Wednesday, August 24, 2011

అమ్మ ఊరెళ్తే? !!!



చిన్న పని పడింది. రెండు రోజులకి ఎలాగైనా హైదరాబాద్ కెళ్లి రావాలి. చూస్తే ఈ వారాంతం తప్ప అవకాశమే లేదు. పెద్దదానికి ప్రాణ స్నేహితురాలి పుట్టినరోజట! పైగా రోబోటిక్స్ క్లాస్ ట. చిన్న దానికి స్కౌట్స్ & గైడ్స్ పిక్ నిక్ ట. అస్సలూ కుదరదు.


పిల్లల్ని తీసుకెళ్లకుండా వెళ్తే ఏడుస్తారు. నాకూ అయ్యో అనిపిస్తుంది ఎలాగా? ఏం చేద్దాం? అని ఆలోచిస్తుంటే పిల్లలు పోనీ నువ్వొక్క దానివే వెళ్లు.. మేముంటాం. అనేసారు. మా వారూ, అత్తగారూ కూడా పర్వాలేదు వెళ్లు అని అభయ హస్తం ఇవ్వగానే ..చివరకు మనసు చిక్కబెట్టుకుని టికెట్టు కొనుక్కొచ్చుకున్నాను.

ఇవ్వాళ స్కూల్ నుండి ఇంటికి రాగానే పిల్లల్ని ‘ఏమ్మా! బాగా ఉంటారా నేను లేకపోతే.. ‘..అని కాస్త బెంగ తో కూడిన అనురాగం తో అడిగాను. అంతే ఇక కలల ప్రపంచం లోకి అలా అలా వెళ్లి పోయారు.

చిన్నదానికి కాస్త పొగరెక్కువకదా.. ఏది వినాలనుకోలేదో అదే అనేసింది. ‘ఏం పర్వాలేదమ్మా! We will be more than fine!, infact it will be excellent!’ ‘అబ్బా దీనికి బొత్తి గా దాపరికం లేదు..’ అని విసుక్కున్నా. అది ఊరుకుంటుందా? అరమోడ్పు కన్నులతో.. దాచాలని తెలియదాయె బోల్డు ఆనందం తో చెప్పింది.



1. లేస్ చిప్స్ అలా హాయిగా తినచ్చు (అబ్బా.. ఎప్పుడూ అవేనా?)
2. రోజంతా టీ వీ చూడచ్చు (హమ్మో హమ్మో)

3. బాత్ రూమ్ లో ఒక రివెర్ చేయచ్చు. (నా తల్లే)

4. రెయిన్ లో ఎప్పుడూ హాయిగా ఆడుకోవచ్చు (అఆహా)

5. మూవీస్ , కార్టూన్స్ ఇష్టం వచ్చినట్టు చూడచ్చు (చూడండి చూడండి. అసలు కేబుల్ కనెక్షన్ తీయించి వెళ్తే సరిపోతుంది)

6. నో స్టడీస్ ఓన్లీ ఆటలు (ష్యూర్..)

7. బాత్ చేయక్కరలేదు. (హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్ )

8. మార్నింగ్ టు ఈవెనింగ్ ఆడుకోవచ్చు (ఇందాకా చెప్పారు గా..)

9. అందర్నీ మాడ్,, స్టుపిడ్ అలా బాడ్ వర్డ్స్ అనచ్చు (అని చూడండి తెలుస్తుంది)

10.మాగీ , పిజ్జాలు తినచ్చు. పప్పు వైపు కూడా చూడక్కర్లేదు (నాలుగు రోజుల అవే తింటే.. ప్లీజ్ పప్పన్నం పెట్టు అని మీరనరా? నేను విననా?)

11.తింటూ మధ్య మధ్యలో బాత్ రూమ్ కెళ్ళచ్చు ( ఛీ...)

12.ఒక డాగ్ కొనచ్చు, కాట్ కొనచ్చు (ఆహా. రెండ్రోజుల్లో రెండు కొనేస్తారా.. వచ్చాక నేను మళ్లీ ఇచ్చేస్తా!)

13.ఫ్రెండ్స్ ని పిలిచి మంచాల మీద ఎగరచ్చు (రోజూ ఎగురుతారు గా మీ మంచాల మీద. మా మంచాన్ని కూడా వదలరా.. లాక్ చేసి పోవాలి తప్పదు)

14.జొ మన్ మె ఆయె వొహ్ కర్సక్తె హైన్ (మళ్లీ దీని మొహానికి హిందీ..)

15.ఒక కళ్ళజోడు చేయించుకోవచ్చు (ఓర్నాయనో..)

16.జుట్టు ముళ్ళేసుకోవచ్చు (దానికో పిచ్చి అలవాటు.. మాన్పించలేక చస్తున్నాను)

17.నాయనమ్మ ఐపోడ్ ని లాగేసుకుని, నాన్న లాప్ టాప్ లో ఆడచ్చు.. (అత్తగారికీ, ఈయన గారికీ చెప్పి వెళ్లాలి)

18.జడలు వేసుకోకుండా హాయిగా తిరగచ్చు.. (తిరగండి.. తిరంగండి నేనోచ్చాక కసి గా చిక్కులు తీస్తుంటే తెలుస్తుంది అమ్మగారికి)



పెద్దది ముసి ముసి గా నవ్వుకుంటూ.. వచ్చి నా భుజాల మీద చేతులేసి.. ‘లేదమ్మా! We will miss you a lot!’ అని చిన్నదాని వైపు చూసి నవ్వుతోంది.. పైగా.. చూశాను దానికి గీతా బోధ చేస్తుంటే.. ‘ఇవ్వన్నీ నువ్వు అమ్మ కి చెప్పేయకు. మాడ్’

‘అమ్మా! అక్క నన్ను మాడ్ అంటోంది...’ కంప్లెయింట్!


వామ్మో ఎంతకి తెగించారు? పోనీ ట్రిప్ కాన్సెల్ చేసేసుకుంటే? ఊర్కే అన్నా లెండి. మా చిన్నప్పుడు మా అమ్మ ఒకటి రెండు రోజులకి ఊరెళ్తే మేమూ అంతే.. మళ్లీ మాట్లాడితే ఇంకాస్త ఎక్కువేమో.. కానీ నా పిల్లలకి కాస్త మంచి పోలికలు రావచ్చు కదా నా పోలికలే ఎందుకు రావాలీ.... (((





38 comments:

రసజ్ఞ said...

హహహ బాగుందండి. చిన్నప్పుడు అమ్మా ఊరెళ్తాను సంతోషమే కానీ అది ఒక్క రోజే రెండో రోజే గుర్తొచ్చేస్తుంది తెగ.హబ్బా ఎప్పుడో ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది అనుకుంటాం కానీ తను లేనప్పుడు అయ్యో నన్ను పట్టించుకునే వాళ్ళే లేరే అనిపిస్తుంది. మంచి టపా బాగా రాసారు.

Sravya V said...

హ హ హ :)))

SD said...

కానీ నా పిల్లలకి కాస్త మంచి పోలికలు రావచ్చు కదా నా పోలికలే ఎందుకు రావాలీ

ఎక్కడ్నుంచి రావాలో శెలవిచ్చేరు గాదు. :-) యధా అమ్మా, తధా కూతుళ్ళు. యద్భావం తద్భవతి :-)

Krish said...

మీరు వూరు వెళ్తే వెళ్ళండి కాని ఎవరిక్కావాల్సినవి వాళ్ళకి అరేంజ్ చేసి వెళ్ళండి. ఇంట్లో వాళ్ళకే కాదు, మా లాంటి మీ బ్లాగ్ అభిమానులకు కూడా ఓ రెండు మూడు టపా లు రాసేసి వెళ్ళండి మరి!!!

తృష్ణ said...

"కానీ నా పిల్లలకి కాస్త మంచి పోలికలు రావచ్చు కదా నా పోలికలే ఎందుకు రావాలీ.... ((("

కొసమెరుపు అదిరింది :))

తృష్ణ said...

"కానీ నా పిల్లలకి కాస్త మంచి పోలికలు రావచ్చు కదా నా పోలికలే ఎందుకు రావాలీ.... ((("

కొసమెరుపు అదిరింది :))

లత said...

మీ పిల్లల ముచ్చట్లు భలే ఉంటాయండి.
మనకే బెంగ కానీ,వాళ్ళు బాగానే ఉంటారు ఒకటి రెండు రోజులు అయితే

స్నేహ said...

:-)మీ చిన్నమ్మాయి భలే నచ్చేసింది.

ఇందు said...

హ్హిహ్హిహ్హి :))))))))

అరుణ పప్పు said...

మావాడికి మీ పోస్టు చదివి వినిపించాను. వాడు నోటికి చేతులడ్డంపెట్టుకుని కాసేపు నవ్వాపుకొని తర్వాత పడీపడీ నవ్వడం మొదలెట్టాడు. తర్వాత సీరియస్ గా మొహం పెట్టి ‘అంతే, అంతే. అలాగే చెయ్యాలి. పోనీ అమ్మా ఈసారి హైదరాబాద్ నువ్వొక్కదానివే వెళ్లొచ్చేసేయ్, మై స్వీట్ మమ్మీ... మై లడ్డూ మమ్మీ...’ అంటున్నాడు. ఆయనగారికి ఏడేళ్లు.

భాస్కర రామిరెడ్డి said...

"ఏం పర్వాలేదమ్మా! We will be more than fine!, infact it will be excellent!"


Exactly... We are striving for freedom at home :-)


good post.

Anonymous said...

ఈవేళ,మీలాటి అమ్మల్నే దృష్టిలో పెట్టుకుని ఓ టపా వ్రాశాను.

ఆత్రేయ said...

పులి కడుపున మ్యావ్ ? हो नहीं सकता !

Anonymous said...

అబ్బా ఇన్నాళ్లు ఇంత మంచి బ్లాగు ఎలా మిస్సయ్యాను.
చాలా బాగుందీ టపా కానీ మా అమ్మ ఊరెళ్తే మా చెల్లెళ్లు నిజంగానే ఏడ్చేసేవారు. గొడవ చేస్తే దానికి ఇబ్బంది పడేవాళ్లు కూడా ఉండీ తీరాలని వాళ్ల ఫిలాసఫీ మరి. అమ్మ చేత

Anonymous said...

sry amma cheta annadi jst mistake

హరే కృష్ణ said...

hahaha:-)

మురళి said...

మీ చిన్నమ్మాయి మరీ నచ్చేస్తోందండీ.. భలే ఫ్రాంక్ కదూ :)))
అన్నట్టు ఫాంట్ సైజు సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది :((

కొత్తావకాయ said...

మీ చిన్న టపాకాయ సీమటపాకాయే. నో డౌట్.

కృష్ణప్రియ said...

@ రసజ్ఞ
థాంక్స్! :) కరెక్ట్.
@ శ్రావ్య,
:)
@ DG,
:) అంతే నంటారా? మేనత్త పోలికో, మేనమామ చారికో రాకుండా పోతుందా అన్న ఆశ.
@ Krish,
:) థాంక్స్! అసలీ నేల రాసినంత ఎప్పుడూ రాయలేదోమో.. బ్లాగ్ లు చదివే వారికి విసుగోస్తుందేమో అని అనుమానం కూడానూ
@ తృష్ణ,
:) థాంక్స్

కృష్ణప్రియ said...

@ లత,
నిజమే! మళ్లీ మీ బ్లాగుల్లో కామెంట్లు రాయాలంటే ఫైర్ ఫాక్స్ వాడాల్సి వస్తుందని బద్ధకం గా ఉంది. internet explorer ఎందుకో పని చెయ్యట్లేదు.
@ స్నేహ,
థాంక్స్!
@ ఇందు,
:)
@ అరుణ పప్పు,
:) చూసారా? మా అమ్మాయికీ ఏడేళ్ళే. పిల్లలంతా ఇంతే :))

కృష్ణప్రియ said...

@ భాస్కర రామి రెడ్డి గారు,
థాంక్స్! చాలా కాలానికి కనిపించారు.
@ లక్ష్మీ ఫణి గారు,
చదివాను,...
@ ఆత్రేయ,
అంతే నంటారా? :-((
@ పక్కింటబ్బాయి,
థాంక్స్! ఒక్కో వయస్సూ ఒక లాగా ఉంటుందనుకుంటా. ఇప్పుడిలా ఉన్నారు కొన్నాళ్ల క్రితం పట్టుకుని ఎద్చేసేవారు.
@ హరే కృష్ణ,
:)

కృష్ణప్రియ said...

@ మురళి గారు,
అవును . ఈ ఫాంట్ ప్రత్యేకం గా సైజ్ పెంచాలి ప్రతిసారీ. డీ ఫాల్ట్ గా ఎలా మార్చాలో చూడాలి.
@ కొత్తావకాయ,
:)థాంక్స్!

ఆ.సౌమ్య said...

హహహ మీ చిన్నది బలే తుంటరి :)

చిన్నప్పుడు అమ్మ మమ్మల్ని వదిలి ఊరెళ్ళిన జ్ఞాపకం లేదు. కొంచం పెద్దయ్యాక అమ్మ ఊరెళ్తే బెంగగా ఉండేది గానీ ఓ పక్క సరదగా ఉండేది నాన్నా వంట తినొచ్చని. నాన్న, అమ్మ కంటే బాగా వంట చేస్తారని ఓ అభిప్రాయం. ఎందుకంటే అప్పుడప్పుడూ చేస్తారుగా...బాగ నెయ్యిలు, నూనెలు పోసి వండుతారు...రుచి అమోఘం అన్నమాట.

కానీ ఇంకాస్త పెద్దయ్యాక వంట, ఇంటి బాధ్యతలు చూసుకునే వయసొచ్చాక అమ్మ ఊరెళ్ళిపోతే చాలా బెంగపడిపోయేదాన్ని...ఇంటి పనులు చెయ్యాల్సివస్తుందని. నేను, మా చెల్లి తెగ కీచులాడుకునేవాళ్ళం, పనులకు వంతులేసుకునేవాళ్ళం. :)

వెన్నెల్లో ఆడపిల్ల said...

చిన్నప్పుడు నేను మా చెల్లి కూడ ఇలాగే అనేవాళ్లం అంటే మరీ అంత ఫ్రాంక్ గా కాదు అనుకోండి.కాకపొతే వెళ్లాక ఏం తినాలో ఏం చెయ్యాలో తెలియక ఏడుపు వచ్చేది అనుకోండి...మీ అమ్మాయి ఈ జనరేషన్ ని మనకి చూపిస్తోంది అంతే . Liked it :-)

మధురవాణి said...

హహ్హహహా... బావుంది మీ పిల్లల ఉత్సాహం.. అది చూసి మీరు ఉడుక్కోవడం.. ;) :D
మా అమ్మ ఎప్పుడూ ఇలా ఊరెళ్ళలేదు.. నేనే హాస్టళ్ళ చుట్టూ తిరిగుతూ ఇల్లొదిలేసి పోయాను గానీ.. :((

స్నిగ్ధ said...

భలే ఉందండి మీ చిన్న అమ్మాయి చెప్పింది!!!సో క్యూట్!!మేమైతే మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్తే తెగ ఏడ్చే వాళ్ళము...దానితో వాళ్ళు ప్రయాణం అన్నా మానేసే వారు లేదా మమ్మల్ని వెంటపెట్టుకు వెళ్ళేవారు...
:)

చాణక్య said...

హిహిహి.. :)))))

చిన్నపిల్లలేంటండి. నాకు ఇప్పటికీ ఒక్కడ్నే ఇంట్లో వదిలేసి అందరూ ఏదైనా ఊరెళ్ళిపోతే ఎంత బాగుంటుందో..! వామ్మో.. ఏంటి నిజాలన్నీ కక్కెస్తున్నాను? మా అమ్మ, అక్క చూశారంటే నా పని అయిపోయినట్టే. సరే వస్తానండి. పోస్ట్ మాత్రం ఎప్పట్లాగే అదిరిపోయింది. : )

కొత్త పాళీ said...

భలే భలే.
ఆత్రేయ గారి వ్యాఖ్య కూడా భలే.
మనసు చిక్క "పట్టుకుని" - పెట్టుకుని కాదు.

లలిత (తెలుగు4కిడ్స్) said...

ఈ టపా, క్రితం టపా కలిపి చదివితే, "అమ్మ ఊరెళ్తే కుఛ్ కుఛ్ హోతా హై".
పిల్లలు ఏడిపిస్తారు (ఏడ్చినా, సంతోషించినా), అమ్మలు దొరికిపోతారు :)

బులుసు సుబ్రహ్మణ్యం said...

>>>కానీ నా పిల్లలకి కాస్త మంచి పోలికలు రావచ్చు కదా నా పోలికలే ఎందుకు రావాలీ..

ఆ ఎందుకు రావాలి? తండ్రి పోలికలు వస్తే అసలు నచ్చదు కాబట్టి.(కోప్పడకండి).

బొల్డు దరహాసాలు.

కృష్ణప్రియ said...

@ సౌమ్య,

:) అవును. మా అమ్మ కూడా ఎప్పుడైనా వెళ్తే బోల్డు అడ్వెంచర్లు చేసే వారం. కానీ ఇంటికి రావాలంటే ఏదోలా ఉండేది. నాలుగు రోజులు గడిచాక ఇంక వచ్చేస్తే బాగుండు అనిపించేది, కోపం వచ్చేది.

@ వెన్నెల్లో ఆడపిల్ల,

థాంక్స్! ఈ కాలం పిల్లలు :)

@ మధురవాణి,

థాంక్స్! మీరు పెద్దగా మీ అమ్మని ఇబ్బంది పెట్టలేదన్నమాట అయితే :)

కృష్ణప్రియ said...

@ స్నిగ్ధ,

ఆవిధం గా ఇది ఒక ఇంటరెస్టింగ్ పరిణామం.. మేము ఎప్పుడు ఇంటికెళ్ళినా మా అమ్మ ఎదురు రాకపోవటం ఉండేది కాదు. ఎప్పుడో అత్యవసర పరిస్థితులలో తప్ప. అప్పుడు తెగ విసుక్కునే వాళ్లం. ఇప్పటి పిల్లలకి ఆ లక్జరీ లేదు. ఆఫీసు కెళ్లే తల్లుల పిల్లలు తాళాలు తీసుకుని వచ్చేవారూ ఎంతమంది ఉన్నారో .. కొంత మంది తల్లులు ఆఫీసు పనుల మీద విదేశాలకి వెళ్లటం తో అదీ ఈకాలం పిల్లలు అలవాటు చేసేసుకుంటున్నారు.

@ చాణక్య,

అంతే అంతే :)

@ కొత్త పాళీ గారు,

తప్పు దిద్ది నందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పటి వరకూ మనసు చిక్కబెట్టుకుని తప్పని తెలియదు.

@ లలితా,
భలే పట్టావే :) Good one!

@ బులుసు వారు,
LOL. (మీ భాష లో అ. హా)

Anonymous said...

పిల్లల అమ్మ వూరెళ్ళాలని కోరుకునే బడుగుజీవుల స్వాతంత్ర్యకాంక్ష, స్వేచ్చా పిపాస, వుర్వారు కమివభంధనా ముక్త్యోర్ముక్షీయ మామృతాత్ అనే ఆక్రందనలు అప్పుడప్పుడు వింటుంటాం. :D

రవికిరణ్ పంచాగ్నుల said...

మీరు ఇంకా ఊరెళ్లేదాకా మాట్లాడారు.. మా బుడ్డిగాడైతే చాలా బుద్ధిమంతుడిలా, మా "మహా"మంచి కోరుకునేవాడిలా - "అమ్మ, నాన్నా మీరు సినిమాకెళ్లి చాలారోజులైనట్టుందే...?" అని అడుగుతూంటాడు. :(

thrill said...

krishnaveni garuu ..
adedo cinemalo " no nagamani enjoyyy"(wife ni bus ekkinchi) ani keka vesinattu ... papam chinnu edo avesam lo nijalu cheppesindi :p ....
...
peddavallu urike chepparaa...( mamidi chettuki mamidi kayalu kaka .. kakarakayalu kasthaya ani ;P)

krishnaveni garu .. chinnu anna matalu manasulo petukoni satayinchalani chuste khabadaar ... ikkada chinnu fans unnarani marchipokandi ..marokkasari gurtuchestunna,..

itlu..
parotala ramulanna
(veediki poratam takkuva tindi aratam ekkuva )

వేణూశ్రీకాంత్ said...

హహహ :):):):) నాకు ఇలాంటి అవకాశాలు అతి తక్కువగా వచ్చేవి కానీ మా పిన్ని సూపర్ విజన్ లో ఉంచి అమ్మానాన్న ఇద్దరూ వెళ్ళే వాళ్ళు దాంతో పెనం మీదనుండి పొయిలో పడ్డట్టు అయ్యేది. అమ్మ కొట్టేది కాదు కానీ ఏమన్నా తేడా వస్తే పిన్ని చీపురు పుల్లతో వాతలు తేల్చేది మరి. ఇప్పుడు మీ చిన్నమ్మాయ్ చెప్పినవి వింటే ఏంమిస్ అయ్యానో ఆర్ధమౌతుంది :-)
మీ చిన్నమ్మాయ్ గురించి ఇంకొక్క టపా.. అంతేనండీ తనకి అభిమాన సంఘం పెట్టేస్తాను తొందర్లో :):):)

కృష్ణప్రియ said...

@ snkr,

LOL! మీ భాషా పరిజ్ఞానం అద్భుతం! మీ సామాజిక స్పృహ ప్రశంసనీయం! అభినందనలు!

@ రవికిరణ్,
 తెలివైన పిల్లలు...

@ థ్రిల్,
నన్ను కృష్ణవేణి అనేసారే! అయినా ఓకే. మీరంత చెప్పాక, ఇక సతాయించటం కూడానా? btw, మీ టాగ్ లైన్ బాగుంది.

@ వేణూ శ్రీకాంత్,
ఏం మిస్సయ్యారో అర్థమైందా! బాగుంది. సీరియస్ గా మొహం పెడితేనే మమ్మల్ని ఒక ఆట ఆడిస్తోంది అది. ఇక మీరు అభిమాన సంఘం అంటే అంతే సంగతులు.

Anonymous said...

:)) ఏదో సరదాగా అన్నాను, నా భాషాపరిజ్ఞానమా! :D అదేంలేదులేండి.

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;