Monday, August 23, 2010

జాతస్య మరణం ద్రువం..


" పక్కింట్లో ముసలావిడ నాలుగు రోజులయ్యింది కనిపించట్లేదు. రోజూ ఎండకి బాల్కనీ లో కనిపించేది కుర్చీలో కూర్చుని ఏవో చదువుకుంటూ.. 'ఏదో ఊరెళ్ళి ఉంటుంది అనుకున్నాను.  ఇవ్వాళ్ళే తెలిసింది ఆవిడ పోయిందని!! ఇంట్లోనే ఉన్నాను.. నాకస్సలు తెలియనే లేదు,. అసలు ఎప్పుడు తీసుకెళ్ళారో.. ఎవరొచ్చారో ఏం చేసారో తెలియను కూడా లేదు " అని మా ఫ్రెండ్ బాధ పడుతూ చెప్పింది మొన్నీ మధ్య ఫోన్ లో.

తర్వాత పలకరింపు కని వెళ్ళిందిట .. 'నా చాదస్తం నాది కాని అసలు వాళ్ళు ఏమీ జరగనట్టున్నారు. టీ వీ లో ఏదో ప్రోగ్రాం చూస్తూ.. ఎప్పుడెళ్ళిపోతానా అన్నట్టు మొహాలు పెట్టారు... ఆవిడ కి రొప్పు వస్తే.. హాస్పిటల్ కి తీసుకెళ్ళారట. అక్కడ ఎడ్మిట్ చేసాక 2-3 గంటల్లో పోయారట. మిగిలిన పిల్లలేమో అమెరికాల్లో, ఆస్ట్రేలియాల్లో ఉన్నారట. ఫోన్లు చేస్తే మేము రాలేము..నెమ్మదిగా వస్తాం పదకొండోరోజుకి వీలుంటే.. మీరు కానిచ్చేయండి అన్నారట. ఇంక ఇంటికి తీసుకుని రావటమెందుకని.. అక్కడ్నించే ఎలెక్ట్రిక్ దహనానికి తీసుకెళ్ళి స్నానాలు చేసి వచ్చేసారట ' .. పక్కింటివాళ్ళం ఉన్నాం కనీసం మాకు చెప్పాలని కూడా అనిపించలేదు వాళ్ళకి చూడు కృష్ణా! ' అంది.

నన్నైతే ఆలోచింపచేసింది ఈ విషయం. మా ఇంటి దగ్గర కూడా ఒక 90 దాటిన ముసలావిడ మంచానికి పరిమితమై ఉన్నారు. కొడుకూ, కోడలూ, మనవడి కుటుంబం తో ఉన్నారావిడ. కోడలికే 70 దాటాయి. కూతురికీ అంతే. వారూ పరాధీన లయ్యారు. కాకపోతే రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బు తో కొడుకు మంచి ఇల్లు కొనటం తో ఆవిడ కి ప్రత్యేకం గా ఒక గది, తదితర సదుపాయాలు అమర్చ గలిగారు.  పెద్దావిడ కి ఇంకో కొడుకు ఉన్నా.. ఆయన ముంబై లో ఎక్కడో పదో అంతస్థు లో చిన్న ఫ్లాట్ లో ఉండటం మూలాన ఆయన నా వల్ల కాదు అమ్మని చూడటం అనేసారు.  కూతురేమో ఇద్దరన్నదమ్ములున్నారు వాళ్ళే చూసుకోవాలి అని నోరు మెదపకుండా ఊరుకుంది.

పెద్దావిడ వల్ల కుటుంబం లో విబేధాలు.. చాలా పెద్ద లెవెల్లో .. పెద్ద కోడలు పెద్ద కసిగా.. దానికి మూడు రెట్ల కసి గా సదరు కోడలుగారి కోడలు..  ఎవరితో మాట్లాడినా వారి వైపే న్యాయం ఉందనిపిస్తుంది. అంత కన్నా వారేం చేయగలరు అని అనిపిస్తుంది కానీ నలిగిపోతుంది మాత్రం జీవన చరమాంకం లో ఉన్న ఆ వృద్ధురాలు. వారు ఆక్రోశం తో ఆవిడ తో మాట్లాడరు. మనం వెళ్ళి మాట్లాడినా 'అదిగో.. ముసలావిడ ఏం చాడీలు చెప్తున్నారో నని ఒక కన్నేసి ఉండటం.  ఒక్కోసారి అలాంటి జీవితం కన్నా జైలు జీవితం నయమేమోననిపిస్తుంది. ఆడపడచు ఊళ్ళో ఉండి కూడా రాదని ఈ కుటుంబానికి కోపం. ఆవిడేమో గుండె జబ్బు తో 2 పెద్దాపరేషన్లు చేసుకుని ఏదో ఈడిస్తున్నారు. 70 యేళ్ళ వయసు, భర్త లేడు. కొడుకు వద్ద ఉన్నప్పుడు తన తల్లిని తెచ్చుకుని పెట్టుకోలేని నిస్సహాయురాలు. ఆవిడ కొడుకేమో 'నేను తల్లిదండ్రుల, అత్త మామల బాధ్యత తీసుకున్నాను. అమ్మమ్మ బాధ్యత కూడా ఎలా తీసుకోను? అని..


                                                వైద్యులు ఇంకో వారం కన్నా బతరని చెప్పాక ఇంటికి తెచ్చారు ఆవిడని. ఆరోజు ఆవిడ మనవడి భార్య కనపడింది.. 'నేను మా పుట్టింటికి వెళ్తున్నాను. మళ్ళీ పదో రోజయ్యాక వస్తాను. నా పాప చిన్నది .. చూసి భయపడుతుంది..' అంది. 'ఒహ్ మీ అత్తగారికి మరి సహాయం అవసరమేమో? ' అంటే.. 'ఉన్నారు గా ఆవిడ తోటికోడల్నో, ఆడపడచునో తెప్పించుకుంటుంది.. మా అమ్మా వాళ్ళొచ్చి మా ఇన్ లాస్ ని పలకరించి, నన్నూ, పాపనీ తీసుకెళ్ళిపోతారు.' అంది.

'బాబోయ్.. ఇంకా ఆవిడ బతికుండగానే.. వీళ్ళు పలకరించటానికి రావటం, గుండిగలు మోయక్కరలేదుగా.. కాస్త చేదోడు వాదోడు గా ఉంటే బాగుండే సమయం లో బాధ్యత నుండి తప్పుకుని వెళ్ళిపోతున్న ఈ తరం అమ్మాయి ని ఏమంటాం? మనం.

బిల బిల లాడుతూ అంతా వచ్చారు.  డాక్టర్ చెప్పిన వారం ఇంకో రోజులో పూర్తవుతుందనగా.. మళ్ళీ ఆసుపత్రి లో చేర్పించగానే.  ఒకటి, రెండు, మూడు.. 10 రోజులైనా ప్రాణం గట్టిది అలాగే ఉన్నారు. ' ప్రస్థుతానికి ఈవిడ బానే ఉంది కానీ 'ఏ క్షణం అయినా పోవచ్చు ప్రాణం..'  అనగానే సాయంత్రానికి ఏదో ఒక సాకు చెప్పి అంతా చల్లగా జారుకున్నారు.

నెల రోజులైనా ప్రాణం అలాగే నిలవటం తో పోయాక పదో రోజుకి వస్తానన్న మనవరాలు వెనక్కి వచ్చింది. మళ్ళీ అంతా మామూలే. యూరోప్ లో ఆఫీస్ పని ఉందని మనవడు వెళ్తుంటే.. ఆయన తో భార్యా,పాపా వెళ్ళిపోయారు.

వృద్ధులు మిగిలారు ఇంట్లో పెద్దావిడ ని చూసుకుంటూ. అప్పుడప్పుడూ ఆవిడ కి బ్రేక్ ఇవ్వటానికి నేను ఏదైనా డాక్యుమెంట్ చేసుకోవటానికి వెళ్ళేదాన్ని వాళ్ళింటికి. ఆవిడ కాస్త చల్ల గాలికి తిరిగి వచ్చేది. ఒక రోజు  రాత్రి ఫోన్ వచ్చింది.. 'మా అత్తగారు పోయారు..ఇంట్లో ఎవ్వరూ లేరు. ' అని.. నేను వెళ్ళేటప్పటికే ఎవరో నలుగురైదుగురు చేరారు అక్కడ.

ఎక్కడ పుట్టారో, జీవితం లో ఎన్ని చూశారో, ఏం చూశారో తెలియదు కానీ అతి ప్రశాంతం గా పండుటాకు నేలారాలినట్టున్నారావిడ. ఐసుపెట్టె లో ఉన్నారు. అందరూ ఉదయానికి చేరతారన్నారు ట. రాత్రి శవ జాగరణ కి పెద్దగా ఎవరికీ ఇంటరెస్ట్ లేదని గమనించి నేనూ, మా వారూ అక్కడే ఉందామని నిశ్చయం చేసుకున్నాం. పిల్లలు అమ్మమ్మ గారింటికెళ్ళారు అని..

ముగ్గురమో నలుగురమో.. ఉన్నాం. సన్నటి హల్లో పక్కనే ఐస్ బాక్స్. కోడలు సోఫా లో పడుకుంది. అవీ ఇవీ పొంతన లేని కబుర్లు చెప్తోంది .. ముసలావిడ ని డబ్బిచ్చి హాస్పిటల్లో చేర్పించేద్దామనే ప్రపోజల్స్ ని ఎంత తీవ్రం గా అడ్డుకున్నారో, అంత పెద్ద వయసు లో విసుక్కుంటూనో, ఉసూరుమంటూనో సేవ చేసిన విషయం నాకూ తెలుసు.మౌనం గా వింటున్నాం..  12 కొట్టేసరికి అంతా నిద్ర పోయారు. ఒకళ్ళిద్దరం మాత్రం ఏవోపనులు చేసుకుంటూఉండిపోయాం ..
                                   తెల్లవారుతుండగా ఒక్కొక్కరు గా కుటుంబ సభ్యులు చేరుక్తున్నారని నేనూ నెమ్మదిగా బయట పడదామనుకుటుండగానే.. కాస్త కాఫీ అదీ కాస్తావా అని అడిగారు మొహమాటం గా.. 'సరే అని కాఫీ చేసి అందరికీ ఇచ్చాక అందరం కాఫీ తాగటం లో పడ్డాం.  మాట్లాడుతూ పైగా తాగిన కాఫీ కప్ కూడా ఐస్ బక్స్ మీద పెట్టటం గమనిస్తే నవ్వొచ్చింది.

తమిళులు వాళ్ళు...  ముసలివారి చావు కల్యానం తో సమానం..  అని సామెత చెప్పారెవరో.. మధ్యాహ్నం పురోహితుడూ వాళ్ళూ వచ్చేదాకా విబేధాల వల్ల  బింకం గా గంభీరం గా ఉన్న కుటుంబ సభ్యులు శవాన్ని ఐస్ బాక్స్ లోంచి తీసి కింద పెట్టగానే.. ఒక్కసారి గా ఘొల్లు మన్నారు.

విబేధాలూ అవీ బాధ్యత మోయవలసి రావటం వల్ల ఉత్పన్నమైనవి కానీ కన్నీటితో వాళ్ళ ద్వేషాన్నంత కడిగేసుకుని ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ఆఖరి రోజుల్లో వదిన చేసిన సేవ, చాకిరీ గురించి మాట్లాడుతూ కూతురు కన్నీటి తో వదిన గారి చేతులని అందుకుని కళ్ళదగ్గరకి తీసుకుని. చిన్న కోడలూ, ఇతర మనవలూ కూడా తామింకా చేయవలసి ఉండవలసిందని అనుకున్నారు. ఎక్కువ మందిని పిలవకుండా సింపుల్ గా కానిచ్చినా అందరూ కలిసి కర్మ కాండలు జరిపించారు.

ఎవరిళ్ళకి వారు వెళ్తూ అప్పుడప్పుడూ కలవాలనీ, అలాగ ఒకరికొకరు చెప్పుకుని వెళ్ళిపోయారు. రెండు నెలల్లోనే వారి వారి రొటీన్ లో పడిపోయారనుకోండి. కానీ అందరూ ఒక్కటిగా కనీసం ఒక నాలుగు రోజులు ఉన్నారు.

వారికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటేనో? ఆవిడ ఇంకో నాలుగు నెలలు బతికుంటే ?  ఏ 10 లక్షలో ఖర్చు పెడితే ఆవిడ ఇంకో 10 యేళ్ళు బతుకుతుందని డాక్టర్లు అని ఉంటే?   ఆవిడ అదృష్టవంతురాలు.. ఇంకా బాగా జరుగుతున్నప్పుడే అస్థమించారు.. మన చరమాంకం ఎలా ఉంటుందో.. సత్తు లేని దినాన మన పరిస్థితేంటి? స్వర్గారోహణ పర్వం లాగా ఐచ్చికం గా మరణాన్ని ఆహ్వానించటమే బెస్టేమో.. ఇలా గజిబిజి గా ఉంది..ఏమో అవన్నీ ఆలోచించ కూడదు బాబూ. అనుకుని ఆ ఆలోచనలని పక్కకి నెట్టేసి నేనూ రొటీన్ లో పడిపోయాను.

అసలే మా పెద్దమ్మాయి కి లెక్కల పరీక్ష .. ఎంత చదివించాలి? ..పైగా ఆఫీస్ డెడ్ లైన్ దగ్గర పడుతోంది..

15 comments:

Rao S Lakkaraju said...

నేనూ, మా వారూ అక్కడే ఉందామని నిశ్చయం చేసుకున్నాం.
---
మీరు మనసుకు అనిపించింది చేసారు. కాఫీలు కలిపి ఇవ్వటము కూడా. అది చాలా చాలా గొప్ప పని. అటువంటి సమయములో ఇంట్లో వాళ్లకి ఏమి చేస్తున్నారో తెలియనంత పరిస్థితి ఏర్పడు తుంది. అన్నీ ముగించుకుని వచ్చిన తరువాత ఎవ్వరో మాకు ఇడ్లీలు తెప్పిచ్చి పెట్టారు అహమ్మదాబాదు లో!. అవి లేకపోతే ఆ రోజు పస్తె. మీకు ఎవ్వరూ కృతజ్ఞతలు చెప్పక పోతే వాళ్ళ తరఫున ఇవే నా కృతజ్ఞతలు.
వేసవిలో రెండు వారాలకు అమెరికా నుండి వచ్చిన నాకు మా అమ్మగారి అంత్య క్రియలు చేయ వలసి వచ్చింది. ఒక్కటే నాకు నచ్చనిది, వెంటనే అంటరాని వాళ్ళ మవుతాము బంధు మిత్రుల కందరికీ.

Sujata M said...

I sincerely admire this post !

కృష్ణప్రియ said...

@ రావు ఎస్ లక్కరాజు గారికి,

ధన్యవాదాలు. మీరు చిన్నదాంట్లో పాయింట్ ఉంది. మైల అన్న ఆచారం వెనక తర్కం పూర్వం రెలెవెంట్ అయ్యుండవచ్చు. (ప్లేగ్, కలరా లాంటి రోగాలు గట్రా..) నా వరకూ అంత్యక్రియలనంతరం స్నానాదులు పాటించినా మీరు చెప్పిన అంటరానితనం.. పాటించటం లో (ముఖ్యం గా కర్మ కాండలు ముగిసేదాకా కొనసాగించటం .) ఆసక్తి చూపించను.

అలాగే వీరింటికెళ్ళి సహాయ సహకారాలు అందించి వచ్చినా, చాలా సార్లు కొద్దిగా తెలిసిన వారింట్లో వచ్చిన ఇలాంటి కష్టాలకి స్పందించటానికి ఒక అరగంట కూడా స్పేర్ చేయలేకపోతున్నాను నేను.
పశుపక్ష్యాదులే తమ సాటి జీవి మరణానికి స్పందించి గుమిగూడతాయి. తెలివీ, నాగరికతా ఉన్న మానవులం.. మాత్రం.. ఒక అరగంట కేటాయించాలంటే ఎన్నో పనులు ఆపుకోలేక పోతున్నామేమో..

@ సుజాత,
థాంక్స్!

వీరుభొట్ల వెంకట గణేష్ said...

With tears.

కృష్ణప్రియ said...

@ గణేష్,
అవును.. మన సీనియర్ సిటిజన్లు (80 లు దాటాక) తమ వృద్ధాప్యం లో ఇలాంటి సమస్యలు ఎదుర్కోని వారు, ఆఖరి క్షణం వరకూ ప్రేమింప బడేవారు, అరుదే..

కృష్ణప్రియ

Shiva said...

meeko vishayam telusa ippudu konni developed countries lo quality of death ni improve cheyadam ela ane dani meeda teevram ga strategies alochistunnaru. mundundi musalla pandaga manandariki :-(

Sravya V said...

కొద్దిగా భారమైన టపా :(
{విబేధాలూ అవీ బాధ్యత మోయవలసి రావటం వల్ల ఉత్పన్నమైనవి కానీ కన్నీటితో వాళ్ళ ద్వేషాన్నంత కడిగేసుకుని ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ఆఖరి రోజుల్లో వదిన చేసిన సేవ, చాకిరీ గురించి మాట్లాడుతూ కూతురు కన్నీటి తో వదిన గారి చేతులని అందుకుని కళ్ళదగ్గరకి తీసుకుని. చిన్న కోడలూ, ఇతర మనవలూ కూడా తామింకా చేయవలసి ఉండవలసిందని అనుకున్నారు. }
నేను ఇలాంటి సంఘటనలు చాల చూసాను, మనిషి ఉన్నప్పుడు చేయలేక ఇలా ప్రవరిస్తారేమో , ఆ మనిషి దాటి పోయిన తరవాత తప్పు తెలిసి బాధ పడతారనుకుంటాను .

ఇక చనిపోయిన వారి దగ్గర భయమని , అంటూ అని అనేవాళ్ళని చూస్తుంటే చీదరేస్తుంది . మా కజిన్ ఒకడున్నాడు ఎవరన్నా వాడు చూసేటప్పుడు అలా చేసారా చచ్చారే దుమ్ము దులిపేస్తాడు, అలాగే తనకు తెలిసిన వాళ్ళ ఏదైనా ఫంక్షన్ మిస్ చేస్తాడేమో గాని , ఎంత బిజీ ఉన్నాసరే ఇలాంటి వాటికి తప్పనిసరి గా వెళ్లితీరతాడు .

కృష్ణప్రియ said...

@ శివ,
ఎగ్జాట్లీ.. క్వాలిటీ ఆఫ్ డెత్.. ని మెరుగు పరచాలి.. అదే నేను ఈ టపా ద్వారా తెలియ పరచ దలచుకుంది. ఆఖరి రోజుల్లో లోకుల కోసం వృద్ధులని విసుక్కుంటూ, కసురుకుంటూ, జీరో ఆప్యాయత తో చావు కోసం ఎదురు చూసే బదులు ఏదైనా మంచి ప్రత్యామ్నాయ మార్గం చూడాల్సిందేననిపిస్తుంది...

కృష్ణప్రియ said...

@ శ్రావ్య,
అవును. మనిషి పోయాక ఒకటి, ఆస్థులు పంచుకునేంత వరకూ విబేధాలు, పంచుకున్నాక అన్యాయం జరిగిందని.. అలాగ కొన్నేళ్ళు మనసులో పెట్టుకునే అన్నదమ్ములు కూడా యాభైలు దాటాక ఇలాగే ఒకరి కష్టాన్ని ఒకరు అర్థం చేసుకున్నట్టు గా కలిసి మెలగటం కూడా చూశాను..

మన పెద్దవాళ్ళంటారు.. పెళ్ళిళ్ళకీ వాటికీ వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి సందర్భాల్లో వెళ్ళి తీరాలని.. మీ కజిన్ చేసేది మంచి పని!

Rao S Lakkaraju said...

అమెరికా లో Hospice care అని ఒకటి ఉంది. గవర్నమెంట్ సోషల్ సెక్యూరిటీ ప్రోగ్రాం లో ఉంటె, ఆరు నెలల కన్నా బతకరని డాక్టరు వ్రాసిస్తే, జీవితము లో చరమ భాగాన్ని బాధలు లేకుండా గడపటానికి ఆ ఇళ్ళల్లో ఉండవచ్చు. వారిని జాగర్తగా చూడటానికి తగిన సౌకర్యాలు ఉండును.

హరే కృష్ణ said...

touching one
with tears

కృష్ణప్రియ said...

@ రావు లెక్కరాజు,
బెంగుళూరు లో కరుణాశ్రయ లో కాన్సర్ బాధితులని, ముఖ్యం గా బ్రతకరు అని తెలిసిన టర్మినల్లీ ఇల్ వ్యాధిగ్రస్తులని మరణం దాకా చూస్తారు అని విన్నాను.

@ హరేకృష్ణ,
అవును, చాలా బరువైన కదిలించే సబ్జెక్ట్..

వేణూశ్రీకాంత్ said...

చాలా బరువైన విషయం ఎన్నుకున్నారండీ మొత్తానికి... మనసంతా భారమైపోయింది.

సవ్వడి said...

కృష్ణ ప్రియ గారు! ఏమని స్పందించాలో తెలియట్లేదు.
ఆలోచించవలసిన విషయం చక్కగా చెప్పారు.

కృష్ణప్రియ said...

@ సవ్వడి, వేణు శ్రీకాంత్

..ధన్యవాదాలు

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;