Friday, July 23, 2010

హాయిగా హాల్లో సినిమా...

పుట్టినరోజని సినిమా కెళ్దాం అని బయల్దేరాం..మాల్ లో మల్టీప్లెక్స్ థియేటర్ కి. అన్ని సెక్యూరిటీ పరీక్షలూ పాస్ అయి తీరిగ్గా వెళ్ళి కిటికీ షాపింగ్ చేసి... ( ఇంటర్నెట్ ద్వారా బుక్ చేసుకున్నందువల్ల, తొందర లేదు..) ఇంకో పది నిమిషాలుందనగా.. లోపలకెళ్ళాం. కెమేరా లకోసం వెతికి లోపలకి పంపగానే 500 రూపాయలు ఫట్!! కోక్, నాచోలకీ.. పాప్ కార్న్ కీ..

రెహమాన్ జాతీయగీతం, అందరూ నిలబడ్డాం. తర్వాత.. స్మూత్ గా జరిగిపోయింది సినిమా. జోకులకి నవ్వుతున్నా.. పెద్దగా సీట్లు చించేసేంత లేదు అక్కడ. సినిమా అయ్యాక..దోవలోనే పిల్లలు నిద్రపోయారు. ఇంటికొచ్చాక ఆలోచనలో పడ్డాను.

మా చిన్నప్పుడు ..మా ఊర్లో "హేఏఏఏఏ కృష్ణా.. ముకుందా... మురారీ......" ' ఘంటసాల గొంతు వినబడగానే..పౌడర్లు దబ దబా మొహాన దగ్గొచ్చేలా కొట్టి పరిగెత్తించేవారు మా అమ్మా వాళ్ళు. స్కూల్ కి వెళ్తున్నప్పుడు ఎంత సున్నితం గా దువ్వినా అరిచి గీ పెట్టే మేము ఆరోజు మాత్రం నేలని దున్నినట్టు దువ్వినా కిక్కురు మనకుండా సహకరించేవాళ్ళం. పైగా అడగకుండానే అమ్మా వాళ్ళు వినేలా అరడజన్ పాఠాలు గట్టిగట్టిగా చదివేసి.. ఈ పీ ఎం (performance assessment) ముందు వారం రోజులు ఆఫీస్ లో పని చేసినట్టు!!.. 2 వారాలకోసారేమో వెళ్ళేవాళ్ళం. అందరూ మనల్ని చూస్తున్నారా లేదా అని గమనించుకుంటూ..

స్లైడ్లూ, న్యూస్ రీళ్ళూ అయ్యాక, అసలు మొదటి హీరో తెర మీదకొచ్చేదాకా వాడేమన్నాడో అసలేమవుతోందో తెలిసేదే కాదు.. అన్ని ఈలలూ, చప్పట్లూ, పిల్లి కూతలూ. ఇంటర్వెల్ లో ఏమీ కొనమని మా అమ్మా వాళ్ళూ ఇష్ట దైవాల మీద ఒట్లు పెట్టించుకుని తెచ్చేవారు. కానీ ఇంటర్వెల్ లో సామ, దాన, బేధ, దండోపాయాలేవైనా సరే వాడి కనీసం గోలీ సోడా అయినా కొనిపించుకునేవాళ్ళం అనుకోండి..

ఆఖరి పరీక్ష అయ్యాక సినిమా కెళ్ళే ఆనందానికి ముందు బంగారు తొడుగులు అయినా సాటి రావు కదా.. ఒకసారి ఆఖరి పరీక్ష అయ్యాక మా ఊర్లో సినిమా హాల్లో 'ఎఱ్ఱ మల్లెలు ' ఆడుతోంది. మా అమ్మ నేను చచ్చినా రాను అంది. ఏం చేస్తాం? మా నాయనమ్మ దగ్గర గొడవ చేస్తే..ఆవిడ సరే అంది. నేనూ, మా చెల్లీ, నాయనమ్మా బయల్దేరాం. ఆవిడా..నెమ్మదిగా నడుస్తుంది. ఊరంతటికీ ఒకటే హాల్. పైగా.. ఎఱ్ఱ మల్లెలా మజాకా? గోదావరిఖని కార్మికులంతా హాల్లోనే.. వెళ్ళి చూస్తే.. టికెట్లన్నీ అయిపోయాయి. మేము దొర్లి దొర్లి ఏడుపు! ఎంతైనా మనవరాళ్ళ ఏడుపు చూడలేక మా నాయనమ్మగారు బతిమాలి బెంచి టికెట్ సంపాదించారు. పెద్దావిడ కదా అని ఆవిడ కి కాస్త చోటిచ్చారు జనాలు. మేం కిందే.. ఎంత మజా.. 30 యేళ్ళు దాటినా ఇంకా ఆ బీడీ వాసన ఫ్రెష్ గా..

ఇక అమ్మమ్మ గారింట్లో సినిమా అంటే.. ఉదయం డప్పు తీసుకుని దండోరా వచ్చేది... "ఈరోజు.. ఢం ఢం ఢం ఢం.. నక్కా తాతయ్యగారి దొడ్లో.. ఢం ఢం ఢం ఢం.. 'వయ్యారి భామలూ.. వగలమాడి భర్తలూ'.. వేస్తున్నారోఓఓఓఓఓఓ ఢం ఢం ఢం ఢం!!!!!" ఇంక మాకు పట్ట పగ్గాలుండేవి కావు.

పొద్దున్నుంచీ గొడవ గొడవ చేసి.. అందరి దగ్గరా బోల్డు మంచి వేషాలేస్తే.. సాయంత్రం పంపేవారు.. చాపలూ, పాత దుప్పట్లూ తీసుకుని పొలో మని.. వెళ్తే.. టికెట్ కి అర్థ రూపాయి. మధ్యలో కరెంట్ పోతే.. నాగమణి అని ఒక పిల్ల ఉండేది.. 10-12 యేళ్ళుంటాయేమో.. 'నువ్వాడవే." అనటం ఆలస్యం.. పాడుతూ డాన్స్ చేసేసేది. మేము ఇంత ఎంజాయ్ చేస్తున్నట్టు కనపడ్డా.. మా తాతగారు 'ఏంటా వెకిలి వేషాలు ? ' అని హుంకరించటం.. ఎన్నున్నాయో గోడ మీద సినిమా జ్ఞాపకాలు!!! ఎంటివోడి సినిమాలంటే చాలు! ఊరి పెద్దలు కుర్చీల మీద, మిగిలిన వాళ్ళు వాళ్ళు తెచ్చుకున్న చాపలమీదా కూర్చుని చూడటం...

హైదరాబాద్ కొచ్చాక మాత్రం సినిమాల జోరు మాకు తగ్గిపోయింది. మేమూ పెద్దయి.. కుటుంబం కన్నా.. స్నేహితులతో ఎక్కువ వెళ్ళేవాళ్ళం. చిరంజీవి, బాలకృష్ణ, అప్పుడప్పుడూ శోభన్ బాబు, కృష్ణ.. అమీర్ పేట లో సత్యం, చిక్కడపల్లి లో. బోల్డు థియేటర్లు..బస్సెక్కి పోవటం, చూడటం..

అప్పుడప్పుడూ పిల్లల్ని పంపేది మా అమ్మ సినిమాలకి.
మా తమ్ముడు మామూలప్పుడు మామూలు గా తిన్నా..సినిమాలకి వెళ్తే.. ఇంక ఆగేవాడు కాదు. వాడిని తీసుకెళ్తే.. ఇంక మాకు తిప్పలే తిప్పలు. మంచి నీళ్ళ బాటిల్ లోంచి నీళ్ళు పారబోసి.. చెఱకు రసం పోయించుకునేవాడు. చిప్స్ దగ్గర్నించీ పావలా త్రికోణం సమోసాల దాకా తిండే తిండి.. పర పర, కర కర.. ఒకసరైతే..తెచ్చుకున్న డబ్బంతా తిండి కే సరిపోయి సినిమా హాల్ నుండి ఇంటికి వెనక్కెళ్ళటానికి బస్సుకి డబ్బుల్లేవని నడుచుకుంటూ వెళ్ళాం.

మా పెద్దమ్మల ఇళ్ళకెళ్తే అక్కడ సినిమా చూడటం లో మజా యే వేరు. 20 మంది 7-8 రిక్షా లెక్కి వెళ్ళటం.. ఉక్కిపోతూ కూర్చోవటం.. హాల్లో పాటలొచ్చినప్పుడు మగాళ్ళంతా బయటకెళ్ళటం.. ఫైట్లప్పుడు ఆడవాళ్ళు కబుర్లు మొదలు పెట్టడం.. ఏడుపు సీన్లలో ఆడవాళ్ళు వెక్కి వెక్కి ఏడ్వటం.. ఒకసారి ఒకావిడ చేతులూపుతూ శాపనార్థాలు పెట్టింది.. మా పక్క సీట్లో ( ఓలమ్మో.. నీదొక ఆడ జన్మేనా థూ.. దాని మొగుణ్ణి వల్లో వేసుకుంటావా.. !@%@) అంటూ.. తెగ ఏడుపు! నవ్వుకోలేక చచ్చాం..

ఒకసారి ఉండ్రాజవరం అన్న ఊర్లో టూరింగ్ టాకీస్ లో 'జగజ్జట్టీలు ' అన్న సినిమాకెళ్ళాం. ఆవూర్లో ఆడవాళ్ళకీ, మగవారి సీట్లకీ మధ్య ఒక గోడ ఉండేది. మేమా చిన్న పిల్లలం. 2 సైకిళ్ళమీద బయల్దేరాం. మగాళ్ళ సైడ్ మా అన్నయ్య.. ఆడవాళ్ళ సైడ్ లో నేనూ, మా అక్క, చెల్లీ.. (కజిన్లం ) డబ్బేమో వాడి దగ్గరే.. ఇంటర్వెల్లో భటాణీలూ, పల్లీలూ కొనుక్కొచ్చేసరికి లైట్లు ఆపేశారు. గోడ మీదనుండి.. 'పాపాయీ.. తీసుకోవే.. పిడత కింద పప్పు తెచ్చాను 3 పొట్లాలు.. ' అన్నాడు.. మేము సినిమాలో లీనమైపోయాం అప్పటికే.. ఎవరో శుభ్రం గా అందుకుని తినేసారు. విషయం సినిమా అయ్యాక తెలిసి మాకు ఎక్కడ లేని బాధా వచ్చేసింది...


టెంత్ లో అనుకుంటా పబ్లిక్ పరీక్షలప్పుడు లెక్కల పేపర్ లీకయిందని కాన్సెల్ చేసారు. పరీక్ష హాల్ కి రాగానే వార్త విని, వచ్చిన రిక్షా నే 'బాబూ.. సత్యం థియేటర్ కి తిప్పు ' అని వెళ్ళిపోయాం.

లాబ్ లో అటెండన్స్ ఇచ్చి ప్రాక్టికల్సప్పుడు ఎంత హాయిగా వెళ్ళిపోయేవాళ్ళమో .. కానీ అప్పుడప్పుడూ దారుణం గా దొరికిపోయేవాళ్ళం.. పైగా..ఎక్కువ డబ్బులు ఉండేవి కావు. దానితో లంచ్ డబ్బా లో పెట్టిందే తినటం. ఒకసారి లైట్లు తీసేశాక చీకట్లో దోశలు తింటుంటే ముందు సీట్లో అబ్బాయి నాకూ దోశలు కావాలని ఒకటే ఏడుపు...

ఒక్కోసారి మార్నింగ్ షో కెళ్ళి ఇంటర్వెల్ లో వచ్చి మాటినీ కి కొనుక్కునేవాళ్ళం. ఉదయం నుండీ సాయంత్రం దాకా 2 సినిమాలు చూసి.. కాలెజొదిలే సమయానికి ఇళ్ళకి చేరటం.. మా స్నేహితురాలిని తెచ్చి మా అమ్మని అడిగించటం.. 'ప్లీజ్ మీ అమ్మాయిని పంపమని.. ఫ్రెండ్స్ ముందు ఒప్పుకున్నా.. వాళ్ళు వెళ్ళాక రికమెండేషన్లు తెస్తావా అని తిట్లు..

మా ఇంటి ఎదురు గా ముగ్గురు అన్నదమ్ములు అందరూ మెడికల్ కాలేజ్ లో చదివేవారు. మా నాన్నగారు వాళ్ళని ఆదర్శం గా తీసుకొమ్మంటారని వాళ్ళకి తెలుసు.. ఒకసారి అందాల నటుడు శొభన్ బాబు సినిమా ఏదో చూసి వస్తున్నాను ఫ్రెండ్స్ తో.. 'ఏంటీ సినిమా నా.. ఏం చూసావ్? అనగానే.. మరీ 'శ్రీవారి ముచ్చట్లో ఏదో చెపితే ఏం బాగుంటుందని.. పక్క థియేటర్ లో ఆడిన కళా తపస్వి విశ్వనాథ్ గారి సినిమా శ్రుతి లయలు చూశామని కోసిన గుర్తు. ఏం చేయను? మా ఫ్రెండ్ శోభన్ బాబు కి వీరాభిమానాయె! తర్వాత ఎందుకైనా మంచిదని కథా, నటుల గురించి తెలుసుకున్నాను..

ఇంక యూనివర్సిటీ లో..సైకిల్ మీద వెళ్ళి బస్ టికెట్ల డబ్బు తగ్గించుకుని తిరిగినవీ.. 'చీప్ ' అని మొదటి వరస లో చూడటం... ' అందాజ్ అప్నా అప్నా ' సినిమా కెళ్తూ సరదాకి ఒకళ్ళం చీర/20 నగలూ, ఒకరు జీన్సూ/టీ, ఇంకోళ్ళు సల్వార్-కమీజ్, ఇంకోళ్ళు ధోతీ/జుబ్బా లలో వెళ్ళి నవ్వించటం..
హం ఆప్కే హై కౌన్ ఐదు సార్లు చూడటం.. ముందుగానే కథ/డైలాగులూ తెలుసుకుని ఇంగ్లిష్ సినిమా ప్రతి ముక్కా అర్థమయినట్టు నటించటం.. మదరాసులో సూపర్ స్టార్ రజనీకాంత్ వీ, బెంగుళూరు లో పవర్ స్టార్ పునీత్ వీ చూడటం.. 'ఖల్ నాయక్ ' చూద్దామని ముందుగానే 15 మందికి సైకిల్ మీద వెళ్ళి సరిగ్గా చూసుకోకుండా అడ్వాన్స్ బుకింగ్ చేస్తే.. హిందీ డబ్బింగ్ సినిమా 'ఈవిల్ డెడ్ ' అయ్యిందని 15 మంది కొట్టటానికి వస్తే పారిపోయి రావటం,

అమెరికాలో ఇంక సినిమాలు పిల్లలు పుట్టనంత కాలం వారానికొకటి చూసి హాయిగా వచ్చేవాళ్ళం.. ఓ సారి సన్నీ వేల్ లో సినిమా చూడాలని ( ఇంకో వారం లో మా పాప పుడుతుంది అనగా ) వెళ్ళాం నేనూ, మా వారూ.. చిరంజీవి సినిమా 'అన్నయ్య ' కి. టికెట్లిచ్చే ఆవిడ 'మీకు వీలు గా ఉండేందుకు ఐల్ సీట్ ఇస్తాము ' అనగానే 'అబ్బో వీళ్ళకి ఎంత దయ! ' అనుకుని వెళ్తే ఏముంది.. పట్టుమని 10 మంది కూడా లేరు హాల్లో..ఆవిడ జోక్ చేసిందని అప్పటికి అర్థం అయింది మాకు :-)

ఇలా ఇంకో వారం లో పుడతారనేదాకా కూడా చూసినందువల్లనేమో.. మా పిల్లలకీ.. బానే సినిమా పిచ్చే :-) చిన్నప్పట్నించీ వాళ్ళకి సినిమాలు అలవాటే.. కాకపోతే పాప్ కార్న్ పాకెట్లు అయ్యాక ఎవరో ఒకళ్ళం గుమ్మం దగ్గర నిలబడేవాళ్ళం అనుకోండి..

మా తాతగారి జమానా లో బళ్ళు కట్టించుకుని కారియర్లలో టవున్లకొచ్చి చూసినా.. మా తల్లిదండ్రుల జమానా లో రిక్షాల్లోనో, చేతక్ మీదో వెళ్ళి చూసినా, ఆటోల్లో, బస్సుల్లో వెళ్ళి లైన్లల్లో నుంచుని/బ్లాక్ లో కొని చూసినా.. సాఫిస్టికేటెడ్ గా ఇంటర్నెట్ లో బుక్ చేసుకుని యే సీ కార్లో వెళ్ళి కోక్, నాచోలూ తింటూ మల్టీ ప్లెక్స్ లో చూసినా.. హాల్ కెళ్ళి చూడటం లో మజా నాకయితే.. డీవీడీల్లో, టీవీలోనో, యూ ట్యూబ్ లోనో, టోరెంట్లో డవున్లోడ్ చేసి చూస్తేనో.. రాదు.

కానీ అంత టైమెక్కడేడ్సింది? ఎలాగో అలాగ వారానికో సినిమా ఖాతా లో పడకపోతే.. తెలుగు వారికి సంతృప్తి ఎక్కడిది?

23 comments:

హరే కృష్ణ said...

బావుంది పోస్ట్
ఒకతను రాసారు కొద్దిరోజులు క్రితం ఇంచుమించు ఇదే కాన్సెప్ట్ తో
http://blogavadgeetha.blogspot.com/2010/06/blog-post_12.html

భాస్కర్ రామరాజు said...

హ్మ్!! నేనూ సినిమాల మీద ఓ టపా రాయాల్సొచ్చేలా ఉంద్యే.

Sravya Vattikuti said...

సూపర్ అండి మీ సినిమా ప్రహసనం .

swapna@kalalaprapancham said...

nenu kooda chinnappudu okka saremo goda mida cinema chusa abba ippudu malli evarina ala pedithe bagundu.

3g said...

సూపర్ పోస్ట్

భావన said...

హ హ హ బలే బాగా చెప్పేరు నిజమే సినిమా చూడక పోతే తొయ్యదు అదీ హాల్ కెళ్ళి చూడక పోతే. ఇప్పుడే మర్యాద రామన్న సినిమా చూసి వచ్చి after movie affect వుంటుంది కదా అబ్బ ఇంత దూరం పొలో మని వెళ్ళి వెధవ గోల అని వుసూరు మనుకుంటు వచ్చాము, మళ్ళి పులి వస్తే తయారు మంగతాయారు అనుకుంటూ రడీ ఐపోతాము అనుకోండి. బాగా చెప్పేరు...

divya vani said...

bagundandi mee cinima post

Weekend Politician said...

"ఎంత మజా.. 30 యేళ్ళు దాటినా ఇంకా ఆ బీడీ వాసన ఫ్రెష్ గా.."

ఫ్రెష్ గా ఉందంటే...నాకనుమానమే??? మీరు ఇక్కడ బ్లాగుతుంటే అక్కడ మీ వారు దమ్ములాగించేస్తున్నారేమో... ఒక్కసారి చూసుకోండి.:)

అయినా ఆ మధుర స్మృతుల కోసం మీ వారికే ఒక బీడీ కట్ట కొనిపెట్టినా కొనిపెట్టగల అగంతకుల్లా ఉన్నారు మీరు. :)

చక్కగా రాసారు. అభినందనలు.

Venkat said...

keka..............

కొత్త పాళీ said...

నేనీదేశంలో థియేటరుకెళ్ళి దేశీ సినిమా చూడకూడదు అని వొట్టేసుకున్నా, ఐనా అప్పుడప్పుడూ గట్టు మీద పెట్టేసి వెళ్ళి బలైపోయి మళ్ళి ఇంకా బలంగ వొట్టేసుకుంటూ ఉంటా. ప్రస్తుతానికి చివరి బలి మగధీర.
ఇహ చిన్నప్పుటి సినిమాలు .. మీర్రాసినవన్నీ నా ఎకవుంట్లో వేసేసుకోవచ్చు. పదోక్లాసు దాకా పరీక్షల మధ్యలో (ఛాన్సు దొరికినా సరే) సినిమా చూస్తే పరీక్ష తప్పుతామని ఒక సెంటిమెంటుండేది. ఇంటర్లో కాలేజి ఎగ్గొట్టి వెళ్ళే సీను లేదు. ఫాదర్లు గుడ్లగూబల్లా కాపలా కాసేవాళ్ళు. ఇహ ఇంజనీరింగులో మా ఇష్టారాజ్యం. వేటగాడు (రీ-రిలీజ్) ఆ పూట ఆఖరి రోజని తెలుసుకుని, సుమారు పాతికమంది సైకిళ్ళేసుకుని ఆరు కిలోమీటర్లు పోయి సెకండ్ షో చూసి రావడం, ఆకుచాటు పిందె తడిసె పాట ఐపోయాక గోలగోల చేసి ఆ పాట మళ్ళి వెయ్యించడం .. మరిచిపోలేని మధురానుభూతులు.

సవ్వడి said...

నాకు కూడా హాల్ కెళ్లి చూస్తేనే నచ్చుతుంది. ఎంజాయ్ చేస్తాను..
మా స్నేహితులు సిడిలో చూద్దామంటారు. వాళ్లు ఎలా ఎంజాయ్ చేస్తారో నాకు అర్థం కాదు. నేను ఏ సినిమా కూడా హాల్లో చూడకుండా సిడిలో చూడలేదు.
ఇక సంక్రాంతి వచ్చిందంటే.. తాతగారి ఇంట్లో ఉన్న అందరం బయలుదేరతాం. 15 నుంచి 20 మంది వరకూ ఉంటాం. మా పిల్లకాయలందరం ఒకేసారి బయలుదేరేవాళ్లం. సినిమాకి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు వాటిగురించే మాటలు. మేమైతే ఇప్పటకీ ఇలాగే ఎంజాయ్ చేస్తుంటాం.
" చెన్నకేశవ రెడ్డి " సినిమాకి 20 రూపాయల టికట్ 90 రూపాయలకు కొని వెళ్లాను. నా జీవితంలో ఇదే ఎక్కువ ధర చెల్లించి కొన్న టికట్. నాముందే ఒకతను 50 రూపాయల టికట్ ని 600 రూపాయలకు కొన్నాడు. దానికి తోడు అప్పటికే రెండు సార్లు తిరగడం వల్ల... ఎలాగైనా కొనేయాల్సిందే అని నిర్ణయం తీసుకుని కొనేసాను. అప్పుడు స్టార్ట్ ఐంది టెన్షన్. అది నిజమైనదా కాదా... లోనకి తీసుకెల్తారా లేదా... డబ్బులు వేస్ట్ ఐపోయాయా... ఇలా ఒకటే ఆలోచనలు. లోనకెళ్లాక గాని టెన్షన్ తగ్గలేదు.

వీరుభొట్ల వెంకట గణేష్ said...

____________________________________
ఆఖరి పరీక్ష అయ్యాక సినిమా కెళ్ళే ఆనందానికి ముందు బంగారు తొడుగులు అయినా సాటి రావు కదా..
___________________________________
Correct. By default, after every last exam, I used to go to movie. After annual exams, exhibition or movie is must.

నైస్ పోస్ట్. అన్నట్టు, ఇవ్వాళ పొద్దున్న జెమిని టీవిలో అన్నయ్య సినిమా!!

జయ said...

మీ సినిమా కబుర్ల ప్రహసనం అందరి అనుభవాలను నెమరువేసింది. నా కైతే నా చిన్న తనపు నాగార్జునసాగర్ లో సినిమా అనుభవాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. నమో వెంకటేశా పాటతో మొదలయ్యేది హడావుడి:) ’సినిమా ఎక్స్పీరియన్స్ త్రూ ద ఏజెస్’ లాగా గత స్మృతులను తట్టిలేపారు. చాలా మధురంగా ఉంది.

Krishnapriya said...

@ హరేకృష్ణ,
ధన్యవాదాలు. నేను మీరు చెప్పిన పోస్ట్ చూశాను. చాలా నచ్చింది. అదే కాక Phanibabu musings లో కూడా ఒక పోస్ట్ చూశాను వారం పది రోజుల క్రితం. వీలైతే చదవండి..
http://harephala.wordpress.com/2010/07/15/baataakhaani-280/

Krishnapriya said...

@ భాస్కర్ రామ రాజు గారు,
ఆలస్యం దేనికి? రాసేయండి సరదాగా!
@శ్రావ్య,
థాంక్స్!
@స్వప్న,
శ్రీ రామ నవమికి ఒకటి రెండు సార్లు లాప్ టాప్ లోంచి మేం సరదాగా ప్రొజెక్టర్ అద్దెకి తెచ్చి గోడ మీదకి వేసుకుని ఆరుబయట చూశాం మా కాంప్లెక్స్ లో... ట్రై చేయండి మీరు కూడా :-)

Krishnapriya said...

@దివ్యవాణి, 3జీ, వెంకట్,
థాంక్స్!
@భావన,
:-) మేమూ శుభప్రదం, ఝుమ్మంది నాదం లాంటివి ఎందుకు బాలేదో చూద్దామనుకుంటున్నాం. (అదీ హాల్ కెళ్ళి మరీ).. మీ సామెత బాగుంది వినలేదు ఎప్పుడూ..

Krishnapriya said...

@ వీకెండ్ పొలిటిషీన్ ,
హ్మ్మ్, ఈ కోణం లో ఆలోచించలేదు... ఇంకా నేను పాత అనుభూతులన్న భ్రమలో ఉన్నాను. ఉండండి చెక్ చేసి వస్తా.. థాంక్స్! :-)

Krishnapriya said...

@కొత్తపాళి గారు,
మీ ఎక్స్ పీరియన్సులు షేర్ చేసుకున్నందుకు థాంక్స్! మేము 'తమ్ముడు ' అన్న సినిమా సన్నీవేల్ లో చూశాం. పెద్దగా గోల లేదు థియేటర్ లో. కానీ తర్వాత అదే సినిమా అనంతపూర్ లో చూశాం. అల్లరి అల్లరిగా.. చాలా సరదాగా అనిపించింది.

నాకు మీ ఒట్టు వెనక ఆంతర్యం అర్థం కాలేదు... ఎందుకు అలాంటి నిర్ణయం?

Krishnapriya said...

@సవ్వడి,
మేమూ అందరం ఎప్పుడు కలిసినా.. తీరిక చేసుకుని ఒక సినిమా చూస్తాం. ఇంతకీ చెన్న కేశవరెడ్డి ఎలా ఉందో చెప్పనేలేదు?
@జయ,
ధన్యవాదాలు!

Sheshu Kumar Inguva said...

చదువు కుంటున్నప్పుడు వారానికి 2 ౩ సార్లు థియేటర్ కి వెల్ల్లి చూసే వాళ్ళము. ఇప్పుడు బెంగళూరు లో ౩౦ కి ఒక సినిమా చూస్తున్న డి వి డి లో. కానీ పెద్ద తెర మెడ చూస్తే చాలా రిల్యాక్స్ అవుతుంది మెదడు. మా స్నేహితుడు శాస్త్రి చెప్పినట్టు పిచ్చా తగ్గుతుంది థియేటర్ లో చూస్తే...

సవ్వడి said...

మంచి సినిమా అండి.. నేను హాల్ లోనే రెండు సార్లు చూసాను.

Krishnapriya said...

@ శేషుకుమార్,

అవును..పాయింటే! ఇంట్లో చూస్తే.. గట్టిగా మాట్లాడతాం. వేరే పనులు చేస్తూ చూస్తాం..ఇష్టం లేనివి ఫార్వర్డ్ చేసేస్తాం కదా.. థియేటర్ లో అయితే..వేరే ఏ పనీ లేకుండా..బోర్ గా ఉంటే.. కనీసం.. చూపించే సీన్ లో వాళ్ళ బట్టలూ, వెనక పెయింటింగ్ లూ, హాల్ లో జనాల రియాక్షన్లూ చూస్తూ టైం పాస్ చేస్తాం కదా..

@ సవ్వడి,
అయితే నేనూ చూస్తాను ఈసారి,.. టీవీ లో వస్తూనే ఉంటుందేమో..

కృష్ణప్రియ/

సవ్వడి said...

కృష్ణ ప్రియ గారు!
కంగారు పడకండి. నాకు ఏక్షన్ మూవీస్ ఇష్టం. అందుకే నచ్చింది. మీకు అవి ఇష్టమైతేనే చూడండి. లేకపోతే.. అది నచ్చలేదనుకోండి. మళ్లీ నన్ను తిడతారు.
మీరు బాలకృష్ణ సినిమాలు చూస్తామన్నారు. ఇది చూడలేదా..!

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;