‘ పర్యావరణం లో కాలుశ్యం చేరటాన్ని ఆరి కట్టేందుకు, టపాకాయలు ఈ సంవత్సరం నుంచీ కాల్చటం మానేద్దాం’ అని గత ఐదేళ్ల నుండీ అనుకుంటూనే ఉన్నాం.. కానీ అబ్బే.. కుదురుతుందా? మా పిల్ల రాక్షసులు ఊరుకుంటారా? ‘ పుట్టినరోజులు అనాథాశ్రమం లో మాత్రమే జరుపుకోవాలి, ఈసారి బహుమతులు అంగీకరించకూడదు, లాంటి తీర్మానాల్లాగానే.. ప్రతి సంవత్సరమూ ఈ తీర్మానమూ వీగిపోతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం లాగానే వెయ్యి మన లిమిట్.వెయ్యి దాటి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకూడదు అనుకుని బయల్దేరాం. దానికి మూడు రెట్లు ఎలాగూ కొనేస్తాం అనుకోండి..
టపాకాయలు చిన్నప్పుడంటే.. దసరా వెళ్లిన మర్నాటి నుంచే హడావిడి. పాత న్యూస్ పేపర్లు సేకరించుకుని, ఇసుక సమకూర్చుకుని, ఇంట్లోనే జిగురు తయారు చేసుకుని పెట్టుకోవటం. సికందరాబాద్ మహంకాళీ గుడి దగ్గర మార్కెట్ లో గంధకం, ఆముదం, సూర్యేకారం, సున్నం, మెటల్ పౌడర్ లాంటివి కొని ఎండపెట్టుకుని, ఎప్పుడు కూర్చుందాం.. అని అమ్మా వాళ్లని పీకేయటం. అందరం కూర్చుని ఒక్కోదానికి ఒక్కోలా పాళ్లు రాసుకున్న పుస్తకం తెచ్చుకుని, జాగ్రత్త గా బీడు కలుపుకుని కాగితం పాకెట్లలో ఇసుకు కూరి, బీడు కూర్చి.. మతాబులు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు, సిసింద్రీలు చేసుకోవటం.. అవి రోజూ ఎండపెట్టటం.. అంబానీలు ఆస్తులు పంచుకున్న రేంజ్ లో ఇవి పంచుకుని వేరు వేరు సంచీల్లో దాచుకోవటం ఒక సరదా!
పండగ పూట కొన్ని పేలాల్సినవి తుస్సు మనటం, ఎగిరెగిరి పడాల్సినవి కొన్ని చీదేయటం, పూల జల్లు కురిపించాల్సినవి డామ్మని పేలటం జరిగినా, మొత్తం మీద సక్సెస్! మర్నాడు ఉదయమే లేచి ఎవరింటి ముందు ఎక్కువ కాగితాల తుక్కు ఉందో చూసుకుని గర్వ పడటం, పేలని బాంబులని ఏరుకోవటం.. పేలిన టపాసుల చెత్త ఊడ్చి మంట వేయటం.. అబ్బో! ఆ సరదా ఇక రాదు.. మా అమ్మా వాళ్లూ ఇలాగే అనేవారనుకోండి.. తాటాకు టపాకాయలు, వెన్న ముద్దలు.. టెలిఫోన్ టపాకాయలు చేసిన విధానాలు చెప్పి, ఆరోజుల్లో వాళ్ళెంత బాగా చేసుకునేవారో, ఎలా పంచేవారో చెప్పి..
ఇప్పుడా .. టెర్రరిస్టుల పుణ్యమా అని.. ఎక్కడా గంధకాలూ, భాస్వరాలూ అమ్మట్లేదు. ఒకవేళ అమ్మినా, చేసుకునే ఓపికా, తీరికా లేని హై స్పీడ్ బతుకులు.
పోనీ తయారయితే చేయం.. కానీ మన పిల్లలూ వాళ్ల పిల్లలకి చెప్పాలి గా.. మనం ఎంత బాగా టపాకాయలు తెచ్చుకునే వాళ్లమో!
బెంగుళూరు లో మా ఇంటికి ఒక పాతిక కిలో మీటర్ల లో తమిళ నాడు బార్డర్. కర్ణాటక లో 65% డిస్కౌంట్ అయితే తమిళ నాట 80% డిస్కౌంట్ తో దొరుకుతాయి. హోసూరు దగ్గర రెండు రాష్ట్రాల సరిహద్దు. సరిహద్దు ద్వారం టోల్ బ్రిడ్జ్ దాటితే చాలు బారులు తీరిన టపాసుల దుకాణాలు. ఏటా వేలాది మంది బెంగుళూరు ప్రజలు వెళ్లి కొనుక్కుని పొదుపు చేసామని సంతృప్తి పడుతూ ఉంటారు. మేమూ అంతే.
గత మూడేళ్లు గా వైట్ ఫీల్డ్ ద్వారా, గుంజూర్ ఊరు వైపు కి బయల్దేరుతాం.. వైట్ ఫీల్డ్ ఐటీ కి ఒక పేద్ద హబ్. ‘ కొన్నేళ్ల క్రితం అడవి అసలు రావాలంటే భయమేసేది’ అంటారు ఇక్కడి వారు. . ఇప్పుడూ అంతే ననుకోండి. భయమే! కాకపొతే, ఆ ఏరియా లో ఇక్కడ ఏదైనా స్థలం రేటు వింటే! ఫోరం వాల్యూ మాల్, ‘స్టార్టింగ్ రేంజ్ రెండు న్నర కోట్లు మాత్రమే’ అని అమ్మే బంగళాలు, గేటెడ్ కమ్యూనిటీలు దాటుకుంటూ, వర్తూరు చెరువు దాటుతూనే సంత. గత మూడేళ్లు గా దాటుతున్న ప్రతి ఒక్కసారీ ఇప్పుడు సమయం లేదు. ఈసారి వచ్చినప్పుడు ఆగి ఏదైనా కొనాలి అనుకుంటున్నాము. ఎప్పుడోప్పుడు కొనేస్తాం! చూస్తూ ఉండండి.. కనీసం కొత్తిమీరైనా...
కాస్త సంత దాటి వెళ్తే ఇక పచ్చదనం, తారు రోడ్డు.. నర్సరీలు, లోపల గా ఇంటర్ నేషనల్ స్కూళ్లు.
‘Welcome!’ అంటూ అందమైన నల్లని ఆంజనేయ స్వామీ, శనీశ్వరుడి కోవెల. చాలా విశాలం గా ఉంటుంది. అక్కడ ఆగి నెమ్మదిగా పచ్చదనాన్ని ఆస్వాదించి, మళ్లీ కారెక్కి వెళ్తూంటే వందల కొద్దీ ఎకరాల్లో నర్సరీలు, పూదోటలు, అరటి తోపులు.. ఆగి ఒకటి రెండు మొక్కలు కొనుక్కుని మళ్లీ వెళ్తూ ఉంటే నెమ్మది నెమ్మది గా ట్రాఫిక్ తగ్గుతూ,.. కాలుశ్యానికి భయపడి ఏసీ లతో కాలక్షేపం చేసే మాకు హాయిగా విండోలు దించి ఒక పద్దెనిమిది కిలోమీటర్ల స్వర్గం.
ఇంకొకటి రెండు కిలో మీటర్లలో హోసూరు పట్టణం వస్తుందనగా వస్తుంది అసలు సర్ప్రైజ్. రోడ్డుకి ఎదురుగా హెయిర్ పిన్ బెండ్ లో ఒక ౩౦-౪౦ అడుగుల గద లాంటి కట్టడం.. దాంట్లో ఒక ఆంజనేయ స్వామి. చూసారా ఎంత అందమైన గుడో. మొదటి సారి వెళ్లినప్పుడు ‘ ‘ఏంటి? ఈ గద కథా? కమామీషూ? ‘ అని అడిగాము. ఆ కార్నర్ లో బ్లైండ్ స్పాట్ వల్ల నెలకోసారి కనీసం ఆక్సిడెంట్ అవుతూ మనుషులు తమ పొలం ముందు చనిపోతుండటం చూడలేక కొద్దిగా కొత్త గా కనపడుతూ ఉంటే రోడ్డు తిరిగి ఉందని, ఈ మలుపు దగ్గర జాగ్రత్త పడాలి అని వాహన చోదకులు అనుకుంటారని అక్కడి రైతు, గోవిందప్ప అలా కట్టించారు అని చెప్పారు.
ఈ గుడి ని ఆనుకుని బోల్డు పొలాలు. అలచందలు, బీన్స్, అరటి తోటలు.. సిమెంట్ ఇటుకల ఫాక్టరీ.. ఒక ఎత్తైతే.. అక్కడ అన్నింటి కన్నా చూడదగ్గ విశేషం..., వెయ్యి గజాల విస్తీర్ణం లో హాయిగా ఎదిగిన పేద్ద ఊడల మఱ్ఱి చెట్టు, చుట్టూ సిమెంట్ బెంచీలు, పిక్ నిక్ స్పాట్.
ఒక్క షాట్ లో ఆ వృక్ష రాజాన్ని కవర్ చేయలేకపోయా నా సెల్ కామెరా తో.. నాలుగు ఫోటోల్లో వచ్చింది మొత్తం చెట్టు..
ఒక పక్క మునీశ్వర కోవెల. చల్లటి గాలి, మానవ మాత్రుడు లేడు.. ఎక్కడో పొలాల్లో పని చేసుకునే వారు తప్ప.
కాసేపు కూర్చుని, ఒక కునుకు తీసి, పేపర్ చదివి, చేల వెంబడ తిరిగి,పరుగులెత్తి (పిల్లలు, మేము కాదు) నెమ్మది గా మళ్లీ కార్ ఎక్కి ఒక కిలో మీటర్ పచ్చటి చేల మధ్యలో రోడ్డు పైన వెళ్తూండగానే, మెట్రో నగర పోకడలు, బజార్లు, ట్రాఫిక్ జామ్ లూ.
నక నక లాడుతూ అక్కడి మయూర బేకరీ & స్వీట్ల దుకాణం లోకి ఉరుకులు పెట్టి హాయిగా తింటాం. పేరుకి బేకరీ, స్వీట్లు.. అక్కడ లేని తిండి పదార్థాలు లేవే. పాత కాలపు చందమామ బిస్కట్లు, రస్కులూ, బన్నులూ, బిస్కట్లూ పేస్ట్రీలు మొదలుకుని, మాడర్న్ పిజ్జాలూ, బర్గర్లూ! జంతికలూ, పకోడీలూ, ఊరగాయలూ,, చిప్సూ, పండ్ల రసాలూ..
అబ్బో ఎవరికి కావలసినవి వారికి. శుభ్రం గా తినేసి ట్రాఫిక్ జామ్ లో కాసేపు రిలాక్స్ అయి...
ఇదిగో తెగ కొనుక్కొచ్చాం.. డిస్కౌంట్, డిస్కౌంట్ అని ఎగురుతూ వెళ్లటం, ప్రతిసారీ, ఎంత సేవ్ చేసామో మురిసిపోవటం.. ఈసారి కాస్త రాయితీ స్కీం మారినట్టు గమనించాం.. మొదట 75% రాయితీ ఇచ్చి దాని మీద 15% రాయితీ ఇస్తాం.. అనగానే సరిగ్గా చూసుకొని వారు అందరూ ‘ఆహా, ఓహో ౯౦% ‘ అనుకోవటం కానీ.. జాగ్రత్త గా చూస్తే అది 78.5% మాత్రమే.
ఏంటీ? టోల్,పెట్రోల్, మధ్యలో మేత వగైరా అంతా కలిపి మా ఇంటి పక్క దుకాణం ధర కన్నా ఎక్కువే అవుతుంది అంటారా? పైగా శ్రమా? సమయం? అంటారా? అన్నీ ఓకే. కానీ ఇలా ప్రకృతి మాత ఒడి లో కాసేపు గడిపి అప్పడు ఆవిడకి కాలుశ్యం నింపే పని లో పడటం,.. కొద్దిగా ముల్లు లాగా గుచ్చుకుంటూ.. తప్పదు గా..
అందరికీ దీపావళి శుభాకాంక్షలు..