Monday, March 14, 2011

సింగం, బార్డర్ సమస్యా, మల్లెపూలూ..



ఆఫీస్ లో నా ప్రాజెక్ట్ పార్టనర్ సింగ పెరుమాళ్ నుండి మెయిల్.. సోమవారం. 'Family Emergency.. Will be Out of Office for couple of days' అని.  'అయ్యో.. పాపం ఏం ఎమర్జెన్సీ యో' అనుకున్నాఒక్క క్షణం కానీ.. ఆయన చేయాల్సిన పని కూడా నా మీద పడిందని గుర్తొచ్చి.. నీరసం వచ్చింది...  కానీ మళ్ళీ అనుకున్నా.. పోన్లే.. ఎన్ని సార్లు నన్ను ఆదుకోలేదు.. అని..






రెండు రోజులకని వెళ్ళిన వాడు వారం అంతా రాలేదు.ఫోన్ కి పలకడు.. ఆన్లైన్ లేడు.బాసుగారిని అడిగితె.. 'నాకూ చెప్పలేదు.. ఏమైందో..' అని చెప్పాడు.  సింగ పెరుమాళ్ చాలా నెమ్మది. ఘాటైన తమిళ వాసన తో మాట్లాడతాడు. తనని అందరూ సింగం అని పిలుస్తారు.. మేమైతే 'సిమ్గామంటీ చిన్నోడే ఆఫీస్ కొచ్చాడే..' అని సరదాగా ఏడిపించినా..  'Singapore mall' అని ముద్దు పేరు పెట్టినా..నవ్వుతూ వెళ్ళిపోవటమే..


అతను మొత్తానికి ఆఫీసు కి రాగానే..  'ఏమైంది? ' అని అడిగితే రుద్రవీణ లో లా 'అదంతా పెద్ద కథ' అని నిట్టూర్చాడు. సరే ఈరోజు లంచ్ సింగం తో ఫిక్స్ చేసేసా..  కిటికీ సీట్ సంపాదించి..'ఇప్పుడు చెప్పు..' అనగానే.. మొదలు పెట్టాడు..


'మా ఊరు తమిళ నాట ఒక అందమైన చిన్న పల్లె.. ' అని..    నేను.. 'ఆ ఆ.. introduction వద్దు తండ్రీ... పచ్చని చేలూ, ఊరి పక్క పారే కావేట్లో చల్లని నీరూ, నిష్కల్మషమైన హృదయాల తో ఊరి ప్రజలూ, ఇళ్ళ ముందు ముగ్గులూ, .. ' ఇంకా ఏదో అనబోతుంటే..  సింగం మొహం లో ఎక్స్ప్రెషన్ చూసి.. 'సారీ.. చెప్పు చెప్పు ' అన్నాను.


ఊళ్ళో.. వాళ్ళింటి పక్క వారికీ సింగం కుటుంబానికీ భూముల గొడవలు ఉన్నాయిట. అంతగా పడదట. ఈలోగా వీళ్ళ ఇళ్ళ మధ్య కంచె ఏదో నిప్పు అంటుకుని కొంత పార్ట్ కాలిపోయిందిట. మళ్ళీ వేయించే సమయం లో పక్కాయన కాస్త పకడ్బందీ గా  సింగం తండ్రి ఊళ్ళో లేని సమయం లో రెండడుగులు జరిపి కట్టించాడట. సింగం అమ్మ  ఉదయమే లేచి ఈ ఘోరం చూసి గగ్గోలు పెట్టి అరిచి నానా యాగీ చేసి.. పక్కవాళ్ళని శాపనార్థాలు పెట్టినా.. వాళ్ళు వినిపించుకోలేదట...


ఇక వాళ్ల నాన్న ఊర్లోకి రాగానే పెద్ద గొడవ.. కంచె కట్టటం ఆపు చేయించి.. ఊళ్ళో పెద్దమనుషుల్ని పిలిచి గొడవ పెట్టించాడట.  సింగం తండ్రి ఒక సామాజిక వర్గానికి నాయకుడు. ఆయన వెనక మొత్తం కుల సంఘం నిలిచింది. ఇక అవతల పక్కవారి వైపు కౌన్సిలర్ ఉన్నాడట. దానితో.. కాంగ్రెస్ వాళ్ళంతా వెనక నిలిచారట. ఇటు సింగం తండ్రి  DMK మెంబర్. దానితో.. ఆయన వెనక రాజకీయ శక్తులు కూడా వచ్చి చేరాయి.


ఒక పక్క సింగం కి తప్పి పోయిన పెళ్లి సంబంధం వారు ఒకళ్ళు అవతల పక్క  గుంపు లో కలిసారట. వాళ్ళు MLA చుట్టాలు.  ఎలక్షన్ల హడావిడి కూడా ఉందిట ఆ ఊర్లో.. దేనివో..


ఈలోగా.. ఒక DMK అతనికి అవతల పక్క చేరిన కాంగ్రెస్ మనిషి తో ఉన్న పాట కక్ష తీర్చుకోటానికి ఇదే మంచి అవకాశం అని తోచింది. ఇంకేం?  వెంటనే.. దారి కాసి శత్రువులపై కర్రలతో, కత్తులతో దాడి చేసారు.. వాళ్ళూ అప్రమత్తం గానే ఉండటం తో కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారు.. అదీ పోలీస్ జీప్ అదే దారిలో వస్తూండటంతో...


దాంతో.. గొడవ పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళిందిట.. సరే.. ఇక ఇంత దూరం వచ్చాక తగ్గేది లేదని.. సపోర్ట్ కోసం కొడుకులకి ఫోన్లు చేసారట.. తల్లి దండ్రులు.. 


 సింగం తమ్ముడు ఇంకా చదువుకుంటున్నాడట. సింగానికి మొదటి నుండీ కోపమెక్కువ.. ఊళ్ళో గొడవల్లో ఇరుక్కుంటుంటే వాళ్ల తల్లిదండ్రులు హాస్టల్ లో పెట్టి చదివించారని చెప్తే..  నాకు కాస్త భయమేసి ఎందుకైనా మంచిదని స్టిఫ్ గా కూర్చున్నాను.   నా పరిస్థితి ని పట్టించుకోకుండా.. సింగ పెరుమాళ్ తన కథ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు.





'హమ్మో.. సింగాన్ని చాలా సార్లు డెడ్ లైన్ల గురించి నిలదీయటం, వార్నింగ్ లు ఇవ్వటం.. లాంటివి చేస్తూ ఉంటాను.. టీం లీడ్ గా.. ఇంత బాక్ గ్రౌండ్ ఉందా.. అని కాస్త భయం వేసింది.  ఇంద్ర లో చిరంజీవి లా అజ్ఞాత వాసం గడుపుతున్నాడా? తేడా వస్తే..  తల కాయలు  లేపేస్తాడేమో .. ఎన్ని సార్లు అతనికి కోపం వచ్చి ఉంటుందో.. ఈ పాటికి అని ఒక అంచనా వేయటం లో మునిగిపోయాను.




చిన్న కాలిన కంచె ఊళ్ళో కులాల మధ్య గొడవగా,.. రాజకీయ పార్టీల మధ్య పోరుగా పరిణామం చెందింది.. ఊరు మండుతోందిట.  తండ్రి ఫోన్ చేసినా.. మా ప్రాజెక్ట్ డెడ్ లైన్ వల్ల సింగ పెరుమాళ్ ఊరెళ్ళ లేకపోయాడు. కానీ.. ఈలోగా. గొడవ ఇంకో రూపు దిద్దుకుందిట.



ఉదయం 5 గంటలకి సింగం తండ్రి కాల కృత్యాలు తీర్చుకోవటానికి ఇంటి ఆవరణలో కూలిన కంచె వైపున్న బాత్ రూం వైపు నడుస్తుండగా..  ఏదో తేడా గా అనిపించి కాస్త జాగ్రత్త గా చూస్తే.. ఒక ఎర్రటి చీర..ఒక స్త్రీ శరీరం.. ఆయన కి ఒళ్ళు జలదరించి ఒక్క పరుగులో ఇంట్లోకి చేరి కుటుంబాన్ని లేపారట..  అవతల పార్టీ వాళ్ళు మర్డర్ చేసి శవాన్ని ఇటు పారేసారని భయం వేసి..అందరూ కలిసి వెడదామని లాంతరూ అవీ తీసుకునేలోపల మళ్ళీ ఒక పెద్ద అరుపు వినిపించిందట..  ఏంటా అని చూస్తే.. పక్కావిడ వణుకుతూ ఇంట్లోకి పరిగెట్టటం చూసారట..


నేనూ చాలా ఉత్కంట గా ముందుకు వంగి వింటున్నా..  అందరూ జాగ్రత్త గా వెళ్లి చూస్తే.. ఏమీ లేదుట...  అందరికీ ఇది ఒక మిస్టరీ అయిపొయింది. కంచెకి అవతల వాళ్ళూ, ఇవతల వాళ్ళూ  చర్చల్లో ములిగిపోయారు.. కానీ.. ఎవరు చేసి ఉంటారీ పని? అన్నది తెలుసుకోలేక పోయారు. 


' ఇంక లాభం లేదు .. సింగం .. ఇంటికి రా..' అని పిలుపు తండ్రి నుండి అందుకున్న సింగ పెరుమాళ్ హుటాహుటిన బయల్దేరి ఊరెళ్ళాడట... ఇక్కడి వరకూ  చెప్తూ ఉండగా ఫోన్ మోగిందని మాట్లాడుతున్నాడు సింగం..   ఆ 2 నిమిషాల్లో ఎన్నో ఆలోచనలు నన్ను కమ్మి పారేశాయి..  'అబ్బా.. నా జీవితం ఎంత చప్ప గా ఉంది... అయితే  ఫాక్షన్ సినిమాల్లో చూపించేంత  ట్విస్టులతో జీవితాలు ఉన్న వాళ్ళల్లో ఒకరు నా టీం లో ఉన్నారా.. హెంత అదృష్టం!! సింగం ఊరెళ్ళి మిస్టరీ సాల్వ్ చేసాడా? ఇలాగ..  ఒక్కసారి ఫోన్ లాక్కుని విసిరి గొట్టి.. 'తర్వాత ఏమైంది? ' అని అడుగుదామనుకున్నా.. కానీ.. 'అసలే అజ్ఞాత వాసం లో ఉన్న ఇంద్ర ' లాంటి సింహ అని గుర్తొచ్చి.. ఎదురు చూస్తూ కూర్చున్నా..  


ఈలోగా ఫోన్ కాల్ అయి.. మళ్ళీcontinue చేసాడు సింగం..



సింగం  తల్లికి మంచి నెట్వర్క్ ఉందిట ఊళ్ళో.. ఆవిడ వేగుల ద్వారా సమాచారం సంపాదించింది.. ఏంటయా అంటే..   వీరి దొడ్లో మల్లెలు విరగబూస్తాయట. ఒక కొంటె పిల్లకి మల్లెల పిచ్చిట. తనుండే గుడిసె లో మల్లె తీగ లేదు.. ఎవర్నడిగినా, 'అబ్బే!! మాకే సరిపోవట్లేదు..' అనేస్తున్నారట. ఇలా కాదని ఉదయమే వచ్చి కోసుకుంటోందిట పిచ్చి పిల్ల!!!  సింగం తల్లి ఈ విషయం చెప్పగానే.. అందరూ 'అమ్మయ్య' అని రిలాక్స్ అయిపోయారట.  


సింగం తల్లి .. 'అయ్యో పాపం.. పక్కింటావిడ భయపడింది.. ఆవిడకూ చెప్దాం..' అని అందరూ వారించినా వాళ్ళింటి వైపు కంచె దగ్గరికి చక చకా నడిచిందట.  15 ఏళ్ళుగా భూమి గొడవల కారణాన మాట్లాడటం మానేసినావిడ ఇంట్లోకి తొంగి చూస్తూ 'పార్వతమ్మా.. ' అని పిలుస్తుంటే.. 'పోన్లే ఆడ వాళ్ళని ఆపటం ఎందుకూ '  అని  ఊరుకున్నారట అవతల పక్షం వాళ్ళు. .. ఈ మల్లె పూల దొంగ విషయం చెప్పగానే కంచె కి రెండు పక్కల వాళ్ళూ 'హమ్మయ్య' అనుకుని నవ్వుకుని.. ఒకళ్ళకొకళ్ళు సారీలు చెప్పుకుని కలిసిపోయారుట...


ఓస్ .. ఇంతేనా? నేనేదో.. ఒక Sherlock Holmes లా మా సింగం వెళ్లి మిస్టరీ సాధించాడేమో నని సంబర పడుతుంటే. నెత్తిన చల్లని నీళ్ళు జల్లినట్టైంది..   సరే.. ఏం చేస్తాం.. నా జీవితం లో ఈ మాత్రం మిస్టరీ, గొడవలూ, అజ్ఞాత వాసాలూ లేవు.. ఆ విధం గా నాకు తెలిసిన ఒక్క మనిషి సిమ్గమే కదా అని సద్ది చెప్పుకుంటున్నా..   

సింగం.. కంటిన్యూ చేసాడు..

కానీ కుల సంఘాల వాళ్ళూ, రాజకీయ నాయకులూ, మాత్రం అలాగ మధ్యలో కలిసిపోతే కుదరదు.. అని హెచ్చరిక లు రోజూ..చర్చలు.. మాఅమ్మా వాళ్ళకీ ఏమీ పాలు పోదు. చుట్టాలువెనక్కి తగ్గద్దని ఒకటే ఒత్తిడి.  ఇంటి బయటకి రావాలంటే భయం.. భూమి గొడవ లేదు. కానీ ఊరి గొడవ  పెరిగింది.

'అదిగో ఈ ఒత్తిడి భరించలేక నాలుగు రోజులు తల్లి దండ్రులని తీసుకుని వచ్చాను... అన్నాడు సింగ పెరుమాళ్.. 

'మరి ఇప్పుడు? '  అని అడిగితే 'ఏముంది? నాలుగు రోజులు ఇక్కడే ఉంటారు.ఊరికి వెళ్ళినా గొడవలు తగ్గకపోతే..మాత్రం.. నేను వెళ్లి.. నా పధ్ధతి లో సరిచేస్తాను.. అన్నాడు..  ఎందుకైనా మంచిది.. అని  పధ్ధతి అంటే  ఏంటో అడగలేదు నేను.   

లంచ్ చేసాక క్యూబ్ కి నడుస్తూ.. 'అన్నట్టు ఈ కథ నేను బ్లాగ్ లో రాసుకోవచ్చా? కావాలంటే .. పులి పెరుమాళ్/పులి రాజా.. ఇలాగ మార్చమంటే మారుస్తా.. అని అడిగా.. గట్టిగా నవ్వి.. 'పేరేమీ మార్చక్కరలేదు..రాయి' అని.. 'అన్నట్టు.. కృష్ణాజీ.. నేను కొత్త బగ్స్ ఇచ్చారు రెండు.. తీసుకోలేను..పేరెంట్స్ ని బయటకి తీసుకెళ్ళాలి.. మీరే చేసేస్తారా?' 

అని 'వినమ్రం' గా రిక్వెస్ట్ చేసాడు సింగం..  'అయ్యో.. ఈ మాత్రం దానికినోరు తెరిచి అడగాలా? నో ప్రాబ్లం..నేను చేస్తాను.. ' అనేసాను...  అదేదో.. నాకు ఎంత అదృష్టం పట్టింది? ఆ కొత్త బగ్స్ కూడా సాల్వ్ చేసే అవకాశం వచ్చింది? ' అన్నట్టు ఎక్స్ ప్రెషన్ పెట్టి :-(










34 comments:

శ్రీరామ్ said...

:-)

Two new bugs per day...cool

Indian Minerva said...

మీరెంత మంచి టీ.ఎలో కదా...

మనసు పలికే said...

హహ్హహ్హా.. కృష్ణప్రియ గారు, భలే ఉంది మీ సింగం కథ;) మమ్మల్ని కూడా సస్పెన్స్‌లో పెట్టి భయపెట్టేశారు:(

గిరీష్ said...

ఎందుకైనా మంచిది.. అని పధ్ధతి అంటే ఏంటో అడగలేదు నేను.. :)
ee saari mee singam mahesh babu style lo velli, athanimeeda gun petti, nuvvu padivelu iccina S.I ki nenu laksha rupayalu istanu, tractor tiragabadi chaccipoyadu ani raseyamantadu.. :)

ఆ.సౌమ్య said...

హహహ బలే సింగం బలే కథ...ఇంతకీ మీ సింగం ఊరిపేరు తిరునెల్వేలా?..ఓసారి అడగండి.

కథ కంటే మీరు పేరు పెట్టిన టైటిల్ సూపరు...కథంతా చదివాక ఆ టైటిల్ చూసి ఎంత నవ్వుకున్నానో...నిజంగా మీకు మీరే సాటి ఇలాంటివి రాయడంలో :)

Kathi Mahesh Kumar said...

:) :)

కృష్ణప్రియ said...

@ శ్రీరామ్,

అమ్మో.. 2 బగ్స్ మాత్రమే.. రోజుకి రెండు బగ్స్ తీసుకోవాల్సి వస్తే.. దానికి బదులు సింగం కంటి చూపు తో కాలిపోవటం బెటర్.

@ Indian Minerva ,

థాంక్సండీ.. మీరన్నా గుర్తించారు. కాస్త మా బాసుకి కూడా చెప్తారా ప్లీజ్?

@ మనసు పలికే,
థాంక్స్ అపర్ణ!

కృష్ణప్రియ said...

@ గిరీష్,

:)) బాగుంది

@ ఆ.సౌమ్య ,

థాంక్స్! :) కనుక్కున్నాను.. నా పక్క క్యూబేగా.. కాదట. ఏదో నోరు తిరగని తమిళ ఊరు పేరు చెప్పాడు. మీకు నచ్చినందుకు చాలా సంతోషం గా ఉంది.

@ మహేష్,

రేటింగ్ తగ్గినట్టుంది ఈసారి.. (3 స్మైలీ నుండి 2 స్మైలీ కి దించారు)

మధురవాణి said...

హహహ్హా.. సూపర్ ఫ్యాక్షన్ స్టోరీ చెప్పారుగా! :) :)
చాలా బాగా రాశారు ఎప్పట్లాగే! :)

మాలా కుమార్ said...

ఐతే మీకు ఓ ఫాక్షనిస్ట్ ఫ్రెండ్ వున్నాడన్న మాట :))

Sravya V said...

మాంచీ ఫ్యాక్షన్ సినిమా చూపించారు :)
కానైతే మీ పోస్టు చదివాక కొద్ది గా భయమేస్తుంది . కొత్త గా లీడ్ పొజిషన్ ఇచ్చారు కదా అన్న ఆనందం లో ఎడా పెడా టీం మెంబెర్స్ ని డెడ్ లైన్ల గురించి నిలదీస్తున్నా , వాళ్ళలో ఎంతమందికి ఇలాంటి బాక్గ్రౌండ్ ఉందొ ఏమో ఇప్పుడు అర్జెంట్ గా తెలుసుకోవాలి :(

రాధిక(నాని ) said...

:)) ఏమి ఫాక్షన్ స్టోరీ చూపించారు! చాలా బాగుంది.:))

కృష్ణప్రియ said...

@ మధురవాణి,

:) ధన్యవాదాలు..

@ మాలా కుమార్ గారు,

నెమ్మది గా మాట్లాడే కో వర్కర్స్ తో కాస్త నెమ్మది గా ఉండాలని అర్థమైంది....అదన్నమాట.. :)


@ శ్రావ్య,

:) థాంక్స్. నా పోస్ట్ వల్ల మీరు మరీ దూరం వెళ్ళకుండా .. కాపాడగలిగానన్న మాట.. చూశారా నా బ్లాగ్ చదివితే అన్నీ లాభాలే..

sphurita mylavarapu said...

భలే suspence సినెమా చుపించారండీ...

పైకి హాస్య ధోరణి లో రాసినా అంతర్లీనం గా చిన్న చిన్న సమస్యల్ని పెద్ద గొడవలు గా చుట్టూ వున్నవాళ్ళు ఎలా మారుస్తారో చక్కగా చెప్పారు.

మీ blog చదివే మేమే ఇంత enjoy చేస్తుంటే మీతో కలిసి పని చేసే collegues, మీ friends & family మీ company ని ఎంతగా enjoy చేస్తారా అని కుళ్ళుకుంటున్నా...హ హ హ

KumarN said...

క్రిష్ణప్రియా, దుర్మార్గులు సుమీ మీరు, కరక్టుగా మంచి సమయంలో, సింగం కి ఫోన్ బ్రేక్ ఇచ్చారు :-)
As always, the post reflects your unique style

హరే కృష్ణ said...

ఇంద్ర దగ్గర వాల్మీకి లా ఉండే అబ్బాయి సింగమలై ఆ ?
పోస్ట్ ఎప్పటిలానే సూపర్ :)

Anonymous said...

కృష్ణప్రియ గారు,
మీ టపాలు దాదాపు అన్ని చదువుతుంటాను. ప్రతి దానికి కామేంట్ రాయను. కాని ఈ టపా చదివిన తరువాత ఒక విషయం రాయలనిపించింది కనుక రాస్తున్నాను.
చిరంజీవి మంచి సక్సెస్ సినేమాల ఊపు మీద ఉన్నపుడు కొన్ని యావరేజ్ సినేమాలు కూడా సుపర్ హిట్ అయిపోయేవి. దానికి కి కారణం చిరంజీవి తెలుగు సినేమాలలో మొదలు పెట్టిన కొత్త ఒరవడి. అప్పట్లొ సినేమా ఎలా ఉన్నా చిరంజీవి వున్నాడంటె కనీసం ఒకసారి సినేమా చూడాలి అని నిర్ణయించుకొనే వాళ్ళం. ఆ సినేమా బాగున్నా లేక పొయినా. చిరంజీవిలా మీరు ఒక కొత్త ఒరవడిని బ్లాగలలో పెట్టారని నేను అనుకొంట్టున్నాను. మీరు చిన్న విషయాన్ని మీ శైలి ద్వారా ఒక రేంజ్ తీసుకొని వెలుతున్నారు. రాసిన టపాలో ఎంత విషయం ఉందో అని అర్థం చేసుకొనే లోగానే మీ టాపా మొత్తం చదివేయటం జరిగిపోతున్నాది. సినేమాలలో చిరంజీవి ఎలానో బ్లాగులలో మీరు అలా, మీకు నేను లేడి మేగా రైటర్ అని బిరుదు ఇస్తున్నాను.అందుకోండి.

Mauli said...

క్రిష్ణప్రియ గారు,

టపా చదవలేదు కాని, మీకు అభిమానులు ఇచ్చిన బిరుదు 'లేడి మేగా రైటర్' మాత్ర౦ సూపర్. మీకు ఇప్పటికే ఫాన్స్ అసోసియేషన్ వు౦డాల్సి౦ది :)

లత said...

మీ పోస్ట్ లు భలే ఉంటాయండి,
చాలా బాగా రాస్తారు

కృష్ణప్రియ said...

@ Madhu Mohan,

:) థాంక్స్.. మంచి ఐడియా.. నా బ్లాగ్ కి స్వాగతం!

@ రాధిక,

:) ధన్యవాదాలు...


@ స్ఫురిత,

:)) చాల థాంక్స్..

ఇక నా కంపెనీ గురించి అంటారా..

డెడ్ లైన్లు మిస్ అవుతున్నప్పుడు నా టీం మెంబర్లనీ,
పరీక్షలప్పుడు మా పిల్లలనీ,
తన వైపు చుట్టాలు వచ్చి వెళ్ళాక మా వారినీ...


అడిగి చూస్తే చెప్తారు రియాలిటీ ఏంటో ;-)

అన్నట్టు ప్రొఫైల్ పిక్చర్ కోసం వెయిటింగ్.. :)

కృష్ణప్రియ said...

@ KumarN,

:) నేను చేసిందేదీ లేదు.. ఆ పరమాత్ముడు ఆడించిన నాటకం..

Thanks a lot...


@ హరేకృష్ణ,

ధన్యవాదాలు!
ఇంద్ర సినిమా అంత గుర్తు లేదు.

@ లత,

థాంక్స్ థాంక్స్!

కృష్ణప్రియ said...

@ శ్రీకర్,

:) థాంక్స్... బిరుదు ని సవినయం గా స్వీకరింపడమైనది..

కొత్త ఒరవడి సృష్టించానన్నారు.. ధన్యవాదాలు.. మీ అభిమానం. ఇంతకీ టపా లో విషయం గురించి చెప్పనే లేదు ;-)


@ మౌళి,

వచ్చి టపా చదవకుండా వెళ్ళిపోయారా? :) Anyways..thanks!

Sasidhar Anne said...

Krishnapriya garu.. Meeru entha manchi TL kada. .maa TL emo valla chantodini chusukovali ani naaku rojuki two bugs ekkuva icchesthondi.. twaraga vacchi maa team lo cheripondi please... :)

meeru tension padatame kakunda aa ammayi vishyam daggara mamalani kooda tension pettesaru :)

Unknown said...

కృష్ణ ప్రియ జి .. నాకెందుకో మిమ్మల్ని బకరా చెయ్యడానికి మీ సింగం ఆడిన నాటకమేమో అని డౌటు కొడుతోంది ..
నాకెందుకో నా ఫ్లాష్ బాకులు అన్ని గుర్తోచేస్తున్నాయి .. నేను అసలే మా కొనసీమకి నాగమ్మ టైపు .. :P

మంచు said...

ఇంట్రడక్షన్ చూసి కనీసం రెండు కసక్ కసక్ లు అన్నా ఉంటాయనుకున్నా...ఒక్క మర్డర్ కూడా లేకుండా ముగించేసారేంటండీ మీరు :-((

Anonymous said...

మీరు రాసిన టపా బాగ లేక పోవటమా? హెంత మాట. మీ టపాలు బాగున్నాయా? లేవా? అనే వాటికి అతీతం. అందువలననే నేను మిమ్మల్ని "లేడి మెగా రైటర్" అన్నది. ఒకసారి ఎవరైనా మీ బ్లాగు లో ఒక టపా చదివారంటె మళ్ళి వెతుకొంట్టూ వచ్చి చదువుతారని నా అభిప్రాయం. గాస్ మీద నుంచి వేడి నీళ్ళు కాళ్ళ మీద పడి బొబ్బలెక్కాయను కోండి, దాని మీద కూడా మీరొక టపా రాస్తే అందరు చదివి చాలా బాగుంది ఎప్పటి లాగానే అని కామేంట్లు రాయించగల మాంచి శైలి మీకు ఉంది. ఒక్క సంవత్సరం లో మీరు రాసిన 51 టపాలకి 21,580హిట్లు.

కృష్ణప్రియ said...

@ శశిధర్,

:) సింగం అంటే..బాక్ గ్రౌండ్ చూసి కాస్త జంకి ఎదురు బగ్స్ తీసుకున్నా.. కానీ. మామూలు గా.. అలా జరగదు..మరి అయినా పర్వాలేదంటే మీ కంపెనీ కి వచ్చేస్తా..


@ కావ్య,

:) నాకూ ముందర అదే డౌట్ వచ్చింది. కానీ సింగం అంటే మజాక్ కాదని కొన్ని రుజువులు కూడా దొరికాక నమ్మక తప్పలేదు. బాబోయ్ మీరూ నాగమ్మ టైపా.. ఐతే కొద్దిగా మీరన్నా భయం గానే ఉంది.

@ మంచు,
:) బాగుంది.. గట్టిగా అంటే మళ్ళీ నా డైరీ మూత పడుతుందని.. బోల్డు త్యాగం చేసి బగ్స్ తీసుకున్నా ----


@ శ్రీకర్,

Thanks a lot!.. You made my day...

సుజాత వేల్పూరి said...

ఇదేంటి? అలా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు కల్సిపోతే ఊళ్ళో వాళ్ళ పరిస్థితేం కావాలి? నేనూ ఒప్పుకోను వాళ్ళు కల్సిపోడానికి!

మొత్తానికి సింగం లాంటి ఫాక్షన్ లీడర్ మీ టీములో ఉన్నందుకు, మీరు ఇక్కడ తెలుగు బ్లాగుల్లో మాతో ఉన్నందుకు మాక్కూడా గర్వంగా ఉంది. మాక్కూడా కొద్దో గొప్పో faction బాక్ గ్రౌండ్ ఉన్నట్టు ఫీలైపోవాలనిపిస్తోంది :-))

Sasidhar Anne said...

@aithey naa peru kooda samara simha reddy ano.. reddy naidu ano marchukunta.. appudu enchakka meeru maa team ki vacchesina.. naaku problem vundadhu

Ram Krish Reddy Kotla said...

సింగం కేక... పోస్ట్ రాసి మీరు పొలికేక :))

Jai Telangana said...

Baagundandi mee suspense.

కథాసాగర్ said...

మీ సింగం కథ చదవుతుంటే నాకెందుకో బ్రహ్మానందం పోషించిన నెల్లూరు పెద్ద రెడ్డి పాత్ర గుర్తుకొచ్చింది ..
మీ సింగం పాత్ర లో బ్రహ్మానందాన్ని ఊహించుకుని మీరు రాసిన సింగం గారి ఫ్లాష్ బ్యాక్ కథ చదివి తెగ నవ్వుకున్నాను..

కృష్ణప్రియ said...

@ సుజాత,
:) అదే మరి.. చూసారా.. సింగం వల్ల నాకూ, నా వల్ల మీకూ కూడా కాస్త బాక్ గ్రౌండ్ వచ్చింది కదూ.. నేనూ అదే అంటున్నా తనతో.. వెనక్కి తగ్గద్దని..

@ Sasidhar Anne,

హమ్మో.. టీం అంటూ మారితే ఇక ముందర టీం మెంబర్స్ పేర్లు సాత్వికం గా ఉన్నాయా లేదా అని చూసుకుని మరీ జాయిన్ అవుతా..

@Kishen Reddy,

:) థాంక్స్.. కిషన్ రెడ్డి గారు!

@ Jai Telangana,
:-) ధన్యవాదాలు! నా బ్లాగ్ కి స్వాగతం..

@ కథా సాగర్,
థాంక్స్.. నా బ్లాగ్ కి స్వాగతం!

స్నిగ్ధ said...

బాగుందండీ...మీ సింగ పెరుమాళ్ కథ..మంచి ట్విస్ట్లున్న సినిమాని చూసినట్లయ్యింది...కథ మంచి రసపట్టులో ఉందనుకుంటే చివారాఖరలో సప్పా మేటర్ లా తేలిపోయిందేమిటండీ?ఏదైతేనేం..ఆల్ హేపీస్.. మీ సింగంది మదురై చుట్టుపక్కనున్న ఊరా??
కృష్ణ గారు,మీరెంత మంచి టి.యల్..నన్ను కూడా మీ టీం లో తీస్కోండి....
:)..మా టీంలో ఈసారెవరైనా ఏమైనా ఉంటే నా వెనకాల కృష్ణ గారు ఉన్నారని చెప్తా...ఎలాగూ మీకు సింగం గారి సపోర్ట్ ఉంటుంది కదా...

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;