Friday, May 14, 2010

అంబిగేశ్వరి-శ్రీనివాసోపాఖ్యానం

అబ్బో ఇప్పటి కథా? ... పదిహేనేళ్ళ క్రితం మొదలైంది. కాంపస్ ని వదలకుండానే మొదటి ఉద్యోగం వచ్చేసింది. మొదటి ఉద్యోగం మద్రాస్ మహా నగరం లో.. మే నెల పదిహేనున జాయినింగ్ రెపోర్ట్ ఇవ్వాలంటే నాకు మంచి ఉత్సాహం వచ్చేసింది. మద్రాస్ శీతోష్ణత గురించి కాదులెండి. మొదటి ఉద్యోగం, ఇన్నేళ్ళ శ్రమకి దొరికిన మొదటి ఫలం అని..

మొదటి సారి అంబిగ ని మా వర్కింగ్ వుమెన్ హాస్టెల్ లో కలిసాను. ఎవరో చెప్పారు. అంబిగ కూడా మా ఆఫీసేనని. సరే నని వెళ్ళి పరిచయం చేసుకున్నాను.సాయంత్రం ఆఫీసునుండి, వచ్చి టీ తాగుతూ.. డీడీ-2 లో ఏదో తమిళ కార్యక్రమం చూస్తోంది.

చాలా ప్రసన్నమైన మొహం... కానీ చాలా డల్. అతి సాధారణమైన బట్టలు, కారు నలుపు. మొహం మీద నలుపు విరిగిపోయి తెల్ల పాచెస్ , పల్చటి జుట్టు గుండు ని పూర్థి గా కప్పట్లేదు. సన్నటి జడ..

రోజులు గడుస్తున్నకొద్దీ.. నేను గమనించింది.. తను చాలా 'డిఫరెంట్ '.తన తో మాట్లాడాలంటే నాకు ఏ టాపిక్కూ ఉండేది కాదు. రాజకీయాలు,ఆటపాటలు, సినిమాలు,పుస్తకాలు, కుట్లూ, అల్లికలూ. ఊహూ .. ఒక్కదాంట్లో ఆసక్తి లేదు.పోనీ.. భక్తి,సమాజ సేవ, లాంటివీ ఇంటరెస్ట్ లేవు.

కనీసం, వంట,గిన్నెలు తోమటం,బట్టలుతకటం..వ్యాయామం? అబ్బే.. తిండి, మంచి బట్టలు,వాచీలు, నగల లాంటివీ.. పట్టించుకునేది కాదు.స్నేహితులూ, చుట్టాలూ, కనీసం తల్లిదండ్రులన్నా పెద్దగా ఇష్టం చూపించినట్టు నేను గమనించలేదు.

కానీ..ప్రసన్నం గానే ఉండేది. అలా అని ఒక్కత్తీ ఉండేది అని కాదు. నలుగురిలోనూ ఉన్నా.. నలుగురితో ఉండేది కాదు. రాను రాను నాకొక తపన మొదలైంది. తనకి దేంట్లో ఆసక్తి ఉందో తెలుసుకోవాలని.

ఆఫీస్ లో నా బ్లాక్ లోనే ఉండేది. అంబిగ ఎవరంటే.. ఎవ్వరూ చెప్పలేకపోయేవారు. పని లో ఏమంత చురుకుగా ఉండేది కాదు. సాధారణమే. ఎవరైనా ఉంటే..వాళ్ళు మాట్లాడితే వినేది. లేకపోతే ఒంటరి గా ఉండిపోయేది.

నేను తెలియకుండానే తనకి అభిమాని గా మారిపోయాను. ఏమి ఉన్నా, లేకపోయినా.. అంత ఆనందం గా ఉండవచ్చని తనని చూసాకే తెలిసింది. తనతో ఉంటే.. ఏకాంతం లో ఉన్నట్టే ఉండేది.

ఒకసారి మా గ్రూపులో వాళ్ళు ఏవో జోకులేసుకుంటూ.. అంబిగ టేబుల్ మీద డైరీ ని చూసి తన డైరీ లో ఏం రాసుకుంటుందో ఊహించుకుని చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. 'ఆఫీసుకెళ్ళాను.. వచ్చాను, తిన్నాను,పడుకున్నాను '.. అంబిగ వింటోంది. నాకు బాధ వేసింది. కానీ..తనేం పట్టించుకున్నట్టు అనిపించలేదు..

శ్రీనివాస్ తెలుగబ్బాయి. అందం గా ఉండేవాడు. I.I.T లో ఎం టెక్ చదివిన అబ్బాయి. సరదాగా నవ్వుతూ,నవ్విస్తూ, ఎస్ పి బి లా పాడేవాడు. ముక్కు సూటి మనస్తత్వం. చాలా చురుకైన అబ్బాయి. చేసే ప్రతి చిన్న పనిలోనూ, సంతృప్తి నీ, ఆనందాన్నీ వెతుక్కునేవాడు.

ఎవ్వర్నీ నొప్పించేవాడు కాదు. అతనికి కుట్టు పని మొదలుకుని, కొబ్బరి చెట్టెక్కటం దాకా.. మనిషి మనిషినీ పలకరించటం, కళలని ఆరాధించటం.. అతను ఆఫీసుకొస్తే అందరికీ ఆహ్లాదకరం గా ఉండేది. ఒక్క మాట లో చెప్పాలంటే ' ఆంటై అంబిగ '

ఎవ్వరూ పట్టించుకోని అంబిగ ని సైతం ప్రతి రోజూ పలకరించేవాడు. మహాబలిపురం వెళ్ళొచ్చి అందరికీ..గవ్వల పర్సులేవో సరదాగా తెస్తే.. కనీసం 10 రోజులు టేబుల్ పైన్నుంచి కూడా తీయలేదు అంబిగ.నేనే బావుండదని ఒక రోజు తీసి హాస్టల్ లో తన రూం లో పడేసాను.

ఒకసారి నాతో ఏదో మాట్లాడుతూ.. ' అన్నట్టు.. ఆ అంబిగ మీతోటే హాస్టెల్ లో ఉంటుంది ట గా.. 'అదో టైప్ అనుకుంటా కాండిడేట్ ' అన్నాడు. నేను కోపం గా 'నీకెందుకు? అది మంచి పిల్ల ' అన్నాను.

తర్వాత ఒక సంవత్సరం అందరం కలిసి పని చేసాం. సరదాగా గడిచిపోయింది మాకు.శ్రీనివాస్ వేరే ఆఫర్ వచ్చిందని వెళ్ళిపోయాడు బెంగుళూరికి. ఫేర్ వెల్ పార్టీకి కూడా అంబిగ వచ్చినట్టులేదు.

నేను ఇంకో రెండు నెలలకి వేరే కంపెనీకి మారినప్పుడు.. హాస్టల్ ఖాళీ చేస్తుంటే.. 'అంబిగా.. ఐ విల్ మిస్ యూ' అంటే.. అభావం గా చూసింది నన్ను.

పదేళ్ళు గడిచిపోయాక ఒకసారి ఒకసారి బే ఏరియా లో బాలసుబ్రమణ్యం పాడుతున్నాడని వెళ్ళాం. మా పాప ఏడుస్తుందని.. బయటకి తెచ్చాను. అక్కడ కనిపించింది అంబిగ.. ఒక చిన్న పాపాయి ని పట్టుకుని. చాలా ఆనందం గా వెళ్ళాను.. మళ్ళీ అదే అభావం. ఈసారి విసుగొచ్చింది నాకు.. చటుక్కున తిరిగి విసురుగా లేచి వెళ్ళిపోయాను. ఆవేశం తగ్గాక..' అయ్యో..ఇదేంటి తనెప్పుడూ అంతే గా.. నేనెందుకు బాధపడటం..' అనుకుని వెళ్ళాను. కానీ అప్పటికే తను కనిపించలేదు.

ప్రోగ్రాం అయ్యాక మేము కార్ దగ్గరకెళ్తున్నాం. పెద్ద వర్షం! శ్రీనివాస్ కనపడ్డాడు పక్క కార్ రివర్స్ చేస్తూ.. ఒకే రోజు రెండు సర్ ప్రైజులు.

'హాయ్ కృష్ణా!! ఎన్నాళ్ళకి? నేననుకంటూనే ఉన్నాను. నువ్వు బే ఏరియా లో ఉంటే తప్పక వస్తావని.. ' అన్నాడు. నేనూ చాలా ఖుష్! ఫోన్ నంబర్లూ అవీ ఇచ్చిపుచ్చుకున్నాక.. మళ్ళీ శనివారం కలవటానికి నిశ్చయమయిపోయింది మా ఇంట్లో.. తన కుటుంబం తో సహా భోజనానికి.

శ్రీనివాస్ వెనగ్గా నడిచొస్తున్న అంబిగ ని చూసి సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాను. ఇద్దరూ నవ్వుతూ..'సర్ ప్రైజెడ్ ?' అని అడిగితే నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయాను.శ్రీనివాస్ చెప్పాడు. మా కంపెనీ వదిలి వెళ్ళిన వారం రోజుల్లోనే.. పక్క క్యూబ్ లో కాం గా పని చేసుకుని పోతుండే అంబిగ ' ప్రెజెన్స్ ' ని బాగా మిస్సయ్యాడట.

ఇంకోవారం తర్వాత ఉండలేక మద్రాసుకొచ్చే రైలెక్కేసాడట. ఇక్కడ అంబిగ పరిస్థితీ అంతేనట. నవ్వుతూ, తృళ్ళుతూ, పాటలు హం చేస్తూ ఉండే శ్రీనివాస్ గురించి ఆలోచించటం మొదలు పెట్టిందిట..

ఇంత కథా శ్రీనివాస్ పిల్లాడ్ని ఆడిస్తూ కళ్ళనిండా చమక్కులతో నాకూ, మావారికీ ఉత్సాహంగా వివరిస్తున్నా.. అంబిగ మాత్రం అదే ప్రసన్నత, అభావం తో చూస్తూ ఉండిపోయింది.

ఇప్పుడు నేనూ తీరికున్నప్పుడు ఆలోచిస్తూ ఉంటాను... అంబిగ అప్పట్లో డైరీలో ఏం రాస్తుండేదా అని. ఈ విభిన్న దృవాలని కలిపిన దేవుడి లీలల గురించి కూడా.. మార్గాలు వేరయినా ఇద్దరికీ భావ స్వారూప్యం ఉందనుకుంటా . .. బహుశా అది రహదారంతా.. దొరికిన ప్రతి క్షణాన్నీ నిండుగా ఆస్వాదించటం..

8 comments:

sravya said...

I read all your posts just now.
Ur blog is really superb.

SD said...

మీరు రాసే డైరీ లాగానే ఆవిడ కూడా మీ మీద ఒక బ్లాగు మొదలెట్టిందేమో చూసుకోండి. :-) స్టిల్ వాటర్స్ రన్ డీప్ అని అందుకే అంటారని ఇప్పటికైనా అర్ధం అయిందా?

కృష్ణప్రియ said...

ధన్యవాదాలు! నిజమే..' స్టిల్ వాటర్స్ రన్ డీప్ '.. తన ద్వారా నేను నేర్చుకున్న పాఠం..

జేబి - JB said...

ప్రతి మనిషిలోను మనకు తెలియని కోణం ఒకటుంటుంది.
నేను 10 రోజులనించి పూర్తి చేయకుండా అట్టి పెట్టిన టపా అంశానికి ఈ అంబిగగారి వ్యక్తిత్వం సరిగ్గా సరిపొతుంది. నా టపా ప్రచురించాకా మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటానండి :-)

AK41 said...

Gayopakyanam laga Bagundi andi mee Ambika ... yopakyanam. Short cut lo 3 mukkala (Means veryshort) Story kani telugu Cinema laga baga enlarge/edit chesaru andi. Chala bagundi
Regards
Anil Sharma

Ram Krish Reddy Kotla said...

టర్నింగ్ అదిరింది...ఇలాంటి టర్నింగులు నిజ జీవితంలో కూడా జరుగుతాయ అనిపించింది :-)...బాగుంది మీ నేరేషన్

happyreddy said...

super

కృష్ణప్రియ said...

@ happyreddy,
థాంక్స్!

@ JB-జేబి,

ఎందుకో ఈ కామెంట్లన్నీ చూడలేదు మే లో :-) అప్పుడే బ్లాగ్ మొదలు పెట్టాను, కొత్త టపాలవి మాత్రమే చూసే దాన్ననుకుంటా.. మీ బ్లాగ్ కెళ్ళి చూశాను.. టపా రాశారేమోనని.. అన్నీ చదివాను. గుడ్ బ్లాగ్.

@ అనిల్ శర్మ,
:-) అదే ప్రాబ్లం. మా అమ్మా వాళ్ళు.. "చెప్పదల్చుకున్నది 2 ముక్కల్లో చెప్పి ఏడు... " అని రోజూ అనేవాళ్ళు.
థాంక్స్!

@ కిషన్ రెడ్డి గారు,
థాంక్స్.

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;