Thursday, July 8, 2010

పిన్ని పెళ్లి - పిన్ని కొడుకు పెళ్లి..

పెంకుటింట్లో ఎనభైల్లో పిన్ని పెళ్ళి..

అప్పుడు చాలా చిన్నవాళ్ళం.. పిన్ని పెళ్ళంటే.. 'అలాగా' అనుకున్నాం. పెళ్ళికి మనం వెళ్ళాలి అంటే.. 'అబ్బా విసుగు ' అనుకున్నాం. స్కూల్ డుమ్మా కొట్టి వెళ్ళాలి, అదీ 10 రోజులకి అనగానే పులకరించిపోయాం. జరిగేది అమ్మమ్మ గారింట్లో అనగానే 'హుర్రే' అనుకున్నాం.. (ఆ రోజుల్లో 'వావ్ ' ప్రయోగం తక్కువే కదండీ!)

వేసవి సెలవలకి తప్ప, సంవత్సరం మధ్యలో అమ్మమ్మ గారింటికెళ్ళటం, .. అందునా.. స్కూల్ మాని అంటే, ఎవరికి ఉత్సాహం ఉండదు చెప్పండి? మాకున్నవే 3 మంచి జతలు... మా అమ్మ తనకున్న 2 పట్టుచీరలూ, ఒక జరీ చీరని మళ్ళీ ఇస్త్రీ చేసి వారం ముందే పెట్టె లో పెట్టేసాం. కలరా ఉండ ఒకటి వేసి పెట్టె చూసుకుని చూసుకుని మురిసి ముక్కలయ్యాం.

బజార్ కెళ్ళి పెళ్ళి లో ఇవ్వటానికి మా పిన్నులకీ, పిల్లలకీ ఏవో పిన్నులూ, రబ్బర్ బాండ్లూ, రంగు రంగుల సిల్క్ రిబ్బన్లూ కొంది మా అమ్మ. అవి చూసుకుని ఏ రంగు ఎవరు తీసుకుంటారో అని ఆలోచిస్తూ ఆవారం అంతా గడిపేశాం. పాండ్స్ పౌడరూ, కాటుక్కాయా, తిలకం, పూసల గొలుసులూ, సంచీ లో పెట్టుకుని,..ముందు గది లో పెట్టుకుని,..క్లాస్ పిల్లల దగ్గర్నించి, పాలబ్బాయి దాకా అందర్నీ వివరాలతో ఊదరకొట్టాం.

అంతగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. నాలు గిన్నెల కారియర్ లో చింతకాయ పచ్చడన్నం, ఆవకాయ,పెరుగు, జంతికలు,సున్నుండలూ.. లాంటివి తీసుకుని.. ఎక్కేశాం గోదావరి ఎక్స్ ప్రెస్. 10 రోజుల ముందే అమ్మమ్మ గారింట్లో చేరిన వాళ్ళు 20 మందైనా ఉంటారు.

పసుపు దంచటం, తీపి పదార్థాలూ, పిండి వంటలూ చేసి తాటాకు బుట్టల్లోకెత్తటం,.. మంగళ సూత్రం తాడు పేనడం, కొత్త తుంగ చాపలు, విసెన కఱ్ఱలు,...తయారు చేసుకోవటం, పేడ తో ఇల్లలకటం, విస్తళ్ళు కుట్టుకోవటం..లాంటివి ఒక ఎత్తైతే.. ఇందరికి వంటలు, పెండ్లి పిలుపులు, ఇంకో ఎత్తు.

రెండు వసారాల మధ్యనున్న నేల ని కూడా శుభ్రం గా అలికి, బియ్యప్పిండి తో ముగ్గులు పెట్టి,.. అతిథులు కూర్చోవటానికి తాటాకు పందిరీ,. దూలాలూ, పచ్చి కొబ్బరాకులూ వాడి పెళ్ళి పందిరి వేయటం.. అబ్బా..ఆ వాసన ఇప్పటికీ గుర్తే!

ఇక పెద్దల పాటలు, పద్యాలు, పేకాటలు, పిల్లల పరుగులు, ఆటలు,.. ఒక్కరొక్కరిగా వస్తున్న చుట్టాలని అందరూ వచ్చి సామాన్లు దింపుకుని, ఆప్యాయంగా లోపలికి తీసుకెళ్ళటం. కబుర్లలో పడటం.. వేన్నీళ్ళ పొయ్యిల దగ్గర కొందరు, కూరగాయలు తరిగేవారు కొందరు, వంటలు కొందరు, ఆజమాయిషీ కొందరు.. పిల్లలకి తలంట్లు కొందరు, బట్టలు ఉతికేవారు కొందరు.. ఏం చేసుకుంటున్నా.. పరాచకాలు, ఎత్తిపొడుపులు, నవ్వులాటలు..వేళాకోళాలు, విసుర్లు, ఏడిపించటాలు.. ఇలాగ..

మగ పెళ్ళి వారొచ్చాక ఇంకో హడావిడి వారి విడిది దగ్గర .. అలకలూ, చెమటలు కక్కుతూ, అటూ ఇటూ ఉరుకులూ, పరుగులూ కాఫీలు, టిఫిన్లు, పెళ్ళికూతురి తరఫు వారు స్వయంగా విసురుతూ వడ్డించటం..

పెద్దవారెక్కడెక్కడ ఏం చేసే వారో తెలియదు కానీ.. , ఆ కోలాహలం.. మగపెళ్ళి వారిని ఏదో శతృ కూటమి వారన్నట్టు చూడటం.. వారిమీద గూఢచర్యం చేయటం.. పెళ్ళి కొడుకుని కిటికీల్లోంచి సీక్రెట్ గా చూడటం..పెళ్ళికొడుక్కి కొరియర్ సర్వీస్ చేసి పెట్టడం లాంటివి ఎంత ఆస్వాదించామో.. ఇప్పటికీ మా బాబాయిగారిని చూస్తే.. ఈయన్నా.. మేము అంత లా 3 రోజుల పెళ్ళిలో 'ఆరాధించింది ' అనిపిస్తుంది.

బంతిపూల మాలలూ,మామిడాకుల తోరణాలు, గాజులేయించుకోవటాలూ, గోరింటాకులూ, గాడి పొయ్యి మీద వండిన పెళ్ళి భోజనం పంక్తి లో కుటుంబ సభ్యులే కొసరి కొసరి వడ్డించటం.. లాంటివి గుర్తుకొస్తే.. ఇంకా ఆ టేస్ట్ గుర్తుకొచ్చి నోరూరుతుంది.

అమ్మాయికి మంగళ సూత్రం, చెవికి బుట్టలూ, పెండ్లి కుమారునికి ఒక ఉంగరం చేయించి చేతులెత్తేసారు మా తాతగారు. పెళ్ళి కూతురికి అక్కలూ, వదినెలూ తమ గొలుసులని వేయగా.. కల్యాణ తిలకం, బుగ్గన చుక్కా, గాజు గాజులతో, చేమంతుల తో వేసిన పూలజడా, పసుపు నీటిలో ముంచిన మధుపర్కాలలో, పసుపు, సున్ని పిండిలతో కడిగిన మొహం ఎంత కళగా ఉన్నదో ఇప్పటికీ మాకు గుర్తే.. తర్వాతెప్పుడో పదేళ్ళతర్వాత వెండి కంచం చేయించారని విన్నాను.

అలాగ పెళ్ళయి ఎడ్ల బండి లో ఊరేగింపుగా ఊరు దాటి అత్తవారింటికెళ్ళిపోయిన మా పిన్ని ఢిల్లీ లో సెటిల్ అయిపోయింది.. పెళ్ళిలో వాడిన వస్తువులన్నీ ఆర్గానిక్ అవటం వల్ల మట్టిలో కలిసిపోయాయి. కానీ ఆ పెళ్ళి అనుభూతులు మాత్రం మాతో తాజా గానే ఉండిపోయాయి.

అదే పిన్ని కొడుకు పెళ్ళి 2010 లో అదే నిన్ననే ..

మా పిన్ని కొడుకు పెళ్ళి అమెరికా లో phD చేసి వచ్చాడు. కుటుంబానికి ఒక్కరిద్దరం వెళ్ళాం.. 10 రోజుల ముందు కాదనుకోండి.. ఎన్ని పనులు.. అసలే రెండో క్లాస్ మా అమ్మాయి. ఇప్పట్నించీ కష్టపడకపోతే ఎలా? ఆఫీస్ లో డెడ్ లైన్లు.. ' పెళ్ళికొడుకు తో పాటూ రండే మీరు..' అని మా పిన్ని అడిగిందని వాడి వెనక కార్ లో బయల్దేరాం. రాష్ట్ర రాజధాని లో ఒక పెద్ద రెసార్ట్/ గార్డెన్లలో పెళ్ళి. అద్దె పూట కి రెండు లక్షల నలభై వేలట!!! అందుకని ఒకటే పూట కి రమ్మన్నారు ఆడ పెళ్ళి వారు.

పెళ్ళి కార్ ఆగగానే.. ఆడ పెళ్ళివారు వచ్చేసారు. వెండి పళ్ళాలతో హారతి ఇవ్వటానికి. పైన్నుంచి కిందకి నగలతో మెరిసిపోతూ,.. 30 వేల పట్టు చీరలట.. ధగధగ లాడుతున్నారు ఆడవారు. ఉత్సాహం గా దిగిన మమ్మల్నందర్నీ.. 'కాస్త అసింట జరగండని ' 'ఏక్షన్!! ' అనగానే నటన మొదలైనట్టు.. రకరకాల పోజుల్లో వీడియో వారి సమక్షం లో స్వాగతం చెప్పారు. వెండి పూల మాలలు వేసి ఎర్ర కార్పెట్ మీద పెళ్ళి కుమారుడిని తీసుకెళ్ళి యేసీ గదుల్లో కూర్చోపెట్టి.. మర్యాదలు చేసారు.


4 రకాల ఐటంలతో ఉపాహారం! వాతావరణం చాలా రిచ్ గా నాలాంటివాళ్ళకి కాస్త బెరుగ్గా.. బఫే కావటం తో ముసలివారికి తెచ్చి మేమూ తెచ్చుక్కూర్చున్నాం. ఆడపెళ్ళివారొక గది లో మేమొక గదిలో ఉండిపోయాం. పిల్లలూ మొహమాటం గా సెల్ ఫోన్ లో ఆటలు ఆడుతూ కూర్చున్నారు.

చాలా కాలం తర్వాత కలిసిన చుట్టాలు పలకరించుకున్నారు. పెళ్ళి కూతురిని పలకరించి వద్దామంటే.. మేకప్పట.. ఎవ్వర్నీ రానివ్వటం లేదు.

పెళ్ళి కూతురు నగల షాప్ లా.. వచ్చింది. వేదిక పూల డెకరేషన్ ట.. 85 వేలయ్యింది అని చెప్పారు చాలా అందం గా ఉంది. అర్థరాత్రి పెళ్ళని పెళ్ళికి ముందే రిసెప్షన్. స్టేజ్ మీద పరిచయం..'హాయ్.. ' అని, ఇంకా ఒక ఫొటో.. అయిపోయింది. దిగి వచ్చాక ఒకటే తుమ్ములు. పూల మీద చల్లిన సెంట్ వల్ల అని అర్థమయింది.

ఎర్రటి మినీ స్కర్ట్, తెల్లటి స్టాకింగులేసుకుని ఫుల్ మేకప్ తో అమ్మాయిలు, వెనక ఎర్రటి పాంటూ,షర్టూ వేసుకుని ట్రేలలో రకరకాల ఫింగర్ ఫుడ్ టూత్ పిక్ లతో గుచ్చి 'సర్వ్' చేసారు. కబాబులు, స్వీట్లు, మంచూరియన్ కూరలు,..ఒకటేమిటి.. 'వద్దు వద్దు ' అని చెప్పటమే సరిపోయింది. ఒకపక్క చాక్లేట్ ఫవుంటెన్.. ఇంకో పక్క చాట్ స్టాల్, మరో పక్క థాయ్ వంటకాల స్టాల్, 20 రకాల స్వీట్ల సెంటర్, పళ్ళ కార్నర్, నార్త్ వంటకాల స్టాల్స్, టిఫిన్ల కౌంటర్లు, మరో పక్క అన్నం, పప్పు, ఆవకాయ,గోంగూర, పులుసులు, పులిహారల లాంటి తెలుగు వంటకాల స్టాళ్ళు..

ఏ ఇద్దరు మాట్లాడుకుంటున్నా మధ్యలో దూరి సర్వ్ చేస్తామని విసిగించే ఎర్ర స్కర్ట్ అమ్మాయిలు.

అన్నీ అమరినా ఏదో వెలితి. ఏక్కడో అసంతృప్తి.. అందరూ, గబ గబా తినేసి ఇళ్ళకెళ్ళాలనే ఆతృత తో కొట్టుకుపోతున్నారు. వెయ్యి మంది మనుషులు!

మధుపర్కాలు పెట్టగా.. పెళ్ళికూతురు.. 'ఆంటీ.. ఐ విల్ కంటిన్యూ విత్ దిస్ .. ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ' ' అనేసింది. మరి 30 వేల పట్టు చీర కట్టుకుంది.. ఆరు వందల మధుపర్కాలు కట్టుకుంటే.. ఏం బాగుంటుంది? ' అన్న భావం అనుకుంటా.

తలంబ్రాలకి నిజం ముత్యాలు తెప్పించారు. రంగు రంగుల పూసలు.. మేము సరదాగా ఎగదోద్దాం మా తమ్ముడిని.. తలంబ్రాల ఆట లో గెలిపిద్దాం అనుకుంటే..వారికి ఫొటోలకి పోజులివ్వటం తోనూ..మమ్మల్ని వీడియోవారికి అడ్డం రాకుండా మానేజ్ చేసుకోవటం తోనే సరిపోయింది :-)

ఇలా పెళ్ళి అయిందో లేదో.. తర్వాతి పెళ్ళివారట.. వచ్చేస్తారట. దానితో.. పూల కుండీలూ అవీ తీసేస్తున్నారు. మేమూ.. మా నగలూ అవీ తీసేయటం మొదలు పెట్టాం.

కార్లు వచ్చేసాయి.. పదండి పదండి అని తొందర పెట్టగా.. వచ్చేస్తూ ఉండగా తట్టింది.. కనీసం.. పెళ్ళికూతురికి కానీ.. వాళ్ళ తరఫు వారికి ఎవ్వరికీ మన పరిచయమే అవలేదని.. మరి మా పిన్ని అత్తగారి వాళ్ళు మాకు ఎంత దగ్గరంటే.. ఈరోజు కూడా పిన్ని పెళ్ళి లో ఏర్పడిన బాంధవ్యం తో.. పిన్ని కి తెలియకుండానే కూడా చాలా సార్లు ఫోన్లు, ఫేస్ బుక్కులూ, అలా ..

అయినా.. ముప్ఫై యేళ్ళ క్రితం జరిగిన పెళ్ళిని కంపేర్ చేస్తున్నానంటే.. హ్మ్మ్. ఆలోచించాల్సిన విషయం. నేను కూడా.. 'మా కాలం లో నా.. ఇలా కాదమ్మా..పెళ్ళిళ్ళు ఎంత బాగా జరిగేవనీ.. ' అనే మా మేనత్తగారిలా తయారవుతున్నానా? ఏమో?

20 comments:

voleti said...

we are also feeling the same while attending the marriages now a days.. but we can't do anything in this speed yugam.. vachaama.. ichaama (shakehand) .. tinnaamaa.. thatsall.. No chadivimpulu also..

Praveena said...

Krishnapriya, ee post chala baagundi.No post can compete with this one,especially mee pinni pelli description superb !!!

కృష్ణప్రియ said...

@వోలేటి,

అవును. స్పీడ్ యుగం.. కానీ అనవసర ఆర్భాటాలు,ఆడంబరాలు, వేలాది మందిని పిలవటం, బోల్డు వేస్టేజ్, వందల కొద్దీ తిండి పదార్థాలూ, ఘనమైన రిటర్న్ గిఫ్టులూ,..ఒక చల్లని పలకరింపు ముందు దిగదుడుపేనని...

@ప్రవీణ,

ధన్యవాదాలు! నిన్ననే పెళ్ళి కెళ్ళి వచ్చా :-)

కృతజ్ఞతలతో
కృష్ణప్రియ/

హరే కృష్ణ said...

మా ఢిల్లీ లో జరిగిందా ఎక్కడ.. ఎక్కడ జరిగింది ?
ఒక చల్లని పలకరింపు ముందు దిగదుడుపేనని
excellent

మా అభిమాన రచయిత్రి మీరే

Srinivas said...

పెళ్లయిపోయినా ఊడపీకని పచ్చి తాటాకుల పందిరిలా కనీసం మనకు ఆ జ్ఞాపకాలన్నా ఉన్నాయి, ఉంటాయి. హడావుడిలో ఏం జారవిడుచుకుంటున్నామో తెలియని రోజులొచ్చాయి. స్థాయీప్రదర్శనే తప్ప ఆప్యాయత కనపడదీ వేదికలపైన. వీడియో కోసం పెళ్ళిలా తయారయింది ఇప్పుడు.

భావన said...

ఏమి చెప్పేరండి.. .తిరుగు లేదు... తేడా ను కళ్ళకు కట్టినట్లు చూపించేరు.. ఏం చేస్తాము చెప్పండి మరి.... నగరాలలో పల్లెల్లో చేసినట్లు తీరిక గా చెయ్యలేక పోయినా ఈ ఫుడ్ వేస్టేజ్, ఈ పూల ఆర్భాటాలు ఈ వీడియోల గోలలు వాటిలో తల మునకలయ్యే పిల్లలు పెద్దలు, అబ్బ ఎంత బాగా పెళ్ళి చేసేరో అని నా బోటమ్మ చెప్పుకోవటం... తప్పని ఒక తంతు (పెళ్ళి తంతు లో భాగాలే అనుకోండి) :-). ఆధునీకరణ అందులోని భాగం గా వచ్చేసిన పోకడలు మరి ఏం చేస్తాం.

కృష్ణప్రియ said...

హరే కృష్ణ,

ధన్యవాదాలు! పెళ్ళి భాగ్యనగరం లో జరిగింది. ఏవో రాయల్ గార్డెన్లలో..

'రచయిత్రి ' అనేంత లేదు లెండి.. ఏవో నా ఎక్స్ పీరియన్సులు రాయటం .. మీకు నచ్చటం నా అదృష్టం!

కృష్ణప్రియ/

కృష్ణప్రియ said...

@ శ్రీనివాస్, భావన,

ధన్యవాదాలు! అవును.. స్థాయీ ప్రదర్శన ఎంత అలవాటైపోయిందంటే.. మనకి కూడా ఆ ఆర్భాటాలు లేకుండా పెళ్ళిళ్ళు అయితే..' ఏదో తూ తూ మంత్రం చేయించేసారు. బాగా పిసినారుల్లా ఉన్నారు ' అని అనుకోవటం ..

నిన్న పెళ్ళిలో పక్కవారి తో పలకరింపైనా కుదరనీయకుండా డీ జే మ్యూజిక్కు ట. చెవుల తుప్పు వదిలిపోయింది.

కింగ్ ఫిషర్ ఫ్లైట్ లో ప్రయాణానికి కూర్చున్నట్టు అనిపించింది :-) ఆ సర్వ్ చేసే అమ్మాయిల మొహం లో ప్రసన్నత మచ్చుకైనా కాన రాలేదు. కాస్త నవ్వు ముఖం పెడితే.. వాళ్ళకి పాపం ఏమి వేధింపుల బారీ పడతారనేమో.. వాళ్ళ కష్టాలు వారివి.

కృష్ణప్రియ/

divya vani said...

బాగా రాసారు క్రిష్ణప్రియ గారు ,మా పిన్ని పెళ్ళి గుర్తుకు వచ్చింది.,మీ పిన్ని పెళ్ళిలాగానె జరిగింది

కృష్ణప్రియ said...

ధన్యవాదాలు దివ్య వాణి గారూ,

ఆరోజుల్లో పల్లెల్లో మధ్యతరగతి కుటుంబాల్లో పెళ్ళిళ్ళన్నీ ఇంచుమించు ఇలాగే జరిగాయేమో!

కృష్ణప్రియ/

విరజాజి said...

అయ్యో ! అప్పటి పెళ్ళిళ్ళకీ, ఇప్పటి పెళ్ళిళ్ళకీ నక్కకీ నాగలోగానికీ ఉన్నంత తేడా ఉంది! మొన్ననే మా కొలీగ్ కూతురి పెళ్ళికి వెళ్ళాము - పెళ్ళికొడుకు వాళ్ళు తప్పనిసరిగా స్టార్ హోటల్ లోనే పెళ్ళి చేయమన్నారట! అందుకని తప్పనిసరిగా హోటల్ లోనే చేసారు - చివరికి చుట్టాలు కూడా ఇంటికి రాకుండా నేరుగా హోటల్ కే వచ్చారు. అన్నీ యాంత్రికం అయ్యాయి - పెళ్ళి కూడా చివరికి అంతే!

Sravya V said...

ముత్యాలముగ్గు , వరుడు సినిమాలు ఒకటే ఫ్రేం లో చూసిన ఫీలింగ్ వచ్చింది మీ పోస్టు చదివితే , అలా ఎందుకూ అంటే ఏమో తెలియదు :)

..nagarjuna.. said...

చిన్నపుడు మా పిన్ని పెళ్లికూడా మీ పిన్ని పెళ్లి క్రతువులాగే అయింది. వంటలు, పందిరి అలంకరించడం,మగపెళ్ళివారి కోసం ఎదురుచూడటం, పెళ్ళి అయ్యాక మా వయసే ఉన్నా మావయ్యతో పందిరిమీద ఆడుకోవడం, పెళ్ళి తరువాత బాబాయికి 10 పైసల పిప్పరమెంటుని కేజి పేపర్లలో కట్టిఇవ్వడము..ఎంత బాగుండిందో!!

సూట్‌కేసులో కలరాఉండ (డాంబర్‌‍ గోళీ అనేవాళ్లం మేం).... hmm, im feeling nostalgic .
మీ పిన్ని కొడుకు పెళ్ళి వర్ణణ చూసాక (చదివాక) నేనో ఘ్ఘా...ట్టి నిర్ణయానికొచ్చేసా...prestige సమస్య అన్నా సరే నా పెళ్ళి మాత్ర్రం పిల్ల ఇంట్లోనే కనీసం ఓ ఫుల్ డే జరిపించాలని కాబోయే మామాగారికి కండిషన్ పెడతా :D నేను హ్యాపిసు, పెళ్ళికొచ్చినవాళ్లకు తీపిగురుతులు ఉంటాయ్

చిన్న డౌటు...,‘మధుపర్కాలు’ అంటే ?

కృష్ణప్రియ said...

@విరజాజి, నిజమే!
@శ్రావ్య, :-)

@ నాగార్జున,
మధుపర్కాలు అంటే.. నాకూ కరెక్ట్ గా తెలియదు..(అర్థం గట్రా..) కానీ.. జీలకర్ర, బెల్లం తంతు తర్వాత, వధువు పట్టుచీర విడచి, పసుపు లో ముంచిన తెల్లని నూలు చీర ధరించి, దీపాలూ అవీ పట్టుకుని వస్తుంది పెళ్ళి పీటలమీదకి. ఇంకొక కండువా లాంటి పై బట్ట ని క్రాస్ గా వేసుకుంటారు కూడా.. వాటినే మధుపర్కాలు అంటారని అనుకుంటున్నా.. అదే అర్థం లో వాడాను.
I could be completely wrong too :-)

కృష్ణప్రియ/

కొత్త పాళీ said...

మీరు బ్లాగు మొదలెట్టి మొదటి రెండు మూడు టపాలు చదవగానేనే అనుకున్నా, మీరు సామాన్యమైన రచయిత కాదని. ఆ అంచనా వమ్ము చెయ్యకుండా కొనసాగిస్తున్నారు. చాలా సంతోషం. ఈ టపా అద్భుతంగా రాసారు అని చెప్పడం అల్పోక్తి (అతిశయోక్తికి ఆపోజిట్)!

అస్సలుకి మధుపర్కం అంటే తేనె పెరుగు కలిసిన మిశ్రమం. కన్యాదానం చేసే ముందు వధువు తండ్రి వరునికి చేతిలో ఈ మిశ్రమాన్ని మూడు సార్లు తీర్ధం ఇచ్చినట్టు ఇచ్చి, స్వీకరించమని కోరగా, స్వీకరిస్తున్నాను అంటూ వరుడు పుచ్చుకుంటాడు. ఇది వైదిక సాంప్రదాయాన్ని అనుసరించే అన్ని పెళ్ళిళ్ళలోనూ జరుగుతుంది.

వాడుకలో, మధుపర్కాలు అని జరీ అంచున్న తెల్ల వస్త్రం కానీ, పసుపులో ముంచిన తెల్ల వస్త్రం కానీ వధూవరులిద్దరికీ కట్టడం తెలుగు వారిలోనే చూశాను. సాధారణంగా ఎర్ర అంచున్న వస్త్రాల్ని వాడతారు. బట్టల్లో, ధారణలో, ఇతర వాడుక విషయాల్లో మండలాన్ని బట్టి, కుల శాఖల్ని బట్టి తేడాలున్నాయి.

కృష్ణప్రియ said...

కొత్తపాళీ గారికి,
మీ స్పూర్థిదాయకమైన వ్యాఖ్యలకి ధన్యవాదాలు! 'రచయిత ' అన్నంత పెద్ద పదం వర్తించదేమో నాకు. ఏదో చిన్న డిస్క్రి ప్షన్లు, నారేషన్లు రాయటం మాత్రం కొద్దిగా అబ్బుతోంది బ్లాగు రాయటం మొదలు పెట్టిన దగ్గర్నించీ.

మొదటి టపాలతో పొలిస్తే.. ఆంగ్ల పదాల వినియోగం కాస్త తగ్గినట్టనిపిస్తుంది కూడా.
వాడుక భాషలో కూడా 'వాకింగ్ కి వెళ్దామా? ' లాంటి వాక్యాలు మాని 'నడకకి వస్తారా ? ' లాంటివి వచ్చాయని. మా కుటుంబ సభ్యులు చెప్తున్నారు :-) మా ఆరేళ్ళ అమ్మాయి కూడా.. ఈరోజు 'పొద్దున్నే చదువూ, సంధ్యా అంటూ నా వెంట బడకు! శనివారం..నన్ను కాస్త ఆడుకోనీయి ' అంది. అదే నాలుగైదు నెలల క్రితం.. పూర్తిగా ఆంగ్లమే వాడేది.

కృష్ణప్రియ/

మాలా కుమార్ said...

క్రిష్ణప్రియ గారు ,
చాలా బాగా రాసారండి . నిజం గానే ఈకాలం పెళ్ళిళ్ళకి వెళ్ళి రావటమంటే ఏదో కొత్త సినిమాకు క్యూ లో నిలబడి వెళ్ళి వచ్చినట్లే వుంటోంది .

సవ్వడి said...

కృష్ణ ప్రియ గారు! రెండు పెళ్లిల్లకి తేడాని చాలా బాగా చెప్పారు. అప్పటి రూజులే మంచివి.

కృష్ణప్రియ said...

మాల గారూ, సవ్వడి గారూ,
ధన్యవాదాలు!
కృష్ణప్రియ/

Chandu S said...

మొదటి సగమంతా ఉల్లాసంగా చదివాను, రెండో సగం చదివిన తర్వాత ఉల్లాసం సగమై, నీరసం వచ్చింది. తలంబ్రాలకు నిజం ముత్యాలా? హూ.

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;