Wednesday, May 26, 2010

శీనూ,రాధల గృహప్రవేశం..

శ్రీనివాసు పాతికేళ్ళ కుర్రాడు. రిసెషన్ టైం పెళ్ళికొడుకులకి డిమాండ్ తక్కువని గ్రహించి,..ఓపిక పట్టి కాస్త మాంద్యం తగ్గుముఖం పడుతూనే, కంపెనీ మూడు నెలలకి అమెరికాకి పంపగానే పెళ్ళిసంబంధాలు వెతకటం మొదలు పెట్టారు వాళ్ళింట్లో.. ముప్ఫై సంబంధాలు చూసి.. చేసుకుందామనుకంటే.. మూడు సంబంధాలు వస్తే ఒట్టు!

లక్కీ గా చూసిన రెండవ అమ్మాయే అతనిని, అతని తల్లిదండ్రుల ఆస్థిపాస్తులనీ, ఉన్న ఒక్క అక్కా, పెళ్ళయి 15 యేళ్ళవటాన .. పెట్టిపోతలకి పెద్దగా అవసరం లేకపోవటాన్నీ, అన్నగారు ఉండటం వల్లా, వాళ్ళ స్వగ్రామం లో తండ్రి ఇంట్లోనే కాపురం ఉండటం వల్లా, కాబోయే మామగారి అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళూ అదే ఊళ్ళో ఉండటం వల్లా, అత్తమామలు తమ దగ్గర యేళ్ళ తరబడి ఉండరన్న నమ్మకం వల్లా.. ఒప్పేసుకుంది.

(అఫ్ కోర్స్ బెంగుళూరులో తన అన్నయ్య తో ఇతగాడి కాండక్ట్ సర్టిఫికేట్లు పరీక్షించాకే ననుకోండి...)

అందరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లల్లానే ఒక్క మూడునెల్ల ట్రిప్పులు 3-4 చేయగానే ఇంటికి అడ్వాన్స్ కట్టేసాడు మన శీను.

ఇదండీ మన కథ కి ఉపోద్ఘాతం....

రాధ కూడా సాఫ్ట్ వేర్ ఇంజినీరే.. బెంగుళూరు రాగానే ఉద్యోగం వెతుక్కుని చేరిపోయింది. కాకపోతే.. పెళ్ళప్పుడు పెద్దవాళ్ళ పాతకాలపు దీవెనని 'తు చ ' తప్పకుండా పాటించి పెళ్ళయిన నాలుగు నెలలు నిండకుండానే, మూడో నెల అని, వేవిళ్ళ తీవ్రత కి ఉద్యోగ విరమణ చేసి.. వాంతుల మధ్య గాప్ లో బేబీ కాలెండర్లూ, ఎల్ కే జీ ఎడ్మిషన్లూ, ఐ ఐ టీ కోచింగ్ క్లాసులూ గూగుల్ చేస్తూ కాలక్షేపం చేస్తోంది.

ఈలోపల అపార్ట్ మెంట్ రెడీ అయిపోయింది. ఇంతటి తెలివైన దంపతులూ, 35 లక్షలంటే.. నెలకి 30 వేలు కడితే సరిపోతుంది. జీతం ఇంకో 30 మిగులుతుందని లెక్కలేసారే కానీ.. రెజిస్ట్రేషన్, కార్ పార్కింగ్, చెక్కపని, చిన్న చిన్న రిపైర్ పనులూ, లైట్లూ, ఫాన్లూ, వంటగది ఉపకరణాలూ,.. లాంటి ఖర్చుల్ని చూసి కళ్ళు తేలేసారు. మళ్ళీ ఇంకో ఐదు లకారాల అప్పు తేవాల్సి వచ్చింది శీను.. బావగారి దగ్గర్నించి.

నెలలు నిండినకొద్దీ..కష్టమని, ముందుగానే.. కొత్త ఇంట్లో వెళ్దామని చూస్తే.. బ్యాంకు లో ఇరవై వేలు. ఖర్చులు కోకొల్లలు. ఇటు రాధ అక్క,అన్న,తల్లి దండ్రులు,నాయనమ్మ,అమ్మమ్మలు. అటు శీను వైపు అక్క, తమ్ముడు కుటుంబాలు, పెదనాన్నలు..అత్తయ్యలు.. ఎవర్ని పిలావాలి? ఎవర్ని వదిలేయవచ్చు? ఎంతమందిని సమర్థించగలం? అన్నది ఒక అంశం...

ఊళ్ళో కోవర్కర్లు, క్లాస్ మేట్లు ? వచ్చినవారికి పెట్టిపోతలు? శీను అక్కకి తనకి పెళ్ళి లో సరిగ్గా ఆడపడచు లాంచనాలైనా జరపలేదని కినుక. వెండి బిందె ఇవ్వకపోతే తన స్నేహితులమధ్య పరువు నిలవదని గొడవ. ముప్ఫై వేలు ఎక్కడినిండి తేవాలి? అని బాధ.

ఇరువురూ ఆలోచించి చించి అర్థరాత్రికి ఒక నిర్ణయానికొస్తే.. మర్నాడు ఉదయం, శీనుకి ఆఫీస్ కి ఫోన్ చేసి వాళ్ళ అమ్మా నాన్నలు ప్లానంతా మార్చేసేవాళ్ళు, రాధ తల్లిదండ్రులకి ఫోన్ చేసి తన కష్ట సుఖాలని చెప్పుకుని సలహాలు పొందేది. రాత్రికి మళ్ళీ మొదలు.

మొత్తానికి ఇద్దరూ పది రోజుల కాలయాపన తర్వాత ఒక నిర్ణయానికొచ్చారు. తల్లిదండ్రులకీ, తోబుట్టువులకీ తప్ప ఎవరికీ ఆహ్వానం పంపరాదని. శీను అక్కకి స్టీలు బిందె తో సరిపెట్టి, కుటుంబానికి వెయ్యిన్నూటపదహార్లు తాంబూలం లో పెట్టి ఇవ్వాలని. రెండు వైపుల వారికీ నషాలానికెక్కినంత పనయ్యింది. "ఏంటి మీ ఉద్దేశ్యం? ఇంతోటి దానికి గృహప్రవేశం చేయటం దేనికి? మమ్మల్ని అవమానపరచటానికా? " అని ఆవేశపడ్డారు.

వీళ్ళు మళ్ళీ తలలు పట్టుక్కూర్చుని.. బట్టలు పెడతామని,.. శీనయ్య పెద్ద పెదనాన్ననీ.. (ఇంకా ఇద్దరు పెద్ద నాన్నలున్నారు మరి..), అమ్మమ్మనీ కూడా పిలుద్దామని. అలాగే రాధమ్మ అమ్మమ్మ,నాయనమ్మ కుటుంబాల్ని కూడా పిలవాలనీ..

అసంతృప్తిగా, చేసేది లేక తలాడించారు ఇరువైపులవారూ. గండం గడిచిందనుకుని మిగతా ఏర్పాట్లు చేసుకోవటానికి ఉపక్రమించారు భార్యా భర్తలు. ఈ ఆర్భాటానికంతా ఇంకో పాతిక వేలు చేబదులు తీసుకున్నాడు శీను. ఇంకో పది రోజులుందనగా.. మళ్ళీ నిప్పు రాజుకుంది. శీను మేనత్తలు, చిన్నాన్నలూ అలిగారు. ఇదే ఊళ్ళో ఉన్న రాధ తాతగారు ప్రయాణం కడుతున్నారట.. మొన్న పెళ్ళిలో చెప్తే.. సిగ్గుతో తలవంపులయ్యింది, పెద్దన్నయ్య్య ని పిలిచారట. ఇంతకాలం ఉమ్మడి కుటుంబం లో ఉన్నాం. అంత కానివాళ్ళమైపోయామా? పిలిచినంత మాత్రాన వచ్చేస్తామా? అని బాధపడ్డారట. శీను తండ్రికి అవమానమయిపోయింది.

ఈలోగా రాధ పెదనాన్న కొడుకు, వీరింటిలోనే చదువుకున్న వాడు.. సొంత చెల్లెలు కాదని ఏనాడో మరచిన వాడు, వీళ్ళ పెళ్ళికి కూడా వారం సెలవ పెట్టి కష్టించినవాడు, బెంగుళూరులోనే ఉన్నవాడు.. ఫోన్ చేస్తే ముక్తసరి గా సంభాషణ ముగించటం.. రాధ తట్టుకోలేకపోయింది.

శీను బావ ఫోన్ చేసి.. 'ఏరా.. డబ్బు అప్పుగా కావాలంటే చెప్పు..నేను సర్దుతాను.. మీ అక్కకి మాత్రం వెండి బిందె మర్చిపోకు.. ' అనేటప్పటికి శీను కి ఉక్రోషం వచ్చింది.

శుక్రవారం ఉదయం కాస్త నింపాది గా కాఫీ బ్రేక్ లో ఆఫీస్ వాళ్ళు.. " అంత పెద్ద ఇల్లు కొన్నావు.. మాకు స్వీట్లేవి? " అని అడిగారు. ఒక్కసారి గా జ్ఞానోదయం అయినట్టనిపించింది శీనుకి. " తప్పకుండా.. సోమవారం తెస్తాను.." అని .. తలనొప్పిగా ఉందని బాసుకి చెప్పి ఇంటికొచ్చేసాడు.

రాధ మార్నింగ్ సిక్నెస్ కాస్త తగ్గాక బాగా పొద్దెక్కేదాకా స్నానం చేయట్లేదు. శీను ఇంటికి చేరేటప్పటికి తల స్నానం చేసి తల తుడుచుకొంటూంది. 'పద పద ' అని తొందర పెట్టి శీను రాధని బయల్దేర దీసాడు. మంచి బట్టలు వేసుకోలేదన్నా.. జడ పూర్తి కాలేదన్నా వినలేదు. ఎక్కడికంటే సమాధానం లేదు. బైక్ ముందు పెట్టిన బ్యాగ్ లో ఏముందో చెప్పడు.

కొత్త అపార్ట్ మెంట్ దగ్గర ఆపి దిగమన్న భర్తని వింతగా చూసింది రాధ. గుమ్మం దగ్గర బ్యాగు తెరచి.. పసుపు,పూలు, కొబ్బరికాయ, పాల పాకెట్, హాట్ ప్లేట్ వగైరాలు చూసాక అర్థమైంది. ఒక్కక్షణం 'అమ్మో' అనిపించినా.. మనసు తేలికైనట్టనిపించింది.

ఆనందం గా గుమ్మానికి పసుపురాసి, ఇంటిముందు బియ్యప్పిండి తో ముగ్గువేసి.. గుమ్మానికి తోరణం కట్టి, నవధాన్యాలు ప్రతి గదిలో జల్లుతూ, వంటగదికి చేరి హాట్ ప్లేట్ మీద కొత్త గిన్నె లోకి పాల పాకెట్ చించారు ఇద్దరూ... పరమాన్నం వండి తిని, తెచ్చుకున్న దుప్పటీ మీద కూలబడి.. ఉత్తరాలూ, ఈమెయిళ్ళూ డ్రాఫ్ట్ చేయటం మొదలు పెట్టారు... ' నూతన గృహప్రవేశం సంపూర్ణం.. వీలు చూసుకుని తప్పక వచ్చి ఆశీర్వదించవలసిందీ ' అని.

7 comments:

కొత్త పాళీ said...

హ హ హ .. సారీ అండీ మీరు సీరియస్‌గా రాశారేమోగాని, నాకైతే నవ్వే వచ్చింది మరి. ఇల్లుకట్టి చూడుకి బదులు గృహప్రవేశం జరిపిచూడు అని మార్చాలేమో

కృష్ణప్రియ said...

కొత్తపాళీ గారూ,
లేదండీ.. లైట్ గా రాయాలనే రాశాను :-)

కృష్ణప్రియ

sphurita mylavarapu said...

హ హ హ...మంచి పని చేసారు...

Unknown said...

Krishnapriya గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.

మానస said...

చాలా బాగుంది.నిజంగా జరిగిందేమో అనుకున్నా నేను.ఒకటి రెండు ఫంక్షన్లు నేనూ మా వారూ ఇలాగే కానిచ్చేసాము ఎవ్వరినీ పిలవకుండా,పిలిస్తే అంతు ఉండదు ఇక ఆ లిస్టు కి అని :)..ఈ మధ్య నేను విన్నాను వెండి బిందె గురీంచి.అయినా తెలీక అడుగుతా రోజూ వాడతారా ఏమిటి దానిని..ఏ పండగకో పబ్బానికో ఓ సారి తీస్తారు.ఇంతోటి సంబరానికీ అవసరమా వెండి బిందే అనిపిస్తుంది నాకు.లోకో భిన్న రుచి అనుకోండి

Anonymous said...

మీ బ్లాగ్ చూసా నిన్న by chance.అలా చదువుతూనే ఉన్నాను. చక్కటి శైలితో రాస్తున్నారు. అందరూ experience చేసేవే ఐనా రాసే పద్ధతి impressive గా ఉండటం వల్ల interesting గా ఉంది చదవటానికి
మేము కూడా మా గృహప్రవేశం అలానే చేసాం చిన్న మార్పుతో- కొత్త ఇంట్లో భోజనాలు పెడితే మంచిదని అక్కDa ఉన్న వర్కర్స్ ని అందరినీ పిలిచి పెట్టాం. :-)-లక్ష్మి

Mauli said...

మంచి గృహప్రవేశం అయిడియా !

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;