Wednesday, February 20, 2013 40 comments

సారీ.. తెనాలి రామా! నువ్వే రైటు..

అప్పుడెప్పుడో ఆయనకీ, నాకూ భేదాభిప్రాయాలున్నట్టు రాసేసినట్లున్నాను.. ఇక్కడ (http://krishna-diary.blogspot.in/2011/07/blog-post.html) కానీ ఇప్పుడు ఆ అభిప్రాయం మార్చుకోవాల్సివచ్చింది...అయినా నా అభిప్రాయాలు శిలల మీద చెక్కినంత స్థిరంగా ఉన్నదెప్పుడని...




సప్తసముద్రాలు దాటి వచ్చిన వాడు ఇంటి ముందు నీటి గుంట లో పడ్డాడట.

అలాగ ఆటక మీద నుంచి పడి దులుపుకుని వెళ్లిన నేను, మెట్ల మీద నుంచి జర్రున జారి కాస్త అటూ ఇటూ విదిలించుకుని పనిలోకి దూరిన నేను, సన్నజాజులు కోయటానికి పాత ప్లాస్టిక్ కుర్చీ ఎక్కి అది ఫెళ ఫెళ మంటూ విరిగి పడితే, మళ్లీ ఇంకో కుర్చీ ఎక్కి మరీ పని పూర్తి చేసుకున్న నేను,..

ఓ శుక్రవారం పొద్దున్నుంచీ కదలకుండా ఒకేచోట కూర్చుని పని చేసి చేసి ఇక ఈ వారానికి చాలు ‘ఈ సోఫా లో మళ్లీ కూర్చోను.. సోమవారం దాకా’ అనుకుని సాయంత్రం లాప్ టాప్ షాపు కట్టేసి ఇక కాస్త సాయంత్రపు నడక కి బయల్దేరదామని లేచి అరడుగు ఎత్తు నుంచి దబ్బున కూలి పడి పాదం ఎముక విరగ్గొట్టుకున్నాను. ఓ రెండు గంటల్లో ఎక్స్ రే లూ, సిమెంట్ కట్టూ అన్నీ అయి, మళ్లీ అదే సోఫా లోకి వచ్చి పడ్డాను. మా వారూ, పిల్లలూ కూర్చో పెట్టి మంచి నీళ్ల దగ్గర్నించీ చేతికిచ్చి .. ‘ఆహా.. ఇంత రాజ భోగం ఉంటుందని తెలిస్తే ..ఎప్పుడో పడేదాన్ని..కనీసం కాలు బెణికిందనో, చేయి గుంజిందనో చెప్పైనా ఎన్ని సేవలు చేయించుకోవడం మిస్సయ్యానో ‘ అని ఓ సారి నిట్టూర్చాకా అందరికీ మరి ఫోన్ చేసి చెప్దామా? అని ఉత్సాహం గా ఫోన్ చేతిలోకి తీసుకుని మొదలు పెట్టాను.




కొందరు విషయం వినగానే రాత్రికి రాత్రే వచ్చి పలకరించి వెళ్తే, కొందరు..ఫోన్ మీదే సానుభూతి ప్రకటించారు. మరి కొందరు పిల్లలకి సహాయం ఆఫర్ చేస్తే, ఇంకొందరు తలుపు కొట్టి మరీ రకరకాల వంటలు తెచ్చి పెట్టారు. ఆఫీసు వాళ్లు చేతనైనంత ఇంట్లోంచి చేయి..లేదా మానేయి అని ఆదరం చూపిస్తే,..మా అత్తగారు ఆఘ మేఘాల మీద సహాయం గా ఉండటానికి వచ్చేశారు.మా మేరీ డార్లింగ్ ‘నువ్వు.. సరిగ్గా పూడ్సేవరకూ.. నాను.. ఇక్కడనే.. ఉంటాను మాడం’ అంది. వెలక్కాయ పచ్చడి నుంచీ ఎగలేస్ కేక్ దాకా ఏదో ఒకటి తెచ్చి ఇవ్వడం, నేను తినేయడం .. బాగానే అలవాటైపోయింది. రేపు కట్టు తీసేశాకా, ఓ నాలుగు కిలోల బరువు పెరిగితే అస్సలూ ఆశ్చర్యపోవాల్సిన పనీ లేదు.

http://www.youtube.com/watch?v=5E9bSGA4w0U

అదేం చిత్రమో.. టీవీ చానెళ్ల వారికి ఎలా తెలిసిందో.. ఏ చానెల్ చూసినా చక్రాల కుర్చీల్లో చెదరని మేకప్ లో ఆడవాళ్లని ‘దారి చూపిన దేవతా..’ , మా ఇంటి మహాలక్ష్మి నీవే’ అని ముద్దుగా చూసుకునే సినిమాలు తెగ వేశాడు. నాకు అంత జరగట్లేదని మా వారిని నిష్టూరాలాడితే.. ‘నేనూ పాడతా లే.. (ఎ) డారి చూపిన దేవతా.. లేక (గో) దారి చూపిన దేవతా ‘ అని..నా ఆశల మీద నీళ్లు చల్లేసారు  గయ్యి మని లేవగానే..

http://www.youtube.com/watch?v=SslpgwUIA9s

‘నువ్వు అలా పట్టు చీర కట్టుకుని వీల్ చెయిర్ లో కూర్చుంటే పోనీ మా ఇంటి లోని మహాలక్ష్మి.. అంటూ జడేస్తాను అయితే.. అని సెటైర్లు వేశారు. బయట వాళ్లే నయం..బోల్డు సలహాలిచ్చారు.

మా అన్న తెనాలి రాముడు మాత్రం అబ్బో అడుగడుగునా, అదేదో సినిమా లో అలీ లాగా ముక్కున వేలేసుకుని, సొట్ట బుగ్గలతో, నవ్వుతూ తలాడిస్తున్నట్టు అబ్బో.. ఒకటే గొడవ. అయినా ఆయనకి వ్యతిరేకాభిప్రాయాలు వెలిబుచ్చి నిలిచిందెవరంట?

నాకొచ్చిన సలహాలు..

అసలెందుకు పడ్డావు?

కృష్ణా.. నీకు దూకుడెక్కువ.. ఇంక నెమ్మది గా నడవటం నేర్చుకో..!!! (నేను నడుస్తూ పడలేదే?)

వయసు పెరుగుతున్నప్పుడు ఎముకలు బిరుసు బారిపోయి ఉంటాయి.. జాగ్రత్త గా ఉండాలి.. (ఓకే. అయితే ఈసారి ఆరడుగు ఎత్తు కూడా ఎక్కకుండా జాగ్రత్త గా ఉండాలి..)

పచ్చళ్లూ, పొడులూ తింటావు.. టీ ఎక్కువ గా తాగుతావు. తగ్గించేసి, కాల్షియం ఎక్కువ ఉన్న కూరలూ, పళ్లూ తినాలి.అయినా కాస్త డయట్ చేయి.. (అలాగే.. అన్నీ తగ్గించేస్తా...)

తిండి లో కాల్షియం సరిపోదు. కాల్షియం టాబ్లెట్లు తీసుకోవా నువ్వు? (డాక్టర్ ని అడిగినా అక్కర్లేదన్నాడు.. మరి..మళ్లీ అడిగి చూస్తా)

మొన్న ధనుర్మాసం లొ సరిగ్గా గోదాదేవి వ్రతం చేసావా? అంటే ఏమన్నావు.. నాకు ఆసక్తి ఉండదు.. ఉన్నా సమయం ఉండదు.. అని..చూశావా ఇప్పుడేమయిందో? (మరి తమరు.. యదావిధి గా అన్ని పూజలూ చేస్తూ వస్తున్నారు.. మరి మీకు ఏ కష్టమూ రావటం లేదా?’)

నరుడి దృష్టికి నల్ల రాయైనా పగులుతుందంటారు.. మరి ఊర్కే,.. ఫేసు బుక్కు లో ఫొటోలు పెడతావు.. నేనింత గొప్ప, నాకిన్నున్నాయి.. అని తమకీ కొట్టుకుంటూ తిరుగుతావు. ఫలితం చూడు.. (నేను..ఆఫీసు లో మరి performance reviews లో తప్ప ప్రగల్భాలు అంత చెప్పుకున్నట్టు లేదే?)

ఇల్లు క్లీన్ గా ఉంచుకోవాలి. ఎప్పుడూ ఆఫీసూ, ఆఫీసూ అని పరిగెత్తకూడదు. అందుకే నేను ఒకటికి రెండు సార్లు శుభ్రం గా కడుగుతాను. ఎక్కడి వస్తువులక్కడ పెట్టుకోవాలి. నేల జిడ్డు గా ఉంటే అంతే.. (హ్మ్. ఈ ముక్క మా మానేజర్ గారికి వినపడాలి. ఖంగు తింటాడు..ఆయనేమో..ఇల్లూ, ఇల్లూ అని పరిగెడతానని ఒకపక్క సాధిస్తుంటేనూ...నేను జిడ్డు గా ఉన్న నేల మీద జారి పడ్డానని ఎవరన్నారబ్బా?)

నడవాలా వద్దా?

ఇదిగో.. నడవకు.. ఒక చోట ఉండు.. లేకపోతే జీవితాంతం నొప్పి వెంటాడుతూనే ఉంటుంది.. (మరి డాక్టర్ గారు.. నడువు అని చెప్పారే)

ఇదిగో.. ఒకేచోట జడ్డిగా కూర్చుండిపోకు.. ఎప్పుడు చూసినా కూర్చునే కనిపిస్తున్నావు.. కండరాలు బిగదీసుకుపోతాయి. అలాగే రక్త ప్రసరణ ఆగిపోతుంది. కాస్త పనులు చేసుకుంటూ ఉంటే మంచిది. (అవునా. పొద్దున్న వంట, చేస్తున్నాను. ఒక ఫ్రాక్చర్ అయిన కాలు బయట పెట్టి మంచి కాలుని లోపల పెట్టి నుంచుని పిల్లలకి తలంట్లు పోస్తుంటే? సాధ్యమైనంత వరకూ యోగా..లాంటివి చేసి అప్పర్ బాడీ ఎక్సర్సైజులు చేస్తూ.. మనసు, శరీరం కంట్రోల్ లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంటే..? ఎలాగూ కూర్చునే ఉంటాను.. అని ఆఫీసు పని చేసుకుంటుంటే? వడియాలు,కంది పొడి, ఆవకాయలు ఖాళీ గానే ఉన్నాను కదా.. అని పెట్టుకుంటే?, మహా భారతం మరోసారి చదువుకుని కొత్త బ్లాగు కూడా మొదలు పెడితేనూ.. )

ఇదిగో కాస్త లీన్ గా ఉన్నవాళ్లకయితే త్వరగా తగ్గుతుంది.మరి బల్కీ గా ఉన్నవారి బరువంతా చిన్న పాదం మీద పడటం తో మీకు నడకకి ఉన్న ఇబ్బంది ని నేనర్థం చేసుకోగలను.. (నేను—కన్నీరు తుడుచుకుంటూ.. నన్నర్థం చేసుకునేవారు ఇన్నాళ్లకి దొరికారు..) అయినా నడిచి తీరాలి.. (ఈయన కోసమైనా నడవాలి నేను...)

ఎలా నడవాలి?

స్ట్రెయిట్ గా నడువు.. అలా వంకర గా నడిస్తే.. అదే అలవాటై కూర్చుంటుంది.. (ఆ కట్టు వేసిందే.. పాదం దగ్గర ఎముక కదలకూడదని.. స్ట్రెయిట్ గా ఎలా నడుస్తారు? అయినా పెళ్లయిపోయింది గా?;))

ఇదిగో ఒక స్టిక్ తీసుకుని నడువు.. నాకు తెలుసు.. కర్ర సహాయం తీసుకుంటే ముసలి దానిలా ఉంటావని భయమా? ( ఆవు మల్ల.. పిల్లలు తెచ్చిన బట్టలేవో కట్టుకుని .. అంటే ఎర్ర టాప్, ఆకుపచ్చ బాటం, మామిడి పండు రంగు చున్నీ, కాలికి కట్టు, వంకర నడక తో కొత్త వన్నెలు తీరిన నా సౌందర్యానికి, కొత్త గా కర్ర సహాయం.. తీసుకుంటే వచ్చే నష్టం ఏంటంట?)



సైకలాజికల్ కౌన్సిలింగ్ ..

నాకు ఏదో అయిందని సెల్ఫ్ పిటీ లోకి వెళ్లిపోకు.. నీకేమీ అవలేదు.. నీకన్నా కష్టం లో ఉన్నవాళ్లని చూసి ధైర్యం తెచ్చుకో.. లేచి తిరుగు.. ( పాత పాట గుర్తొచ్చింది... నడవాలమ్మా..నడవాలి...అవును.. నాకేమీ అవలేదు.. నడవాలి నేను...నడవాలి!)

ఆరోగ్యానికి సూచనలు..

కాస్త లేచి ఎండలోకి వచ్చి కూర్చో.. డీ విటమిన్ వచ్చి, ఎముక అతుక్కుంటుంది... అసలే సాఫ్ట్ వేరు వారు.. ఎప్పుడూ నీడపట్టున కూర్చునీ, కూర్చునీ.. (అమ్మా.. కూర్చుంటాను. ఎండలోనే కూర్చుంటాను. నీడ మాటేత్తను.. తల్లీ..)

కర్పూరం కరిగించి, ఆవనూనె లో..కాస్త.. కలిపి...... మర్ధనా చేసి... (ఇదిగో మిమ్మల్నే,.. కాస్త బజారు కెళ్లి కర్పూరం, బిళ్ళ గన్నేరు,.. ఆవనూనె, జిల్లేడు కాయలూ, నిమ్మగడ్డీ, కరక్కాయలూ, కర్పూరం, .... తెస్తారా.. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయా? ఏమో.. ఆమాత్రం నాకోసం తెలుసుకుని తేలేరా? అదేంటి అంత కోపం? అసలు కోపం రావాల్సింది నాకైతేనూ.. అదే తలనొప్పి వచ్చినా పక్కింటి మీనాక్షికి..వాళ్లాయన....)

హోమియో లో మందుందిట.. ఒక్క పూట లో నయమైపోతుందిట.. (మరి మా హోమియో డాక్టర్.. ఆరు వారాలు ఆగాల్సిందే అన్నాడే)

ఒక బకెట్ నీళ్లల్లో గోరు వెచ్చటి నీరు పోసి.. ఉప్పు వేసి.. కలియబెట్టి దాంట్లో.. కాలు ముంచు.. (మరి డాక్.. నీళ్లకి ఆమడ దూరం ఉంచమన్నాడే...)

And the award for the best advice goes to....

మాకు చిన్న చిన్నటాక్స్ పనులు చేసి పెట్టే ‘టాక్స్’ నాగరాజు గారు చాలా మంచాయన.. ఆయన పడ్డ కష్టం ఎదుటి వారు పడకూడదని ఆయన ఆత్రం కాస్త పెద్దాయన..ఓరోజు వచ్చి నా కాలు చూసి బాగా నొచ్చుకుని మంచి సలహా ఇచ్చారు. ‘అమ్మా.. అలాగ కూర్చుని ఉండిపోకు.మా అత్తగారు. అలాగే కుర్చీ లో కూర్చుని కూర్చుని..తర్వాత,నుంచో లేక పోయారు.పోయేంత వరకూ.. అలాగే.. ఒక కాలు.. తొంభై డిగ్రీల కోణం లో ఉండిపోయింది. పోయేదాకా అందరం ప్రయత్నిస్తూనే ఉన్నాం.. అందరం.. చివరకి... అని చాలా డ్రమాటిక్ గా ఆగి నన్ను చూశారు..

నాకేమో నరాలు చిట్లిపోయేంత టెన్షన్.. ‘ఏమైంది.. చెప్పండి.. ‘ అన్నాను.. ఉత్కంఠ గా.. తొంభై డిగ్రీ ల కోణం నుండి కొంచెం గూడా కాలు కదిలించకుండా..

ఆయన.. మన జోయీ (ఫ్రెండ్స్ లో అబ్బాయి) లా మొహం పెట్టి.. ఆవిడ పోయాకా.. స్నానం గట్రా చేయించాకా మరి పాడె మీదకి ఎక్కించేముందు ఇద్దరం అటు, ఇద్దరం ఇటూ పట్టుకుని లాగాము. అలా కూర్చో పెట్టి కాలిస్తే బాగుండదు కదా అని..

దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది.. నిజమే కదా.. ఒక్కసారి నేను అలా .. ఊహల్లోకి వెళ్లి వచ్చేశాను. ముల్లా నసీరుద్దీన్ చనిపోయే వరకూ జనాల్సి నవ్వించి నవ్వించి పోయే ముందు చుట్టూ అందరినీ సీరియస్ గా కూర్చుని బాధ పడటం చూసి.. ‘ఇలా కాదని’ కాస్త గోడ దగ్గరకి తనని జరపమని కాళ్లు గోడ మీదకి నలభై ఐదు డిగ్రీల కోణం లో పెట్టి పోయాడట. దానితో ఆయన పోయాక కాళ్లు కిందకి పెడితే తల పైకి లేస్తుందిట, తల కిందకి తోస్తే కాళ్లు పైకెళ్ళిఅందరూ హాయిగా నవ్వుతూ అంత్య క్రియలు చేసేలా చేసాడట.

నాకు అలాంటి పరిస్థితి కలగకూడదన్న ఆయన ఆవేదన నన్ను కదిలించింది. ఏమనాలో తెలియక.. ‘అలాగే.. అప్పుడప్పుడూ లేస్తూ ఉంటా లెండి..’ అని మాట ఇచ్చాను. ఒకవేళ నాకలాంటి పరిస్థితి వస్తే.. ‘ఆ నలుగురూ..’ . కావాల్సింది ఇలాంటి వాటికి కూడా అని తెలిసొచ్చింది. ఎందుకైనా మంచింది. మనల్సి వంచి సాగదీసే శక్తి ఉన్న నలుగురితో మంచి గా ఉండాలి బాబోయ్..

అబ్బబ్బ.. మరి తెనాలి రామా.. నువ్వే రైటయ్యా.. సలహాలివ్వటమే తేలిక.. నేనే ఏదో, నిన్ను వ్యతిరేకించి పేరు గడిద్దామానుకుంటేనూ....



గమనిక : టపా సరదాకి రాసుకున్నది మాత్రమే.. నా మీద ఎంతో అభిమానం ఉండి, నేనిచ్చిన చనువు వల్లే నాకు నా హితులు, సన్నిహితులూ, స్నేహితులు, బంధువులు ఇచ్చిన సలహాలివి. ఈ నలభై రోజుల ‘confinement’ నాకు ఇంతమంది ఉన్నారని కళ్ళు చెమర్చేలా చేసింది.

Wednesday, February 13, 2013 31 comments

ఈ వారం లో ఎక్కిన రెండు చెట్లు..

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు..




కుటుంబ కథా చిత్రం.. ఫామిలీ ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకుంటుంది.. అంటే కొద్దిగా సంక్రాంతి సినిమా లా ఉంటుందేమోనని భయం ఉన్నా.. మొత్తానికి మొన్న చూసేసా.. చూశాకా అర్థమైంది. ఈ చెట్టు కుటుంబ కథా చిత్రమని ఎందుకన్నారో!

యూత్ (అబ్బాయిలు) ఎందుకు వెళ్లాలి?

బిజినెస్ మాన్ లో బాబుని మొన్నీమధ్య అతి క్రూరంగా,భయానకం గా మొహం పెట్టి సంఘ విద్రోహ పనులు చేస్తూ దేశాన్ని కంట్రోల్ చేసే పాత్ర లో చూసి అలిసిపోయారు మన యూత్.. పాపం.. వాళ్ల కలల మాటేంటి?

అందం గా తయారయి, ఇంట్లో అంతా ఒక్క మాట కూడా అనకుండా, ‘హైదరాబాదు లో ఉద్యోగం సజ్జోగం లేదు.. అసలు ఏం చేస్తున్నావు?’ అని మాట వరసకైనా అడక్కుండా అపురూపం గా చూసుకుంటూ, నోటి దురుసుదనంతో వెక్కిరింపు మాటలు మాట్లాడినా ‘అగ్గగ్గలాడుతూ’ సేవలు చేసే కుటుంబం..

కాస్త అందం గా తయారయి, చేతికి చిక్కింది నములుతూ, బేవార్స్ గా తిరుగుతూ సెంటర్ లో కూర్చుని ‘కనిపించిన అమ్మాయిలంతా రెండు నిమిషాలకే పడి పోతుంటే.. పూలెక్కడ పెట్టుకుంటావే?’ అని వాగడం, అలా ఎవరైనా రెండు నిమిషాలైనా పడకపోతే టీజ్ చేస్తూ ఎదురు తిరిగి అడిగితే ‘నువ్వు ముసలిదానివయ్యాకా.. నన్ను కూడా టీజ్ చేశారు అనే స్వీట్ మెమరీజ్ కోసమే ఏ ఏడిపించడం ‘ అనడం..

(ఏమాట కామాటే చెప్పుకోవాలి.. రోడ్డున పోయే ఆడవాళ్లకి ముసలాళ్లయ్యాకా తలచుకుని మురిసిపోవటానికి మెమరీస్ కోసం తమ కారీర్, జీవితం, తల్లిదండ్రులు పెద్ద వయసులలో కష్టపడి మేపుతుంటే అవన్నీ లెక్క చేయకుండా సెంటర్ లో కూర్చో వాలంటే ఎంత దొడ్డ మనసుండాలి? – డైలాగ్ రైటర్/డైరెక్టర్ జిందాబాద్)

తప్పించుకుని తిరుగుతున్నా, ‘బావా’ బావా’ అంటూ తిరగడం తప్ప పనీ పాటా పెద్దగా పెట్టుకోని సమంత ల్లాంటి మరదళ్లు..

ఎందుకో లక్షలు కుమ్మరించి ఐటం సాంగ్స్ చేయించడం. ఇలాంటి కారక్టర్లున్నాకా ఎవడు చూడోచ్చాడు.. అవి కావాలంటే ఏ హాల్లో చూసినా ఉంటాయి కదా..

మరి అమ్మాయిల మాటో?

మహేశ్,మహేశ్, మహేశ్.. ఆ పేరు లోనే.. ఏదో మాజిక్ ఉంది.

ఇంకా అనార్కలీ సూట్లు..

మరి మాలాంటి మహిళలు?

పైకి వెంకటేశ్ బాబు పేరు చెప్పుకుని మహేశ్ బాబునీ చూడచ్చు.. ఏ మధ్య సీరియళ్లల్లో అందరూ పట్టు చీరలేనాయే.. రోజూ మానేజ్ చేయలేం. అలాగే వేరే హీరోయిన్లేసుకునే బట్టలు రోజూ ఇళ్లల్లో వేయాలంటే మరి.. చుట్టూ జనాలు “నవరసాలు” చూపించే ప్రమాదం ఉంది కదా..

ఈజీ గా మానేజ్ చేసుకునే సింథటిక్ చీరల ప్రింట్లు చూసుకోటానికి మోడల్ గా పెట్టుకున్న ‘హోమ్లీ’ అంజలి.. మాకు వీలుగా రకరకాల ప్రింట్లు కనపడాలని బట్టలు డాబా మీద ఆరేస్తూ కనపడుతుంది చాలా సార్లు.. షాపుల్లో కూడా ఇంత ఆరేసి చూపించరు కదా..

మరి మగ మహారాజుల మాటో?

కలలలోనో, చరిత్ర పుస్తకాల్లోనో కనపడే కారక్టర్లు.. పేరు తో పిలవక్కరలేదు. సంపాదన వివరం అడగదు/ఉద్యోగం ఊసెత్తదు. ఒక మంచి మాట ఆశించదు. మొహం మీద విసుగు/కోపం తప్ప వేరే ఎక్స్ ప్రెషన్ లేకపోయినా ఒద్దిక గా, పొడులు విసురుకుంటూ, బట్టలారేస్తూ, నవార్లు నేస్తూ, ఎప్పుడూ ‘తిన్నాడో లేదో..’ అని బెంగ పెట్టుకుని బాధపడుతూ, ‘ఏఏ ఏ .... య్య్య్య్య్య్య్’ అనగానే ‘బావా అంటూ ఏది కావాలో చెప్పక్కర్లేకుండానే పరుగు పరుగున తెచ్చి పెట్టే మరదలు/బార్య..

పిల్లలకి?

వాళ్లేమైనా టికెట్లు కొంటారా? పెద్దవాళ్లకి కావాల్సినవన్నీ పెట్టారు కదా? వాళ్లే పిల్లల్ని లాక్కెడతారు. ఓ పాప్ కార్న్ పాకెట్ మొహాన కొట్టేస్తే సరి. అదయిపోయాక కొక్ ఉండనే ఉంది.

వృద్ధులకి?

‘అయ్యవార్లకు చాలు ఐదు వరహాలు. పిల్లగాళ్లకు చాలు పప్పు బెల్లాలు, పెద్దవారికి చాలు.. అచ్చమైన తెలుగు టైటిల్, కొబ్బరి చెట్లు.

ఇక అందరినీ మెప్పించిన జంట ప్రకాశ్ రాజు, జయసుధ, ఇక ఇంటర్నేషనల్ లెవెల్ నటి రోహిణి హట్టంగడి..

ఇన్నుండగా కథా, కాకరకాయా, కంకర పీసూ అంటే మరి కోపం రాదూ? పైగా ప్రకాశ్ రాజు తో సహా నీతి కూడా చెప్పించారు కదా..

ఇంతకాలం ఏదో కష్టాలొచ్చినా చిరునవ్వు తో ఎదుర్కుని కష్టపడే వారికే విజయం అనుకున్నా. ఈ సినిమా చూశాకా తెలిసింది. కష్టం వచ్చినప్పుడు ‘ఈ ఈ ఈ ‘ అని ఇకిలిస్తూ కూర్చుంటే చాలు.. ‘ఈ సీక్రెట్ తెలియక.. ఎన్ని సంవత్సరాలు కష్టపడి పని చేశాను.. ప్చ్ (((( (మన్మధుడు బ్రహ్మి స్టైల్ లో...)

అన్నట్టు గమనించారా? సీతమ్మ ఇంట్లో పెద్దావిడ రోహిణి, మధ్య వయస్కురాలు జయసుధ, థయ్య్య్య్యి మని గెంతుతూ ఉండే అంజలి పనులు చేస్తూ కనిపిస్తారు..కానీ మగవాళ్లు ఒక్క పెళ్లి లో కాస్త బిందెలు మోయడం తప్ప మామూలు గా ఇంటా/బయటా ఏదీ చేస్తున్నట్లు కనపడరు..



వంశ వృక్ష.. (కన్నడ)




ప్రముఖ కన్నడ రచయిత S. L. బైరప్ప రచించిన వంశ వృక్ష నవల ఆధారం గా తీసిన సినిమా ఇది. తెలుగు లో కూడా బాపు దర్శకత్వం లో పునర్నిర్మించారు.

ఈ సినిమా చూడాలంటే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. కాస్తచుట్టాలూ, పక్కాలూ రాని సమయం ఎంచుకోవడం, పిల్లా మేకా నిద్రపోతున్నప్పుడు చూస్తే మరీ బెటర్.

‘భగవద్గీత చదువుకోమ్మా! మానసిక శాంతి కలుగుతుంది’ అని మామగారు కోడలి తో చెప్పడం తో కథ మొదలవుతుంది. ‘నాకు ఎందుకో చదివినా ప్రశాంతత రావడం లేదు మామగారూ..’ అని సమాధానమిస్తుంది కోడలు.

అదొక శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబం. పెద్దాయన కొడుకు మరణించాడు. కోడలు కాత్యాయిని భర్త పోయిన దుఃఖం లో ఉంది. చిన్న పిల్లవాడిని చూసుకుంటూ, గీత, ఉపనిషత్తులలో మానసిక శాంతి ని వెతుక్కుని భంగపడి కిటికీ లోంచి తన వయసు అమ్మాయిలు నవ్వుతూ,తృళ్ళుతూ కాలేజ్ కి వెళ్లటం చూస్తూ నైరాశ్యం తో మగ్గుతూ అత్తగారింట్లో ఉంటుంది. పసి పిల్లవాడిని చూసుకోవడానికి ఇంట్లో మనిషి ఒకావిడ సహాయం ఉంటుంది. వంటగది లోకి వెళ్లాలంటే సువాసిని కాబట్టి (పూర్వ కాలం బ్రాహ్మణ కుటుంబాల్లో భర్త పోయిన స్త్రీ జుట్టు తీయించుకుంటే కానీ వంట కి,మడి కి పనికి రాదనే రూల్ ఉండేది) ఆచారం అడ్డు. అత్తగారికి గుండు చేయించి కోడలిని వంటగది లోకి సహాయం చేయడానికి తెప్పించాలని ఉంటుంది. మామగారు ఒప్పుకోరు. ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా అలాంటి పని చేయకూడని భార్యకి గట్టి గా చెప్తాడు. కోడలిని ఆదరాభిమానాలతో, ఆప్యాయతతో చూస్తూ ఉంటాడు.

మామగారి కుటుంబం మంచిదే.. కాకపోతే పాతకాలం పద్ధతులు.. మనవడు తన వంశానికి,సంస్కృతీసాంప్రదాయాలకి వారసుడవ్వాలని కలలు కంటూ, అన్నీ దగ్గరుండి నేర్పిస్తూ ఉంటాడు. మామగారి దగ్గరకి వెళ్లి తనకి చదువుకోవాలనుందని చెప్తుంది. ‘నీలాంటి స్త్రీలకి అది మంచిది కాదు.’ అన్నప్పుడు ‘నా లాంటి స్త్రీయా? ‘ అని బాధ పడుతుంది. భర్తకి BA పూర్తి చేయాలని ఆశయం నెరవేరకుండానే చనిపోయారు కాబట్టి తాను ఆ ఆశయం నెరవేర్చడానికి చదవ దలచుకున్నట్టు, అదీకాక ఇంట్లో తనకు సరైన పని లేక బోర్ గా ఉన్నట్టు చెప్పుకుంటుంది. తన కొడుకు ఆశయం పూర్తి చేయాల్సిన ధర్మం మనవడిది కానీ కోడలిగా నీకు ఆ అవసరం లేదని చెప్పి పంపించినా, కోడలి కోరిక ని మన్నించి, భార్య కి ఇష్టం లేకపోయినా 12 km దూరం ఉన్న విశ్వవిద్యాలయానికి రైల్లో ఇంకో అమ్మాయితో కలిసి రోజూ వెళ్లి వచ్చేట్టు, అలాగే తన స్నేహితుడు ప్రొఫెసర్ గారికి చెప్పి సీటు వచ్చేట్టు అన్నీ అమర్చుతాడు.

‘చదువు కోసం పంపుతున్నాను.. కానీ కుటుంబ గౌరవానికి మచ్చ తెచ్చే పని చేయవద్దని సుద్దులు చెప్పి మరీ కోడలిని ఆదరం గా రైలెక్కిస్తాడు. కాత్యాయిని జీవితం లో మళ్లీ నెమ్మది గా వెలుగొస్తుంది. ఇంట్లో కొడుకుతోనూ, కాలేజీ లో పాఠాలూ, ప్రొఫెసర్ గారింట్లో మధ్యాహ్న భోజనం.. రైల్లో తన వయసు ఆడ వారితో స్నేహం ఆమె ముఖం లో మళ్లీ చిరునవ్వు తెప్పిస్తాయి. ప్రొఫెసర్ గారి తమ్ముడు, ఫారెన్ లో చదువుకుని వచ్చిన ఆంగ్ల లెక్చరర్ గిరీష్ కన్నాడ్ తో పరిచయం, స్నేహం గా, తర్వాత ప్రేమ గా మారుతుంది.

కాత్యాయిని అటు మామగారికిచ్సిన మాట, ఇటు తన జీవితం లో మంచి భవిష్యత్తు ఇస్తానంటున్న గిరీష్ మధ్య ఎటూ తేల్చుకోలేక తీవ్ర సంఘర్షణ కి లోనవుతుంది. మొత్తానికి భవిష్యత్తు పట్ల గల మోహం,ఆశ గెలుస్తాయి. మామగారు పెళ్లికి అంగీకరించి ఆమెని పంపేసినా, కోడలికి తన మనవడిని ఇవ్వటానికి మాత్రం ఒప్పుకోడు. ‘నీ కొత్త సంసారం లో నీకు సంతానం కలిగే అవకాశాలున్నాయి. నాకు వేరొక కొడుకు కలగడు.. అలాగే నా వంశంవృక్షం ఇక్కడే ఆగిపోతుంది. ముసలి వాళ్లం.. మా దుఖం చూసైనా వాడిని తనకి వదలమని వేడుకుంటాడు.

కాత్యాయిని తల్లి గా తన హక్కులు అతి కష్టం మీద వదులుకుని వెళ్లిపోతుంది. తర్వాత ఆమె జీవితం ఏమైంది? కొడుకుని వదిలి ఆనందం గా ఉండగల్గిందా? మామగారు ఏ వంశం ముందుకి వెళ్లడం కోసం తల్లీ-బిడ్డలని వేరు చేసాడో, ఆ వంశం లో ఉన్న రహస్యం ఏంటి? అది తెలుసుకున్న మామగారి మానసిక స్థితి ఏంటి? కాత్యాయని పెద్దవాడయిన తన కొడుకుని చూసి పలకరించడానికి వెళ్లినప్పుడు చూపించిన చీత్కారం తో ఏమవుతుంది? ఇదంతా చూసి తీరాల్సిందే. సంభాషణలు అన్నీ ఆణిముత్యాలే. ఆ ఆర్టిస్టుల పేర్లు తర్వాత వికీ లో చూసి ఆశ్చర్య పోయాను. నాకు మరి పాత్రలే కనిపించారు. ఈ మెయిన్ కథ కాకుండా, ప్రొఫెసర్-ఆయన phD విద్యార్థిని కథ, (తమ రిసర్చ్ కోసం జీవితం లో మిగిలినవన్నీ పోగొట్టుకున్న విధానం), అలాగే మామగారు-అత్తగారు-పనిమనిషి మధ్య కథ..

కథంటే అది,..పాత్రలంటే అవి. స్లో నలుపు-తెలుపు చిత్రం, పైగా తెలిసిన కథ ఉన్న సినిమా, సరిగ్గా భాషా రాదు. అలాంటి సినిమా చూస్తూ అంత ఉత్కంఠత నేనెప్పుడూ అనుభవించి ఎరగను.కుదిరితే మీరూ చూసేయండి.. యూట్యూబ్ లో ఉంది.

Friday, February 8, 2013 29 comments

ప్రాజెక్ట్ 2012 - పక్షి ఈకలని సంపాదించడం ఎలా?

చిన్నప్పుడు ఎప్పుడూ క్రాఫ్ట్ క్లాస్ అంటే పరమ బోర్ గా ఉండేది. ఉండదూ మరి? ప్రతి సంవత్సరమూ అదే అదే.. చేతి రుమాలు చుట్టూ కాడకుట్టు కుట్టడం, గొలుసు కుట్టు తో మధ్యలో ఒక పువ్వో, పేరు లో మొదటి అక్షరమో కుట్టడం,లేదా చేతి సంచీ చేయడం.. ఇవి తప్ప ఏమీ ఉండేవి కావు. పైగా, కాస్త పరీక్షలు దగ్గర పడుతున్నాయని అంతమాత్రం క్రాఫ్ట్ క్లాస్ సమయం లెక్కల టీచర్ ఆక్రమించేస్తే హాయిగా ఊపిరి పీల్చుకునే దాన్ని.. మా చెల్లి బాగానే చేసుకునేది. మా అమ్మకి కుట్టుపని లో ప్రావీణ్యం చాలా ఎత్తుకి ఎదిగిందంటే దానికి పరోక్షం గా నేనే కారణం అని సగర్వం గా err. సవినయం గా తెలుపు కుంటున్నాను.


అప్పట్లో అమ్మ మీద పని వేసి తప్పించుకుని హాయిగా తిరిగినా,.. చేసిన పాపాలకి భగవంతుడు చక్ర వడ్డీ తో సహా తిరిగి ఇస్తాడని తెలుగు సినిమాలు డెబ్భై ఐదేళ్లు గా ఘోషిస్తున్నా, ‘అప్పుడు చూసుకుందాం’ లెమ్మని వదిలేశాను ఇప్పుడు ఇద్దరి ప్రాజెక్టుల రూపం లో .. అనుభవిస్తున్నాను. అయినా ఇంత త్వరగా బూమరాంగ్ లా నాకు తిరిగి వచ్చేయాలా? వచ్చే జన్మల్లో ఎప్పుడో నెమ్మదిగా ఇవ్వచ్చు కదా..

నాకు ఆర్ట్ రాదనే కానీ, పని చేసీ చేయనట్లు చేయడం, చేసినట్లు బిల్దప్ ఇచ్చి ఎలాగోలా మానేజ్ చేయడం.. వాట్లల్లో మనం దిట్ట కదా.. ఎలాగోలా నెట్టుకొచ్చేస్తున్నా.. ఎలాగంటారా?

పక్షుల పాఠం చెప్పినప్పుడు నేను పడ్డ కష్టాలు పగవారు కూడా పడకూడదు బాబోయ్..

పక్షి గూడు తీసుకురమ్మన్నారు.. ఐదు మార్కులకి. పక్కావిడ కొబ్బరి చీపురు చీపురు కట్ట, కొబ్బరి బోండాల బండీ పక్కన్నుంచి కొబ్బరి డొక్కలూ, పీచూ, తోటమాలిని అడిగి గడ్డీ వగైరా తెచ్చుకుంది. మా అమ్మాయికి ఇంక ఒత్తిడి పెరిగిపోయింది. మాకు లక్కీ గా “కృష్ణమ్మ వాకిట్లో ఉన్న సిరిమల్లె చెట్టు (గుబురు) లో పిట్ట వదిలేసి వెళ్లిన గూడుండటం తో, అది నెమ్మది గా తీసి కాస్త హంగులేర్పరిచి జాగ్రత్త గా పాక్ చేసి పంపించా. తీరా సాయంత్రం మా అమ్మాయి ముఖం వేలాడేసుకుని వచ్చింది. దీని నిజం గూటికి మూడున్నర వేశారు.. భవానీకి ఐదుకి ఐదు. ఈ స్కూల్ వాళ్లకేం పోయే కాలమొచ్చింది? మరీ పిట్ట పని పిట్ట దానికి చేతనైనట్లు చేసుకుంటే మూడున్నర వేస్తారా? మా అమ్మాయికీ ఐదుకి ఐదు ఈసారి ప్రాజెక్ట్ లో తెప్పించే పూచీ నాది.. అని భీకర ప్రతిజ్ఞలు చేస్తే కానీ మా అమ్మాయి ఊరుకోలేదు...

పక్షి ఈకల ప్రాజెక్ట్ కథ..



సైన్సు క్లాసు లో పిల్లలకి ఏదో, సన్నటి పొడుగీకలు ఎగరడానికి, కుచ్చు లాంటి పొట్టి ఈకలు దీనికీ అని చెప్పి వదిలేస్తే అర్థం ఉంది కానీ, ఎవరైనా ఈకలు పుస్తకం లో అంటించి తెమ్మని చెప్తారా? విడ్డూరం!! తల్లిదండ్రులని ఏడిపించడానికి కాకపోతేనూ.. వదిలేయాలంటే ఐదు మార్కులు పోతాయని పిల్లల గోల.

“నెమలీకల పంఖా ఉంది ఇంట్లో.. దాంట్లోంచి రెండు పీక్కెళ్ళు”.. అన్నా. అది చూసిన చూపుకి జడిసి “సరే తెస్తాలె” మ్మని మాటిచ్చా.

‘ప్రాణ్ జాయే పర్ వచన్ న జాయే’ అని సెంటిమెంట్లు పెద్దగా లేవు కదా.. యదావిధి గా మర్చిపోయా.. డెడ్ లైను ఇంకో వారముందనగా, ‘అందరూ ఈకలు తెచ్చేసుకున్నారు.. మనమే ఇంకా తెచ్చుకోలేదు. ‘ అని అమ్మాయి గోల.

సరే. కాలనీ లో చివర పావురాలు కూర్చుంటాయి కదా. .ఎప్పుడూ అవి చేసే చప్పుడు కి, రాల్చే ఈకలకీ తిట్టుకోవడమే కానీ వాటి అవసరం పడుతుందని అనుకోలేదు. చకచకా వెళ్లి మనమూ నాలుగు తెచ్చుకుందామని పోతే .. నాలుగో క్లాస్ తల్లులందరూ అప్పుడే తీసేసినట్లున్నారు. ఒక్క ఈకైనా లేదు. పాపం నాలాగే ‘లేటు తల్లి ‘ ఇంకో ఆవిడా వెతుక్కుంటూ కనపడింది. ఆవిడ ని పలకరిస్తే..’పర్వాలేదు. మా ఊరినుండి అమ్మా వాళ్లు వస్తున్నారు.. కోడీకలు తెప్పిస్తాను. మీకూ ఇస్తాను లెండి.’ అంది. ఆవిడ ఇచ్చిన భరోసాకి నాకు ఇంక టెన్షన్ తీరిపోయి సుఖం గా కూర్చున్నాను.

రెండు రోజుల గడువు ఉందనగా, మా పిల్ల మళ్లీ గుర్తు చేసింది. సరేనని ఆవిడకి ఫోన్ చేస్తే.. ‘మా అమ్మకి అనుకోకుండా.. ఆయాసమని ప్రయాణం ఆపుచేసుకుంది..’ అంది. తల్లికి అసలే బాగోలేదంటే మనం ఈకలు కావాలంటే బాగుండదని ఊరుకున్నాను కానీ ఏం చేయను? పిల్లతో ప్రమాదం వచ్చి పడిందాయే.. నాకోడీకలు చేతిదాకా వచ్చి జారిపోయినట్లనిపించి నీరసంగా అనిపించింది. అంతలో ఐడియా వెలిగింది.. సరే..స్కూటరేసుకుని మా మెయిన్ రోడ్డు మీద మాంసం కొట్టుకి వెళ్లాను. ‘రెండు ఈకలు ఇస్తావా బాబూ?’ అని మొహమాటం గా అడిగాను. నా అదృష్టం కొద్దీ నాలుగు ఈకలు తీసి ఇచ్చాడు. నాలా చాలా మంది వెళ్లినట్టున్నారు. పెద్దగా ఆశ్చర్యపడినట్లు లేడు.

అన్నీకలూ సన్నని పొడుగైనవే, కుచ్చుల్లాంటి చిన్న ఈకలు డొక్కల దగ్గర ఉంటాయి.. అవి లేవా? అని అడిగాను. ఓసారి నన్ను ఎగా దిగా చూసి “వద్దా? వెనక్కిచ్చేయండి..” అన్నాడు.

“లేదు లేదు..చాలా థాంక్స్!” అని చెప్పి ఇంటికొచ్చా.

‘అమ్మా.. ఫెదర్స్.. ఇచ్చేది రేపే.. గుర్తుంది కదా..” అంది మా అమ్మాయి.

“ఓ! జ్ఞాపకం ఉంది.. రేపు ఉదయానికి ఇస్తాను..” అని చెప్పాను.

పిల్లలు పడుకున్నాకా, ఒక ఈక మాత్రం పక్కన పెట్టి, మిగిలిన ఈకని సగానికి కత్తిరించి, వేరే ఈకనుండి ఫైబర్ కత్తెర తో కత్తిరించి, ఈ సగం ఈక ముక్కకి ఫెవికాల్ తో అంటించి.. మూడు సన్నటి పొడుగీకల నుండి ఒక చిన్న కుచ్చు ఈక ని చేసి తృప్తి గా పడుకున్నా.

మా అమ్మాయి, ఆనందం గా రెండూ తన స్క్రాప్ పుస్తకం లో అతికించి. దాని మీద, వాటిని పక్షులు ఎలాగ ఉపయోగించుకుంటాయో, వివరం గా రాసి ఇచ్చేసింది. నేనూ ‘బ్రతికాను రా భగవంతుడా..’ అనుకుని ఆఫీసుకెళ్లి పోయాను.

సాయంత్రం ఇంటికి వచ్చేసరికి దోవలో కాలనీ స్త్రీలు ఇద్దరు ముగ్గురు మాట్లాడుతూ కనిపించారు. పలకరింపు గా నవ్వితే ముఖాలు తిప్పుకున్నారు. “ఏమయ్యుంటుందా “ అని ఆలోచిస్తూ బాగ్ లోపల పడేయగానే.. మా అమ్మాయి.. “అమ్మా.. మా టీచర్.. డైరీ నోట్ ఇచ్చింది..” అని వచ్చి చూపించింది.

నేను భయం భయం గా (EAMCET ఫలితాలు చూస్తున్నప్పుడు కూడా ఇంత ఉద్విగ్నత లేదు..) నా మోసం పసిగట్టినట్టుంది.. అనుకుని నెమ్మదిగా డైరీ తెరిచి చూశాను.

“క్లాస్ మొత్తం మీద మీరే రెండు రకాల ఈకలూ అంటించారు. మీ అమ్మాయి చెప్పింది. మీరు చాలా కష్టపడ్డారని.. కుచ్చు ఈకలు ఎక్కడ నుంచి తెచ్చారు? ఈసారి ఇంకా కొన్ని తెచ్సిపెదతారా? మా స్కూల్ లో డెమోలకి పనికొస్తుంది...ఆలాగే అవి ఏ పక్షివో వివరాలు రాసి పంపండి..” అని.

‘హమ్మయ్య.. ‘ అని ఉత్సాహం గా లేచి.. “ బందిపూర్ అడవులకెళ్లినప్పుడు అదృష్ట వశాత్తూ దొరికాయి. మళ్లీ వెడతామా? పెడతామా? కావాలంటే మా అమ్మాయి పుస్తకం లోంచి కత్తిరించుకోండి.. అదేం పిట్టదో..నాకు తెలియదు. క్షమించగలరు..” అని జవాబు రాసిన తర్వాత వెలిగింది.. మా లైను ఆడవారు నా ఎడల ఏల కినుక వహించితిరో.. పోన్లే.. ఇప్పుడు కుచ్చీకల రహస్యం చెప్పానంటే స్కూల్లో పరువు పోతుంది. కాలనీ లో ఇజ్జత్ పోతుంది. ఇది కవర్ చేయాలంటే ఏమబద్ధం చెప్పాలబ్బా.. అని ఆలోచన లో పడిపోయాను..

(తదుపరి టపా లో రకరకాల రాళ్లు, మొక్కలు తెమ్మన్నప్పుడు చేసిన గమ్మత్తులు)

 
;