ఆఫీస్ లో క్యూబికల్స్ మధ్య నుండి మీటింగ్ రూం కి నడుస్తున్నాను.. ఒక క్యూబ్ లోంచి నా పేరు వినిపిస్తే.. ఆసక్తి గా ఒక చెవి అటుపడేసాను. "విచ్ కృష్ణ?, దట్ ఫాట్ లేడీ? " వినగానే వొళ్ళు మండిపోయింది..
"నేను లావా? " వాడి మొహం అనుకున్నాను. కానీ మనసు లో ఎక్కడో తగిలింది. లేచి రెస్ట్ రూం లోకెళ్ళి గమనించుకుంటే.. హ్మ్మ్.. నిజమే.. బానే లావయినట్టున్నాను.. ఈ మధ్య గమనించలేదు. అదీ కాక.. దైనందిక కార్యక్రమం లో ఒక్క పది నిమిషాలు అటూ ఇటూ అయితే.. ప్రళయమే వస్తుందన్న భ్రమ.. కొన్ని వదిలేద్దాం అని ఉండదు.. ప్రతీదీ అవాలి.. అన్నీ కావాలి. అంటే.. ఎక్కడో అక్కడ కొట్టక మానదు..
నాలుగు రోజులు చుట్టూ గమనించసాగాను.. తీగల్లాంటి అమ్మాయిలు. చువ్వల్లాంటి అబ్బాయిలు. నేనో ? డ్రమ్ములాంటి ఆవిడ?
ఆత్మ నూన్యతా భావం పెరిగిపోయింది. ఎందుకీ జీవితం అనిపించింది. లాభం లేదు. గట్టిగా ప్రయత్నించాల్సిందే.. బరువు తగ్గాలి.. అని నిశ్చయం జరిగిపోయింది.
ఉదయం ఉంటి ముందు లాన్ లో కలుపు తీస్తూ, మొక్కలకి సేవ చేస్తూ, తాగే ఉదయపు తేనీట్లో చక్కెర కట్.. కప్ సైజు సగం అయిపోయాయి.
ఉదయం.. పిల్లల్తో సరదా గా.. తీరిగ్గా భోజనం బల్ల మీద పింగాణీ పళ్ళాలలో వాళ్ళ స్కూల్ ముచ్చట్లు వింటూ, వేడి వేడి గా లాగించే ఇడ్లీలూ, రక రకాల అట్లూ, నోరూరించే కొబ్బరి, పల్లీలు, టమాటా, కొత్తి మీర, పుదీనా చట్నీల స్థానాన్ని .. ఒక్క శాతం కొవ్వు పాలల్లో ఓట్లు ఆక్రమించాయి.
మద్యాహ్నం తినేందుకు ఆకుకూర పప్పూ, పులుసు కూరలతో, అన్నం లేదా చపాతీలు హాయిగా కాస్త చింతకాయ,గోంగూర, ఆవకాయ లేక రోటి పచ్చళ్ళ తో 4-5 చిన్నా పెద్దా బాక్సుల్లో తీసుకెళ్ళి రెలిష్ చేసే నేను..
డబ్బాడు మొలకెత్తిన గింజలూ, కీర దోస, కారట్ ముక్కలు, ఆవిరి మీద ఉడికించిన చప్పటి కూర ముక్కలూ, ఉప్పు లేని ఫుల్కావులతో సరిపెట్టుకోవటం.. మొదలు పెట్టాను.
దోవలో ఆగి తినే పానీపురీలూ, మొక్క జొన్న కంకులూ, ఉడకపెట్టిన పల్లీల సంగతి దేవుడెరుగు... పళ్ళల్లో కూడా.. 'సగం పండిన సగం పండు ' కన్నా ఎక్కువ తినటం తప్పని నన్ను నేను కన్విన్స్ చేసేసుకున్నాను.
రాత్రి మరీ అభోజనం గా కాకపోయినా.. ఉడకపెట్టిన ఆకుకూరలూ, పెద్ద చెంబు చారు లో 2 చెంచాల అన్నం మెతుకులూ, గ్లాసుడు వెన్న తీసిన మజ్జిగ నీళ్ళతో సరిపెట్టుకుంటున్నాను.ఉదయం యోగా.. ట్రెడ్ మిల్లూ, ఆఫీస్ లో మెట్లూ, సాయంత్రం నడకా.. మొదలు పెట్టటమూ జరిగిపోయింది.
కో వర్కర్స్ పట్ల నా దృష్టి కోణం ఒక్కసారిగా మారిపోయింది. ..అప్పటిదాకా.. గీత ని చూస్తే.. " చురుకైన పిల్ల ", " దివైజ్ డ్రైవర్స్ లో దిట్ట " , "ఓ యెస్ బేసిక్స్ తన దగ్గరకే వెళ్ళాలి " అని అనుకునే దాన్ని. ఇప్పుడో.. చాలా లావు ఈ అమ్మాయి.. డయట్ గురించి ఆలోంచించనట్టుంది అసలు.. నాకయితే ముప్ఫై అయిదు దాటాయి.. ఇద్దరు పిల్లలూ, ఇల్లూ,వాకిలీ.. ఉద్యోగం, బాధ్యతలు. తనకి ఏముందీ... కాస్త జిమ్ముకో, నడకకో వెళ్ళవచ్చు గా.. అనిపిస్తోంది.
నిన్నటి దాకా ' పాడీ ' ఫద్మ సామాజిక స్పృహ ఉన్న మనిషి, ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకం .. ఇవ్వాళ్ళో నాజూకైన అమ్మాయి!!'లక్కీ' లక్ష్మి ప్రసన్నత నిండిన నగుమోము లో ఇప్పుడు 'దబల్ చిన్ ' మాత్రమే కనిపిస్తుంది.
చిన్న వయసు లో మూడు సాంకేతిక పుస్తకాలు రాసి, 15 కి పైగా పేటెంట్లు సంపాదించి, మాకందరికీ స్పూర్థిదాయకమైన మా పెద్ద బాసు లో బాన పొట్ట.. కొత్త గా నోటీస్ చేయడం మొదలు పెట్టాను...
వారం తిరిగే సరికి.. అణువణువునా నీరసం.. శక్తి హీనం గా తయారయ్యాను. తీవ్రమైన అలసట తప్ప ఏమీ కనిపించటం లేదు నాకు.. ప్రపంచం లో.పిల్ల్లలతో అల్పాహారం వేళ సరదా కబుర్లు, రాత్రి భోజనం తర్వాత కథా కాలక్షేపం బంద్. వంట చేయాలన్నా.. పిల్లలతో 2 ఆటలు ఆడాలన్నా.. ఓపిక లేదు. పిల్లల తగాదాలూ, చాడీలని.. నవ్వుతూ, పరిష్కరించే నేను.. అరిచిన అరుపులకి, బిత్తరపోయి నా ముందుకి రావటం తగ్గించారు పిల్లలు.
పిల్లలకే టైం లేదు. ఇంక మొక్కలకీ, పత్రికలకీ, పక్కావిడ తో సరదా సాయంత్రపు కబుర్లకీ.. ఎక్కడుంటుంది తీరికా.. ఓపికా?
విసుగూ, ముటముటలూ, విరక్తీ.. పిల్లలు పడుకున్నాక, ఆఫీస్ కాల్స్ అయ్యాక నడుస్తూ, రోజు ఎలా గడిచిందో నెమరు వేసుకుంటూ.. కబుర్లు చెప్పుకుంటూ, ప్రణాళికలేసుకుంటూ నడిచేవాళ్ళం ఇద్దరం.. ఇప్పుడు కాల్ అయ్యాక కంప్యూటర్ దగ్గర్నించి లేవాలన్నా.. వెర్రి నీరసం...
3 నెలలు గడిచాయి. 3 కిలోలు తగ్గాను కానీ.. చిరాకూ, చిటపటలు,అరుపులూ, ముటముటలూ ఆరు రెట్లు ఎక్కువయ్యాయి. మొక్కలు ఎండుతున్నాయి. పిల్లల మొహాలు వడలుతున్నాయి. ఇల్లు డ్రై.. ఆఫీస్ పని నాణ్యత.. తగ్గింది. బాస్ నుండి.. మెత్తని చురకలు ...
పెళ్ళిళ్ళల్లో, పార్టీల్లో, పచ్చి కూర ముక్కల్ని తినటం,.. తనూ, పిల్లలు పిజ్జాలు తింటుంటే, నేను సలాడ్, దయట్ కోకూ చప్పరించటం.. అమ్మమ్మ మినప సున్నుండలు పంపితే.. చిదిమి కూరల్లో వేసేంత పసుపు పరిమాణం లో తినటం..
ఆవకాయలూ,వేపుళ్ళూ, బజ్జీలూ, అప్పడాలూ, వడియాలూ, పొళ్ళూ, మిఠాయిలూ, కారప్పూసా, చాట్లూ, బర్గర్లూ, పిజ్జాలూ, పులుసులూ, పాఠోళీలూ, నా జీవితపు చరిత్ర పుటల్లో కెళ్ళిపోయాయి...
మూడు నెలల తర్వాత ఇంక బరువు తగ్గటం లేదు ఎంత ప్రయత్నించినా.. అప్పటికీ జుట్టు కత్తిరించి.. ఇంకో 100 గ్రాముల బరువు తగ్గించాను. :-)
పైగా.. జ్వరాలూ, తలనొప్పులూ, ఇదీ అని కచ్చితం గా చెప్పలేని ఉదాసీనత..
మితం గా తిని..సాధారణ పనులు చేస్తూ.. నా బాధ్యతలని నిర్వర్తిస్తూ .. ఆరోగ్యకరంగా, సహజం గా జీవితం గడపాలా?
లేక..బిపాషా, రాణీ ముఖర్జీ ల్లాగా రోజుకి 5 గంటలు గడపాలేమో జిమ్ములో!! ఈ మాత్రం తిండీ మానేసి.. ప్రోటీన్ షేకులూ, న్యూట్రిషన్ బార్లూ.. ?
ఇంత చేసి.. నా జీవితం లో 'రుచి ' అన్న పదం దూరం చేసుకోవటం, కుటుంబాన్ని భయపెట్టటం, కష్టపెట్టటం.. ..
దేనికి? ఎవరికోసం? " విచ్ కృష్ణ? " అంటే.. " దట్ థిన్ లేడీ " అనిపించుకోవటానికా? .. కళ్ళు తిరిగి కేఫెటేరియా లో ' లో ఫాట్ ' సెక్షన్ లో 'నో చీజ్..నొ మేయో.. వెజ్జీ సాండ్ విచ్ ' కొరుకుతూ నన్ను వేసుకున్న ప్రశ్న....
లేచి చెత్త లోకి ప్లేట్ పడేసి.. బయల్దేరాను.. దోసా కౌంటర్ కేసి.. , తర్వాత వెళ్తానండీ చాకొలేట్ పేస్ట్రీ కోసం.. తొందరేముంది?
Subscribe to:
Post Comments (Atom)
14 comments:
lol hilarious
:)
Extremes diets almost always never work. Should always start with exercize and then cut portions. Do not have to cut taste. 4 or 5 boxes for lunch? That is HUGE ;-)
For starters, a golden rule for diet is 3 bites of each. You can eat anything and everything but the portions should be just 3 bites of each item. No more. Each bite you can chew as long as you want (chewing burns a few calories BTW) to enjoy taste.
@DG,
Right! ఈ మధ్య కాలం లో చాలా మంది అమ్మాయిలు /అమ్మలు మోడళ్ళని చూసి (ఇంటేక్) కోతలు (పులి ని చూసి వాతల్లా..) పెట్టుకుంటున్నారని.. పొద్దస్తమానం 90% ఆలోచనలు వంటి బరువు చుట్టూనే వాళ్ళ ఆలోచనలు పొద్దస్తమానం.. ఉంటున్నాయని .. వ్యంగ్యం గా రాద్దామన్న ప్రయత్నం ఇది.. :-) BTW.. 4-5 బాక్సెస్ అంటే.. చిన్న టప్పర్ వేర్ వండీ.. 2 స్పూన్స్ రైస్ పట్టవచ్చు :-)..
thanks..all for your comments!!
నేను ఎలాంటి డైట్ లేకుండా ఒక్క నెలలో 3 కేజిల బరువు తగ్గాను, ఒక్క బెణ్ణె దోసె మాత్రం మానేశా, ఇంకొక 8 కేజిలు తగ్గితే హాపి :)
కృష్ణ గారు...ఆరు నెలలు..మధ్యాహ్నం సబ్ వేలో సాండ్ విచ్..సాయంత్రం వెజిటబుల్ చాట్..రాత్రి రెండు చపాతీలు తింటూ..పన్నెండు కేజీల పైనే తగ్గానండి...ఇప్పుడు మల్లి మామూలు తిండి తింటున్నా..కాని వెయిట్ కంట్రోల్ లో పెట్టానులెండి....
మీ పోస్ట్ నాకు బాగా నచ్చింది...
Krishna garu,
I am with you.
బరువు వల్లే రోగాలు అంటారు. మా బామ్మ, అమ్మమ్మ అంత తీగల్లా ఉండేవాళ్ళేమి కారు ఎనబై ఐదు దాకా వంటిల్లు వదల్లా. తొంభైల్లొ చిన్నాచితకా పనులు చేసుకొంటూ బకెట్ కొట్టారు. ఇప్పుడు ఈ ముప్పై ఏళ్ళ తీగలు పిల్లల్ని ఏత్తుకోలేక పోతున్నారు. మా అమ్మాయిని అబ్బాయిని చెరో వైపు ఎత్తుకొనే దాన్ని నేను. దాంట్లో కిక్కే వేరు. ఎరోబిక్స్ లో కూడా ఫాటిస్ మే ఫస్ట్ మా ఆఫీస్ లో. ఎవరేమనుకొంటే మనకేమి మనం ఇలానే ఉందాం అని, కావాలంటే ఇదే ఫాషన్ అందామని ఈ మధ్య మా మామ్స్ క్లబ్ నిర్ణయించాం :)
నాకు తెలిసి గత పది స౦వత్సరాలుగా అలాగే ఉన్న అమ్మాయి..లేక ఆవిడ "ఉదయభాను"..
అనవసర వ్యయప్రయాసలకి పోకుమ్డా హాయిగా నచ్చిన ఫుడ్డుని లాగిమ్చెయ్యమ్డి..
@ రాజ్ ఉదయభాను 1993 నుండి అలాగే ఉంది ఈ టీవీ లోకి రాక ముందు చిన్న చిన్న స్టేజ్ షోలు చేసేది 17 ఏళ్ళ నుండి అలాగే ఉంది.
baagundi baagundi.. nenu mee party ne!! :D
I feel your pain :)
Same pinch! :-))
You have to read this krishna priya...!I wrote this around 2 years ago!
http://manishi-manasulomaata.blogspot.com/2008/05/blog-post_12.html
@సుజాత
నిజమే.. రెండేళ్ళ క్రితం నేను తెలుగు బ్లాగులేవీ చదవలేదు. కానీ.. మీ పోస్ట్ సూపర్!
Post a Comment
మీ అభిప్రాయం...
Note: Only a member of this blog may post a comment.