర రైల్వే స్టేషన్ బయట కూరగాయల అంగళ్లు, పండ్ల తో నిండిన తోపుడు బళ్ళు, ఇనప సామాన్ల షాపులు. హొల్ సేల్ ధాన్యాల కోట్లూ, కన్నడ లో వ్యాపారస్తుల అరుపులూ, వాహనాల రొద .. ఎటు చూసినా జనం .. దాంతో తెగ వేడి గా.. విసుగ్గా .. తెలుగు పత్రికలు బోల్డు కొనుక్కోవచ్చని కానీ.. లేకపోతే ఈ ఏప్రిల్ ఎండల్లో అసలు దిగటం పెద్ద బోరు..

సాఫ్ట్ వేర్ కంపెనీ ఆఫీసు లోకి కడుపు లో చల్ల కదల కుండా బట్టలు నలగ కుండా సున్నితం గా బాగు పట్టుకుని మేసీస్ లో అమెరికా లో కొనుక్కున జీన్సు, గంజి పెట్టిన కాటన్ కుర్తీ వేసుకుని ఒక చేత్తో లేటెస్ట్ మోడల్ సెల్, ఇంకో చేత్తో తప్పర్ వేర్ లంచ్ బాక్సూ .. డ్రైవర్ సరిగ్గా బిల్డింగ్ కి పది గజాల దూరం లో కారాపితే లిఫ్ట్ లో మూడో అంతస్తు లోకి ఆపసోపాలు పడుతూ వెళ్ళటం.. సాయంత్రం మళ్ళా కారు దాకా వచ్చి రెండు నిమిషాలు వెయిట్ చేస్తేనే డ్రైవర్ కి డర్టీ లుక్కులు పడేసి కారెక్కి ఇంటికొచ్చే దాకా రోజుకో స్నేహితురాలితో హస్కేసుకోవటం తప్ప ఇలాగ మార్కెటు లోకి రావటం చాలా అరుదు.

పెద్ద మార్కెట్ కదా ధరలు తక్కువ గా ఉంటాయని పని మనిషి చెప్తుంది.. పైగా.. నవ నవ లాడుతూ కూరగాయలు పిలుస్తున్నాయి. నాలుగు రకాలు కొన్నానో లేదో ఒకేసారి కుండపోత గా వర్షం. ఆశ్చర్యం వేసింది. ఇప్పటివరకూ ఎండగా. అకస్మాత్తు గా ఈ వర్షం ఏమిటి అని. గోల గోల గా సామాన్లు సర్దేస్తున్నారు. పరుగెత్తుకెళ్ళి ఒక షెడ్ కింద నుంచున్నాను. నాలాగ ఎంత మందో .. నవ్వుకుంటూ విసుక్కుంటూ... కబుర్లు చెప్పుకుంటూ .. ఒక తెల్ల పిల్లి కూడా వెదురు బుట్ట కిందకి దూరుతోంది.. చేతినిండా సామాన్లు.. బట్టలు మురికవుతాయి ఎలాగో ఏంటో అని బెంగ.. కారు కనిపించటం లేదు .. సెల్ తీసి కాల్ చేద్దామంటే తడిసిపోతుందేమో .. కాస్త లోపల పొడి గా ఉండే స్పాట్ దొరికితే బాగుండు .. ఫోన్ చేసి కార్ పిలిస్తే ఇక గొడవ ఉండదు. .. ముసలావిడ కొత్తిమీర కట్టలు బస్తాలలో గబగబా వేసి టార్పాలిన్ షీట్ కప్పుతోంది. ఏవో పాటలు పాడుతూ.. స్కూల్ పిల్లలు.. వడగళ్ళు వడగళ్ళు అని ఒకటే గెంతులు.

అంతలో దూరం నుండి కనిపిస్తుంది కార్. అమ్మయ్య అనుకున్నాను. కానీ ఎక్కడో ఏదో చిన్న కదలిక. డ్రైవర్.. నాకోసమే వెతుకుతూ.. నెమ్మది గా వస్తున్నాడు. ఆత్రం గా ముందుకు రాబోతున్న దాన్నల్లా .. వద్దు..అనుకుని చటుక్కున చుట్టముక్కలు కాలుస్తూ.. కబుర్లేసుకున్న ముసలి తాతల వెనక్కెళ్ళి సెల్ ఆఫ్ చేసాను. కార్ వెళ్ళిపోయింది. నేను.. ప్యాంటు జేబులో సెల్ జాగ్రత్త గా పెట్టి.. తీరిగ్గా కార్ వెనక వంద గజాల దూరంలో వడగళ్ళ దెబ్బలు తింటూ.. చినుకుల చురకలు భరిస్తూ చూరు కింద జనాల ఆసక్తి పూరిత చూపులని ఇగ్నోర్ చేస్తూ.. నెమ్మదిగా అతి నెమ్మదిగా ప్రతి చిన్న చినుకునూ ఆస్వాదిస్తూ.. నడుస్తున్నాను.
మొక్క జొన్న కంకులు కొనుక్కుని ఇనప జల్లెడ బేరం చేసి మల్లెపూలు రెండు మూరలు కొని వినాయకుడి గుడి లో ప్రసాదం తీసుకుని బయటకోచ్చానోలేదో అదిగో రెడీ గా ఉన్నాడు డ్రైవర్ కార్ తో సహా ..

మళ్ళీ గాభీర్యం ముసుగు లో నా యాంత్రిక జీవితం లోకి మళ్ళీ వెళ్ళిపోయాను .. సెల్ తీసి నెల రోజులు గా కాల్ రిటర్న్ చేయని పరిచయస్తులకి కార్ ఇంటికెళ్ళే లోపల చేయకపోతే మళ్ళీ ఫ్రీ టైం దొరకదు.
అసలే గడ్డు రోజులు .. ఇలా ప్రయోజనం లేని పనులతో టైం వేస్ట్ చేసుకుంటే .. ? ఇంటికెళ్ళాక వేడి వేడి బజ్జీలా? లేక ఆఫీసు వర్క్ పూర్తి ? బజ్జీలు టైం వేస్ట్ .. పైగా డైట్ కి కష్టం. ...

15 comments:

కొత్త పాళీ said...

excellent narration - మీ అబ్జర్వేషన్లు అద్భుతంగా ఉన్నాయి

Krishna said...

ధన్యవాదాలు 'కొత్త పాళీ గారు..

నాకు పర్సనల్ గా నచ్చిన పోస్ట్ ఇదే. మనలాంటి వాళ్ళు ఎంతో మంది సామాన్య జీవన శైలి, ప్రకృతి ప్రసాదాలని వదిలి కృత్రిమ జీవితాలలో ఇమిడి పోయాం. వర్షాకాలం లో వానల్నీ , వేసవి లో ఎండల్నీ, శీతాకాలం లో చలినీ తప్పించుకోవటానికి కృత్రిమ పద్ధతులని అనుసరిస్తాం. ఆ పరికరాలని అమర్చుకోవటం, మనం జీవించే ప్రదేశం లో పూసే పూలనీ, పండే పళ్ళనీ, కాసే కాయలనీ ఆస్వాదించటం 'చీప్' అనుకుని, దూర ప్రదేశాల నుంచి దిగుమతి చేసుకోవటం లోనే విజయ గర్వాన్ని అనుభవించి.. చిన్న చిన్న అనుభూతులకి దూరం అవుతాం..

ఆ కొనుగోలు శక్తిని అమర్చుకోవటం కోసం ఒక విధమైన వెట్టి చాకిరీ కి అలవాటు పడిపోయాం.

వీరుభొట్ల వెంకట గణేష్ said...

కృష్ణప్రియ గారు:
మీ టపాలు చాలా బాగున్నాయి. నేను చాలా సార్లు, ఈ సాఫ్ట్వేర్ వెట్టిచాకిరి గురించి మనసులో అనుకున్న మాటలు మీ టపాలో చూసాను.

స్ఫురిత said...

మీ టపా చదువుతుంటే ఆ వేసవి వానలో తడిసిన అనుభూతి, ఆనందం కలిగాయి...

Krishnapriya said...

ధన్యవాదాలు స్ఫురిత,గణేష్,

అసలు పిల్లల్ని వేసవి సెలవలకి అమ్మమ్మగారింటికి రైలెక్కించాక వర్షం లో తడుస్తూ ఈ విధం గా ఇంటికి వచ్చాకే ఈ బ్లాగ్ రాయాలని తోచింది. పదవతరగతి తెలుగు మాధ్యమం లో చదివాక తర్వాత తెలుగు లో రాయటమనేది ఇప్పుడే..

నా దైనందిక అనుభవాలనీ, అనుభూతులనీ.. మాతృభాష లోనే రాయాలనే ఉద్దేశ్యం తోనే మొదలు పెట్టాను..

కృష్ణప్రియ

drsd said...

బాగుంది. పైన గణేష్ గారి మాటే నాది. ఈ సాఫ్ట్వేర్ వెట్టిచాకిరి నుంచి విముక్తి ఎపుడో? నేను ఈ రోజు మీ టపా లో ఇంతకు ముందు మిస్ ఐనవి చదువుతూ కామెంట్ చేస్తున్న. భయపడకండి:-)

మనలాంటి వాళ్ళు ఎంతో మంది సామాన్య జీవన శైలి, ప్రకృతి ప్రసాదాలని వదిలి కృత్రిమ జీవితాలలో ఇమిడి పోయాం. వర్షాకాలం లో వానల్నీ , వేసవి లో ఎండల్నీ, శీతాకాలం లో చలినీ తప్పించుకోవటానికి కృత్రిమ పద్ధతులని అనుసరిస్తాం. ఆ పరికరాలని అమర్చుకోవటం, మనం జీవించే ప్రదేశం లో పూసే పూలనీ, పండే పళ్ళనీ, కాసే కాయలనీ ఆస్వాదించటం 'చీప్' అనుకుని, దూర ప్రదేశాల నుంచి దిగుమతి చేసుకోవటం లోనే విజయ గర్వాన్ని అనుభవించి.. చిన్న చిన్న అనుభూతులకి దూరం అవుతాం.. just too good.. ఇంకా చెప్పడానికి ఏమి లేదు.

కృష్ణప్రియ said...

పాత టపాలు చదివి కామెంట్లు పెట్టారు.. ధన్యవాదాలు! మళ్ళీ ఈ విషయానికి దగ్గరలోనే టపా రాద్దామని మొదలు పెట్టాను ఈరోజే..

lalithag said...

WOW!
I don't want to write more than that Krishna priya "gaarU"....Can't stop smiling!!!!
Got to read all your posts! Been missing so much already!

కృష్ణప్రియ said...

@ లలిత,

:-) చాలా థాంక్స్! నాకు personal గా నచ్చిన టపా ఇది. ప్రతి క్షణానికీ విలువ కట్టుకుని, ఏదో ఒకటి పనికి వచ్చేది చేసి తీరాలనుకుని,
చిన్న చిన్న ఆనందాలకు దూరమవుతున్నాం :-(

budugoy said...

కూడలిలో టైటిల్ చూసి క్లిక్ చేస్తే మొత్తం బ్లాగంతా చదివించారు. మీ బ్లాగు భలే. మీ రచనా శైలి చక్కగా ఉంది. ఎలాగు సాఫ్టువేర్ ఉద్యోగం చేస్తున్నారు, సోమరాజు సుశీల గారి తరహాలో వృత్తి మీద కథలు రాద్దురూ... మీ కలానికి పదును ఎలాగూ ఉంది. సమయమే మీ కంపెనీ నుండి కాస్త అప్పు తీసుకొని తెలుగు పాఠకులకోసం ఆ పని చేద్దురూ
-బు

కృష్ణప్రియ said...

@ budugoy,

థాంక్స్!! హ్మ్మ్.. నాకు కథలు రాయడం వస్తుందా.. చూడాలి. సుశీల గారి ఇండస్ట్రీ అనుభవాల రచనలంటే నాకూ చాలా ఇష్టం. ఆఫీస్ విషయాలు అప్పుడప్పుడూ రాస్తున్నాను.. 'సాఫ్ట్ వేర్ కంపెనీ కబుర్లు ' అన్న విభాగం లో..

kallurisailabala said...

వెళ్ళేటప్పుడు సామాన్ల బరువు .. తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళతో గడిపిన నెల రోజుల జ్ఞాపకాల బరువు. e lines chala bavunnayi.
http:/kallurisailabala.blogspot.com

కృష్ణప్రియ said...

@ #kallurisailabala#,

థాంక్స్! నాకూ నచ్చిన లైన్ అదే :)

VSR said...

hmmm....

Btech 3rd year lone JOB vasthe...yegiri ganthulu vesi......inkeppudu Join avuthaamaa...inkeppudu join avuthaamaaa...!!!!!! ani yeduru chusi......

antha GOPPPHA JOB lo join ayyaka....3 months Induction kudaa ayyaaka....

Project allocate chesi..HANDS-ON training kudaaaa ayyaaka.....


appudu modalavuthundi...MISS avvadam.....

adi modalu....manaku anni thelusthune vuntaaayi..MISS avuthunnam chinna chinna aanandaalu yennoooo....ani.....


kaaniii....LIFE lo SETTLE avvaali anukuntu...LIFE ne MISS avuthuntaam....


Baagundi..meee VARSHAPU ANUBHUTHI.....meee RACHANAA SAILI

కృష్ణప్రియ said...

@ VSR,

ధన్యవాదాలు! చాలా సంతోషం. ఇది నా రియల్ మొదటి టపా. very close to my heart!

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;