Friday, July 23, 2010 23 comments

హాయిగా హాల్లో సినిమా...

పుట్టినరోజని సినిమా కెళ్దాం అని బయల్దేరాం..మాల్ లో మల్టీప్లెక్స్ థియేటర్ కి. అన్ని సెక్యూరిటీ పరీక్షలూ పాస్ అయి తీరిగ్గా వెళ్ళి కిటికీ షాపింగ్ చేసి... ( ఇంటర్నెట్ ద్వారా బుక్ చేసుకున్నందువల్ల, తొందర లేదు..) ఇంకో పది నిమిషాలుందనగా.. లోపలకెళ్ళాం. కెమేరా లకోసం వెతికి లోపలకి పంపగానే 500 రూపాయలు ఫట్!! కోక్, నాచోలకీ.. పాప్ కార్న్ కీ..

రెహమాన్ జాతీయగీతం, అందరూ నిలబడ్డాం. తర్వాత.. స్మూత్ గా జరిగిపోయింది సినిమా. జోకులకి నవ్వుతున్నా.. పెద్దగా సీట్లు చించేసేంత లేదు అక్కడ. సినిమా అయ్యాక..దోవలోనే పిల్లలు నిద్రపోయారు. ఇంటికొచ్చాక ఆలోచనలో పడ్డాను.

మా చిన్నప్పుడు ..మా ఊర్లో "హేఏఏఏఏ కృష్ణా.. ముకుందా... మురారీ......" ' ఘంటసాల గొంతు వినబడగానే..పౌడర్లు దబ దబా మొహాన దగ్గొచ్చేలా కొట్టి పరిగెత్తించేవారు మా అమ్మా వాళ్ళు. స్కూల్ కి వెళ్తున్నప్పుడు ఎంత సున్నితం గా దువ్వినా అరిచి గీ పెట్టే మేము ఆరోజు మాత్రం నేలని దున్నినట్టు దువ్వినా కిక్కురు మనకుండా సహకరించేవాళ్ళం. పైగా అడగకుండానే అమ్మా వాళ్ళు వినేలా అరడజన్ పాఠాలు గట్టిగట్టిగా చదివేసి.. ఈ పీ ఎం (performance assessment) ముందు వారం రోజులు ఆఫీస్ లో పని చేసినట్టు!!.. 2 వారాలకోసారేమో వెళ్ళేవాళ్ళం. అందరూ మనల్ని చూస్తున్నారా లేదా అని గమనించుకుంటూ..

స్లైడ్లూ, న్యూస్ రీళ్ళూ అయ్యాక, అసలు మొదటి హీరో తెర మీదకొచ్చేదాకా వాడేమన్నాడో అసలేమవుతోందో తెలిసేదే కాదు.. అన్ని ఈలలూ, చప్పట్లూ, పిల్లి కూతలూ. ఇంటర్వెల్ లో ఏమీ కొనమని మా అమ్మా వాళ్ళూ ఇష్ట దైవాల మీద ఒట్లు పెట్టించుకుని తెచ్చేవారు. కానీ ఇంటర్వెల్ లో సామ, దాన, బేధ, దండోపాయాలేవైనా సరే వాడి కనీసం గోలీ సోడా అయినా కొనిపించుకునేవాళ్ళం అనుకోండి..

ఆఖరి పరీక్ష అయ్యాక సినిమా కెళ్ళే ఆనందానికి ముందు బంగారు తొడుగులు అయినా సాటి రావు కదా.. ఒకసారి ఆఖరి పరీక్ష అయ్యాక మా ఊర్లో సినిమా హాల్లో 'ఎఱ్ఱ మల్లెలు ' ఆడుతోంది. మా అమ్మ నేను చచ్చినా రాను అంది. ఏం చేస్తాం? మా నాయనమ్మ దగ్గర గొడవ చేస్తే..ఆవిడ సరే అంది. నేనూ, మా చెల్లీ, నాయనమ్మా బయల్దేరాం. ఆవిడా..నెమ్మదిగా నడుస్తుంది. ఊరంతటికీ ఒకటే హాల్. పైగా.. ఎఱ్ఱ మల్లెలా మజాకా? గోదావరిఖని కార్మికులంతా హాల్లోనే.. వెళ్ళి చూస్తే.. టికెట్లన్నీ అయిపోయాయి. మేము దొర్లి దొర్లి ఏడుపు! ఎంతైనా మనవరాళ్ళ ఏడుపు చూడలేక మా నాయనమ్మగారు బతిమాలి బెంచి టికెట్ సంపాదించారు. పెద్దావిడ కదా అని ఆవిడ కి కాస్త చోటిచ్చారు జనాలు. మేం కిందే.. ఎంత మజా.. 30 యేళ్ళు దాటినా ఇంకా ఆ బీడీ వాసన ఫ్రెష్ గా..

ఇక అమ్మమ్మ గారింట్లో సినిమా అంటే.. ఉదయం డప్పు తీసుకుని దండోరా వచ్చేది... "ఈరోజు.. ఢం ఢం ఢం ఢం.. నక్కా తాతయ్యగారి దొడ్లో.. ఢం ఢం ఢం ఢం.. 'వయ్యారి భామలూ.. వగలమాడి భర్తలూ'.. వేస్తున్నారోఓఓఓఓఓఓ ఢం ఢం ఢం ఢం!!!!!" ఇంక మాకు పట్ట పగ్గాలుండేవి కావు.

పొద్దున్నుంచీ గొడవ గొడవ చేసి.. అందరి దగ్గరా బోల్డు మంచి వేషాలేస్తే.. సాయంత్రం పంపేవారు.. చాపలూ, పాత దుప్పట్లూ తీసుకుని పొలో మని.. వెళ్తే.. టికెట్ కి అర్థ రూపాయి. మధ్యలో కరెంట్ పోతే.. నాగమణి అని ఒక పిల్ల ఉండేది.. 10-12 యేళ్ళుంటాయేమో.. 'నువ్వాడవే." అనటం ఆలస్యం.. పాడుతూ డాన్స్ చేసేసేది. మేము ఇంత ఎంజాయ్ చేస్తున్నట్టు కనపడ్డా.. మా తాతగారు 'ఏంటా వెకిలి వేషాలు ? ' అని హుంకరించటం.. ఎన్నున్నాయో గోడ మీద సినిమా జ్ఞాపకాలు!!! ఎంటివోడి సినిమాలంటే చాలు! ఊరి పెద్దలు కుర్చీల మీద, మిగిలిన వాళ్ళు వాళ్ళు తెచ్చుకున్న చాపలమీదా కూర్చుని చూడటం...

హైదరాబాద్ కొచ్చాక మాత్రం సినిమాల జోరు మాకు తగ్గిపోయింది. మేమూ పెద్దయి.. కుటుంబం కన్నా.. స్నేహితులతో ఎక్కువ వెళ్ళేవాళ్ళం. చిరంజీవి, బాలకృష్ణ, అప్పుడప్పుడూ శోభన్ బాబు, కృష్ణ.. అమీర్ పేట లో సత్యం, చిక్కడపల్లి లో. బోల్డు థియేటర్లు..బస్సెక్కి పోవటం, చూడటం..

అప్పుడప్పుడూ పిల్లల్ని పంపేది మా అమ్మ సినిమాలకి.
మా తమ్ముడు మామూలప్పుడు మామూలు గా తిన్నా..సినిమాలకి వెళ్తే.. ఇంక ఆగేవాడు కాదు. వాడిని తీసుకెళ్తే.. ఇంక మాకు తిప్పలే తిప్పలు. మంచి నీళ్ళ బాటిల్ లోంచి నీళ్ళు పారబోసి.. చెఱకు రసం పోయించుకునేవాడు. చిప్స్ దగ్గర్నించీ పావలా త్రికోణం సమోసాల దాకా తిండే తిండి.. పర పర, కర కర.. ఒకసరైతే..తెచ్చుకున్న డబ్బంతా తిండి కే సరిపోయి సినిమా హాల్ నుండి ఇంటికి వెనక్కెళ్ళటానికి బస్సుకి డబ్బుల్లేవని నడుచుకుంటూ వెళ్ళాం.

మా పెద్దమ్మల ఇళ్ళకెళ్తే అక్కడ సినిమా చూడటం లో మజా యే వేరు. 20 మంది 7-8 రిక్షా లెక్కి వెళ్ళటం.. ఉక్కిపోతూ కూర్చోవటం.. హాల్లో పాటలొచ్చినప్పుడు మగాళ్ళంతా బయటకెళ్ళటం.. ఫైట్లప్పుడు ఆడవాళ్ళు కబుర్లు మొదలు పెట్టడం.. ఏడుపు సీన్లలో ఆడవాళ్ళు వెక్కి వెక్కి ఏడ్వటం.. ఒకసారి ఒకావిడ చేతులూపుతూ శాపనార్థాలు పెట్టింది.. మా పక్క సీట్లో ( ఓలమ్మో.. నీదొక ఆడ జన్మేనా థూ.. దాని మొగుణ్ణి వల్లో వేసుకుంటావా.. !@%@) అంటూ.. తెగ ఏడుపు! నవ్వుకోలేక చచ్చాం..

ఒకసారి ఉండ్రాజవరం అన్న ఊర్లో టూరింగ్ టాకీస్ లో 'జగజ్జట్టీలు ' అన్న సినిమాకెళ్ళాం. ఆవూర్లో ఆడవాళ్ళకీ, మగవారి సీట్లకీ మధ్య ఒక గోడ ఉండేది. మేమా చిన్న పిల్లలం. 2 సైకిళ్ళమీద బయల్దేరాం. మగాళ్ళ సైడ్ మా అన్నయ్య.. ఆడవాళ్ళ సైడ్ లో నేనూ, మా అక్క, చెల్లీ.. (కజిన్లం ) డబ్బేమో వాడి దగ్గరే.. ఇంటర్వెల్లో భటాణీలూ, పల్లీలూ కొనుక్కొచ్చేసరికి లైట్లు ఆపేశారు. గోడ మీదనుండి.. 'పాపాయీ.. తీసుకోవే.. పిడత కింద పప్పు తెచ్చాను 3 పొట్లాలు.. ' అన్నాడు.. మేము సినిమాలో లీనమైపోయాం అప్పటికే.. ఎవరో శుభ్రం గా అందుకుని తినేసారు. విషయం సినిమా అయ్యాక తెలిసి మాకు ఎక్కడ లేని బాధా వచ్చేసింది...


టెంత్ లో అనుకుంటా పబ్లిక్ పరీక్షలప్పుడు లెక్కల పేపర్ లీకయిందని కాన్సెల్ చేసారు. పరీక్ష హాల్ కి రాగానే వార్త విని, వచ్చిన రిక్షా నే 'బాబూ.. సత్యం థియేటర్ కి తిప్పు ' అని వెళ్ళిపోయాం.

లాబ్ లో అటెండన్స్ ఇచ్చి ప్రాక్టికల్సప్పుడు ఎంత హాయిగా వెళ్ళిపోయేవాళ్ళమో .. కానీ అప్పుడప్పుడూ దారుణం గా దొరికిపోయేవాళ్ళం.. పైగా..ఎక్కువ డబ్బులు ఉండేవి కావు. దానితో లంచ్ డబ్బా లో పెట్టిందే తినటం. ఒకసారి లైట్లు తీసేశాక చీకట్లో దోశలు తింటుంటే ముందు సీట్లో అబ్బాయి నాకూ దోశలు కావాలని ఒకటే ఏడుపు...

ఒక్కోసారి మార్నింగ్ షో కెళ్ళి ఇంటర్వెల్ లో వచ్చి మాటినీ కి కొనుక్కునేవాళ్ళం. ఉదయం నుండీ సాయంత్రం దాకా 2 సినిమాలు చూసి.. కాలెజొదిలే సమయానికి ఇళ్ళకి చేరటం.. మా స్నేహితురాలిని తెచ్చి మా అమ్మని అడిగించటం.. 'ప్లీజ్ మీ అమ్మాయిని పంపమని.. ఫ్రెండ్స్ ముందు ఒప్పుకున్నా.. వాళ్ళు వెళ్ళాక రికమెండేషన్లు తెస్తావా అని తిట్లు..

మా ఇంటి ఎదురు గా ముగ్గురు అన్నదమ్ములు అందరూ మెడికల్ కాలేజ్ లో చదివేవారు. మా నాన్నగారు వాళ్ళని ఆదర్శం గా తీసుకొమ్మంటారని వాళ్ళకి తెలుసు.. ఒకసారి అందాల నటుడు శొభన్ బాబు సినిమా ఏదో చూసి వస్తున్నాను ఫ్రెండ్స్ తో.. 'ఏంటీ సినిమా నా.. ఏం చూసావ్? అనగానే.. మరీ 'శ్రీవారి ముచ్చట్లో ఏదో చెపితే ఏం బాగుంటుందని.. పక్క థియేటర్ లో ఆడిన కళా తపస్వి విశ్వనాథ్ గారి సినిమా శ్రుతి లయలు చూశామని కోసిన గుర్తు. ఏం చేయను? మా ఫ్రెండ్ శోభన్ బాబు కి వీరాభిమానాయె! తర్వాత ఎందుకైనా మంచిదని కథా, నటుల గురించి తెలుసుకున్నాను..

ఇంక యూనివర్సిటీ లో..సైకిల్ మీద వెళ్ళి బస్ టికెట్ల డబ్బు తగ్గించుకుని తిరిగినవీ.. 'చీప్ ' అని మొదటి వరస లో చూడటం... ' అందాజ్ అప్నా అప్నా ' సినిమా కెళ్తూ సరదాకి ఒకళ్ళం చీర/20 నగలూ, ఒకరు జీన్సూ/టీ, ఇంకోళ్ళు సల్వార్-కమీజ్, ఇంకోళ్ళు ధోతీ/జుబ్బా లలో వెళ్ళి నవ్వించటం..
హం ఆప్కే హై కౌన్ ఐదు సార్లు చూడటం.. ముందుగానే కథ/డైలాగులూ తెలుసుకుని ఇంగ్లిష్ సినిమా ప్రతి ముక్కా అర్థమయినట్టు నటించటం.. మదరాసులో సూపర్ స్టార్ రజనీకాంత్ వీ, బెంగుళూరు లో పవర్ స్టార్ పునీత్ వీ చూడటం.. 'ఖల్ నాయక్ ' చూద్దామని ముందుగానే 15 మందికి సైకిల్ మీద వెళ్ళి సరిగ్గా చూసుకోకుండా అడ్వాన్స్ బుకింగ్ చేస్తే.. హిందీ డబ్బింగ్ సినిమా 'ఈవిల్ డెడ్ ' అయ్యిందని 15 మంది కొట్టటానికి వస్తే పారిపోయి రావటం,

అమెరికాలో ఇంక సినిమాలు పిల్లలు పుట్టనంత కాలం వారానికొకటి చూసి హాయిగా వచ్చేవాళ్ళం.. ఓ సారి సన్నీ వేల్ లో సినిమా చూడాలని ( ఇంకో వారం లో మా పాప పుడుతుంది అనగా ) వెళ్ళాం నేనూ, మా వారూ.. చిరంజీవి సినిమా 'అన్నయ్య ' కి. టికెట్లిచ్చే ఆవిడ 'మీకు వీలు గా ఉండేందుకు ఐల్ సీట్ ఇస్తాము ' అనగానే 'అబ్బో వీళ్ళకి ఎంత దయ! ' అనుకుని వెళ్తే ఏముంది.. పట్టుమని 10 మంది కూడా లేరు హాల్లో..ఆవిడ జోక్ చేసిందని అప్పటికి అర్థం అయింది మాకు :-)

ఇలా ఇంకో వారం లో పుడతారనేదాకా కూడా చూసినందువల్లనేమో.. మా పిల్లలకీ.. బానే సినిమా పిచ్చే :-) చిన్నప్పట్నించీ వాళ్ళకి సినిమాలు అలవాటే.. కాకపోతే పాప్ కార్న్ పాకెట్లు అయ్యాక ఎవరో ఒకళ్ళం గుమ్మం దగ్గర నిలబడేవాళ్ళం అనుకోండి..

మా తాతగారి జమానా లో బళ్ళు కట్టించుకుని కారియర్లలో టవున్లకొచ్చి చూసినా.. మా తల్లిదండ్రుల జమానా లో రిక్షాల్లోనో, చేతక్ మీదో వెళ్ళి చూసినా, ఆటోల్లో, బస్సుల్లో వెళ్ళి లైన్లల్లో నుంచుని/బ్లాక్ లో కొని చూసినా.. సాఫిస్టికేటెడ్ గా ఇంటర్నెట్ లో బుక్ చేసుకుని యే సీ కార్లో వెళ్ళి కోక్, నాచోలూ తింటూ మల్టీ ప్లెక్స్ లో చూసినా.. హాల్ కెళ్ళి చూడటం లో మజా నాకయితే.. డీవీడీల్లో, టీవీలోనో, యూ ట్యూబ్ లోనో, టోరెంట్లో డవున్లోడ్ చేసి చూస్తేనో.. రాదు.

కానీ అంత టైమెక్కడేడ్సింది? ఎలాగో అలాగ వారానికో సినిమా ఖాతా లో పడకపోతే.. తెలుగు వారికి సంతృప్తి ఎక్కడిది?
Friday, July 16, 2010 35 comments

NRI నుండి పక్కా ఇండియన్ గా మారడం దాకా..

ఏదో ఆఫీస్ పార్టీ.. అంటే బయటనుంచి సమోసాలు, పకోడీలు, 2 రకాల స్వీట్లు, సలాడ్ తెప్పించి బ్రేక్ రూం లో పెట్టి మా అడ్మిన్ మెయిల్ పంపితే అందరం ' యెటాక్ ' అని నచ్చినవి తీసుకుని అక్కడ కూలబడి కబుర్లు చెప్పుకుంటూ కొత్తగా వచ్చిన ఇంజినీర్ ని గమనిస్తున్నాం.

'హ్మ్మ్మ్ .. లుక్స్ గుడ్!! ' అని కళ్ళెగరేసి.. చూసి.. ' వావ్ !! ' అని కాస్త అరిచినట్టుగా చేసి.. అతి జాగ్రత్త గా ఒక టిష్యూ పేపర్ మీద ఒకటే 'వెజెటబుల్ ' తీసుకుని ఒక కార్నర్ కొచ్చి సాటి IE లతో నుంచున్నాడు (Imported Engineers). " జిలియన్ కాలరీస్ " , "గ్రీజీ " లాంటి పదాలు వినబడుతున్నాయి మంధ్రం గా ...

IE .. ముద్దుగా మా గ్రూపు లో పెట్టుకున్న పేరు లెండి. మేమందరం కళ్ళతోనే ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నాం. ఇది పునహ్ భారతీకరణ లో మొదటి ఫేజ్. (పది పదిహేనేళ్ళ విదేశీ వాసం తర్వాత భారత జన జీవన స్రవంతి లో మళ్ళీ కలిసిపోవడం ...)

మా హెడ్ ఆఫీసు అమెరికా లో ఉండటం తో.. ఆర్థిక మాంద్యం మొదలైన దగ్గర్నించీ , దాదాపు 2 వారాలకొకరు బెంగుళూరు వచ్చేస్తునారు మూటా ముల్లే సద్దుకుని.

మొదటి ఫేజ్ లో ఉన్నాడు సుభాష్. అందరు RI (Returning Indians) ల్లాగానే.. కొద్దిగా వెలిసినట్టున్న లేత రంగుల షర్టులూ, అవే రంగుల్లో పాంటులూ, హైకింగ్ లేదా స్పోర్ట్ షూలూ, కనబడిన వాళ్ళందరినీ, పెదాలు సాగదీసి నవ్వినట్టు పోజిచ్చి
తల తో ' రా ' అని పిలిచినట్టు ఒకసారి కిందకి వంపి హాల్ వే లల్లో కుడి వైపు నడుస్తూ, అందరికీ తగలబోయి సారీలు చెపుతూ ..

కాఫెటేరియా తిండి లో కాలరీలు లెక్కపెట్టడం, టిష్యూ పేపర్ల కట్టలు క్యూబ్ లో పెట్టుకుని వాడటం.. ఇతర క్యూబ్ లలోకి తొంగి చూడకుండా డీసెంట్ గా ఆయిల్స్ లోంచి వెళ్ళటం.. ఇతరులు మాట్లాడుతుంటే మధ్యలో కట్ చేసి మాట్లాడక పోవటం.. ఒక తేదీ న పని పూర్తి చేస్తానన్నప్పుడు అది పాటించి పూర్తిచేసి చూపటం లాంటివి మంచి బుద్ధులతోనే ఉంటారు మొదట్లో ..

ఇళ్ళు ఎగ్సెట్రా..

రావటం రావటం గెస్ట్ హౌజ్ లోనో, లేక వారి ఆత్మీయిలు ఇళ్ళల్లోనో దిగి.. ఇక వాళ్ళు ఇళ్ళు వెతకటం చూస్తే ముచ్చటేస్తుంది. మొదటి ప్రశ్నలు.. 'ఈజ్ ఇట్ సేఫ్ నైబర్ హుడ్?' , ' ఇతర ఆర్ ఐ లు ఉన్నారా లేరా? '.. గేటెడ్ కమ్యూనిటీ తప్పని సరి. ఇంటికి మారగానే పని మనుషులు కుప్పలు తెప్పలు గా వచ్చి..' అమ్మగారో.. ' అంటూ చక చక లాడుతూ పనిచేస్తారనే ఊహలు! అయినవాళ్ళంతా.. @సర్వీస్.. అంటూ అండగా ఉంటారని కూడా అంతర్లీనం గా ఆశ పడటం.. అదే విధం గా మనం కావాలనుకున్నప్పుడు మాత్రమే మనల్ని ఎంటర్ టెయిన్ చేసి వద్దనుకున్నప్పుడు తెర చాటుకెళ్ళే బంధుగణం..

కలలు కరిగాక .. వారానికో రోజు ఆరోగ్యం,చుట్టాలు, నానా రకాల ఫంక్షన్ల పేర్లు చెప్పి ఎగ్గొట్టే పని మనుషులు,.. వాళ్ళ వాళ్ళ రొటీన్ లో ఉన్న ఆత్మీయులు, అవసరాన్ని బట్టి ప్రత్యక్షమయ్యే బంధువులూ..

వీకెండ్ లు?

అమెరికాలోలాగే ఎక్కడికో ఒక చోటకి వెళ్ళాలేమో అన్న రంధిలో కొంతకాలం కొట్టుకోవటం.. బెంగుళూరు ట్రాఫిక్ లో అడుక్కి అరవైనాలుగు సార్లు కార్ ఆగుతూ.. ఏదో విధం గా కష్టపడి తిరిగి రావటం..

ఆరు నెలలు తిరిగేసరికి..
వారాంతాలంటే..హాయిగా ఇంటిపట్టున పడి ఉండటం.. పిల్లలూ, పెద్దలూ, వారం లో పేరుకుపోయిన పనులు పూర్తిచేసుకోవటం.. ట్రాఫిక్ తక్కువ ఉన్న వైపు తప్ప పొరపాటున కూడా వెళ్ళకపోవటం!

ప్రయాణాలు?


మొదట్లో వారి సొంత ఊళ్ళకి ప్రయాణాలన్నీ విమానాల్లో.. లేక 7-8 వందల కిలో మీటర్లు కూడా కార్ డ్రైవ్ చేయచ్చా అని ఆలోచనలూ.. లేదా రైలెక్కారంటే.. తప్పని సరిగా స్టేషన్ కి టాక్సీలు.. కూలీలకి అడిగినంత ఇచ్చేయటం.. చేతి సంచీలో టాయిలెట్ టిష్యూలు, ఎక్వా ఫినా నీళ్ళ సీసాలు మాత్రం మరిచిపోకపోవటం!

ఓ ఏడాది తిరిగేటప్పటికి.. బస్సూ, థర్డ్ ఏ సీ, స్లీపర్ కోచూ... కార్లలో వెళ్ళినా.. అద్దె కార్లలో..డ్రైవర్ ని నియమించుకోకుండా వెళ్ళే సాహసాలు చేయకపోవటం..

కబుర్లు?


' సాన్ హోసే (వారుండి వచ్చిన సిటీ) ' లో ఉన్నప్పుడు.. తో మొదలు పెట్టి.. బెంగుళూరు లో క్రమశిక్షణ లేని ట్రాఫిక్ ని తిట్టుకోవటం తో ముగించటం.
ముదిరిన లంచగొండిదనం, సమయపాలన చేయని వారి ప్రవర్తన గురించి,విదేశాల్లో ఉండగా తిరిగిన ప్రదేశాల చర్చలు...
విదేశాల్లోని వస్తువుల నాణ్యత గురించి, భారతావని లోని కాలుశ్యం గురించీ మాట్లాడకుండా ఉండని ఆర్ ఐ లుంటారా?
అమెరికన్/వారుండివచ్చిన ప్రాంతపు కూరలూ, పళ్ళూ, ఇతర ఆహార/ఇతర పదార్థాలు ఎక్కడ దొరుకుతాయో..వివరాలు ఎక్స్ చేంజ్ చేసుకోవటం..
అక్కడ పిల్లల చదువు లో సృజనాత్మకతా,..ఇక్కడ బట్టీ కొట్టే పద్ధతి గురించి విపులం గా మాట్లాడుకోవటం..
విదేశాలకి ఒక్కసారి కూడా వెళ్ళని వారు తారసపడితే కాస్త గంభీరం గా మొహం పెట్టి, స్టైలిష్ గా పలకరించి ఊరుకోవటం..

ఇతరత్రా..

ఒక ఏడాది పాటు అక్కడనుంచి తెచ్చిన బట్టలూ, ఇతర వస్తువులూ వాడటం, ఎవరైనా వస్తుంటే తెప్పించుకోవటం.. ఓ రెండేళ్ళు అక్కడికి ఎవ్వరి వెళ్తున్నా.. విదేశాల్లో స్నేహితులకి మైసూర్ పాక్ ల నుండీ.. కాటన్ కుర్తీల వరకూ పంపటం..
క్రెడిట్ కార్డ్ బిల్లుల్లో డబ్బు మేరుపర్వత ప్రమాణాన కనిపిస్తుంటే.. నెమ్మదిగా తగ్గించేయటం..

ప్రైవసీ కరువైందని బెంగపెట్టుకోవటం.. తెలిసీ తెలియని వారి పార్టీల్లో 'ఆర్ ఐ ' లు గా గుర్తింపు పొందాలని తాపత్రయపడటం..

ఇలాగ ఎన్ని చేసినా ఎన్ని విషయాల్లో కష్టపడ్డా.. నష్టపడ్డా, డిజపాయింట్ అయినా, అనారోగ్యం పాలయినా (మొదట్లో వాతావరణం మార్పు కి..ముఖ్యం గా పిల్లలకి), ప్రైవసీ లేదని బెంగపెట్టుకున్నా.. ట్రాఫిక్ ని తిట్టుకున్నా, టైంలీ నెస్ ఏదీ? అని నిట్టూర్చినా...

చక్కగా నచ్చినవి కొనుక్కోవటం, లేదా చేయించుకోవటం, అదీ కుదరకపోతే..పని వారి సహాయం తో స్వయం గా చేసుకోవటం.. వాతావరణం ఎలా ఉంది? ఎన్ని లేయర్ల తొడుగులు అవసరం లాంటి లెక్కల్లేకుండా.. చటుక్కున వీధిలోకి వచ్చేయటం. పిల్లలని మరీ ఇంట్లో కట్టిపారేయకుండా వీధిలోకి.. (లేదా కాంప్లెక్స్ ఆవరణ లోకి) ధైర్యం గా పంపగలగటం.. తల్లిదండ్రులతో వీసాలూ, ఇన్ష్యూరన్సులూ, లాంటి టెన్షన్లు లేకుండా వారి జీవన చరమాంకం లో ఆసరా ఇవ్వగలగటం.. వారితో పిల్లలకు అనుబంధాన్ని పెంచగలగటం.. అన్నింటినీ మించి మాతృ దేశం లో వచ్చి పడ్డామన్న తృప్తి తో పోల్చుకుంటే.. ఈ ట్రాఫిక్కూ, సమయపాలనా, లంచగొండిదనం.. పెద్ద విషయాలే కావేమో..

విదేశాల్లో పరిచయమైన పాత ఫ్రెండ్స్ ఎక్కడ తగిలినా.. 'ఎంత సుఖపడిపోతున్నామో.. పని మనిషి (ఎంత మంది మారినా, ఇంట్లో వస్తువులు ఎన్ని కొట్టేసినా.. డ్రైవర్ (కార్ లో ఒక్క ముక్క మాట్లాడినా 'ట్రూ మన్ షో ' లా ప్రపంచానికి తెలుస్తుందని నోరు మూసుకుని కార్లో పడి ఉన్నా.. తోటమాలి తో (మొక్కల్ని ఎండబెట్టినా, లాన్ ని కుళ్ళబెట్టినా).. ఇస్త్రీ అమ్మాయితో (పట్టు చీరలు కాల్చినా, షర్టులు మాయం చేసినా)..

వీళ్ళందరి సహాయం..మేమేమీ చేయం.. హాయిగా అక్కడా ఇక్కడా తిరగటం, ఆఫీస్ పని చూసుకోవటం, ఎంజాయ్ చేయటం.. అంతే! అని చెప్పుకుంటారు. (లేకపోతే అర్థరాత్రి దాకా కాల్సూ, నిద్రలేమీ,..ల్లాంటివి చెప్పుకుంటామా ఏంటి? మరీ..)

ఓ ఏడాది పోయాక.. మళ్ళీ ఇలాంటి పార్టీ యే ఉంటే RI లు ఈ పాటికి ప్యూర్ 'I' లు గా రూపాంతరం చెంది ..గాఢమైన రంగుల బట్టలూ, అందర్నీ గట్టిగా పలకరించటం, (వీలైతే..భుజం మీద ఒక్క చరుపు చరిచి మరీ..),.. పెద్ద సమోసాని తీసుకుని చిదిమి చట్నీలు పోసుకుని.. చేత్తో తిని.. పెట్టిన స్వీట్లన్నీ తినేసి.. కొత్తగా వచ్చిన ఆర్ ఐ ల మీద కామెంటుతూ ఉంటారు..

" ఏంటీ..? నీకెలా తెలుసూ అంటారా? నేనూ ఇదంతా స్వయంగా అనుభవించటమే కాక.. నాలుగైదేళ్ళనుండీ చూస్తున్నాకదండీ :-)

ps : సరదాగా రాసిందే .. ఎవ్వర్నీ కించపరచాలని కాదు
Monday, July 12, 2010 24 comments

పెద్దయ్యాక నేను..

పొద్దున్నే లేస్తూనే ముసురు ముసురు గా.. చినుకులు.. పిల్లలూ బద్ధకం గా.. నేను ఉత్సాహం నటిస్తూ.. (లోపల మాత్రం..వాళ్ళు స్కూల్ కెళ్ళాక హాయిగా కాళ్ళు జాపుకుని ఒక గంట ఆలస్యం గా వెళ్దాం అని నిర్ణయం!) .. స్కూల్ బస్ కూడా ఆలస్యం లా ఉంది. మా అమ్మాయి ముందే వెళ్ళి కూర్చుంది, వర్షం లో ఎగరవచ్చని.

మా కమ్యూనిటీ లో జండా కఱ్ఱ కింద మూడు రంగుల మెట్లుంటాయి. అదే పిల్లల స్కూల్ బస్ ఆగే చోటు. బస్సు వచ్చేలోపల అక్కడ కూలబడి చిన్న పిల్లల తల్లిదండ్రులు 2 నిమిషాలు బాతాఖానీ వేయటం పరిపాటి.

నేనూ హాయిగా చెప్పుల్లేకుండా.. తార్ రోడ్ మీద నెమ్మది గా, అతి నెమ్మది గా బస్ స్టాండ్ కెళ్ళి నిలబడ్డాను. చిన్నప్పుడు అస్తమానూ జలుబులూ, చెవి పోటనీ.. మా అమ్మా వాళ్ళు వర్షం లో బయటకి వెళ్ళాలంటే వంద జాగ్రత్తలు చెప్పేవారు. నేను పెద్దయ్యాక 'ఒక్కటి కూడా ఎప్పుడూ పాటించను ! ' అని నిర్ణయం రెండో తరగతి లోనే తీసేసుకున్నానాయె!

సన్నగా జల్లు, కాళ్ళ కింద గరకు గా చెమ్మగా రోడ్. మొక్కలన్నీ పాపం చన్నీటి స్నానం అనుకుంటా.. వణుకుతున్నాయి. మా కాంప్లెక్స్ లో ఇంకో తెలుగాయన నా వయసు వాడే అయుంటాడు... ఐదుగురు హాయిగా పట్టే నల్లటి గొడుగు వేసుకుని ఆనందం గా నుంచున్నాడు. వాళ్ళావిడ నా స్నేహితురాలు. ఆవిడ చిన్న గొడుగు లో పక్కనే.. వాళ్ళ అబ్బాయి ని కాపలా కాయటానికి వచ్చారట బస్ వచ్చే లోపల ఎక్కడ వర్షం లో ఆడతాడో నని ట :-)

సరే ఏంటి ఈ గొడుగుల కథ? అని అడిగితే చెప్పాడాయన. చిన్నప్పట్నించీ ఆయనకి ఈ కోరిక ట. పెద్దయ్యాక పేఏఏఏద్ద గొడుగు కొనుక్కోవాలని. వాళ్ళావిడ మాత్రం, అంత పెద్ద గొడుగు లో దూరాలంటే నాకు సిగ్గు.. అందుకని నా గొడుగు నాదే! అని డిక్లేర్ చేసేసింది. అక్కడ చేరిన తల్లి దండ్రులందరూ హాయిగా నవ్వుకున్నారు. నేను ఆలోచన లో పడటం గమనించి పక్కన నుంచున్నావిడ అడిగింది. 'ఏంటి కృష్ణా దీర్ఘం గా ఆలోచిస్తున్నావు? ' అని. 'ఏం లేదు మా ఇంటికీ గొడ్ల సావిడి కీ పై కప్పులు దేంతో వేయిద్దామా అని ' అన్న పాత జోక్ వేసేసి.. తర్వాత చెప్పాను. 'నాకూ ఇలాంటి చిన్న కోరికలు ఉన్నాయి చిన్నప్పటివి.. ' అని.

అందరూ కాస్త ఆసక్తి గా వింటున్నారని గమనించి చెప్పాను..

1. వర్షం లో గొడుగు, చెప్పులూ లేకుండా తిరగాలని.
2. పెద్దయ్యాక అన్నీ జంక్ ఫుడ్డే తినాలని..
3. ఇంట్లో ప్రతి గదిలోనూ చేతికి తగిలేలా పిన్నీస్ కట్టలు, సూదులూ ఉంచుకోవాలని.
4. రోజూ మధ్యాహ్న భోజన సమయం దాకా నిద్ర లేవకూడదని..

ఇలా 2-3 చెప్పానో లేదో ఇంకొకాయన మొదలు పెట్టాడు..

1. నేనెక్కిన రైలు కీకారణ్యం లో ఓ నాలుగు రోజులు ఆగిపోవాలని, అప్పుడు సినిమాల్లో లాగా బోల్డు సాహసాలు చేయాలని. (అఫ్ కోర్స్ పెద్ద పెద్ద డబ్బా నిండా తిండి పదార్థాలూ లాంటివి ఉండాలి ...)

2. ఏ పాడుబడ్డ భవంతి లోనో చేరిన దేశ ద్రోహులని ధైర్య సాహసాలు ప్రదర్శించి పోలీస్ లకి అప్పగించి రాష్ట్ర పతి చేతుల మీదుగా మెడల్ పొందాలని..


ఇంకొకావిడ..

మా అమ్మావాళ్ళూ దెబ్బలాడుకోవటం చూసి పెద్దయ్యాక సినిమాల్లో 'గుమ్మడీ, అన్నపూర్ణల్లాగా అస్సలూ దెబ్బలాడకుండా ఉండాలనుకునేదాన్ని అంది. 'ఇప్పుడు మాత్రం అనిపిస్తుంది.. ఆ రోజుల్లో అబ్బో వాళ్ళెంత సం యమనం తో ఉన్నారో.. రోజూ కీచులాటలే మాకు ' అంది. అందరం హాయిగా నవ్వేసాం. అందరూ ఇలాగే అనుకుంటారేమో అనుకుని.

ఒకతను.. ' పిల్లల్ని ఒక్క దెబ్బ వేయకుండా.. పువ్వుల్లా పెంచాలనుకున్నాను.. ' అని నిట్టూర్చాడు బురదలో ఎగురుతున్న వాళ్ళబ్బాయిని తరుముతున్న భార్యని చూసి...

ఇంకో ఆవిడ కాస్త సీరియస్ గా .. 'మా అమ్మ ఉద్యోగస్తురాలు.. ఎప్పుడూ పరిగెడుతూనే ఉండేది.. ఇంట్లో పని, ఆఫీస్ పనీ,చుట్టాలూ, ఎవ్వరూ కాస్త కూడా సహాయం చేసేవారు కాదు.. ఎప్పుడూ డస్సిపోయి, వడలిన తోటకూర కాడ లా ఉండేది. అందుకే పెద్దయ్యాక ఉద్యోగం ఎట్టి పరిస్థుతుల్లోనూ చేయకూడదనుకున్నాను. కానీ.. గేటెడ్ కమ్యూనిటీ లో ఇల్లూ లాంటి కోరికల వల్ల నేనూ ఉద్యోగం చేస్తున్నాను. కాకపోతే.. బోల్డు సహాయం అదీ ఉంది లెండి ' అనేసింది.

ఇంకో ఆయన.. కాస్త బరువెక్కిన టాపిక్ ని తేలిక పరుస్తూ 'నేనైతే సూపర్ మార్కెట్ నడిపే మా నాన్నగారు పడే కష్టం చూసి.. యేళ్ళ తరబడి కష్టపడకుండా.. ఒక్క బాక్ గ్రవుండ్ పాట అయ్యేటప్పటికి అంబానీ అయిపోదామనుకున్నా.. ఆ సరయిన పాట దొరకటమే తరువాయి ' అన్నాడు మహా సీరియస్ గా మొహం పెట్టి.


నేనైతే సల్మాన్ ఖాన్ అయిపోదామనుకున్నా అన్నడొకాయన. ఒకళ్ళు ప్రపంచాన్ని అబ్బుర పరచే విషయాలు కనుక్కుని నోబుల్ ప్రైజులు కొట్టేద్దామని, వేరొకరు ఒలింపిక్స్ లో పతకాలు సాధిద్దామనీ.. ఇంకొకరు సైనికుడు గా పాకిస్తాన్ సైన్యాన్ని ఊచకోత కోసి.. పరమ వీర చక్ర అవార్డ్ సాధిద్దామనీ.. అనుకున్నట్టు గా చెప్పేసారు.

ఆహ్లాదకరమైన వాతావరణం పుణ్యమా అని అందరూ సరదాగా పోటీలు పడి తమ చిన్నప్పటి స్వప్నాల గురించి ఏకధాటి గా చర్చించుకుంటున్నాము.

మా కబుర్లు వింటున్న ఒక తాతగారు.. ఆయన ధోరణి లో 'అందరు పిల్లలూ ట్రాఫిక్ పోలీసు, రైలు డ్రైవరూ, అవుదామనుకుంటారు., కొన్నాళ్ళు పోయాక.. (పెద్దలు అలా అంటే ఇష్టపడతారనేమో) డాక్టర్లూ, పైలెట్లూ, సైంటిస్టులూ అవుదామనుకుంటారు. వాళ్ళని ఏం ఆకర్షిస్తే అదవుదామనుకుంటారు. టీచర్లూ, నాయకులూ, టికెట్ కౌంటర్ల్లలో కూర్చునేవారిగా.. సినిమా హాల్లో గేట్ కీపర్ గానూ, .. ఇంకా ఏదో చెప్తుండగానే ఒకావిడ అందుకుంది ఉత్సాహం గా..

'అమాయకుడైన (కాస్త పిచ్చి కూడా అనుకుంటా) జమీందార్ ని పెళ్ళాడి పాపం ఆయనకి పాలల్లో ఏదో మందు కలిపి పడుతూ , అమాయకుడిని చేసి ఆడించే సవతి తల్లీ/అమ్మమ్మా. , బెల్ట్ దెబ్బలు కొట్టే సవతి తమ్ముడి/మామా చేతుల్లో అష్ట కష్టాలు పడుతూ ఉంటే.. సావిత్రి లా భర్త ని తన ప్రేమానురాగాలతో మార్చుకుని, టాగోర్ గేయాలు, జిడ్డు కృష్ణమూర్తి గారి రచనలూ చదివేట్టుగా, తెలివి తేటలతో సవతి అత్తగారి కుటుంబాన్ని మారుద్దామని కలలు కన్నట్టు చెప్పి నవ్వించింది.


ఇలా చిన్నప్పటి కలల్లో తేలుతున్న మమ్మల్ని స్కూల్ బస్ హార్న్ మళ్ళీ భూలోకం మీదకి నిర్దాక్షిణ్యం గా విసిరి పడేసింది. బస్ డ్రైవర్ కాస్త భయం గా చూశాడు మమ్మల్ని. మరి ఆలస్యమైతే ఎప్పుడూ దెబ్బలాడతాం కదా అని. అందరి మొహాలూ ప్రసన్నం గానే ఉండటం గమనించి 'అమ్మయ్య ' అనుకుని పిల్లల్ని తీసుకెళ్ళిపోయాడు. మేమూ 'బై' లు చెప్పుకుని ఆఫీసులకి పరుగులెట్టాం.
Thursday, July 8, 2010 20 comments

పిన్ని పెళ్లి - పిన్ని కొడుకు పెళ్లి..

పెంకుటింట్లో ఎనభైల్లో పిన్ని పెళ్ళి..

అప్పుడు చాలా చిన్నవాళ్ళం.. పిన్ని పెళ్ళంటే.. 'అలాగా' అనుకున్నాం. పెళ్ళికి మనం వెళ్ళాలి అంటే.. 'అబ్బా విసుగు ' అనుకున్నాం. స్కూల్ డుమ్మా కొట్టి వెళ్ళాలి, అదీ 10 రోజులకి అనగానే పులకరించిపోయాం. జరిగేది అమ్మమ్మ గారింట్లో అనగానే 'హుర్రే' అనుకున్నాం.. (ఆ రోజుల్లో 'వావ్ ' ప్రయోగం తక్కువే కదండీ!)

వేసవి సెలవలకి తప్ప, సంవత్సరం మధ్యలో అమ్మమ్మ గారింటికెళ్ళటం, .. అందునా.. స్కూల్ మాని అంటే, ఎవరికి ఉత్సాహం ఉండదు చెప్పండి? మాకున్నవే 3 మంచి జతలు... మా అమ్మ తనకున్న 2 పట్టుచీరలూ, ఒక జరీ చీరని మళ్ళీ ఇస్త్రీ చేసి వారం ముందే పెట్టె లో పెట్టేసాం. కలరా ఉండ ఒకటి వేసి పెట్టె చూసుకుని చూసుకుని మురిసి ముక్కలయ్యాం.

బజార్ కెళ్ళి పెళ్ళి లో ఇవ్వటానికి మా పిన్నులకీ, పిల్లలకీ ఏవో పిన్నులూ, రబ్బర్ బాండ్లూ, రంగు రంగుల సిల్క్ రిబ్బన్లూ కొంది మా అమ్మ. అవి చూసుకుని ఏ రంగు ఎవరు తీసుకుంటారో అని ఆలోచిస్తూ ఆవారం అంతా గడిపేశాం. పాండ్స్ పౌడరూ, కాటుక్కాయా, తిలకం, పూసల గొలుసులూ, సంచీ లో పెట్టుకుని,..ముందు గది లో పెట్టుకుని,..క్లాస్ పిల్లల దగ్గర్నించి, పాలబ్బాయి దాకా అందర్నీ వివరాలతో ఊదరకొట్టాం.

అంతగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. నాలు గిన్నెల కారియర్ లో చింతకాయ పచ్చడన్నం, ఆవకాయ,పెరుగు, జంతికలు,సున్నుండలూ.. లాంటివి తీసుకుని.. ఎక్కేశాం గోదావరి ఎక్స్ ప్రెస్. 10 రోజుల ముందే అమ్మమ్మ గారింట్లో చేరిన వాళ్ళు 20 మందైనా ఉంటారు.

పసుపు దంచటం, తీపి పదార్థాలూ, పిండి వంటలూ చేసి తాటాకు బుట్టల్లోకెత్తటం,.. మంగళ సూత్రం తాడు పేనడం, కొత్త తుంగ చాపలు, విసెన కఱ్ఱలు,...తయారు చేసుకోవటం, పేడ తో ఇల్లలకటం, విస్తళ్ళు కుట్టుకోవటం..లాంటివి ఒక ఎత్తైతే.. ఇందరికి వంటలు, పెండ్లి పిలుపులు, ఇంకో ఎత్తు.

రెండు వసారాల మధ్యనున్న నేల ని కూడా శుభ్రం గా అలికి, బియ్యప్పిండి తో ముగ్గులు పెట్టి,.. అతిథులు కూర్చోవటానికి తాటాకు పందిరీ,. దూలాలూ, పచ్చి కొబ్బరాకులూ వాడి పెళ్ళి పందిరి వేయటం.. అబ్బా..ఆ వాసన ఇప్పటికీ గుర్తే!

ఇక పెద్దల పాటలు, పద్యాలు, పేకాటలు, పిల్లల పరుగులు, ఆటలు,.. ఒక్కరొక్కరిగా వస్తున్న చుట్టాలని అందరూ వచ్చి సామాన్లు దింపుకుని, ఆప్యాయంగా లోపలికి తీసుకెళ్ళటం. కబుర్లలో పడటం.. వేన్నీళ్ళ పొయ్యిల దగ్గర కొందరు, కూరగాయలు తరిగేవారు కొందరు, వంటలు కొందరు, ఆజమాయిషీ కొందరు.. పిల్లలకి తలంట్లు కొందరు, బట్టలు ఉతికేవారు కొందరు.. ఏం చేసుకుంటున్నా.. పరాచకాలు, ఎత్తిపొడుపులు, నవ్వులాటలు..వేళాకోళాలు, విసుర్లు, ఏడిపించటాలు.. ఇలాగ..

మగ పెళ్ళి వారొచ్చాక ఇంకో హడావిడి వారి విడిది దగ్గర .. అలకలూ, చెమటలు కక్కుతూ, అటూ ఇటూ ఉరుకులూ, పరుగులూ కాఫీలు, టిఫిన్లు, పెళ్ళికూతురి తరఫు వారు స్వయంగా విసురుతూ వడ్డించటం..

పెద్దవారెక్కడెక్కడ ఏం చేసే వారో తెలియదు కానీ.. , ఆ కోలాహలం.. మగపెళ్ళి వారిని ఏదో శతృ కూటమి వారన్నట్టు చూడటం.. వారిమీద గూఢచర్యం చేయటం.. పెళ్ళి కొడుకుని కిటికీల్లోంచి సీక్రెట్ గా చూడటం..పెళ్ళికొడుక్కి కొరియర్ సర్వీస్ చేసి పెట్టడం లాంటివి ఎంత ఆస్వాదించామో.. ఇప్పటికీ మా బాబాయిగారిని చూస్తే.. ఈయన్నా.. మేము అంత లా 3 రోజుల పెళ్ళిలో 'ఆరాధించింది ' అనిపిస్తుంది.

బంతిపూల మాలలూ,మామిడాకుల తోరణాలు, గాజులేయించుకోవటాలూ, గోరింటాకులూ, గాడి పొయ్యి మీద వండిన పెళ్ళి భోజనం పంక్తి లో కుటుంబ సభ్యులే కొసరి కొసరి వడ్డించటం.. లాంటివి గుర్తుకొస్తే.. ఇంకా ఆ టేస్ట్ గుర్తుకొచ్చి నోరూరుతుంది.

అమ్మాయికి మంగళ సూత్రం, చెవికి బుట్టలూ, పెండ్లి కుమారునికి ఒక ఉంగరం చేయించి చేతులెత్తేసారు మా తాతగారు. పెళ్ళి కూతురికి అక్కలూ, వదినెలూ తమ గొలుసులని వేయగా.. కల్యాణ తిలకం, బుగ్గన చుక్కా, గాజు గాజులతో, చేమంతుల తో వేసిన పూలజడా, పసుపు నీటిలో ముంచిన మధుపర్కాలలో, పసుపు, సున్ని పిండిలతో కడిగిన మొహం ఎంత కళగా ఉన్నదో ఇప్పటికీ మాకు గుర్తే.. తర్వాతెప్పుడో పదేళ్ళతర్వాత వెండి కంచం చేయించారని విన్నాను.

అలాగ పెళ్ళయి ఎడ్ల బండి లో ఊరేగింపుగా ఊరు దాటి అత్తవారింటికెళ్ళిపోయిన మా పిన్ని ఢిల్లీ లో సెటిల్ అయిపోయింది.. పెళ్ళిలో వాడిన వస్తువులన్నీ ఆర్గానిక్ అవటం వల్ల మట్టిలో కలిసిపోయాయి. కానీ ఆ పెళ్ళి అనుభూతులు మాత్రం మాతో తాజా గానే ఉండిపోయాయి.

అదే పిన్ని కొడుకు పెళ్ళి 2010 లో అదే నిన్ననే ..

మా పిన్ని కొడుకు పెళ్ళి అమెరికా లో phD చేసి వచ్చాడు. కుటుంబానికి ఒక్కరిద్దరం వెళ్ళాం.. 10 రోజుల ముందు కాదనుకోండి.. ఎన్ని పనులు.. అసలే రెండో క్లాస్ మా అమ్మాయి. ఇప్పట్నించీ కష్టపడకపోతే ఎలా? ఆఫీస్ లో డెడ్ లైన్లు.. ' పెళ్ళికొడుకు తో పాటూ రండే మీరు..' అని మా పిన్ని అడిగిందని వాడి వెనక కార్ లో బయల్దేరాం. రాష్ట్ర రాజధాని లో ఒక పెద్ద రెసార్ట్/ గార్డెన్లలో పెళ్ళి. అద్దె పూట కి రెండు లక్షల నలభై వేలట!!! అందుకని ఒకటే పూట కి రమ్మన్నారు ఆడ పెళ్ళి వారు.

పెళ్ళి కార్ ఆగగానే.. ఆడ పెళ్ళివారు వచ్చేసారు. వెండి పళ్ళాలతో హారతి ఇవ్వటానికి. పైన్నుంచి కిందకి నగలతో మెరిసిపోతూ,.. 30 వేల పట్టు చీరలట.. ధగధగ లాడుతున్నారు ఆడవారు. ఉత్సాహం గా దిగిన మమ్మల్నందర్నీ.. 'కాస్త అసింట జరగండని ' 'ఏక్షన్!! ' అనగానే నటన మొదలైనట్టు.. రకరకాల పోజుల్లో వీడియో వారి సమక్షం లో స్వాగతం చెప్పారు. వెండి పూల మాలలు వేసి ఎర్ర కార్పెట్ మీద పెళ్ళి కుమారుడిని తీసుకెళ్ళి యేసీ గదుల్లో కూర్చోపెట్టి.. మర్యాదలు చేసారు.


4 రకాల ఐటంలతో ఉపాహారం! వాతావరణం చాలా రిచ్ గా నాలాంటివాళ్ళకి కాస్త బెరుగ్గా.. బఫే కావటం తో ముసలివారికి తెచ్చి మేమూ తెచ్చుక్కూర్చున్నాం. ఆడపెళ్ళివారొక గది లో మేమొక గదిలో ఉండిపోయాం. పిల్లలూ మొహమాటం గా సెల్ ఫోన్ లో ఆటలు ఆడుతూ కూర్చున్నారు.

చాలా కాలం తర్వాత కలిసిన చుట్టాలు పలకరించుకున్నారు. పెళ్ళి కూతురిని పలకరించి వద్దామంటే.. మేకప్పట.. ఎవ్వర్నీ రానివ్వటం లేదు.

పెళ్ళి కూతురు నగల షాప్ లా.. వచ్చింది. వేదిక పూల డెకరేషన్ ట.. 85 వేలయ్యింది అని చెప్పారు చాలా అందం గా ఉంది. అర్థరాత్రి పెళ్ళని పెళ్ళికి ముందే రిసెప్షన్. స్టేజ్ మీద పరిచయం..'హాయ్.. ' అని, ఇంకా ఒక ఫొటో.. అయిపోయింది. దిగి వచ్చాక ఒకటే తుమ్ములు. పూల మీద చల్లిన సెంట్ వల్ల అని అర్థమయింది.

ఎర్రటి మినీ స్కర్ట్, తెల్లటి స్టాకింగులేసుకుని ఫుల్ మేకప్ తో అమ్మాయిలు, వెనక ఎర్రటి పాంటూ,షర్టూ వేసుకుని ట్రేలలో రకరకాల ఫింగర్ ఫుడ్ టూత్ పిక్ లతో గుచ్చి 'సర్వ్' చేసారు. కబాబులు, స్వీట్లు, మంచూరియన్ కూరలు,..ఒకటేమిటి.. 'వద్దు వద్దు ' అని చెప్పటమే సరిపోయింది. ఒకపక్క చాక్లేట్ ఫవుంటెన్.. ఇంకో పక్క చాట్ స్టాల్, మరో పక్క థాయ్ వంటకాల స్టాల్, 20 రకాల స్వీట్ల సెంటర్, పళ్ళ కార్నర్, నార్త్ వంటకాల స్టాల్స్, టిఫిన్ల కౌంటర్లు, మరో పక్క అన్నం, పప్పు, ఆవకాయ,గోంగూర, పులుసులు, పులిహారల లాంటి తెలుగు వంటకాల స్టాళ్ళు..

ఏ ఇద్దరు మాట్లాడుకుంటున్నా మధ్యలో దూరి సర్వ్ చేస్తామని విసిగించే ఎర్ర స్కర్ట్ అమ్మాయిలు.

అన్నీ అమరినా ఏదో వెలితి. ఏక్కడో అసంతృప్తి.. అందరూ, గబ గబా తినేసి ఇళ్ళకెళ్ళాలనే ఆతృత తో కొట్టుకుపోతున్నారు. వెయ్యి మంది మనుషులు!

మధుపర్కాలు పెట్టగా.. పెళ్ళికూతురు.. 'ఆంటీ.. ఐ విల్ కంటిన్యూ విత్ దిస్ .. ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ' ' అనేసింది. మరి 30 వేల పట్టు చీర కట్టుకుంది.. ఆరు వందల మధుపర్కాలు కట్టుకుంటే.. ఏం బాగుంటుంది? ' అన్న భావం అనుకుంటా.

తలంబ్రాలకి నిజం ముత్యాలు తెప్పించారు. రంగు రంగుల పూసలు.. మేము సరదాగా ఎగదోద్దాం మా తమ్ముడిని.. తలంబ్రాల ఆట లో గెలిపిద్దాం అనుకుంటే..వారికి ఫొటోలకి పోజులివ్వటం తోనూ..మమ్మల్ని వీడియోవారికి అడ్డం రాకుండా మానేజ్ చేసుకోవటం తోనే సరిపోయింది :-)

ఇలా పెళ్ళి అయిందో లేదో.. తర్వాతి పెళ్ళివారట.. వచ్చేస్తారట. దానితో.. పూల కుండీలూ అవీ తీసేస్తున్నారు. మేమూ.. మా నగలూ అవీ తీసేయటం మొదలు పెట్టాం.

కార్లు వచ్చేసాయి.. పదండి పదండి అని తొందర పెట్టగా.. వచ్చేస్తూ ఉండగా తట్టింది.. కనీసం.. పెళ్ళికూతురికి కానీ.. వాళ్ళ తరఫు వారికి ఎవ్వరికీ మన పరిచయమే అవలేదని.. మరి మా పిన్ని అత్తగారి వాళ్ళు మాకు ఎంత దగ్గరంటే.. ఈరోజు కూడా పిన్ని పెళ్ళి లో ఏర్పడిన బాంధవ్యం తో.. పిన్ని కి తెలియకుండానే కూడా చాలా సార్లు ఫోన్లు, ఫేస్ బుక్కులూ, అలా ..

అయినా.. ముప్ఫై యేళ్ళ క్రితం జరిగిన పెళ్ళిని కంపేర్ చేస్తున్నానంటే.. హ్మ్మ్. ఆలోచించాల్సిన విషయం. నేను కూడా.. 'మా కాలం లో నా.. ఇలా కాదమ్మా..పెళ్ళిళ్ళు ఎంత బాగా జరిగేవనీ.. ' అనే మా మేనత్తగారిలా తయారవుతున్నానా? ఏమో?
 
;