Thursday, October 10, 2013

“కష్టాలంటే ఏంటో తెలియకుండా పెంచాడు మా నాన్న..


ఎందుకంటే.. కష్టాల్లోనే సుఖాలు చూసుకున్నాం మేము. అవి కష్టాలని మాకు తెలియవు.”  ఇది ఏదో, ప్రాస/హర్షద్వానాల కోసం చెప్పిన డైలాగో, కాదు.

 “బాగా కష్టాల్లోంచి పైకొచ్చిన మనిషి. కింద స్థాయి నుండి తన కృషి తో ఎదిగిన మనిషి, గంజి నీళ్ల నుంచీ, బెంజి కారు స్థాయి కి ఎదిగిన మనిషి.. “ అని పరిచయం ఇచ్చిన ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి తో మన (రియల్ స్టార్?) శ్రీహరి అన్న మాటలివి.


 అతని పేరు చెప్పగానే మొదట గా ప్రతి వారూ చెప్పేవే ఇవి.  శ్రీహరి అంటే నాకు మొదటి నుండీ చాలా అభిమానం. అదేదో సినిమాలో రంభ కి కాబోయే భర్త గా నటించినప్పుడు మొదటి సారి గా చూశాను. ముఖం లో క్రూరత్వం+ అమాయకత్వం కలిసి ఉంటాయి అందులో. చిరంజీవి అతన్ని మూర్ఖుడిని చేసి జనాల్ని నవ్విస్తూ ఉంటాడు. తర్వాత తర్వాత చాలా సినిమాల్లో అతన్ని గుర్తు పట్టడమూ మొదలు పెట్టాను.

తర్వాత శ్రీహరి అభిమాని గా నెమ్మది గా మారిపోయాను..


అలా మొదలైంది...

ఓసారి ఏదో పత్రిక లో అతనిది బాలా నగర్/బోయనపల్లి అని చూశాను. అర్రే... మా ఊరి హీరో.. అనుకుని కుతూహలం గా బాలా నగర్ లో నా కాంటాక్ట్స్ ని అడిగాను. ‘అదేనోయ్..మన శోభన థియేటర్ ఎదురుగా ఉన్న పాత చెక్క మెకానికల్ షెడ్... ఉండేది చూడు.. అక్కడుండేటోడు..కదా.?’ అంది మా ఫ్రెండు. నాకు అస్సలూ గుర్తు రాలేదు కానీ..  మరి అవతల పక్క వాడు  రియల్ స్టార్ కదా.. అందుకని గుర్తొచ్చినట్లు అర్జెంట్ గా బల్బ్ వెలిగినట్లు నటించాను. ఇప్పటిదాకా అదే ఇమేజ్ మెయిన్టైన్  చేస్తున్నా...

పిచ్చి ముదిరి పీక్ స్టేజ్ కి ...

అయితే గత పదిహేనేళ్లుగా అందరూ నన్ను శ్రీహరి వీరాభిమాని గా గుర్తిస్తున్నారు. కుటుంబ సభ్యులు, సాటి సాఫ్ట్వేర్ కూలీలు, స్నేహితులూ, చుట్టుపక్కల మదర్స్, సిస్టర్స్.. (అమ్మలక్కలు), అందరున్నూ.. ఎప్పుడైనా ఏ సినిమాలోనైనా, శ్రీహరి పేరు టైటిల్స్ లో చూసినా, అలాగే ముఖం తెరమీదో/పేపర్ లోనో కనపడినా, ఆయన పేరు వినబడినా.. అదేదో చంద్రముఖి లో జ్యోతిక ముఖం వెలిగిపోయినట్లు నాకు ఏ పూనకం వచ్చి మళ్లీ మొదలు పెడతానేమోనని, అందరూ ‘అవును.. మాకు తెలుసు బాబోయ్.. మీ బోయన పల్లి హీరో.. మీ ఇంటిదగ్గర ఆయన మెకానికల్ షెడ్డూ, నీ డొక్కు లూనా అక్కడే నీకు రిపెయిర్ చేసి పెట్టాడు శ్రీహరో, వాళ్ల అన్నో నీకు సరిగ్గా గుర్తులేదు...” అని దణ్ణం పెట్టే స్థాయిదాకా అంచెలంచలు గా ప్చ్ .. ఏంటో అలా పెరిగిపోయింది.

ఇంకా అతి చేయచ్చు గానీ..

నేను స్కూల్ కి బస్సు లో వెళ్తుంటే పక్కన డబ్బుల్లేక సైకిల్ మీద వెళ్తూ కన్పించేవాడు.. అలాంటివి, అయితే మరీ నాకూ ఓ యాభై ఏళ్లు అని జనాలు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది కదా అని.. కొద్దిగా కంట్రోల్ అనుకోండి..

సైట్ ఇన్స్పెక్షన్ చేసి డిటైల్స్ జాగ్రత్త గా దాచుకున్నా..

ఎవరు ఎప్పుడు ఎక్కడ రియల్ స్టార్ శ్రీహరి మాటెత్తినా.. మా బోయనపల్లి వాడే.. ఆయన షెడ్ మేము ఎప్పుడూ సినిమాలు చూసే థియేటర్ ఎదురుగానే... ఉండేది.. (అబద్ధం.. మేము ఎప్పుడూ శోభనా లో సినిమా చూస్తే కదా? ఓసారి అప్పట్లో ఇండియా వెళ్లినప్పుడు ఆ థియేటర్ దగ్గరకెళ్లి ఎదురుగా పరిసరాలు నోట్ చేసుకున్నాను. ఎవరైనా అడిగినప్పుడు ఆథెంటిగ్గా నా కథ ఉంటుందని..)

వ్యక్తిగత అభిమానం Vs. ఒక ప్రాంతం, సామాజిక వర్గానికి చెందామని లేదా ఫలానాయన కొడుకు/మనవడు అని ఉండే అభిమానం..

నాకెప్పుడూ, ఇలాంటి బేసిస్ మీద ఉండే అభిమానం అంటే ఒక చిన్న చూపు..  కానీ నాకూ అలాంటి అభిమానం ఉంది అని నేను గ్రహించనే లేదు.. నిజానికి, నా సామాజిక వర్గం నుంచి వచ్చిన వారందరంటే నాకు గోప్ప అభిప్రాయం ఉందా? ఏమో? సహజం గా వాళ్లంటే ఒక చిన్న సానుభూతి, వాళ్లల్లో ఏమాత్రం విషయం ఉన్నా, గొప్పగా అనిపిస్తుందేమో.. తెలియదు. 

అలాగే అట్టడుగు స్థాయి నుంచి, గాడ్ ఫాదర్ లేకుండా కష్టపడి పైకి వచ్చాడు అందువల్ల అభిమానం?  మరి రాచరిక కుటుంబం నుండి వచ్చాడనే ప్రభాస్ అంటే ఇష్టపడుతున్నామా? 

అయితే అసలంటూ విషయం ఉంటేనే పైన చెప్పిన కారణాల వల్ల కొద్దిగా, బ్రౌనీ పాయింట్లు మనకే తెలియకుండా కలుస్తాయేమో...

వ్యక్తిగతం?

అక్షర ఫౌండేషన్ గురించి తెలుసు, శాంతి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తెలుసు, బంజారా హిల్స్ లో ఇటు శ్రీహరి, అటు శాంతి అని నేం ప్లేట్ ఉన్న ఒక పెద్ద భవనం అతనిదని తెలుసు..  అలాగే జిమ్నాస్టిక్స్ లో జాతీయ స్థాయి క్రీడాకారుడని కూడా తెలుసు.  అయితే అంతకు మించి ఎప్పుడూ తెలుసుకునేంత ఆసక్తి నాకు లేకపోయింది. నిన్న రాత్రి మాత్రం ఒక పాత ఇంటర్వ్యూ చూసి చాలా విషయాలు తెలుసుకున్నాను. 

నాకెందుకో అతను చాలా నిజాయితీ గా సమాధానాలిచ్చాడని అనిపించింది. నాదంటూ ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి, స్క్రీన్ మీద నేను కనిపించినప్పుడు మిగిలిన వారి మధ్యలో నన్ను జనాలు చూడాలి అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని కండలూ అవీ పెంచి..  బ్రూస్లీ సినిమాల్లో అతని టెక్నిక్ ని గమనించి.. జిమ్నాస్టిక్స్ లో చెరి ఆరు సార్లు జాతీయ స్థాయి లో ఆడానని, సియోల్ ఒలింపిక్స్ లో కూడా సెలక్షన్ క్యాంప్ లో వెళ్లి వెనక్కి వచ్చినట్లు గా చెప్పాడు.

నాకు అతని మాట తీరు లో నచ్చినదేమిటంటే,.. అంతులేని నిజాయితీ ఒకటి,  కలిమి, లేమి, గెలుపు, ఓటమి, అతని మిత్రులు, బంధువులు, చిన్నప్పటి లేమి, పెట్టుకున్న కొట్లాటలు, శోభనా థియేటర్  లో పాలు పోసినప్పుడు అతను చేసిన కిరికిరీలు, సెటిల్మెంట్లు, ఒక ఎత్తైతే

శాంతి తో అతని పెళ్లి ఎలా జరిగిందో, అలాగే తన కూతురు అక్షర ఆకస్మిక మరణం,  పదేళ్ల పాటు సినీ రంగం లో నిలదొక్కుకున్నప్పుడు పడ్డ కష్టం, రాజకీయాల్లో తనకి వచ్చిన అవకాశం అన్నీ ఒకే టోన్ లో ‘as the matter of fact’ చెప్పడం.

అలాగే తన పిల్లలకి బంగారు గ్లాసు, కంచం చేయించి ఒక పూటంతా వాటినే చూస్తూండి పోయానని born with golden spoon అంటే ఇదే నేమో అని చెప్పాడు. అలాగే తాను రబ్బర్ చెప్పులు, లుంగీ కట్టుకుని, తన కొడుకుని బెంజి కారు లో తిప్పడాన్ని గురించి కూడా.

మీ ఆవిడ రోజుకి వంద సార్లు మీకు ఫోన్ చేసి కనుక్కుంటుందట. బాగా అనుమానమట? అని అడిగితే ‘లేదు. అతిప్రేమ వల్ల వచ్చిన అనుమానమది. అయినా ఇప్పుడు బాగా తగ్గింది..’ అన్నాడాయన, చాలా మామూలు గా.

అన్నిటికన్నా.. పాత్రలు, రోల్స్, ప్రాజెక్ట్స్ కాకుండా వేషాలు.. అన్న పదం వాడటం కూడా భలే అనిపించింది.  

‘నన్ను తండ్రిని చేయటానికి చాలా మంది ప్రయతించారు. నేను ఒప్పుకోలేదు. బ్రదర్ దాకా ఓకే’ అన్నాను. అప్పుడే అమితాబ్ బచ్చన్ అవదలచుకోలేదు. చాలా టైం ఉంది.. అన్నాడు.

షేర్ ఖాన్ ముందు?

భద్రాచలం, శ్రీశైలం, హనుమంతు, అయోధ్య రామయ్య, పృథ్వీనారాయణ, ఎవడ్రా రౌడీ.. విజయ రామ రాజు ల్లాంటివి సినిమాలు ఆవరేజ్ గా అనిపించినా, నాకు హీరో అతని,నటన, టైమింగ్, ఈజ్ మాత్రం తెగ నచ్చేశాయి. నాలాంటి వాళ్లు కోకొల్లలని,నిన్నటి నుండీ, ఫేస్ బుక్ లో వివిధ గ్రూపుల్లో వ్యాఖ్యలు చూస్తుంటే అర్థమవుతోంది.

చాలా మంది నా శ్రీహరి అభిమానం చూసి నవ్వుకున్న వాళ్లు “నువ్వొస్తానంటే నేనొద్దంటానా” లో అన్న గా అతన్ని చూసి, ఒప్పేసుకున్నారు.  ఇక   ఢీ సినిమా లో  “ఏమిస్తున్నర్రా వీనికి?” అని వెనక్కి తిరిగి చూసి అడిగే డాన్ పాత్ర చూసి, ‘కేవలం దీనికి ఇష్టం కాబట్టి.. మనం వ్యతిరేకిద్దాం అనుకునే నా ప్రత్యర్థి రంగాల వారూ, ఇతని లో విషయం ఉందని “రూఢి” చేసేసుకున్నారు.

ఇక కింగ్ లో.. బొమ్మలు వేయడం, బొట్టుశీను తో సెటిల్మెంట్లు, హార్డ్ వేర్ బిజినెస్ మాన్ అవతారమెత్తటం, రజనీ కాంతు లా, గంభీరం గా “సిగ్మండ్ ఫ్రాయిడ్ బుక్కు కి తెలుగు నకళ్ళుచదివిన.. “ అని చెప్పడం.. కళా వైద్యం చేయడం,.. బామ్మర్ది దావత్ ఇవ్వడం,  ఇంట్లో పెద్ద ముత్తైదువలు “పప్పన్నం పెట్టి ఊర్కోనుడు గాదు.. మాకు పట్టు శీరలు పెట్టాలే’ అంటే, “శీరలు పెట్టమంటరు ఒక్కరైన పది సంవత్సరాలనుండి నాకు ఒక్క శీర ని చూసినారే??’అని నిష్టూరాలాడటం,..ఎంగేజ్మెంట్ దినం చేసే వాళ్ల వంశం చేసే సంప్రదాయాలు, అతని భాష,..  ఒక్కటని కాదు..  విశ్వరూపం చూపించాడు అనిపించింది.   అన్న, అమాయకపు డాన్, పాత్రలకి ‘కింగ్’ అని కితాబు ఇక అందరికీ ఇవ్వక తప్పింది కాదు.

ఇక షేర్ ఖాన్ గా అతను ప్రదర్సించిన నటన, నాకే మాత్రం ఆశ్చర్యం కలిగించనే లేదు.. కానీ ఇంకాస్త నిడివి ఉంటే బాగుండు అని నిరాశ గా మాత్రం అనిపించింది. శ్రీకాకుళం బెస్తవానిగా, నాలుగు వందల ఏళ్ల క్రితం రాజు గా రెండు పాత్రల్లో మెప్పించినా నాకేమాత్రం ఆన లేదు L

ఇంకా ఈ జీవిత నాటక రంగం లో ఆయన పాత్ర నిడివి ని భగవంతుడు పెంచి ఉంటే.. సినీ రంగం లో ఎన్ని పాత్రల్లో మనల్ని ఇంకా ఎన్నెన్ని రకాలు గా మెప్పించేవాడో.. ఏమో..

నేనింత ఇమేజ్ క్రియేట్ చేశానా?

నిన్న ఆఫీసులో నాకు ఒక  క్లిష్టమైన ఒక సమస్య ని ఎదుర్కున్న  రోజు. అలాగే కుటుంబ పరం గా కూడా అతి ముఖ్యమైన రోజు.  ఫోన్లు, చాట్ చర్చలు, ఆఫీసులో ఇద్దరు ఇంజనీర్ల మధ్య వివాదాలు పరిష్కరించడం అనే పని పెట్టుకోవడం తో, తల దిమ్మెక్కి పోయినట్లయింది.  ఇంత హడావిడి లో నాకిష్టమైన వ్యక్తులిద్దరితో (కోవర్కర్లు) కలిసి పదిహేను నిమిషాల భోజనం, పది నిమిషాల నడక,. ఇంకో స్నేహితురాలితో కాఫీ, ఇంకోరితో అల్లం టీ, ఇంటికొచ్చాకా ముగ్గురిళ్ళల్లో పేరంటాలు,..

మధ్యలో  చాట్ ద్వారా,ఫోన్ల ద్వారా, మెయిల్స్ ద్వారా, ఫేస్ బుక్ సందేశాల ద్వారా ముఖతః ఎంత మంది శ్రీహరి చనిపోయినందుకు నాకు తమ విచారాన్ని తెలిపారో..  ఈరోజు కూడా నా బ్లాగు తెరిచి ఒక పేజీ అయినా రాయకపోతే.. ఇన్నేళ్లు గా నేను పెంచుకున్న అభిమానానికి అర్థం లేదు. తర్వాత ఇమేజ్ సెర్చ్ చేస్తే.. ఎంత పీలగా ఉన్నాడు ఆగస్ట్ లో? 


ఇదే నా అభిమాన నటునికి నా నివాళి..

26 comments:

వేణూశ్రీకాంత్ said...

చాలా అద్భుతమైన నివాళి కృష్ణప్రియ గారు. వార్త తెలిసిన దగ్గరనుండి తనగొంతులో "మళ్ళీ పుడతావురా భైరవా" అన్నమాటే నా మదిలో మార్మోగుతుంది, అదే తనకి అన్వయించుకుంటున్నాను. నాక్కూడా చాలా ఇష్టమైన నటుడు అతను.

Anonymous said...

కృష్ణగారు,

శ్రీహరి అంటె మీకున్న అభిమానానికి ముచ్చటేసింది. నాకు కూడా శ్రీహరి నటన నచ్చుతుంది. కాని దేవుడు ఆయనికి ఇంకా ఆయుషు ఇచ్చివుంటె బాగుండేది..ప్చ్

Anonymous said...

కృష్ణగారు,

శ్రీహరి అంటె మీకున్న అభిమానానికి ముచ్చటేసింది. నాకు కూడా శ్రీహరి నటన నచ్చుతుంది. కాని దేవుడు ఆయనికి ఇంకా ఆయుషు ఇచ్చివుంటె బాగుండేది..ప్చ్

Krishna Palakollu said...

sad, and ya
he is a very good human being!!!!

ప్రేరణ... said...

చక్కనికూర్పుతో మీ అభిమానాన్ని చాటుకున్నారు.....
but sad think that we all miss him :-(

Anonymous said...

శ్రీహరి , నారాయణమూర్తి వీళ్ళంటే నాకు చాలా అభిమానం . కష్టం అంటే ఏంటో తెలిసిన వాళ్ళు అని .
గత పది సంవత్సరాలాలో నేను ఏ పత్రిక లోనూ శ్రీహరి గురించి నెగటివ్ గా చదవలేదు .
కొంచెం కూడా ఉహించలేదు , ఇప్పుడు శ్రీహరి మీద కోపంగా కూడా ఉంది .జబ్బు తో ఉన్న మనిషి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి , ఎంత రెస్ట్ తీసుకోవాలి . అవేమి తీసుకోలేదని నా ఉద్దేశ్యం .
ఏం చేస్తాం , దేవుడి ఆట అంతే

రాజ్ కుమార్ said...

గొప్ప నివాళీ అండీ. we miss him.. ;(

Unknown said...

Krishna priya garu, i share your feelings about Srihari. btw, ee madhya blog meeda sheetha kannesinattunnaru. raastoo undandi. rayaleni maalantivaallam chaduvukuni aanadinchadaanikainaa - Nagesh from boinpally

Mauli said...

నేనూ మార్గదర్శిలో చేరా అన్నట్లు , కొన్నాళ్ళు బాలానగర్ లో ఉన్నా ... అలా శ్రీహరి ఇంటర్వ్యూ లు చూసి మన బాలానగరా అని అభిమాన్ని కూడా అయిపోయా ... కళ్ళకి కట్టినట్లు వివరించాడు తన బాల్యం , పోరాటం .


మీకు తెల్సా, భద్రాచలం సిన్మా వచ్చినపుడు చాలా మంది పౌరానికమ్ అని గుంపులు గుంపులు గా వెళ్ళారు ఊర్లలో :)

నాక్కూడా మగధీర లో శ్రీహరి ఆనలేదు.

ప్రకాష్ రాజ్ విష్యం లో శ్రీహరి చూపిన బాధ్యతా, ఇష్టం లేకున్నా బృందావనం లో కలిసి నటించడం కదిలించాయి.

సడెన్గా ఆయన మరణవార్త చూసి షాక్. మీ బ్లాగులో నిజంగా ఉండాల్సిన టపా ఇది.

Anonymous said...

మనసు భారమైంది.....మంచి వ్యక్తి ని గురించి....నుంచి మాటలే అన్నారు

సుజాత వేల్పూరి said...

ఎందుకో తెలీదు, అతడు ఎక్కడ మాట్లాడినా నాకూ చాలా నిజాయితీ గా మాట్లాడాడు అనే అనిపించేది. ఒక జెన్యూన్ అభిమానం.

సముద్రంలో పోలిసాఫీసర్ గా.. ఢీలో నవ్వులు పంచీ..ఏంటో తెలీని అభిమానం. నటుడిగానే కాక, వ్యక్తి గా కూడా

జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 లో పెద్దమ్మ టెంపుల్ టర్నింగ్ తర్వాత వచ్చే అతని ఇంటి బాల్కనీల్లో (నా ఆఫీసు కి అదే రూట్లో వెళ్ళాలి లెండి) చాలా సార్లు ఎలాటి ఇమేజ్ కోటింగూ లేకుండా కనిపించేవాడు. ఇంటి ముందు ఏదో ఒక లేటెస్ట్ సినిమా హోర్డింగూ!

నాకు అతని మరణ వార్త విన్నపుడు గుండెలో కలుక్కుమంది! ఆ తర్వాత ఒక టీవీ ఛానెల్ వాళ్ళు డాక్టర్ మాదాల రవికి ఫోన్ చేసి "సిరోసిస్ ఆఫ్ లివర్ తాగితేనే కదా వస్తుంది? రోజూ తాగేవాడా? ఎంత తాగేవాడు? తోటి నటులెవ్వరూ నచ్చ జెప్పలేదా? దాని వల్ల ఇంట్లో గొడవలయ్యేవా? మధ్యలో మానేశాడా, కంటిన్యూగా తాగాడా?" అని అతని శవం కూడా ఇల్లు చేరక ముందే అతని వ్యక్తిగత జీవితాన్ని, అలవాట్లని పబ్లిక్ లో పెట్టి ...తీర్పులిస్తుంటే మాత్రం........ కన్నీళ్ళొచ్చాయి.

నాకెందుకో ఈ వార్త వినగానే చక్కని అతని కుటుంబం కళ్ల ముందో సారి మెదిలి, ఆ పై పోయిన కొడుకుని బతికించమని కాళ్ల మీద పడిన తల్లితో "చావు లేని ఇంటికెళ్ళి కాసిన్ని ఆవాలు పట్టుకురా, నీ కొడుకుని బతికిస్తాను"అని బుద్ధుడు అడుగుతాడే... ఆ కథ గుర్తొచ్చింది.

ఆత్మ శాంతీ అని మాట్లాడలేను కానీ.. చాలా కలత పెట్టిన వార్త ఇది. ఒద్దు ఒద్దనుకుంటూనే అంత్యక్రియలు కూడా చూసి మరో సారి బాధ పడటం లో కొంత శాంతి అనుభవించాను.

కృష్ణప్రియ said...

వేణూ శ్రీకాంత్ గారు,

థాంక్స్.. మా సర్కిల్ లో అందరికన్నా నాకే ఎక్కువ అభిమానం ఉండేది. మొదట్లో ఒక టైప్ సినిమాలు ఇష్టపడే వాళ్లకే ఆయన అంటే అభిమానం ఉంటే.. తర్వాత నువ్వొస్తానంటే వచ్చింది. అందరికీ నచ్చిన నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గృహప్రవేశం చేసేశాడు.

అనాన్ గారు,
:) అవును. నాకు ఆసక్తి గా ఉండేది. ఈ అన్న పాత్రలనుండీ ఆయన సినీ ప్రస్థానం ఎటు వెళ్తుందో చూద్దామని. కానీ ..

కృష్ణ గారు,

అవును. చాలా రేర్ పర్సనాలిటీ..

ప్రేరణ గారు,
ధన్యవాదాలు. శ్రీహరి బూజు పట్టి ఉన్న నా బ్లాగు ద్వారాలు దాదాపు ఎనిమిది నెలల తర్వాత తెరిపించాడు.

కృష్ణప్రియ said...

అనాన్ గారు,

నిజమే. ఎప్పుడూ నేనూ నెగెటివ్ గా చదవలేదు. మంచి వ్యక్తి.

రాజ్ కుమార్,

నాకెందుకో టీవీ లో పదే పదే ఆ వార్త చూడటం ఇష్టం లేకపోయింది. సాధారణం గా కిశోర్ కుమార్ నుండీ, రాజేశ్ ఖన్నా దాకా టీవీ చూసి చూసి.. మనసు కుదుట పడేది. ఈసారి బ్లాగ్ లో రాసుకుని ఎప్పటికీ డాక్యుమెంట్ చేసుకోవాలనిపించింది.

నాగేష్,
మీదీ మా ఊరేనా అయితే? గుడ్.
Do I know you?

కృష్ణప్రియ said...

మౌళి గారు,

థాంక్స్. మీరూ నేనూ ఈ విషయం లో ఒకేరకం గా ఆలోచిస్తున్నట్టున్నాం..

సరే.. ప్రకాశ్ రాజ్, శ్రీహరి? ఇది అర్థం కాలేదు..

అనూ గారు,
హ్మ్.. ఇలా మీ వ్యాఖ్యలు చదువుతుంటే.. నాకు బరువు తగ్గినట్లుంది.

సుజాత గారు,

Thanks for the comment! 100% in agreement with you..

కొండముది సాయికిరణ్ కుమార్ said...

కొద్దిమంది మనకు తెలియకుండానే మన మనసుల్లో తిష్ట వేసుకుంటారు. అలా అని, శ్రీహరికి నేనేమీ వీరఫానునేం కాదు. కాని, ఆయన మరణవార్త మాత్రం కదిలించింది. మీ నివాళితో మా కళ్ళు చెమర్చాయి. ఫేస్ బుక్ లో నేను వ్రాసుకున్నది :

దాదాపు పదేళ్ళ క్రితం అనుకుంటా... సినిమా పేరు బాగా గుర్తు లేదు. బహుశా విజయరామరాజు అయ్యుంటుంది. అందులో క్లైమాక్సులో ఓ కోర్టు సీను ఉంటుంది. అందులో శ్రీహరి చాలా అద్భుతంగా నటించాడు. చాలామందికి ఓవర్ యాక్షన్ అనిపించినా, నాకైతే అతని నటనలో ఓ కసి కనిపించింది. అంతకు ముందు వరకూ ఏవో చిన్నపాటి విలన్ గా, కామెడీ విలన్ గా చూసా. కానీ ఆ సినిమా తర్వాత శ్రీహరి ఇంత అద్భుతంగా చేయగలడా అనిపించింది.

మీకు సిల్లీగా అనిపించవచ్చు. నేను ఉబుసుపోనప్పుడు చేసే కాలక్షేపపు ఆలోచన ఒకటుంది. అది ఈరోజుల్లో మహాభారతాన్ని సినిమాగా తీస్తే ఇప్పుడున్న నటుల్లో ఎవరు ఏ పాత్రకు నప్పుతారు అని! ఆ ఆలోచన రెండు పాత్రలు, ఇద్దరు నటుల దగ్గరకు వచ్చి ఆగిపోయేది. అవి - దుర్యోధనుడు, కర్ణుడు. ఎన్.టి.ఆర్., ఎస్.వి.ఆర్. ల తర్వాత, ఇప్పుడున్నవాళ్ళల్లో శ్రీహరి, సాయికుమార్ ఈ పాత్రలు అద్భుతంగా చేయగలరని అనిపించేది.

ఏదేమైనా, తెలుగు సినీ పరిశ్రమ చాలా మంచి నటుడిని కోల్పోయింది. శ్రీహరి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ...

తృష్ణ said...

ప్చ్... బాధాకరమైన వార్త! మొన్న రాత్రి చదివిన ఈ వార్తతో నిన్నంతా కూడా దిగులుగా గడిచింది :(
మా ఇంట్లో కూడా అతని వ్యక్తిత్వం, మంచితనం పట్ల ఎడ్మిరేషన్ ఉన్నాయి.

అన్నట్లు మీకో సంగతి చెప్పనా.. "ఆదియందు బాలానగర్ కలదు..." అని మావారిని ఉడికిస్తూ ఉంటా...:-)
(వాళ్ళది దాదాపు ముఫ్ఫై ఏళ్ల అనుబంధం బాలానగర్తో :D)

రవి said...

చాలా యేళ్ళ ముందు "సాంబయ్య" సినిమాకు ఫ్రెండ్స్ కెవరికీ చెప్పకుండా మొదటి రోజు వెళ్ళిన రోజు గుర్తొచ్చింది నాకు. (చెపితే రారు, ఆపైన గేలి చేస్తారు.అతని సినిమాకా అని)

భద్రాచలం సినిమా టీవీలో వచ్చినప్పుడల్లా టీవీకి అతుక్కు పోతుంటే - ఇలాంటి సినిమాలు మీరు చూడరు కదా, ఇదేంటి అని మా ఆవిడ అంటే - సింధు మీనన్ అన్న కారణంతో శ్రీహరిపై అభిమానం దాచుకున్న సందర్భాలు గుర్తొస్తాయి.

నువ్వొస్తానంటే - ఈ సినిమాలో శ్రీహరి ఉన్నాడన్న విషయమే తెలీదు. సిద్ధార్థ్ సినిమా కాబట్టి హిట్ అయినా చూడకుండా, చివరకు ఎలానో తెలిసి, వరుసగా మూడుసార్లు చూసిన వైనం.

అబ్బో! శ్రీహరి గురించి చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. అదేదో సినిమాలో రాశి హీరోవిన్. ప్రకాష్ రాజ్ విలన్, వాడికి భార్యపైన అనుమానం. చాలా వరైటీ కథ. అందులో డైలాగ్ అనుకుంటా. "మంచిగ చదువుకొర్రి, షకలక బేబీలొద్దు" - ఈ డవిలాగ్ తెగ ఇష్టం నాకు.

శ్రీనివాస్ పప్పు said...

"చావు లేని ఇంటికెళ్ళి కాసిన్ని ఆవాలు పట్టుకురా, నీ కొడుకుని బతికిస్తాను"

సుజాత గారి వ్యాఖ్యలో మాటలా నిజమే కానీ మరీ ఇంత చిన్న వయసులోనే అంటేనే కొంచం బాధగా ఉందండీ.అదీ పది మందికీ పనికొచ్చేవాళ్ళంటే దేవుడికి కూడా ఇష్టమేనేమో గమ్మున తీసుకెళ్ళిపోతుంటాడు అదేంటో.

ఒక మంచి మనిషి,నిజాయితీగల వ్యక్తిత్వానికి నిండునూరేళ్ళు అర్ధాంతరంగా నిండాయి అంతే.

ఆ.సౌమ్య said...

naaku vaarta guugal plas loa sneahitula poasT dwaaraa telisindi. neanu Tiivii cuuDaleadu, cuuDadalucukoaleadu. vishayma telisindi caalu. neanu inka aa vaartalu cuuDaleanu. padea padea vinaleanu, antyakriyalu avii cuuDaleanu. naa maTuku naaku Sriihari sajeevamgaa batikea unnaaDu atani paatralloa. atanu gurtoccinappuDalaa intakumundulaagea magadheeroa, Dhii gaanii kingoa peTukuni cuustaanu. Sriihari batikea unnaaDu...antea!!

kaanii vaarta vinna daggaranumDii nuvvostaanamtea neanoddamTaanaa loa laasT guDi loa parucuuri toa amaayakamgaa kaLLaloa oka rakamaina merupu toa "raari konni kamkulu teesi veaseasaanu" ani ceppea siinu, magadheera vandamandini campea siinu..."ceekaTi kaDupunu ceelcuku maLLii puDataavuraa"...padea padea cevulloa pratidhwanistoandi.

ప్రతీ పాత్రని తనదిగా చేసుకుని వైవిధ్యమైన డిక్షన్ తో ఈ పాత్రని శ్రీహరి తప్ప ఇంకెవరు చెయ్యలేరు అనిపించేలా ఉంటుంది. నిజంగా ఇప్పుడు అతని చోటుని భర్తీ చెయ్యగల ఆర్టిస్టులెవరూ లేరనే అనిపిస్తోంది.

ఆ మధ్య హలోబ్రదర్ సినిమా టివీలో చూస్తుంటే శ్రీహరి ని చూసి గొప్ప ఆశ్చర్యమేసింది...ఎక్కడినుంది ఎక్కడికొచ్చాడు..ఎంతో కష్టపడి పైకొచ్చాడు కదా అనిపించింది.

అప్పుడప్పుడూ శ్రీహరి, శాంతి కలిసి జైల్ కి వెళ్ళి క్రిమినల్స్ తో కాస్త సమయం గడిపారని, ఫలనా చోట కరువు వస్తే ధన సహాయం చేసారని, ఎవరికో ఏదో అవసరమైతే ఇద్దరూ హాజరయ్యారని వార్తలు చూసినప్పుడల్లా వాళ్ళిద్దరిపై అడ్మిరేషన్ పెరుగుతూ వచ్చింది. ఇద్దరూ కలిసికట్టుగా సేవా కార్యక్రమాలు చేపట్టడం, ఎక్కడికైనా ఇద్దరూ కలిసి వెళ్ళాం లాంటివి చూస్తే భలే ముచ్చటేసేది.

శాంతి గారికి ఈ బాధని తట్టుకునే శక్తి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

Anonymous said...

ప్రకాష్ రాజ్ , శ్రీహరి తోడల్లుళ్ళు అని చదివాను .
ప్రకాష్ రాజ్ భార్య లలితా కుమారి , శ్రీహరి భార్య శాంతి సొంత అక్క చెల్లెళ్ళు .
ప్రకాష్ రాజ్ విడాకులు టైం లో , కుటుంబ సభ్యులు అందరు అతనికి ఎంతో నచ్చ చెప్పి చూసారు శ్రీహరి కూడా . కాని ప్రకాష్ రాజ్ వినలేదు .

Unknown said...

Krishna gaaru, avunu c/o Dubaigate. eesari hyd. ki vaste maa intiki ravaali. Adapaduchu lanchanaaluntai:).-Nagesh.

Anonymous said...

సహజ నటన మరియు సౌష్టవ రూపమ్ము,
ఖంగుమనెడి గొంతు కలిగి వెలిగె -
అతడు శ్రీహరి! కన నన్నింటిలో ఫస్టు!
తుదకు చావుకైన తొలుత నిలిచె!

Andhra Pradesh Live said...

everybody admires him. everybody felt shocked to know he is no more. That is enough for a human being at the end of the life.

తృష్ణ said...

మీరు రాసిన తెలుగు సిన్మాలు ఒకటి చూశా, ఒకటి చూడలేదు..అయినా వాటి గురించి ఏం రాసే మూడ్ కూడా లేదు :) "లంచ్ బాక్స్ " గురించి మాత్రం సేమ్ ఫీలింగ్స్... ఆ బాధతోనే నేనసలు బ్లాగ్లో రాయడం మానేసా! ట్రైలర్ యూట్యూబ్ లో వచ్చిన దగ్గర్నుంచీ, రివ్యూలు చదివి చాల ఆశ పడిపోయా కాని చూడ్డం పడలేదు. ఈ మధ్యనే చూసా కానీ.. నాకూ పెద్దగా నచ్చలేదు. చాలా కరక్ట్ గా రాసారు. దాదాపు ఇవే సందేహాలు నాక్కూడా వచ్చాయి! డబ్బావాలాతో చివరిలో పోట్లాడేది మొదట్లోనే ఇదేంటి అని పోట్లాడదా? ఆ భర్త మాత్రం తన ఇంటి క్యారేజ్ కీ, బయట క్యారేజ్ కీ తేడా తెలియకుండా అన్ని రోజులు ఎలా ఉన్నాడు?
అసలు ఎప్పటికీ నాకు అర్థం కానిది ఒకటే.. డిస్ట్రెస్డ్ స్టేట్ లో ఉన్నా కూడా, ఆ చేసే స్నేహానికి చివరికి ప్రేమ రంగు పులమకుండా ఉండలేరా కథకులు? స్నేహాన్ని స్నేహంలా ఎందుకు ఉంచలేరు? అండ్ ఐ డోన్ట్ అండర్స్టాండ్ హౌ ఈలా కేన్ డెవలప్ సచ్ ఫీలింగ్స్ టూవార్డ్స్ ఏ స్ట్రేంజర్, దట్ టు ఇన్ సచ్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్... టోటల్ డిస్సప్పాయింట్మెంట్ ఫీలయ్యాం మేం కూడా సిన్మా చూసి :(

buddhamurali said...

యాదృచ్చికంగా ఇప్పుడే చదివాను కృష్ణ ప్రియ గారు చాలా బాగా రాశారు .. మనిషిగా అతని నిజాయితి బాగా నచ్చింది .. అలాంటి నిజాయితి ఆ రంగం లో చాలా తక్కువగా కనిపిస్తుంది

Anonymous said...

In reactions to your posts ,please add heart touching category also.

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;