Wednesday, May 19, 2010

నాకు పాటలు రావండీ….

ఉద్యాననగరి నుండి భాగ్యనగరి కి మళ్ళీ ప్రయాణం కట్టానండీ.. పిల్లల్ని సెలవలతర్వాత వెనక్కి తెచ్చుకోవటానికి.. ఏసీ లో తత్కాల్ లో ఎంత ప్రయత్నించినా దొరకలేదు, చాన్నాళ్ళ తర్వాత స్లీపర్ కోచ్ లో ప్రయాణం.

కోస్తా ఆంధ్ర లో తుఫాను సూచనలట. కొలిమిలా కాలుతున్న అంధ్రప్రదేశ్ కి అతివృష్టి మళ్ళీ మొదలన్నమాట. హిందుపూర్ దాటగానే ఆకాశమంతా మబ్బులు, రివ్వున చల్లని గాలులు.. రైలు ఆగిపోయింది. మనోహరం గా ఉంది బయట దృశ్యం. చిట పటా చినుకులు మొదలయ్యాయి.

నేనే త్రిషనైతే,.. దిగి.. డాన్సు చేసేదాన్నేమో కానీ.. ఇది సినిమా కాదూ, బయట ప్రబాసూ లేడు. దానితో... భావోద్వేగాన్ని నియంత్రించుకుని.. సన్నగా పాడుకుంటున్నాను .. ' శివశంకరీ '..

కొంత సాహిత్యం, కొన్ని సంగతులూ గుర్తు రాలేదు. కొన్ని గుర్తుకొచ్చినా నోరు తిరగలేదు.. గొంతు సహకరించక కొంతా.. ఒక మాదిరి గా పాడుకుంటున్నాను.. ఎలా పాడుకున్నా.. ఎంతో ఆనందం గా .. నేను, నాకోసం,.. ప్రకృతి విన్యాసం చూసి.. సహజంగా..

టీవీ లో లిటిల్ చాంప్స్ పిల్లలు ఇది విన్నారంటే ఇంకేమైనా ఉందా? చీల్చి చెండాడి.. దేశ బహిష్కరణ శిక్ష విధించినా పెద్ద గా ఆశ్చర్య పోవక్కర్లేదు.. ఫక్కున నవ్వొచ్చింది. ఎదుట కూర్చున్నాయన.. విస్మయం గా చూసాడు.


నాకు వారపు రోజుల్లో పెద్దగా టీవీ చూసే సమయం ఉండదు.. రాత్రి 9.30 మీటింగు ఏ కారణం గానైనా తొందరగా అయిపోతే.. కాసేపు తెలుగు చానెళ్ళు తిరగేస్తాను. అన్నింటిలోనూ.. పాటలో, నాట్యాలో పోటీలు జరుగుతూనే ఉంటాయి.

నేను అమెరికాకెళ్ళేముందు అంతగా లేవనుకుంటా.. మూడేళ్ళక్రితం వచ్చాక అందరి నోళ్ళల్లో ఈ కళాకారుల పేర్లే.. అక్షరజ్ఞానం లేని పశువు లా చూసారు బంధువులూ, మిత్రులూ. దానితో ఒక నెల రోజులు.. జాగ్రత్తగా చూసి.. కాస్త జ్ఞానార్జన చేసి తర్వాత విసుగొచ్చి మానేసా లెండి.

ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే.. మా క్లాసులో కానీ.. చుట్టుపక్కల పిల్లల దగ్గర కానీ.. చుట్టాల్లో కానీ.. అందరం పెళ్ళిళ్ళకో, పార్టీలకో కలిస్తే.. ' ఏమే కృష్ణా.. శంకరాభరణం పాట పాడు.. మేమందిస్తాం లే.. గుర్తులేకపోతే పోనీ.. ఏదైనా రాజన్- నాగేంద్ర పాట పాడు..' అని అడిగిన తడవుగా.. హాయిగా..పాడేసేవాళ్ళం. తప్పుల తడకలా పాడినా.. ఎంజాయ్ చేసేసి.. ' నువ్వు పాడరా.. రాజూ..' అని అలా...

మొన్నీమధ్య మా తమ్ముడి వరస కుర్రాడి పెళ్ళికి వెళ్ళాను. ఆ సాంప్రదాయం అయితే మా వాళ్ళు మానలేదు.. కానీ.. ఒక కొత్త పోకడ మొదలయింది. నేను.. నా ధోరణి లో 'భద్రం బీ కేర్ఫుల్ బ్రదరూ.. వద్దురా సోదరా.. పెళ్ళంటె నూరేళ్ళ మంట రా' లాంటివి పాడాను. మా తమ్ముడి పెళ్ళి కదా అని సరదాగా.

పాట అయ్యాక.. మా పెద్దమ్మ గారు.. 'బాగా పాడావు సెభాష్! కానీ.. నీ వోయిస్ కి తగ్గ పాట ఎంచుకోవాల్సింది.. నీవు సాధారణం గా ఏం శృతి లో పాడతావు? ఎఫ్1?' అని అడిగింది. బెదిరిపోయాను. 'ఏమో! నాకు శృతి అంటే ఏంటో తెలియదు. పాట బాగుంటే.. నేర్చుకుని పాడేయటమే' అన్నాను.

' శృతి పెట్టె పెట్టుకుని పాడితే నీకు స్వరాల మీద కంట్రోల్ వస్తుందమ్మా.. ' అంది. అయోమయం గా తల ఊపాను.

మా అత్తయ్య వరసావిడ.. 'నువ్వు రోజుకి ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తావు?' అంది. 'ప్రాక్టీసా? నా మొహమా? నెల రోజులకొకసారి తీరిగ్గా కూర్చుని పాడితే గొప్ప ' అన్నాను. ఆవిడ అమెరికా ని కనుగొన్న కొలంబస్ లెవెల్లో మొహం పెట్టి విజయగర్వం తో.. 'అదీ.. వోయిస్ కల్చర్ కంట్రోల్లో లేనట్టుంది.. వోకల్ కార్డుల మీద ఒత్తిడి కనిపిస్తోంది.. కాస్త చూసుకోమ్మా!' అంది. ఏడ్చినట్టుంది అనుకున్నాను.

చిన్నబుచ్చుకున్న నా మొహం చూసి.. మా పినత్తగారొకావిడ (దగ్గర దగ్గర అరవయి ఏళ్ళుంటాయి..) ఒక న్యూస్ పేపర్ తీసుకుని.. రెండు ముక్కలు చేసింది. అందరూ చప్పట్లు.. చాలా సిగ్గనిపించింది. తర్వాత ఎక్కడెక్కడ శృతి, లయ సంగతులూ గట్రా తప్పాయో.. ఎక్కడ సాహిత్యం లో తేడా వచ్చిందో.. విశదం గా చర్చించుకున్నారు.

అత్తాకోడళ్ళంచుల ధోవతి,కండువా, నొసటన తిలకం తో నాకు మహా స్మార్ట్ గా, గౌరవభావం ఉట్టిపడేట్టుండే మా బాబాయిగారు.. నాకు పదేళ్ళ వయసు నుండీ పరిచయం, చనువూ. ఆయన 'నీవు పాడిన పాట అంతా పర్వాలేదు కానీ.. ఇంక్ ఊఊఊఉంచెం ఎమోషన్ పెడితే బాగుండేది తల్లీ.. మొహం మీద తమ్ముడి మీద జాలి, చిలిపితనం ప్రస్ఫుటిస్తే.. ఇంకా బాగుండేది. ఎనీ హవ్.. బానే పాడినట్టు లెక్క. అల్ ద బెస్ట్..' అన్నారు.

'మీరు కూడానా!!' అన్నట్టు చూస్తూ ఉండిపోయాను. సాక్షాత్తూ ఘంటసాల గారు దిగి వచ్చి 'శివ శంకరీ' పాడినా.. మనవాళ్ళు వదలేట్టు లేరు అని అర్థమయిపోయింది.

నాకు తిక్క రేగింది. జన్మలో ఇక పాడేది లేదు ఇలా గెట్ టుగెదర్లలో అని ఒట్టేసుకున్నాను…

అయినా.. ఇంక ఈ టపా ఆపేస్తాను... ఘుమ ఘుమ సువాసన!.. రైలు ధర్మవరం లో ఆగుతోంది.. దాల్ వడ తట్టలతో.. బోల్డు మంది పరిగెడుతున్నారు ప్లాట్ ఫాం మీద. కరకర లాడే పొగలు కక్కుతున్న పప్పు వడా, నవనవలాడే సన్నటి పొడుగాటి పచ్చిమిర్చీ.. అరబాటిల్ మంచి నీళ్ళూ.. హోరున వర్షం!

లేటర్ ఫ్రెండ్స్!!

16 comments:

Sravya V said...

ha ha ha :)

Raghav said...

ha ha hilarious, train lo eppudainaa madduru vadalu tinnaraa??

Bangalore nunchi hindupur velle varaku matramee dorukutai

వాత్సల్య said...

Nice one :))

వాత్సల్య said...

ఇంకా మీకు బాడీ లాంగ్వేజీ గురించి ఎవరూ చెప్పలేదా..ఈ మధ్య ఇదొకటి ఫ్యాషన్ అయిపోయింది లెండి.కామెంటేటర్లు,ప్రోగ్రాం ప్రెజెంటర్స్,క్రీడా విశ్లెషకులు,పిల్లల పోటీల జడ్జీలు ఒక్కరేమిటి అందరూ దీని మీదే లెక్చర్లు.

ఆవకాయ said...

పిల్లల శలవలు అయిపోయాయా అప్పుడే పాపం?
>>ఇది సినిమా కాదూ, బయట ప్రబాసూ లేడు.
Hillarious :)
మొత్తనికీ అందరూ మీకు ప్రైవెటు చెప్పేసారన్నమాట మూకుమ్మడిగా..

Raj said...

బాగు౦ది మీ పోస్టు...

ధర్మవరమ్ లో ఇడ్లీలు మీరు మరిచారు...ఆ టేస్ట్ నేను ఎక్కడా చూడలేదు...

నేను said...

ఏమో! నాకు శృతి అంటే ఏంటో తెలియదు. పాట బాగుంటే.. నేర్చుకుని పాడేయటమే//

shruthi ante aa green chudeedaar pillena ani adagakapoyara

భావన said...

హ హ హ బాగుందండి. ఇదొక కొత్త ట్రెండా ఇండియా లో ఇప్పుడూ?

కృష్ణప్రియ said...

ధన్యవాదాలు! ఈ మధ్య మా బంధువుల పెళ్ళిలో.. సూపర్ సింగర్ లాంటి కాంటెస్ట్ కూడా సరదాగా పెట్టారు. వంటింట్లో, స్నానాల గది లో, సరదాగా స్నేహితులతో పాడే పాటలకి కూడా జనాలు 'శృతి, లయ, వాయిస్ కల్చర్,బాడీ లాంగ్వేజ్ ' లాంటి పెద్ద పదాలని వాడుతూ, కంగారు పడుతూ సహజత్వానికి దూరమవుతున్నారు..

@రాఘవ,రాజ్,

ధర్మవరం ఇడ్లీలు తినలేదు. ఈసారి తింటాను. అవును.. మద్దూర్ వడ తిన్నాను. భలే ఉంటుంది.

జయ said...

బాగుందండి ప్రోగ్రాం కళ్ళకు కట్టినట్లు చూపించారు.

మేధ said...

Hahaha :)
ఈ మధ్య ఎక్కడ చూసినా ఇలానే... మా కజిన్ సంగీతం నేర్చుకుంటోంది, మొన్నామధ్య ఓ ఫంక్షన్ లో తను పాట పాడితే, అందరూ తనకి ఏవేవో సలహాలు ఇచ్చినవారే!

lalithag said...

Still cann't believe :)

మంచు said...

బెంగళూరు వచ్చినప్పుడు ఎదొ మీ ఇంటికి వద్దామనుకుంటే మీరేమో చుంబరెస్కా టెల్లొస్ ... శివ శంకరీ అంటూ భయపెట్టేస్తున్నారు :-(

బెంగళూరు నుండి ప్రశాంతి బయలుదేరినప్పటినుండి ధర్మవరం ఎప్పుడొస్తుందా అని ఎదురుచుస్తూ ఉంటా .. ఆ దాల్ వడ కొసం ... భలే గుర్తుచేసారు ...

BTW: ఇంతకు మునుపు మిమ్మల్ని ఎవరొ ఎదొ ఒక బ్లాగ్ లొ చెయ్యితిరిగిన రచయత అన్నట్టు గుర్తు ... అది నిజం అండి

కృష్ణప్రియ said...

@ జయ, మేధ, లలిత,
:-) థాంక్స్!

@ మంచు,
:-) Thanks!! చెయ్యి కాస్త తిరిగి ఉంటే.. రోగ లక్షణమా? అద్భుతమైన టల్లోస్ వంట వల్ల వచ్చిన గుర్తింపు వల్లా? అని ఆలోచిస్తున్నాను. :))

శివశంకరీ వద్దు అనుకుంటే సింపుల్.. టీ వీ పాటల పోటీలు అన్నీ చూస్తాను. నాకు మ్యూజిక్ అంటే ఇంటరెస్ట్.. అనండి చాలు. అప్పుడు నాకు పాటలే కావు, మాటలు కూడా ఒక పట్టాన బయటకి రావు :)

మనసు పలికే said...

హహ్హహ్హా.. చాలా బాగుందండీ టపా..:)
>> టీవీ లో లిటిల్ చాంప్స్ పిల్లలు ఇది విన్నారంటే ఇంకేమైనా ఉందా? చీల్చి చెండాడి.. దేశ బహిష్కరణ శిక్ష విధించినా పెద్ద గా ఆశ్చర్య పోవక్కర్లేదు..
నిజమేనండోయ్..;)

కృష్ణప్రియ said...

@ అపర్ణ,

:) థాంక్స్!

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;