క్యూబ్ లో నేనూ, మా సింగం ( నా సహోద్యోగి) యమా సీరియస్ గా పని చేసుకుంటున్నాం. మా బాసు గారు వెనక నుంచి వచ్చి అంత కన్నా సీరియస్ గా.. ప్రాజెక్ట్ డెడ్ లైన్ పొడిగించబడింది. అమెరికా టీం వాళ్లకి వేరే ఏవో ఎమర్జెన్సీల వల్ల మా పని చేయరు. అని చెప్పి, ఆ వార్త మా మెదడు లో పూర్తిగా ఇంకే లోపలే ఆయన కి ఏదో ఫోన్ కాల్ వచ్చి చక్కా వెళ్లి పోయాడు. ఇంక సగం వాక్యం రాసిన డాక్యుమెంట్ అలాగే వదిలేసి బ్రేక్ రూమ్ లో కెళ్లి పిచ్చాపాటీ లో పడ్డాం. మాతో పాటూ, ఇంకో నలుగురు చేరారు. ఇలాంటి సమయాల్లో మనకి ఉండే టాపిక్కులు ఏముంటాయి? ఆఫీస్/దేశ రాజకీయాలు, మా కంపెనీ కాకుండా అన్ని కంపెనీల్లో ఎంత చక్కటి జీతాలు, గట్రా ఇస్తున్నారో, ఎవరు ఎక్కడ ఇళ్లు కొనేస్తున్నారో అయ్యాక ఇంక మిగిలింది సినిమా యే కదా! బిజినెస్ మాన్ జోకులు, పవన్ కళ్యాణ్ జోకులు, బాలకృష్ణ /జూనియర్ NTR జోకుల్లాంటివి తెలుగు వాళ్లు చెప్తే, తమిళులు, హిందీ వారు వాళ్ల సినిమా స్టార్ల జోకులు చెప్తూ అలరిస్తుండగా మా సింగ పెరుమాళ్ ఇవన్నీ కాదు కానీ క్రిందటేడు ‘తమిళ్ పటం’ అని ఒక సినిమా వచ్చింది. ఒక్క సినిమా చూసారంటే అన్ని సినిమాలూ చూసినట్టే.. ‘నాను గారంటీ’ అనేశాడు. నేనూ ఎక్కడో ఆ సినిమా గురించి చదివాను. సాధారణం గా సింగం మాట మీద నాకు చాలా గురి. క్యూబ్ కెడుతూనే, ఆన్ లైన్ లింక్ నాకు ఇచ్చాడు.
రేపెలాగా గణతంత్ర దినోత్సవం .. ఇంట్లోనే ఉంటాం కదా అప్పుడు చూద్దామనుకున్నాను. లింక్ పని చేస్తోందో లేదో చూద్దామని చూస్తే ఏముంది.. ఆంగ్ల సబ్ టైటిళ్లు లేవు. సర్లే అని వదిలేసి వేరే పనుల్లో పడ్డాను. రాత్రి, మీటింగ్ కాన్సెల్ అయింది. పిల్లలు గణతంత్ర దినోత్సవం కార్యక్రమాలకి తయారవుతూ చాలా బిజీ గా ఉన్నారు. కాస్త బ్లాగులు చూద్దామని లాప్ టాప్ తెరిచాను. ఎదురు గా ‘తమిళ్ పటం ‘ సినిమా డౌన్ లోడ్ అయి ఉంది. సరే చూద్దాం ఎప్పుడు అర్థం కాక బోర్ అనిపిస్తుందో అప్పుడే మానేద్దాం. అని మొదలు పెట్టాను.
ఈ మధ్య కాలం లో భాష పూర్తిగా అర్థం కాకపోయినా అంతగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన సినిమా ఇదే..
సబ్ టైటిల్స్ కూడా లేకుండా చూసి ఒక రివ్యూ రాసే సాహసానికి ఉసి గొల్పిన సినిమా ఇది. అప్పటికప్పుడు కొంత మంది స్నేహితులకి ఫోన్ చేసి మరీ చూడమని బలవంతం పెట్టేందుకు ప్రేరేపించిన సినిమా ఇది.
“బామ్మా! ఇన్నాళ్లుగా నీ హృదయం లో సమాధి చేసిన రహస్యం చెప్పమ్మా చెప్పు.. నేనెవర్ని? నా తల్లిదండ్రులెవరు? నా ఊరేది?” అని హీరో చచ్చే భావోద్వేగం తో అడిగితే.. నింపాదిగా ‘అదేం పెద్ద విషయం కాదు.. నువ్వడగలేదు.. నేను చెప్పలేదు! అయినా ఇన్ని సినిమాలు చూస్తావు .. GK బొత్తి గా లేదేంటి? “ మెడ లో లాకెట్ చూసుకో.. అంటే కనీస స్పృహ లేని కథా నాయకుడు పాతికేళ్ల జీవితం లో మొట్ట మొదటి సారి లాకెట్ తెరిచి తల్లి దండ్రులని చూసుకుని కన్నీళ్లు పెట్టుకునే సీన్, చూసి చిరునవ్వైనా రాకుండా పోదు.
హీరోయిన్ తండ్రి ‘నీ అంతస్తేంటి నా అంతస్తేంటి? అని హీరో ని అడిగితే, నీకన్నా బోల్డు రెట్లు సంపాదించి హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటానని చాలెంజ్ చేసి హీరో పౌరుషం గా బయటకెళ్లి ఒక పాట అయ్యేలోపల పాల పాకెట్లు, పత్రికలూ వేసి, పండ్లమ్మి, పాత ఇనప సామాన్లు కొని, పార్కులో ప్రేమికులకి పల్లీలమ్మి, కత్తులకి పదును బట్టి, కూలీ పని చేసి వేలాది కోట్లు సంపాదించి (అదీ హీరోయిన్ తండ్రి కప్పు కాఫీ తాగే లోపల!) పది ఫారిన్ కార్లలో రావటం చూస్తే నవ్వే నవ్వు.
ఇక, చెల్లి కాలేజ్ కెళ్తే, అరిచేతుల మీదుగా నడిపించే అన్నలు, రైలు డబ్బా మీద ప్రేమలేఖలు రాసే గంగోత్రులు, కాలేజ్ కెళ్లే నలభై ఏళ్ల లేత బాయ్స్, జులపాల జుట్ల విలన్లు, చిన్న స్టికర్ పెడితేనే ప్రేమికురాలు కూడా గుర్తు పట్టనంత మారిపోయే హీరో రూపం, చూస్తేనే పొట్ట చెక్కలవటం ఖాయం.
హీరోయిన్ ని ఇంప్రెస్ చేసేందుకు హీరో ఒక్క రాత్రంతా కష్టపడి భారత నాట్యం నేర్చుకుని ప్రదర్శన ఇచ్చిన సీన్ చూసి నేనైతే కుర్చీ లోంచి కింద పడి నవ్వాను. (ముఖ్యం గా భాగ్య రాజా స్టెప్ లు చూసి నాట్యం నేర్చుకోవాలని చూడటం)
వీధి లో దుండగులు ఫుట్ పాత్ మీద అమ్ముకునేవారి మీద చేసే జులుం అన్యాయాన్ని ఎదిరించటానికి ఒక పెడల్ వేసి సైకిల్ చక్రం తిప్పి పెద్దయి వచ్చి వారిని చితక్కొట్టిన సీన్ అవగానే దళపతి అయిపోయి, రజనీ కాంత్ లా డాన్స్ వేసే సీన్ ‘అబ్బ! ఎన్ని సినిమాల్లో చూశాం?’ అనిపించక మానదు.
దరిద్రం ఓడుతున్న ఇంటి తలుపు తీస్తూనే అత్యంత ఆధునిక సదుపాయాలతో కూడిన ఇళ్లు, భయంకరమైన టెక్నాలజీ తో కట్టిన విలన్ల డేన్లూ, ఆదిమ మానవుడి కాలం నుండీ ఒకేరకం గా కనిపించే CBI కార్యాలయాలూ, పోలీస్ ఆఫీసర్లూ.. డాక్టర్లూ,
పనీ పాటా లేకుండా పతంగులకోసం మాంజా కోసం గాజు ముక్కల్ని మరిగిస్తున్న హీరోనీ, అతని బేవార్స్ స్నేహితుల దగ్గరకి కాలనీ సమస్యలు చెప్పుకోవటమే నవ్వు తెప్పిస్తే, ప్రజలకోసం తన డబ్బునీ, బండి నీ లంచం ఇవ్వటం చూస్తే గిగిల్ గిగిల్..
గజనీ, అపరిచితుడు, అపూర్వ సహోదరుల తరహా లో విలన్లని చంపే పద్ధతులు చూసి నవ్వీ నవ్వీ, డొక్కల నొప్పులు..
ఇక అన్నింటి కన్నా హైలైట్ హీరో ప్రేమ ట్రాక్, హీరోయిన్ కనపడుతూనే, లైట్లు వాటంతట అవే వెలగటం, గంటలు మోగటం, రోడ్డు మీద కనపడే ప్రతి ఆడ మనిషి లోనూ హీరోయినే కనిపించటం.. కాలేజీ ఇంటర్ కాం లో మైక్ లో ‘ ఐ లవ్ యూ’ చెప్ప టానికి క్యూ, ఊరంబడా చిత్తం వచ్చినట్టు కలిసి తిరిగి, ప్రధానం సమయం లో మాత్రం తెగ సిగ్గు పడటం.. ‘అబ్బ.. ఒక్కటని చెప్పటానికి లేదు’.
ఆంగ్లం లో విడిపోయిన కుటుంబ సభ్యులు ఎమోషనల్ పాట పాడుతూ కలవటం కూడా తెగ నచ్చింది..
క్లైమాక్స్ లో ఫైట్ అయితే చెప్పనే అక్కరలేదు.
సినిమా లో మొదటి సీన్ లోనే వర్షపు రాత్రి గుడిసె లో ఒక తల్లి ప్రసవ వేదన! మంత్రసాని, గుడిసె బయట తండ్రి ..అంతా మామూలే. బిడ్డ క్యార్ మన్నాడు.
‘మళ్లీ మగ బిడ్డ!’ ఆ ఊరి ఆచారం ప్రకారం బిడ్డ కి జిల్లేడు పాలు పోసి చంపేయమని తండ్రి మంత్రసాని కి ఆదేశం,.. హృదయ విదారకం గా ఏడుస్తున్న పురుట్లో పసి కందు ని మంత్రసాని తీసుకెళ్లిపోతుంది. ‘ఎందుకు? ఎందుకు? ఎందుకు? ‘ దానికో ఫ్లాష్ బాక్. ఆ ఊరి ‘పెదరాయడు’ ఒకానొక చారిత్రాత్మక తీర్పు ఇస్తూ, ‘ఈ ఊరి మగ బిడ్డలు పెరిగి పెద్దయి, చెన్నై కి వెళ్లి అక్కడ పంచ్ డైలాగులు కొడుతూ, హీరోలయిపోయి, మొదటి సినిమా రిలీజ్ అవకుండానే ముఖ్యమంత్రి పదవి కి అభ్యర్టులవుతున్నారు.. కాబట్టి.. పుట్టిన మగ పిల్లలకి.. జిల్లేడు పాలు..
మంత్రసాని హృదయ విదారక మైన పాట పాడుతూ, జిల్లేడు పాలు పట్టబోయేంతలో, ‘బుడ్డ సూపర్ స్టార్’ “ఆగు!! నన్ను గూడ్స్ బండి ఎక్కించు.. అన్ని సినిమాల్లో గూడ్స్ బండి చెన్నై కే వెళ్తుంది కదా!” అంటాడు. ఈవిధం గా బామ్మగారిని మురిపించి, ఆవిడ తోడుగా మదరాసు మహానగరానికి చేరతాడు.
వెంటనే అలవాటు ప్రకారం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ పైన జూమ్ చేస్తుంటే ఒక ఆటో డ్రైవర్ వచ్చి.. ‘ఏంటి? మళ్లీ ఇంకో హీరో వచ్చినట్టున్నాడు చెన్నై కి? ఏం బాబూ? మద్రాసంటే ఇక రైల్వే స్టేషన్ ఒక్కటే ఉందా? బీచ్ ఉంది.. కాలేజీ ఉంది.. పోరా..’ అని బెదిరిస్తాడు. ఇలాగ చెన్నై కి చేరిన బాబు హీరో గా ఎదిగిన విధానం, అతని విజయాలు ఈ సినిమా కథ.
మనల్ని ఈసినిమా ఎంత నవ్వించినా తెర పైన పాత్రం చాలా చాలా సీరియస్ గా చేశాయి. అలాగే సంగీతం, ఛాయాగ్రహణం చాలా బాగున్నాయి. హీరో చాలా చాలా ప్రతిభావంతుడు. డైలాగులు పెద్దగా అర్థం కాకపోయినా తెలుగు సినిమాలూ అదే అదే చూపించి మనల్ని ఈ సినిమా చూడటానికి రెడీ చేసేసాయి.
మా అత్తయ్య వాళ్ల ఊర్లో ఒకావిడ అంతంత సొమ్ము పోసి కొంటున్నాం టికెట్టు అని కనీసం 18 రీళ్లయినా ఉండే సినిమాకే వెళ్తాను.. అనేది. అలాగ, ఈ ఒక్క సినిమా చూస్తే వంద సినిమాల పెట్టు.
ఈ సినిమా సమీక్ష కోసం :
http://www.indiaglitz.com/channels/tamil/review/11518.html
ఆలమూరు సౌమ్య రాసిన సమీక్ష చిత్ర మాలిక లో :
http://chitram.maalika.org/%E0%B0%A8%E0%B0%BE%E0%B0%95%E0%B1%81-%E0%B0%A8%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AE%E0%B1%82%E0%B0%A1%E0%B1%81-%E0%B0%A4%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B3-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8/
చూసి చెప్పండి మీకెలా అనిపించిందో..