విజయ గర్వం తో జై జై ద్వానాల మధ్య.. నాలుగు వైపులా జనాలు కరతాళ ధ్వనులు.... ఒక చేతిలో ఖడ్గం.. రెండో చేతిలో రథం పగ్గాలు. రథాన్ని ఆపి శిరస్త్రాణం తీసి,కవచాన్ని వదులు చేసి దిగాను. నా చేతిలో ఉన్న వస్తువుల్ని ఇద్దరు ముగ్గురు అందుకున్నారు.. దుమ్ముకొట్టుకుపోయిన,అక్కడక్కడా చిరిగిన బట్టలు, చిన్నపాటి గాయాలు. జుట్టు చెదిరి, వొళ్లు నొప్పులు .. బురద తో నిండిన పాదరక్షలు.. వెనక్కి తిరిగి చూశాను. చాలా మంది ఇంచుమించు నాలాగే.. యుద్ధం లొ పోయిన వారు పోగా.. కొందరు క్షతగాత్రులై చికిత్సా శిబిరాలకి తరలి వెళ్లిన వారు కొందరైతే.. రథాలు విరిగి, వాహనాలకి, శరీరాలకి గాయాలయినా.. కొండలూ, కోనలూ, నదులూ దాటి, విజయాన్ని చేజిక్కించుకుని ఆనందం చిందుతున్న మొహాలతో నా వాళ్లు నా వెనక..
‘కృష్ణా..లే.. మళ్లీ లేటయింది అని గోల పెడతావు.. నువ్వు లేస్తే కానీ.. పిల్లలు లేవరు’ అని మా వారు.. ‘ఆహా! ఇదంతా కలయా!..తెల్లవారుఝామున వచ్చిన కలలు నిజమౌతాయంటారు.ఐతే ఇవ్వాళ్ల యుద్ధం చేస్తానా? రాత్రంతా వర్షం కురిసినట్టుంది.. సరే లే జీవితమే ఒక యుద్ధం.... ‘ అనుకుంటూ లేచి పనుల్లో పడ్డాను.
ఎవరితో అవుతుంది యుద్ధం? అత్తగారితో.. ఆవిడకా ఓపిక లేదు. నాకా తీరిక లేదు. పిల్లలతో, పక్కవాళ్ళతో,పని మనిషితో.. పాలు పోసే అబ్బాయితో.. మా వారితో.. ఫోన్లో స్నేహితులతో.. ఇలా సరదాకి..ఎవరితో అవవచ్చో ఆలోచించాను.
బాసు తో యుద్ధం అవుతుందేమో.. ఇవ్వాళ్ల.. లేక మా సింగం,నేనూ కలిసి టెస్ట్ టీం వాళ్లతో గొడవ పడం కదా.. అనుకుంటూ బయటకి స్కూటర్ తీశాను.. హెల్ మెట్, జాకెట్ వేసుకుని రివర్స్ చేస్తున్నాను. DRDO లొ సైంటిస్ట్ ఆవిడ కార్ లొ వెళ్తూ నా వైపు పలకరింపు గా చూసి నవ్వి..’ఏంటి? వర్షం రాత్రంతా వర్షం! స్కూటర్ మీద వెళ్తున్నారా? జాగ్రత్త!’ అంది. కొద్దిగా జంకు గా అనిపించింది కానీ ఎక్కుబెట్టిన రామ బాణాన్నీ, ఒకసారి బర్రు మనిపించిన స్కూటర్నీ ఇక వెనక్కి తిప్పే ప్రశ్నే లేదు.
కాస్త మెయిన్ రోడ్డెక్కా.. ఒక ఇరవై నిమిషాల తర్వాత పావు కిలో మీటర్ నడిచి ఆగింది బండి.. పర్వాలేదు.. ఇవ్వాళ్ల పెద్దగా ట్రాఫిక్ లేదు.. అనుకుని బండి పార్క్ చేశా నడి రోడ్డు మీద. పక్క స్కూటర్ ఆయన ఎవరితోనో.. ఫోన్లో కబుర్లు చెప్తున్నాడు.. ముందు మోటార్ సైకిల్ ఆయన షేవింగ్ కిట్ తీసి గడ్డం గీస్తున్నాడు. ఇంకో ఆవిడ హెల్ మెట్ తీసి దాంట్లో పాకెట్ లోంచి సన్నజాజులు గుమ్మరించి మాలలు కడుతోంది. నేను బ్యాగ్ తీసి చూస్తే.. ట్రాఫిక్ జాముల్లో చదువుకునే పుస్తకం కనపడలేదు. పోన్లే.. కాసేపు యోగా చేద్దాం అని మొదలు పెట్టాను.
కాసేపయ్యాక ఒక్కసారి గా హారన్ లు కొడుతున్నారు. ‘హమ్మయ్య.. ఇంకో రెండు ఇంచులు ముందుకెళ్లచ్చు.. అని మళ్లీ స్కూటర్ ఆన్ చేసి రెండించులు ముందుకెళ్లి ఆగి అటూ ఇటూ చూస్తున్నా రాత్రి మీటింగ్ అర్థ రాత్రి దాకా అయ్యింది. ఒక్క కునుకు తీద్దామా? అని కాస్త సెంటర్ స్టాండ్ వేసి బ్యాగ్ దిండు లా అడ్జస్ట్ చేస్తుంటే ‘హాయ్ కృష్ణా!’ అని మా ఎదురింటావిడ కార్ లోంచి పిలుస్తోంది. సరే కబుర్లేసుకోవచ్చు.. అని ఉత్సాహంగా ఆవిడ విండో దగ్గరకెళ్లి ఈ ఆదివారం చూసిన ఈ టీ వీ సుమన్ సినిమా ట్విస్ట్ కథ మొదలు పెట్టా.. ఆవిడ..’కృష్ణా! యూట్యూబ్ లొ ఉందన్నావు గా.. చూస్తాలే’ అని రెండు చేతులూ జోడించి దీనం గా అడిగింది. ‘అమ్మా! ఆశ! నువ్వు మళ్లీ ఇంత తీరిగ్గా దొరుకుతావా?’ అని మొదటి భార్య ఎంట్రీ దాకా చెప్పా.. మరి మొన్న వాళ్లింట్లో తమ్ముడి పెళ్లి ఫోటోలు దాదాపు ఏడు వందలు చూపించినప్పుడో?
ఇంతలో ఏ కమ్యూటర్ చేసిన వ్రత ఫలమో..అక్కడ ఆక్సిడెంట్ తాలూకు శకలాల్ని తొలగించి వదిలినట్టున్నారు.. ముందు నుండి ఒక హారన్ మోగింది.. అందరూ ఉత్సాహం గా బోయ్ బోయ్ అని ఒకటే మోత. ఒకేసారి అందరూ బండ్లు ముందుకురికించారు.
కళ్ళు మూసి తెరిచేలోగా అన్ని వైపులనుండీ బండ్లు... ముందుకు దూసుకుపోతున్నాయి. దుమ్ము మేఘం లా చుట్టూ దట్టం గా..
స్కూటర్లు, సైకిళ్లు, మోటార్ సైకిళ్లు, కార్లు, టెంపో ట్రక్ లు, వాన్లు, బస్సులు, లారీలు, ఒకటేమిటి.. మధ్యలో పాదచారులు, వీళ్లు చాలదన్నట్టు మహా నగర సింహాలు (అవేనండీ గ్రామ సింహాలు/శునక రాజాలు) ఆవేశం తో రోడ్డు మీద.. బరి లోకి ముందడుగు వేస్తున్నాయి..
అదేదో యుద్ధం శంఖారావం ముందున్న సైన్యాధ్యక్షుడు చేయగానే.. సైన్యం అంతా వారి వారి శంఖాలు పూరించి శూలాలు పట్టుకుని వెళ్లే పాదచారులు, గుఱ్ఱాల మీద వెళ్లే వారు (ఆశ్వారూడులు), ఏనుగుల పై వెళ్లేవారు, రథాలనధిరోహించి రథ సారథి పై ఆధారపడి బాణాలూ అవీ సరి చూసుకునేవారు ముందుకి ఉరకలేస్తూ వేగం గా వెళ్తున్నట్టు..
ఒక్కసారి గా బల్బ్ వెలిగింది ఉదయపు కల నిజమైంది అని అర్థమైంది. టపటపా కన్నీళ్లు కారిపోయాయి. జ్ఞాన/ఆనంద/దుఃఖ భాష్పాలు కావవి.. దుమ్ము వల్ల కలిగిన కాలుశ్య భాష్పాలు. తుడుచుకుందామంటే శిరస్త్రాణం లోకి చేయి పెట్టి తుడవాలి. ఒక Ford I10 కీ, వాల్వో బస్సుకీ మధ్య ఉన్న అరమీటర్ గాప్ లోంచి అతి లాఘవం గా బండిని ఇరికించి ఇద్దరు డ్రైవర్ల చూపులూ, అరుపులూ, హాంకులూ విననట్టు, చూడనట్టు, నటిస్తూ ముందుకెడుతూ ఆలోచిస్తున్నా.. ఎలాగోలా ఇంటర్వ్యూ కాండిడేట్ వచ్చే సమయానికి చేరుకుంటే చాలు..
ముందు ఒక కాల్ టాక్సీ శకటం వెళ్లి ఒక ద్విచక్ర వాహనాన్ని స్పృశించింది. ఒక చిన్న పాటి గొడవ ని పట్టించుకోకుండా..శకటం దెబ్బ తింది. ద్విచక్ర వాహన చోదకుడి కాలి కి గాయం తగిలి రక్తం కారుతోంది.. కరుణ తో కూడిన ఒక చూపు అరసెకను వారి వైపు విసిరి ముందుకేగుతూనే ఉన్నా. రింగు రోడ్డెక్కా! అన్ని దేశాల సైన్యం చిన్న చిన్న దారుల ద్వారా వచ్చి ప్రధాన రహదారి లొ కలిసినట్టు.. రోడ్డు రంగు కనిపించట్లేదు. అన్నీ వాహనాలే.
ఇంకా ఎక్కడైనా గాప్ దొరుకుతుందా అని చూస్తున్నా.. అబ్బే.. లాభం లేదు. చుట్టూ దుమ్ము మేఘం పలచబడుతోంది. గుండె లబలబ లాడింది.. ‘అంటే..మళ్లీ ట్రాఫిక్ జామా! అయ్యో!! పోన్లే బాబాయి కి ఫోన్ చేసి రెండు నెలలవుతోంది.. ఇప్పుడు చేసేస్తే సరి!’ అనుకుంటున్నా.. ‘అదేంటి? ఆ చివర జనాలు పోతున్నారే! అసలు అక్కడ మాత్రం ఖాళీ ఏదబ్బా!’ అని బండి ని అటువైపు ఉరికించా.. చూస్తే.. రోడ్డు పక్క ఉన్న కాలువ పైన రెండు బండలు వేసి అప్పటికప్పుడు తాత్కాలికం గా వేసిన అడ్డ రస్తా! మీద ఒక్కొక్కరు గా కాలవ దాటి సర్వీస్ రోడ్డు మీదకి చేరుతున్నారు. అద్భుతమైన టీం వర్క్! చాలా ఆనందం వేసింది. నేనూ వెళ్దామని చూశా.. కానీ.. కొద్దిగా భయం వేసింది. స్కూటర్ తూలితే.. మురికి కాలవ లోకే! కార్ల వారు, బస్సుల వారు ఇదంతా ఈర్ష్య గా చూస్తున్నారు.
నా వెనక శంఖారావాలు తారా స్థాయికి అందుకున్నాయి. వెనక్కి చూస్తే.. ‘ఆ వంతెన ఎక్కవేం!! ‘ అని కొందరు చూపులతో గద్దిస్తే.. కొందరు చేతులతో మార్గ నిర్దేశన చేస్తున్నారు. నేను వెళ్తే గాని వెనక వారు వెళ్ళలేరు. సరే అని నా వెనక బండాయన దిగి నా స్కూటర్ పడకుండా చూస్తానని మాటిచ్చాడు. బండ ఇలా ఎక్కానో లేదో..ఒక చక్రం ఇరుక్కుపోయింది. నలుగురు వచ్చి తీసి మళ్లీ రింగు రోడ్డు మీదకి తెచ్చేశారు. ఈలోగా.. ఇంత సాహసం చేసి బ్రిడ్జ్ కట్టి మరీ సర్వీస్ రోడ్డు మీదవెళ్లిన జనం మళ్లీ తిరిగి వస్తున్నారు. ముందు అంతా పైప్ లైన్ కోసం తవ్వేశారు ట. లాభం లేదట.
చతుర్చక్ర వాహన చోదకులు ‘బాగా అయింది!’ అన్న లుక్కు ఇచ్చి సంతృప్తి గా నిట్టూర్చారు. కానీ పట్టు వదలని విక్రమార్కులు ద్వి.చ.వా.చోలు (ద్విచక్ర వాహన చోదకులు) డివైడర్ మీద కెక్కించి ఎదురుగా వస్తున్నా ట్రాఫిక్ వైపు వెళ్దామని ప్రయత్నిస్తున్నారు.
ఇంతలో మళ్లీ శంఖారావం మ్రోగింది. అందరూ.. మళ్లీ ముందుకు.. ఒక్కసారి గా మళ్లీ ప్రకృతి పరవశించి, దుమ్ము మేఘం వెలిసింది, బురద ఫౌంటెన్.. చిమ్మింది. ప్లెయిన్ చుడీదార్ మీద మంచి డిజైన్లు ఏర్పడ్డాయి. చెప్పులు మీద చాక్లెట్ కోటింగ్ లా బురద చేరింది. ఏం చేస్తాం.. కొంతమంది అభినవ కర్ణులు తమ బండ్ల చక్రాలు బురద లొ కూరుకుపోయాయి. పక్క బండి వాడి బూటు కాలు కొట్టుకుంది. ‘ఒక్క సారి గా కళ్ళ ముందు మెరుపు మెరిసినట్టు..’.. ఈ సినిమాల్లో ఎన్ని దెబ్బలు తిన్నా.. ఎలా మళ్లీ లేచి ఫైట్ చేస్తారబ్బా! అనుకున్నాను. అవున్లే..ఉత్తుత్తి నే తంతే అంతే.. పైగా లేచేదాకా.. కర్ణ కఠోరంగా స్పూర్తిదాయక గీతాలు పాడుతుంటే ఆపటానికైనా లేవాలి తప్పదు.
అభినవ భీష్మాచార్యులు ట్రాఫిక్ పోలీసు నిస్సహాయం గా చూస్తున్నారు.
మరీ మడమలు దాటెంత ఎత్తు వర్షపు నీరు. అయ్యప్ప స్వామి లా లూనాల వాళ్లు కాళ్లు పైకెత్తేసారు. నేను ఒక అడుగు పైకి కాళ్లు పెట్టి ముందు వెళ్తున్న స్కూటర్ వెనకే జాగ్రత్త గా వెళ్తున్నా.. ముందర ట్రాఫిక్ మళ్లీ ఆగింది. అక్కడ బ్రిడ్జ్ కడుతున్నారు. విధిగా ఆగి ప్రోగ్రెస్ చూసి ప్రతి ప్రయాణికుడూ/రాలూ తరించాలి గా.. చిన్న గాప్ ఉంది ఎదురుగా.. పడతానా? పట్టనా? భయం గానే ఉంది. వెనక బండి అతను హాంక్ చేస్తున్నాడు. ఇంకో నిమిషం ఆగితే దిగి హారన్ బదులు నన్ను కొడతాడేమో అని భయం వేసింది. గాప్ ఇచ్చిన వాడు గమ్యం చేర్చక పోతాడా అన్న ధీమా తో.. ముందుకు వెళ్లాను. డివైడర్ మీద ముళ్ల కంప గీరుకుని కమీజ్ పక్క కొర్రు, చేతి మీద ఎర్ర రక్తపు చార.. కనీసం ఇంకో నాలుగు మీటర్లు ముందుకొచ్చాం సంతోషం..పక్క బండి మీద వారు ఎవరో ఏసుక్రీస్తుకి మొక్కుకుంటున్నారు.. నేనూ ‘ఆమెన్’ అని నా దేవుళ్ళు రామ కృష్ణులని పూజించుకున్నా.
ఈలోగా అందరూ మెయిన్ రోడ్డు పక్కన గ్రామం లోంచి వెళ్తే బెటర్ అని అటుపోతున్నారు. నేనూ ఒక్క క్షణం ఊగిస లాడా.. కానీ.. మెయిన్ రోడ్డు మీద, అందునా రింగు రోడ్డు మీద, బురద లొ మునిగి, గాయం అయి, బట్టలు చిరిగి దుమ్ము కోటింగ్ తో ఉన్నా.. ఇంక చిన్న గుంతల రోడ్డు మీద వెళ్లి కొత్త సమస్యలనెదుర్కునే మానసిక స్థైర్యం, శారీరక బలం లేక వదిలేశా. ఇంకో అరగంట తర్వాత ఇంకో రెండు కిలో మీటర్ల దూరం వెళ్లాకా చూస్తే అర్థమైంది. నేను తీసుకున్నది సరైన నిర్ణయమని. అక్కడ రైల్ ట్రాక్ దాటాలి. రైలోస్తుంటే.. ఆఫీస్ తొందరలో ఎవరో దాటాలని పట్టాల కింద పడ్డారట! దానితో.. మళ్లీ అటు డీ-టూర్ అయిన జనాలు మా వెనక కలిసారని. బాధ తో హృదయం నిండి పోయింది.
ఉక్క గా.. చెమట గా కాసేపు హెల్ మెట్ తీద్దామని తీసి చేత్తో పట్టుకున్నా.. మళ్లీ శంఖారావం. దుమ్ము మేఘం.. బురద ఫౌంటెన్.. అలాగే ముందుకు పరిగెత్తిస్తున్నా బండి ని.
మా ప్రార్థనలు కాస్తా పొరపాటున వరుణ దేవుడు విన్నట్టున్నాడు..ఆయన కరుణించాడు. ఒకేసారి ఫెళ్ళున వాన. ‘వామ్మో నా లాప్ టాప్’ అనుకుని ఒడుపు గా జాకెట్ తీసేసి లాప్ టాప్ బాగ్ మీద కప్పి హెల్ మెట్ పెట్టేసుకున్నా. ముందరేమవుతుందో తెలియదు. వెనక్కెళ్ళటానికి లేదు. ఎవరో అండర్ పాస్ కోసం తవ్విన గుంట లొ పడ్డారని అంటున్నారు. ‘అయ్యో’ అనుకోవటం తప్ప చేసేదేదీ లేదు. వర్షం వల్ల గుంటల్లోకి ధబ్ ధబ్ మని పడుతూ లేస్తూ మా ఆఫీస్ గేట్ దగ్గర కి చేరుకొని ఆత్రం గా షెడ్ కిందకి వెళదామంటే.. ‘అబ్బే! మా సెక్యూరిటీ వాళ్లంత కర్తవ్య నిష్ఠ కలిగిన వారు యావద్ప్రపంచం లొ ఉండరాయే. నిజమే.. ఈ ట్రాఫిక్ వల్ల ఉన్న ఆవేశం తో బిల్డింగ్ కూల్చేస్తే! చెప్పలేం..
అసలు ఈ నోబుల్ పీస్ ప్రైజులు, సెయింట్ హుడ్లూ, మఠాలకి పీఠాధిపతుల పోస్టులూ గట్రా ఇచ్చే ముందు ఈ ట్రాఫిక్ టెస్ట్ చేసి చూడాలి. ఈ ట్రాఫిక్ లో ఒక్క తిట్టు వాడకుండా, ఒక్క రూలైనా బ్రేక్ చేయకుండా.. చిరునవ్వు చెదరకుండా, ప్రశాంత చిత్తం తో ఐదు కిలో మీటర్లు రెండు గంటల్లో ప్రయాణం చేస్తేనే ఇవ్వాలని.. ఏమంటారు?
ఆ వర్షం లొ బ్యాగ్ లోంచి ఐడీ కార్డ్ తీసి చూపించి ముఖాన్ని మాచ్ చేయటానికి హెల్ మెట్ తీసా.. సెక్యూరిటీ వాళ్లు నా బ్యాగ్ లో ఏమైనా మారణాయుధాలు తెచ్చానేమో అని చూస్తున్నారు.. వెనక్కి తిరిగి చూశా..
అచ్చం నా కల లాగానే!!!
ఒక చేతిలో ఖడ్గం.. రెండో చేతిలో రథం పగ్గాలు. రథాన్ని ఆపి శిరస్త్రాణం తీసి,కవచాన్ని వదులు చేసి దిగాను. నా చేతిలో ఉన్న వస్తువుల్ని ఇద్దరు ముగ్గురు అందుకున్నారు.. దుమ్ముకొట్టుకుపోయిన,అక్కడక్కడా చిరిగిన బట్టలు, చిన్నపాటి గాయాలు. జుట్టు చెదిరి, వొళ్లు నొప్పులు .. బురద తో నిండిన పాదరక్షలు.. వెనక్కి తిరిగి చూశాను. చాలా మంది ఇంచుమించు నాలాగే.. యుద్ధం లొ పోయిన వారు పోగా.. కొందరు క్షతగాత్రులై చికిత్సా శిబిరాలకి తరలి వెళ్లిన వారు కొందరైతే.. రథాలు విరిగి, వాహనాలకి, శరీరాలకి గాయాలయినా.. కొండలూ, కోనలూ, నదులూ దాటి, విజయాన్ని చేజిక్కించుకుని ఆనందం చిందుతున్న మొహాలతో నా వాళ్లు నా వెనక..