Monday, June 11, 2012

అగ్వగ్వాగ్వాగ్వ! మీకు పండగ, మాకు దండగ...

తెలుగు కవిత్వం చెప్పాలంటే, మగవారికి, థళ థళ లాడే తెల్లని ధోవతి, కుర్తా, కండువా, ఆడవారికి హుందా తనం ఉట్టిపడే చీరలు,..గట్రా... బాసంపెట్లు వేసుకునో, లేక ఎటో అలౌకికావస్థ తో, తీరిగ్గా ప్రశాంతత నిండిన ముఖం తో, ఉండాలేమో, అనే స్టీరియో టైపింగ్, మనసులోకి వచ్చేస్తుంది నాకు.. నిత్య జీవితం లో దాక్కున్న కవిత్వం ఎన్నో సందర్భాల్లో, తొంగి చూసినా, కొన్ని సార్లు కొన్ని చిత్రాలు ఇలాగ మస్తిష్కం లో నిలిచిపోతాయి.


ఈ మధ్య భాగ్య నగరం లో కొన్ని ప్రాంతాలకి వచ్చి వారానికో సారి సంత పెడుతున్నారు గా.. ఆకు కూరల దగ్గర్నించీ, ఇనప మూకుళ్ళదాకా! అప్పడాల నుండీ, సమోసాల దాకా కూడా అమ్మేస్తూ.. మా అమ్మగారింటి దగ్గర ప్రతి మంగళవారం పెట్టుకునే ‘మంగళవారం మండీ’ గురించి ఎన్నోసార్లు విన్నాను, చూశాను, కానీ ఎప్పుడూ, మంగళ వారం సాయత్రం హైదరాబాదు లో అమ్మగారింట్లో, తీరిగ్గా గమనించే అవకాశం రాలేదు. ఈసారి వేసవి కాలం లో హైదరాబాదు కెళ్లినప్పుడు కాస్త తీరిక చేసుకుని, కాస్త షాపింగ్ చేశాను. కొద్ది మందిని అడిగి నాలుగు ఫోటోలు తీశాను.. మా పిన్ని నాకు మోడలింగ్ కూడా చేసింది గా :)


మంగళ వారం అయ్యేసరికి, మా కళ కళ లాడే కూరగాయల మార్కెట్ కి చిన్ని కవితలూ,సరదా పిలుపులూ, స్లోగన్లూ, పెట్టని తోరణాలు..

మధ్యాహ్నం రెండు దాటడమేంటి! ఇళ్ల ముందు రోడ్డు బ్లాక్ చేసి పట్టాలు పరవటం మొదలు పెట్టారు. మా స్కూటర్లు అవీ కూడా లోపల పెట్టేసాం. మా ఇంటి ముందు గోరు చిక్కుడు కాయలమ్ముకునే లక్ష్మి, తన బిడ్డని అలవాటు గా మా ఇంట్లో పడుకో పెట్టి వెళ్లి కూర్చుంది. మేమూ, ఓ సంచీ వేసుకుని సంత లోకి దూరిపోయాము.

‘అగ్వగ్వాగ్వాగ్వాలూ బీస్కుదో కిల ..బీస్కుదో కిల..’

‘ఏంటండీ? అంటున్నాడూ!’ అంటోంది ఒకావిడ కొత్తగా వచ్చినట్టుంది భాగ్యనగరానికి.. కాస్త కోస్తా యాస తో ..

‘ఇరవై కి రెండు కిలోల్.. బామ్మగారూ.. బంగాళా దుంపల్ చవ్కా.. చవ్కా! గింత చవ్కాగా ఎక్కడ దొర్కాద్!’ అని స్లోగన్ మార్చి పిలిచాడు, ఆలుగడ్డలమ్ముకునే అబ్బాయి.



మామిడి కాయలమ్ముకునే ఈ కవి హృదయం చూసే జనాలు అయస్కాంతానికి ఆకర్షించబడే ఇనప రజను లా వచ్చి చేరుతున్నారంటే నమ్మండి...

‘పప్పులకూ, ఉప్పులకూ,

చట్నిలకూ, పుల్సులకూ,’

‘రైసులకూ, షర్బత్తులకూ’

ఏడుకొక్కటి, పదికి రెండు,

‘తియ్యంగ కావాల్నా! రాండ్రి.. పుల్లంగ కావాల్నా! రాండ్రి,

చప్పని కాయ కావల్నంటే ఈడ కష్టం, ఆ యేన్క మీ ఇష్టం!’

అని అందర్నీ పిలుస్తుంటే, కాయ ఎలా ఉన్నా కోనేయాలనిపించి సంచీ నింపేసా.



‘పది కి మూడు, దస్కూ తీన్’ అంటూ అమ్ముకుంటున్న ఆకుకూరలమ్మి ని వెళ్లి ‘పది కి ఐదిస్తావా?’ అని అడిగి ‘పోమ్మా! ఎప్పుడైనా కూరలు కొన్న ముఖమేనా? చేయి తీయి నా ఆకు కూర మీద !’ అనిపించుకుని, ‘అందరికి నాలుగిస్తున్న, కళ్లజోడు ఆంటీ బిడ్డవి కద! నువ్వు ఐదు తీస్కో పో’ మని కూడా ఇంకో చోట కాస్త తగ్గింపు ధర సాధించుకుని, ‘బోణీ బేరం.. తీస్కోమ్మా బేరం వద్దు’ అని అప్పటికే కనీసం పది మందికి నా కళ్లముందే ముందుగా అమ్మినా సెంటిమెంట్ తో కొట్టి కొనిపించిన వారిని వారించలేక, సంచీలు నింపుకుంటూ,.. తిరుగుతూ ఉన్నాను..

‘దస్కూ చార్ దస్కూ చార్.. మీకు పండగా.. మాకు దండగా.. దస్కూ చార్..’ అని ములక్కాడల వ్యాపారి కవితా ధోరణి లో పిలిచాడు. ములక్కాడ అప్పుడు కొనాలనుకోక పోయినా, ‘మీకు పండగా.. నాకు దండగా..’ లైన్ నచ్చి ఓ నాలుగు కొనేశాను.

బంగారం.. బంగారం.

బంగారం, బంగారం, రేపు ప్రియం, ఇయ్యాల నయం.. పది కి కిల బంగారం.. బంగారం.

బజార్లో ముప్ఫై వేలకి తులం అంటున్నారు, ఇతను పది కి కిలో అంటున్నాడు అని చూస్తే బంగారు ముద్దల్లాంటి దోసకాయలు.. నిజమే! బంగారం పెట్టుకున్న దగ్గర్నించీ, వంటి మీద బరువు, ప్రశాంతత కరువు! (బాబోయ్.. నాకూ కవిత్వం వచ్చేస్తోంది!!) అదే దోస కాయలైతే, చలవ, హాయి,.. ఆహా.. ఓహో అనుకుని ఓ కిలో అవీ పడేశా సంచీ లో.


కుంపట్లు, మూకుళ్ళు,. కవ్వాలు, ఇనప పెనాలు, కొలత పాత్రలు,.. చెక్క గరిటెలు, జల్లెడ లూ, కత్తులు, పట్టకార్లు,.. ఆహా  చూస్తేనే,  నాకు కడుపు నిండిపోయింది.



‘కళకి భాషా బేధాల్లేవు..’ అని ‘సినీ’ కళాకారులు ఇచ్చే స్టేట్ మెంట్లు చూసి.. నవ్వుకుంటూ ఉంటాను కానీ, వ్యాపారం విషయం లో మాత్రం, ఒకటే సూత్రం.. ‘ఏ భాషైనా.. వస్తువు అమ్మ గలగాలి, అది అమ్మేమనిషి బాధ్యతే’

‘మల్లే పూల్ , మల్లే పూల్! అంటూ సైకిల్ మీద అమ్మేసుకుంటున్న ఆసామీ, బుర్ఖా వేసుకున్న ఆడవారి కోసం, ఒక్కసారి గా, ‘మొగ్రా, మొగ్రా,.. లేలో, జీ మొగ్రా..’ అని భాష మార్చాడు. ఆంగ్ల భాష లో సంభాషణ జరుపుతూ, వెళ్తున్న కాలేజీ అమ్మాయిలు పక్కన కనపడేసరికల్లా, మళ్లీ ‘ఫాట్ జాస్మిన్స్, ఫ్రెష్, ఫాట్ జాస్మిన్స్.. టేక్ మాడం..’ అని మార్చేశాడు. ఘటికుడే!

వాగ్ధాటి లేని వ్యాపారుల దగ్గర అయ్యో ఒక్కరూ లేరే!


వంకాయల వ్యాపారికి మాత్రం, అతని వాగ్ధాటికీ, వ్యాపార చతురత కీ, నేను మొదటి స్థానం ఇచ్చేస్తాను.

ఓ రాజ శేఖర రెడ్డి లా, ఓ చంద్రబాబు నాయుడిలా, రకరకాల మోడ్యు లేషన్ల తో, ‘అమ్మ్మా! మా వంకాయలు కొని, మీ కుటుంబం లో కలతలొస్తే నాకు సంబంధం లేదు.. లేత గున్నయ్ గదా, పాలు కారుతున్నయ్ అని, నువ్వు మసాల బెట్టి, కమ్మగ వండి, మొగునికి పెట్టకుండ, అత్త,మామకి వాసనైన చూపకుండ, బిడ్డలని కనికరమైన చేయకుండ, పొయ్యి మీదకెల్లి తీసి, అంత నువ్వే తింటే, అది మా తప్పు కాదు. మమ్ముల్ని అడిగితే, మాకు తెల్వదు. మా మీదకు రావొద్దు! లేత వంకాయల్’ అని అందర్నీ ఆకర్షిస్తున్న అతని ముందున్నవి అన్నీ, ఎండిపోయిన, వడలిపోయిన కాయలు. చాలా వరకూ పుచ్చులు కూడా ఉండవచ్చు..

గల గల లాడుతూ, ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ, ఎకసెక్కాలు చేసుకుంటూ,..

చీకటి పడిపోతోంది.. త్వర త్వరగా అమ్ముకుని ఇళ్లకి వెళ్దామనుకునే తొందర లో, లైట్ల వెలుగు లో,..

కిలో ఇంతకి’ అని అమ్ముకునే వారల్లా, కుప్ప ఐదుకి, కుప్ప పదికి,.. అని ఖాళీ సంచులు సద్దుకుని, అమ్మిన మేరా, కాస్త తుడిచేసి, పిల్లల్ని, పైసల్ని జాగ్రత్త గా పట్టుకుని, వాళ్ల కార్రియర్ బండ్లు ఎక్కేసి, గొడవ గొడవ గా.. వెళ్లి పోయారు. కూరగాయల మార్కెట్ కవిత్వం, మాత్రం, నన్ను ఇప్పటిదాకా వెంటాడుతూనే ఉంది.. మళ్లీ బెంగుళూరు లో సూపర్ మార్కెట్ లో ‘డల్’ గా రోల్ లోంచి కవర్లు చింపుకుని, కూరగాయలు, పండ్లు నింపుకుని వస్తున్నప్పుడల్లా, ముఖం మీద చిరునవ్వు తెప్పిస్తూనే ఉంది.

20 comments:

Anonymous said...

:)

మాలా కుమార్ said...

అగ్వాగ్వా ఏమిటా అనుకున్నాను . అగ్గువ అని నాలుగైదు సార్లు చదివితే అర్ధమైంది :) మా దగ్గర ఆదివారం పొద్దున పెడుతారు సంత . కాకపోతే చాలా ఏళ్ళ నుంచి పెడుతున్నారట .

Sai said...

హహ.. బాగుందండీ...
అగ్వాగ్వా ....

Sai said...

హహ.. బాగుందండీ...
అగ్వాగ్వా ....

జ్యోతిర్మయి said...

కృష్ణ ప్రియ గారూ... ఎర్రగడ్డ రోడ్డుమీదుగా, భరత్ నగర్ సంత దాకా వెళ్ళిపోయాను.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

Soooooooooper :)

తృష్ణ said...

ఇది చూడండి... మీరు కామెంట్ కూడా రాసారు గుర్తుందా?
http://trishnaventa.blogspot.in/2011/02/blog-post_27.html

మాకు రెండు సంతలు ఇప్పుడు శనివారం ఒక వీధిలో, మంగళవారం మరో వీధిలో.
నాకు మొదట్లో సంతలో వాళ్ళు "ఎగ్వాగ్వా..." అని అరుస్తుంటే అర్ధం అయ్యేది కాదు... "ఎక్కువ" అంటున్నారేమో అనుకునేదాన్ని... తర్వాత మావారు చెప్పారు..."ఎగ్వాగ్వా..." అంటే "చవగ్గా" అని :)
మొదట్లో చవగ్గానే ఉండేవి ధరలు. ఈ మధ్యన ఈ సంతల్లో కూడా రేట్లు పెంచేసారు. 1/4kg పది రూపాయలు ఫిక్స్డ్ & లాక్డ్ అయిపోయింది. వేసవి దాటితే ధరలు తగ్గుతాయేమో చూడాలి.

Padmarpita said...

అగ్వాగ్వా...వహ్వా...వహ్వా:-)

బులుసు సుబ్రహ్మణ్యం said...

మీరెంత ఖరీదైన కవిత్వం వ్రాసినా మా కామెంటు మాత్రం అగ్వాగ్వా నే...........దహా.

Mauli said...

అగ్వాగ్వా అంటే బంగాళా దుంపలు కాదన్నమాట :)
మీ కవిత్వం కూడా బాగుంది.

Anonymous said...

/అని అందర్నీ పిలుస్తుంటే, కాయ ఎలా ఉన్నా కోనేయాలనిపించి సంచీ నింపేసా/
:)
నాకూ అంతే, ఏదైనా కానివ్వండి... రెండు కెజిలు ఆగ్వాగ్వాలు, మూడు కిలోలు దస్కూచార్లు ఇవ్వండి, కెజి మోగ్రలు ఇవ్వండి. :)

y.v.ramana said...

మంచి పోస్ట్. నేనెప్పుడూ కూరగాయలు కొన్లేదు. ఇప్పుడు కొనాలనిపిస్తుంది. అగ్వాగ్వా!

వేణూశ్రీకాంత్ said...

హహహహ బాగుందండీ బెంగళూరులో కూడా అక్కడక్కడా సంతలు జరుగుతుంటాయ్ అక్కడకూడా ఇలానే చిత్ర విచిత్రమైన మాడ్యులేషన్ తో అరుపులమధ్య మహా చిత్రమైన వాతావరణం ఉంటుంది :) లింగరాజపురం ఏరియాలో ఉన్నపుడు కొన్నాళ్ళు నేనూ తరచుగా అక్కడి సంతకు వెళ్ళేవాడ్ని. వాళ్లు వచ్చిన క్రౌడ్ ని బట్టి కన్నడం నుండి తెలుగుకి ఇంగ్లీష్ కి హిందీకి మార్చేవారు.

కృష్ణప్రియ said...

@ puranapandaphani,
:)
@ మాలా కుమార్ గారు,
:) అవును. నాకూ మొదట్లో అదే కన్ఫ్యూషన్, నెమ్మది గా అర్థమైంది.

@ సాయి గారు,
:) థాంక్స్.

కృష్ణప్రియ said...

జ్యోతిర్మయి గారు,

అవునా..థాంక్స్.
ఎర్రగడ్డ రోడ్డంటే ఇంకా ఏంటో అని ఒక్క క్షణం కంగారు పడ్డాను.. :)

వీకెండ్ పొలిటిషియన్,
థాంక్స్!

తృష్ణ గారు,
మీ బ్లాగ్ లో రాసిన కామెంట్ గుర్తుంది. నిజానికి ఆ టపా చదివి మా ఇంటి దగ్గరే ఉంటారేమో మీరు అనుకుని, కొంత సేపు ఎవరై ఉండచ్చా అని ఆలోచించాను కూడా..

పద్మార్పిత గారు,

చాన్నాళ్లకి కనిపించారు. ధన్యవాదాలు!

కృష్ణప్రియ said...

బులుసు గారు,

మీ కామెంట్ 'అగ్గువ' కాదు, చాలా 'ప్రియం'

మౌళి గారు,
:) థాంక్స్.

snkr గారు,
:) సరే. అలాగే

Found In Folsom said...

mee dosakaya joke highlight. as usual, chala bavundi :)

కృష్ణప్రియ said...

రమణ గారు,

అవునా! మీరు తప్పక మీ సుబ్బు గారిని తీసుకెళ్లండి, ఒక మంచి టపా రావచ్చు..

వేణూ శ్రీకాంత్ గారు,

:) అవును. కర్ణాటక లో అందరూ, బహు భాషా కోవిదులు.. నాకూ KR మార్కెట్,మడి వాలా కూరగాయల మార్కెట్ల లో అందుకే కొనటం అంటే చాలా ఇష్టం.


@ Found in Folsum,

థాంక్స్!

కృష్ణప్రియ said...

రమణ గారు,

అవునా! మీరు తప్పక మీ సుబ్బు గారిని తీసుకెళ్లండి, ఒక మంచి టపా రావచ్చు..

వేణూ శ్రీకాంత్ గారు,

:) అవును. కర్ణాటక లో అందరూ, బహు భాషా కోవిదులు.. నాకూ KR మార్కెట్,మడి వాలా కూరగాయల మార్కెట్ల లో అందుకే కొనటం అంటే చాలా ఇష్టం.


@ Found in Folsum,

థాంక్స్!

Jai Gottimukkala said...

మండీలల్ల సామాన్లు అమ్మెటొల్ల మనసులు ఫ్రెష్, మాటలు స్వీట్, ధరలు అగ్గువ, క్వాలిటీ పర్ఫెక్టుగ ఉంటది.

ఏ బళ్ళకు పోయిండో తెల్వదు కానీ అన్ని బాసలు మాట్లాడుతడు. లెక్కలు నేర్చుకోలే కానీ చిల్లర్ చారానా కూడా తక్కువ ఇయ్యడు.

ఈ మట్టి మనుషుల గొప్పతనం ఆ "ఫ్రెష్"లో వస్తదా?

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;