Wednesday, April 21, 2010

నారాయణ రెడ్డి గారు

ఆఫీసుకొచ్చి , క్యూబ్ లో బాగ్ పడేసి, IM లోకి లాగిన్ అయి , కార్ లో డ్రాఫ్ట్ చేసిన మెయిల్సు వెళ్లాయని నిర్ధారణ అయ్యాక వెళ్ళవలసిన మీటింగులు చూసుకుని హుషారు గా కాఫీ కి వెళ్ళటం అలవాటు. ఈరోజు కాలండర్ చూడగానే సేంద్రియ వ్యవసాయం గురించి నారాయణ రెడ్డి గారి లెక్చర్ ఉంది అని చూసాను.

ఎవరబ్బా ఈ నారాయణ రెడ్డి? ఏది ఏమయినా సేంద్రియ వ్యవసాయం గురించి వినవచ్చు గా.. అయినా సాఫ్ట్ వేర్ సంస్థ లో వ్యవసాయం గురించి ఎందుకు చెప్తారు? అని చూస్తె ఎర్త్ దినం గురించిట. సరే మీటింగు లో కూర్చుని పని చేస్తూ వినవచ్చు గా.. అంత గా 'ఖాస్' గా లేకపోతే బయట పడినా ఎవరూ అడిగే వాళ్ళుండరు.. అనుకుని.. టైం చూసుకున్నాను. పదిహేను నిమిషాలుంది.

వంద మంది కి పైగా పట్టే హాల్లో అరవయి మంది దాకా ఉంటారు. నెమ్మది గా తలుపు కి పక్కన ఉన్న సీటు సంపాదించాను. మైకు, వీడియో కామెరా రెడీ గా అమర్చారు. మీ గెస్ట్ స్పీకర్ వచ్చేసారు. ఆయన తో మన డైరెక్టర్ గారు మాట్లాడుతున్నారు. కాబట్టి రెండు నిమిషాలు ఓపిక పట్టాలి అన్నాడు ఒక నిర్వాహకుడు. నేను పెద్దగా పట్టించుకోకుండా నా కంపైలేషన్ లో మునిగి పోయాను. తలెత్తి చూస్తే వక్త ముందు వరుస లో కూర్చుని ఉన్నారు.

నేను ఒక ఖాదీ ఖుర్తా లాంటిది వేసుకుని.. పిల్లి గడ్డం, కళ్ళజోడూ.. అలాగ ఏదో ఊహించుకున్నాను. తీరా చూస్తే.. ఒక బక్క పలచని ముసలాయన.. పల్లెటూరి రైతు అని స్పష్టం గా తెలుస్తుంది... రాబిన్ బ్లూ వాడినట్టు కొట్టొచ్చినట్టు కనపడే తెల్ల పంచె, కాటన్ చొక్కా, పాతిక రూపాయలు చేయని ఒక తువ్వాలూ, బాగా వాడ బడ్డ వంకర తిరిగిన తోలు చెప్పులూ,.. నేను తలెత్తి చూడటం గమనించి.. నమస్కారం చేసాడాయన. సిగ్గు పడి లాప్ టాప్ మూసి ప్రతి నమస్కారం చేసాను. నిర్వాహకులు కన్నడ లో మాట్లాడుతుంటే.. చిరునవ్వుతో గల గలా మాట్లాడుతున్నాడు. పాపం సరైన బట్టలు కూడా లేవు పెద్దాయన కి .. ఏదైనా సహాయం అవసరం అయితే చేయాలి తర్వాత అనుకున్నాను.. ఉదారం గా.. :-)

ఇప్పుడు కన్నడ లో మాట్లాడతాడు లా ఉంది. పూర్తిగా అర్థం అవుతుందో లేదో.. పోన్లే తలుపు దగ్గర సీట్ సంపాదించాను ముందు చూపుతో అని నన్ను నేను మనసు లోనే తెగ మెచ్చుకున్నాను. ఆయన ని మాట్లాడమని అభ్యర్థించ గానే.. గొంతు సవరించుకుని.. తువ్వాలు జాగ్రత్త గా ఒక కుర్చీ మీద వేలాడ తీసాడు. 'నా ఆంగ్లం అంత బాగుండదు.. పాత కాలం వాడిని. డెబ్భయి నాలుగేళ్ళు నాకు. నాల్గవ తరగతి పాస్ అవగానే చదువు మానేసాను.. కానీ.. మీకు అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను' అన్నాడు.

ఆ ఒక్క వాక్యం లోనే ఆయన ఆంగ్ల పాండిత్యం అర్థం అయింది. స్వచ్చమైన ఆంగ్లం.. పైగా అద్భుతమైన ఉచ్చారణ. ఒక గంట సేపు ఆయన ప్రసంగం మంత్ర ముగ్దులమయి విన్నాము.

ఐరోపా ఖండం అంతా ఏడు సార్లు పర్యటించిన సంగతీ,... మూడు సార్లు ఉత్తమ రైతు గా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ రాజ్యోత్సవ దిన పురస్కారం గెలుచుకున్న సంగతీ.. దేశ విదేశాల్లో వివిధ యూనివర్సిటీల్లో, కార్పోరేట్ సంస్థల్లో అతిథి లెక్చర్లు ఇచ్చిన విషయమూ.. దేశం లో వివిధ వ్యవసాయ రంగ సంస్థల శాస్త్రజ్ఞులు ఆయన ని సంప్రదించే సంగతీ.. విజయ కర్ణాటక పత్రిక లో ఆయన వ్యాసాలూ, సేంద్రియ వ్యవసాయ పితామహుడిగా భావించే Sir Albert Howard ఆయన తండ్రి ఇంటికి స్వయం గా విచ్చేసి ఈయన పద్ధతులని కుతూహలం గా అధ్యయనం చేయటం, నిర్వాహకులు పరిచయ వాక్యాలలో చెప్పగా..


చారిత్రకం గా, ఆర్థికంగా.. సామాజిక పరంగా.. వ్యవసాయం పై ప్రపంచ/ ప్రాంతీయ రాజకీయాలు, కొంత మంది మిడి మిడి జ్ఞానం గల శాస్త్రజ్ఞుల సలహాలు, రసాయన ఎరువులూ, క్రిమి సంహారక మందుల ఉత్పత్తి దారుల పెత్తనం, గురించి నిశితం గా తన పరిశోధన, అభిప్రాయాలు .. వివరిస్తుండగా.. ఎప్పుడు.. తలుపు పక్క కుర్చీ లోంచి మొదటి వరుస కి వచ్చానో నాకే తెలియదు.


ఆయన జ్ఞానం అపారం. అరవై ఏళ్ల అనుభవ సారం .. ఆశ్చర్యం ఏంటంటే.. ఇటు పురాణాల కథలు, అటు ప్రపంచ జానపద కథలూ ఉదహ రిస్తూనే నిన్న చదివిన మెక్సికన్ కథా, మొన్న కుర్ర సైంటిస్ట్ తో ఆయన సంభాషణా, రాజ్య సభ మెంబెర్ తో వేసిన చెణుకులూ, జయలలిత బట్టల భండాగారం లో ఉన్న పదిహేను వేల పట్టు చీరలూ, ఆయన చెప్తుంటే నేనే కాడు.. మిగిలిన యాభై తొమ్మిది మందీ తెరిచిన నోరు మూయలేదు..

ఎన్నో ఎకరాల యజమానికి రెండు జతల ధోవతులు, ఒక సైకిలూ, వ్యక్తిగత ఆస్తి. పది అంతస్తులు అలుపు లేకుండా ఎక్కగల సత్తా ఉంది ఆయనకి. మిల మిలా మెరిసే అసలైన పళ్ళు, 20/20 కంటి చూపు, అక్కడక్కడా నెరిసిన జుట్టు, రజనీకాంత్ లాంటి కొవ్వు లేని చువ్వ లాంటి శరీరం... పొద్దున్న ఆయన చేసిన 1500 మట్టి ఇటుకలకి నీళ్ళు పెట్టి వచ్చాడట.. రెండు గంటలు ప్రయాణం బస్సు లో చేసి..

లెక్చర్ అయిపోయినా రెండు మూడు గంటలు ఓ పది మంది ఆయన దగ్గర కూర్చుండి పోయారు.. ఆయన విషయాలు వింటూ.. ఈ వయసు లో కూడా ఇంత కష్ట పడటం దేనికి? అని ఎవరో అడిగిన ప్రశ్న కి ఆయన సమాధానం నచ్చింది నాకు.

ఒక ఊరిలో ఒక గుడి కడుతున్నారు.. బోల్డు పలకల రాళ్ళు, పెద్ద రాళ్ళూ తెప్పించారు. కొన్ని రాళ్ళని పెద్దగా బాధించ కుండా మెట్లు గా మలిచారు. కొన్నింటిని కాస్త ఆరగ దీసి నునుపు తెచ్చి గోడలపై అతికించారు. ఒక రాయిని.. సుత్తి తో కొట్టి కొట్టి బాధించి విగ్రహం గా మలిచారు. ప్రతి రోజూ.. మెట్ల రాళ్ళు తమ అదృష్టానికి పొంగి పోగా.. గోడ రాళ్ళు ఏదో మన రాత ఇలా ఉంది లే అనుకున్నాయి. విగ్రహం రాయి కి పట్టిన దుర్గతి కి జాలి పడ్డాయి. ఒక రోజు గుడి తెరవ బడింది.. జనం మెట్లు తొక్కుకుంటూ, గోడలని రాసుకుంటూ విగ్రహానికి మొక్కుకుంటూ వెళ్ళారు.
"ఎన్ని ఆటు పోట్లు ఎదురైతే.. అంత సద్గతి.."

ఈరోజు అనుకోకుండా సజ్జన సాంగత్యం తో ఏంటో చాలా గొప్ప గా గడిచినట్టనిపించింది నాకు.

10 comments:

phani said...

ఒక ఊరిలో ఒక గుడి కడుతున్నారు.. బోల్డు పలకల రాళ్ళు, పెద్ద రాళ్ళూ తెప్పించారు. కొన్ని రాళ్ళని పెద్దగా బాధించ కుండా మెట్లు గా మలిచారు. కొన్నింటిని కాస్త ఆరగ దీసి నునుపు తెచ్చి గోడలపై అతికించారు. ఒక రాయిని.. సుత్తి తో కొట్టి కొట్టి బాధించి విగ్రహం గా మలిచారు. ప్రతి రోజూ.. మెట్ల రాళ్ళు తమ అదృష్టానికి పొంగి పోగా.. గోడ రాళ్ళు ఏదో మన రాత ఇలా ఉంది లే అనుకున్నాయి. విగ్రహం రాయి కి పట్టిన దుర్గతి కి జాలి పడ్డాయి. ఒక రోజు గుడి తెరవ బడింది.. జనం మెట్లు తొక్కుకుంటూ, గోడలని రాసుకుంటూ విగ్రహానికి మొక్కుకుంటూ వెళ్ళారు.

what more i can say...

its nice to read such blogs...

Krishna said...

aayana ee katha cheptunDagaa edurugaa koorchini vinnappuDu, .. naaku kaligina bhavaanni varNinchaalanTE nEnoka kaaLidaasuni kaavaali..

-Krishnapriya.

Rishi said...

You are very lucky to attend such talks.marinni ilaantivi post chestoo undandi.Good blog.Keep writing.

శ్రీవిద్య said...

adbhutam... mee blog chaalaa bavundi.
chaduvutunte edo cheppaleni anubhooti.
Thanks for writing :)

Krishnapriya said...

ధన్యవాదాలు శ్రీవిద్య,రిషి,

నారాయణరెడ్డి గారి మాటలు విన్నాక, రైతులమీద రాసిన వ్యాసాలూ, వార్తలూ చదవటం మొదలు పెట్టానంటే నమ్మండి!

కృష్ణప్రియ.

బుద్దా మురళి said...

కృష్ణప్రియ గారు బాగుందండి .ఇలాంటివి పత్రికలకు పంపితే బాగుంటుంది. మీ కోసం అని కాదు ఇలాంటివి చాలామంది చదవడానికి అవకాశం ఉంటుంది. మెదక్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామం లో ఇలానే ఒక iit ప్రొఫెసర్ తన ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయం చేస్తున్నారు. ఒక పత్త్రికలో వచ్చాక , కొన్ని చానల్స్ లో చూపించారు

కృష్ణప్రియ said...

@ మురళి గారు,

భలే గా వెనక్కి వెళ్లి చదివి వచ్చారే! థాంక్స్! నారాయణ రెడ్డి గారు కర్ణాటక లో పేరున్న రైతు. ఒక పత్రిక లో కాలం కూడా రాసేవారు అనుకుంటా.. ఆయన స్పీచ్ విన్నాక ఆ అద్భుతాన్ని అక్షరబద్ధం చేద్దామని రాసుకున్నాను.

పత్రికలకి ఎప్పుడూ నేను రాయలేదు. ఏదో ఇలాగ బ్లాగ్ తో కాలక్షేపం..

రాధేశ్యాం said...

చప్పట్లు..చప్పట్లు..చప్పట్లు..!!!
మీరు రాసింది చదివితేనే ఇంత మంచి అనుభూతికి లోనయ్యను. ఎదురుగా కూర్చొని వింటేనో..!! మీరు చాలా అదృష్టవంతులు. మీరు వాడిన సజ్జన సాంగత్యం అక్షర సత్యం.
నేను ఈ పోస్ట్ ని షేర్ చేస్తున్నాను..!
ధన్యవాదాలు.

కృష్ణప్రియ said...

రాధేశ్యాం గారు,

ఇంత వెనక్కి వచ్చి చదివారా! చాలా సంతోషం! ఎంత విశిష్టమైన వ్యక్తి ఆయన! ఇప్పటికీ తాజాగా ఆయన స్పీచ్ జ్ఞాపకాలు ఉన్నాయి నాకు.

షేర్ చేసినందుకు ధన్యవాదాలు!

Vijay Reddy said...

యెందరో మహాను భావులు అందరికి వందనాలు !
చక్కగా వ్రాసిన ( మీ శైలికి) మీకు ధన్యవాదాలు !!

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;