Wednesday, February 13, 2013

ఈ వారం లో ఎక్కిన రెండు చెట్లు..

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు..
కుటుంబ కథా చిత్రం.. ఫామిలీ ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకుంటుంది.. అంటే కొద్దిగా సంక్రాంతి సినిమా లా ఉంటుందేమోనని భయం ఉన్నా.. మొత్తానికి మొన్న చూసేసా.. చూశాకా అర్థమైంది. ఈ చెట్టు కుటుంబ కథా చిత్రమని ఎందుకన్నారో!

యూత్ (అబ్బాయిలు) ఎందుకు వెళ్లాలి?

బిజినెస్ మాన్ లో బాబుని మొన్నీమధ్య అతి క్రూరంగా,భయానకం గా మొహం పెట్టి సంఘ విద్రోహ పనులు చేస్తూ దేశాన్ని కంట్రోల్ చేసే పాత్ర లో చూసి అలిసిపోయారు మన యూత్.. పాపం.. వాళ్ల కలల మాటేంటి?

అందం గా తయారయి, ఇంట్లో అంతా ఒక్క మాట కూడా అనకుండా, ‘హైదరాబాదు లో ఉద్యోగం సజ్జోగం లేదు.. అసలు ఏం చేస్తున్నావు?’ అని మాట వరసకైనా అడక్కుండా అపురూపం గా చూసుకుంటూ, నోటి దురుసుదనంతో వెక్కిరింపు మాటలు మాట్లాడినా ‘అగ్గగ్గలాడుతూ’ సేవలు చేసే కుటుంబం..

కాస్త అందం గా తయారయి, చేతికి చిక్కింది నములుతూ, బేవార్స్ గా తిరుగుతూ సెంటర్ లో కూర్చుని ‘కనిపించిన అమ్మాయిలంతా రెండు నిమిషాలకే పడి పోతుంటే.. పూలెక్కడ పెట్టుకుంటావే?’ అని వాగడం, అలా ఎవరైనా రెండు నిమిషాలైనా పడకపోతే టీజ్ చేస్తూ ఎదురు తిరిగి అడిగితే ‘నువ్వు ముసలిదానివయ్యాకా.. నన్ను కూడా టీజ్ చేశారు అనే స్వీట్ మెమరీజ్ కోసమే ఏ ఏడిపించడం ‘ అనడం..

(ఏమాట కామాటే చెప్పుకోవాలి.. రోడ్డున పోయే ఆడవాళ్లకి ముసలాళ్లయ్యాకా తలచుకుని మురిసిపోవటానికి మెమరీస్ కోసం తమ కారీర్, జీవితం, తల్లిదండ్రులు పెద్ద వయసులలో కష్టపడి మేపుతుంటే అవన్నీ లెక్క చేయకుండా సెంటర్ లో కూర్చో వాలంటే ఎంత దొడ్డ మనసుండాలి? – డైలాగ్ రైటర్/డైరెక్టర్ జిందాబాద్)

తప్పించుకుని తిరుగుతున్నా, ‘బావా’ బావా’ అంటూ తిరగడం తప్ప పనీ పాటా పెద్దగా పెట్టుకోని సమంత ల్లాంటి మరదళ్లు..

ఎందుకో లక్షలు కుమ్మరించి ఐటం సాంగ్స్ చేయించడం. ఇలాంటి కారక్టర్లున్నాకా ఎవడు చూడోచ్చాడు.. అవి కావాలంటే ఏ హాల్లో చూసినా ఉంటాయి కదా..

మరి అమ్మాయిల మాటో?

మహేశ్,మహేశ్, మహేశ్.. ఆ పేరు లోనే.. ఏదో మాజిక్ ఉంది.

ఇంకా అనార్కలీ సూట్లు..

మరి మాలాంటి మహిళలు?

పైకి వెంకటేశ్ బాబు పేరు చెప్పుకుని మహేశ్ బాబునీ చూడచ్చు.. ఏ మధ్య సీరియళ్లల్లో అందరూ పట్టు చీరలేనాయే.. రోజూ మానేజ్ చేయలేం. అలాగే వేరే హీరోయిన్లేసుకునే బట్టలు రోజూ ఇళ్లల్లో వేయాలంటే మరి.. చుట్టూ జనాలు “నవరసాలు” చూపించే ప్రమాదం ఉంది కదా..

ఈజీ గా మానేజ్ చేసుకునే సింథటిక్ చీరల ప్రింట్లు చూసుకోటానికి మోడల్ గా పెట్టుకున్న ‘హోమ్లీ’ అంజలి.. మాకు వీలుగా రకరకాల ప్రింట్లు కనపడాలని బట్టలు డాబా మీద ఆరేస్తూ కనపడుతుంది చాలా సార్లు.. షాపుల్లో కూడా ఇంత ఆరేసి చూపించరు కదా..

మరి మగ మహారాజుల మాటో?

కలలలోనో, చరిత్ర పుస్తకాల్లోనో కనపడే కారక్టర్లు.. పేరు తో పిలవక్కరలేదు. సంపాదన వివరం అడగదు/ఉద్యోగం ఊసెత్తదు. ఒక మంచి మాట ఆశించదు. మొహం మీద విసుగు/కోపం తప్ప వేరే ఎక్స్ ప్రెషన్ లేకపోయినా ఒద్దిక గా, పొడులు విసురుకుంటూ, బట్టలారేస్తూ, నవార్లు నేస్తూ, ఎప్పుడూ ‘తిన్నాడో లేదో..’ అని బెంగ పెట్టుకుని బాధపడుతూ, ‘ఏఏ ఏ .... య్య్య్య్య్య్య్’ అనగానే ‘బావా అంటూ ఏది కావాలో చెప్పక్కర్లేకుండానే పరుగు పరుగున తెచ్చి పెట్టే మరదలు/బార్య..

పిల్లలకి?

వాళ్లేమైనా టికెట్లు కొంటారా? పెద్దవాళ్లకి కావాల్సినవన్నీ పెట్టారు కదా? వాళ్లే పిల్లల్ని లాక్కెడతారు. ఓ పాప్ కార్న్ పాకెట్ మొహాన కొట్టేస్తే సరి. అదయిపోయాక కొక్ ఉండనే ఉంది.

వృద్ధులకి?

‘అయ్యవార్లకు చాలు ఐదు వరహాలు. పిల్లగాళ్లకు చాలు పప్పు బెల్లాలు, పెద్దవారికి చాలు.. అచ్చమైన తెలుగు టైటిల్, కొబ్బరి చెట్లు.

ఇక అందరినీ మెప్పించిన జంట ప్రకాశ్ రాజు, జయసుధ, ఇక ఇంటర్నేషనల్ లెవెల్ నటి రోహిణి హట్టంగడి..

ఇన్నుండగా కథా, కాకరకాయా, కంకర పీసూ అంటే మరి కోపం రాదూ? పైగా ప్రకాశ్ రాజు తో సహా నీతి కూడా చెప్పించారు కదా..

ఇంతకాలం ఏదో కష్టాలొచ్చినా చిరునవ్వు తో ఎదుర్కుని కష్టపడే వారికే విజయం అనుకున్నా. ఈ సినిమా చూశాకా తెలిసింది. కష్టం వచ్చినప్పుడు ‘ఈ ఈ ఈ ‘ అని ఇకిలిస్తూ కూర్చుంటే చాలు.. ‘ఈ సీక్రెట్ తెలియక.. ఎన్ని సంవత్సరాలు కష్టపడి పని చేశాను.. ప్చ్ (((( (మన్మధుడు బ్రహ్మి స్టైల్ లో...)

అన్నట్టు గమనించారా? సీతమ్మ ఇంట్లో పెద్దావిడ రోహిణి, మధ్య వయస్కురాలు జయసుధ, థయ్య్య్య్యి మని గెంతుతూ ఉండే అంజలి పనులు చేస్తూ కనిపిస్తారు..కానీ మగవాళ్లు ఒక్క పెళ్లి లో కాస్త బిందెలు మోయడం తప్ప మామూలు గా ఇంటా/బయటా ఏదీ చేస్తున్నట్లు కనపడరు..వంశ వృక్ష.. (కన్నడ)
ప్రముఖ కన్నడ రచయిత S. L. బైరప్ప రచించిన వంశ వృక్ష నవల ఆధారం గా తీసిన సినిమా ఇది. తెలుగు లో కూడా బాపు దర్శకత్వం లో పునర్నిర్మించారు.

ఈ సినిమా చూడాలంటే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. కాస్తచుట్టాలూ, పక్కాలూ రాని సమయం ఎంచుకోవడం, పిల్లా మేకా నిద్రపోతున్నప్పుడు చూస్తే మరీ బెటర్.

‘భగవద్గీత చదువుకోమ్మా! మానసిక శాంతి కలుగుతుంది’ అని మామగారు కోడలి తో చెప్పడం తో కథ మొదలవుతుంది. ‘నాకు ఎందుకో చదివినా ప్రశాంతత రావడం లేదు మామగారూ..’ అని సమాధానమిస్తుంది కోడలు.

అదొక శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబం. పెద్దాయన కొడుకు మరణించాడు. కోడలు కాత్యాయిని భర్త పోయిన దుఃఖం లో ఉంది. చిన్న పిల్లవాడిని చూసుకుంటూ, గీత, ఉపనిషత్తులలో మానసిక శాంతి ని వెతుక్కుని భంగపడి కిటికీ లోంచి తన వయసు అమ్మాయిలు నవ్వుతూ,తృళ్ళుతూ కాలేజ్ కి వెళ్లటం చూస్తూ నైరాశ్యం తో మగ్గుతూ అత్తగారింట్లో ఉంటుంది. పసి పిల్లవాడిని చూసుకోవడానికి ఇంట్లో మనిషి ఒకావిడ సహాయం ఉంటుంది. వంటగది లోకి వెళ్లాలంటే సువాసిని కాబట్టి (పూర్వ కాలం బ్రాహ్మణ కుటుంబాల్లో భర్త పోయిన స్త్రీ జుట్టు తీయించుకుంటే కానీ వంట కి,మడి కి పనికి రాదనే రూల్ ఉండేది) ఆచారం అడ్డు. అత్తగారికి గుండు చేయించి కోడలిని వంటగది లోకి సహాయం చేయడానికి తెప్పించాలని ఉంటుంది. మామగారు ఒప్పుకోరు. ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా అలాంటి పని చేయకూడని భార్యకి గట్టి గా చెప్తాడు. కోడలిని ఆదరాభిమానాలతో, ఆప్యాయతతో చూస్తూ ఉంటాడు.

మామగారి కుటుంబం మంచిదే.. కాకపోతే పాతకాలం పద్ధతులు.. మనవడు తన వంశానికి,సంస్కృతీసాంప్రదాయాలకి వారసుడవ్వాలని కలలు కంటూ, అన్నీ దగ్గరుండి నేర్పిస్తూ ఉంటాడు. మామగారి దగ్గరకి వెళ్లి తనకి చదువుకోవాలనుందని చెప్తుంది. ‘నీలాంటి స్త్రీలకి అది మంచిది కాదు.’ అన్నప్పుడు ‘నా లాంటి స్త్రీయా? ‘ అని బాధ పడుతుంది. భర్తకి BA పూర్తి చేయాలని ఆశయం నెరవేరకుండానే చనిపోయారు కాబట్టి తాను ఆ ఆశయం నెరవేర్చడానికి చదవ దలచుకున్నట్టు, అదీకాక ఇంట్లో తనకు సరైన పని లేక బోర్ గా ఉన్నట్టు చెప్పుకుంటుంది. తన కొడుకు ఆశయం పూర్తి చేయాల్సిన ధర్మం మనవడిది కానీ కోడలిగా నీకు ఆ అవసరం లేదని చెప్పి పంపించినా, కోడలి కోరిక ని మన్నించి, భార్య కి ఇష్టం లేకపోయినా 12 km దూరం ఉన్న విశ్వవిద్యాలయానికి రైల్లో ఇంకో అమ్మాయితో కలిసి రోజూ వెళ్లి వచ్చేట్టు, అలాగే తన స్నేహితుడు ప్రొఫెసర్ గారికి చెప్పి సీటు వచ్చేట్టు అన్నీ అమర్చుతాడు.

‘చదువు కోసం పంపుతున్నాను.. కానీ కుటుంబ గౌరవానికి మచ్చ తెచ్చే పని చేయవద్దని సుద్దులు చెప్పి మరీ కోడలిని ఆదరం గా రైలెక్కిస్తాడు. కాత్యాయిని జీవితం లో మళ్లీ నెమ్మది గా వెలుగొస్తుంది. ఇంట్లో కొడుకుతోనూ, కాలేజీ లో పాఠాలూ, ప్రొఫెసర్ గారింట్లో మధ్యాహ్న భోజనం.. రైల్లో తన వయసు ఆడ వారితో స్నేహం ఆమె ముఖం లో మళ్లీ చిరునవ్వు తెప్పిస్తాయి. ప్రొఫెసర్ గారి తమ్ముడు, ఫారెన్ లో చదువుకుని వచ్చిన ఆంగ్ల లెక్చరర్ గిరీష్ కన్నాడ్ తో పరిచయం, స్నేహం గా, తర్వాత ప్రేమ గా మారుతుంది.

కాత్యాయిని అటు మామగారికిచ్సిన మాట, ఇటు తన జీవితం లో మంచి భవిష్యత్తు ఇస్తానంటున్న గిరీష్ మధ్య ఎటూ తేల్చుకోలేక తీవ్ర సంఘర్షణ కి లోనవుతుంది. మొత్తానికి భవిష్యత్తు పట్ల గల మోహం,ఆశ గెలుస్తాయి. మామగారు పెళ్లికి అంగీకరించి ఆమెని పంపేసినా, కోడలికి తన మనవడిని ఇవ్వటానికి మాత్రం ఒప్పుకోడు. ‘నీ కొత్త సంసారం లో నీకు సంతానం కలిగే అవకాశాలున్నాయి. నాకు వేరొక కొడుకు కలగడు.. అలాగే నా వంశంవృక్షం ఇక్కడే ఆగిపోతుంది. ముసలి వాళ్లం.. మా దుఖం చూసైనా వాడిని తనకి వదలమని వేడుకుంటాడు.

కాత్యాయిని తల్లి గా తన హక్కులు అతి కష్టం మీద వదులుకుని వెళ్లిపోతుంది. తర్వాత ఆమె జీవితం ఏమైంది? కొడుకుని వదిలి ఆనందం గా ఉండగల్గిందా? మామగారు ఏ వంశం ముందుకి వెళ్లడం కోసం తల్లీ-బిడ్డలని వేరు చేసాడో, ఆ వంశం లో ఉన్న రహస్యం ఏంటి? అది తెలుసుకున్న మామగారి మానసిక స్థితి ఏంటి? కాత్యాయని పెద్దవాడయిన తన కొడుకుని చూసి పలకరించడానికి వెళ్లినప్పుడు చూపించిన చీత్కారం తో ఏమవుతుంది? ఇదంతా చూసి తీరాల్సిందే. సంభాషణలు అన్నీ ఆణిముత్యాలే. ఆ ఆర్టిస్టుల పేర్లు తర్వాత వికీ లో చూసి ఆశ్చర్య పోయాను. నాకు మరి పాత్రలే కనిపించారు. ఈ మెయిన్ కథ కాకుండా, ప్రొఫెసర్-ఆయన phD విద్యార్థిని కథ, (తమ రిసర్చ్ కోసం జీవితం లో మిగిలినవన్నీ పోగొట్టుకున్న విధానం), అలాగే మామగారు-అత్తగారు-పనిమనిషి మధ్య కథ..

కథంటే అది,..పాత్రలంటే అవి. స్లో నలుపు-తెలుపు చిత్రం, పైగా తెలిసిన కథ ఉన్న సినిమా, సరిగ్గా భాషా రాదు. అలాంటి సినిమా చూస్తూ అంత ఉత్కంఠత నేనెప్పుడూ అనుభవించి ఎరగను.కుదిరితే మీరూ చూసేయండి.. యూట్యూబ్ లో ఉంది.

31 comments:

శ్రీనివాస్ పప్పు said...

అనిల్ కపూర్ మొదటి సినిమా అండీ ఇది.చాలా బావుంటుంది కానీ జనాలకి ఎక్కదు,స్లో మోషన్ కదా.

"క్షోత్రియ బ్రాహ్మణ కుటుంబం"

శ్రోత్రియ అంటారేమో కదండీ? కాదా?

శ్రీనివాస్ పప్పు said...

సీతమ్మ వాకిలి గురించి చాలా బాగా రాసారు కృష్ణప్రియగారూ మీ స్టైల్లోనే

కృష్ణప్రియ said...

oops.. corrected.

Reminds me.. మా కజిన్ ఒకమ్మాయి వేరే రాష్ట్రం లో పుట్టి పెరిగింది. అమ్మమ్మ నా జుట్టు తో సవరం చేయించుకుంది అందామనుకుని .. కొంచెం భారం గా ఉంటుందని.. క్షవరం అనేసింది.

Mauli said...

సంక్రాంతి సంబరాల పుణ్యమా అని, థియేటర్ లో చూద్దామని అనుకొన్నా కుదరలేదు.

ఇద్దరు అన్నదమ్ములు మధ్య ఉండే సంబంధాలు, ఇంకా అబ్బాయిల మనస్సు మాత్రం ఉన్నది ఉన్నట్లుగా చూపించేసాడు కాబట్టి ఇది అబ్బాయిలకు నచ్చే సిన్మా అని నాకు తెలిసిన వారు సెల్ఫోన్ బద్దలుకొట్టి మరీ చెప్పారు. పాపం మగవాళ్ళ మనోభావాలకు గుర్తింపు తెచ్చిన గొప్ప సినిమా ఇది అని అర్ధం అయ్యాక , ఇంకా మనం ఈ చిత్ర రాజాన్ని విమర్శించ వచ్చునా :)

రమణారెడ్డి said...

నాది అదే అభిప్రాయమే నండి.పేరు చూసి ఆ సినిమా కెల్లి అడ్డంగా దొరికి పోయాను.

తృష్ణ said...

మొదటి చెట్టు గురించి చెప్పిన పాయింట్లు బాగున్నాయి..:)
రెండవ చెట్టు సినిమా కథను శ్రీరమణ గారు నవలోకరించారు. ఆ పుస్తకం గురించి ఇదివరలో రాసాను.. చూడకపోయి ఉంటే వీలైనప్పుడు చూడండి..
http://trishnaventa.blogspot.in/2012/01/blog-post_25.html

Anonymous said...

హమ్మయ్య!!!!
సీతమ్మ గురించి నాకు ఇదే ఫీలింగు. అసలిది ౪౦ కోట్లు ఎలా కలెక్ట్ చేసిందబ్బా అని ఒకటే ఇదయి పొయ్యా. కృష్ణప్రియ గారూ!!!! ఇప్పుడు అర్థమయ్యిందండి. వంతులవారిగా అన్ని వయసుల వారు సినిమా చూసి తమ వంతు కర్తవ్యం తాము పోషించారన్నమాట.

ఈ లెక్కన మిథునం లాంటి మంచి సినిమా కోట్లు కలెక్ట్ చెయ్యకపోవడమ్లో వింతేమి లేదు.

సీతమ్మలో కాసేపు కళ్ళార్పకుండా చూడదగ్గ అంశాలు అంటే రెండే. అంజలి అంజలి.మిగిలినవన్ని చిరాకు తెప్పించడంలో పోటీ పడ్డారు. పన్లో పని గా కొన్ని నిజాలు కూడా చెప్పేస్తాను...అసలు మహేష్ ని..... జనాలు మరీ మోసేస్తున్నారు.. మరీ ఒవర్ చేస్తున్నారు జనాలు అనిపించట్లేదా? ఎంటో!!! వచ్చే ఏడు ఇతగాడికో పద్మభూషణో, భరతభూషణో వచ్చిన ఆశ్చర్యం అనిపించట్లా!!!!.

అంతకు మునుపే ఎవయినా సంఘాలు వీళ్ళకి " జీవన సాఫల్య పురస్కారం" ఇచ్చేసి ఇంట్లో కూర్చోబెట్టి మనల్ని బతికిస్తే బాగుంటుంది.

గీతిక బి said...

నేను నిజ్జంఘా చెట్లు ఎక్కారేమో అనుకున్నానండి..

పోస్టు చాలా బాగా వ్రాశారు.

జ్యోతిర్మయి said...

అంత గొప్ప పేరు పెట్టి ఈ సినిమా కథలేకుండా ఎలా తీశారా అని బోల్డు కుతూహలంగా ఉంది.

వంశవృక్షం తెలుగు సినిమా దొరికితే బావుణ్ణు.

రెండు చెట్ల పోలిక బావుంది.

Anonymous said...

అయితే కోతికొమ్మచ్చి ఆడారన్న మాట.

తెలుగమ్మాయి said...

రెండు మంచి సినిమాల గురించి బాగాచెప్పారు.

Anonymous said...

రెండు వృక్షాలన్నారు బావుంది.కథంటే ఎలా ఉండాలో చెప్పడానికి వంశవృక్షం ఎత్తారు.. కానీ అసలు కథలాటి పదార్ధమే లేనటువంటి ఆ మొదటి సినిమా గురించి అంత టైమెందుకు వేస్టు చేసినట్టూ? మామూలుగా ఉండేటట్టే మీ రివ్యూ బాగాఉంది.

Though late....

ప్రేరణ... said...

నాకు నచ్చిన రెండు చిత్రాలపై సమీక్ష బాగుందండి.

Anonymous said...

మీరెక్కింది ఒకటే చెట్టు - దాని పేరు మునగ చెట్టు.

లేకపోతే ఏమిటండీ? తెలుగు సినిమా చూడ్డమూ, దానికో అర్ధం వెదకడమూనా? అంతకంటే ఏ పాత చందమామో చదూకోడం మేలు కాదూ? ఆఖరికి ఇతియోపియా నుంచి వచ్చిన మూగ సినిమాకైనా అర్ధం పర్ధం ఉంటుంది కానీ తెలుగు సినిమాకి ఎక్కడైనా ఉంటుందా? చోద్యం కాకపోతే? మీకు ఇప్పటికైనా బుద్ధి రాకపోతే (పాపము శమించుగాక), తప్పు మీదే డబ్బులు పెట్టి మరీ తలనెప్పి కొనుక్కున్నందుకు. కాదు మరీ? అనుభవించండి. చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత మహదేవా.

Krishna Palakollu said...

నాకు బాగా నచిన విషయం ఏంటంటే మా మూడేళ్ళ బుడుగుని SVSC సిన్మా కి తీసుకువెళ్తే అస్సలు ఏడవకుండా, పాటలు వచినప్పుడు నవ్వుతు ప్రశాంతం గా సిన్మా చూడనిచ్చాడు :-) కొంత సేపు బోర్ అనిపించిన మాట వాస్తవం.

కొత్త వ్యూ పాయింట్ మీ పోస్ట్ ..ఎప్పట్లాగానే చదివిన్చేసింది.

Unknown said...

బాగుందండి సిరిమల్లె చెట్టు గురించి ఇంకా బాగుంది.వంశవృక్షం ఎప్పుడో టివీ లొ వెస్తే చుసాను.అనిల్ కపూర్,సంధ్య ..బాగుంటుంది సినిమా

వేణూశ్రీకాంత్ said...

హహహహ SVSC అంత హిట్టెందుకయిందా అని తెగ ఆలోచిస్తున్నానండీ మొత్తానికి మీరు భలే వివరించారు :-))

స్ఫురిత said...

ఈ మధ్య వరసగా మీ అమ్మాయి ప్రోజెక్ట్లతో మీ కష్టాలు రాస్తున్నారు కదా...దేవుడా చెట్లు కూడా ఎక్కాలా వీళ్ళ ప్రోజెక్త్ళకోసమ్ అనుకుంటూ మొదలెట్టా చదవడం...:)))

మీరెక్కిన చెట్ల గురించయితే...వంశవృక్షం నాకు నచ్చిన సినిమాల్లో వొకటి...సీతమ్మ చెట్టు...పాపం అందరూ నిండుగా బట్టలేసుకున్నారన్న సంతోషం లో మీ అంత లోతుగా ఆలోచించకుండా చూసేసానా అనిపిస్తోంది మీ టపా చూసాకా...:)

Anonymous said...

అజ్ఞాతల కామెంట్స్ బాగున్నాయి. మొదటి చెట్టు గురించి రివ్యూ బాగుంది. అద్రుష్టవశాత్తు ఇంకా ఆ చెట్టు ఎక్కలేదు, ఎక్కే ఆలోచన కూడా లేదు.
-SJ

Zilebi said...

ఇదిగో నండీ మేడం గారు,

పోతే పోనీ అని అట్లా 'అచ్ఛ తెనుగు' అరవై అణా ల పేరు పెట్టి సినిమా తీస్తే ఇట్లా లొసుగులు చెబ్తా రేమిటి ?
(అబ్బా, ఈ సాఫ్ట్వేర్ వాళ్లకి ఫంక్షనల్ స్పెక్ కి తడి పెడు గంపంత రివ్యూ కామెంట్లు పెట్టక పోతే నిద్ర పట్టదు సుమీ!)

ఎక్కువగా రివ్యు కామెంట్లు చెప్పే రంటే, మళ్ళీ 'కృష్ణ వాకిట్లో కరేపాకు చెట్టు' అని మరో చిత్ర రాజం తీసి జనాల మీద వదిలేస్తాం ! ఆ పై మీ ఇష్టం ! ఖబడ్దార్ !

వంశ వృక్షం తెలుగులో లింకు ఉంటే ఇవ్వండి !చీర్స్
జిలేబి.

Found In Folsom said...

హహహ... మొదటి సినిమా..మీ రివ్యూ సూపర్. 90% జనాలకి నచ్చలేదు సినిమా....కానీ ఫైటింగ్ లు లేకుండా ఉండే సరికి నాకు నచ్చింది. మీరు అన్నట్లు, ఆ పెద్దోడు యాయ్ అంటం, ఆ చిన్నొడు ఆడపిల్లలని మాట మాట కి తిట్టటం తిక్క రేగింది. రెండో సినిమా నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసిన గుర్తు..మీ లానే మంచి ఉత్ఖంటతో చూసినట్లు గుర్తు.

Sujata said...

వంశ వృక్షం - చాలా మంచి తెలుగు సినిమా. అనిల్ కపూర్ జీవితం మొత్తానికి మంచి సినిమా. ఆ డెలివరీ సీన్లూ, పిల్లలు చనిపోతుంటే, ఆ అమ్మాయి పడే అంతఃసంఘర్షణా అన్నీ చాలా 'నిజం' గా తీసారు. ఆ హీరోయిన్ ఎవరో గానీ చేతులెత్తి దణ్ణం పెట్టాలి. ఇపుడు మళ్ళీ గుర్తు చేసారు.

btw మీరెక్కిన మొదటి చెట్టు ఇగ్నోర్ ఇగ్నోర్.

చాతకం said...

LOL ;). మొదటి సినిమా పేరు 'బేవార్స్ బ్రదర్స్ ' లేదా 'ఏయ్' అని పెట్టాల్సినది.

Chinni said...

వంశవృక్షం నేను చాలా రోజులనుంచి వెతుకుతున్నాను youtube లో, good reviews:)మొదటిచెట్టు గురించి అంటే..అసలు ఆ సినిమాని ఏ ధ్యేయంతో తీశారో అర్థమవట్లేదు..నేను మీ టపా శీర్షిక చూసి మళ్లీ ప్రాజెక్టుపని కోసం ఈసారి ఆకులు,పూలు కోసారేమో అనుకున్నా

Anonymous said...

mee post Andhrajyothy lo vachchindi. its very nice nd funny too. Especially cartoons.

కృష్ణప్రియ said...

@అజ్ఞాత,

థాంక్స్. ఇప్పుడే నా చేతిలోకీ ఆదివారం పేపర్ వచ్చింది. మా స్నేహితులూ, చుట్టాలూ అసలు సగం పేపర్లు నిన్న కొనేసి నట్లున్నారు. :) అన్నట్టు బొమ్మ వేసింది ఆంధ్రజ్యోతి వారి కార్టూనిస్ట్ సినిశెట్టి గారు. నాకూ భలే నచ్చింది.

లింక్ :

http://www.andhrajyothy.com/sundaypageshow.asp?qry=2013/feb/17/sunday/blagotam&more=2013/feb/17/sunday/sundaymain


కృష్ణప్రియ said...

శ్రీనివాస్ గారు,
థాంక్స్..
మౌళి,
నేను మాత్రం ఎక్కడ విమర్శించాను? అందరికీ నచ్చి తీరుతుందని చెప్పాను. ప్రతి కేవలం అబ్బాయిలకే కాదు, అమ్మాయిలకి, నడి వయస్కులకి, పెద్దవారికి కూడా ఎందుకు నచ్చుతుందో, సవిస్తరం గా వివరిస్తేనూ... 
రమణారెడ్డి గారు,
మరే...అడ్డంగా దొరికి పోవడమంటే ఇదే.
అజ్ఞాత,
సీతమ్మ అన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే.. ‘ఓటమెరుగని దిల్ రాజు’, పెద్ద పెద్ద తారలు, అశ్లీలత కి తావివ్వకపోవడం, చక్కటి పల్లెటూరి వాతావరణం, తెలుగుదనం ఉట్టి పడటం, బెమ్మాండమైన టైటిల్, చాలా కాలానికి చీరలు కట్టిన హీరోయిన్.. అని నా అభిప్రాయం.
తృష్ణ గారు,
తెలుగు లో వంశ వృక్షం చూడటం నాకు పడలేదు. చూడాలి ఎలా అయినా. కన్నడ లో మాతృక చూశాకా ఎలా తెలుగీకరించారో చూడాలని నాకూ చాలా ఆసక్తి గా ఉంది.

కృష్ణప్రియ said...

అజ్ఞాత @ feb 18, 2013 at 3:17PM
కదా.. ప్రేక్షకులని పిచ్చివాళ్లని చేయడం అంటే ఇదేనేమో :)
గీతిక గారు,
:)) చెట్టు ఎక్కి పడ్డ బాబతే కదండీ దాదాపు గా..
జ్యోతిర్మయి గారు,
తప్పక చూడండి ఈ సినిమా. చాలా బాగుంటుంది. (స్వగతం: ఏం? మేమొక్కరమే కష్టపడితే మీరంతా హాయిగా ఎస్కేప్ అవుతారా? హన్నా..)
bonagiri గారు,
LOL.. అదే అదే.. కోతికొమ్మచ్చి..
ఫణిబాబు గారు,
థాంక్స్...
అంటే నా టైమూ వేస్ట్ అయిందన్న బాధ తో, ఎలాగూ వేస్ట్ అయింది కదా అని ఇంకాస్త టైం వేస్ట్ చేశానన్నమాట. :)
ప్రేరణ గారు,
ధన్యవాదాలు. మొదటి సారి నా బ్లాగు లోకి వచ్చినట్లున్నారు.. స్వాగతం.
కృష్ణ గారు,
థాంక్స్..
అవును. మా అబ్బాయి ( మా తోటి కోడలి కొడుకు- ఐదేళ్ల వాడు) కి కూడా తెగ నచ్చింది సినిమా..

కృష్ణప్రియ said...

అజ్ఞాత (Feb 18,2013 6.31pm)
అవునవును. అలాగే ఉన్నట్టుంది పరిస్థితి.
unknown గారు,
:)ధన్యవాదాలు..
స్ఫురిత గారు,
lol. అదే.. మరి.
‘స్వరాభిషేకం’ సినిమా వచ్చినప్పుడు దాని రివ్యూ చదివాను. ఎందులోనో గుర్తులేదు. కేవలం, శాస్త్రీయ సంగీతం, అన్న దమ్ముల సెంటిమెంట్, వంటి నిండా బట్టలున్నంత మాత్రాన మంచి సినిమా అయిపోదు అని. అదే మాట ఇక్కడా వర్తిస్తుంది.
SJ గారు,
థాంక్స్.. అదృష్టవంతులు.. :)

జిలేబీ గారు,
బహుకాల దర్శనం.. లొసుగులేం చెప్పానండీ? ఆంధ్రులని ఓ రేంజ్ లో అలరిస్తుంది ఎందుకో పూస గుచ్చినట్లు వివరిస్తేనూ? ;) సాఫ్ట్ వేర్ బుద్ధి ఉపయోగించే మరి ప్రతి కోణం నుండీ చూసి మరీ అందరికీ ఎందుకు నచ్చుతుందో డాక్యుమెంట్ రాసి పడేస్తేస్నూ..
కృష్ణమ్మ వాకిట్లో కర్వేపాకు చెట్టు.. కాన్సెప్ట్ బాగుంది. ఈసారి అక్కా చెల్లెళ్లు చెగోడీలు, పాలకాయలూ, అరటి పండ్లూ, చెరుకు గడలుతింటూ, తగువులాడుకుంటూ,..సద్దుకుపోతూ, ఊరెంబడ తిరుగుతూ, వెంట బడిన అబ్బాయిలని ‘పిలకెక్కడ రా నీకూ :) ‘ అనుకుంటూ.. ఆహా.. ఎక్కడికో తీసుకెళ్లిపోయారు.. bravo.. zilebi zindabad!
Found In Folsom,
థాంక్స్ :)) కరెక్ట్ గా చెప్పారు.

సుజాత గారు,
తెలుగు సినిమా చూడాలండీ. ఈసారి టీవీ లో వస్తే సెలవ పెట్టి మరీ చూస్తా..
చాతకం గారు,
సూపర్.. కరెక్ట్ టైటిల్.
చిన్ని గారు,
థాంక్స్. ప్రాజెక్ట్ కోసం.. ఇంకా అంత వరకూ వెళ్లలేదు లెండి. నా అదృష్టం..

Mauli said...

అయితే మనోభావాలెవరివీ దెబ్బతినలేదా?????? కనీసం ఒక్కరివి కూడా? మహిళలకు ఎందుకు నచ్చుద్దో మీరు చెప్పిన కారణం మాత్రం కేక. అన్నదమ్ములపి సానుభూతి తో ఈ యాంగిల్ మిస్సయ్యాం, ఏ సీన్ లో చీర మరీ బాగుందో చెబితే ఇంకోసారి చూస్తా :)సినిమాలపై, ఊరికినే మనోభావాలు అరగదీసుకునే వారంతా.. ఈ సిన్మా చూసిన చూసిన అన్ననో , తమ్ముడు నో చూసి బోలెడు నేర్చుకోవాలి ;-)

Mauli said...

మంచి ప్రింట్ వచ్చాక ఈ వారంలో ఇంకొక సారి చూసాను సీతమ్మ చెట్టు. సిన్మా బావుంది. ప్రతి కారెక్టర్ మనకి తెలిసిన మామూలు వ్యక్తులను కళ్ళ ముందుకు తెస్తుంది. మహేష్ బాబు కారెక్టర్ అచ్చు ఈ మధ్య బ్లాగర్ చందు శైలజ గారి కధలో హీరో లా ఉంది. కాకుంటే ఇలాంటి అబ్బాయే కావాలని హీరోయిన్ వెంటపడి మరీ సాధించుకొంటుంది :)

కృష్ణప్రియ గారూ, మగవాళ్ళు ఎవరూ పనీ పాటా చెయ్యని కుటుంబాలు, సినిమా పాత్రలకు అర్హతలేనివి అని మీరన్నట్లు గాఉంది. సగం మంది పురుష జనాభా మనోభావాలు, మనోభావాలు :)

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;