Monday, May 24, 2010

'నిక్కీ ' నూకాలమ్మ..

మా స్నేహితురాలు పద్మిని ఫోన్.. ' విస్సుగ్గా ఉంది.. మీ ఇంటికి వస్తున్నాం.. భోజనానికి.. ఏర్పాట్లు చేసుకో' అని.

పద్మినికీ,నాకూ 20 యేళ్ళ స్నేహం. దానికి ఇద్దరు పిల్లలు. కవలలవటం,కాస్త పీల గా పుట్టటం, ఏదో ఒక అనారోగ్యం వల్ల అక్కడ తమ వల్ల కావట్లేదని.. భార్యా భర్తలూ ఉద్యోగాలకి రిజైన్ చేసి వాళ్ళ సామాన్లు షిప్ చేయించి మరీ కాలిఫోర్నియా నుండి బెంగుళూరు విమానమెక్కేసారు. రెండేళ్ళతర్వాత మళ్ళీ వెళ్తాం. ఇప్పటికి ఇండియాలో అయితే.. పనిమనుషులని పెట్టుకోవచ్చు.. తల్లీ దండ్రీ, అత్తా మామల సహకారం,సహాయం ఉంటాయని..

పద్మిని కి గుండె కొట్టుకోకపోయినా.. నడుస్తుంది కానీ.. ఉద్యోగం లేకపోతే మాత్రం గడవదు. అమెరికన్ సిటిజెన్ షిప్ ఉంది. బెంగుళూరు కి వచ్చాక వాళ్ళమ్మగారికి పరాలిసిస్ వచ్చిందిట. మామగారికి రక్తపుపోటు ఎక్కువైంది అని గుండె జబ్బనీ.. ఇల్లు కదలటం లేదట. మరి పాపం.. ఎలా నడుపుకొస్తుందో.. నెలల పిల్లలనీ, విడవలేని ఉద్యోగాన్నీ.. అనుకుంటూ వంట ప్రయత్నం లో పడ్డాను.

ఇంటిముందు ఇన్నోవా ఆగింది. ఆత్రం గా ఎదురెళ్ళిన నాకు ఆనందంగా, అప్పుడే బ్యూటీ పార్లర్ నుండి దిగివచ్చినట్టుగా పద్మిని స్మార్ట్ గా దిగింది. వెనగ్గా ఒక పిల్లవాడ్ని తీసుకుని దాని భర్త రవి. ఇంకోడేడి? అని ఆశ్చర్యపడుతుంటే వెనక ఇంకో పిల్ల దిగింది బాబుని ఒకచేత్తో, డైపర్ బాగుని ఇంకో చేత్తో తీసుకుని. ఈ అమ్మాయెవరా అనుకుంటూ ఇంట్లోకి ఆహ్వానించాను.

పిల్ల నల్లగా ఉన్నా కళగా ఉంది. ఒక పదేళ్ళుంటాయి. అంత చిన్న పిల్లలు ఐబ్రోలు చేయించుకోవటం చూడటం నేను అదే మొదలు. షాంపూ చేసిన జుట్టు బాండ్ పెట్టి వదిలేసింది. మొహానికి పౌడర్, గోళ్ళకి రంగు. లేత రంగు సల్వార్ కమీజ్. కొద్దిగా పెద్ద దానిలా కనపడాలన్న ప్రయత్నం కనిపిస్తోంది.

లోపలకెళ్ళాక పద్మిని చెప్పింది. వాళ్ళ పుట్టింటి దగ్గర కూలీల పిల్లట. తండ్రికి 10,000 రూపాయలిచ్చి తెచ్చుకుందిట. రెండు నెలలకొకసారి ఐదువేలు ఇస్తాం అందిట. వాడు తాగుబోతు. తల్లి వద్దని గొడవ పెడుతున్నా వినకుండా పంపేసాడట. నాకు చాలా కోపం వచ్చింది. 'ఇదేం పిచ్చి పని? చదువుకోవలసిన పిల్లని పనిలో వాళ్ళు పెట్టారు సరే. అమెరికాలో ఎం ఎస్ చేసావు.. నువ్వు డబ్బిచ్చి తెచ్చుకోవటం తప్పనిపించలేదా? పాలు కారే ప్రాయం.. పైగా ఇది చట్టం దృష్టి లో నేరం కూడా ' అని కసిరాను.

'నీకేం? ఎన్నయినా చెప్తావు... మీ అత్తగారు ఇంట్లో ఉంది. పిల్లలకి ఇంటిపక్కన పిల్లల స్కూలు, ఆఫీస్.. అందరికీ అలా కుదుర్తుందా? అయినా నేను తీసుకెళ్ళకపోతే ఇంకోళ్ళు తీసుకెళ్తారు. దానికి వాళ్ళెవరి దగ్గరో ఉండేకన్నా నా దగ్గర పని చేస్తేనే భద్రతా.. సుఖం' అంది.

' ఏమో.. నాకయితే నచ్చలేదు నువ్వు చేసిన పని. ఐ ఆం డిసపాయింటెడ్ ఇన్ యూ ' అన్నాను, తల అడ్డం గా ఊపుతూ.

'నువ్వు అంత బాధ పడిపోతావెందుకు? నేను ఆఫీస్ నుండి వచ్చాక దాన్ని కూర్చోపెట్టి చదువు చెప్తాను కదా.. అయినా ఈ విషయంలో నీకేంటి సంబంధం? దాన్ని చూడు.. జిడ్డోడిపోతూ ఉండేది. దాని దగ్గర్నుంచి భరించలేని వాసన ఉండేది. నేను వారం రోజులు దాన్ని స్టెర్లైజ్ చేయించి, బాడీ, జుట్టు ట్రీట్ చేయించి.. ఆ మురికి వదిల్చాను. మొహం లో కళ రావటానికి రోజూ,పాలూ, జ్యూసులూ కూరలూ ఎన్ని పెడుతున్నానో..' అంది.

'ఆ పిల్ల ఏమైనా కోడిపెట్టా? మేపటానికి, రుద్ది కడగటానికి? నువ్వు కాబట్టి వాదిస్తున్నాను. అదే ఇంకెవరైనా అయితే.. ఈపాటికి పోలీస్ కంప్లైంట్ చేసేదాన్ని.. ఇంతకీ పాప పేరేంటి?' అన్నాను.

' నిక్కీ. అసలు పేరు నూకాలమ్మ అనుకో, నేనే 'నిఖిత గా మార్చేసాను. ఇదిగో నిక్కీ.. కం హియర్.. ' అంది. ఆ అమ్మాయి నెల రోజులకే.. చాలా ఫాషన్ గా, స్టయిల్ గా తయారయినట్టుంది. ' యెస్ ఆంటీ.. ' అంది. ఇద్దరు పిల్లలకీ అన్నం పెట్టి, వాళ్ళ డైపర్లు మార్చి బజ్జోపెట్టి.. ఇలాంటి పనులు చేయటానికి ఇబ్బంది పడటం నేను చూస్తూ ఉండిపోయాను.

తర్వాత రెండు మూడు సార్లు కనపడ్డారు వాళ్ళు. 'నిక్కీ బొద్దుగా తయారయి నిగారింపు వచ్చింది. స్టైల్ కూడా హెచ్చింది. మాట తీరు మారింది. బొత్తిగా టీవీల్లో ఆంకర్లల్లా గా తెలుగు.. సగానికి పైగా ఆంగ్ల పదాలు. చదువెంత వరకూ వచ్చిందని అడిగితే.. 'పద్మిని ఆంటీ చదివిస్తానన్నారు కానీ నాకు ఇంట్రెస్ట్ లేదాంటీ.. ' అంది అప్పచెప్పినట్టు గా.


కాస్త తెరిపి గా ఉండటం తో పద్మిని మనసు మళ్ళీ అమెరికాకి మళ్ళింది. నిక్కీని తీసుకువెళ్తానంది. 'క్రైం కూడా అది. దాన్ని హాస్టెల్ లో చేర్పించు. ఇంకో పెద్దావిడని వెతుక్కో' అని చిలక్కి చెప్పినట్టు చెప్పినా వినలేదు పద్మిని. పాస్పోర్ట్ తయారు చేయిస్తోందని విన్నాను. చేయగలిగింది లేక నిట్టూర్చాను.

ఒకసారి తెలిసింది.. నిక్కీ తల్లి చనిపోయిందని. ఆ అమ్మాయి ఊరెళ్ళిందని. పద్మిని అమెరికా వెళ్ళిపోతోంది 3-4 రోజుల్లో అని ఒకసారి చూసి రావాలని వెళ్ళాను. పద్మిని తల్లిదండ్రులు ఉన్నారు పిల్లల్ని ఆడిస్తూ.. కాస్త కబుర్లూ,కాకరకాయలూ అయ్యాక.. 'నిక్కీ ఏది? పాపం వాళ్ళమ్మ పోయిందిట ఈ మధ్య?.. దానికి ఏం వీసా తీసుకున్నారు? ' అని అడిగాను.

అందరూ మొహాలు ముడుచుకున్నారు. పద్మిని ముందుగా తేరుకుని.. 'నువ్వు చెప్పింది నిజం కృష్ణా.. ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా.. లాగా అలగా జనాలకి అలగా బుద్ధి ఎక్కడికి పోతుంది? వాళ్ళమ్మ పోయినప్పుడు.. మరీ చెత్త చెత్త గా ఏడ్చి యాగీ చేసి శోకణ్ణాలు పెట్టింది. దాన్ని చూస్తే అసహ్యం వేసింది.. దానికి చెప్పలేదు.. మీ నాన్నని చూసిరా అని పంపాము. అది ఆదివారం వస్తుంది. శనివారమే మేము వెళ్ళిపోతాం.' అంది.

షాకింగ్ గా అనిపించింది. 'నేను అన్నది అదా? ఆ పాపని మోసం చేసి వెళ్ళిపోతారా? హాయిగా మట్టిలో ఆడుకుంటూ.. అంట్లూ అవీ తోమటానికెళ్ళినా ప్రభుత్వ పాఠశాలకి వెళ్తూ,.. ఆడుకునే ప్రాణాన్ని తీసుకొచ్చి..నాగరికత నేర్పి.. సున్నితం గా తయారు చేసి.. ఇప్పుడు గాలికి వదిలేస్తారా? ఎంత క్రూరత్వం? ' అని అనుకున్నాను.

'పోనీ.. నీకు కావాలా? నీ పిల్లల పనులు చేసి పెడుతుంది..నువ్వూ హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు ' అంది. ఒక్కసారి చురుగ్గా సీరియస్ గా చూసేటప్పటికి ' కృష్ణ పెద్ద సంఘ సంస్కర్త.. తను అసలు జీవితం లో ఒక్క రూల్ కూడా బ్రేక్ చేయలేదు. మనం మాత్రం నీతీ, నియమం లేని జనాలం. ' అంది వ్యంగ్యంగా.

ఏమీ అనకుండా కాసేపు కూర్చుని 'బై' చెప్పి బయట పడ్డాము. చాలా రోజులు నాకు నూకాలమ్మ గుర్తుకొచ్చేది. అసహనం గా ఉండేది. పోనీ..పద్మిని అన్నట్టు తీసుకురావాల్సింది ఇంటికి.. నేను ఎక్కడైనా చేర్పించాల్సింది అని చాలా మదనపడ్డాను.

హైదరాబాద్ కెళ్ళినప్పుడు.. పద్మిని తల్లిగారింటికి వెళ్ళి చూసాను.. అపార్ట్ మెంట్ కట్టటం ఆల్ మోస్ట్ అయిపోయింది. వెళ్ళి అడిగాను.. 'నూకాలమ్మ ఉందా? ' అని. 'ఏమ్మా? తీస్కబోయి కన్ బొమ్మల్ గొరిగించాలనుకున్న్నవా? పో.. మీగసుంటోళ్ళవల్లనే బిడ్డ ఏమిట్కీ గాకపాయె.. మంచిగున్నది ఇప్పుడు.. గింక ఇటుసంది వస్తె మంచిగుండదు పో..పో ' అంది ఒకావిడ. అక్కడున్న బాల కార్మికుల్లో నూకాలమ్మ ఎక్కడుందో తెలియలేదు. నిట్టూర్చి స్కూటీ వెనక్కి తిప్పాము.

4 comments:

Ram Krish Reddy Kotla said...

నేను కూడా ఇలా తమ పిల్లల పనులుచూసుకోడానికి ఇంకొక పిల్లని తీసుకొచ్చి పనిమనిషిని చెయ్యడం చూసాను చాలా ఇళ్ళల్లో..మన దేశంలో ఉన్న దౌర్భాగ్యమే అది..పని చెయ్యకపోతే పూట గడవని కుటుంబాలు పిల్లల చదువుల పై ఏం శ్రద్ధ చూపిస్తారు..కుదిరితే ఇలాంటి పనులకి వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తారు .. :(

కొత్త పాళీ said...

ఇటువంటి కేసుల్లో ఎవరి తరపునా వకాల్తా తీసుకుని ఇదే రైటు అని చెప్పడం చాలా కష్టం. కొంచెం ఆలోచించి చూస్తే, కొంతవరకూ మన విద్యావిధానం చేస్తున్నది కూడా సరిగ్గా పద్మిని గారు చేసినలాంటి పనే. ఒక పల్లెలో, ఎక్కువగా రైతుకూలీల పిల్లలకి చదువు చెప్పే పాఠశలని తీసుకోండి ఉదాహరణకి. వాళ్ళకి ఉన్న వనరుల్లో ఒక బేచిలో ఎవరో ఒకరిద్దరు పిల్లలు ఓ మోస్తరు మార్కులు సాధిస్తారనుకుందాం. వాళ్ళు పక్కూరికి వెళ్ళి పై చదువులు చదవగలరా? పది దాకా చదివినతరవాత పలుగు పారా పట్టుకుని రైతుకూలి కాగలరా? ప్రభుత్వమే ఏపని ఎందుకు చేస్తున్నామో తెలియని స్థితిలో పిల్లల్ని రెంటికీ కాకుండా తయారు చేస్తుంటే, ఇంక ఎవరో ఒక వ్యక్తి స్వార్ధాన్ని గురించి వగచనేల?

కృష్ణప్రియ said...

నిజమే..

మా పిన్నీ వాళ్ళింటిదగ్గర సుగుణ అని ఒకమ్మాయి ఉంటుంది. ఏడేళ్ళ పిల్ల. తమ్ముడిని చూసుకోవటం,.. కూలీలకి టీ చేయటం.. కాకుండా.. ఇళ్ళల్లో చిన్నా చితకా పనులు చేస్తుంది.

ఇదీ కాక ఇల్లు ఊడ్చిపెడతాను అని ఐదు రూపాయలు, కిటికీలు తుడిచిపెడతాను 10 రూపాయలు,.. కూరలు తరిగి పెడతానని కొంతా.. సంపాయించి తండ్రి చేతిలో పోస్తుంది. మా పిన్ని ఒక్కో సారి 10 రూపాయలకి దాని టైం బుక్ చేసుకుని చదువు నేర్పిస్తుంది....

భావన said...

స్వేచ్హ గా హాయి గా వుండే పిల్లను తీసుకొచ్చి వంకర నాగరీకం నేర్పి పైగా ఆ పిల్ల బుర్ర లో కూడా అదే సూపరని ముద్ర వేసి.. హుమ్.. ఏంటో.. కొత్తపాళి గారన్నట్లు ప్రభుత్వం కూడా ఒక రకం గా చేసేది అదే. ఏమిటో మనిషి కి ఏది మంచిదో ఏది చెడ్డదో తేల్చటం ఎలానో.

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;