Wednesday, April 28, 2010

(లాప్) టాబ్భూషణం భూషణం?

చిన్నప్పుడు తెలుగు పాఠ్యాంశం గా చదివాను... శ్రీ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గురించి..

ఆయన ఒకసారి ఒక పార్టీ కి వెళ్ళారు ట. దానికి సెమీ ఫార్మల్ డ్రెస్ కోడ్ ఉంది. దుస్తులగురించి పట్టించుకుని ఏం వేసుకోవాలి ఈపూట అని ఆలోచించే వాళ్ళల్లో ఒకరు కాదాయె.. ఆయన వాదించి ప్రయోజనం లేదని అక్కడినించి విష్క్రమించి ఇంటికి వెళ్ళి ఒక అరువు సూట్ ధరించి వెళ్ళారుట. అప్పుడు ఆదరం గా ఆహ్వానింపబడ్డారుట.

లోపల భోజనం దగ్గర ఆయన "ఈ భోజనం నీకే తిను.. తిను " అని తన బట్టలకి చూపిస్తున్నారట. దానితో ఆ పార్టీ ఇచ్చిన వారు సిగ్గు పడి "మీకిబ్బంది అయితే మీకిష్టమైన బట్టలే వేసుకోండి " అని ఆయన కి చెప్పారట..

ఎందుకో చిన్నప్పట్నించీ.. ఈ కథ నాకు మనసు లో బలం గా నాటుకు పోయింది. ఈ రోజుల్లో.. మనం వేసుకునే దుస్తులే మనని నిర్వచిస్తున్నాయి. ఒక రకం గా

హైదరాబాదు లో నేను చదువుకునే రోజుల్లో కాలేజీ లో పరికిణీ ఓణీలు వేసుకుని వచ్చేవారు ఇద్దరు అమ్మాయిలు. వాళ్ళిద్దర్నీ.. ఒక్కరూ తమతో కలుపు కున్నట్టు నేను గమనించలేదు. వాళ్ళ ప్రతిభ, క్లాస్ మేట్లు వాళ్ళని గుర్తించటానికి సహాయపడింది కానీ.. ఆ అమ్మాయిలు ఒక ఏడాది వేచి ఉండాల్సి వచ్చింది. ఈ స్పీడ్ యుగం లో అంత ఓపిక,తీరిక ఎవరికి?
యూనివర్సిటీలోనూ, పదేళ్ళ అమెరికా జీవితం లో కూడా అక్కడక్కడా ఇదే తంతు.

మొన్న శనివారం బయల్దేరి హైదరాబాద్ కి వద్దామని కాచిగూడా ఎక్స్ ప్రెస్ ఎక్కాను. పిల్లల్ని అమ్మా వాళ్ళు వేసవి సెలవలకి తీసుకెళ్ళారు పది రోజులక్రితం. నేను హైదరాబాద్ నుండి పది రోజులు పని చేసి మళ్ళీ బెంగుళూరికి రావచ్చని ఆలోచన.

ఎలాగూ వస్తున్నాను కదా అని పెద్ద పాత బట్టల చాకలి మూట చేసాను, అమ్మావాళ్ళ ఇంటి దగ్గర కూలీ పిల్లలకి పంచవచ్చని. మా అమ్మ "నవ్య, విపుల, చతుర, అంధ్ర భూమి మాస పత్రిక" లు తెప్పిస్తే.. నేను స్వాతి (వార,మాస పత్రికలు). ఎప్పుడు హైదరాబాద్ కి వచ్చినా నా పాత సంచికలన్నీ తెచ్చి పడేయటం అలవాటు.

మా ఇంటిలో అరటిచెట్లు రెండు గెలలు వేసాయి. పక్కన అరటి పిలకలు 20-30 వచ్చాయి. మా పిన్నులకి తీసుకెళ్దాం అని ఒక ప్లాస్టిక్ కవరులో అరటి పిలకలూ, పూల మొక్కలూ.. అదొక బ్యాగు తయారయింది. లాప్ టాప్ బ్యాగొకటి ఎలాగూ తప్పదు.

వీటన్నిటి తో 'బెంగుళూరు దండు ' స్టేషన్ లో ట్రైన్ ఎక్కి సీట్లో సర్దుకుని కూర్చోవడంలో బిజీ గా ఉండడం వల్ల చుట్టూ కూర్చున్న వాళ్ళ మొహాల్లో భావాల్ని గమనించటానికి వీలు కాలేదు.

ఒక తెలుగు కుటుంబమే.. భుజాల దాకా కత్తిరించి జుట్టు తో.. స్లీవ్ లెస్ షర్టూ, కాప్రీ తో .. నా వయసే ఉంటుంది. పిల్లలు.. ఒక చేత్తో లేస్ చిప్స్, ఇంకో చేత్తో ఏవో వీడియో గేంస్ .. భర్త మోకాలు దాటని షార్ట్స్.. ఇంకో కుటుంబం ఇంచు మించు అదే రకం గా. ఇద్దరు పాతికేళ్ళ పిల్లలు ఐపోడ్స్ పెట్టుకుని..

నన్నో రాతి యుగపు పాతకాలపు స్త్రీ ని చూసినట్టు.. కాస్త నిరాసక్తత, కాస్త నిర్లక్ష్యం.. కాస్త చిరాకు నిండిన చూపులు .. తర్వాత .. అందరూ అంధ్ర ప్రదేశ్ రాజకీయాలు, జగన్ సానుభూతి యాత్ర, సానియా పెళ్ళి వగైరాలు మాట్లాడుతున్నారు. నాతో ఎవరూ మాట కలపలేదు. నేను ఎంచక్కా.. ఆఫీసు లో ఒక అమ్మాయి ఇచ్చిన ఇంగ్లిష్ నవల చివరి పది పేజీలు పూర్తి చేయటం లో మునిగి పోయాను. పుస్తకం పూర్తి చేసి మళ్ళీ నాకు నచ్చిన పేజీలు ఇంకోసారి తిరగేసి..

తెచ్చుకున్న బాక్స్ తీసి కూరన్నం, ఆవకాయన్నం, మజ్జిగ తో తినటం చూసి.. వాళ్ళకి నిరాసక్తత కోషియంట్ కాస్త పెద్దదయినట్టుంది. నాకు చెప్పొద్దూ.. చాలా సరదా వేసింది. వాళ్ళల్లో వాళ్ళు తిండి పదార్థాలు పంచుకున్నారు. పేకాట మొదలు పెట్టారు.

రోజూ.. రాత్రి 10 దాటాక రోజూ మీటింగులు అలవాటయిపోయి.. నాకు నిద్ర రావటం లేదు. ఇంకా 8.30 దాటలేదు మరి. ఒక స్పెసిఫికేషన్ రాయాలి.. ట్రెయిన్ లో కాస్త పని పూర్తి చేసుకుంటే హైదరాబాద్ లో కులాసా గా గడపవచ్చనుకుని.. లాప్ టాప్ తీసాను. వర్డ్ తెరిచి రాయటం లో మునిగి పోయాను.

కాసేపయ్యాక చూస్తే ఏదో మార్పు.. ధోరణి లో.. కాస్త మర్యాద,మన్నన.. నవ్వొచ్చింది. మూడేళ్ళ క్రితం కొన్న కాటన్ సల్వార్ కమీజ్, నూనె రాసిన తల, మూటలూ, సంచీలూ.. లాప్ టాప్ తో కూడా కాస్త పని చేస్తున్నందుకు.. అన్నీ తుడిచిపెట్టుకు పోయాయన్న మాట..

వాక్కు, కాదు జనులకు, కేయూరాలు, మంచి దుస్తులూ, పరిమళ ద్రవ్యాలూ, స్వర్ణ కంకణాలు, (లాప్) టాబ్భూషణం భూషణం ?

13 comments:

Sravya Vattikuti said...

భలే రాసారు జనాల ప్రవర్తన, నాకూ ఇలాంటివి బొలెడు అనుభవాలు :)

praseeda said...

కృష్ణప్రియ గారూ, చాలా బాగా రాసారు. ఈ రోజుల్లో వేషభాషలే ముఖ్యం. నాకో సందేహం. మీ పిల్లల పేర్లు ధాత్రి, మైత్రి నా? ఎందుకు అడుగుతున్ననంటే మేము ఈ మధ్యన హైదరాబాదు వెళ్ళినప్పుడు ఈ ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళ అమ్మమ్మా తాతగార్లతో కలిసి మాతో ప్రయాణించారు. వాళ్ళిద్దరూ 'మా అమ్మ పేరు కృష్ణప్రియ అని చెప్పారు, వాళ్ళ తాతగారు మా అమ్మాయి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని చెప్పారు. అది మీరేనేమో అనిపించింది. మీరే అయితే చెప్పండి.

Rishi said...

Baaga cheppaaru... nappakapoyinaa tappakakundaa vesukune aa capris,sleeve less andaalu choodaleka nenu rojoo chastuntaanandee baaboo...

సుజ్జి said...

:)

Chenna Kesava Reddy Madduri said...

తెలుగు గడ్డ మీద కూడా "ఆంగ్ల భాషణమే" భూషణం. ఈ హైదరాబాద్ లో ఎన్నో షాపుల్లో, రైళ్ళలో, బస్సుల్లో తెలుగు లో మాట్లాడి నిరసించబడి, నీరసించి వాపోయిన సందర్భాలెన్నో... ఇందుకా ఈ జీవితం అన్పిస్తోంది..

బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ said...

బాగుంది.

లాప్ టాప్ భూషణం కాదు భోషాణం. చంకన పిల్లనెత్తుకొని తిరిగినట్టు లాప్ టాప్ ని మోసుకొని తిరగాలంటే నాకు పరమ చిరాకు. కాని ఇలాంటి "అదనపు గౌరవం" కావలనుకున్నప్పుడు మాత్రం ఆంగ్ల భాష ని, లాప్ టాప్ ని మించిన భూషణాల్లేవు.

మాలా కుమార్ said...

బాగుందండి .

Krishna said...

చదివిన వారికీ, చదివి ప్రతిస్పందించిన వారందరికీ ధన్యవాదాలు. అవును. మొన్న బెంగుళూరు లో "ఫాబ్ ఇండియా' కి వెళ్ళి బట్టలు చూస్తుంటే.. అక్కడ సహాయం చేసే సిబ్బంది ఆంగ్లం తప్ప వేరే భాష మాట్లాడటం లేదు. నాకూ కాస్త పంతం వచ్చి.. " నాకు ఇంగ్లిష్ రాదు.. నాతో తెలుగు, కన్నడ, హిందీ లల్లో ఏదో ఒక భాష లో మాట్లాడగలిగిన వాళ్ళెవరైనా ఉన్నారా" అని అడిగి వాళ్ళ దృష్టి లో చాలా చులకన అయ్యాను. ఇక వారు నాకు ముట్టుకున్న ప్రతి పెయిర్ కీ.. ధర చెప్పటం :-)

@ప్రసీద.. అవునండీ.. వాళ్ళు మా పిల్లలే.. మిమ్మల్ని నేను చూసాను. మీ అబ్బాయి కూడా ఉన్నాడు మీతో.

praseeda said...
This comment has been removed by the author.
praseeda said...

కృష్ణప్రియ గారూ, చాలా సంతొషంగా ఉంది మిమ్మల్ని ఇలా కలవడం. మీ పిల్లలతోటీ, మీ అమ్మా నాన్నగార్లతోటి చాలా సరదాగా గడిచింది ప్రయాణం. మీ అమ్మగారు మాకు రాత్రి మాగాయ, పెరుగు అన్నం కూడా పెట్టారు, మేము హడావుడిగా వెళ్ళటంవల్ల ఏమీ తీసుకెళ్ళలేదు, రైలు లో కొన్న బిరియానీ అస్సలు బావులేదు..ఆ కారం తినలెక మా అబ్బాయి అవస్థ పడుతుంటే పాపం మీ అమ్మగారు ఇవన్నీ పెట్టారు ఇంకేమీ కొనకండీ అంటూ. మళ్ళీ నా తరపున వారికి కృతజ్ఞతలు చెప్పండి. నా అసలు పేరు సుభద్ర.

కొత్త పాళీ said...

Interesting experience and observations.
అసలు ఈ మధ్య రైలు ప్రయాణాల్లో పక్క వాళ్ళతో మాట్లాడ్డమే పోయింది. ఇదివరకు మూడుగంటల ప్రయాణంలో పూర్తి అపరిచితులతో ప్రాణస్నేహితులం అయిపోతుండేవాళ్ళం, మళ్ళీ వాళ్ళని జీవితంలో ఎప్పుడూ కలవక పోయినా.

Krishnapriya said...

ప్రసీద గారు,

మా అమ్మగారింట్లో మొన్న చెప్పాను మీరు నా బ్లాగ్ చూసి కామెంట్ పెట్టారని. కోయిన్సి డెన్స్ కి అందరం అబ్బురపడ్డాం. మీ బ్లాగ్ లో ప్లాస్టిక్ వాడకం మీద పోస్ట్ చూసాను. వెరీ నైస్. నేనూ ఇదే టాపిక్ మీద రాద్దామనుకుంటున్నాను త్వరలో మీ స్ఫూర్తి తో..

ధన్యవాదాలు.
కృష్ణప్రియ

praseeda said...

అలాగా. చాలా సంతోషం.. తప్పకుండా రాయండి. ఇది ఎంతో మందిని చేరితే తప్ప కొంతైనా మార్పు రాదు. గుడ్ లక్.

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;