Sunday, December 25, 2011

మూడు వందల అరవై రోజుల జ్ఞాపకాలు....



ఇంకో కాలెండర్ చెత్త బుట్టలోకి.., ఇంకో ‘యాప్పీ న్యూ ఇయరు..’ పది పేజీలు రాసి వదిలేసే ఇంకో డైరీ, రెండు రోజులు ఆచరించి మూలన పెట్టిన రెసొల్యూషన్లు.. ఈసంవత్సరం పోగేసిన ఇంకో నాలుగు పౌండ్లు.. మూడు వందల అరవై రోజులు,.. అంతేనా? ఒక సంవత్సరం కొందరి జీవితాల్లో ఓడల్ని బళ్లు గా .. బండ్లని ఓడలు గా మారుస్తుందేమో, . కొంత మంది జీవితాల్లో ఎక్కడి గొంగళి ని అక్కడే ఉంచేస్తుందేమో, వయసు పెరిగిన కొద్దీ, నలభైలకి దగ్గర కొస్తున్నకొద్దీ జీవితం గానుగెద్దు జీవితం లా అలాగే ఉంటుందనీ, పెద్దగా కూర్పు, మార్పు,చేర్పులుండవనీ, విసుగెత్తిపోతుందనీ.. ఎన్నో విన్నాను. మానసికం గా రెడీ అవ్వాలనుకుంటూ కూడా ఆలోచిస్తూన్నాను ఒకప్పుడు.. కానీ నాకైతే 2011 బాగా పాళ్లు కుదిరిన ఉగాది పచ్చడి లా.. కొద్దిగా తియ్యగా, పుల్లగా, చేదుగా,కమ్మగా,కారంగా, వగరు గా, అన్ని రకాలు గా.. జయోపజయాలు, కష్ట సుఖాలు, శాశ్వతమనుకున్న కొన్ని పరిచయాలు స్నేహాలు, ముందు రోజు జాజుల్లా వడలిపోగా, కొన్ని పరిచయాలు ఆకులు దూసేసిన మల్లె తీగలా కొత్త చిగుర్లు తొడగటాలు,.. ఎవరిదో బ్లాగ్ టాగ్ లైన్ లా ‘సహస్ర వర్ణ శోభితమీ జీవితం’ అన్న మాట కి అర్థం తెలిసేలా..


కమ్మగా,..కొబ్బరి పలుకుల్లా..

భలే పుస్తకాలు చదివాగా..

ప్రొ. బైరప్ప గారు రాసిన పర్వ, డా. కేశవరెడ్డి గారు రచించిన ‘మునెమ్మ’, ‘అతడు అడవిని జయించాడు’, యండమూరి రాసిన ‘డేగ రెక్కల చప్పుడు’, యార్లగడ్డ రాసిన ‘సత్యభామ’, మధురాంతకం వారి కథల కలెక్షన్, శ్రీపాద వారి పుల్లం పేట జరీ చీర, మార్గదర్శి కథల సంకలనాలు, నాలుగు కాలక్షేపం ఆంగ్ల నవలలు, అరడజను తెలుగు నవలలు,నవలికలూ..

నచ్చిన కొత్త రుచులు!

ఉలవచారు మీగడ తో, కిసాన్ వారి కొత్త క్రీం చీజ్ లు, శొంఠి, కర్వేపాకు కాడల చారు, డామినోస్ వారి చాకో లావా కేక్, హైడ్ & సీక్ – కిస్ ఆఫ్ కాఫీ బిస్కట్లు,

హం చేసుకున్న కొత్త పాటలు..

శంకర్ మహాదేవన్ - గణేశాయ ధీమహి, Mr Perfect - చలి చలిగా, JNDB- సేనోరిటా, రావన్ -చమ్మక్ చల్లో..

చేసుకున్న కొత్త అలవాటు..

ఒకటి రెండు ఇంట్లో శుభ కార్యాలకి తప్ప, సింథటిక్,పట్టు బట్టల వాడకం దాదాపు లేకపోవటం. అన్నీ నూలు బట్టలే నా వార్డ్ రోబ్ ని ఆక్రమించటం..

వ్యవసాయ విజయాలు..








చెప్పుకోదగ్గ పంటలు (కొద్దిగా పెద్ద పదం వాడినట్టున్నాను).. సంక్రాంతికి పసుపు కొమ్ములు తవ్వుకోగలగటం, ౨౦ గ్రాముల కందిపప్పు పండించుకోగలగటం, ఓ నాలుగు కిలోల చేమగడ్డలు, ఎనిమిది గెలల అరటి పండ్లు,.. బ్రహ్మ కమలాలు

తియ్య తియ్యని కొత్త బెల్లం లాగా.. మంచి బ్లాగ్ జ్ఞాపకాలు..

బ్లాగు లో దాదాపు అన్ని టపాలూ, విహంగ లో ఒక రచన, మాలిక పత్రికలో ఒక రచన, ఒక పుస్తకానికి తొలి రివ్యూ, ఒక సినిమా కి నవతరంగం లో ఏ-వ్యూ, నమస్తే ఆంధ్ర లో నా బ్లాగ్ టపా, బ్లాగ్ పరిచయం.. కృష్ణప్రియం టపా, స్ఫురిత వేసిన నా బ్లాగ్ ప్రొఫైల్ బొమ్మ, బోల్డు ఈ-ఉత్తరాలు..

అందుకున్న ప్రశంసలు..

నా తో అనారోగ్యకరమైన పోటీ తత్వం తో బాధపడుతున్న ఒక వ్యక్తి, ఒక బలహీన క్షణం లో నా బాటే కరెక్ట్ అని అంగీకరించటం, ,

కొన్ని బ్లాగర్ల ఈ-మెయిళ్ళు

చేసిన తప్పులు..

అబ్బా..ఇది కష్టం బాబూ.. చాలా చేశాను. అయినా.. కొన్ని .. స్కూటర్ మీద వెళ్తూ కూలీల పిల్లలిద్దరు ‘లిఫ్ట్’ అని అడిగితే కొంపలు మునిగే పని లేక పోయినా..సినిమా హాల్లో పార్కింగ్ దొరకదేమో నన్న బెంగ తో ఎక్కించుకోకపోవటం.. తర్వాత సినిమా చూస్తున్నంత సేపూ, అయ్యో అని వగచటం.

ఇస్త్రీ చేసే కుర్రాడు, నా బిడ్డ వయసు వాడు.. కేవలం పండగలకీ, పబ్బాలకీ స్వీట్లూ, అవీ ఇస్తాననీ,స్కూల్ ఫీజు కడుతున్నానన్న (ఎక్కడో మస్తిష్కం లో దాక్కున్న) గర్వం తో, ఒక విషయం లో సరిగ్గా పని చేయలేదని కొద్దిగా అవమానకరం గా మాట్లాడటం, సంవత్సరం అంతా.. మానని గాయం లా అది బాధించటం.

ఆఫీసులో కొంత పనిని కావాలని తప్పించుకోవటం, ఆఫీస్ సమయం లో వ్యక్తిగత పనులు చేసుకోవటం, .కొన్ని సార్లు హాస్యం శృతి మించి ఎదుటి వారిని గాయపరచటం.. ఒకరిద్దరిని ‘అవాయిడ్’ చేయటం..

మనస్సుకి నచ్చిన ఒక రోజు..

ఉదయపు అల్ఫాహారం, తోట పని, తలంట్లు అయ్యాక ఒకానొక ఆదివారం, పిల్లలు ఏదో ప్రాక్టీసులకని, శ్రీవారు ఆఫీసు పనికనీ,వెళ్తే.. నచ్చిన పుస్తకం చదువుకుంటూ, ఆవకాయన్నం తిని, ఒక కునుకు తీసి, చిరు చీకటి సమయం లో దీపాలు పెట్టకుండా.. పురందర దాసు రచించిన కాపీ రాగ కృతి ‘జగదోద్ధారణ’ పాడుకుంటుంటే, పక్కింటావిడ (బోంబే జయశ్రీ పెద్దమ్మ కూతురు) తన శృతి పెట్టే తెచ్చుకుని మరీ వచ్చి, నాతో కూర్చుని బోల్డు పాటలు పాడటం..

చిరు విజయాలు



ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ‘లైవ్’ హరికథ, దూర్ దర్శన్ పుణ్యమాని టీవీ లో మళ్లీ అప్పుడప్పుడూ చూసిన ప్రక్రియని ఆంగ్లం లో ‘దాక్షాయణి’ కథ ని ‘నాదా తనుమనిశం శంకరం’ , ‘నటనం ఆడెనే’, ‘శివాష్టకం’ లాంటివి పాడుతూ కర్ణాటక సంగీతం కృతులతో, పద్యాలతో కూర్పు చేసుకుని, నా పెద్ద కూతురి గాత్ర సహకారం తో కాంప్లెక్స్ వాసులకి చెప్పటం..

అన్ని వైపుల నుండీ వచ్చే ఒత్తిడులకి చెదరకుండా, బెదరకుండా, రెండు పెద్ద కస్టమర్ ఇష్యూలకి చెక్ పెట్టటం, నా కారీర్ లో ఇంకో ప్రాజెక్ట్ కొత్త బాక్స్ మీద సంవత్సరపు ఆఖరి రోజున పని చేయించగలగటం..

పిజ్జా, పాస్టా లే తిండి పదార్థాలు, ఆలుగడ్డ వేపుడు, ఉత్తర భారతీయులు చేసుకునే మీగడల, పనీర్ కూరలు మాత్రమే , తినాలి అనుకునే మా పిల్లల తో,.. పెసరపచ్చడి, నెయ్యన్నం, కాబేజ్, కాప్సికం, ముఖ్యం గా వంకాయ పులుసు అలవాటు చేయటం.


ఏకైక తమ్ముడికి పెళ్లి కుదిర్చటం లో ప్రముఖ పాత్ర వహించి, మరదల్ని తెచ్చుకోవటం.

సుమన్ బాబు సినిమాలకి ‘టెంప్ట్’ అవటమో, రాత్రి పూట మీటింగ్ లు నడుస్తుంటే పది దాటాక వేసే తెలుగు/హిందీ సినిమాలు చూడటం, అప్పుడప్పుడూ వేరే పనేదో చేసుకుంటూ చూసిన ఆంగ్ల సినిమాలు తప్పితే, టీవీ వ్యామోహం నుండి దూరమవగలగటం..

ఇంట్లో Wii,DS ల్లాంటివి ఉంచుకుని కూడా పిల్లలకి వాటి వైపు ధ్యాస పోకుండా ఆటపాటల్లో, పుస్తక పఠనం ఎక్కువ సమయం గడిపేలా చేయగలగటం.

మహాభారతం కథ విశదం గా చెప్పి, ఆఖర్న కొన్ని కథలు సగం సగం వదిలి, తద్వారా, మా పెద్దమ్మాయి తో డా. రాజ గోపాలాచారి గారి భారతం, దేవదత్త పట్నాయక్ రచించిన ‘జయ’ చదివేలా చేయగలగటం, అలాగే ఇడ్లీలు, దోశలు, పచ్చడి,మాగీ,సాండ్ విచ్ లు చేసుకోవటం అలవాటు చేయటం.

అపజయాలు..

నా దగ్గర చేరిన BITS BTech intern చేత పని చేయించుకోలేకపోవటం..

సంగీతం నేర్చుకోవటం ఆపేయటం.,

కార్ డ్రైవింగ్ టెస్ట్ కి ఈ సంవత్సరం కూడా వెళ్లకపోవటం...

యోగా వదిలేయటం.

స్నేహితులు..

ఇరవయ్యేళ్ల తర్వాత, కలిసిన నలుగురు స్నేహితులు, పదహారేళ్ల తర్వాత కలిసిన ఇంకో స్నేహితురాలు.. Thank you facebook, Linked in!

కేవలం నాలుగేళ్లు కనుమరుగమవటం వల్ల, పల్చబడ్డ పదిహేనేళ్ల స్నేహాలు రెండు మూడు..

కొత్తగా ఏర్పడ్డ మూడు స్నేహాలు..

ప్రయాణాలు..

బెంగుళూరు కి దగ్గర ఊళ్లకి వారాంతం ట్రిప్ లు..మేకెదాటు, రామ నగర, దొడ్డ మలూర్, కాలి నడకన తిరుపతి వెంకన్న దర్శనం, అమెరికా, పారిస్ పర్యటన, ఒక ఎనిమిది సార్లు హైదరాబాద్ ట్రిప్పులు, ఒక కడప ప్రయాణం..

దుఃఖాలు.. వ్యక్తిగతం గా పెద్దగా లేనట్టున్నాయి. పేపర్లలో పడ్డ కొన్ని సంఘటనలు, దేవానంద్ మరణం,

‘వా హ్’ అనుకున్న సెలెబ్రిటీ .. అన్నా హజారే

‘వార్నీ’ అనుకున్న దొంగలు : గాలి జనార్థన్. కనిమొళి

కొత్తగా సంపాదించిన చరాస్తులు.... నా బ్లాక్ బ్యూటీ (నల్ల హోండా ఆక్తివా బండి), ఒక జత బంగారు గాజులు.

బాగా కాయకష్టం చేసి అలిసిన రోజు.. వెంకన్న దర్శనం కోసం కాలి బాటన వెళ్లటాన్ని వదిలేస్తే, ఇంటి వెనక తోటంతా శుభ్రపరచిన రోజు..

‘అమ్మయ్య’ అనుకున్నరోజులు... తమ్ముడి పెళ్లయి ఇంటికి వచ్చిన రోజు, పిల్లల పరీక్షలైన రోజు, నిరోష్ఠ బ్లాగాయణం టపా అయిందనిపించినరోజు..

ముప్పైల్లో అందులో ఆఖరి సంవత్సరం ఇంత ఇంటరెస్టింగ్ గా గడుస్తుందని ఎప్పుడూ అనుకోలేదు రోలర్ కోస్టర్ రైడ్ లాంటి బిజీ జీవితం లో చిన్న సర్ప్రైజ్ లు చిలకరించి మనసు లోతుల్లో, ఎక్కడో ఆటక పైన పెట్టిన దుమ్ము పెట్టిన అట్ట పెట్టెల్లో దాచిన పాత పరిచయాలు, అప్పుడప్పుడూ ఒక్కోటి గా దింపి, నెమరు వేసుకునేలా చేసిన ఘనత మాత్రం ఫేస్ బుక్, బ్లాగ్, లింకేడ్ ఇన్ లకే ఇస్తాను. మళ్లీ మనుషులని కాస్త దగ్గర చేయటానికి విత్తనం అయితే వేయబడింది. ఇక వాటిని నీళ్లు పోసి, జాగ్రత్తలు చేసి నిలుపుకోవటం, వదిలేయటం నా చేతుల్లోనే ఉంది.

ఇంకో ఐదు రోజులుంది కొత్త సంవత్సరాగమనానికి... ఇంకెన్ని రంగులున్నాయో, రుచులున్నాయో, ఇంకెన్ని  పరిమళాలు నా కోసం వేచి ఉన్నాయో,. చూద్దాం!

47 comments:

Rao S Lakkaraju said...

సంవత్సర సమీక్ష బాగుంది. చేసిన మంచి పనుల్లో "చేసిన తప్పులు" మనస్సుని కలచి వేస్తూ ఉంటాయి. టెక్ ఇట్ ఈజీ.

Anonymous said...

బాగుంది.
కానీ ఈ సంవత్సరాంతంలోపు మరో విమర్శ మీ ఖాతాలో జమేస్తున్నాను.
మీ టపాలో మొదటి రెండు పేరాలు దాటేసరికి ఆఖరుదాకా చెయ్యటం, అంగీకరించటం, వగచటం, బాధించటం, పాడటం.... టం టం టం లతో నింపారు. కొన్ని వాక్యాలకు అలా కొన్ని వాక్యాలకు పాడాను అంటూ రాస్తే ఇంకా బాగుండేదేమో.
ఇక మీరు హరికథ చెప్పాననటం(క్షమించాలి మీకు చెప్పి నేను టం వాడటం తప్పలేదు) నాలో పాత కోర్కెలకి ప్రాణం పోసింది. మా ఫ్రెండ్ అమ్మగారు హరికథ కళాకారిణి. ఆవిడ దగ్గర హరికథలు చెప్పటం నేర్చుకోవాలని నాకు నేను గతంలో చేసుకున్న ప్రామిస్. వచ్చే ఏడాది మీ పుణ్యమా అని నేర్చుకోవాలని రెసల్యూషన్ చేసుకుంటున్నా.

నీహారిక said...

ఈ పోస్టుతో మీలోని మెగావ్రైటర్ తన్నుకొచ్చాడండీ ?? ?
బాగుంది సమీక్ష !!
ఇలాగే మీరు మరింత ఎదుగుతారని, ఎదగాలనీ కోరుకుంటున్నాను.

ఎందుకో ? ఏమో ! said...

2 0 1 1

upch baapre.......

?!

(simhaavalokanam Awesome)

రసజ్ఞ said...

ఏడాది జ్ఞాపకాలన్నీ నెమరువేసుకుంటూ చేసిన సమీక్ష చాలా బాగుంది. మంచయినా చెడయినా చేసినది తెలుసుకోగలగడం గొప్ప తద్వారా ఆ తప్పుని మళ్ళీ మళ్ళీ చేయలేము.

lalithag said...

:)

Disp Name said...

మీ Day count convention మెథడ్ తెలియ జేయ్యగలరు.

1. 30/360 or
2. Actual/360 or
3. 360/360
4. ఎనీ అథర్ !

చీర్స్
జిలేబి.

Anonymous said...

Nice self appraisal.
Hope all bloggers bless with tons of comments in the new year.

సుజాత వేల్పూరి said...

కృష్ణ ప్రియ గారూ,
సంవత్సరాంతం రివ్యూ కూడా మీ శైలిలో చక్కగా రాశారే! బాగుంది, చిన్న చిన్న విజయాలు, కొన్ని సవాళ్లు, మరి కొన్ని తీపి జ్ఞాపకాలు, ఇల్లు,పిల్లలు,ఆఫీసు,అభిరుచులు.....బావుంది!

వ్యక్తిగత జీవితంలో మీ విజయాలు ఎలా ఉన్నా, మీరు ఇంత మంది బ్లాగర్లకు అభిమాన బ్లాగర్ గా మారడం, మంచి శైలితో టపాలు రాయడం..మీకు మంచి జ్ఞాపకం~! (అని నేను చెప్పేస్తున్నానేంటి)

కొత్త సంవత్సరం కూడా మీకు మంచి విజయాలను అందించాలని కోరుతూ...

శరత్ లిఖితం said...

chaala baagundani...ive titlesto nenu try chestaa naa year end retro...

వేణూశ్రీకాంత్ said...

వావ్ సింహావలోకనం చాలా బాగుందండీ...

లత said...

చాలా బావుందండీ
అన్నిటినీ కవర్ చేస్తూ బాగా రాశారు
మీ తోట ఫొటోలు ఇవేనా, ఇంకా ఉంటే ఎప్పుడు చూపిస్తున్నారు మాకు

కృష్ణప్రియ said...

Rao S Lakkaraju గారు,

ధన్యవాదాలు!
చాలా రోజులకి నా బ్లాగ్ లోకి వచ్చారు.. మీరూ చెప్పినట్టు విజయాల మదం కాలక్రమేణా తగ్గుతుంది, కానీ చేసిన తప్పులని మాత్రం ఎప్పుడు రేపినా, అలాగే పచ్చిగా ఉండిపోతాయి.

@ పక్కింటబ్బాయి,

ధన్యవాదాలు! మీరు చెప్పింది నిజం. Totally agreed. విమర్శ నచ్చింది. నిరభ్యంతరం గా మీరనుకున్నది చెప్పండి. ఒకవేళ కామెంట్ రూపేణా చెప్పలేకపోయినా ప్రొఫైల్ లో ఉన్న ఈ-మెయిల్ అడ్రస్ కి పంపండి. పక్కింటబ్బాయి చెప్పకపోతే ఎవరు చెప్తారు చెప్పండి :)

కృష్ణప్రియ said...

నీహారిక గారు,

మీరు మంచి మనసు తో చేసిన వ్యాఖ్య చూసి చాలా సంతోషం వేసింది.మనఃపూర్వక ధన్యవాదాలు!

చిన్న రిక్వెస్ట్.. ఇక 'మెగా' వాడకం వదిలేద్దాం.

ఎందుకో? ఏమో!

ధన్యవాదాలు. మీ సంతకం భలే నచ్చింది నాకు.

@ రసజ్ఞ,

థాంక్స్!

మీ వ్యాఖ్య తర్వాత చిన్న ఆలోచన లో పడ్డాను.
"చేసిన తప్పులు.. తెలిసుకుంటే మళ్లీ చేయగలమా?" హ్మ్.. చేస్తామనే అనిపిస్తుంది. కాకపోతే పర్యవసానం తీవ్రత ని బట్టి కొద్దిగా తక్కువ చేస్తామేమో.

ఉదా: వ్యసనాలు, పిల్లల్ని తిట్టకూడదు అనుకోవటం, సమయం వృధా చేయకూడదు, ముందు గానే టాక్స్ లు కట్టాలి, డెడ్ లైన్ ముందే పనులు చేసుకోవాలి, మితి మీరిన హాస్యం లాంటివి..

కృష్ణప్రియ said...

లలితా,

:)) నీ స్మైలీ కి ఇంకాస్త కొసరు వేసి..

జిలేబి గారు,

అర్థం కాలేదండీ.. విశదీకరించగలరు.. 360/360 అనుకుంటున్నాను..

bonagiri గారు,

థాంక్స్!

యశోదకృష్ణ said...

baagundi mee sameeksha. ilaantivi raayalante mana gurinchi manam 100% nijaayitheega alochinchali. very nice.

కృష్ణప్రియ said...

సుజాత గారు,

మీరు కూడా చాలా కాలానికి వచ్చారు.
మీ అభినందనకి చాలా థాంక్స్! మీకన్నానా?

@ శరత్,

That would be really great! తప్పక ప్రయత్నించండి. ఈలోగా నేను మీ బ్లాగు రిఫ్రెష్ చేస్తూ చూస్తూ ఉంటాను.

@ వేణూ శ్రీకాంత్ గారు,

ధన్యవాదాలు.

కృష్ణప్రియ said...

లత గారు,

ధన్యవాదాలు. నా తోట (తోట అన్నది పెద్ద పదం..చిన్న గార్డెన్ ఇది) మీద తప్పక ఒక టపా రాయాలనుకుంటున్నాను. ఫోటోలు అన్నీ ఒక పక్క పెట్టుకోవాలి.

ఈ ఫోటోల్లో కనపడేది సవత్సరం కాపు :)

@ గీత యశస్వి గారు,

హ్మ్. అది నిజం. కానీ నేనూ, అన్నీ నా గురించి రాయలేకపోయాను లెండి. కొన్ని రాయాలంటే కష్టమే. నా లిమిట్ ప్రస్తుతానికి ఇదీ :)

తృష్ణ said...

మీ ఈ సంవత్సరం కబుర్లు చాలా బాగున్నాయండి..!

స్నిగ్ధ said...

కృష్ణ గారు,బాగుంది మీ సంవత్సరపు సమీక్ష...మీ వ్యవసాయ విజయాలు బాగున్నాయి..ఙ్ఞాపకాలు,అభిరుచులు,పిల్లలు బాగున్నయండి...నాకైతే మీ తోట భలే నచ్చిందండి...కొత్త సంవత్సరంలో మీ తోట కాపు ఇంకా బాగా రావాలని...ఈ సారి మీ నెక్స్ట్ టపా లో వ్యవసాయవేత్త కృష్ణ ప్రియగారి గురించి చదవాలని ఉందండి...

బులుసు సుబ్రహ్మణ్యం said...

సరిలేరు మీకెవ్వరూ అని నేను కూడా పాడాను. సంవత్సర సమీక్ష బాగుంది.

ఇలాగే మీరు మరెంతో పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

కృష్ణప్రియ said...

తృష్ణ గారు,

ధన్యవాదాలు.

స్నిగ్ధ,

:)ధన్యవాదాలు! ఈ మాత్రం భరోసా ఇచ్చారు గా.. ఇక వ్యవసాయం మీద టపా టపా నాల్గు టపాలు రాసేస్తా..

అన్నట్టు ఈ మధ్య కనిపించటం లేదు?

బులుసు వారు,

ధన్యోస్మి.

kastephale said...

సంవత్సరం ఇంకా వారం వుందండి. అప్పుడే చుట్టేస్తే ఎలా.

kastephale said...

సంవత్సరం ఇంకా వారం వుందండి. అప్పుడే చుట్టేస్తే ఎలా.

Kathi Mahesh Kumar said...

మీ బ్లాగుపేరే కృష్ణప్రియ ‘డైరీ’. కాబట్టి ఎక్కడ జీవితపు గీత రాతగా మారుతుందో అదే మీ బ్లాగు రూపం సంతరించుకుని అలరిస్తోంది. జీవితాన్ని అనుభవిస్తూకూడా అంతే విశ్లేషణాత్మకంగా, విమర్శనాత్మకంగా, విస్తృతంగా ఒక విశ్వరూపంగా చూడటం డైరీల ఉద్దేశం. ఆ విషయానికి సార్థకత చేకూరే బ్లాగు మీది. సార్వజనిక జీవితంలోని మూల్యాంకనల్ని వ్యక్తిగత పార్శ్వాలతో కలిపి వండివడ్డించే మీ బ్లాగుతీరుకి అచ్చొచ్చే మరో మ(మె)చ్చుతునక ఈ టపా. అభినందనలు.

జయ said...

చాలా బాగున్నాయి మీ అనుభవాలు. చెప్పిన పధతి ఇంకా బాగుంది.

జేబి - JB said...

1.మీరు చేసిన‌ తప్పలను‌ బహిరంగంగా చెప్పటం (కన్‌ఫెషన్‌) చాలా ధైర్యమైన‌ విషయం!

2. మీ`జ్ఞాపకశక్తి‌ అమోఘం - లేకపోతే సంవత్సరంలో చూసిన‌ కొత్త‌ రుచులు‌ ఎలా‌ గుర్తున్నాయండీ‌ బాబోయ్!

SHANKAR.S said...

చాలా బాగా రాశారండీ.ఇంత వినూత్నంగా గడచిన సంవత్సరాన్ని సమీక్షించడం కూడా మీ చిరు విజయాల సెక్షన్లో చేర్చేస్తున్నాం.

ఇకపొతే మీ వ్యవసాయ విజయాల విభాగంలో సీతాఫలాల సాగు గురించి లేకపోవడం కడు శోచనీయం. నేను ఖండిస్తున్నా హై.

Anonymous said...

*చిన్న రిక్వెస్ట్.. ఇక 'మెగా' వాడకం వదిలేద్దాం.*

బాగా చెప్పారు. ఆర్ముగం మీద టపా రాసినప్పుడే మెగా నుంచి టెరా రైటర్ (10^12) గా ఎదిగారు. మంచి టపాలు రాస్తూ వచ్చే సంవత్సరాంతానికి జెట రైటర్ (10^21)గా ఎదగాలని ఆశిస్తూ, నూతన సంవత్సర శుభాకంక్షలతో

శ్రీnivas

Vani said...

క్రిష్ణ ప్రియ గారు,

మీ బ్లాగ్ నేను ఎన్నో రోజుల నుంచి ఫాలో అవుతున్నా. చదివిన ప్రతిసారు ఎంతో inspire అవుతాను. జీవితం లో జరిగే చిన్న చిన్న విషయాలను మీరెంత చక్కగా చెబుతారు అంటే, నేను మర్చిపోయాను అనుకొన్నవన్ని మళ్ళా ఎంజాయ్ చేయగలతున్నా.

Thank you!!
- వాణి

కృష్ణప్రియ said...

కష్టేఫలే శర్మ గారు,

:) అవును. మిగిలిన వారం గురించి మళ్లీ రాసుకుంటాను.

మహేశ్ కుమార్ గారు,

అమ్మో, చాలా పొగిడేసినట్టున్నారు. మీరన్నంత గొప్పగా నా బ్లాగ్ ఉంటే అదృష్టవంతురాలినన్నట్టే.. ధన్యవాదాలు!

జయ గారు,

థాంక్సండీ.

కృష్ణప్రియ said...

జేబీ గారు,

థాంక్స్! ఎవరైనా అడుగుతారు అనుకున్నాను. మీరడిగారు.

నేను చెప్పిన తప్పుల పట్టీ లో కనీసం ఒకటి రెండు దాదాపు అందరూ చేసేవే అనుకుంటున్నాను. నేనైతే ఇంకా కూడా చేసి ఉండవచ్చు, చేశాను కూడా.

అలాగే, ఇవి మాత్రమే నేను చేసిన తప్పులని అనుకుంటున్నాను కానీ, నా చుట్టూ ఉన్నవాళ్లు గమనించినవి ఇంకా ఎన్నో ఉండచ్చు :)

ఇదే మొదటి సారి రాసుకోవటం.. ఇలా రాసుకోవటం మాత్రం చాలా తృప్తినిచ్చింది. ఒకటి రెండు సార్లు ఆలోచించాను, ఇవి బ్లాగ్ లో రాయనా? పర్సనల్ డైరీ లోనా అని.

ఏ వ్యక్తయినా ఇవీ నా విజయాలు అని రాసుకుని అపజయాలు, చేసిన తప్పులూ రాసుకోకపోతే అది అసంపూర్తిగానే ఉంటుందనిపించి రాశాను.

మళ్లీ ఇంకోసారి ధన్యవాదాలు. ఇక జ్ఞాపక శక్తి :) కొన్ని బ్లాగ్ లో, కొన్ని ఫేస్ బుక్ లో, కొన్ని పర్సనల్ డైరీ లో, మరి కొన్ని మస్తిష్కం లో, డాక్యుమెంట్ అయ్యే ఉన్నాయి లెండి.

సుభ/subha said...

:):):)

ఆ.సౌమ్య said...

Excellent, ఎంత అందంగా రాసారో! మీ శైలి విలక్షణం అని మరోసారి నిరూపించుకున్నారు. వచ్చే సంవత్సరం కూడా ఇలాగే ఆనందంగా గడపగలరని ఆశిస్తున్నాను.

కృష్ణప్రియ said...

శంకర్ గారు,
ధన్యవాదాలు! సీతాఫలాలంటారా? అవి క్రిందటేడు కూడా కాసాయి. ఈ సంవత్సరం కొత్తగా మొదటి సారి పూసిన పువ్వులు, కాసిన కాయలు మాత్రమే రాశాను.

శ్రీnivas గారు,

వామ్మో.. ఎక్కడికో తీసుకెళ్లి పోయారు. మీ అభిమానానికి ధన్యవాదాలు.

@ వాణి గారు,

థాంక్స్ అ లాట్! యూ మేడ్ మై డే!

@ సుభ గారు,

:)) థాంక్స్

@ సౌమ్య,

ధన్యవాదాలు!

Kottapali said...

బాగుంది విహంగ వీక్షణం ఆత్మపరిశీలనం.

"కొన్ని పరిచయాలు స్నేహాలు, ముందు రోజు జాజుల్లా వడలిపోగా, .." ఈ వాక్యం ఈ మధ్యనెప్పుడో నేను రాసుకున్నట్టుగా ఉంది.

మీ గేటెడ్ కమ్యూనిటీలో పెద్ద తోటే ఉన్నదండీ! Impressed!!

పాట కూడా బాగానే పాడతారన్నమాట. Double Impressed.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

Nice and new appraoch to the yearend retrospective.

పరుచూరి వంశీ కృష్ణ . said...

బాగుందండి మీ సింహావలోకనం ...అల్ ది బెస్ట్ ఫర్ 2012

కొత్తావకాయ said...

అన్వర్థనామధేయం "కృష్ణప్రియ డైరీ"!

అందంగా, స్పష్టంగా.. ఓ సంవత్సరాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నారు. వాహ్!!

నందు said...

@కృష్ణ ప్రియ గారు : చాలా బాగా రాసారండీ. నేనెప్పుడూ అదే అంటాను. మనిషికి ముందు చూపు తోబాటే వెనక చూపూ కావాలని. నిన్న పొందిన అనుభవం విత్తనంగా నేడు మనం చేసే వ్యవసాం రేపటికి ఫలసాయం ఇస్తుంది. అనుకొన్న ఫలితాలొచ్చినా రాకపోయినా ఇలా మనసు పుస్తకంలో పోగవుతాయి, అనుభవాలూ అనుభూతులూ తరచి చూసుకొంటే ఏరోజుకైనా మధురశ్మృతుల్లా గుభాళిస్తాయి. మీకూ, మన బ్లాగ్ మిత్రులందరికీ 2012 సంవత్సరం ఆయురారోగ్యాలతో పాటూ ఆనందోత్సాహాలని ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకొంటూ,ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలతో
-నందు

జయ said...

మీకు నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

సుభ/subha said...

మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

Rao S Lakkaraju said...

నూతన సంవత్సర శుభా కాంక్షలు. ఈ కొత్త సంవత్సరము మీ మంచి మంచి కోరికలన్నీ నెరవేరాలని ఆశిస్తూ

లక్కరాజు

sphurita mylavarapu said...

బావుందండీ మీ సిమ్హావలోకనం...మీ 2011 జ్ఞాపకాల్లో నాక్కూడా చోటు దొరికింది...ధన్యురాలిని...

Ruth said...

చాలా బాగుంది కృష్ణ ప్రియ గారు. అందరూ ఓ కొత్త సంవత్సరం అని వచ్చే ఏడు గురించే ఆలోచిస్తారు గాని, ఇలా వెళ్ళే ఏడు గురించి ఒక సిమ్హావలోకనం చేసుకోడం చాలా బాగుంది. మీరు ఇన్ని విషయాలు గుర్తు పెట్టుకున్నారు చాలా గ్రేట్. నేను ప్రతీ ఏడు ఒక్కటే అనుకుంటాను ఆ సంవత్సరం చదివిన పుస్తకాలు గుర్తు చెసుకుని ఒక ముక్కైనా రాసుకోవాలి అని. ఊ హూ ఇప్పటి వరకు కుదరలేదు. ప్చ్ !
ఆ ఇంకో విషయం, మీ బ్లాగు వల్ల నేను ఉసిరికాయలతో వండటం నేర్చుకున్నాను. చాలా థాంక్స్.

కృష్ణప్రియ said...

@ కొత్తపాళీ గారు,

:) మీలాగే ఆలోచించానన్నమాట! ధన్యోస్మి...

చాలా చాలా థాంక్స్!

@ WP,

Thanks!

@ నందు గారు,

మంచి మాట చెప్పారు. మీకు చాలా చాలా ఆలస్యం గా నూతన సంవత్సర శుభాకాంక్షలు..

@ పరుచూరి వంశీ కృష్ణ గారు, కొత్తావకాయ,
ధన్యవాదాలు..

జయగారు, సుభ గారు, Rao Lakkaraju గారు,

ధన్యవాదాలు. మీకు కూడా శుభాకాంక్షలు..

@ స్ఫురిత గారు,

ధన్యవాదాలు. ప్రొఫైల్ ఫోటో కనే కాదు. నా గేటెడ్ కమ్యూనిటీ కథల సిరీస్ కి బొమ్మవేసినందుకు కూడా.
అదే బొమ్మ నా బ్లాగ్ టపాతో పాటూ ఆంధ్రజ్యోతి లో వేశారు.
ఈ సిరీస్ లో వచ్చే ప్రతీ టపా కీ అదే బొమ్మ వాడుకుంటాను.

రుత్ గారు,

థాంక్స్!
ఒక విధం గా బ్లాగ్ ద్వారా, డైరీ లోనూ ఎప్పటికప్పుడు రాసుకోవటం వల్ల సాధ్యమైంది..

నా వల్ల ఉసిరికాయ వంట నేర్చుకున్నానన్నారు :) బాగుంది బాగుంది.

Unknown said...

మీ సమీక్ష గురించి చెప్పడానికి మాటల్లేవు.
అసలు ఇన్నిరోజులు ఈ బ్లాగ్ ఎలా మిస్ అయ్యానో??
ఇకపొతే మీ వ్యవసాయం గురించి కొంచం వివరంగా చెప్పగలరా
శ్రమ అనుకోకపోతే ఒక పోస్ట్ రాయండి.
ఎరువులు అవి వాడాతార? ఏమి పండిస్తారు తదితర వివరాలతో ఒక పోస్ట్ రాయగలరు.

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;