Monday, July 12, 2010

పెద్దయ్యాక నేను..

పొద్దున్నే లేస్తూనే ముసురు ముసురు గా.. చినుకులు.. పిల్లలూ బద్ధకం గా.. నేను ఉత్సాహం నటిస్తూ.. (లోపల మాత్రం..వాళ్ళు స్కూల్ కెళ్ళాక హాయిగా కాళ్ళు జాపుకుని ఒక గంట ఆలస్యం గా వెళ్దాం అని నిర్ణయం!) .. స్కూల్ బస్ కూడా ఆలస్యం లా ఉంది. మా అమ్మాయి ముందే వెళ్ళి కూర్చుంది, వర్షం లో ఎగరవచ్చని.

మా కమ్యూనిటీ లో జండా కఱ్ఱ కింద మూడు రంగుల మెట్లుంటాయి. అదే పిల్లల స్కూల్ బస్ ఆగే చోటు. బస్సు వచ్చేలోపల అక్కడ కూలబడి చిన్న పిల్లల తల్లిదండ్రులు 2 నిమిషాలు బాతాఖానీ వేయటం పరిపాటి.

నేనూ హాయిగా చెప్పుల్లేకుండా.. తార్ రోడ్ మీద నెమ్మది గా, అతి నెమ్మది గా బస్ స్టాండ్ కెళ్ళి నిలబడ్డాను. చిన్నప్పుడు అస్తమానూ జలుబులూ, చెవి పోటనీ.. మా అమ్మా వాళ్ళు వర్షం లో బయటకి వెళ్ళాలంటే వంద జాగ్రత్తలు చెప్పేవారు. నేను పెద్దయ్యాక 'ఒక్కటి కూడా ఎప్పుడూ పాటించను ! ' అని నిర్ణయం రెండో తరగతి లోనే తీసేసుకున్నానాయె!

సన్నగా జల్లు, కాళ్ళ కింద గరకు గా చెమ్మగా రోడ్. మొక్కలన్నీ పాపం చన్నీటి స్నానం అనుకుంటా.. వణుకుతున్నాయి. మా కాంప్లెక్స్ లో ఇంకో తెలుగాయన నా వయసు వాడే అయుంటాడు... ఐదుగురు హాయిగా పట్టే నల్లటి గొడుగు వేసుకుని ఆనందం గా నుంచున్నాడు. వాళ్ళావిడ నా స్నేహితురాలు. ఆవిడ చిన్న గొడుగు లో పక్కనే.. వాళ్ళ అబ్బాయి ని కాపలా కాయటానికి వచ్చారట బస్ వచ్చే లోపల ఎక్కడ వర్షం లో ఆడతాడో నని ట :-)

సరే ఏంటి ఈ గొడుగుల కథ? అని అడిగితే చెప్పాడాయన. చిన్నప్పట్నించీ ఆయనకి ఈ కోరిక ట. పెద్దయ్యాక పేఏఏఏద్ద గొడుగు కొనుక్కోవాలని. వాళ్ళావిడ మాత్రం, అంత పెద్ద గొడుగు లో దూరాలంటే నాకు సిగ్గు.. అందుకని నా గొడుగు నాదే! అని డిక్లేర్ చేసేసింది. అక్కడ చేరిన తల్లి దండ్రులందరూ హాయిగా నవ్వుకున్నారు. నేను ఆలోచన లో పడటం గమనించి పక్కన నుంచున్నావిడ అడిగింది. 'ఏంటి కృష్ణా దీర్ఘం గా ఆలోచిస్తున్నావు? ' అని. 'ఏం లేదు మా ఇంటికీ గొడ్ల సావిడి కీ పై కప్పులు దేంతో వేయిద్దామా అని ' అన్న పాత జోక్ వేసేసి.. తర్వాత చెప్పాను. 'నాకూ ఇలాంటి చిన్న కోరికలు ఉన్నాయి చిన్నప్పటివి.. ' అని.

అందరూ కాస్త ఆసక్తి గా వింటున్నారని గమనించి చెప్పాను..

1. వర్షం లో గొడుగు, చెప్పులూ లేకుండా తిరగాలని.
2. పెద్దయ్యాక అన్నీ జంక్ ఫుడ్డే తినాలని..
3. ఇంట్లో ప్రతి గదిలోనూ చేతికి తగిలేలా పిన్నీస్ కట్టలు, సూదులూ ఉంచుకోవాలని.
4. రోజూ మధ్యాహ్న భోజన సమయం దాకా నిద్ర లేవకూడదని..

ఇలా 2-3 చెప్పానో లేదో ఇంకొకాయన మొదలు పెట్టాడు..

1. నేనెక్కిన రైలు కీకారణ్యం లో ఓ నాలుగు రోజులు ఆగిపోవాలని, అప్పుడు సినిమాల్లో లాగా బోల్డు సాహసాలు చేయాలని. (అఫ్ కోర్స్ పెద్ద పెద్ద డబ్బా నిండా తిండి పదార్థాలూ లాంటివి ఉండాలి ...)

2. ఏ పాడుబడ్డ భవంతి లోనో చేరిన దేశ ద్రోహులని ధైర్య సాహసాలు ప్రదర్శించి పోలీస్ లకి అప్పగించి రాష్ట్ర పతి చేతుల మీదుగా మెడల్ పొందాలని..


ఇంకొకావిడ..

మా అమ్మావాళ్ళూ దెబ్బలాడుకోవటం చూసి పెద్దయ్యాక సినిమాల్లో 'గుమ్మడీ, అన్నపూర్ణల్లాగా అస్సలూ దెబ్బలాడకుండా ఉండాలనుకునేదాన్ని అంది. 'ఇప్పుడు మాత్రం అనిపిస్తుంది.. ఆ రోజుల్లో అబ్బో వాళ్ళెంత సం యమనం తో ఉన్నారో.. రోజూ కీచులాటలే మాకు ' అంది. అందరం హాయిగా నవ్వేసాం. అందరూ ఇలాగే అనుకుంటారేమో అనుకుని.

ఒకతను.. ' పిల్లల్ని ఒక్క దెబ్బ వేయకుండా.. పువ్వుల్లా పెంచాలనుకున్నాను.. ' అని నిట్టూర్చాడు బురదలో ఎగురుతున్న వాళ్ళబ్బాయిని తరుముతున్న భార్యని చూసి...

ఇంకో ఆవిడ కాస్త సీరియస్ గా .. 'మా అమ్మ ఉద్యోగస్తురాలు.. ఎప్పుడూ పరిగెడుతూనే ఉండేది.. ఇంట్లో పని, ఆఫీస్ పనీ,చుట్టాలూ, ఎవ్వరూ కాస్త కూడా సహాయం చేసేవారు కాదు.. ఎప్పుడూ డస్సిపోయి, వడలిన తోటకూర కాడ లా ఉండేది. అందుకే పెద్దయ్యాక ఉద్యోగం ఎట్టి పరిస్థుతుల్లోనూ చేయకూడదనుకున్నాను. కానీ.. గేటెడ్ కమ్యూనిటీ లో ఇల్లూ లాంటి కోరికల వల్ల నేనూ ఉద్యోగం చేస్తున్నాను. కాకపోతే.. బోల్డు సహాయం అదీ ఉంది లెండి ' అనేసింది.

ఇంకో ఆయన.. కాస్త బరువెక్కిన టాపిక్ ని తేలిక పరుస్తూ 'నేనైతే సూపర్ మార్కెట్ నడిపే మా నాన్నగారు పడే కష్టం చూసి.. యేళ్ళ తరబడి కష్టపడకుండా.. ఒక్క బాక్ గ్రవుండ్ పాట అయ్యేటప్పటికి అంబానీ అయిపోదామనుకున్నా.. ఆ సరయిన పాట దొరకటమే తరువాయి ' అన్నాడు మహా సీరియస్ గా మొహం పెట్టి.


నేనైతే సల్మాన్ ఖాన్ అయిపోదామనుకున్నా అన్నడొకాయన. ఒకళ్ళు ప్రపంచాన్ని అబ్బుర పరచే విషయాలు కనుక్కుని నోబుల్ ప్రైజులు కొట్టేద్దామని, వేరొకరు ఒలింపిక్స్ లో పతకాలు సాధిద్దామనీ.. ఇంకొకరు సైనికుడు గా పాకిస్తాన్ సైన్యాన్ని ఊచకోత కోసి.. పరమ వీర చక్ర అవార్డ్ సాధిద్దామనీ.. అనుకున్నట్టు గా చెప్పేసారు.

ఆహ్లాదకరమైన వాతావరణం పుణ్యమా అని అందరూ సరదాగా పోటీలు పడి తమ చిన్నప్పటి స్వప్నాల గురించి ఏకధాటి గా చర్చించుకుంటున్నాము.

మా కబుర్లు వింటున్న ఒక తాతగారు.. ఆయన ధోరణి లో 'అందరు పిల్లలూ ట్రాఫిక్ పోలీసు, రైలు డ్రైవరూ, అవుదామనుకుంటారు., కొన్నాళ్ళు పోయాక.. (పెద్దలు అలా అంటే ఇష్టపడతారనేమో) డాక్టర్లూ, పైలెట్లూ, సైంటిస్టులూ అవుదామనుకుంటారు. వాళ్ళని ఏం ఆకర్షిస్తే అదవుదామనుకుంటారు. టీచర్లూ, నాయకులూ, టికెట్ కౌంటర్ల్లలో కూర్చునేవారిగా.. సినిమా హాల్లో గేట్ కీపర్ గానూ, .. ఇంకా ఏదో చెప్తుండగానే ఒకావిడ అందుకుంది ఉత్సాహం గా..

'అమాయకుడైన (కాస్త పిచ్చి కూడా అనుకుంటా) జమీందార్ ని పెళ్ళాడి పాపం ఆయనకి పాలల్లో ఏదో మందు కలిపి పడుతూ , అమాయకుడిని చేసి ఆడించే సవతి తల్లీ/అమ్మమ్మా. , బెల్ట్ దెబ్బలు కొట్టే సవతి తమ్ముడి/మామా చేతుల్లో అష్ట కష్టాలు పడుతూ ఉంటే.. సావిత్రి లా భర్త ని తన ప్రేమానురాగాలతో మార్చుకుని, టాగోర్ గేయాలు, జిడ్డు కృష్ణమూర్తి గారి రచనలూ చదివేట్టుగా, తెలివి తేటలతో సవతి అత్తగారి కుటుంబాన్ని మారుద్దామని కలలు కన్నట్టు చెప్పి నవ్వించింది.


ఇలా చిన్నప్పటి కలల్లో తేలుతున్న మమ్మల్ని స్కూల్ బస్ హార్న్ మళ్ళీ భూలోకం మీదకి నిర్దాక్షిణ్యం గా విసిరి పడేసింది. బస్ డ్రైవర్ కాస్త భయం గా చూశాడు మమ్మల్ని. మరి ఆలస్యమైతే ఎప్పుడూ దెబ్బలాడతాం కదా అని. అందరి మొహాలూ ప్రసన్నం గానే ఉండటం గమనించి 'అమ్మయ్య ' అనుకుని పిల్లల్ని తీసుకెళ్ళిపోయాడు. మేమూ 'బై' లు చెప్పుకుని ఆఫీసులకి పరుగులెట్టాం.

24 comments:

వెంకట్ said...

నాకూ ఒక కోరిక ఉంది, ఈ తొక్కలో సాఫ్ట్వేరు ఉద్యోగం మానేసి ఒక మంచి హోటలు పెట్టుకోవాలని
ఇంకో 6 సంవత్సరాల తర్వాత హోటల్ మొదలు పెట్టాలని ప్లాన్ చేశా చూడాలి నా కోరిక తీరుతుందో లేదో...

శ్రీనివాస్ said...

మొత్తానికి చిన్ననాటి మా కోరికల చిట్టా గుర్తు చేశారు. నాకూ ఉండేవి పెద్దయ్యాక షాడో( మధుబాబు) అవ్వాలని.. రెండో క్లాసు నుండి నా క్లాస్ మేటు స్వప్న కి మొగుడిని అవ్వాలని , దయ్యం జుట్టు కోసి దాని చేత మా ఇంట్లో ఊడిగం చేయించుకోవాలని, టెండూల్కర్ లాగ క్రికెట్ ఆడాలి ... మ్యాచ్ లు లేని టైం లో చిరంజీవి లా సినిమాల్లో హీరో అవ్వాలి అని అబ్బో చాలా పెద్ద లిస్టు లెండి.

Weekend Politician said...

Nice post. As usual, you wrote the very basic and simple things in life. I enjoy reading your posts as they continously remind me that I am a human rather than the efficient machine I am trying to be..:)

frankly.. the mix of humor in this post is not upto your standard..

హరే కృష్ణ said...

గుమ్మడీ, అన్నపూర్ణల్లాగా అస్సలూ దెబ్బలాడకుండా ఉండాలనుకునేదాన్ని అంది

హ హ్హ బావుంది
ఇంకా నయం జేవి సోమయాజులు అన్నపూర్ణ అని అనలేదు బతికించారు

భావన said...

అబ్బబ్బ ఏమి రాస్తారండి మీరు. చిన్నప్పటికలలు సినిమా స్కోప్ లో అని పెట్టుండాల్సింది పేరు.. నిజమే కదా ప్రస్తుతం ఇక్కడ ఎవ్వర్ ఉలేరు నేనే నా చేతి వేళ్ళతో రింగులు రింగులు చూడుతూ వెనక్కి ...వెనక్కి...వేళిపోతున్నా. బై

బద్రి said...

నాకైతే పెద్దయ్యాక పని పాట లేకుండా హాయిగా తిని పడుకునేంత మా తాత సంపాదిస్తే బావుండనిపించేది (బద్దకరత్న బిరుదాంకితుడ్ని మరి).

Krishnapriya said...

@ వెంకట్,
మీ కోరిక తీరాలని కోరుకుంటున్నాను ..
@ శ్రీనివాస్,
మీ కోరికల చిట్టా బాగుంది.. ముఖ్యంగా మ్యాచులున్నప్పుడు టెండుల్కర్, లేనప్పుడు ఖాళీ సమయాల్లో చిరంజీవి :-)

మా కాలేజ్ లో ఒకమ్మాయి ఉండేది. దానికి ఒక 'చిన్న్న్న్న ' కోరిక.. దానికి పెళ్ళి సంబంధాలు చూసేవారు ఇంట్లో..

SV Rangarao గారి లాంటి గుంభనమైన మామగారు
డబ్బింగ్ జానకి లాంటి నోరు లేని అత్తగారు.
రాజ్యలక్ష్మి లేదా..పూర్వం పరికిణీ ఓణీలేసుకుని ఒక చెల్లెలు పాత్రలేసే అమ్మాయి ఉండేది..) ఆ అమ్మాయి లాంటి 'వదినా.. వదినా ' అని తిరిగే hardworking ఆడపడచు..
రంగనాథ్, సంగీత ల్లాంటి harmless బావగారు/తోటికోడలు..
రాళ్ళపల్లి లాంటి వఫాదార్ నౌకరూ.. భర్తేమో.. అని.. డ్రమాటిక్ గా అందర్నీ తలకాయ అటుంచి ఇటూ, ఇట్నుంచి అటూ తిప్పి.. ఒకసారి చూసి.. ' చిరంజీవి లా' అనేది..

ఇప్పుడు అమెరికా లో ఒక పెద్ద మల్టీ నేషనల్ కంపెనీ లో సీనియర్ మానేజర్.. అప్పటి విషయాలు గుర్తు చేస్తే..నవ్వేస్తుంది. దాని పిల్లలకి వీళ్ళంతా ఎవరో కూడా తెలియదు :-)

Krishnapriya said...

వీకెండ్ పొలిటిషీన్ గారూ,
థాంక్స్! మీరన్నది నిజం. మనం మెషీన్లుగా మారి మన అస్థిత్వాన్ని కోల్పోతున్నాం...

ఏదో వర్షం అని పిల్లలు బట్టలు మాపుకోకుండా అస్సలూ చుట్టూ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా రోబోల్లా బస్ ఎక్కి వెళ్ళాలనే తపన వల్లే మొన్న అంత మంది ఉదయానే.. నిలబడి మాట్లాడుకోవడం జరిగింది. లేకపోతే.. ఈ స్పీడ్ యుగం లో అంత తీరిక ఎవరికి?

Also, Thanks for the frank feedback! :-)

Krishnapriya/

Krishnapriya said...

@ హరే కృష్ణ,
:-) సోమయాజులు అన్నపూర్ణ అయితే.. సోమయాజుల చూపులకే భయపడి గుమ్మం చాటుకు తప్పుకోవాలి కదండీ!! అందుకే గుమ్మడి ని చూజ్ చేసుకుందనుకుంటా మా ఫ్రెండ్ :-)

ధన్యవాదాలు,
కృష్ణప్రియ/

Krishnapriya said...

@ భావన,
ధన్యవాదాలు, మీరు అలా రింగులు రింగులు చూస్తూ వెనక్కి వెళ్ళాక చూసిన విషయాలు మళ్ళీ బయటకి వచ్చాక చెప్పాలి మాకు.. :-) మీరిచ్చిన టైటిల్ బాగుంది! నాకు ఏంటో తోచలేదు..

@ బద్రి,

:-) బాగుంది.
చిన్నప్పుడు నేనూ అంతే హాయిగా తిని,పడుకుని, ఇష్టం వచ్చినంత సేపు, పుస్తకాలూ, టీ వీ.. చూడాలని అనుకునేదాన్ని.

ఇప్పుడూ తక్కువేం లేదు. రోజూ పెరుగు తోడుపెట్టుకోవటం, బట్టలు మడత పెట్టుకోవటం.. ఇలా ఎన్నున్నాయో.. విసుగొచ్చే పనులు .. :-)

కృష్ణప్రియ/

నేస్తం said...

నేను కోరుకున్న రెండు కోరికల్లో సగం సగం తీరాయి..
ఒకటి బాగా మొండితనం ,కోపం ఉండి భార్యను అస్సలస్సలు పట్టించుకోని అబ్బాయిని పెళ్ళి చేసుకుని ఎంతో మంచిగా మార్చుకోవాలాని..
రెండోది మంచి ఇల్లు కట్టుకుని కొంచెం కూడా దుమ్ము దూళీ లేకుండా అద్దంలా నీట్ గా పెట్టాలని..
మొండి మొగుడు,సొంత ఇల్లు ఉన్నాయి.. కాని రెండిటిని తీర్చిదిద్దడం నావల్ల కావట్లేదు బాబోయ్.. :(

Krishnapriya said...

@ నేస్తం,

:-) నవ్వించారు..

కృష్ణప్రియ/

సవ్వడి said...

పెద్దయ్యాక ఏమవ్వలో అని చిన్నప్పుడు నేనేమనుకున్నానో ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదండి... ఈసారికి వదిలేయండి. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు మీకు మళ్ళీ కామెంట్ చేస్తా!

divya vani said...

బాగుంది కృష్ణప్రియ గారు మీ పెద్దయిన తర్వాత.
నాకయితే నా చిన్నప్పుడు ఎవరైన నీకేం తెలియదు అని కోప్పడితే తొందరగా పెద్దయిపోతె బాగుండు అని అనిపించేది.

Krishnapriya said...

@ సవ్వడి,

హ్మ్మ్. వెయిట్ చేస్తానయితే..

@దివ్యవాణి,

నాకూ అలాగే అనిపించేది.. ఏదైనా చేయవద్దంటే.. పెద్దయ్యాక నా ఇష్టం వచ్చినట్టుండవచ్చు కదా అని.

కొత్త పాళీ said...

నేను మాత్రం సీరియస్‌గా రైలింజన్ డ్రైవరే అవుదామనుకున్నా. నా రీజనింగ్ ఏంటంటే, అన్ని వందలమంది ప్రయాణికులు నిద్ర పోతుండగా రాత్రిపూట రైలు నడపడం .. అంతమంది ప్రాణమూ ఆ డ్రైవరు బాధ్యతే కదా. అందుకని అది చాలా నోబుల్ మరియూ బాధ్యతా యుతమైన ఉద్యోగం. జీతం కూడా బాగా ఎక్కువ ఉంటుందని నా అంచనా. ఆకాలంలో ఆవిరి ఇంజన్లు నడిపే వాళ్ళు కర్చీఫుకి నాలుగు మూలల్లోనూ ముడులు వేసి ఒక చిన్న టోపీలా చేసి తలకి వేసుకునేవారు - ఇది కూడా ప్రాక్టీసు చేశా, చాలా కాలం.

nagarjuna said...

నేనైతే న్యూస్‌పేపర్లు చదివెసి టెర్రరిస్టు (మంచిగానేలెండి)గా, సాగరసంగమం చూసి డాన్సరుగా, రజినీకాంత్‌ను చూసి స్టైలిష్ కోటీశ్వరుడిగా, అంబానీని చూసి పారిశ్రామికవేత్తగా అవాలనుకున్నా...హ్ం ఈ లెక్కన నాకు బ్యాక్‌గ్రౌండులో ఒక పాటకాదు ఏకంగా సినిమానే కావాలి.. హి హి

పోస్టు ఎప్పటిలాగే...బావుంది

krishna said...

నా చిన్నప్పటి ' పెద్దయ్యాక ' కోరిక చెబితే నవ్వుతారేమొ అందరూ...
నవ్వనంటే చెబుతా... సరే
నాకు , మిక్కీ మౌస్ , డొనాల్డ్ డక్ అవ్వాలని వుండేది.. ఒకసారి తపస్సు కూడా చేసాను, లోకమంతా అలా అలా కార్టూన్ వరల్డ్ లా అయ్యిపోవాలని, మళ్లీ ఈ సారి ఖాళీ దొరికితే మొదలెట్టాలి తపస్సు :)

Krishnapriya said...

@ కొత్తపాళీ గారు, నాగార్జున గారు, కృష్ణ గారు,

మీ చిన్నప్పటి స్వప్నాలు పంచుకున్నందుకు థాంక్స్! నేను, మా చెల్లి ఎత్తి పెట్టిన నవార్ మంచం వెనక కూర్చుని తపస్సు చేశాం 2-3 సార్లు. కాకపోతే ఊర్వశి, మేనక ల బదులు మా అమ్మ కఱ్ఱ తో తపోభంగం చేసేసింది. :-)

pavani said...

హ్మ్మ్ బాగుందండి మీ పొస్ట్..

నా చిన్నప్పటి కొరికల చిట్టా అటుంచితే ఒకటి మాత్రం అస్తమాను అంటూ ఉండేదాన్ని

చిన్నప్పుడు coffee ఇమ్మంటే మ అమ్మ చిన్న cup తో సగం ఇచ్చేది...అప్పుడు మాత్రం అంటూ ఉండేదాన్ని "నేను అమ్మ అయ్యాక (పెద్ద అయ్యాక కాదు సుమా ..మరి ఆ తేడా ఏంటో నాకూ పెద్దగా clarity లేదు ;)] ఒక పెద్ద glass నిండా coffee పెట్టుకుంటాను" అని అనేదాన్ని :D

కృష్ణప్రియ said...

@ పావని,
:-) థాంక్స్!!
మేము పెద్దయ్యాక రోజూ జంక్ ఫుడే తినాలి అనుకునే వాళ్ళం.

lalithag said...

"నేను, మా చెల్లి ఎత్తి పెట్టిన నవార్ మంచం వెనక కూర్చుని తపస్సు చేశాం 2-3 సార్లు. కాకపోతే ఊర్వశి, మేనక ల బదులు మా అమ్మ కఱ్ఱ తో తపోభంగం చేసేసింది. :-) "
Hats off! Shall I shout now? May be not (yet).
"స్పీడ్ యుగంలో తీరిక ఎక్కడ?" అంటే నమ్మాలా? స్పీడు స్పీడుగా ఇలా మీరు టపాలు రాస్తుంటే మేం తీరిగ్గా నవ్వుకుంటున్నాం. మీ స్పీడు మాకు హుషారు :)
ఇంతకు ముందు చెప్పిన busy lady కథ మళ్ళీ చెప్పక్కర్లేదు కదా?

కందర్ప కృష్ణ మోహన్ - said...

హే క్రిష్..

మీ శైలి చాలా అంటే చాలా బావుంది..
హ్‌మ్‌మ్‌మ్‌మ్.... నేను ఏమవుదామనుకున్నానంటే....కనీసం ఒఖ్ఖ జిల్లాకైనా కలెక్టర్ అవుదామనుకున్నాను. ఏమేమో చేసేద్దామనుకున్నాను. చిన్నప్పుడు కడప కలెక్టర్ గా పనిచేసిన కీశే. సుబ్రహ్మణ్యం (అవును రాశేరే తో పాటు వెళ్ళిపోయినాయనే) మరియు రమణాచారి గార్లను కలిసిన మరియు వారి పనితనం ఇచ్చిన ప్రేరణతో....

నేనూ మీలాంటి క్రిష్ నే... గో అహెడ్...

కృష్ణప్రియ said...

@ లలిత,
:-) థాంక్స్!

@ కృష్ణమోహన్ గారు,
నా బ్లాగ్ కి స్వాగతం! చిన్నప్పుడు తెలిసీ తెలియనిదనం లో నేను, బాగా చదివితే కలెక్టర్ అవుతారు, కొంచెం తక్కువ చదివితే డాక్టర్లూ, ఇంజనీర్లూ, సైంటిస్టులూ అవుతారనుకునేదాన్ని .. మీ వ్యాఖ్య కి, పెద్దయ్యాక మీరు ఏమవుదామనుకున్నారో,.. చెప్పినందుకు థాంక్స్!

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;