Sunday, November 25, 2012

ఆల్ రౌండర్ సుబ్బు గాడి కబుర్లు..



ఇంటి నుంచి పని చేస్తున్నాను కదా.. కాస్త కులాసా గా పడక్కుర్చీ లో కాళ్లు జాపుకుని, లాప్ టాప్ లో సినిమా పాటలు పెట్టుకుని, మధ్యాహ్నం భోజనం తాలూకు సుషుప్తావస్థ లో జోగుతూ,  మధ్యలో ఉలిక్కి పడి ‘ఎవరైనా పింగ్ చేశారా?‘ అని చూసుకుంటుండగా   ‘డింగు’మంటూ కాలింగ్ బెల్ మోగింది. ఉలిక్కి పడి లేచి తలుపు తీసేపాటికి. మా చిన్నమ్మాయి తలుపు తోసుకుని వచ్చి విసురు గా సంచీలు ఓపక్క విసిరి ‘హుం’ అనుకుంటూ లోపలకి వెళ్లిపోయింది.

ఏమైందో ఏంటో నని నేను లేచి వెనగ్గా వెళ్లి కాసిని ఊసుబోక కబుర్లు చెప్పి, నెమ్మది గా  ఆ విసుగు కి కారణం ఏంటో కనుక్కుంటే తేలింది... క్లాస్ టెస్టుల మార్కులు ఇచ్చారు, దీనికి పదిహేడు మార్కులొచ్చాయి ఇరవై కి.
 ‘ఓస్.. ఆ మాత్రానికేనా?.. బాగానే వచ్చాయి కదే? ఇరవై కి పదిహేను దాటితే చాల్లే..’ అని తేలిగ్గా తీసిపడేసి నా పని నేను చేసుకుంటున్నాను..
‘ఇరవై కి పదిహేడంటే, వందకి ఎంతన్నట్టు?’ అడిగింది.

‘నన్నడుగుతావా? నువ్వే కట్టు లెక్క! నేర్చుకున్నావు కదా.. పర్సెంటేజ్ కట్టటం..’

‘ఓకే..ఓకే.. చూస్తాను..‘ అని పావుగంట ప్రయత్నించి.. నెమ్మదిగా తేల్చేసింది.. ‘ఇలాగ ఆడ్ నంబర్లకి పర్సెంటేజ్ లు కట్టలేరు. మా టీచర్ చెప్పింది.’

ఇంక మా టీచర్ చెప్పింది అన్న మాట ఫైనల్! దానికి తిరుగు లేదు. ప్రపంచం లో ఏ ఆర్గ్యుమెంటూ ఇక పని చేయదు. టీచర్ ఏది చెప్తే అదే రైటు. అంతే కాదు టీచర్ ఏం చెప్పినా, పిల్లలకి ‘ఏవిధంగా’ అర్థమయితే అదే రైటు..

‘ఆహా.. మరాలంటప్పుడు ఒక బిట్ ప్రశ్న ఎక్కువ రాయటమో, ఒక ప్రశ్న మానేయటమో చేయాల్సింది..’

‘అమ్మా.. రాసేటప్పుడు ఎలా తెలుస్తుంది? రాసినప్పుడు ఇరవై కి ఇరవై వస్తాయనుకున్నా!’

‘సర్లే..ఇంతకీ సుబ్బుగాడికెన్నొచ్చాయే?.. పక్కింటి భవానీ కి?’
కోపం గా చూస్తూ ‘సుబ్బు కాదు, శుభ్రోతో  అని ఎన్నిసార్లు చెప్పా! నీకు..’ అని అంతలోనే మొహం అదోలా పెట్టి..’నీకు తెలుసు కదమ్మా.. ఇరవై కి ఇరవై..’  

నవ్వొచ్చింది నాకు.. ఎప్పుడూ ఈ సమాధానం లో మార్పుండదు.. ప్రతి సబ్జెక్టు లోనూ వంద శాతం.. మార్కులే..  ఒక క్వార్టర్ మొత్తం లో కొన్ని చెప్పి, కొన్ని ముందస్తు గా చెప్పకుండా పెట్టిన వివిధ పరీక్షల్లో, ఒక్కసారైనా ఒక్క మార్కైనా తక్కువ వస్తుందేమోనని చూస్తాను.

వాళ్లకి తక్కువ రావాలని నా కోరికయితే కాదు.. కానీ.. అసలు అంతలా ఎలాగ చదవగలుగుతున్నారని నాకు ఆశ్చర్యం... అబ్బే.. నేను ఇంతవరకూ వాళ్లకి ఒక సబ్జెక్ట్ లో అరమార్కు తక్కువ వచ్చినట్లు ఎప్పుడూ వినలేదు. ఒక్కోసారి భవానీ కి అటూ ఇటూ అవటం విన్నాను. కానీ సుబ్బు? నో వే! వాళ్లమ్మ ఉత్తర ప్రదేశ్, నాన్న బెంగాలీ. IIT టాపర్లు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తల్లి తన పెద్ద ఉద్యోగం పిల్లలకి దిశా నిర్దేశం చేయటానికే మానేసి అహర్నిశలూ కష్టపడుతుందని విన్నాను. బస్ లో వస్తే చుట్టూ తిప్పి తెచ్చి పిల్లవాడి 'క్రియేటివ్' సమయం వృధా అవుతుందని రోజూ ఆవిడే పిల్లవాడిని దింపి తెచ్చుకుంటుందని విన్నాను. చాలా సార్లు స్కూల్లో ఆవిడని చూశాను, కొంత పరిచయం ఉంది.

వారం దాటాకా, త్రైమాసిక పరీక్షల మార్కులిచ్చేసారు. క్లాస్ లో పదమూడో రాంక్ వచ్చింది దీనికి. 538/600. ‘చాలా మంచి మార్కులు’ .. అని మనస్పూర్తి గా మెచ్చుకున్నాను. రాంక్ ఎంతైతే నేంటి? దానికే ఆనందం గా లేదు. మొహం అంతా అదోలా పెట్టుకుని తిరిగింది ఒక పూట. సాయంత్రానికి వచ్చి కూర్చుంది. 

‘అమ్మా! నువ్వు.. ఈసారి సుబ్బుగాడికి ఎన్నొచ్చాయో ఎందుకడగ లేదు?’
‘అమ్మలూ.. అది నాకు అనవసరం. చిన్న చిన్న టెస్టులకి సరదా గా అడుగుతాను. కానీ I really don’t care.. సుబ్బుగాడికి తల్లిని నేను కాదు.. అయినా వాడికీ , భవానీకీ మొదటి రెండు రాంకులు వచ్చే ఉంటాయి. నాకు తెలుసు’

కొన్ని క్షణాల ఆలోచన తర్వాత..
‘కానీ వాడికన్నా నాకు మార్కులు తక్కువ వచ్చినందుకు నీకు బాధ కలగలేదా?’
‘ఎందుకు అలాగ అడుగు తున్నావు? నేనేమైనా ఆనందం గా లేనని నీకనిపించిందా?’

‘లుక్ అమ్మా..  ప్రతి పేరెంట్ కీ వాళ్ల వార్డ్ కి మొదటి రాంక్ రావాలని ఉంటుందని నాకు తెలుసు. కానీ.. సుబ్బు గాడికి ఎన్ని మార్కులొచ్చాయో నీకు తెలుసా? 599/600. వాడికే ఫస్ట్ రాంక్. రెండో రాంక్ భావీ కి! దానికి 595/600. నేను వాళ్లతో కంపీట్ అయి ఫస్ట్ రాంక్ తెచ్చుకోవాలంటే.. ప్రతి క్లాస్ టెస్ట్ లో ఒక్కసారి కూడా I can not afford to lose even half a mark.. that means, I have to be 100% prepared all the time. I can not fall sick,or simply take a day off. I need to be at school every single day, fully prepared, so I can attend every single surprise test,.. ‘

‘హ్మ్మ్.. కానీ, నేను నిన్న ఫస్ట్ ప్లేస్ లో ఉండి తీరాలని ఎప్పుడైనా పట్టు పట్టానా? ‘
‘ఇప్పటి వరకూ అలాగ అనలేదు. కానీ.. నేనే చెప్తున్నా.. మీరిద్దరూ బాధ పడను.. అని అంటే.. నాకు హాయిగా ఉంటుంది’

ఈ మధ్య దీని ఫ్రెండ్స్ లో ఈ ట్రెండ్ బాగా గమనిస్తున్నాను. ప్రతి వాళ్లూ 'ధోనీ, తారే జామీన్ పే..' లు చూసేసి మంచి మార్కులు తెచ్చుకునే పిల్లల గురించి కచ్చగా ‘నెర్డు’లని, వాళ్లకి ఇంకే వ్యాపకం లేదని.. అదంతా ఒక ‘అన్ కూల్’ వ్యవహారం అని అనటం. తల్లిదండ్రులు కూడా ‘మా పిల్లలని మేము గుడ్డిగా చదువు అని వాళ్లని తొయ్యం.. ఫలానా వాళ్లల్లాగా.’ అంటూ, ఇంట్లో మాత్రం రహస్యం గా బెత్తాలు విరగదీసి మరీ చదివించటం..

‘యా.. మేమేం బాధ పడం.. నీ సంగతి నువ్వు చూసుకో.. 100% తయారీ తో వెళ్లి రాయటం లో తప్పు లేదు. అదేమీ.. పెద్ద ‘nerdish/uncool’ ఏమీ కాదు. ఇంక ఒక పూట స్కూల్ కి వెళ్లాలనిపించలేకనో లేక అనారోగ్యం వల్లనో వెళ్లలేక మార్కులు తగ్గితే దానికి మనమేమీ చేయనక్కరలేదు..సంతోషం గా చదవగలిగినంత చదువు. శ్రద్ధ గా పరీక్షలు రాయి అది చాలు.’  అని చెప్పా..
అప్పటితో ఆ టాపిక్ అయిపోయింది.

ఆలోచిస్తూ కూర్చున్నాను. దీని క్లాస్మేట్ తల్లి కూడా ఇలాంటి సంభాషణ ఈ కాలం పిల్లలకి ఎంత క్లారిటీ.. అంతే కాదు.. ఒక నాలుగో తరగతి పిల్ల తల్లిదండ్రుల దగ్గర తన ఆర్గ్యుమెంట్ ఎంత ధైర్యం గా చెప్తోంది.. తనకి రాంక్ రాకపోవటానికి థీరీలు చెప్పి, సమర్ధించుకుని మేము ప్రశించకుండా ముందరి కాళ్లకి బంధాలు వేయటానికి ప్రయత్నిస్తోంది.  మేము చదువుకున్నప్పుడు .. ప్రోగ్రెస్ కార్డ్.. ఎప్పుడూ.. ఫ్లయింగ్ సాసర్ లా విసిరేస్తే మళ్లీ తెచ్చుకోవటం..సంతకం చేయమని బ్రతిమలాడుకోవటం తప్ప ప్రశ్నించింది చాలా తక్కువ సందర్భాల్లో..

సుబ్బు గాడికి క్రితం ఏడు కూడా, అన్నింటిలోనూ ఫస్టే.. చదువే కాదు, లెక్కల క్విజ్, ఒలింపియాడ్లు, ఈత, చెస్, తైక్వాండో.. టెన్నిస్ ఏడు గోల్డ్ మెడల్స్...   మా పిల్లల గురువు గారి దగ్గరే సుబ్బు గాడు సంగీతం నేర్చుకుంటాడు. ప్రతి సంవత్సరం సంగీతం స్కూల్ వార్షికోత్సవం లో కనిపిస్తాడు. ఓ మాదిరి గా పాడతాడు. ‘exceptional,gifted...’ అయితే కాడు. కానీ, ఒక్క పాట హార్మోనియం వాయిస్తూ మరీ పాడి, వాళ్ళక్క పాడినప్పుడు తబలా మీద వాయిద్య సహకారం ఇచ్చాడు.  

‘వార్నీ.. వీడికి తెలియని విద్య అంటూ ఉందా? అసలు?’ అనుకున్నా.   ఏది ఏమైనా, సుబ్బు గాడిని పరిశీలించటం గత మూడేళ్లుగా నాకొక హాబీ అయిపోయింది.. గత నెల్లో స్కూల్లో ఏదో సైన్స్ ఎక్జిబిషన్ అంటే వెళ్లాం.. మా అమ్మాయి ప్రాజెక్ట్ అయితే వాళ్లు ఎంచుకోలేదు కానీ సుబ్బు, భవానీ ఒకే ప్రాజెక్ట్ చేసినట్టున్నారు. నేను వెళ్లి దాని గురించి అతని వాక్చాతుర్యం గురించి కూడా తెలుసుకున్నాను. చాలా ఉత్సాహంగా, సరదాగా నవ్వుతూ, మధ్యలో భవానీ మీద జోకులు కూడా వేస్తున్నాడు.  ఈ అబ్బాయి నిజంగా ‘exceptional’ అని ఒక ముద్ర మనసులో వేసేసాను.

ఈ మధ్య కూరగాయలు కొంటుంటే, పక్కనే సుబ్బు తల్లి.. పలకరింపు గా నవ్వింది. కుశల ప్రశ్నలయ్యాకా, ‘సంగీతం మాస్టారు ఎందుకో మా అబ్బాయి కి నచ్చట్లేదండీ ఈ మధ్య.. ఎంత బాగా పాడినా.. బాగా పాడటం లేదని దెబ్బలాడుతున్నాడు ఆయన. అసలు మా అబ్బాయి సంగతి తెలుసు కదా.. వాడు పర్ఫెక్ట్. వాడికే తప్పులు పడుతున్నాడు. ఆయన తీరు నాకూ పెద్దగా నచ్చట్లేదు. మీకు ఎలా ఉన్నాడు ఆయన?’ అని అడిగారు.

‘ఏమో నండీ.. మా పిల్ల ఎప్పుడూ అల్లరి చిల్లర గా పెద్దగా ప్రాక్టీస్ చేయకుండా వెళ్తుంది. ఆయన ఓపిగ్గా చెప్తున్నారు అనిపిస్తుంది. మా చిన్నప్పటి టీచర్ అయితే, కళ్ళు కిటికీ వైపో,  గడియారం వైపుకో తిరిగితే కూడా క్లాస్ ఆపేసి పొమ్మనేది. బోల్డు తిట్లు తిట్టేది. ‘ అన్నాను. 
‘అదీ నిజమే.. కానీ మావాడు బాగా ఇరిటేట్ అవుతున్నాడు. భరించలేకపోతున్నాడు.He is very sensitive you know.. ’ అనేసిందావిడ. నేనేమనాలో తెలియక ఊరుకుండిపోయాను. 

ఈలోగా, ఓ రోజు మా చిన్నది ఇంటికొచ్చి ‘అమ్మా.. ఇవ్వాళ్ల స్కూల్లో సుబ్బు చాలా ఏడ్చాడు. ఎర్రగా అయిపోయాడు. తెలుసా? అదీ ఎందుకో తెలుసా? సైన్స్ క్విజ్ లో వాడికన్నా భావీ కి ఒక్క మార్కు ఎక్కువ వచ్చిందని.. ‘just for one mark ‘ అమ్మా.. ఛీ అంత మంది లో ఒక సైన్స్ క్విజ్ గురించి ఏడవటం నాకైతే చాలా సిల్లీ అనిపించింది..’ అంది.
ఈ ఫస్ట్ వచ్చి తీరాలనే జబ్బు వీడికి ఇంత బలం గా ఉందన్నమాట.. అనుకున్నాను.

 ఈమధ్య  ఆధార్ కార్డులకి ఫోటోల కోసం లైన్లో నుంచున్నా. చాలా రద్దీ గా ఉంది. ఒక గంటైనా పట్టేట్టు ఉంది. పక్క లైన్లో సుబ్బు తల్లి కనిపించింది. పిచ్చాపాటీ మొదలు పెట్టాం.
‘సంగీతం మానేశాడండీ మావాడు’
‘అయ్యో! అదేంటి? పాట, హార్మోనియం, తబలా.. అన్నీ చేస్తాడు. ఆల్ రౌండర్ అనుకుంటాము మేము.. ఏమైంది?’
‘సంగీతం సార్ ఒకసారి సరిగ్గా శృతి లో పాడటం లేదని తిట్టాడు. దానితో he got terribly hurt!. ఇలాగైతే ఇక సంగీతం చెప్పను. ఒక్క మాట కూడా అనకూడదంటే ఎలాగ? అన్నాడాయన. మా వాడు కొద్దిగా మొండి గా ‘నేనే కరెక్ట్ పాడుతున్నాను..’ అని ఇంకా అలాగే తప్పు శృతి లో పాడుతూ ఉన్నాడు. దానితో ఆయన కి కోపం వచ్చి నీకు అన్నీ వచ్చనుకుంటున్నావా? ప్రతివాడికీ అన్నీ రావు ప్రపంచం లో గుర్తుంచుకో.. నీకు పాడాలనిపించినప్పుడు నాకు ఫోన్ చేయి.. అప్పుడే వస్తాను. అని వెళ్లి పోయాడాయన. తర్వాత ఫోన్ చేద్దాం అంటే.. ‘నాకే తప్పులు పట్టిన వాళ్లతోనేను మాట్లాడను అని భీష్మించుకు కూర్చున్నాడు.  ఆతర్వాత సార్ గారే కాల్ చేసి ఒక్కసారి మాట్లాడతాను అబ్బాయితో.. అని ఎంత బ్రతిమలాడినా ఒక్క క్షణానికి కూడా ఫోన్ దగ్గరకి రాలేదు. నోరు విప్పలేదు.గురువు గారు ఇంటికి వచ్చి మాట్లాడతానంటే బాత్ రూమ్ లోకెళ్ళి ఆయన ఇంట్లోంచి వెళ్లేంత వరకూ బయటకి రాలేదు.. ఇంక చేసేది లేక ఆయన దగ్గర మాన్పించేసాం మీము.. మళ్లీ ఒక మంచి సంగీతం మాష్టారిని వెతకాలి..’ అని నిట్టూర్చింది ఆవిడ. 
అంతలోనే మళ్లీ సద్దుకుని..

 ‘అయినా మా అబ్బాయి బ్రిలియంట్ కిడ్. ఒక్క క్షణం వేస్ట్ చేయడు. ఎప్పుడూ జ్ఞాన సాధన లోనే నిమగ్నమై ఉంటాడు. ఖాళీ గా ఉండటమే వాడికి రాదు. అలాంటి వాడిని పట్టుకుని నీకిది రాదు, అది రాదు అంటే వాడికి కోపం రాదూ? అసలే వీడు చాలా సెన్సిటివ్. ఇప్పటి వరకూ మా వాడు పాల్గొని ఓడినది అంటూ ఏదీ లేదు. సార్ దే తప్పు.ఇన్ని వచ్చినప్పుడు ఒక్క సంగీతం సరిగ్గా రాకపోవటమేమిటి.. నాన్సెన్స్! ఆయనకి సరిగ్గా చెప్పటం రాదు. I will find a good teacher..’ అని ఆవేశం గా చెప్పింది.

‘వామ్మో!.. అంటే.. అతని టాలెంట్ ని ఎప్పుడూ పొగుడుతూ, అతని తెలివితేటలని చూసి ఆశ్చర్యపోతూ, అతని గుణగానం చేస్తూ .. ఉండే వాళ్లు మాత్రమే అతనికి చుట్టూ ఉండాలి. ఓటమి అన్నది అతని దరిదాపులకి చేరకూడదు. మరి జరిగినంత వరకూ చెల్లుతుంది. అతని పరిథి విస్తరించినప్పుడో? అతన్ని మించిన వారు ఎదురుపడితేనో? హార్ట్ మాటర్స్ లోనో? ఓటమి అంటూ ఎరగని మనిషి అంటూ ఉన్నాడా? అలెగ్జాండర్ అయినా అనారోగ్యానికి తల వంచలేదూ?’

పిల్లలకి ఏదో ఒక విషయం లో ఎప్పుడో ఒకప్పుడు చిన్నదో, పెద్దదో ఓటమి అనేది అనుభవం లోకి రాకుండా ఉండనే ఉండదు. ఓటమినీ, బోర్ డం నీ, ఒంటరిదనాన్నీ, లేమినీ స్వీకరించటం, అనుభవించటం, దాని నుంచే విజయం, వ్యాపకం,స్నేహం, ప్రశాంతత, సంపాదన.. ల్లాంటివి అమర్చుకోవటం, మలచుకోవటం తెలియజేయటం ఎంత ముఖ్యమో సుబ్బు ద్వారా అర్థమైంది. 
అంటే పిల్లలకి నేను నేర్పాలనుకున్నవన్నీ నాకొచ్చనీ, ఈ విషయం లో నేను సిద్ధ హస్తురాలినని కాదు లెండి.. J

38 comments:

వేణూశ్రీకాంత్ said...

చాన్నాళ్ళకు కనిపించారు.. వెల్కం బాక్ కృష్ణప్రియ గారు :-)
టపా ఎప్పటిలానే బ్రహ్మాండంగా ఉంది. ఎంతటి చేదుమాత్ర లాంటి సీరియస్ విషయానికైనా పంచదారలాంటి హాస్యపు పూతపూసి అందివ్వడంలో మీకు మీరే సాటి.

మధురవాణి said...

బావుందండీ పోస్టు.. తల్లితండ్రులు అందరూ తప్పక ఆలోచించాల్సిన విషయం..
ఆ మధ్య 100% లవ్ అని ఒక తెలుగు సినిమా వచ్చింది. మీరు చూసారా? అందులో హీరో పాత్ర మీరు చెప్పిన సుబ్బు లానే ఉంటుంది కొంచెం. కేవలం నాలుగో తరగతి చదివే పిల్లలకి అప్పుడే ఇంత బలమైన అభిప్రాయాలు, వ్యక్తిత్వాలు ఉన్నాయంటే భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది ఈ జెనెరేషన్ పిల్లల్ని చూస్తుంటే.. :)

Anonymous said...

We dearly miss your posts Krishna Priya gaaru. Please continue posting trends in kids education in India. We need to get prepared for all this I think :(

భాను కిరణాలు said...

ఏంటో ... క్లాస్ పీకినట్టు అనిపించింది ...... మేమంత సీతారాముడు కొసం ఎదురుచూస్తుంటే మధ్యలో ఈ బుడత శుభ్రం గాడిని తీసుకువచ్చారేంటి...

Chinni said...

చాలా రోజుల తర్వాత వచ్చి మంచి విషయంతో అలరించారు కృష్ణప్రియ గారు.

UG SriRam said...
This comment has been removed by the author.
Dantuluri Kishore Varma said...

<> మీ పరిశీలన, విశ్లేషణ, ప్రజంటేషన్ చాలా బాగున్నాయి.

Anonymous said...

ఈ గొడవలోనే పడి ఆరోజు ఆ మాయదారి తెలుగుపాట విని అంత చిరాకు పడ్డట్టున్నారు...

Mauli said...

ఈ వారం లో మీనుండి టపా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసాం. థాంక్స్ :)

మన వాళ్ళం కలిసినపుడు పిల్లల మ్యూజికల్ చైర్స్ మాత్రం నేను చాలా ఎంజాయ్ చేస్తాను. కొందరు అస్సలు పట్టించుకోరు, కొందరు ఒక్కో అడుక్కి చైర్ ని రిసర్వ్ చేసుకొంటూ పోతారు. పెద్దపిల్లలు సగం అయాక చిన్నవాళ్ళ కోసం వదిలేస్తూ ఉండడం. ఒక్కో పాప గట్టిగా ఎడ్చేయ్యడం, వాళ్ళని చూసి మేము పకపకా నవ్వుకోవడం. గెలవాలన్న తపనతో ఏడుస్తూ ఉంటె యెంత ముద్దోస్తారో. సగం ఆట అయ్యేసరికి ఒక్కళ్ళ వెనుక ఒకరు ఒక ప్రక్క మాత్రమె పరిగెడుతూ ఉంటారు. (ముందు వెళ్ళే అబ్బాయి సేఫ్ గా వెళ్తూ ఉంటాడు మరి :))

మీ సుబ్బు కొంచెం ఫెయిల్ అవ్వడం నచ్చింది. కాని పెద్దవాళ్ళు మాట్లాడుకోనేప్పుడు కూడా ఎన్ని అడ్డుగోడలో కదా.

Found In Folsom said...

Krishnapriya garu, English lo comment pedutunnanduku kshaminchandi....prati sari anthe pedutunna anukuntu..:) I totally agree with you. Naaku bhayam kooda subbu lanti pillalanna, alanti parents Anna....ikkada of friend adigindi oka roju..phalana award edo vachinda mee vadiki ani? Adento kooda naku teledu..ventane ee sari maa vallaki raledu...nenu okatey ginjukutunna annadi aavida. Ventane naa reply: asalu aa award ento kooda naku teledamma. Moreover, alantidi unna, maa Vadu dare dapullo kooda undadu lendi...so naku anta aasa ledu ani cut chesa....mothaniki manchi post...Chala rojulaki rasaru...pillalaki vodipotam kooda alavatu kavali..

జ్యోతిర్మయి said...

పోటీతత్వం పెరిగిపోయి సంఘర్షణతో నలిగిపోతున్న ఈ రోజుల్లో ఆలోచన పెంపొదించే చక్కని పోస్ట్.

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఈ రోజుల్లో ఇంట్లో రుబ్బుడు ఎక్కువై పోతోంది. ఒక విధంగా పిల్లలు నలిగి పోతున్నారు. దీనికి తల్లితండ్రులదే బాధ్యత ఎక్కువ. కొంతమంది అయినా ఆలోచిస్తారని ఆశిద్దాం. క్లిష్టమైన విషయాన్ని సున్నితంగా మీ స్టైల్ లో బాగా చెప్పారు.

అన్నట్టు, మీ అమ్మాయి నాకు ఇంకా నచ్చేసింది. మీరు అదృష్టవంతులా, మీ పిల్లలు అదృష్టవంతులా తేల్చుకోలేకపోతున్నాను. మీ ఇంటిలో నాల్గైదు రోజులుంటే తప్ప తెలియదనుకుంటాను. తయారుగా ఉండండి.....దహా.

ధాత్రి said...

nice post..:)

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

బావుంది పోస్టు :)

పిల్లలు ఇలా ఉండాలి అనే ఎక్స్ పెక్టేషన్ తోనే ఈ సమస్యలన్నీ అనిపిస్తుంది నాకయితే. వీళ్ళు ఇలా ఉన్నారు, ఇలా ఆలోచిస్తున్నారు అని అర్థం చేసుకోవటం దాని ప్రకారం వాళ్ళకి అవసరమైనప్పుడు కొద్దిగా గైడెన్స్ ఇవ్వగలగడం ముఖ్యం. దురదృష్టవశాత్తూ చాలా మంది పేరెంట్స్ అదేదో ఒక మంచి ఫార్ములా ప్రకారం వాళ్ళకి అభిరుచులూ అలవాట్లూ చేసేస్తే మహ గొప్ప జీవితం తయారవుతుందనే అపోహతో ముందు ముందు వాళ్ళు ఏ స్టేజీ మీదో నాకు చిన్నప్పటినుంచే మా అమ్మా నాన్నలు ఇలా నేర్పారు అని చెప్తే కళ్ళు తుడుచుకోవటానికి సాధన మొదలెట్టేస్తున్నరల్లే ఉంది.

Anonymous said...

I simply love this post. I was a topper in my school. Nannu oka medhaavilaa treat chesevaaru andaroo. Interki vachesariki naa samaujjee iddaroo vundevaadu. naku first rademo ani entha talakrindulu ayyi tension padi aa baadha varnanaateetam. adoka verri nijangaa. I lost somany beautiful years in my life with that futile tension and worry. aatupotu, gelupu otami annee jeevithamlo baagam ante

..nagarjuna.. said...

బహుకాల దర్శనం... వెల్కం బాక్ :)

పోస్ట్ చదివాక Lord of the Rings లో ఒక డైలాగ్ గుర్తొచ్చింది. రాక్షసులనుంది తప్పించుకునేందుకు హాబిట్స్ ఇద్దరు ఓ కీకారణ్యంలోకి వెళతారు. ఆ సంగతి తెల్సుకున్న వారి స్నేహితుడంటాడు "What madness drove them in there!"

అసలు అలాంటి instincts ఎలా కలుగుతున్నాయి పిల్లల్లో !!

Mauli said...

@@ముందు ముందు వాళ్ళు ఏ స్టేజీ మీదో నాకు చిన్నప్పటినుంచే మా అమ్మా నాన్నలు ఇలా నేర్పారు అని చెప్తే కళ్ళు తుడుచుకోవటానికి సాధన మొదలెట్టేస్తున్నరల్లే ఉంది.


Haha వీకెండ్ గారు సుబ్బు మాత్రం అలా చెప్పడు. వాడు బంగారం :)

గీతిక బి said...

ఇళ్ళలో ఒక్క సంతానమే అవడం, వాళ్ళ దారిలోకి మనం వెళ్తూ గారాబంగా పెంచడం.. ఇలాంటివాటివల్ల పిల్లల్లో మానసిక విశాలత ఉండదు.

పంచడం, త్యాగం, ఓటమిలు తెలీకపోవడం పిల్లల జీవితంలో దురదృష్టం అనాలేమో...!

పిల్లల్ని అబ్జర్వ్ చేస్తుంటే ఆహ్లాదమే కాదు... జీవితానికి సరిపడా పాఠాలు, తెలుసుకోవాల్సిన విషయాలూ ఎన్నో ఉంటాయనిపిస్తుంది.

మీ పోస్ట్ చాలా నచ్చింది నాకు.

కృష్ణప్రియ said...

వేణూశ్రీకాంత్ గారు,
 ధన్యవాదాలు.
మధురవాణి గారు,
అవును ఆ సినిమా కొంత కాలం క్రితం చూశాను. నాగ చైతన్య  అవును. వీళ్లు మరీ నాల్గవ తరగతి! నిజానికి.. వీళ్ల మధ్య ఉన్న కాంపిటీషన్ గురించి ఇంకో పోస్ట్ రాస్తాను.. చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. దాదాపు రాష్ట్ర రాజకీయాల ఎత్తు లో ఉంటాయి.
అజ్ఞాత ,
ధన్యవాదాలు..
భానుకిరణాలు,
:) కదా! మంచి ప్రశ్న.. నేను కూడా సీతా రాముడి గురించే రాద్దామనుకున్నాను. కానీ, రాయటం మానేసి చాలా కాలం అవటం తో చేయి సహకరించక, కాస్త పదును పెట్టుకునే ప్రయత్నం గా రాసిన పోస్ట్ ఇది.

కృష్ణప్రియ said...

చిన్ని గారు,
థాంక్స్!
కిశోర్ వర్మ గారు,
ధన్యవాదాలు! మొదటి సారి ఇటు తొంగి చూసినట్టున్నారు. స్వాగతం.
@ ఫణిబాబు గారు,
LOL. అదో పేద్ద కథ. టీవీ లో ఏదో మొబైల్ ఫోన్ ప్రకటన లో ‘పంతం.. పంతం నీదా? నాదా? సై..’ పాట విన్నాను. నేను కీరవాణి ఫాన్ ని. ఆ సినిమా లో ‘గంగా ఏసీ మాట్నీ షో.’ పాట చూపిద్దాం మా పిల్లలకి, చాలా సరదాగా ఉంటుంది అని యూట్యూబ్ లో ఆ పాటలు తెరిచాను. తర్వాత మిగిలిన పాటలు కూడా వింటూ, ఆ ‘మాయదారి’ పాట వినటం తటస్థించింది. ఆ ఇరిటేషన్ లో ఉన్నప్పుడు మీరూ, నా ఇంకో ఫ్రెండ్ కనపడితే.. అలాగ మీకూ నా ఫ్రస్ట్రేషన్ కాస్త పంచానన్నమాట..

కృష్ణప్రియ said...

మౌళి గారు,
:) థాంక్స్..
ఎలా ఎక్స్పెక్ట్ చేశారు? నేను బులుసు గారి/బుద్ధా మురళి గారి బ్లాగుల్లో కామెంట్ రాయటం చూసా?
గెలవాలన్న తపనతో ఏడుస్తూ ఉంటె యెంత ముద్దోస్తారో>>>> అవునా? నాకు బాధ/భయం వేస్తాయి.. చిన్నప్పుడు మా తమ్ముడు స్కూల్లో ఆటలు ఓడిపోతే ఇంటికొచ్చి ఏడ్చి గొడవ గొడవ చేస్తే.. మా అమ్మ సందు చివర దాకా పరుగు పందెం పెట్టి, మమ్మల్ని ఓడిపొమ్మని అడిగి వాడికి స్కూల్లో దక్కని విజయం ఇంట్లో దొరికేలా చేసేది.. అప్పుడు మాకు ముద్దు గానే ఉండేది. కానీ ఇప్పుడనిపిస్తుంది..అలా కాకుండా.. ‘అయ్యో ఓడిపోయావా? నెవర్ మైండ్..’ అంటే సరిపోయేదేమో? ఇప్పటికీ వాడు మా మీద ప్రతి విషయం లో గెలిచి తీరాలనుకుంటాడు ;) మా తమ్ముడు ఇది చదివాడంటే అంతే..:)
ఇక సుబ్బు ఓటమి సంగతి.. ఎప్పుడో ఒకప్పుడు తప్పదు. సాడ్ పార్ట్ ఏంటంటే వాడు పాట పాడటం అనేది పూర్తిగా మానేశాడు. మొదటి స్థానం రాకపోవటం అనేది ఇష్టం లేక.

కాని పెద్దవాళ్ళు మాట్లాడుకోనేప్పుడు కూడా ఎన్ని అడ్డుగోడలో కదా>>>>>>
పెద్దవాళ్లు ఎప్పుడూ ఇంతేగా? :)

కృష్ణప్రియ said...

లలితా,
)
Found In Folsom,
ధన్యవాదాలు. ఓటమి జీర్ణించుకోవటం ఎవరికైనా కష్టమే. నేనూ పదవ తరగతి దాకా మా స్కూల్ లో క్వీన్ ని. అన్ని ప్రైజులూ నావే. ఇంటర్ లో బయటకి వచ్చి కాలేజ్ లో చేరాక నాలాంటి ‘క్వీన్లు’ వేల మంది సిటీ లో ఉన్నారు అని తెలిసినప్పుడు నేను అనుభవించిన షాక్ ఇంతా అంతా కాదు. లక్కీ గా, ఒక్క నెలలో ఆ ‘క్వీన్’ జాడ్యం వదిలిపోయిందనుకోండి.
అయినా ఇప్పటికీ వర్క్ లో, ఇంట్లో, చుట్టాల/స్నేహితుల సర్కిల్స్ లో కొన్ని ఓటములు కొద్ది మోతాదు లోనైనా పించ్ చేస్తూనే ఉంటాయి 
జ్యోతిర్మయి గారు,
ధన్యవాదాలు. మీ మెయిల్ కూడా నిన్నే చూశాను. నన్ను గుర్తుపెట్టుకుని రాశారు. చాలా థాంక్స్.

కృష్ణప్రియ said...

బులుసు గారు,
ఈ రోజుల్లో ఇంట్లో రుబ్బుడు ఎక్కువై పోతోంది. ఒక విధంగా పిల్లలు నలిగి పోతున్నారు. దీనికి తల్లితండ్రులదే బాధ్యత ఎక్కువ>>>>
100% agreed. ఒక గమ్మత్తు చూస్తూ ఉంటాను. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని ఇలాంటి రుబ్బుడు స్కూళ్లల్లో వేయకూడదని.. ఆధునిక బోధనా పద్ధతులున్న బడుల్లో మూడు రెట్లు ఫీజులు కట్టి వేస్తారు. కానీ అక్కడ కూడా, చాప క్రింద నీరు లా అన్ని వైపులా నుండీ exponential గా స్పర్థ వచ్చి చేరుతుంది. పెద్ద క్లాసులకి వెళ్తున్న కొద్దీ పోటీ ప్రపంచం లో వెనకబడిపోతామన్న దుగ్ధ తినేస్తూ ఉంటుంది. తెలియకుండానే పిల్లల మీద రుబ్బుడు మొదలైపోతుంది. ౯౦% పేరెంట్స్ దీనికి అతీతులు కాదు.
ఎక్కడో కదాచిత్ తల్లిదండ్రులు వదిలేసినా కొద్దిగా తెలివైన పిల్లలకి క్లాస్ లో వెనకపడినప్పుడు ‘మొద్దులు’ గా ముద్ర పడటం వల్ల ఆత్మ న్యూన్యత కి లోనవడం జరిగి బాధ పడటం చూడలేక .. కూడా రుబ్బుడు మొదలవుతుంది :-(
ఇది ఒక విషవలయం.

కృష్ణప్రియ said...

@ ధాత్రి,
వెల్కం.. ఇదే మిమ్మల్ని బ్లాగుల్లో నేను చూడటం. ధన్యవాదాలు.
@ వీకెండ్ పొలిటిషియన్,
 కరెక్టే.. చాలా వరకూ upper middle class కుటుంబాల్లో పిల్లలకి ముందు గానే ఒక ప్రణాళిక వేయబడి ఉంటుంది. ‘చదువు+కర్ణాటక/టీవీ పోటీల్లో పనికొచ్చే సంగీతం+నాట్యం+వీలయితే టెన్నిస్ లేకపోతే బాట్మింటన్, కాస్త తెలివుంటే చెస్, కొద్దిగా బొమ్మలు వేయగలిగితే ఆర్ట్ క్లాస్.
ఇక ఆ పిల్లలు వీటన్నింటినీ /కొన్నింటిని మాత్రమే ఎంజాయ్ చేయగలిగితే బెస్ట్. లేదంటే.. 
@ అజ్ఞాత,
ధన్యవాదాలు. Very well said..

కృష్ణప్రియ said...

నాగార్జున,
 థాంక్స్.. చిన్న ఇన్సిడెంట్ (ఊర్కే గుర్తొచ్చి) : మొన్నీ మధ్య ఎవరింటికో వెళ్తే వాళ్ల పాప (౬) అక్కడక్కడే తచ్చాడుతోంది. నాకర్థం కాలేదు. ఆ అమ్మాయి వస్తువు మీద ఏమైనా కూర్చున్నానా? అని రెండు సార్లు చూసుకుని వదిలేశాను. తర్వాత వాళ్లమ్మ చెప్పింది. ‘నేను ఎప్పుడో ఇచ్చిన ఫ్లవర్ వేస్ లో ఒక పువ్వు పెట్టి కాఫీ టేబుల్ మీద పెట్టిందిట ఆ అమ్మాయి నేను సంతోష పడతానని.’ నాకు చాలా ఆశ్చర్యం/ఆనందం వేసింది. చిన్న అమ్మాయి ఎంతలా ఆలోచించింది.. అని.
పిల్లల్లో భలే రాజకీయాలుంటాయి. Their world is as complex as ours. ఈసారి ఎప్పుడైనా వివరం గా రాస్తాను.
గీతిక గారు,
పిల్లల్ని అబ్జర్వ్ చేస్తుంటే ఆహ్లాదమే కాదు... జీవితానికి సరిపడా పాఠాలు, తెలుసుకోవాల్సిన విషయాలూ ఎన్నో ఉంటాయనిపిస్తుంది.>>> నిజమే..
ధన్యవాదాలు.

Mauli said...


@గెలవాలన్న తపనతో ఏడుస్తూ ఉంటె యెంత ముద్దోస్తారో>>>> అవునా? నాకు బాధ/భయం వేస్తాయి..

అబ్బే , అప్పటి మనతోనో మనవాల్లతోనో ఇప్పటి పిల్లల్ని పోల్చుకోకూడదు అండీ :)

వాడు పాట నేర్చుకోవడం లో రిలాక్స్ అవ్వగాలగాలి, లేదంటే మానెయ్యడం హాయి :) ఇదికాకపోతే ఇంకోటి నేర్చుకొంటాడు...అన్నీ కొనసానవసరం లేదు :)
అసలు వాళ్ళమ్మ నాన్నకి పాటలు రాక వాడు పర్ఫెక్ట్ గా పాడటం లేదు :) వాడు వాళ్లకి కరెక్ట్ ఝలక్ ఇచ్చాడు :)

క్విజ్ అంటారా, సుబ్బు కి తెలియనిది కుఇజ్ లో గెలుపు తన ఒక్కడి ప్రతిభా చాలదు . 'పక్క గ్రూప్ నుండి బట్వాడా అయ్యే ప్రశ్నలు' అనే లక్కు కూడా ఉండాలి అని తెలియని పసి వయసు కాబట్టి ఏడ్చాడు :)
తెలుస్తాయి.

Madhav Kandalie said...

చాలా బాగుంది. ఈ ఓడిపోవడాన్ని ఓర్చుకోలేని వాళ్ళని నేను కొంతమందిని చూసాను. మా సీనియర్ ఒకాయన చాల పేద కుటుంబం లో పుట్టి, అద్భుతం గా చదివేవాడు. స్కూల్ నుంచి కాలేజీ వరకు ఎప్పుడూ ఫస్టు రావాల్సిందే.. ఐ ఐ ఎస్ సి (బెంగళూరు) లో చేరాక, ఒక స్లిప్ టెస్టు లో సెకండు వచ్చేసరికి, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.ఓటమి కూడ బ్రతుకు లో ఒక భాగమే అని పెద్దలు పిల్లలకి చెప్పకుండా బాగా వత్తిడి పెంచుతున్నారు ఈ మధ్య.

Sharada said...

చాలా హార్ష్ గా చెప్తున్నాను అనుకోకండీ- కానీ సుబ్బు వాళ్ళమ్మ లాంటి వాళ్ళకి సైకియాట్రిక్ కౌన్సెలింగ్ ఇప్పించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అలాంటి తల్లి వుండడం కంటే పెద్ద శాపం పిల్లలకి ఇంకేమీ వుండదు. ఆ పిల్లలు పెద్దయింతర్వాత ఆ తల్లిని భరించటం కష్టమే! నాఖలాంటి ఆడవాళ్ళు కొందరు తెలుసు.

పిల్లల ప్రపంచంలో రాజకీయాలు- ప్రెషర్లూ, అబ్బో! ఇక వాటి గురించి మాట్లాడుకుంటే అయిపోనే పోదు.

శారద

తృష్ణ said...

చాలా రోజులకి కనబడ్డారు! టపా చదివాకా నాకు సుబ్బు మనస్థత్వం, అతని భవిష్యత్తు మీద బెంగ పట్టుకుంది... పెద్దయితే ఎలా తయారవుతాడో ఏమో...ప్చ్...!

రాస్తూండండి..:)

Anonymous said...

I don't see anything wrong with them.
The caring mother sacrificed her career and dedicating her time to guide her kids, that not all parents do. So is her kid, who is competitive and is always on his toes to achieve perfection. Good! Of course as he grows he would realize difficulties of such a highly ambitious life.

Think of useless kids who try to bunk classes and spend time with friends in McDonald, cinema halls and on roads.

కావ్యాంజలి said...

హాయ్ కృష్ణప్రియ గారు , చాలా బాగుందండి పోస్ట్....నిజమే ఓటమిని కూడా sportive గా తీసుకోవటం నేర్పించాలి పిల్లలకి....నాకు ఈ పోస్ట్ ద్వారా చాలా విషయాలు తెలిసాయ్....Thank You

బొందలపాటి said...

No need to worry about Subbu. He will cope with it and be alright as you and I are now. As he grows up he realises that he could not succeed in everything, and also knows he can't reject the thing that he can't succeed in.
For middle class people art, singing, dance, chess etc are some good to have decoratory skills. These fields can not be their professions in future, unless these kids are the toppers in those fields.
For bread and butter, ultimately middle class needs to focus on academics.

Anonymous said...

మీ అమ్మాయి చాలా ఇంప్రూవ్ అయ్యింది. ఇంతకముందు పదికి రెండు వచ్చేవి ఇప్పుడు ఇరవైకి పదిహేడు వస్తున్నాయి.

వెరీ వెరీ గుడ్.

జేబి - JB said...

పైన ఎవరో చెప్పినట్లు పెద్దయ్యాక ఉదరపోషణ తప్ప కళాపోషణ మర్చిపోతాడు. కానీ, ఓటమిని అంగీకరించడం అన్నది నేర్చుకోకపోతే (నేర్పించకపోతే) జీవితంలో ఎదగలేడు. ఇంకా శృతిమించితే సైకోలాంటి (నరసింహా చిత్రంలో రమ్యకృష్ణలాగ) అవ్వచ్చు.

మీరు మీ అమ్మాయిని పెంచుతున్న విధానం బాగుందండి.

Mauli said...

@సందు చివర దాకా పరుగు పందెం పెట్టి, మమ్మల్ని ఓడిపొమ్మని అడిగి వాడికి స్కూల్లో దక్కని విజయం ఇంట్లో దొరికేలా చేసేది


పని హడావిడి లో ఈ పాయింట్ మిస్సయ్యాను :)

ఒకసారి చివరి రవుండ్ లో అన్న, తమ్ముడు మిగిలారు. అన్న పోయిన సంవత్సరం గెలిచాడు కదా, ఈ సారి తమ్ముడికి వదిలెయ్యమని వాళ్ళ నాన్న చెప్పడంతో పాపం వదిలాడు. ఇక్కడ యాంకరింగ్ చేసే ఆవిడ ఉత్సాహం గా గెలిచే వాడు కాదు గెలిపించేవాడు కింగు అని అనగానే, చిన్నోడు గాట్టిగా ఏడ్చేశాడు :)


(ఈ వ్యాఖ్య మీ తమ్ముడు చూడటం లేదు కదా :P )

Anonymous said...

వాళ్ళ బతుకు వాళ్ళని బతకనీయకుండా, పిల్లలని బొమ్మరిల్లులో ప్రకాష్ రాజ్ లా పెంచితే వాళ్ళు మంచి 'మరమనిషి' అవుతారు కాని మంచి 'మనిషి' అవలేరు.

అలా అని గాలికి వదిలేయకుండా అవసరమైనపుడు గైడ్ ఛేయాలి.

మనిషి ప్రపంచంలో జీవించాలి కాని, రంగస్థలంపై నటుడిగా బతకకూడదు.


చాతకం said...

Girls get mental maturity faster than boys. Boys are more perfectionists than girls when they put thier mind into it be it studies, sports or video games. There is nothing wrong with subbu. He started on right track but need to balance a little not to fall on wrong track which is way better than starting on a wrong track and pulling back onto a right track. Time would teach. To each thier own.

కృష్ణప్రియ said...

మౌళి గారు,
అబ్బే , అప్పటి మనతోనో మనవాల్లతోనో ఇప్పటి పిల్లల్ని పోల్చుకోకూడదు అండీ :)----- ఈ వాక్యం పూర్తిగా అర్థం కాలేదు.
మిగిలిన అన్ని స్టేట్ మెంట్లతో ... I agree. :)

@ మాధవ్ గారు,
How sad!! సుబ్బుగాడి విషయం లో నా బాధ కి కారణం ఇదే.. కానీ ఎందుకో నాకనిపిస్తుంది. ఇంకా నాలుగో క్లాసే కదా.. కాస్త పెద్దయ్యేసరికి ఒక రకమైన వైరాగ్యం లాంటిది వస్తుందేమో చెప్పలేం.
@ శారద గారు,
హ్మ్మ్...
@తృష్ణ గారు,
థాంక్స్.
@snkr,
I hope the same too. As he grows, he he would not succumb to his ambitions and lose himself
@ కావ్యాంజలి గారు,
థాంక్స్.
@ బొందలపాటి గారు,
హ్మ్.. థాంక్స్.
@ kamudha గారు,
:) మీకు భలే గుర్తుందే.. నైస్. థాంక్స్
@ జేబి – JB గారు,
పైన చెప్పినట్టు నిజంగా ఓటమిని అంగీకరించగలగడం నేర్చుకోగలిగితే అద్భుతం. జీవితం హాయిగా సాగిపోతుంది. అలాగ ఆక్సేప్ట్ చేయలేని వాళ్లు చుట్టూ కనిపిస్తూనే ఉంటారు :-( అంతెందుకు.. ఆఫీసుల్లో వాళ్ల ప్రపోజల్ లో చిన్న మార్పు కి కూడా అంగీకరించలేనిదనం ఎంతమంది లో చూడం మనం?
@ మౌళి గారు,
LOL,
@ bonagiri గారు,
well said!
@చాతకం గారు,
థాంక్స్. అలాగే అవాలని నేనూ ఆశిస్తున్నాను.

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;