Saturday, December 22, 2012

యుగాంతం రోజు.. (21.12.2012)

యుగాంతం,.. Dooms day,.. क़यामत का दिन.. ఏమో వీటి మీద ఇంటి చుట్టుపక్కల వాళ్ల చర్చలు, ఆఫీసు లో కబుర్లు.. Dec. 21 sales, .. టీవీల్లో షోలు,


ఉదయం లేస్తూనే.. ఆఫీసుకి వెళ్లాలంటే రోజూ లాగే బద్ధకం.. బయట అంతా కొద్దిగా పొగమంచు... పిల్లలకి స్కూలు లేదు. క్రిస్ మస్ కార్నివాల్, తల్లిదండ్రులు-టీచర్ల మీటింగు అయితే ఉంది పదిన్నర కి. సరే సగం రోజు సెలవ పెట్టి మధ్యాహ్నం ఇంటి నుండి పని చేద్దాం అని నిర్ణయం తీసుకుని.. నా చాయ్, నిన్నటివి, ఇవ్వాల్టివీ న్యూస్ పేపర్లూ నేనూ వెచ్చ వెచ్చగా హాయిగా కూర్చుని మొదటి పేజీ తీశాను...



దేశ రాజధాని లో మెడికో పై సామూహిక అత్యాచారం మీద కవరేజ్. వెచ్చదనం కాస్తా సెగలు గా.. దేశ రాజధాని లో అర్థ రాత్రి కూడా కాదు.. తొమ్మిదింటికి సినిమా చూసి వస్తే.. రోడ్డు మీద ఉన్న ప్రతివారికీ జవాబు చెప్పాలా? చెప్పకపోతే.. కొట్టేసి అత్యాచారం చేసి.. ఎదిరించిన పాపానికి పొట్టలో చిన్న ప్రేగుల దాకా నాశనం చేస్తారా? బస్సులోంచి తోసేసి వెళ్లిపోతారా? టీ మరీ చేదు గా,.. భయంకరమైన పశు ప్రవృత్తి.. ఢిల్లీ అంతే.. మహిళలకి అస్సలూ సేఫ్ కాదు. ఛీ.. అనుకున్నాను. ఏదో మిగిలిన ప్రాంతాలన్నీ మహా సేఫ్ అన్నట్టు.



ఈ సంవత్సరం మహా నగరం లో నమోదయిన అత్యాచారాల సంఖ్య 530+ ట. క్రితం ఏడు 630+. ఒక వంద తక్కువ అత్యాచారాలు అయ్యాయని సంతోషించాలా? ఇవన్నీ కేవలం రిపోర్ట్ చేసిన సంఘటనలే. ఇంక వెనక ఎన్ని అవుతున్నాయో.. ఎవరికెరుక? అయినా ఒక దేశ రాజదాననే ఏముంది.. ఆడ,మగ, వయసు తో సంబంధం లేకుండా.. ఒక సామాజిక భద్రత ఉంది, రాత్రి తల దాచుకోవడానికి చిన్నో, పెద్దో ఇల్లు అంటూ ఉన్న మధ్యతరగతి, లేదా ఆర్థికం గా ఉన్నత వర్గాల వ్యక్తులకి కూడా రోడ్డు మీద రక్షణ లేదు. ఫుట్ పాత్ మీద పడుకునే కుటుంబాల మాట, అర్థరాత్రి పొట్ట కూటి కోసం ఉద్యోగాల చేసి వెనక్కి వచ్చే అమ్మాయిల విషయం చెప్పనే అక్కర్లేదు. చిన్న సైజ్ పట్టణాల్లో.. 



ఒక మహా నగరం లో దేశ రాజధాని లో ఒక చదువుకున్న అమ్మాయికి జరిగిన ది కాబట్టి ఇంత వెలుగులోకి వచ్చి దేశాన్ని కుదిపేసింది.. మీడియా, విద్యార్థులు, సంఘ సేవ చేసే వాళ్లు, అందరూ ధ్వజమెత్తి నిరసిస్తున్నారు. వీధుల్ని నినాదాలతో దద్దరిల్లేలా చేస్తున్నారు... ఉదయం నుండీ ఏ చానల్ చూసినా గొంతులు చించుకుని మరీ దులిపేస్తున్నారు.. మంచిదే. యువత నిరసన ప్రదర్శించడం మంచిదే. వీరిలో చైతన్యం ప్రశంసనీయమే. మరి మిగిలిన ఐదు వందల సంఘటనలో? టైమ్స్ లో బెంగుళూరు, హైదరాబాదు, ఇంకా చిన్న పట్టణాల్లో గణాంకాలు కూడా ఇచ్చారు. ఎనిమిదేళ్ల పిల్లలు, ఐదేళ్ల పిల్లలు... వాళ్ల గురించి ఒక కార్నర్ లో చిన్న వార్త తప్ప, ఎంతవరకూ ప్రజలని ఎఫెక్ట్ చేసింది..



మా అమ్మాయి వచ్చి పేపర్ చదవడానికి కూర్చుంది. సాధారణంగా రోజూ పేపర్ చదవదని దెబ్బలాడతాను. ఈరోజు మాత్రం.. వద్దు.. ఆటల పేజీలు, కార్టూన్లు చదువు చాలు అని మెయిన్ పేపరు ఇవ్వలేదు. ఇలా మెయిన్ పేపర్ ఎన్నాళ్లు దాచాలి? అసలు దాచాలా? జాగ్రత్తలు చెప్పాలా? ఏరకమైన జాగ్రత్తలు చెప్పాలి? అభద్రతా భావం, సాటి మనిషన్నవాడిని ఎవ్వర్నీ నమ్మరాదని చెప్పాలా? అన్నీ నాకు ప్రశ్నలే. ఎవర్నడగాలో తెలియదు. ఎవరికైనా ఖచ్చితమైన సమాధానం తెలుసని నేననుకోను.

http://www.youtube.com/watch?v=hY8CyTeegrM , http://www.ted.com/talks/sunitha_krishnan_tedindia.html

ఈ మధ్య మనసు కలచి వేసేలా చేసిన ఈ వీడియోలు గుర్తొస్తూనే ఉన్నాయి. ఇంకోసారి చూసి కన్నీరు పెట్టుకుని,.. ఇంక కార్నివాల్ సమయం అయిందని లేచి రెడీ అయిపోయాం అందరం.



యుగాంతం రోజున ఆఫీసు లో ఒంటరి గా ఈ సువిశాల అంతరిక్షం లో ఒక ధూళి రేణువు లా కలిసిపోలేను.. కుటుంబం తో కలిసి నాలుగు రేణువుల సమూహం లా మిగిలిపోతాను. ఉదయం స్కూల్లో పని కాబట్టి సెలవ కావాలి. మధ్యాహ్నం ఇంటి నుండి పని చేస్తాను... అని మెయిల్ కొట్టాను.



స్కూల్లో కార్నివాల్ సరదాగా గడిచిపోయింది..కానీ ఏదో ముల్లులా గుచ్చుకుంటోంది. ఏంటో అర్థం కాలేదు. కాసేపటికి పిల్లలు ఏవో ఆటలాడుతుంటే పక్కనే నుంచుని ఆలోచిస్తున్నాను.ఒకమ్మాయి.. ‘Maam.. please go out and stand. NOW.. just get going .. We need space.. come on.. move...’ అని స్టాల్ లోంచి బయటకి తరిమింది. వెళ్తూ గొణిగాను. ‘బయట చాలా వేడి గా ఉంది. మా అమ్మాయి గోరింటాకు పెట్టించుకోవడానికి ఇంకో ఐదు నిమిషాలు పడుతుంది. మళ్లీ వెతుక్కోవాలి కదా..’ ఇంకా ఏదో అనేలోగానే.. ‘That’s not my problem Mam. You need to handle it. We need space. Please move’ అంది. ‘వార్నీ.. ఎంత మాట సొగసు. అక్కడికి వచ్చే వాళ్లు విద్యార్థుల తల్లిదండ్రులని తెలుసు.. తను ఒక విద్యార్థి .. బహుశా.. ఎనిమిదో/తొమ్మిదో తరగతి అయ్యుండచ్చు.. అనుకుంటూ.. బయటకి నడిచాను. అప్పుడర్థమైంది.. ముల్లు ఎక్కడుందో.. స్టేజ్ మీద ముగ్గురమ్మాయిలు.. ముగ్గురబ్బాయిలు డాన్సు వేస్తున్నారు. చుట్టూ పెద్దలు, పిన్నలు, చేరి చప్పట్లతో ఉత్సాహ పరుస్తున్నారు. వాళ్ల పాటలు..



‘Radha on the dance floor, Radha likes to party.. Radha wants to move that ... Radha body’,

‘సారొచ్చారొచ్చారే .. వచ్చాదోచ్చాడే’

‘ఆకలేస్తే అన్నం పెడతా..(కి తమిళ్/కన్నడ వర్షన్.. సరిగ్గా అర్థం కాలేదు. నా పిచ్చి గానీ కొన్ని తెలుగు పాటలే నాకు అర్థమయి చావవు..)

ఏజెంట్ వినోద్ లో పాట ప్యార్ కీ పుంజీ బజాదే..

Why this kolaveri Di’..



వయసుకి తగని పాటలకి డాన్స్ చేయడం నచ్చక, అక్కడ నుంచుని చప్పట్లు కొడుతున్న టీచర్ కి ఒకావిడ కి చెప్తే,.. ‘మా చేతుల్లో లేదు. మా సూపర్ వైజర్ ఇష్టం. ఆవిడకి రాత పూర్వకం గా మీరు కంప్లైంట్ ఇవ్వండి’ అంది. సర్లే.. మధ్యాహ్నం పని పూర్తి చేసుకోపోతే మళ్లీ వారాంతం లో పని చేసుకోవాలి.. ఎందుకొచ్చింది అని .అక్కడ నూడిల్సు, ఫ్రైలు, బర్గర్లు తినేసి ఇంటికొచ్చి పడ్డాము..



2012 సినిమా చూడలేక పోయానే.. ఎంత మిస్సయ్యానో.. అని నిన్నంతా తెగ బెంగ పడిపోయాను.. స్కూల్లో ఫంక్షన్ లో ఒక్కసారి గా నిలబెట్టిన వినైల్ హోర్డింగ్ గాలిలో, పరిగెట్టుకు వచ్చిన పిల్లల మూక తోసినందుకో, రెండూ జరిగినందుకో.. ఢామ్మని పడిపోయింది. ఇంకేం.. జనాలు.. బాబోఓఒయ్ అని పరుగులు ఒక నిమిషం తర్వాత తేరుకుని నవ్వుకున్నాం.

పక్కింట్లో కూడా పైన్నుంచి ఏదో కుర్చీ పిల్లలు పడేస్తే,.. పిల్లలు అంతా వచ్చి చూసి..’ఓస్ ఇంతేనా..అని బ్హాగా నిరాశ చెందారు..



ఒక స్నేహితురాలితో నా ఉదయం బాధని gchat ద్వారా పంచుకుని కాస్త శాంతించి... రాత్రి రోజూ లాగే శుభ్రం గా తినేసి, పుస్తకాలు చదువుకుంటూ అందరం పడుకున్నాకా, పాలు ఫ్రిజ్ లో పెట్టలేదని గుర్తొచ్చి లేచి వచ్చాక టీవీ పెడితే.. స్టార్ ప్లస్ లో 2012. నేనైతే కూర్చుని పూర్తిగా చూశాను. సాంకేతికం గా బాగా నచ్చింది. భలే తీశాడనిపించింది. అమెరికన్ల ప్రపంచం,వాళ్ల “ఉదారత” ..నవ్వొచ్చింది..



సినిమా చూస్తుండగా ఇంకో ఫ్రెండ్ ‘కర్ణాటక సంగీతం పాడే నిత్యశ్రీ భర్త ఆత్మహత్య వివరాలు చెప్తే బాధ వేసింది. ఇద్దరు అమ్మాయిలట. భర్త ఆత్మహత్య తర్వాత, తనూ ఆత్మహత్యా ప్రయత్నం చేసిందిట. నిన్న రాత్రి అత్తగారు చనిపోయిందట. అసలు పాపం ఏమవుతోంది తన జీవితం లో?


 చాలా ఏళ్ల క్రితం నాకు చెన్నై లో శ్రీమతి పట్టామ్మాల్ గారి కోడలు (లలిత గారనుకుంటా) శిష్యురాలితో పరిచయం ఉండేది. ఓరోజు బీచ్ కి వెళ్లి వస్తూండగా ఆ అమ్మాయి ‘హమ్మో.. నాకు క్లాస్ సమయమైంది. చూసుకోలేదు.. ఎలా’ అని కంగారు పడి ‘పోనీ నువ్వు నాతో వస్తావా? పట్టమ్మాళ్ ఇంటికి తీసుకెళ్తాను వస్తావా?’ అనడిగింది. నేను ఏదో ఒక పిచ్చి పాత నూలు సల్వార్ కమీజ్ లో ఉన్నాను. పైగా ఇసుక రాలుతోంది. అయినా.. carnatic musical trinity లో ఒకరైన పట్టమ్మాళ్ ని చూసే అదృష్టమే!! నాకు నోట మాట రాలేదు. అలా వెళ్లిపోయాం. అక్కడ నిత్యశ్రీ ని చూపించి.. ‘ఈ అమ్మాయే.. మా మాడం కూతురు. తనూ బాగా పాడుతుంది.కచేరీలు చేస్తుంది.’ అని పరిచయం చేసింది.



నా స్నేహితురాలు క్లాస్ లో కూర్చుంటే.. నిత్యశ్రీ తో నేనూ పిచ్చాపాటీ మాట్లాడుతూ కూర్చున్నాను. చాలా సరదాగా మాట్లాడింది. ‘అంత పెద్ద విద్వాంసురాలి మనవరాలు కదా.. మీకు చాలా గర్వం గా ఉండి ఉండవచ్చు కదా..’ అంటే.. ‘అవును. చాలా గర్వం గా ఉంటుంది. అలాగే చాలా అదృష్టం నాది’ అనిపిస్తుంది.. అంది. ‘మీరూ చాలా అదృష్టవంతులు..’ అంది.

‘అవును.పట్టమ్మాళ్ మనవరాలితో మాట్లాడే అవకాశం దక్కినందుకు.. కదూ’ అన్నాను.

‘చనువు గా ఒక్కసారి భుజం మీద చరిచి పక్కున నవ్వుతూ.. ‘కాదు. మీకు తెలుగు తెలుసు. తెలుగు వారు. త్యాగరాజ కృతుల్నినేర్చుకోవడానికి ఎంత ఈజీ మీకు? నాకు మా అమ్మ తెలుంగు నేర్పిస్తుంది..’ అంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం గురించి ఆసక్తి గా అడుగుతూంది.

‘సబాపతిం..’ అని రాగం తానం.. పల్లవి అంటూ ఏదో పాడి వినిపించింది. అప్పట్లో నాకర్థం కాలేదు.. విని మొహమాటానికి బాగుందని చెప్పాను. ఈలోగా, మా నాయనమ్మ ని చూడాలంటే పక్క వీడు కెళ్ళాలి అంది.



అంత పెద్ద కళాకారిణి ఇంటికెడుతూ కనీసం ఒక మూర పూలు, ఒక స్వీట్ ముక్క,కనీసం మంచి బట్టలు కూడా వేసుకోలేదు  అనుకుని చాలా మొహమాటం గా వెళ్లాను. పట్టమాళ్ నాతో ఎవరో అమ్మమ్మ మాట్లాడినంత ప్రేమ గా మాట్లాడి ఊరూ, పేరూ తెలుసుకుని ఒక మూర మల్లెపూలు చేతిలో పెట్టి, ‘పెట్టుకో. నా ప్రోగ్రాం ఉంది. త్యాగరాయ సభలో.. వస్తావా? ‘ అని అడిగింది. నాకు నోట మాట రాలేదు. పట్టు చీరల్లో పట్టమాళ్, లలిత గారు, నిత్యశ్రీ, పక్కన దిష్టి బొమ్మల్లా నేనూ, నా ఫ్రెండూ.. పట్టమ్మాళ్ కొడుకు నాచేతికి ఒక ఎలక్ట్రానికి తంబూరా ఇచ్చి కాస్త పట్టుకోమ్మా.. అని కార్ లోకి ఇచ్చారు. అప్పుడు చూసుకున్నాను. హవాయి చెప్పులు..చింపిరి జడ.. కానీ పట్టమాళ్ ఇచ్చిన మల్లెమాల.. నిత్యశ్రీ కార్ లో కూర్చుని నేను వెళ్లటమేమిటి? అని.



రెండు కార్లు వెళ్లి ఆ సభ దగ్గర ఆగుతూనే, చాలా మంది ఆవిడకి పుష్పగుచ్చాలతో స్వాగతం పలుకుతుంటే, ఆ వెనక మేము ఎలా వెళ్లామో, మొదటి వరస లో కూర్చుని ఏం విన్నామో.. దేవుడికెరుక. ప్రోగ్రాం అవుతూండగానే హాస్టల్లో మళ్లీ రానీయరని. స్టేజ్ మీద పాడుతున్న పట్టమాళ్ కి నమస్కారం చేసి, నాయనమ్మకి సహకారం ఇస్తున్న నిత్యశ్రీ కి బై అన్నట్టు చేయి ఊపేసి, నందనం బస్సెక్కేసాం...



జీన్స్ లో ‘కన్నులతో చూసినదీ’ పాటా,..చంద్రముఖి లో ‘వారాయ్’ అన్న పాట పాడి తెలుగు సినిమా ప్రేక్షకులకి చేరువ అయినప్పుడూ .. కర్ణాటక సంగీత సీడీ లు అమ్మే ప్రతి షాపు లోనూ తన సీడీ లు ఎప్పుడు చూసినా గర్విస్తూ ఉంటాను.. ఇదంతా ఇంకోసారి గుర్తు చేసుకుని..నిద్రపోయాను...



ఈరోజు లేచి చూస్తే.. నరకం లో నూనె లో కాల్చబడుతూనో, స్వర్గం లో కుర్చీల్లో కూర్చుని రంభా వాళ్ల డాన్సులు చూడకుండా,.. పాల పాకెట్లు మళ్లీ చింపుకుని స్టవ్ మీద పెట్టుకుని రోజు మొదలు పెట్టాల్సి వచ్చినందుకు సంతోషం గానే ఉన్నా,.. ఏమూలో ఒక చిన్న, mild disappointment.

29 comments:

Krishna Palakollu said...

ఈ మధ్య ప్రాజెక్ట్ కొంత బిజీ గా ఉండి కొద్ది రోజులుగా ఇటువైపు రాలేదు కృష్ణ గారు.

క్రిస్మస్ బ్రేక్ కదా, ఇవాళ ఉదయాన్నే చూసేసరికి ఆహ 3 పోస్ట్ లు. [నవంబర్ , డిసెంబర్ ], వివాహ భోజనంబు అనుకుంటూ బ్రేక్ఫాస్ట్ తో పాటు చదివేసా.


సూపర్, మూడు మంచి విషయాలు & మీ శైలి లో చక్కగా ఉన్నాయ్.

Anonymous said...

అవునండి!
చాలా సాదాసీదాగా అయిపోయింది "యుగాంతం".

Kathi Mahesh Kumar said...

****

జ్యోతిర్మయి said...

జరిగిన ఘోరం బాధ్యతకు సవాల్ గా మారింది. విఫలమైతే ఎంతకాలమని పిల్లల్ని రెక్కల కింద దాచుకుంటాం. మీ ప్రశ్నే నా మనసులోనూ. జరిగిన ఘోరాల శిక్షల మాటేమిటి?

THARKAM said...

21.12.12 పరమ బోర్ టాపిక్ గా తయారయ్యింది ఆ తేది అనుకున్నా అసాంతం మీ పోస్ట్ చదివాక హమ్మయ్య అనుకున్నా....బాగుందండి.

తృష్ణ said...

మీరు రాసిన మొదటి విషయం వల్ల మేము కేబుల్ టివీ పెట్తించుకోనందుకు మరోసారి చాలా ఆనందించాను.. లేకపోతే రోజుక్ ఇఎన్నిసార్లు ఎన్ని ఛానల్స్లో ఇదే వార్త వినాల్సి వచ్చేదో...:(
నిత్యశ్రీ తాలూకూ న్యూస్ చదివి చాలా సేపు తేరుకోలేకపోయానండి... పైకి గొప్పగా, అదృష్టవంతులుగా కనబడేవారి జీవితాల్లో కూడా ఇలాంటి విషాదాలు ఎన్ని దాగిఉంటాయో కదా అనిపించింది..
పట్టమ్మాళ్ ని కలిసారా...అదృష్టవంతులు..

Kala said...

"మా అమ్మాయి వచ్చి పేపర్ చదవడానికి కూర్చుంది. సాధారణంగా రోజూ పేపర్ చదవదని దెబ్బలాడతాను. ఈరోజు మాత్రం.. వద్దు.. ఆటల పేజీలు, కార్టూన్లు చదువు చాలు అని మెయిన్ పేపరు ఇవ్వలేదు. ఇలా మెయిన్ పేపర్ ఎన్నాళ్లు దాచాలి? అసలు దాచాలా? జాగ్రత్తలు చెప్పాలా? ఏరకమైన జాగ్రత్తలు చెప్పాలి? అభద్రతా భావం, సాటి మనిషన్నవాడిని ఎవ్వర్నీ నమ్మరాదని చెప్పాలా? అన్నీ నాకు ప్రశ్నలే. ఎవర్నడగాలో తెలియదు. ఎవరికైనా ఖచ్చితమైన సమాధానం తెలుసని నేననుకోను." I have the same concerns. How much can we protect our kids from these brutal society filled with rapists and shooters.

Mauli said...

మీరు చాలా అదృష్ట వంతులండీ , మేము కూడా :)

Anonymous said...

పిల్లలు పేపర్ చదివే విషయంలో నాదీ మీ ఇబ్బందే! ఇక్కడ పేపర్లూ, ప్రకటనలూ ఇంకా ఘోరంగా వుంటాయి. అయితే మధు పద్దెనిమిదేళ్ళ పిల్ల అవడం వల్ల ఈ మధ్య దానికి సెన్సార్ చేయటంలేదు. అందులోనూ దానికి ఇండియా, ఆస్ట్రేలియా, రెండు దేశాల కరెంట్ ఎఫైర్స్ మీద చాలా ఇంట్రస్టు.

నిత్యశ్రీ భర్త గురించి- ంకెందుకో- What a selfish man అనిపించిందండీ. ఎదుగుతున్న ఇద్దరు పిల్లలతో సహా భార్యని ఒంటరిగా వదిలేసి వెళ్ళటానికి ఆయనకి మనసెలా ఒప్పిందో!

డిల్లీ సంఘటన- చాలా సార్లు మనం మనుషుల మేనా లేక మనకే తెలియకుండా పశువులల్లోకి మెట మార్ఫైస్ అవుతున్నామా అని అనుమానం వస్తుంది. The less said about it the better

శారద

చాతకం said...

May be these sad incidents are a sign that world is indeed going to end soon?

Sravya V said...

As usual nice post ! నిత్య శ్రీ గురించి న్యూస్ చదినప్పుడు చాలా బాదేసిందండి !

But I have a serious question :-)

కాబట్టి ఇంత వెలుగులోకి వచ్చి దేశాన్ని కుదిపేసింది.. మీడియా, విద్యార్థులు, సంఘ సేవ చేసే వాళ్లు, అందరూ ధ్వజమెత్తి నిరసిస్తున్నారు. వీధుల్ని నినాదాలతో దద్దరిల్లేలా చేస్తున్నారు...
-----------------------------
Many times I read this kind of statement by people, now in your post too :-) What exactly meant by this?
ఇన్నీ రోజులు ఊరుకున్నారు కదా ఎప్పుడు ఈ గొడవ ఏంటి అనా లేక మిగిలిన కేసుల్లో ఎందుకు ఈ గొడవ జరగలేదు అనా ? నేను అనుకోవటం ఆ రెండో ఆప్షన్ మీ ప్రశ్న అనుకుంటా ? ఏ విషయానికైనా ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉండదు కృష్ణప్రియ గారు? ఇక్కడ సంఘటన జరిగిన తీరు కలిచివేస్తుంది అందుకే ఇంత పెద్ద ఎత్తున నిరసన అనుకుంటాను. ప్రతి విషయానికి పోట్లడటానికి జనానికి ఓపిక కావొద్దు :-). ఇంత పెద్ద ఎత్తున మొదలైన నిరసన కనీసం ప్రభుత్వం పైన కాకున్నా, ఇలాంటి సంఘటనలకి తెగబడే వాళ్లకి కనీసపు ఆలోచన కలజేస్తే అది చాలు .

పిల్లల డాన్సులు హ్మ్ నో కామెంట్స్ :-)

కృష్ణప్రియ said...

శ్రావ్యా,

అవును. ఏ విషయానికైనా ఒక ట్రిగ్గర్ అవసరం.
“బీహార్ లో ఎనిమిదేళ్ల పిల్ల పైన జరిగిన అత్యాచారం వార్త వచ్చినప్పుడు లేదా ముంబై లో ఐదేళ్ల పిల్లకి జరిగినప్పుడు/ఏదో ఒక చిన్న ఊళ్లో ఇలాగ జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు? ఇప్పుడెందుకు స్పందిస్తున్నారు?”
నేనూ ఇలాంటి కామెంట్లు విని నేనూ అలిసిపోయాను. ఒక విషయం మీద ఇప్పుడు అడుగుతున్నానంటే మొన్న జరిగిన దానికెందుకు చలించలేదు? అని అడిగితే ఏం చెప్పగలం? మన కళ్లెదురుగా జరిగే అన్యాయానికి ప్రతిస్పందించి మనకేం సంబంధం లెమ్మని అనుకోకపోతే చాలని నేననుకుంటున్నాను. అది కూడా ఒక్కోసారి జరగలేదని నా ఆవేదన.
ఎవరి సంగతో అక్కరలేదు.. నావరకూ నాకే.. ఒకప్పుడు మా కాలనీ లో ఊడ్చే అమ్మాయి భర్త తమ గుడిసెల దగ్గర మరుగుదొడ్లు ఖాళీ లేవని ఉదయం ఒక చిన్న చెరువు దగ్గర కూర్చునుండగా ఒక MLA నడుపుతున్న ఆసుపత్రి నుండి చెత్త (వాడేసిన సిరంజిలు, చీము నెత్తురు తో నిండిన గాజుగుడ్డలు, రక రకాల రసాయనాల తో నిండిన చెత్త..) లారీ అతని మీద గుమ్మరించేసి వెళ్లిపోయింది. ఆ చెత్త లో కూరుకుని చనిపోయాడతను. ఆ విషయం విని ఏమీ నేను చేయలేదు. నేనే కాదు ఎవ్వరూ ఏమీ చేయలేదు. చేసేందుకు ఖాళీ/ఓపిక లేదు. ఏమైనా చేయాలంటే భయం, బెరుకు కూడా ఉంది. తర్వాత కూడా అదే చెరువు లో చెత్త అదే హాస్పిటల్ నుంచి రెగ్యులర్ గా పడుతూనే ఉంది.
ఇన్ఫాక్ట్ స్థబ్దత అనే జాడ్యం లో కూరుకుపోయున్న మెట్రో యువత, అన్నా హజారీ అప్పుడు కానీయండి, ఇప్పుడు కానీయండి..వీధుల్లోకి వచ్చి ప్రశ్నించడం, తమ శక్తి ని గుర్తించి చూపించడం నేనూ టీవీలో చూస్తూ ఆనందిస్తున్నాను.
ఇది కేవలం పొంగు కాకూడదని, మరో అత్యాచారం చేయబోయే వాడికి ఈ ప్రభంజనం అంతా గుర్తొచ్చి వెనక్కి తగ్గాలని నేననుకుంటున్నాను. ఇదొక్కటే కాదు ఇంకా ఏదో చేయాలేమోననుకుంటున్నాను. కానీ అదేంటో నాకూ స్పష్టం గా తెలియదు.

Anonymous said...

యుగాంతం జరుగుతుందంటే, ఏదో అయిపోతుందని కాదు. మీరు వ్రాశారే, ఢిల్లీ సంఘటనలూ, ఈ రోజుల్లో పాడుతున్న పాటలూ,hospital wastes etc.. ఇవన్నీ మీరు టపాకి పెట్టిన శీర్షికకి సంకేతాలు.
As usual మీ టపా చాలా పెద్దగా ఉంది. కానీ కిందటిసారి కంటె కొంచం చిన్నదే.

పట్టమ్మాళ్ గారి గురించి విడిగా టపా వ్రాసుంటే ఇంకా బావుండేది.ఎందుకంటే అలాటివి జీవితంలో ఎప్పుడో కానీ రావు.అలా వచ్చినవి deserve a special post.

Mauli said...

ఉహూ, ప్రతి సారీ హడావుడి చేస్తే మీరన్నట్లు పేపర్ చదివే వారు ఉండరు. ఇప్పటికే టీవీ లు చూడలేక పోతున్నారుట. కాబట్టి మీడియా వారిని ఆకర్షించే ఖరీదు ఉన్న స్పందన నే టెలికాస్ట్ చేస్తుంది, చెయ్యాలేమో. ప్రజల సంతోషమే వారి సంతోషం ఏమో.

మీరు చెప్పిన సంఘటనలో మీరు స్పందిన్చలేకపోవడానికి కారణం, ఆ సమస్య మీకు రెలవెంట్ కాకపోవడం ఏమో. ఇప్పుడు ఇంకో సమస్య గురించి మీ టపా లో మాట్లాడడం కూడా మీకున్న రెలవెన్సు కారణం అయ్యుండొచ్చు .

మొన్న యూ ఎస్ లో పాప కేసు గురించి, నిన్న ఇంకో దేశం లో అమ్మా నాన్న ని అరెస్ట్ చేసిన వైనం గురించి నాతొ ఆరా తీసి చర్చ చేసిన మన పక్క రాష్ట్రాల కో వర్కర్స్ , ఈ వార్త గురించి కనీసమ్ మాట వరుసకన్నా ఎత్తకపోవడం, కొత్త నిజాన్ని చూపించింది. ఇప్పటిదాకా వాళ్ళు చర్చించింది సామాజిక స్పృహ తో కాదని :( :-)

బులుసు సుబ్రహ్మణ్యం said...

మొదటి సంగతి మొదట.

నేను కూడా చాలా అదృష్టవంతుడిని. పట్టమ్మాళ్ గారితో మాట్లాడిన, ఆవిడ తంబురా మోసే అదృష్టం కలిగిన కృష్ణ ప్రియ గారు నాకు తెలుసు అని సగర్వంగా మా ఆవిడకు చెప్పాను.......దహా.

డిల్లీ అత్యాచారం గురించి చాలానే చర్చలు జరుగుతున్నాయి. నేను డిల్లీ ప్రజలకు సాల్యూట్ చేస్తున్నాను. న్యాయం కోసం, పరిస్థితులలో మార్పు డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తున్నారు.ఈ పోరాటం ముఖ్యం. మనం పోరాటం మరిచిపోయాము. ఇక్కడి నుంచి ప్రజల్లో ఈ పోరాడే గుణం పెరిగితే మంచిదే. దిగ్భ్రాంతి చెందాం, ఖండిస్తున్నాం, విచారం వ్యక్తం చేస్తున్నాం లాంటి మాటలు మళ్ళి మళ్ళి విని, కార్యాచరణ శూన్యం అయి, నిరాశ పెరిగిపోతోంది. ఎక్కడో అక్కడ పోరాటం మొదలయితే సంతోషమే. ఎంత దూరం ఈ పోరాటం వెల్లుతుందో తెలియదు. వేచి చూద్దాం.

అన్నట్టు నిన్న త్రిపుర లో ఒక అత్యాచారం జరిగిందిట. సాక్షిలో వార్త. ఎవరి దారిని వారు వెళ్ళిపోయారు అనుకుంటాను. ఈ పరిస్థితి మారాలి. డెల్లి పోరాటం దేశం లో గల్లి గల్లికి పాకాలి. చూద్దాం.

అన్నట్టు, కృష్ణప్రియ డైరీ పుస్తకం గా మారాలి.

కృష్ణప్రియ said...

@ కృష్ణ గారు,
:) ధన్యవాదాలు.. నేనూ చాలా బ్రేక్ తీసుకున్నాకా రాస్తున్నా లెండి ఈ మధ్య.

@ బోనగిరి గారు,
కదా.. కనీసం.. పెరట్లో ఆరేసిన తువ్వాలు కూడా కదలలేదు. ఎలా ఆరేశానో అలాగే పడి ఉంది దండెం మీద.

@ మహేశ్ కుమార్ గారు,
మళ్లీ నాలుగు స్టార్ రేటింగ్ ఇచ్చారు చాలా కాలానికి. థాంక్స్.

@ జ్యోతిర్మయి గారు,
అవును. ఎంతకాలమని పిల్లల్ని రెక్కల మాటున దాచుకుంటాం? :-(

కృష్ణప్రియ said...

@ తారకం గారు,
:) నా పోస్ట్ చదివాక బోర్ గా అనిపించలేదన్నమాట అయితే..

@ తృష్ణ గారు,
టీవీ లో ఆ వార్త గురించి కవరేజ్ నా దృష్టి లో అవసరమే! ఈ సంఘటన తర్వాత యువత లో పెల్లుబికిన ఆవేశం గురించి టీవీ/పేపర్ల లో రాయడం వల్ల ఖచ్చితం గా అవేర్నెస్ పెరుగుతుంది. బహుశా ఒక పొంగు లా వచ్చి ఈ నిరసన చల్లబడి పోవచ్చు. కానీ గుర్తుండి తీరుతుంది.
నిత్యశ్రీ విషయం లో అయితే నిజం గా మూడు నాలుగు రోజులనుంచీ నాకు చాలా బాధ గా ఉంది. ఇక పట్టమ్మాళ్ గారిని కలవడం నా జీవితం లో మరచిపోలేని సంఘటనల్లో ఒకటి.

@ కళ గారు,
అవును. ఇది నాకు ఎప్పుడూ ఒక ప్రశ్నే. ‘brutal society filled with rapists and shooters’ అనిపించడం సహజమే. కానీ అలాగ అనుకుంటే ఎప్పుడూ భయాందోళనల్లో బతకాల్సి వస్తుంది. తమ జాగ్రత్త గా తాముండటం నేర్పించాలి..అందరినీ గుడ్డి గా నమ్మకుండా, ఉండటం లాంటివి నేర్పించగలం. క్లాస్ లో కూర్చుంటే ఎవరైనా గన్ ఫైర్ చేయడం మొదలు పెడితే .. మనమేం చేయగలం?

కృష్ణప్రియ said...

@శారద గారు,

నిత్యశ్రీ భర్త విషయం లో నాకూ అలాగే అనిపించింది. ఎన్ని గొడవలున్నా, ఎన్ని కష్టాలున్నా, తన మీద ఆధార పడ్డ ఎనిమిదేళ్ల పిల్లనీ, ఆరేళ్లపిల్ల నీ వదిలి ఆత్మహత్య చేసుకోవడం నాకూ అస్సలూ నచ్చలేదు. మూమెంటరీ ఎమోషన్ లో అలాగ చేశాడో, లేక తన స్వార్థం తాను చూసుకున్నాడో .. పాపం నిత్యశ్రీ..

@ చాతకం గారు,
హ్మ్..

@ ఫణిబాబు గారు,
నిజమే.. చాలా పెద్దదైంది టపా. మున్ముందు టపాలు ఇంకా కుదిస్తాను.. ఆరోజు జరిగినవి అన్నీ రాసేయాలన్న తాపత్రయం ;)

@ మౌళి గారు,
హ్మ్..

@ బులుసు గారు,
:) కదా.. మీరెంత అదృష్ట వంతులు.. నాకు చాలా కుళ్లు గా ఉంది ;)

Anonymous said...

>>“బీహార్ లో ఎనిమిదేళ్ల పిల్ల పైన జరిగిన అత్యాచారం వార్త వచ్చినప్పుడు లేదా ముంబై లో ఐదేళ్ల పిల్లకి జరిగినప్పుడు/ఏదో ఒక చిన్న ఊళ్లో ఇలాగ జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు? ఇప్పుడెందుకు స్పందిస్తున్నారు?”
నేనూ ఇలాంటి కామెంట్లు విని నేనూ అలిసిపోయాను. ఒక విషయం మీద ఇప్పుడు అడుగుతున్నానంటే మొన్న జరిగిన దానికెందుకు చలించలేదు? అని అడిగితే ఏం చెప్పగలం?


వ్యక్తిగత అభిప్రాయాన్ని ప్రైవేట్ ఫోరం స్ లో వ్యక్తపరిచినప్పుడు పర్వాలేదు. ఒక పబ్లిక్ ఫోరం లో చెప్పినప్పుడు/రాసినప్పుడు
ఒక వర్గం (కులపరమో, మతపరమో, స్త్రీ వాదమో, లేక ఒక కంపెనీ లో ఉద్యోగస్తులో.. etc) వారిని ఏదైనా అంటే మిగిలిన వారిని అనలేదేంటని అడగటం..అది సహజమైన ప్రతిస్పందన కాదంటారా? మానవ నైజం కాదంటారా?

Anonymous said...

>> నేనూ ఇలాంటి కామెంట్లు విని నేనూ అలిసిపోయాను.

అలసిపోయింది ఇలాంటి కామెంట్లు వినా ? చేశా ? ;)

మొత్తానికి ఇటువంటి వాటి మీద అలసటో, విసుగో ఏదో ఒకటి వచ్చిందనేది శుభ పరిణామమే :)

Bhãskar Rãmarãju said...

అగ్లీ ఫేస్ ఆఫ్ అర్బనైజేషన్ డిల్లీ సంఘటన

Anonymous said...

>>సహజమైన ప్రతిస్పందన కాదంటారా? మానవ నైజం కాదంటారా?

సహజమైన ప్రతిస్పందనలూ, మానవ నైజం నిజమే కానీ వీటితో పాటు మానవులకి ఆలోచనా శక్తి కూడా ఉంటుంది. అది ఉపయోగిస్తే మంచిది. అంతేగానీ మనకి అవసరమైనప్పుడు మాత్రం ఆలోచనని ఉపయోగించడం మిగిలినప్పుడు మానవ నైజం అని కల్లబొల్లి కబుర్లు చెప్పడం, అయితే పలాయన వాదమో, మోసమో అయ్యుండాలి లేదంటే, తాము తాము రిలేట్ చేసుకోగలిగేవాళ్ళు మాత్రమే మానవులు, మిగిలిన వాళ్ళు కాదు అనే అఙానమో, అహంకారమో, అయ్యుండాలి.

కృష్ణప్రియ said...


@ అజ్ఞాత,
మానవ నైజమే.. ఒప్పుకుంటాను. అలాగే అప్పుడు నోరెత్తలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడే హక్కు నీకు లేదు అంటే ఒప్పుకోను. అన్నింటికీ అన్ని వేళలా ఓకే రకం గా స్పందించడం సాధ్యమా?

@ అజ్ఞాత ౨,
:) రెంటికిన్నీ..

@ భాస్కర్ రామరాజు గారు,
:-(( ఈ సంఘటన తో, మీడియా మేల్కొని చాలా కవరేజ్ ఇస్తున్నారు కదా.. చూస్తుంటే భయమేస్తోంది. సాటి మనిషంటే నమ్మకం సన్నగిల్లుతోంది..
కేవలం అర్బనైజేషన్ వల్లేనంటారా? ఇంకా చాలా మౌలిక కారణాలున్నాయనిపిస్తుంది నాకు.


@ అజ్ఞాత ౩,
<<<<>>>

మీరు ఈ రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయనుకుంటున్నారు? సమయాభావం, ఇతర పరిమితుల్లాంటివి ఉండే చాన్సే లేదా?
మన ఇంటి మనిషి చనిపోతే తల్లడిల్లుతాం. ఒక్కోసారి రికవరీ కి రోజులు, నెలలు, సంవత్సరాలు ఒక్కోసారి జీవితకాలం పట్టచ్చు. ఆత్మీయిలైతే దుఃఖపడతాం, ఎంత దూరమైనా ఒక వారం సెలవ పెట్టి వెళ్లి ఓదార్చి వస్తాం.
అదే పక్కింటివాళ్లింట్లో వారయితే ఓ రోజు సెలవ పెడతాం. వాళ్లకి వీలైన సహాయ, సానుభూతులందిస్తాం.వీధిలో వారైతే ఓ గంట చూసి వస్తాం. వేరే ఎవరైనా అయితే కేవలం నిట్టూరుస్తాం. కాదంటారా?
ఇదంతా పలాయన వాదమో, మోసమో, , తాము తాము రిలేట్ చేసుకోగలిగేవాళ్ళు మాత్రమే మానవులు, మిగిలిన వాళ్ళు కాదు అనే అఙానమో, అహంకారమో, మాత్రం వల్లేనంటారా?

Anonymous said...

>>సమయాభావం, ఇతర పరిమితుల్లాంటివి ఉండే చాన్సే లేదా?
ఇదంతా పలాయన వాదమో, మోసమో, , తాము తాము రిలేట్ చేసుకోగలిగేవాళ్ళు మాత్రమే మానవులు, మిగిలిన వాళ్ళు కాదు అనే అఙానమో, అహంకారమో, మాత్రం వల్లేనంటారా?

Absolutes like చాన్సే లేదా? మాత్రం వల్లేనంటారా? are basically asked to win the arguments, deflect the topic, to slither away from truth and speaks of lack of intellectual honesty when discussing something.

nobody is setting a standard here. We just need to think and understand ourselves better and make improvements if possible. Above all we should have the intellectual honesty to understand and accept our own weaknesses in our thoughts.

Anonymous said...

>>అలాగే అప్పుడు నోరెత్తలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడే హక్కు నీకు లేదు అంటే ఒప్పుకోను. అన్నింటికీ అన్ని వేళలా ఓకే రకం గా స్పందించడం సాధ్యమా? "

Did I say so ? Did my comment gave that meaning to you !!!

Anonymous said...

ok.. here are the answers to your questions..:)

>>చాన్సే లేదా?

ఉండొచ్చు

>>మాత్రం వల్లేనంటారా?

వాటివల్ల "మాత్రమే" అని అనను

కృష్ణప్రియ said...

@అజ్ఞాత Jan 2013 12.28PM

Quoting you...
Absolutes like చాన్సే లేదా? మాత్రం వల్లేనంటారా? are basically asked to win the arguments, deflect the topic, to slither away from truth and speaks of lack of intellectual honesty when discussing something.>>>>

probably I do lack intellectual honesty,.. Agreed. At the same time, I still feel that not being able to react at the same level to various issues at the same degree,.. could be due to multiple factors..
Not just పలాయన వాదమో, మోసమో, , తాము తాము రిలేట్ చేసుకోగలిగేవాళ్ళు మాత్రమే మానవులు, మిగిలిన వాళ్ళు కాదు అనే అఙానమో, అహంకారమో,

@ ఇంకో అజ్ఞాత,
Did I say so ? Did my comment gave that meaning to you !!! >>>
Probably not! Could be that I took it in a negative way.

Anonymous said...

>> I still feel that not being able to react at the same level to various issues at the same degree,.. could be due to multiple factors..

Nobody is denying that. people might react differently to different things due to various reasons. Only thing I am suggesting is.. when someone explains the things then at least we should try and understand the issue and ourselves better. in stead if we take evasive approaches and hide behind them I call that intellectual dishonesty.

I do not mean to attribute intellectual dishonesty to your personality. What I meant to say is, this temporary intellectual dishonesty creeps into each one of us at different times and in different circumstances. We just need to be aware of that danger.

Just for some thinking let me as you this...
చాన్సే లేదా? మాత్రం వల్లేనంటారా? is it 100% like that ? is it 0% ?

Things like the above are really evasive and dishonest in my opinion. Everyone knows that absolutes are not true. There will always be exceptions. As long as the main point is understood exceptions can be discussed and understood as well. But someone trying to use those metaphors to suppress truth is definitely intellectual dishonesty in my opinion.

You seem to be a reasonable and good individual. Do not attribute momentary and thoughtless mistakes to your personality.

Mauli said...

అజ్ఞాత గారు మీరెవరో గాని బ్లాగులకు మంచి చెయ్యడానికే అవతరించారు :)

Intellectual dishonesty అంటే ముందు నా మట్టిబుర్రకి ముందు అర్ధం కాలేదు కానండీ, అది బ్లాగుల్లో, వ్యాఖ్యల్లో విచ్చలవిడిగా దొరుకుతుంది. బహుసా అటువంటి వారి మధ్య వుండడం వల్ల కాబోలు ఈ temporary intellectual dishonesty కూడా మిగిలిన కొద్దిమందినీ ఆక్రమిస్తుంది.

ఇది కాక నేను విన్న ఇంకొద్ది మంది అభిప్రాయం , మార్చలేని వాటి జోలికి పోవద్దు ,కావాలంటే 10 రూపాయలు డొనేషన్ ఇచ్చి తప్పుకొనడం ఉత్తమం అని. ఆ విధం గా వారు చక్కగా బాధ అనేది లేకుండా జీవించగలుగుతున్నారు. అదికూడా Intellectual honesty నే అవ్వాలి మీ వ్యాఖ్యను బట్టి.

అప్పుడప్పుడు వ్యాఖ్యలు వ్రాస్తూ ఉండండి, మీకు పెద్ద ఫ్యాను, ఎసి ఇంకా ....హ్మ్ మాటలు రావడం లేదు.

క్రిష్ణప్రియగారు మీరు మళ్ళీ అదృష్టవంతులు( Honestly :) )

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;