శుక్రవారం సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చాక నాకు ఎక్కడ లేని నీరసమూ ఆవహిస్తుంది. అలా సోఫా లోకి కూరుకుపోయానంటే.. సాక్షాత్తూ యమ ధర్మ రాజు వచ్చి 'నడువ్వ్...' అని కొరడా ఝుళిపించినా 'నా వల్ల కాదు.. రేపు రండని పంపించే పరిస్థితి. అంటే మిగిలిన వాళ్ళంతా చెంగు చెంగున గెంతులేస్తూ ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటారని కాదు. రఘు మాత్రం శనివారం పొద్దున్నే 9 కల్లా ఎక్కడికైనా వెళ్ళే ప్రోగ్రాములు విధి గా వేయటం, చిన్న "డిస్కషన్" లోకెళ్ళటం.. మర్నాడు గెలిచిన వాళ్ళు బెరుగ్గా,.. ఓడిన వారు కసి తీరా నోరు పారేసుకోవటం మాకు మామూలే..
2 వారాల క్రితం సరిగ్గా అలాంటి ఒక శుక్రవారం పూట, నిస్త్రాణ గా సోఫా లో పడి టీ తాగుతున్న సమయాన అసాధారాణ స్థాయి లో ప్రసన్నత నిండిన స్వరం లో "ఆన్నట్టు చెప్పటం మర్చిపోయాను,.. మా ఫ్రెండ్ ఫణి తెలుసు కదా... " అని తను అడగగానే.. నా మనస్సెందుకో కీడు శంకించింది
'ఆ.. గుర్తున్నాడు చెప్పండి ' అన్నాను చాలా భయంగా. తను అంతకన్నా భయభక్తులతో ఎందుకైనా మంచిదని నా చుట్టుపక్కల ఉన్న చిన్న సామాన్లు తీసి నాకు దూరం గా పెడుతూ... నా టీ ఆఖరి చుక్క కూడా అయిపోయిందని నిర్ధారణ చేసుకుని 'చెప్పడం మర్చిపోయాను కృష్ణా.. వాడు రేపు ఉదయం నాలుగ్గంటల ఫ్లైట్ కి దిగుతాడు.. ఒక వారం ఉంటాడట.. ' అని కప్పు విసిరేస్తే లాఘవం గా పట్టుకోడానికి రైనా లా సంసిద్ధమై నుంచున్నారు.
నా ముఖం లో ఎక్స్ ప్రెషన్ మారే లోపలే.. 'వాడికి ప్రత్యేకం గా ఏమీ చేయక్కరలేదు. ఏదో మనతో పాటే కల్లో, గంజో...' అని ఒక పాత కాలం డైలాగ్ కొట్టారు. నాకు ఏమనాలో తోచలేదు. ఊరుకుండిపోయాను. ఫణి నాకు పదేళ్ళకి పైగానే తెలుసు. రఘు కి ఒకప్పటి కో వర్కర్. చాలా డబ్బు మనిషి. కానీ మంచివాడే. ఆడ వాళ్ళకి అతనికి అన్నం పెట్టమంటే ఎంతో ఆనందం గా ఉంటుంది. ఏమి పెట్టినా వంక పెట్టకుండా ఆనందం గా మరో సారి అడిగి వడ్డించుకుని ' అన్నదాతా సుఖీ భవ !! ' అని ఆశీర్వాదం కూడా ఇచ్చి.. ఎలా చేశారో అన్నీ తెలుసుకుని మరీ వెళ్తాడు. కానీ బొత్తి గా మెటీరియలిస్టిక్. అవసరాన్ని బట్టే సంబంధ బాంధవ్యాలు నడిపిస్తాడు.
అదంతా కాదు నా భాధ. వారం క్రితం మెయిల్ పంపి కాల్ చేసి చెప్తే రేపు ఉదయం బ్రాహ్మీ ముహూర్తం లో దిగుతున్నాడని చెప్తే.. మా బట్టలు కొట్టు సద్దేది ఎప్పుడట?" వారం రోజుల్లో ఉతికిన బట్టలు గెస్ట్ రూం లో పడేయటం మాకు అలవాటు. మా మేరీ మడతలు పెట్టి ఉంచినా అవి మా వార్డ్ రోబ్ లో పెట్టుకోవటానికి కూడా ఒక్కోసారి తీరికుండదు. ఓపిక లేకపోవటం తో, ఆయన కేయాల్సిన అక్షింతల కార్యక్రమం సాధ్యమైనంత క్లుప్తం గా ముగించి, గది సద్దటం మొదలు పెట్టాను.
"ఉదయం మూడు కే కార్ తీసుకుని వెళ్ళాలి Airport కి" ... అని అనగానే నాకు కోపం వచ్చింది. "ఏంటి అసలు? అమెరికా నుండి వస్తూ, ఉదయం పూట గంట డ్రైవ్ చేసుకుని రమ్మనమనడమేమిటి? మనమే డ్రైవర్ మీద ఆధారపడతాం, లేదా టాక్సీ తీసుకుంటాం.. " అని ఏదో అనబోయి.. 'పాపం తనకి మొహమాటం ' అని ఊరుకున్నాను. చక్కగా 2 సూట్ కేసులతో దిగాడు ఫణి. టీ తాగుతూ బోల్డు కబుర్లు, కాకరకాయలూ అయ్యాక.. మా పిల్లలూ వచ్చి చేరారు ఆరు గంటలకే.. (స్కూల్ ఉంటే 7.30 చేస్తారు కానీ.. వీకెండ్ మాత్రం ఠంచన్ గా ఆరుకే లేస్తారు మరి).
పాపం ఏం తిన్నాడో ఫ్లైట్ లో.. మొహమాటం గా ఉంటాడేమో నని, మసాలా దోశలు, 2 చట్నీలూ చేసి వడ్డిస్తే.. ఆనందం గా తిని, పొగడ్తలతో నన్ను ముంచెత్తి,... వెళ్ళి పడుకున్నాడు జెట్ లాగ్ అని. మేమంతా కాస్త నెమ్మది గా మాట్లాడుకుంటూ కాలక్షేపం చేశాం సాయంత్రం వెళ్ళి డ్రైవర్, టాక్సీ తో వచ్చాడు. ఈ లోగా మా పిల్లలు "మా బొమ్మలుండిపోయాయి ఆ రూం లో" అని ఎంత నసిగినా మేము ఒప్పుకోలేదు అక్కడికి వెళ్ళటానికి. సాయంత్రం అతనొచ్చాక గది లోకెళ్ళి వచ్చిన పిల్లలు మెరుస్తున్న కళ్ళతో... 'అమ్మా... అంకుల్ బాగ్స్ చుట్టూ, బోల్డు చాక్ లేట్లు, టాయ్స్ అవీ ఉన్నాయి.. మాకు ఇస్తాడేమో కొన్ని... " అని ఉత్సాహంగా చెప్పారు.
"అతను ఎవరికోసం తెచ్చాడో.. మీరు అస్సలూ అటువైపు వెళ్ళద్ద"ని వాళ్ళని మందలించేసాం. ఫణి తో కూర్చుని మాట్లాడుతుంటే... రోజురోజుకీ ఇంకా మెటీరియలిస్టిక్ గా మారుతున్నట్టు అనిపించింది.
'అమెరికా నుండి ఏదీ తేలేదు రా రఘూ,.. మా అక్క చెళ్ళెళ్ళకి, కజిన్లకీ.. ' అన్నాడు. మేము 'ఆ అవును. ఎక్కడైనా ఒకటే ఈ రోజుల్లో.. అన్నీ అన్ని చోట్లా దొరుకుతున్నాయి ' అని అతన్ని సమర్ధించాం. ' ఓ పది వేలు తీసుకుని షర్ట్ కావాలన్న వాడికి షర్టూ, షూలు కావాలన్నవాడికి షూలూ, ఫోన్లు కావాలన్న వాడికి ఫోన్లూ కొని పడేద్దామనుకుంటున్నాను...' అన్నాడు. నాకు వొళ్ళు మండి పోయింది. కానీ సౌమ్యంగా 'అయినా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళే కొనుక్కుంటారేమో ఫణీ.. ఈ మధ్య ఒకరి చాఇస్ ఒకరికి నచ్చటం మానేసింది..' అన్నాను.
డబ్బు సంబంధమైన మాటలు తప్ప, మంచీ, చెడ్డా అనేది అన్నీ వదిలేశాడు. ఇళ్ళూ, స్టాకులూ, జాబులు అసలు ఎంత క్విక్ గా మారుస్తాడో .. అలాంటివి చెప్తూనే ఉన్నాడు. ఆశ్చర్యం వేసింది. డబ్బు మనిషి అని తెలుసు కానీ.. మరీ ముదిరిపోయాడనిపించింది.
ఏదో విషయం మాట్లాడుతూ, 'మా మేనకోడల్ని ఇంట్లో పెట్టుకొమ్మంటున్నారు రా.. మా అక్క/బావగారు. తనకి MS లో సీటొచ్చింది. ఖర్చంతా భరిస్తాం .. కానీ.. సహజం గా భయస్తురాలు. మీతో కొంతకాలం ఉంటే తర్వాత నెమ్మది గా పరిచయాలయ్యాక అపార్ట్ మెంట్ లో కెళ్ళిపోతుంది .. అని..' ' గాడిద గుడ్డేం కాదూ? ' అన్నాను. అని..
అయ్యో అనుకున్నాము. "సుకన్య వచ్చి ఎన్నాళ్ళయింది ఇండియా కి? " అని అడిగితే.. 'తను రాదు రా.. నాకేదో పని ఉందని వచ్చాను. తనకి ఇబ్బంది గా ఉంటుంది. వాళ్ళ అన్నయ్యా వాళ్ళది ఇరుకైన 2 బెడ్ రూం అపార్ట్ మెంట్ ' .. అందుకని రాదు. అన్నాడు.
ఇస్త్రీ అబ్బాయి వచ్చాడు, బట్టలు తీసుకోవటానికి. 'నావీ ఉన్నాయి వేస్తాను ' అన్నాడు. కానీ.. "ఏంటీ!! 5 రూపాయలా? వద్దులే " అని మానేశాడు. పొద్దున్ననంగా ఇంట్లోంచి వెళ్ళి.. అర్థరాత్రి తిరిగి వచ్చేవాడు. రెండో రోజు ఉదయం లేచి హాల్లోకి రాగానే ఎవరో ఉన్నట్టు అనిపించి..'బాబోయ్' అని చూస్తే.. ఫణి డ్రైవర్ ట. హల్లో పడుకున్నాడు. అతనికి కూడా రగ్గూ, దుప్పటీ, దిళ్ళూ.. ఇచ్చారట. ఓహో.. మళ్ళీ ఇదొకటా అనుకున్నాను.
కాసేపయ్యాక చూస్తే.. మోటర్ సైకిల్ స్టార్ట్ చేసిన శబ్దం వినిపించింది. 'అమ్మయ్య.. కందిపప్పు అయిపోయింది అనుకున్నాను. చెప్దాం ' అని నేను బయటకెళ్తుంటే కనిపించింది.. ఫణి డ్రైవర్ తీసుకెళ్తున్నాడని. అతని పర్సనల్ వర్క్ కోసమట. 'అదేంటి? బస్సులో వెళ్ళచ్చు కదా? ' అంటే.. 'పాపం.. బస్ స్టోప్ దూరం కదా' అని నసిగారు రఘు. 'ఫణి కార్ ఉంది కదా..?' అంటే.. 'పెట్రోల్ వేస్ట్ అనీ.' అనగానే నాకు చిరాకు పెరిగిపోయింది. కానీ మొహమాటమొకటేడ్సింది కదా మనకి.
అలా వారం రోజుల పాటూ, ఫణికీ, అతని డ్రైవర్ కీ భోజనం, పడకా, టీ, కాఫీలూ, వారం రోజులకీ వాడుకోవటానికి మా ఇంట్లో ఉన్న మొబైల్ ఫోనూ .. హాయిగా సాగిపోయింది. దేశ విదేశాలు తిరిగిన మహానుభావుడు కనీసం తువ్వాలూ, సబ్బూ కూడా తెచ్చుకోలేదు. తనకే కాక తన డ్రైవర్ కి కూడా ఇవ్వవలసి రావటం ..
ఇంకో రెండు రోజుల్లో వెళ్తాడనగా ...
'క్రిష్నా.. మీ పిల్లలు చాక్లేట్లు తింటారా? ' అని అడిగాడు. 'ఓహో ఇప్పుడు చాక్లేట్లు పడేస్తాడన్నమాట ' అనుకున్నాను. ఎలాగైనా సరే ఫణి ఒక్క పది రూపాయలైనా ఖర్చు పెడుతుంటే చూడాలన్నా ఆకాంక్ష తో..'యా.. పిల్లలన్నాక చాక్ లేట్లు ఇష్టం లేని వాళ్ళు చాలా అరుదు కదా ' అన్నాను. 'ఏ ఫ్లేవర్ ఇష్టపడతారు? వైట్? బ్లాక్? బ్రవున్? ' నేను నిర్లజ్జగా ' ఏదైనా ఓకే.. కాడ్ బరీజ్ సిల్క్ ' వాళ్ళ ఫేవరేట్ అన్నాను.
'ఓకే.. మీరు శుక్రవారం సాయంత్రం మాత్రం ఫ్రీ గా ఉంచుకోండి.. I want to take you all out for dinner. Pick a nice restaurant.." అన్నాడు. సాధారణం గా అయితే.. 'వద్దు ఫణీ.. ఈ హడావిడి లో ఇదంతా ఎందుకూ? ' ససేమిరా ఒప్పుకునేదాన్ని కాదు. అందునా శుక్రవారం రాత్రికి!
కానీ ఒక విధమైన పంతం మొదలైంది. 'సరే ' అని ఒకటి రెండు పేర్లు చెప్పాను. ఇలా చెప్తున్నప్పుడు రఘు.. ముఖం చూడలేదు ఎందుకైనా మంచిదని. :)
శుక్రవారం రానే వచ్చింది. సాయంత్రం 7 అయినా రాడే? ఫోన్ చేస్తే .. 'నాకు లేట్ అవుతుంది ఒక గంట లో వస్తాను ' అన్నాడు. నేను పిల్లలకి 2 దోశలు పెట్టేసి చూస్తున్నాను. 8.30 కి వచ్చి.. "I am very tired. Can we order pizza? " అన్నాడు. సరే అని డామినోజ్ లోంచి అందరికీ పిజ్జాలూ, స్టార్టర్లూ, డెజర్టులూ, కోక్ లూ చాలా ఉదారం గా ఆర్డర్ చేశాడు 1200+ అయింది బిల్లు. ఆర్డర్ ఇంటికి వచ్చాక వెంటనే బాత్ రూం లో కి దూరాడు. ఎంతకీ బయటకి రాడే? డెలివరీ అబ్బాయి నుంచున్నాడు... విసుగ్గా..
సరే ఏం చేస్తాం? అని అయిష్టం గా.. నేనే పే చేశాను. అదేంటో.. కరెక్ట్ గా డెలివరీ బాయ్ బయటకి వెళ్ళడమేమిటి.. 'అయ్యో.. నువ్వు పే చేసావా క్రిష్నా.. ఇదేం బాగా లేదు.. This is my treat ' అన్నాడు. కానీ.. అంతకు మించి ఏమీ రియాక్ట్ అవలేదు. హాయిగా తినేసి.. మర్నాడు.. 'వెళ్ళొస్తాను .. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాను రా" అని వెళ్ళిపోయాడు.
1200 అని కాదు కానీ ఆశ్చర్యం వేసింది అంతలా ఎలా తప్పించుకున్నాడని.. చాక్ లేట్లన్నాడు, ఏ రకం కావాలన్నాడు.. చివరకి తన బట్టలు కూడా మా చేతే ఉతికించి.. వెళ్ళిపోయాడు.. మళ్ళీ అమెరికా చేరానని ఫోన్ కూడా చేయలేదు.
వారెవ్వా.. ఇంక 2 యేళ్ళు ఆడుకోవచ్చు మా వారిని .. ఈ ఒక్క పాయింట్ మీద అనుకున్నాను.
మళ్ళీ అంతలోనే ...
చ చ... ఏమైంది నాకు? అతని స్వభావం అతనిది. నేనెందుకు మారాలి? అతనికి నచ్చిన విధం గా అతనున్నాడు. తన స్వభావాన్ని దాచటానికి ప్రయత్నం చేయలేదు. నేనే దిగజారాను. ఈ విధం గా అతను డిన్నర్ కి ఖర్చు పెడితే నాకు వచ్చేది ఏంటి? ఇలా ఎక్స్ పెక్ట్ చేయటం.. మెటీరియలిజం కాదా? అనుకుని నెమ్మది గా మా గొడవలో మేము మునిగిపోయాము..
నిన్ననే బిల్లు వచ్చింది తను వాడిన మొబైల్ ది. 1700 రూపాయలట..
తన జేబు నుంచయితే కనీసం 5 రూపాయలని ఇస్త్రీ చేయించుకోడా? తనది కాదు కదా అని ఇంత యూజ్ చేస్తాడా?
నెక్స్ట్ ఇయర్ రానీయండి చెప్తాను..
మొన్నీ మధ్యేనా? త్రైమాసిక పరీక్షలయ్యాయి,.. 'ఓ పనై పోయింది బాబూ ' అన్నాను? మళ్ళీ వచ్చి పడ్డాయండీ హాఫ్ యర్లీస్ .. పిల్లలు రెండు నెలల క్రితం ఆఖరి పరీక్ష రాసిన తర్వాత విసిరేసిన పుస్తకాల దుమ్మూ గట్రా దులుపుకుని, చెదలూ అవీ బ్లేడులతో గీకి పడేసి.. ముందరేసుకుని కూర్చున్నారు. ఉదయం నుండీ పదిహేను నిమిషాల సుదీర్ఘ చదువు ఎపిసోడ్ కి 2 గంటల షార్ట్ బ్రేకులు విధి గా తీసుకుంటూ, తెగ అలిసిపోతున్నారు. ఈ ప్రెషర్ తట్టుకోలేక ఉదయం నుంచీ ఒకటే దెబ్బలాట.
ఉదయం నుంచీ చూస్తున్నాను. అసలు ఇద్దరికిద్దరూ ఆగరే? ఇక లాభం లేదని జస్టిస్ కృష్ణప్రియ అవతారం ఎత్తాను. ఇద్దరినీ తలా ఒక గది లో కూర్చోమని హుకుం జారీ చేసాను ..నేను చూడకుండా మళ్ళీ ఒకదగ్గర చేరి 10 నిమిషాలాడుకోవటం.. మళ్ళీ తగవు మూడ్ లోకి వెళ్ళిపోవటం :-( ఇద్దరూ మాట్లాడుకోవటానికి వీల్లేదని తీర్పు ఇస్తే..సైగల్లో మాట్లాడుకుంటూ ఇకిలింపులు.. నిమిషాల్లో గొడవల్లోకి రూపాంతరం చెందటం.. పోనీ ఏక పక్ష తీర్పు ఇచ్చామా? మనల్ని ఫూల్స్ చేసి ఇద్దరూ కలిసిపోతారు!!!
అసలు రోజు మొదలవటమే పెద్ద గొడవతో .. టూత్ బ్రష్ మీద పేస్టు నేను ఫస్ట్ వేసుకుంటానంటే..నేను ఫస్టని రగడ. పరుగు పరుగున వచ్చాను. తగవు తీర్చటానికి.. ఇద్దరూ నా వైపు నేను వర్ణించలేని భావం తో చూస్తున్నారు, తీర్పు ఎలా ఇస్తానా అన్నట్టు. రాం జన్మ భూమి తీర్పు కన్నా వంద రెంట్ల ఉత్కంఠ మా ఇంట్లో..TV రియాలిటీ షో ల్లో ఎవరు గెలిచారో చెప్పే ముందు చూపించే టెన్షన్ వాతావరణం లో..
సరేనని, దీనికి ఒక పరిష్కారం ఆలోచించి ఇద్దరి టూత్ బ్రస్షులూ తీసుకుని వేరే గది లోకెళ్ళి గడియలు బిగించి పేస్టులు వేసి .. ఎందుకో అనుమానం వచ్చి చూస్తే.. గది బయట కిటికీ లోంచి కర్టెన్ల సందులోంచి చూస్తున్నారు, ఎవరికి ఫస్ట్ వేస్తున్నానా అని. 'హమ్మో.. తృటి లో ఎంత ప్రమాదం తప్పింది. నిన్న మా మేరీ కి ఉదారం గా మూడు రోజుల సెలవ గ్రాంట్ చేసినందులు భగవంతుడు ఇన్స్టంట్ గా ఇచ్చిన వరం!!
రోజంతా.. పిల్లల చాడీలతో తల వాచిపోయింది. 'అదిగో నేనేమీ చేయకుండానే నావైపు కోపం గా చూసింది చెల్లి ' అని అక్కంటే .. 'నేను ఏమీ అనకుండా నా పని చేసుకుంటూ కూర్చుంటే.. గట్టిగా అరుస్తూ, కావాలని నన్ను తోసుకుంటూ వెళ్ళింది చెల్లెలుంగారి కంప్లెయింట్.. అంబానీ సోదరులైనా కాస్త మీడియా ముందైనా అన్యోన్యత నటిస్తారేమో కానీ.. వీళ్ళు మాత్రం టాం & జెర్రీల్లా గొడవలు పెట్టుకుంటూనే ఉన్నారు. ఒకపక్క సహనం నశిస్తున్నా.. పరీక్షలప్పుడు ఏడిపించటం ఎందుకని చూస్తున్నాను.
మా పెద్దమ్మాయికేమో,.. 'తప్పు చెల్లిదయినా తిట్లు నాకే పడతాయి. అమ్మ చెల్లిని ఫేవర్ చేస్తుంది ' అని బలమైన అభిప్రాయం. చిన్నదేమో.. 'అక్కంటేనే అమ్మకి ప్రాణం.. నాకు ఎప్పుడూ సెకండ్ ప్రిఫరెన్సే.. అని.. అందుకే అక్క ని ముందు కన్నాక దాన్ని కన్నామని దానికి అంతకన్నా దృఢమైన అభిప్రాయం.
తల్లిదండ్రులకి ఇద్దరూ సమానమే ' అన్న కాన్సెప్ట్ తలకెక్కేలా బోల్డు కథలు చెప్తున్నాను అప్పటికీ.
నాకు ఇంకోటి కూడా గుర్తొచ్చింది.. చిన్నప్పుడు మా అమ్మ చెల్లిని వెనకెసుకొచ్చినప్పుడల్లా.. మా అమ్మ నిజంగా నాకూ అమ్మేనా? లేక నన్ను ఎక్కడినిచైనా తీసుకొచ్చారా అని అనుమానాలు రావటం గుర్తొచ్చింది.
మధ్యాహ్నం, చదువులయ్యాక కాస్త వంట చేద్దాం అని పిల్లలకి ' బ్రేక్ ' ఇచ్చి కూరగాయలు తరగటం మొదలు పెట్టానో లేదో పేద్దగా ఏడుస్తూ ఇంటికి చేరారు ఇద్దరూ.. వెనకాలే పిల్లల గాంగ్ తమాషా చూడటానికి చేరిపోయారు. ముందర బాబోయ్.. ఈ పిల్లలకి ఏ మోకాళ్ళ చిప్పలు పగలడమో, పళ్ళు విరగటమో జరగలేదు కదా అని వంటింట్లో పని అర్థంతరం గా ముగించి చేతులు కడుక్కునేంత లోనే.. ఇద్దరూ ఒకేసారి గట్టిగా వాళ్ళ వాదనలు మొదలు పెట్టేశారు. వీళ్ళకి తోడు పెద్దమ్మాయి స్నేహితులు, చిన్నమ్మాయి స్నేహితులు కూడా.. ఒకేసారి అరుస్తూండటం తో.. కళ్ళు బైర్లు కమ్మి.. 'ఆపండీఈ, ' అని అరిచి.. కచేరీ మొదలు పెట్టాను.
ఇంతకీ విషయం ఏంటీ అంటే..
హానా మోంటానా స్టిక్కర్లట 10 రూపాయలకి ఒకటి చొప్పున దొరుకుతాయి. ఎవరో రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారు. వాటికోసం ఇవ్వాళ్ళ మరీ రోడ్ మీద జుట్లు పీక్కున్నంత పని చేశారు.
సాధారణం గా ఇలాంటి గొడవలప్పుడు.. నాకు మా చిన్నదనం లో అక్కా చెళ్ళెళ్ళంటే వీళ్ళు రా అన్నట్టు ఎంత సఖ్యత గా ఉండేవాళ్ళమో.. కథలు కథలు గా చెప్పటం అలవాటు.. (మన లో మాట.. మా అమ్మా ..అదే కథ చెప్పేది.. "మీలా మేము కొట్టుకుంటే మా అమ్మా-నాన్న సన్యాసుల్లో కలిసిపోయేవాళ్ళు. ఏడుగురు పిల్లలలం ఎప్పుడూ అంబుల పొది లా కలిసి తిరిగే వాళ్ళం అని.. చిన్నప్పుడు అమాయకం గా నమ్మేసేదాన్ని.
ఇంకా నేను మొదలు పెట్టేలోపలే.. మా పెద్ద టపాకాయ.. 'నాకు తెలుసు.. నువ్వూ, పిన్నీ..ఒక్కసారి కూడా జుట్లు పీక్కునేవాళ్ళు కాదు. మేమే బాడ్ ' అంది ఉక్రోషం గా.. నేను వెంటనే రూట్ మార్చేసి.. ' అది కాదు.. నాకూ, నాన్నకీ..' అని ఏదో మొదలు పెట్టబోయాను.. 'మాకిద్దరికీ కొంత పరువు లాంటివి ఉంది. రోడ్డు మీద గొడవ పడితే మేము తల ఎత్తుకోగలమా? ' అని బరువైన డైలాగులు చెప్దామని ముఖం సాధ్యమైనంత సీరియస్ గా పెట్టుకునేంత లో.. మా చిన్న సిసింద్రీ . 'తెలుసు తెలుసు.. మీరిద్దరూ ఎంత ఫైట్ చేసినా.. ఇంట్లోనీ చేస్తారు కానీ..బయట జుట్లు పీక్కోరు.. ' అనేసింది. దానితో అందరం హాయిగా నవ్వేసాం.
Same story in my family aanTee అంది ఎందురింటి ఆరేళ్ళ పిల్ల. 'ఆ ' అని అనేలోపలే ఏడేళ్ళ పక్కమ్మాయి మా ఇంట్లో కూడా మా అమ్మా నాన్న ఫైట్ చేసుకుంటారు కోనీ.. they won' t hit each other aunty.. అంది. ఇంకో పాప.. " మా ఇంట్లో అయితే.. My grandparents also fight with each other like anything Aunty అంది. పక్కమ్మాయి మళ్ళీ అందుకుని.. మా క్లాస్ లో అరుణ్ వాళ్ళ అమ్మా నాన్న fought so hard that.. Arun missed the school yesterday అంది, పెద్ద రహస్యాన్ని కనుక్కున్న దానిలా...
వీళ్ళ ఇబ్బంది కరమైన వాక్ప్రవాహాన్ని ఆపాలంటే మన దగ్గరుంది గా బ్రహ్మాస్త్రం? హా హా హా అని మనసులోనే వికటాట్టహాసం చేసుకుని.. 'పదండి పదండి.. ఇంక చదువు కీ అని మా పిల్లలని లోపలకి లాగి చాయిస్ ఇచ్చాను " చదువుకుంటారా? రండి లేదా.. కలిసి మెలసి ఆడుకోండి.." కాలనీ పిల్లలని.. పోనీ మీరు కూడా వస్తారా? సరదాగా ప్రశ్నలడు... ' అనేలోపలే పిల్లలంతా.. 'గాయబ్, గాన్, (వెళ్ళి ) పోయారు.. పోయ్టాంగ.. గేలే,, పోగిదరే .
టైం దొరికింది గా.. చక చకా టపా రాసేస్తున్నాను.. :)
జ్యోతి గారికి థాంక్స్ తో..
కార్తీక మాసం వనభోజనాలకోసం.. నా వంట.. మెంతి కూర, పండుమెరప కాయల వంటకం, టల్లోస్..
టల్లోస్.. పేరు వెనక కథ..
పండు మెరప కాయల ఘాటు కాస్త అటూ ఇటూ అయితే స్స్ స్స్ స్స్ అని వగరుస్తూ, జగ్గుల కొద్దీ నీళ్ళు తాగుతూ, ' తల్లో స్స్ స్స్ స్స్ ', 'తల్లో స్స్ స్స్ ' అని అరుపులు మామూలు కనక..
మరీ 'నా తల్లో, ఓర్నాయనో' .. అని పెట్టకుండా.. 'త ' ని 'ట ' గా మార్చి 'టల్లోస్ ' అని పెట్టానన్నమాట.
ఇక టల్లోస్ ఎలా చేయాలో తెలుసుకుందాం..
తప్పని సరి గా కావాల్సిన పదార్థాలు:
పండుమెరప కాయలు - 100 గ్రా
మెంతి కూర - ఒక కట్ట
ఉల్లిపాయ - 1 పెద్దది
బెల్లం - చిన్న నిమ్మకాయంత
చింతపండు - బెల్లం ముక్కంత
ధనియాలు - ఒక తేనీటి చెంచా తో
ఉప్పు, పసుపు - తగినంత
కర్వేపాకు - రెండు రెబ్బలు
తాళింపుకి :
4 బల్ల చెంచాల నువ్వుల నూనె, చిటికెడు ఇంగువ, తేనీటి చెంచాడు ఆవాలు, మినప పప్పు
కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే మానేయవచ్చనుకునే పదార్థాలు..
ఉల్లి, వెల్లుల్లి - రుచికి తగ్గట్టుగా
పెరుగు - ఒక కప్పు..
ముందుగా రెడీగా ఉంచుకోవాల్సినవి..
మెరపపళ్ళు :
పండు మెరపకాయలు కడిగి, పొడిగుడ్డతో తుడిచి డైరెక్ట్ గా జార్ లోకే కత్తెర తో ముక్కలు గా కత్తిరించుకోవాలి. ఫుటో లో మూడు రంగులవి ఉంచాను. కొంతమంది ఎర్ర రంగు చూసి.. 'బాబోయ్ ' అంటారని ఒక్కోసారి నారింజ రంగు మెరపపళ్ళు వాడతాను.. ఒక్కోసారి కాస్త మార్పు గా ఉంటుందని ఆకుపచ్చ గా ఉన్న పచ్చిమెరప కాయా వాడవచ్చు.. కాకపోతే.. ఘాటుని ఎంత వరకూ భరించగలమో,.. మన ఇష్టం..
తరిగిన మెరప పళ్ళల్లో, చింతపండు, బెల్లం, ధనియాలు, ఉప్పు,పసుపు, వేసి కచ్చా పచ్చాగా నూరాలి.
మెరప మిశ్రమాన్ని ఒక పక్కన ఉంచుకుని ఇక పొయ్యి వెలిగించటమే తరువాయి!!!
మూకుడు/బాణలి పొయ్యి మీద పెట్టుకుని, నూనె వేసి, కాస్త కాగాక ఇంగువ వేయాలి, పిదప ఆవాలు, మినప్పప్పు వేసి చిటపట లాడేంత వరకూ ఆగి ..
మంట తక్కువ చేసి, మెంతి కూర మూకుట్లోకి సన్నగా కత్తెర తో కత్తిరించాలి.. ముందే తరుక్కుని రెడీ గా ఉంచుకోవచ్చులెండి.. కానీ నాలాంటి లో మెయింటెనెన్స్/త్వరగా వంట ముగించుకుని బయట పడాలనుకునే వాళ్ళు చేసే షార్ట్ కట్స్ అన్నమాట :)
ఇప్పుడు ఇందాక రుబ్బుకున్న మెరపపళ్ళు,మసాలా మిశ్రమాన్ని మూకుట్లో మెంతికూర తురుముకి జోడించి కలియబెట్టి, మంచి సువాసన వచ్చేంతవరకూ సన్నటి సెగ మీద రెండు నిమిషాలు మగ్గనివ్వాలి.
కాస్త మెంతి కూర మగ్గాక, ఇప్పుడు ముందుగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలియపెట్టి పొయ్యి ఆపేయాలి.
పొయ్యి మీద ఉల్లిపాయలు వేడిగా ఉన్న టల్లోస్ లో ఉల్లి ముక్కలు కమిలి రసాన్ని పీల్చి,..జ్యూసీ గా తయారవుతాయి.
తర్వాత, ఒక గిన్నె లోకి తీసుకుని కర్వేపాకు జత చేసి, ఒక పండుమెరప కాయ, పచ్చి ఉల్లి ముక్కలతో గార్నిషింగులు చేయాలి.
రొట్టెల్లోకీ, అట్టు జాతి పదార్థాలతో, పెరుగు-టల్లోస్ వాడవచ్చు. అదెలా చేస్తారంటే.. ఒక కప్పు పెరుగులో ఒక చెంచాడు టల్లోస్ వేసుకుని కలుపుకోవడమే !! వేడి అన్నం లోకి, ఒక చెంచా నెయ్యి తో తినండి..
కలిపాక పెరుగు టల్లోస్ చూడండి.. ఎంత బాగుందో.. దీన్ని టల్లోస్ రాయ్ తా అని కూడా పిలుచుకోవచ్చు..

Sunday, November 14, 2010
గేటెడ్ కమ్యూనిటీ కథలు
56
comments
గేటెడ్ కమ్యూనిటీ కథలు - ఒక్క కప్పు చక్కెరిచ్చారంటే ..
సినిమాల్లో ఇంట్లో ఆడవాళ్ళని చక్కటి హెయిర్ స్టైల్స్, డిజైనర్ వేర్ బట్టలతో, ఫుల్ మేకప్ తో ముఖం మీద చిరునవ్వు చెక్కు చెదరకుండా.. పిల్లలనీ, భర్తనీ ఆనందంగా, హాయిగా స్కూళ్ళకీ, ఆఫీసులకీ పంపిస్తూ, ఉంటారా? భర్తలేమో బోల్డు రొమాంటిక్ మూడ్ తో, పిల్లలు కిల కిలా నవ్వుతూ, కడిగిన ముత్యాల్లా చక్కటి యూనీఫాం లేసుకుని టిఫిన్ చేస్తూ, పరుగులు తీస్తూ చక చక లాడిపోతూ ఉంటారా? అదేంటో మాకు ఒక్క రోజూ అలా జరగలేదు, జరగదు,జరగబోదు.
మా వాళ్ళు బద్ధకం గా, నిద్ర మత్తులో.. చిరాకు మొహాలతో, టై కనిపించలేదని ఒకళ్ళూ, సైన్స్ ప్రాజెక్ట్ కి ఇదే లాస్ట్ రోజని ఒకళ్ళూ, నిన్నేం చేసావు? 9 కి స్కూలైతే ఇప్పుడా చెప్పేది? @్*్$@్ అని అరుపులూ,.. ఈ హడావిడి లో కాలుతున్న గిన్నె ముట్టుకోవటమో, బస్సు వచ్చిందని తినీ తినక పరుగులు తీయటమో.. చేస్తున్నప్పుడు మోగుతుందండీ మా ఇంటర్ కాం.
పోనీ ఎత్తకుండా వదిలేద్దామంటే.. రెండో నిమిషం లో సదరు కాలర్ ఇంటి బెల్లు మోగించీగలరు.. సరే అని,.. దోశ పెనం ఆఫ్ చేసి పరుగున వస్తే .. ' హాయ్ క్రిష్నా.. తుమ్హారే పాస్ ఏక్ ఎక్ష్ట్రా వైట్ టీ షర్ట్ హై? ' అని నాలుగో నంబర్ ఆవిడ ఫోన్. వొళ్ళు మండింది. కానీ.. లేదనటానికి లేదు. ఎందుకంటే ఆవిడకి తెలుసు.. నేను పద్ధతి గా శనివారం ఉతికి, ఆదివారం ఇస్త్రీ చేయించి పెడతానని.. తనకేమో చికాకు. ' స్కూల్ డ్రెస్ ఉతుక్కోరా? వాళ్ళకిచ్చింది మళ్ళీ పిల్లలకి వేయకు.. ' అని వార్నింగ్..
'ఆగండి.. ప్లీజ్.. ఆవిడ వచ్చేస్తుంది..వింటే బాగుండదు.. ' అని బ్రతిమలాడుకుంటూనే.. మా చిన్నమ్మాయి కి ఒక లుక్కిచ్చాను. దాని వెనక ఒక సుదీర్ఘ గాథ ఉంది.
2 నెలల క్రితం ఒకావిడ సాక్స్ అరువు తీసుకుని వెళ్తుంటే.. 'ఆంటీ.. ' అని పిలిచింది. ఆవిడ ముద్దుగా.. 'ఏంటమ్మా? ' అంటే.. 'కెన్ యూ ప్లీజ్ మేక్ ష్యూర్ టు రిటర్న్? ' అంది. ఆవిడ ముఖం లో రంగులు మారిపోయాయి.. నేను ఆవిడకేదో సర్ది చెప్పి.. ఆవిడ వెళ్ళాక.. దీనికి క్లాస్ తీసుకున్నాను.
దీనికేమో.. కంఫ్యూషన్.. 'అదేంటి ? అది నా వస్తువు. నేను ఎవరికైనా ఇస్తే.. నువ్వు నన్ను అడుగుతావు కదా? ' అంది. 'అలా కాదమ్మా... ఇచ్చింది నేను కదా.. చిన్న పిల్లవి.. ఆంటీ ని అలా అడిగితే.. బాగుండదు.. నీ తోటి వాళ్ళనయితే అడుగు .. కానీ, పెద్దవాళ్ళని అడగటం సభ్యత కాదు ' అని చెప్తే.. 'కానీ ఆవిడ ఇవ్వకపోతే..మనకి ఒక జత సాక్స్ తక్కువ ఉంటాయి కదా? ' అంది. ఆరోజున జరిగిన ప్రశ్నోత్తర పరంపర తరువాత.. ఒక ఒడంబడిక చేసుకున్నాము. నేను అప్పిచ్చిన వస్తువులకి నేను బాధ్యురాలిని,.. అలాగే అదిచ్చిన వస్తువుకి అది బాధ్యురాలు. ఒకరి అప్పుల్లో ఇంకొకరు కల్పించుకొన రాదు.. గట్రా ' .. ఇప్పుదు నేను దానికిచ్చిన లుక్ వెనక అంత అర్థం ఉందన్నమాట ..
అశ్చర్యం ఏంటంటే.. ఆ తర్వాత కూడా ఆవిడ రెండు మూడు సార్లు సాక్స్ అడిగింది. కాకపోతే వెనక్కి ఇచ్చినప్పుడల్లా.. సాక్సులతో పాటూ, ఒక చాక్లేటో, బిస్కట్ ముక్కో.. వడ్డీ గా..
మా కాంప్లెక్స్ లోకి వచ్చిన తర్వాత, 'అప్పు ' అనేది మన జీవితం లో ఎంత గా పెనవేసుకుపోయిందో అర్థమయింది.
బిర్యానీ చేస్తున్నాను.. మీ దగ్గర మసాలా లు ఉన్నాయా ? అని ఫోన్.. 'ఆ ఆ రండి.. పర్వాలేదు..' అన్నాను. ఆవిడ వెళ్ళేటప్పుడు మొహమాట పడుతూనే 2 కాప్సికం లూ, ఒక పెద్ద ఆలుగడ్డ, 2 కారట్ లూ, తీసుకెళ్ళింది. ఆ చేత్తోనే రెండు కీరా లున్నూ.. మరి బిర్యానీ లోకి రాయితా లేకపోతే బాగుంటుందా? పూర్వం బ్రాహ్మలకి ఇచ్చే స్వయం పాకం కాన్సెప్ట్ గుర్తుకొచ్చింది. ఈవిడ ఒక ఎత్తైతే.. ఇంకో ఆవిడ 'మీ ఇంట్లో గోధుమ పిండి ఉందా? ' అంది. ఉంది, రమ్మంటే.. చిన్న డబ్బా తీసుకొచ్చింది. 'మా వారు పిజ్జా ఆర్డర్ చేశారండీ.. మా అత్తగారు పిజ్జా తినరు. ఆవిడకి మటుకు 2 పుల్కావులు చేశానంటే.. రేపు బజారు కెళ్ళినప్పుడు.. అన్నీ తెచ్చుకుంటాము..' అంది. 'మా తల్లే.. ' అనుకుని.. పోన్లే.. పుల్కాల్లోకి ఆధరువులకి కావలసినవి అడగలేదు ' అని ఆనంద భాష్పాలు కార్చినంత పని చేశాను.
మా అమ్మ ఈ మధ్య వచ్చినప్పుడు 'ఇదెక్కడి గోలే.. ఇలాంటి అప్పులు కనీ వినీ ఎరగం .. చెప్పటానికేమో గేటెడ్ కమ్యూనిటీ.. అందరికీ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు.. ఫారిన్ కెళ్ళి తిరిగి వచ్చినవాళ్ళు.. కాని తెల్లారితే చాలు .. ''మజ్జిగుందా? మెంతులున్నాయా? మైదా పిండుందా? చీ చీ ' అని తన నిరసన నానా విధాలు గా వ్యక్తం చేసింది.
'అదేంటమ్మా అలాగంటావు? మీకంటే.. ఇల్లు దాటి రెండడుగులేస్తే చాలు దుకాణం. మరి మాకో.. కనీసం 2 కిలో మీటర్లు నర సంచారం లేదు కదా.. మెయిన్ రోడ్డెక్కాలి.. బండి చేతిలో ఉండాలి,.. కొంతమందికి బండి ఉన్నా డ్రైవింగ్ రాదు కాబట్టి డ్రైవర్ ఉండాలి.. ' అని సమర్థించాను మా కాలనీ వాళ్ళని.'
'అవును లే.. స్విమ్మింగ్ పూల్, జిమ్మూ, బాట్మింటన్ కోర్టూ కావాలంటే 2 అడుగులేస్తే చాలు.. ఉప్పు లాంటి తుచ్చమైన పదార్థాలు కావాలంటే మాత్రం 2 కిలో మీటర్లు వెళ్ళాలి.. వారెవ్వా' అన్నారు మా నాన్నగారు.
అనగానే నవ్వొచ్చింది కానీ, అది నిజమే.. ఇరవై నాలుగ్గంటలూ డ్రైవర్లు అందుబాటులో ఉండరు కదా.. పైగా.. దుకాణాలు ముందర, ఫోన్ లో ఆర్డర్ చేస్తే 15 నిమిషాల్లో తెచ్చి పడేసేవారు. కాస్త వాటి మీద ఆధారపడుతున్నామని తెలిసాక,.. నెమ్మదిగా 2 గంటలైతేనే కానీ డెలివర్ చేయట్లేదు. కొన్ని పెద్ద కమ్యూనిటీలల్లో ఒక మనిషి పనే ప్రతి గంటా.. దుకాణం లోంచి ఆర్డర్ చేసిన వస్తువులని గుమ్మం ముందుకి చేరవేయడం ట!!
'అవును.. ఇళ్ళు కొనుక్కునే ముందర, ఆ ఏముంది.. కార్లున్నాయి, స్కూటర్లున్నాయి, డ్రైవర్ ఉంటాడు,.. కావాలంటే దుకాణం అతను సామాన్లు ఇంటికి చిటికెల మీద తెచ్చి పడేస్తాడు.. ' అనే assumptions మీద కొనేస్తారు.. మారే డ్రైవర్లు, వాళ్ళ సెలవలు, దుకాణం అతని latency లాంటివి పట్టించుకోరు .. తర్వాత ఏముందీ... కాస్త బియ్యం ఇస్తావా? బూట్లిస్తావా? ' అని ఇంకోళ్ళింటి మీద కి వెళ్ళటం..' అని వాక్ప్రవాహం కట్టలు తెంచుకోకముందే టాపిక్ మార్చేసి.. వేరే పనుల్లో పడ్డాం.
ఈ దుకాణాలు దూరమవడం తో అయిన అలవాటు,.. నెమ్మదిగా సాక్సులూ, స్కూల్ డ్రెస్సులూ, అడగటం దాకా వచ్చిందన్నమాట. ఈ విధం గా ఏడాది లో కాలనీ ప్రజానీకం, గార్డెన్ లోకి గడ్డపారలూ, పార్టీలకి చీరలూ, రాయితా లోకి పెరుగూ, రొట్టెల్లోకి గోధుమ పిండీ, ఉప్మా లోకి బొంబాయి రవ్వా, లాంటివి ఇచ్చి పుచ్చుకోవటం లో సిద్ధహస్తులమైపోయాం.
మొదట్లో ఆశ్చర్యంగానూ, చిరాకుగా నూ ఉండేది, నెమ్మదిగా ఇవి నాకూ బాగానే అలవాటయినట్టున్నాయని నాకు క్రిందటి వారమే అర్థమయింది.
ఇంట్లో అందరికీ ఒకరి తర్వాత ఒకరికి, వైరల్ జ్వరాలు తగలడం తో ఎక్కువ గా దీపావళి కి బజారు పనులు చేసుకోలేకపోయాము. మా ఆడపడచు కుటుంబాన్ని పండగ కి సరదాగా రమ్మంటే, తెల్లవారుఝామునే రైలు దిగారు, అందరం కాఫీలు తాగుతూ, కబుర్లు చెప్పుకుంటుండగా.. 'పండుగ కదా..మంచి ముగ్గు పెడదాం రమ్మని మా అమ్మాయి ని అడిగితే సరే అంది. అప్పుడు గుర్తొచ్చింది.. 'అయ్యో ముగ్గు, రంగులు మర్చిపోయాం కొనటం ' అని. పోన్లే మైదా/బియ్యప్పిండి తో లాగించేయవచ్చు. పసుపూ, కుంకుమా ఉండనే ఉన్నాయి రంగులేయటానికి.. ' అనుకుని చూస్తే..గుర్తొచ్చింది. పిజ్జా చేస్తున్నాం.. మైదా పిండి తక్కువైందని ఇరవయ్యో నంబరావిడ మైదా పిండి అప్పుగా తీసుకెళ్ళిన సంగతి!!!
మా పక్కావిడ ని క్షణం ఆలోచించకుండా అడిగేశాను.. 'ముగ్గు పిండి కాస్త ఇస్తారా ? ' అని. ఆవిడ.. అంత మామూలుగానే .. ముగ్గు పిండి , రంగుల పెట్టే ఇచ్చింది. ఈలోగా.. ఫైనల్ గా మా అమ్మాయి.. చాక్ తోనే వేస్తానందనుకోండి..
ఆవిడ, 'కొంజెం మన్ జల్ వేణుం.. ' అంది. పులిహార చేద్దామనుకుంటోందట. మా ఆడపడచు ముక్కున వేలేసుకుంది.,, ఏదో అవసరార్థం అడిగారంటే తప్పులేదేమో కానీ.. పులిహార లోకి పసుపూ, ఇంటి ముందుకి ముగ్గూ .. 'ఇదేంటి వదినా..' అంటూ.. నాకూ సిగ్గేసింది..
ఇకనుండీ ఇంటి ఎవరైనా వచ్చినప్పుడు ముగ్గు పిండి అప్పు అడగకూడని దృఢ నిశ్చయం చేసుకున్నాను. ఒకవేళ నేనడిగినట్టు కనిపిస్తే.. మీరు నాకు గుర్తుచేయాలి సరేనా?
పాత గేటెడ్ కమ్యూనిటీ కథలు..
http://krishna-diary.blogspot.com/2010/08/blog-post.html
పరీక్షలయ్యాయి అమ్మయ్య ' అనుకునేటప్పటికి, స్కూల్లో కల్చరల్ వీక్, స్పోర్ట్స్ డే, పిక్నిక్, తల్లిదండ్రులని పరుగులెత్తించి వదిలిపెట్టారు 10 రోజులకి! దసరా సెలవలు. 3 నెలల క్రితమే నిర్ణయం అయిపోయింది ఈసారి కన్యాకుమారి కి వెళ్ళాలని. రైల్వే వెబ్ సైట్ లోంచి 90 రోజుల ముందు చేసుకోవచ్చు అనగానే టికెట్లు ఉదయం 10 కే చేసేశాం. అప్పటికే మాకన్నా ఫాస్ట్ గా 150 కి పైగా బెర్తులు బుక్ అయ్యాయంటే.. 'ఔరా..' ఎంత ప్లాన్ డ్ గా ఉన్నారు మన ప్రజలు ? అని హాచ్చర్య పోయాం.
ఈ లెక్కన హోటళ్ళూ బుక్ చేసుకోకపోతే రైల్వే క్లోక్ రూం లో సామాన్లు వేసి ఏ చెట్టు కిందో స్నానాలూ అవీ కానివ్వాల్సి వస్తుందని భయం వేసి,.. ఆరోజే హోటల్ గదులూ బుక్ చేసేసి ఊపిరి పీల్చుకున్నాం. ఆఫీసులో బాసుడికి ఒక ముక్క చెవిన వేస్తే సరిపోతుందనుకుంటే నాకా,... క్రాస్ అయిన డెడ్ లైన్లు మూడు ఉన్నాయి!!! అని మాట్లాడకుండా నెమ్మది గా సిస్టం లో లీవ్ అప్లై చేసి ఊరుకున్నాను.
మా బాసొకరుండేవారు. ఆయన ఇండియాకెళ్ళి వచ్చాక రెండు ఫొటో ఆల్బుం లు ఆఫీస్ లో పెట్టుకునేవారు. ఒకటేమో, అందరికీ చూపించటానికి.. .. గోవా బీచుల్లో, స్టార్ హోటల్లలో,.. దేవాలయాల్లో..
ఇంకోటి దేశీలకు మాత్రమే!!.. వాళ్ళ కుటుంబం నడిపే దుకాణం, ఇంట్లో ఉయ్యాలా బల్ల మీదవీ, వాళ్ళింట్లో జరిగిన శుభకార్యాల ఫొటోలూ, ఉండేవి.
అలాగే మా సెలవలు ఎలా గడిపాం అంటే.. ' యా.. ఇట్ వాజ్ గుడ్ యూ నో.. వీ హాడ్ టూ మచ్ ఫన్!!
కన్యాకుమారి లో యూ నో.. సన్ రైజ్ చూసి తీరాలి !.. నెవర్ మిస్ ఇట్ వెన్ యూ గో!! వివేకానంద మెమోరియల్.. మాన్!! ఎంత ప్రశాంతం గా ఉందో.. ' అని ఆఫీస్ వాళ్ళకీ, మా చుట్టుపక్కల నివసించే వాళ్ళకీ, చుట్టాలకీ వర్ణించి వర్ణించి చెప్తున్నాం.. నిజంగా సెలవల్లో ప్రయాణాల్లో ఎన్ని సాధక బాధకాలు? రెండు భాగాలు గా బ్లాగ్ మిత్రులతో సెలవల అనుభవాలు పంచుకుందామని..
ప్రయాణం రెండు రోజుల్లోకి వచ్చింది..
అల్మారీలన్నీ బట్టలతో నిండి తలుపు తీయగానే ఆనకట్ట కి గేట్లు తీసినట్టు పొర్లి పడతాయా? ఉతికేటప్పుడు, మడతలు పెట్టేటప్పుడు, ఐరన్ చేసేటప్పుడు కనపడే గుట్టల గుట్టల బట్టల్లో.. ప్రయాణానికి సద్దుకుందామంటే ఒక్కటీ కనపడదే..? కొన్ని వెలిసినవి, కొన్ని సడెన్ గా ష్రింక్ అయినవి (అబ్బే నేను లావు అవ్వటం వల్ల కాదు లెండి.. కొన్ని బట్టలు 20-30 ఉతుకుల తర్వాత కూడా నాలుగైందు వారాలు వాడకపోతే ష్రింక్ అవుతాయన్నమాట!)
సరే, ఫొటోల్లో ఉండిపోతాయి నాలుగు జతలు మంచివి కొనాలి,... పైగా ఆఫీస్ డెడ్లైన్ ఒకటి మిగిలింది నా ప్రాణానికి.. అర్థరాత్రి దాకా ఆఫీస్ పనీ, ఒక పక్క షాపింగ్, ఇంటి పనులూ,.. సతమతమవుతుంటే.. ఇదే బెస్ట్ సమయం అని మా డ్రైవర్ వాళ్ళావిడ కి 2 వారాల ముందే నొప్పులు మొదలైపోయాయి. అర్జెంట్ గా సెలవు పెట్టేశాడు. ఏడ్చినట్టుంది ' ఇంతకన్నా దురదృష్టం ఉంటుందా? ' అనుకున్నాను ఇంకో షాక్ ఉందని తెలియక..
ఇంటికి రాగానే మా పని అమ్మాయి ఇంకో బాంబు పేల్చింది. క్రిష్టియన్ మహా సభలున్నాయి అక్కడికి వారం రోజులు వెళ్ళాలి.. సెలవిప్పించమని.. ' అయ్యో రేపు రావా? ' అని అడుగుదామనుకుని.. ఎందుకైనా మంచిది.. మా బాసు దగ్గరా, పని మనిషి దగ్గరా ఫేవర్లు అడిగితే, ఇంతకి అంత అని వసూలు చేసుకుంటారు అని గుర్తొచ్చి.. నోరు మెదపకుండా ఊరుకున్నాను.
అసలే ఒక పక్క చస్తుంటే, మా స్నేహితురాలు ఇచ్చిన సలహాలు... ఆఫీస్ లో విన్న టెక్ టాక్ లా వినీ విననట్టు వదిలేశాను. (క్రిష్నా.. జుట్టు ట్రిం చేయించుకో.. ఫేషియల్ చేయించుకో.. ఈ మాసిన బ్యాగ్ వదిలేసి మాంచి డిజైనర్ బ్యాగ్ కొనుక్కో.. అక్సెసరీస్ మర్చిపోకు.. లాంటివి)
నా షాపింగుల తోటే చస్తుంటే.. ఆఖరి రోజున రెండు పుట్టిన రోజు పార్టీలు. మా పిల్లలు గిఫ్ట్ లేకుండా వెళ్ళే ప్రసక్తే లేదని తేల్చారు. ఇక నా పరిస్థితి సంబరాల రాంబాబు దే అయ్యింది. ఆఖరి నిమిషం షాపింగ్ లో బట్టలూ, రైల్లోకి చిరుతిండీ.. లాంటివి కొని తెచ్చుకుని లిస్టులేసుకుని సూట్ కేసులు దించి చూస్తే జ్ఞాపకాల పొరల్లో ఎక్కడో అట్టడుగున తప్పిపోయిన బట్టలు, వస్తువులు!!! .
అసలు మనకున్న బట్టలకి ఎక్కడికెళ్ళినా ఇంకా ఇంకా కొని, లెక్కా పత్రం లేకుండా పడున్నాయి. లాస్ట్ టైం హైదరాబాద్ నుండి సోమవారం ఉదయం రైల్లో రావటం వల్ల ఆదరా బాదరా గా ఆఫీస్ కి పరిగెట్టి.. శని వారం వచ్చేదాకా సమయం లేకపోవటం వల్ల అలాగే అటక కెక్కించిన బాబతు అనుకుంటా.. అప్పుడే డిసిప్లిన్ గురించి అందరికీ లెక్చర్ ఇచ్చానేమో..నాలుక కరుచుకుని, ఎవ్వరూ చూడలేదు కదా అని దాచేసాను
పిల్లల దెబ్బలాటలకి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ల్లో గంటకి 30 రేట్ లో మొదట అనునయం గా, తర్వాత కఱకుగా, పిదప బెదిరింపులతో, అటు పిమ్మట (ఏమరుపాటులో ఉంటే గుండె ఆగిపోయేలా) అరుపులతో తీర్పులిస్తూ, ప్రయాణానికి సద్దుకోవటం, .. బాస్ ఫోన్ కాల్స్ సాధ్యమైతే ఎవోయిడ్ చేసి, కుదరకపోతే.. టైలర్ల లాగా 'పని తప్పక అయిపోతుంది .. మీకెందుకు.. నేనున్నాను కదా.. మర్చిపోండి ' .. అని అబద్ధపు ప్రామిస్ లు చేస్తూ, మానేజ్ చేస్తుంటే.. హాయిగా కామన్ వెల్త్ ఆటలు ఆస్వాదిస్తున్న తండ్రీ కూతుర్లని చూస్తే, వచ్చిన ఇరిటేషన్ ముందు సల్మాన్ కి వివేక్ ఒబ్రాయ్ ని చూస్తే వచ్చే భావం దిగదుడుపే..
అసలే పిల్లలకి బట్టలు, స్విం సూట్లు, కెమేరా, కాం కార్డర్, సెల్ ఫోన్లు, అన్నిటికీ చార్జర్లు, ప్రయాణం లో బోర్ అవకుండా ఎలక్ట్రానిక్ సాధనాలు, ఆటలు, తినుబండారాలు, పుస్తకాలు, బ్యాగులకి బ్యాగులు నిండిపోతున్నాయి. మేము తల పట్టుకుని కూర్చుంటే.. మా పక్కావిడ వచ్చి.. అక్కడంతా వర్షాలు.. టీ వీ చూడలేదా? గొడుగులు మర్చిపోవద్దు అని చక్కా వెళ్ళింది.
మిగిలిన పాలు,పెరుగులు, కూరగాయలు, ఎవ్వరికిద్దామన్నా.. అందరూ ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు. పనమ్మాయా లేదు. సరే అని మాకున్న సామాన్లు చాలక, ఇంకో ప్లాస్టిక్ బ్యాగ్ లో ఇవన్నీ పెట్టుకున్నాం దోవ లో ఇల్లు కడుతున్న కూలీలకి ఇచ్చేందుకు..
బోల్డు ఆటోవాళ్ళున్నారు లక్కీగా అనుకుంటూ, కార్ దిగగానే..
ఆటో కావాలా సార్,.. అంటూ ఆగిన ఆటో అబ్బాయిలకి మా సామాన్లను చూడగానే ముఖం మీద ఒక సామ్రాట్ అశొక్, ఒక శ్రీకృష్ణదేవరాయల, లేదా, అక్బర్ బాద్షా రాజసం,ఠీవీ ఆటోమేటిక్ గా వచ్చేసాయి.. ఎంతకి మాట్లాడామో, తలచుకుంటే అబ్బో.. కన్యాకుమారి కి ఇంకో టికెట్ వచ్చేదేమో అనిపించింది.
అసలు ఎక్కడినుండి ఎక్కడికెళ్ళాలన్నా.. ఇన్ని సామాన్లవుతాయేంటో.. జనాలు హాయిగా నవ్వుతూ తృళ్ళుతూ పుల్ ఆన్ లు సుతారం గా పట్టుకుని లాగుతూ వెళ్తుంటే.. మేము మాత్రం 9 శాల్తీ లతో చెమటలు కక్కుతూ ఆటోలు దిగాము :-( 'కెమేరా నీ దగ్గరే ఉంది కదా? నీ పర్స్ ఉన్న బ్యాగ్ ని కూలీ కి ఇవ్వకు.. లాంటి అరుపులతో ఎలాగోలా మా ప్లాట్ ఫాం మీదకి వచ్చి.. రైలెక్కి సామాన్లు సద్దుకుని కూర్చున్నాం..
ఇంకా స్టేషన్ లో ఆటోలోంచి దిగకముందే.. పిల్లలు 'అమ్మా.. బాత్ రూం ' అని ఒకరు, టింకిల్ కొంటావా అని ఒకళ్ళు ' పీకి పాకం పెట్టగా..రైల్వే స్టేషన్ లో ఉరుకులూ, పరుగులతోనే సరిపోయింది.
మనస్సు లో మాత్రం,.. వంటింటి కిటికీ వేసానో లేదో, వచ్చేముందు చెత్త అంతా ట్రాష్ బ్యాగ్ లో పెట్టాను తలుపు పక్క.. బయట పెట్టానో లేదో.. లాంటి అనుమానాల గాఢత 'కుప్పం స్టేషన్ ' వచ్చేంతవరకూ తగ్గలేదు.. రైలెక్కి సామాన్లు పెట్టుకున్నామో లేదో.. హాయిగా వెనక్కి వాలదామని ఇలా కూర్చున్నానో లేదో..
' అమ్మా.. పూరీలు తీస్తావా? చాలా హంగ్రీ గా ఉన్నాను.. ' అని ఒకళ్ళు.. రైల్లోకి ఏది వస్తే అది కొనమని ఒకళ్ళు గొడవ గొడవ చేసి. పది అయ్యేదాకా తిండి కార్యక్రమం లోనే ఉండి.. కాస్త క్లీన్ అప్ చేసుకుని మళ్ళీ వెనక్కి వాలదామనుకునే సరికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మళ్ళీ బాత్ రూం..
రైలెక్కాక ఎన్నెన్ని చేయాలని ఊహించుకున్నానో,.. ఎంత ఆప్యాయంగా పుస్తకాలు తీసుకెళ్ళానో..
ఇంక ఎలాగో పిల్లలని పడుకోబెట్టి, పూర్తి చేయకుండా వచ్చిన ఆఫీస్ పని ముల్లు లాగా గుచ్చుకుంటుంటే, ఆ ఆలోచనలు మనస్సు లోంచి తోసేస్తూ .. నా పుస్తకం తీసి చదువుదామని కూర్చుకునేసరికి అలసట.. తో కళ్ళు మూసుకుపోయాయి.. :-(
నాన్నగారికి బీ పీ తగ్గట్లేదని డాక్టర్ కి చూపిస్తే హార్ట్ ప్రాబ్లం, రక్తనాళాల్లో బ్లాకులున్నాయి, ఏంజియోప్లాస్టీ చేయాలి అన్నారని చెప్పగానే విపరీతమైన దిగులు వేసింది. యుద్ధ ప్రాతిపదిక మీద నేనూ, మా తమ్ముడూ వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నా రెక్కలు కట్టుకుని వాలిపోయాం. చెల్లీ, మరిదిగారూ ఇల్లూ, వాకిలీ వదిలేసి హాస్పిటల్, ఆఫీసూ, అమ్మా వాళ్ళ ఇల్లూ తిరగటం మొదలుపెట్టారు. ఒక పక్క మా అత్తయ్యలు దిగిపోయారు. మా బాబాయి పిల్లలు ఊర్లోనే ఉంటారు, వాళ్ళూ పొద్దున్నా సాయంత్రం ఫోన్లు చేసి ఊదరగొట్టారు. . ఊళ్ళోనే 2 కి మీ దూరం లో ఉండే అమ్మమ్మ అమ్మకి సపోర్ట్ గా వచ్చేసింది. పెద్దమ్మ కుటుంబం ఇంచుమించు ఇంట్లోనే ఉంటున్నట్టు లెక్క.
ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇల్లు కళ కళలాడిపోయింది. వంటలు,వార్పులు, ఆ రిపోర్టుల గురించి గంటల కొద్దీ చర్చలు, జోకులు.. వేళాకోళాలు. అదేదో పెళ్ళి సందడి లాగా.. మేము 'కాస్త గుమ్మడి లా దుఖం గా మొహం పెట్టి శాలువా కప్పుకుని గడ్డం పెంచుకోండీ 'శూన్యం లోకి చూస్తూ, నిట్టూరుస్తూ, జీవితం నీటి బుడగలాంటిది ' అని కాస్త బరువైన డైలాగులు చెప్పండి అని మేము ఆయన్ని ఆట పట్టించాము. ఆయన అంత సరదాగానూ తీసుకుని,.. ఇంకొంచెం కూర వేసుకోమ్మా.. లేకపోతే.. నా ఈ చిన్ని హృదయం, సన్నని రక్తనాళాలూ తట్టుకోలేవమ్మా...తట్టుకోలేవు .. ' అని సినీ ఫక్కీ లో డైలాగులు కొట్టారు.
పరీక్షల ముందు రోజు దాకా పుస్తకాలు దులపనట్టు గా, రెండేళ్ళ క్రితం కొన్న షుగర్ టెస్ట్ మెషిను అట్టపెట్టె లోంచి తీసి మాన్యువల్స్ చదవటం మొదలు పెట్టాం. మా పిన్ని కూతురు తెచ్చిపెట్టిన బీపీ మిషను ఒకళ్ళం తెరిచాం.
ఒక్కసారి గా, అన్నం,పప్పూ, ఎఱ్ఱావకాయా, కమ్మని నెయ్యీ, మెంతికారం, బెల్లం వేసి చేసిన చిక్కని పులుసు కూరలూ, మజ్జిగ పులుసులూ, జీలకర్ర కారం వేసిన గుత్తి కూరలూ, చెవులూరించే రోటి పచ్చళ్ళూ, చల్ల మెరపకాయలూ, గుమ్మడి వడియాలూ, అప్పడాలూ, ఆవపెట్టిన పెరుగు పచ్చళ్ళూ, ముద్ద కూరలూ, , ఎఱ్ఱ గా వేయించిన వేపుళ్ళకూ ఆయన పళ్ళెం లో స్థానం లేకుండా పోయి, , ఒక్కసారి గా 75 గ్రాముల ముడి బియ్యం తో చేసిన అన్నం, ఆవిరిపై ఉడికించిన ఉపూ వేయని కూరలూ, చక్కెర లేని తేనీరూ, మీగడ తీసిన మజ్జిగా, అవీ లిమిటెడ్ గా...
తెనాలి రామలింగడు ప్రూవ్ చేసినట్టు అందరం, మా మిడి మిడి జ్ఞానాన్ని ప్రదర్శించి ఏవి తినవచ్చో, తినకూడదో,.. గూగుల్ నుండి, మా స్నేహితుల ద్వారా నేర్చుకున్న విషయాలతో ఉక్కిరి బిక్కిరి చేశాం.
ఇది చాలదన్నట్టు మాకు తెలిసిన వారికెన్ని హార్ట్ బ్లాకులు ఎంత శాతం పూడుకుపోయాయో, వారే జాగ్రత్తలు తీసుకుంటున్నారో, వర్ణించి వర్ణించి.. వదిలిపెట్టాం. పనిలో పనిగా.. అమ్మమ్మగారు ముగ్గురు నలుగురు దేవుళ్ళకి మొక్కేసుకున్నారు.
మా నాన్నగారు అటక మీదనుంచి ఎప్పుడో కొన్న పుస్తకాలు వెలికి తీయించారు. 'హార్ట్ ఎటాక్, రక్త పీడనం, చక్కెర వ్యాధీ లాంటి టైటిళ్ళు. ఈ పుస్తక పఠనం వల్ల ఇంకా కొత్త కొత్త అనుమానాలొచ్చాయి ఆయనకి. మచ్చుకి.. 'అవునూ.. ఈ స్ప్రింగుల్లాంటివి రక్త నాళాల్లో అమరిస్తే.. కొన్నాళ్ళకి ఆ స్ప్రింగ్ పక్కనున్న కొవ్వు కరిగితే ఆ స్ప్రింగులు జారి గుండె లోకి జారవు కదా..???', ఆ స్ప్రింగులకి తుప్పు పడితే? స్ప్రింగ్ రక్త పీడనానికి ముక్క విరిగితే?' లాంటివి. ఇక అందరూ ఆయన మీద గంతేసి పుస్తకాలు బయటకి గిరవాటేయించేదాకా శాంతించలేదు..
సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలా? లేక ఆయన దగ్గరే చేయించుకోవాలా అని వాదోపవాదాలు చేసి చేసి ఇక ఓపిక లేక సరే ఈ డాక్టర్ మీదే తల్లిదండ్రులకి గురి కాబట్టి ఆయనతోనే చేయిద్దామని నిర్ణయం చేసుకున్నాం. ఇక మా నాన్నగారు 'నా దగ్గర పైకం ఉంది. ఎవ్వరిమీదా ఆధారపడవలసిన అవసరం లేదు. నేను ఖర్చు పెట్టుకుంటాను ' అనేశారు. 'అదేంటి.. అంటే నేను లేననుకున్నారా? ఇన్స్యూరన్స్ తీసుకున్నది ఎందుకు ? నా అవసరమే లేదూ అని మీరు తేల్చి చెపితే ఇక నేనెందుకు ఇక్కడ?. రాత్రి బస్సుకి పోతానని తమ్ముడు అలిగాడు. వీళ్ళని చూసి ఎందుకైనా మంచిదని నా ఆఫీస్ ఇన్ష్యూరన్స్ కాగితాలు ఇంక సంచీ లోంచి తీయలేదు.
ఇక నాన్నగారు పదే పదే అదే కథ ని పాల అబ్బాయి దగ్గర్నించీ, పక్కింటాయన దాకా, చిన్నత్తయ్య ఆడపడచు నుండీ, మా బాబాయి గారి వియ్యకుండిదాకా చెప్పి చెప్పి బుగ్గలు నొప్పెట్టి పడుకున్నారు. 2 లీటర్ల పాలు ఎక్కువ తెప్పించి పరామర్శకి వచ్చిన వాళ్ళకి టీ లూ, కాఫీలూ ఏర్పాటు చేశారు.
ఈలోగా, ఎలాగూ అందరం ఉన్నాం అని మా అమ్మ ఇంటిముందుకొచ్చిన పచ్చి చింతకాయలు తొక్కి కబుర్లాడుతూ పచ్చడి చేసి అందరికీ వాటాలు చేసి కవర్లలో పెట్టింది. కోరుకొండ నుండి మా బావగారి అక్క వస్తూ, అందరికీ అప్పడాలూ, మాంచి ఇంగువ వేసిన అప్పడాల పిండీ భరిణె లో తెచ్చి పెట్టింది.
2 లక్షల పైనే ఖర్చు ఉందని తేలింది. రక్తనాళాల్లో వేసే స్టెంట్ అనే పరికరం భారతదేశం లో తయారయ్యిందయితే 87 వేలు, జర్మన్ స్టెంట్ అయితే లక్షా, అమెరికన్ దయితే 1.25 లక్షలూ అని చెపితే.. ఏది బెస్ట్ అయితే అదే వేయమని చెప్పాం.
అన్నిటికన్నా హై లైట్ మా చిన్నత్త రాక. ఆవిడ ఇల్లు కట్టించటం లో బిజీ గా ఉండి ఈ విషయం తెలియలేదట. రాత్రి 10 గంటలకి తెలిసింది..ఎల్లుండి ఆపరేషన్ అని..అంతే.. బస్సెక్కేసింది. హాండ్ బాగ్ వేలాడేసుకుని వచ్చిన అత్తని చూసి ఆశ్చర్యపోయాం. కాళ్ళకి చెప్పులు లేవు. 'ఏంటత్తా? ' అంటే.. బస్సు లో తెగిపోయింది. మళ్ళీ టైం వేస్ట్ అని వచ్చేశాను. అన్నయ్య ని చూశాక తీరిగ్గా కొనుక్కోవచ్చులే అని.. అంది. నాన్నగారు తను చూడకుండా.. కన్నీళ్ళు తుడుచుకున్నారు. మద్యాహ్నం భోజనమవుతూనే స్లాబ్ వేయించగానే వచ్చేస్తానని మళ్ళీ బస్సెక్కేసింది.
ముహూర్తం నిర్ణయించుకుని ఆయన్ని ఆసుపత్రి లో చేర్పించేశాము. ఇంక ఆసుపత్రి లో ఒక్క మనిషి నీ, తిండి పదార్థాలనీ రానీయకుండా సెక్యూరిటీ గార్డులు అడ్డుపడుతున్నా, మేము మాత్రం, మా ఆరేళ్ళ చిన్నమ్మాయి దగ్గర్నించీ, మాగాయ అన్నం బాక్స్ దాకా స్మగుల్ చేసాం.. అదో తుత్తి. 20 నిమిషాల ఆపరేషన్ కి మా చెల్లెలి ఇంటినుండి ఒక టిఫిన్, పెద్దమ్మ గారింటినుండి ఒకటీ..
అంత మంది మధ్య కోలాహలం గా విజయవంతం గా ఇంటికి చేరారు మా నాన్నగారు. కొత్త దుప్పట్లు పరిచి, సాధ్యమైనంత ఆహ్లాదకరం గా గది ని మలిచి, ఒక్కొక్కళ్ళం బయల్దుదేరాం.
ఇదంతా బాగుంది కానీ, మా నాన్నగారి 'టర్న్ ' కోసం ఎదురుచూస్తుంటే ఒకావిడని బయటకి తెచ్చారు. ఆవిడ కి మూడు రక్త నాళాలు బ్లాక్ అవుతే స్టెంటులు వేశారుట. ఆవిడ భర్త, కొడుకూ, కూతురూ ఆత్రం గా, ఆనందం గా ఆవిడ చుట్టూ మూగి .. 'ఎలా ఉంది?' అని అడగ గానే..ఆవిడ కన్నీరు పెట్టుకుని కూతురి చేయి ని ముద్దు పెట్టుకుంది. మేమూ ఆ దృశ్యం చూసి నిట్టూర్చాం.
మర్నాడు ఐ సీ యూ దగ్గర ఆవిడ భర్త చెప్పుకొచ్చారు కథ. ఆయన ఫోర్మన్ గా పదవీ విరమణ చేశారుట. కొడుకు చిన్న దుకాణం పెట్టుకున్నాడు. పెద్దమ్మాయి పెళ్ళి అయింది. చిన్నమ్మాయి డిగ్రీ చదివి ప్రైవేట్ గా చదువుకుంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది ట.
చాలా మామూలు గా ఉన్న కుటుంబం. రెండేళ్ళ క్రితం ఇదే ఆపరేషన్ అయితే ఒకటిన్నర లక్షలయితే, 'ఎంప్లాయీ అసోసియేషన్ ఇన్ష్యూరన్స్' వల్ల సులభం గా జరిగిపోయిందిట. తర్వాత బైపాస్ చేయించాల్సి వస్తే.. ఇంకో లక్ష పైగా ఖర్చయితే.. రిటైర్ అయిన ఎలెక్ట్రిసిటీ ఎంప్లాయీ బెనిఫిట్స్ ద్వారా రియెంబ్రన్స్ అయి గట్టెక్కారట. కానీ అది ఫెయిల్ అయి ఆరు నెలలు తిరగ కుండానే, తీవ్రమైన ఆయాసం, అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి లో ఉన్నారట ఆవిడ. కోడలు డాక్టర్ దగ్గరకెళ్ళి తీరాల్సిందేనని పట్టుపడితే. 'ఈ విషయం ఎవరికైనా చెప్పావంటే ఒట్టే' అని ఆపారట.
అమ్మాయి హైదరాబాద్ లో ఏవో పోటీ పరీక్షలకోసం చదువుతూ, అక్క ఇంట్లో ఉందిట. ఇంటి మీద గాలి మళ్ళి ఊరికి వచ్చిన అమ్మాయి, తల్లి పరిస్థితి చూసి తండ్రినీ, మిగిలిన వారినీ కేకలేసి, హైదరాబాద్ కి బయలు దేరదీసిందిట.
'నాకేమీ లేదు.. నీకు పిచ్చి ' అని కూతురి మీద అరిచి యాగీ చేసినా వినిపించుకోకుండా తెచ్చి చూపిస్తే.. కార్డియాలగిస్ట్,.. తెర వెనకకి కూతురినీ, భర్తనీ వెళ్ళమని,..' 'అమ్మా.. నీకేంటి ప్రాబ్లం.. చెప్పు.. మందులతో తగ్గించి, ఎక్కువ ఖర్చు కాకుండా చేస్తాను..' అని నెమ్మదిగా అడగగానే.. 'భరిచలేని నొప్పి, ఆయాసం డాక్టర్ గారూ, నాకు విషం ఇవ్వండి.. కానీ.. పెద్ద ఖర్చున్న ఆపరేషన్లు చెప్పవద్దు. బిడ్డకు పెళ్ళి కాలా..' అన్నారుట.
మూడు బ్లాకులున్నాయని, 3 స్టెంటులకి జర్మన్ వైతే ఐదున్నర లక్షలవుతుందని, మన దేశపు స్టెంటులేయిస్తే,.. 3 లక్షల చిల్లర తో తేలిపోవచ్చని చెప్పారుట.
భారతీయ టెక్నాలజీ తో తయారు చేసిన స్టెంట్ (మాజీ రాష్ట్రపతి కలాం గారు, సోమరాజు గారి ఐడియా ద్వారా చేశారని విన్నాను) వాడితే 2 లక్షలైనా మిగిలేది కదా.. కానీ.. ఏమో ఏమవుతుందో అన్న భయంతో వారి కుటుంబం జర్మన్ టెక్నాలజీ కే మొగ్గిందట.
ఆ అమ్మాయి కోసం దాచిన ఆరు లక్షల ఫిక్స్ డ్ డిపాసిట్ ముట్టటానికి వీల్లేదని ఆవిడ మళ్ళీ వొట్టు ! రెండు లక్షలకి ఇన్ష్యూరన్స్ ఉంది కాబట్టి ఒక్కటే బ్లాక్ తీయించుకుంటానని పేచీ.. పాపం ఆ తల్లి వ్యథ అర్థమయినా,.. అమ్మాయి మాత్రం తండ్రి సహకారం తో,.. ఎఫ్ డీ ల సెక్యూరిటీ తో 2.5 లక్షల లోన్ బాంక్ ద్వారా తీసుకుని, తల్లికి 1.5 లక్షల లో అయిపోతుందని చెప్పి ఆసుపత్రి లో చేర్పించారట.
ఆ అమ్మాయి కూడా .. 'మాది ఎంత అదృష్టమండీ .. మా అమ్మ మాకు దక్కింది.
అమ్మకి ఆపరేషన్ చేయించకుండా దాచిన డబ్బుతో పెళ్ళి చేసుకుని సుఖపడతానా నేను? వీళ్ళ చాదస్తం గాని? నా ఎం బీ యే అయిపోతుంది 3 నెలల్లో.. జూనియర్ అకౌంటంట్ ప్రవేశపరీక్ష రాసాను. 2 మార్కుల్లో పోయింది. మళ్ళీ రాస్తా .. మా నాన్నగారు 1.5 లక్షలు తెస్తున్నారు ఫ్రెండ్ దగ్గర్నించి.. మంచి ఉద్యోగం రావడమేమిటి..తీర్చేస్తాను..' అంది. ఆ అమ్మాయి కళ్ళు ఆత్మవిశ్వాసం తో కళ కళ లాడిపోతున్నాయి. నా కళ్ళు తెలియని భావం తో మసకబారాయి. ఈ అమ్మాయే ఈ నాటి యువత కి ప్రతీక అనుకున్నాను. ఆసుపత్రి నుండి వచ్చే ముందు ఆ తల్లిదండ్రులకి అభినందనలు చెప్పి సెలవు తీసుకుని వచ్చాము.
కానీ,.. మనసులో ముల్లు మాత్రం నాటుకుపోయింది. మనకి ఒక ఫోరం / సంస్థ కావాలి... మన దేశపు పరికరాల నాణ్యత వివరాలు, అపోహలు లేకుండా, కమర్షియల్ వాసన లేకుండా.. ఇలాంటిది ఉందా? మన మీడియా లో ఈ వివరాల ప్రచారం విస్త్రుతం గా జరగాలి. సామాన్య ప్రజల అపోహలు తొలగించేలా..
ఏదో అవసరానికి అప్పులపాలయినా అర్థం ఉంది కానీ, ఇలాగ అపోహల కోసం ఖర్చు చేయగలగటం ఎంతవరకూ సబబు?
మా అమ్మాయి వాక్సినేషన్ కి వెళ్ళినప్పుడు కూడా, అమెరికన్ ది కావాలంటే 1700 రూపాయలు, ఇండియన్ ది అయితే 150 అంది. అమెరికన్ ది అయితే నొప్పి తక్కువ, జ్వరం రాదు అంటే.. మాతో సహా, చంటిపిల్లలకి నొప్పి,జ్వరం ఎందుకొచ్చిన ఇబ్బంది అని అమెరికన్ దే వేయించాము.
మొన్నీ మధ్య కంటి సర్జరీలకీ ఇదే పోకడ విన్నాను. ఇండియన్ పరికరాలతో అయితే.. ఒక ధరా, అమెరికన్ అయితే ఇంకో ధరా, ఇంగ్లిష్ వాళ్ళవయితే వేరొకటీ.. 'కన్ను' అనగానే.. మనకీ భయమే కదా.. ఇండియన్ వి అయితే గొడ్డలి పాటి మందం తో ఉంటాయేమో, అమెరికన్ వి సన్నగా, నాణ్యతతో ఉంటాయేమో నని...
డాక్టర్లు కూడా ఇలాంటి చాయిస్ ఇవ్వటం వల్ల.. ఎదురైన పరిస్థితి ఇది ఏమో?.. పర్వాలేదు తక్కువ రకం వేయమని ఎవరు చెప్పగలరు?

రోజూ మా కాంప్లెక్స్ లో సాయంత్రం వీధంతా పిల్లలు పరుగెడుతూ, లేక సైకెళ్ళమీదా, స్కూటర్ల మీదా, స్కేట్స్ మీదా .. తూనీగల్లా తిరుగుతూ.. అరుస్తూ, గొడవ పడుతూ, .. కొంతమంది బాడ్మింటనో, హూలా హూపో ఆడుతూ, కనిపిస్తూ ఉంటారు.. ఇక రాత్రి అన్నం తిన్నాక నడుస్తుంటే.. టీవీల్లోంచి వాణిజ్య ప్రకటనల గోల, పాటలూ, చప్పట్లూ, టీ వీ పాత్రల ఏడుపులూ, చంటిపిల్లలున్న ఇళ్ళల్లో వాళ్ళ ఏడుపులూ.. అలసట పడి ఆఫీసులనుండి వచ్చిన జంటలు ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవటం, సన్న సన్న గా వినిపిస్తూ ఉండటం కద్దు.
కానీ గత 15 రోజులుగా.. ఎవరో ఒకరిద్దరు, మొహాలు వేలాడేసుకుని.. విరక్తి గా రోడ్లమీద పిల్లలు కనిపిస్తున్నారు. రాత్రిళ్ళు 12 అయినా లైట్లు కనిపిస్తున్నాయి, చడీ చప్పుడూ లేదు.. మా పక్కింట్లోకి అమెరికా నుండి 3 నెలలక్రిందటే వచ్చి సెటిల్ అయ్యారు భార్యా భర్తలు.. వాళ్ళకి అర్థం కాలేదు. అదేదో సినిమాలోలాగా.. 'ఏం జరుగుతోందిక్కడ? నాకు తెలియాలి తెలిసి తీరాలి..' అని వాళ్ళు వాపోతూ ఇంటి బయట నుంచున్నారు. నేనేదో.. ఇంట్లో వాళ్ళకి డిస్టర్బన్స్ లేకుండా మాట్లాడదామని బయటకొచ్చి మాట్లాడుతున్నాను అఫీస్ కాల్ లో.
నేను 'Bye' అని చెప్పటమేమిటి.. ఆత్రం గా అడిగారు..నేనూ సీరియస్ గా.. మీకు తెలియదా? ఫత్వా జారీ చేసారు. ఈ కాంప్లెక్స్ లో పిల్లలకి ఘోషా.. ఈ నెలంతా... ' అన్నాను. కంఫ్యూజ్ డ్ గా ఉన్న వాళ్ళ మొహాలు చూసి.. పోన్లే అని 'త్రైమాసిక పరీక్షలండీ బాబూ..' అనగానే.. వాళ్ళూ 'వార్నీ' అనేసుకుని.. నేటి చదువు తీరూ, పిల్లలమీద పెరిగిన ఒత్తిడీ, మారుతున్న మానవ విలువలూ, మా కాలం లో ఎలా ఆడుతూ, పాడుతూ చదివేవాళ్ళమో కూలంకషం గా చర్చించి, 'ప్చ్చ్..' అని దీర్ఘం గా నిట్టూర్చి.. లోపలకెళ్ళిపోయారు.
ఈ చర్చ లో కొట్టుకుపోయిన నేను హడావిడి గా లోపలకొస్తూ ఎందుకైనా మంచిదని కిటికీ లోంచి తొంగి చూస్తే.. మా పెద్దది.. టింకిల్ చదివేస్తోంది.. చిన్నదేమో.. మ్యూట్ లో పెట్టి టీ వీ లో ఏదో చూస్తోంది.. నేను చిన్నగా దగ్గేసరికి చటుక్కున.. పుస్తకాలు తీసి నటన లో జీవించటం మొదలు పెట్టేసారు.
పోన్లే అని గమనించనట్టు 'ఊ ఊ ఎంత వరకూ వచ్చింది అని..మళ్ళీ వాళ్ళ చదువులో కూరుకుపోయాను. అంత గా కనీసం ఒక దగ్గర కూర్చోవటానికీ ఒక కారణం ఉంది. ఇద్దరికీ అప్పుడే హిందీ మార్కులిచ్చేశారు. స్పీడ్ యుగం కదా.. టీచర్లూ యమా స్పీడ్. మా పెద్దమ్మాయి కి 14/20 వచ్చాయి. లెక్క ఎక్కడ తప్పిందో.. తవ్వి, ఏవిధం గా ఇలాంటి తప్పులు చేయకుండా ఉండవచ్చో చెప్దామని పెద్ద లెక్చర్ తయారు చేసుకుంటే.. దాని పేపర్ చూడగానే నవ్వు ఆపుకోలేకపోయాం. 'చందా కే ఊపర్ లోగ్ క్యో నహీ రహ్సక్ తే? ' అన్న ప్రశ్న కి.. 'చందా పే ..' అన్న దాకా రాశాక 'హవా' అన్న పదం గుర్తు రాలేదట. అందుకని ఆలోచించి చించి.. సాధారణంగా తెలుగు కి దగ్గర్లోనే ఉంటాయిగా హిందీ పదాలూ అని.. 'చందా పే గాలీ నహీ రహ్తా' అని రాసేసిందిట.
వాలి మహారాజు దీ తీరయితే ఇక సుగ్రీవుల వారి పని చెప్పేదేముంది? స్త్రీ లింగం, పుం లింగం రాయడంలో 'దాదా దాదీ, మామా, మామీ, నానా, నానీ రాసాక, పితా కీ అదే లాజిక్ వాడేసరికి .. దాని టీచర్ ఎర్ర ఇంక్ తో పెద్ద మార్క్ పెట్టి మార్కులు కట్ చేసి పడేసింది :-)
మొన్నేమో సైన్స్ అయ్యింది. మా పెద్దది నెయ్యీ, చీజూ దేనితో తయారు చేస్తారు అంటే, ఆవు తో అని రాసి వచ్చిందిట! అదేమంటే.. ఆవు లోంచే కదా పాలు వచ్చేదీ.. అని సాగదీసింది. అమ్మ నుంచి ఇడ్లీస్ వస్తాయి అన్నట్టుంది అంటే.. అర్థమయీ అవనట్టు గా తలాడించి ఊరుకుంది.
చిన్నదేమో ఇంటికి వచ్చాక హాయిగా అవీ,ఇవీ తిని ఊరెంబడా తిరిగి ఇంక ఇంటికి వచ్చేవేళకి కాలనీ లాన్ లో బెంచీ మీద నేను చూసేలా ఏడుస్తూ కూర్చుంది. 'అయ్యో పాపం.. అనుకుని కంగారు కంగారు గా పరిగెట్టి వెళ్ళి చూస్తే ఏముంది..'నేను అస్సలూ ఇంటెలిజెంట్ కాదు. అక్కకే అన్నీ మంచి మార్కులు వస్తాయి.. నేను వేస్ట్!' అని మనీషా కోయిరాలా లా జలజలా కన్నీళ్ళు కార్చింది.
తరచి తరచి అడగగా..చెప్పింది పదికి ఒక్క మార్క్ వచ్చిందిట!!! పైగా.. 'ఏం చెప్పనమ్మా.. సైన్స్ లో మనిషికి 'గాలీ, నీరూ,ఆహారం అవసరాలని చెప్తారు. అదే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ లో తిండీ, బట్టా, ఇల్లూ ' అని అంటారు. నేను 'కంఫూజ్ అయిపోతున్నాను.. అని బొట బొటా కన్నీరు కారిస్తే.. అసలే తల్లి హృదయం కదా.. 2946 ముక్కలయింది. పర్వాలేదమ్మా.. సున్నా వచ్చినా నేనేమీ అనను.. విషయ జ్ఞానం రావాలి కానీ..అన్న ధోరణి లో నానా విధాలు గా ఓదార్చి..
ఇంట్లోకి తెచ్చి పడుకొమ్మని కిందకి వచ్చాను తోడు పెట్టటం మరిచిపోయానని.. పైకెళ్ళేటప్పటికి అక్క తో చెప్తోంది..'చూశావా? నీకు పది కి తొమ్మిది మార్కులొచ్చినా ఆ ఒక్క మార్కూ ఎక్కడ పోయిందీ అని గొడవ చేస్తుంది అమ్మ.. 'నాకు సున్నా వచ్చినా ఏమీ అనదటా కాస్త తెలివి గా ఉండాలి అని అక్కకే పాఠాలు చెప్తోంది... ఇక దాని వెనక పరిగెత్తి ఒక్కటిచ్చుకునేంత వరకూ ఆవేశం చల్లారలేదు.
కాలనీ ఆడవాళ్ళందరం తాత్కాలికం గా మిగతా టాపిక్ లకి సెలవిచ్చి, పిల్లల పరీక్షల గురించీ, వాళ్ళ మొండి దనం గురించీ, తండ్రులెవ్వరూ అస్సలూ పట్టించుకోకపోవటం గురించీ, మూడో క్లాస్ లో 95 దాటలేదు సొషల్లో.. ఇలాగయితో రేప్పొద్దున్న ఐ ఐ టీ ల్లో సీట్లెలా వస్తాయి అనీ.. ఆక్రోశం పంచుకుని ఈ మధ్య చున్నీలూ, కొంగులూ లేకపోవటం వల్ల కనీసం వట్టి చేతులతోనో, కర్చీఫ్ లతో కన్నీళ్ళొత్తుకున్నాం.
ఊళ్ళో పిల్లలలని చూస్తే మా పిల్లలే నయం అనిపించింది మాకు రెండిళ్ళవతలావిడ విషయం వింటే.. వాళ్ళ చిన్నోడు కడుపు నొప్పి అని గిల గిలా తన్నుకుంటే భయమేసి డాక్టర్ దగ్గరకి వెళ్తే ఆవిడ ఇంజెక్షన్ భయం చూపించేసరికి 'లేదు లేదూ అని వెల్లడించిన విషయమేమిటంటే..
వాళ్ళ పదేళ్ళ పెద్దబాబు, చిన్నవాడికి ' వీ వీడియో గేం' వరస గా వారం రోజులు ఆడుకోనిస్తానని లంచం చూపి అమ్మ ని ఏదో విధం గా 'ఎంగేజ్' చేయి. ఈలోపల నేను కాస్త రిలాక్స్ అవుతా.. అన్నాడట!!
మా పెద్దమ్మాయి ఒక ప్రశ్న చదవాలంటే ఆవిడ గారికి మేము ఆలుగడ్డ తప్ప వేరే కూర చేయట్లేదు. నూడుల్స్, పాస్తా, మైసూర్ పాక్, పిజ్జా, జంతికలు, ఇలాగ ఆవిడ అడగటం ఆలస్యం లక్ష్మీ దేవి చుట్టూ, ప్రసాదాలు చేర్చి పూజ చేసినంత ఘనం గా నా నా రకాల ధూప,దీప నైవేద్యాలతో, స్తోత్ర పఠనం చేసి ఆవిడ అనుగ్రహం క్లాస్ పుస్తకాలమీద కలిగేట్టు చూసుకుంటున్నాము.
దీనికి తోడు, లెక్కలంటేనే ఎలర్జీ అయిన ఆవిడాయె, దీన్ని ఏం చేయాలి అని వాపోతుండగా.. ఠక్కున ఐడియా వచ్చింది. దానికి పాటల పిచ్చి ఉంది. దాని లెక్క తప్పయితే నాకిష్టమైన పాటలు, లేక పోతే దానికిష్టమైన పాటలు అని.. ఆరోజు బోల్డు తెలుగు పాటలు వింది..బానే ఉంది. కాకపోతే ఇప్పుడు తెలుగు పాటలు తెగ నచ్చి..తప్పులు చేసినా పర్వాలేదనుకుంటోందనుకోండి.. వేరే మెథడ్లు వెతకాలి ఇంక.
చిన్న రాకుమారి గారికి పరీక్షలకి తయారవటం అంటే పది పెన్సిళ్ళు చెక్కి పెట్టుకుని 2 ఎరేజర్లు, 2 షార్పెనర్లు బాక్స్ లో పెట్టుకోవటమే.. అంతకు మించి కష్టపడటం దానికి ఇష్టం ఉండదు. దాని క్లాస్ మేట్లంతా ఒకటో క్లాస్ కే..రాత్రి 11 దాకా చదివి, మళ్ళీ ఉదయం 5.30 నుండీ మళ్ళీ పునశ్చరణ చేసుకుని, బస్ స్టాండ్ లో కూడా తల్లులు నెమరు వేయిస్తుంటే.. ఇది చిద్విలాసం గా తిరుగుతూ ఉంటుంది.
దాని జీ కే జ్ఞానం చూస్తే..కళ్ళు తిరుగుతాయి ఎంతటివాళ్ళకయినా.. ఆఖరి పరీక్ష.. జనరల్ నాలెడ్జ్ పుస్తకం తేవే అంటే.. అలాంటి సబ్జెక్టే లేదు పొమ్మంది.. 'అదే జీ కే ' అంటే ..ఓహో అదా అంది. పుస్తకం తెరిస్తే.. ఒక చాప్టర్ అంతా వంశ వృక్షం!!! కపూర్ ఖాందాన్ . రణబీర్ కపూర్ అక్కలెవరు? కరీనా చిన్న తాతగారి పెళ్ళాం ఎవరు లాంటి వెధవ ప్రశ్నలు!
చదువుకి కూర్చొమ్మంటే.. పుస్తకం తేవటానికి అరగంటా, పెన్సిల్ కీ, మిగతావాటికీ ఒక్కొక్క దానికీ అరగంటా.. చేసి పైగా మొదటి ప్రశ్న లోనే నీళ్ళకీ, బాత్రూం కీ, 4-5 బ్రేక్ లూ, అదేంటో ఎప్పుడు ఫోన్ తీయమన్నా కాలింగ్ బెల్ కొట్టారు చూడమన్నా..విసుక్కుంటూ, కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళే పిల్లలు పరీక్షలప్పుడు మాత్రం పరుగు పరుగున 2 సెకండ్లలో అటెండ్ చేస్తారు.. అందరిళ్ళల్లో ఇంతేట. అంజూ జార్జ్ లు పనికి రారట. కేబుల్ కట్ చేస్తే దూర్ దర్శన్ లో హిందీ వార్తలు కూడా తన్మయత్వం గా చూస్తున్నారు.
ఈ హడావిడి చూసి ఐ ఐ టీ ప్రవేశ పరీక్ష కి చదువుతున్న పక్క అబ్బాయికి ఒకటే నవ్వు. ఇప్పుడే కేబుల్ తీయిస్తే.. ఇంటర్ కొచ్చాక ఇంకేం ఉంటాయి తీయించి పడేయటానికి అని.. మా ఎదురింట్లో పిల్లకి పాపం బోల్డు ఒత్తిడి. దాని ఖర్మ కాలి దాని కజిన్లందరూ దాని కన్నా కనీసం 10 యేళ్ళు పెద్ద. అంతా పెద్ద పెద్ద చదువుల్లో సీట్లు సంపాదించారు. ఇక వాళ్ళమ్మ దెబ్బలూ, ఈ పిల్ల అరుపులూ వినిపిస్తూనే ఉంటాయి. వారం క్రితం వాళ్ళమ్మా వాళ్ళూ ముందెళ్ళిపోయారని.. పిల్లలతో ఆఖరి సారి చదివిస్తుంటే వచ్చింది, స్కూల్ బస్ కోసం వెయిట్ చేస్తూ. పాలూ, బంగారం చిలికి దానితో చేసిన ఇడ్లీ ల్లంటి బుగ్గల మీద ఎర్ర గా వాత. కళ్ళల్లో ఎక్కడో దిగులు.
ఇక చదివింది చాల్లే అని పిల్లలని మాటల్లో దింపాను. ఆ అమ్మాయి తల్లి పట్ల ద్వేషం పెంచుకుంటుందేమోనని .. మా పిల్లలకి నాలుగు పడ్డాయి ఈ పరీక్షల్లో.. తల్లిదండ్రులు పిల్లల మంచికోసమే కదా.. కొట్టేది... అయినా.. ప్రేమ ఉన్న చోటే దెబ్బ వేయటమూ ఉంటుంది.. అని ఏదో చెప్తుంటే.. ఆ పిల్ల అంది..'యా.. ఐ టూ వాంట్ టు సే.. ఐ లవ్ యూ టూ మామ్మ్మా ' అంది.
ఆ మాట లోతుగా తాకినా.. మంచి జోక్ విన్నట్టు అందరం నవ్వేశాం.. తన తల్లి తో ఎప్పుడో నెమ్మది గా మాట్లాడాలి.. అనుకుంటూ.. నిన్ననే ఆఖరి పరీక్ష..
పాపం పిల్లలకి మళ్ళీ జనవరి దాకా ఊరట. నిన్న చూడాలి వాళ్ళ ఆనందం.. వీధిలోంచే పుస్తకాల బ్యాగులు గిర గిరా తిప్పి విసిరి కొట్టి.. ఎగురుతూ, అరుస్తూ..
ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు కొంతమంది పిల్లలు.. వాళ్ళకీ పరీక్షల గోల ఉండదు కదా అబ్బా.. మీరెంత లక్కీ యో.. అని నేనంటే.. . ఒక అబ్బాయి అన్నాడు.. 'ఆంటీ ఏం లక్కీ.. వీళ్ళకి ఆఖరి పరీక్ష రాసాక వచ్చే ఆనందం మాకేదీ? ' అని :-))
ఏదైతేనేం? ఒక పనైపోయిందండీ.. మళ్ళీ వాకింగ్ కెళ్తే.. రోడ్ మీద పిల్లల గొడవా,..టీవీల్లో సీరియళ్ళ హడావిడీ..
(బొమ్మలన్నీ గూగులమ్మ చలవే..)
Tuesday, August 31, 2010
భాష
61
comments
సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు!!! -- పొరుగింటి పుల్లకూర రుచని..
అదేంటో ఇంట్లో నేనేం వండినా ఒక పట్టాన నచ్చదండీ మా వాళ్ళకి!!!
ఒకవేళ పొరపాటున బాగా కుదిరి ఆనందం గా తిన్నా 'ఆ .. ఉల్లీ, వెల్లీ ఉంటే మా మల్లి గూడా బానే వండుతుంది ' అని తీసి పారేస్తారు. అదే నేను కాక ఇంకెవరు చేసినా 'న భూతో భవిష్యతి ' అని మెచ్చుకుంటూ తినేస్తారు. అప్పటికీ ' ఈ వంట తింటే భవిష్యత్తు లో భూతాలవుతారనా లేక భూతాలకి కూడా భవిష్యత్తు ఉండదనా ? ' అని రిటార్ట్ ఇస్తూనే ఉంటాననుకోండి.
నన్నేడిపించటానికే ఇలా మా వారు అంటున్నారని .. 'నేతి బీరకాయలో నెయ్యంత ఉందో ' వాళ్ళ మాటల్లో నిజం పాలు అంత ఉందని నా నమ్మకం. 'అబ్బే.. వేపకాయలో తీపి, వేసంగి లో చలవా, నీ వంటలో రుచి ' అని వెక్కిరిస్తూనే ఉంటారు. అయినా మా ఇంట్లో వాళ్ళకే సరైన టేస్ట్ లేదు లెండి. భోజరాజు వంటి రాజుంటే.. కాళిదాసు లాంటి కవి అప్పుడే పుడతాడు.
మా చిన్న పాప ని చూస్తే..'వచ్చీరాని మాటలు రుచీ, ఊరీ ఊరని ఊరగాయ రుచీ' అని ఎందుకన్నారో తెలుస్తుంది.. కాకపోతే ముద్దొచ్చిన్నప్పుడే చంకెక్కాలని దానికి తెలుసు. .ప్రేమ గా ఏం వండిపెట్టనూ అంటే వెన్నతో అట్టేయమనే రకం!! అదీ ఆ తాను ముక్కేగా? పువ్వు పుట్టగానే పరిమళిస్తున్నట్టు తండ్రి పోలికలు బానే పుణికి పుచ్చుకుందది. చిన్నప్పటినించీ ఇంట్లో ఏం వండినా సొక్కదు. వంక పెట్టకుండా తిననే తినదు.
వాశిరెడ్డి వెంకటాద్రి నాయుడు తులాభారం తూగితే, కారెడ్ల కామక్క వంకాయల భారం తూగిందట. అలాగ నేనేం తక్కువ అని మా పెద్దమ్మాయికీ అదే గొడవ. దానికెప్పుడూ పొరుగింటి పుల్లకూరే రుచి! అది చాలదన్నట్టు శుభ్రం గా కంచం ఖాళీ చేసి రామాయణం అంతా విన్నాక రాముడికి సీతేమవుతుందన్నట్టు.. 'నేను తిన్నది ఏంటి? ' అని అమాయకమ్మొహం వేసుకుని అడుగుతుంది!! అద్దం అబద్ధం చెప్పదు.. దానికి వంట నచ్చిందనటానికి, కడిగేసినట్టున్న దాని కంచమే సాక్ష్యం. రైల్లోకి టిఫిన్ బాక్సు కట్టినా 'రామేశ్వరానికి పోయినా శనేశ్వరం తప్పలేదన్నట్టు చూస్తుంది నావైపు.
అగ్ని కి ఆజ్యం పోసినట్టు, తండ్రి వంటంటే చెవులు కోసుకుంటారు పిల్లలు!! ఇక నా పరిస్థితేమో .. అత్త కొట్టినందుకు కాదు. తోటి కోడలు నవ్వినట్టు ' తయారవుతుంది.
ఆడలేక మద్దెల వోడన్నట్టు, నాకు చెదిరిన వంటలకి, ముదిరిన కూరగాయల వంకా, పులిసిన పెరుగు వంకా, కుదరని వంట పాత్రల వంకా పెడతాను లెండి.
అందుకే 'అడుసు తొక్కనేల? కాలు కడగనేల' అనుకుని ఒక్కరోజూ..వంటెలా ఉందీ.. అని అడిగి, 'కర్ర ఇచ్చి మరీ పళ్ళు రాలగొట్టించుకోవటం ' ఎందుకని పెద్దగా ఫీడ్ బాకులు అడగను. కానీ వంకలు పెట్టకుండా తినాలంటే మన కిటుకుల సంచీ లోంచి తీసిన చిట్కా..'ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు, వలపు సిగ్గెరగదు..'
'చేత కానమ్మకి చేష్టలెక్కువ ' అని కాస్త గార్నిషింగులు చేసేస్తే సరి!! ఆవురావురుమంటూ తినక ఏం చేస్తారు? మూల విగ్రహానికే ఈగలు దోలుతుంటే,.. ఉత్సవ విగ్రహం వచ్చి ఊరేగింపు ఎప్పుడని అడిగినట్టు, రోజూ వారీ వంటకే దిక్కు లేదు ఇక పిండివంటల సంగతి చెప్పనక్కరలేదు.
ఆ.. నేను పట్టించుకుంటే గా!!!!.. హెచ్చు గా పేలున్న వాళ్ళకు, హెచ్చుగా అప్పులున్నవాళ్ళకు దురదలేదు.వెన్న తిన్నవాడు వెళ్ళిపోతే చల్ల దాగిన వాడిని చావ మోదినట్టు మా వారినే దెప్పుతూ ఉంటాను లెండి. అయినా పిల్లలు 'చీ బావుళ్ళేదంటే.. '
ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు! మా ఫ్రెండ్ భర్త.. ఇంట్లో చూరు నీళ్ళు తాగి, బయటకొచ్చి చల్ల దాగి వచ్చానని చెప్పుకునే రకమైతే.. బయట అంతా నా వంట గురించి గొప్ప గా చెప్పుకుంటుంటే.. నా పరిస్థితేమో ఇంట ఈగల మోత, బయట పల్లకీ మోత అయింది :-(
అయినా ఒక ఊరి కరణం ఇంకో ఊరి వెట్టి ట.. మా అమ్మ ఊరెళ్ళితే.. మా నాన్న గారు నానుబాయి గా అన్నం వండి పెట్టినా పొగుడుకుంటూ తినేవారు..
ఏం చేస్తాం ? కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు లెండి.. మా ఇంకో స్నేహితురాలైతే.. టీ కూడా వంటావిడ తోనే పెట్టిస్తుంది.
మొన్నేమైందో తెలుసా?
కల కాలపు దొంగైనా ఏదో ఒకనాడు దొరుకుతాడంటే ఏంటో అనుకున్నాను కానీ,
నా విషయం లో రుజువయ్యింది!! మొన్నీ మధ్య మా స్నేహితులొక్కరు ఆకస్మికం గా ఫోన్ చేసి, భోజనానికొచ్చేయండి ' అని పిలిచింది. 'అయ్యో వంట మొదలు పెట్టానే.' అంటే..'చేసినంత తెచ్చి, సగం చేసింది ఫ్రిజ్జిలో పడేసి వచ్చేయ మంది. గుత్తి వంకాయ కూర బాక్స్ లో పెట్టుకుని బయలు దేరాను. మరి మా వారికీ సంగతి తెలియదుగా.. అక్కడ భోజనం చేస్తూ.. 'అబ్బా.. పద్మజ గారూ, అన్ని వంటకాలొక ఎత్తు! ఈ గుత్తి వంకాయ ఒకెత్తు.. క్రిష్నా.. కాస్త రెసిపీ తెలుసుకోవచ్చు గా' అనేసారు. సదరు పద్మజ ఇచ్చిన అదోరకమైన ఎక్స్ ప్రెషన్ చూసి.. పాపం ఆయన కేం అర్థం కాలేదు..
తర్వాత ఏం జరిగిందో .. మీ ఊహకే వదిలేస్తున్నాను !!! :-)))))

Blog Author' s note:
ఇది నా కథ కాదు. :-) మా ఇంట్లో అందరం ఏది బడితే అది హాయిగా తినేసే రకాలే.. ఊర్కే బోల్డు సామెతలు వాడి ఏదైనా రాయాలని చేసిన ప్రయత్నం ... 32 సామెతలు వాడాను. కాకపోతే చివరి పారా మాత్రం నిజం గా జరిగిందే!!
ర్ర్ర్ర్ర్ర్ర్ కిర్ర్ర్ర్ర్ర్ శభ్దం తో. మొదలయి డబ్ డబ్ మంటూ ఆగిపోయింది మా వాషింగ్ మిషను.
ఈ ఏడాది నాలుగోసారి అప్పుడే. సరే అని టెక్నిషియన్ ని పిలిపించాం. మల్లిక్ హీరోలా చిలిపి గా చెవుల్దాకా నవ్వుతూ " నాలుగు వేలవుతుంది సార్!!" అన్నాడు నాగరాజ్ ప్రతిసారీ అతనే వస్తాడు.. ప్రతి సారీ ఆలోచించి చించి మళ్ళీ రిపైర్ చేయించటం.. మళ్ళీ 2 నెలల్లో పాడవటం..
ఇలా కాదని ఈసారి కొత్తది కొనేశాం. కొన్నప్పుడు షాపు వాళ్ళు లక్కీ డ్రా కూపన్లని మాకు ఒక నాలుగు కూపన్లు చేతిలో పెట్టారు. మొదటి బహుమతి 50 గ్రా బంగారం, రెండవ బహుమతి అరకిలో వెండి, మూడవది.. 10 గ్రా బంగారం.. అలాగ.. మనకొస్తుందా చస్తుందా, ఎన్ని చూశాం అని నిర్లిప్తం గా పక్కన పడేశాం. వాటిని మా పని అమ్మాయి తీసి పిల్లల పాత కాగితాలలో పడేసింది. మొన్న శ్రావణ శుక్రవారం మాంచి కన్నడ హీరో తో లక్కీ డ్రా చేసి చూస్తే మా పేరు ఉందిట. వాళ్ళు ఫోన్ చేసారు.
పండగ పూటా ఇలా లక్ష్మీ దేవి వచ్చిందని మా అత్తగారు తెగ సంబర పడ్డారు. మాకు ఫస్ట్ ప్రైజో, సెకండ్ ప్రైజో అర్థం కాలేదు. అప్పటికప్పుడు షాప్ కి ఫోన్ చేసి కనుక్కుంటే సెకండ్ ప్రైజ్ అని అర్థమైంది. ఆ కూపన్లెక్కడున్నాయో అస్సలూ గుర్తుకు రాలేదు!!! ఒక అరగంట నీది తప్పంటే.. నీ బుద్ధే చేలో మేయటానికెళ్ళిందని ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ ఇల్లంతా వెతుక్కుంటుంటే.. మా పనమ్మాయి చటుక్కున తీసి ఇచ్చింది.
అర కిలో వెండంటే మాటలా? ఎంతుంటుందో అని గబగబా ఒకళ్ళు పేపర్, ఇంకోళ్ళు లప్పు టప్పు (లాప్ టాప్ కి మేం ముద్దుగా తెలుగు లో పిలుచుకునే పేరు లెండి) తీసి ఆబగా ఆశగా ఎన్ని లక్షలుంటుందో అని చూస్తే దగ్గర దగ్గర 30 వేలట. కాస్త డిజపాయింట్ అయ్యాం లెండి. అంటే దాదాపు 15 వేలన్నమాట. పోన్లే "దంచినమ్మకి బొక్కినంత" అని సరిపెట్టుకున్నాం.
ఈ వార్త తెలిసేటప్పటికి బయటకి వచ్చి ఎవరెవరికి చెప్దామా అని బయటకొచ్చేటప్పటికి పేరంటాళ్ళంతా తలుపులేసేసుకున్నారు. మరీ తలుపులు కొట్టి ప్రత్యేకం గా చెప్తే ఏం బాగుంటుంది చెప్పండి? .. ఎవరో ఇద్దరు ముగ్గురు పెద్దవారు రాత్రి అన్నం తిన్నాక నడక కి వచ్చినట్టున్నారు. సాధ్యమైనంత కాజువల్ గా నడుస్తూ వాళ్ళ దగ్గరకి రాగానే.. ఏదో ఒక విషయం మీద పలకరించి వాళ్ళకి విషయం చెప్పేద్దాం అని.
సాధ్యమైనంత వరకూ లేజీ గా నడుస్తున్నట్టు నటిస్తూ వెళ్తున్నాం.. వాళ్ళు మా దగ్గరకొచ్చేటప్పటికి అకస్మాత్తు గా 'మాహా మాహా..మహా మహా మహా' అని పాట రావటం మొదలుపెట్టింది. బిత్తరపోయి చూసేటప్పటికి పాపం వృద్ధ దంపతులు.. ఇబ్బంది గా మొహం పెట్టారు. వాళ్ళ రింగ్ టోనట. ఫోన్ లో మాట్లాడుతూ వెళ్ళిపోయారు. "అయ్యో బంగారం లాంటి చాన్స్ మిస్సయ్యాం" అనుకుని.. ముందుకెళ్ళి చూస్తే పిట్ట లేదు రోడ్ మీద.
సరే ఫోన్ చేసి చెప్పవచ్చు గా.. అనుకుని.. 'ఈ వీకెండ్ ఏదైనా హోం వర్క్ ఉందా పిల్లలకి ?', ' మొన్నీమధ్య వైరల్ జ్వరాలన్నారు ఇప్పుడు బాగున్నారా? " , "మీ తమ్ముడి పెళ్ళి అయిందన్నావు బాగా అయ్యిందా?", "మా ఆడపడచుకి చీర కొందామనుకుంటున్నాను, దగ్గర్లో మంచి బట్టల షాప్ ఎక్కడుంది?', "మొన్న జాబ్ మారతానన్నారు ఏమైంది?" లాంటి సాకులతో ఫోన్ చేసి గర్వం గా అప్పుడే గుర్తొచ్చినట్టు విషయం అందరికీ చెప్పేశాం. మా ఆడపడచులకి తలా 10% ఇస్తాం అని వాగ్దానం చేసాం.
అమ్మయ్య కాస్త కడుపు ఉబ్బరం తగ్గింది అనుకుని ఆ వెండి తో మా అత్తగారు చెప్పినట్టు "కడ్డీల్లాగే లాకర్ లో ఉంచేసుకోవాలా?" మా అమ్మ చెప్పినట్టు "వెండి కంచం చేయించుకోవాలా" అని తనివి తీరా వాదించుకుని పడుకుని లేచి షాప్ కి పరిగెత్తాం. 11 గంటలకి తాళాలు తీసి వాకిలి చిమ్ముతున్నారు. 'రండి రండి ' అని ఆదరం గా పిలిచిన వాళ్ళు.. విషయం తెలియగానే..'సరే కూర్చుని తగలడండి.. మా ఓనర్ వస్తాడూ అన్న లుక్కిచ్చి తమ పని తాము చూసుకోసాగారు. కాసేపాగి ఓనర్ సోమవారం వస్తాడు వెళ్ళండన్నారు.
సోమవారానికి మా కాలనీ అంతా చెప్పేసాం, మా వారి ఆఫీస్ లోనూ, నా ఆఫీస్ లోనూ అందరికీ చెప్పి అందరి కళ్ళల్లో ఆశ్చర్యం, లైట్ గా ఈర్ష్య చూసి తెగ ఆనందించాం. మా గ్రూప్ లో వాళ్ళు మమ్మల్ని కాఫీ డే లో పార్టీ కి తీసుకెళ్తావా చస్తావా? అని పీకల మీద కూర్చోవటం తో సాయంత్రం 14 మంది ని తీసుకుని ఆఫీస్ పక్కన దానికి తీసుకెళ్ళాను. కాఫీ, సండేలూ వగైరా ఆర్డర్ చేసారు అందరూ.. 'ఆహా నీ అదృష్టమే అదృష్టం.. పెట్టి పుట్టావు ' లాంటి మాటలతో నన్ను పొగిడి తబ్బిబ్బు చేసేసారు. గాలిలోకెక్కడికో వెళ్ళిపోయిన నన్ను ఒక్క దెబ్బలో భూమి కి పడేసింది బిల్లు. 1500 చిల్లర అయింది.
2 కిలోల స్వీట్ తెచ్చి పెట్టాను ఎందుకైనా మంచిదని. మా కాంప్లెక్స్ లో వాళ్ళు ..'ఆహా కృష్ణా.. పార్టీ " అంటూ వచ్చిన వారికి చేతిలో స్వీటు ముక్క పెట్టి సంతోషం పంచుకున్నాము. అక్కడో ఐదు వందలకి తైలం వదిలింది.
షాప్ వాళ్ళు కంప్యూటర్ లో చూసి 2 పాస్ పోర్ట్ ఫొటోలూ, పాన్ కార్డ్ కాపీలూ, 4,500 రూపాయల కాష్ తెచ్చి కట్టమన్నారు. 'అదేంటి? ' అంటే.. 'టాక్శ్ ' అన్నాడు.. 'ఈ మాత్రం తెలీదా? ' అన్నట్టు జాలిగా మొహం పెట్టి. మొత్తం కొన్న వెండికి విలువ చూస్తే 14 వేల చిల్లర. దీంట్లో ఐదు వేలు టాక్స్ కెళ్తే 9 వేల లాభం. అసలు కడదామా వద్దా అని తర్కించుకుని.. అసలే అందరికీ చెప్పేసుకున్నాం కొని తీరాల్సిందే అన్న నిర్ణయానికొచ్చి ఏడుపు ముఖమేసుకుని ఐదు వేలూ కట్టేసాం. (500 ఏమో వేరే ఖర్చులకి ..) రోకట్లో తల పెట్టాక రోకలి పోటులకి భయపడితే ఎలా?
'ఏదీ వెండి? ' అని అడిగితే 'అమ్మా! అంత వీజీ గా ఎలా ఇస్తాం? మా షాప్ వాళ్ళ ఫంక్షన్ ఉంటుంది దాంట్లో స్టేజ్ మీద పిలిచి ఇస్తారు..' అన్నారు. వెర్రి మొహాలేసుకుని ఇంటికి వచ్చి పడ్డాం. ఈ లోగా మా ఆడపడచులకి .. తలా వెయ్యీ ఇచ్చి మీకు కావలసిన వెండి వస్తువు కొనుక్కోండి అని ఇచ్చేసాం.
అంత ఫంక్షన్ లో కట్టుకోవటానికి మంచి చీర ఉంటే బాగుంటుంది కదా.. నావన్నీ సాదా సీదా గా ఉన్నాయి లేదా పాత ఫాషన్ వి. అని కొత్త పట్టు చీర అవీ తీసుకున్నాం. చెప్పొద్దూ.. మూడు వేలకి ఎంత చక్కటి చీర
నేను కొనుక్కుంటూ పిల్లలకి కొనకపోవటమేమిటని వాళ్ళకీ కొత్త బట్టలు కొన్నాం, 5 వేలు బట్టలకైంది అందరికీ. మా పనమ్మాయి 'మాడం.. మీరు అలా గాలికి వదిలేస్తే నేనే కదా పెట్టాను పక్కన జాగ్రత్త గా..' మీరు నాకు ఏం కొంటారు? అని అడిగింది. అదీ నిజమే అని తనకి 500 ఇచ్చి ఏదైనా చీర కొనుక్కొమ్మన్నాను.
ఫంక్షన్ అయింది వెండి కడ్డీలూ దొరికాయి. సంతోషం గా ఇంటికి చేరాం. వారం గడిచేటప్పటికి కాస్త రంగు లో మార్పు వచ్చినట్టనిపించింది. వెండి అంటే ఇది మామూలే అని ఊరుకున్నాం. నాకే మనసాగక కంసాలి దగ్గరకెళ్ళి చూపించాను. 'పర్వాలేదు.. మరీ నాసి రకం కాదు ' అన్నాడు. కానీ.. వేరే లోహం కలిసిందన్నాడు. 'ఏం చేస్తాం?' ఎవ్వరితోనూ అనకుండా తేలు కుట్టిన దొంగల్లా కాం గా ఉండిపోయాం. వెండి చేతికొచ్చేలోపల ఈ విషయం లో మేము చేసిన ఖర్చు తలచుకుంటే.. అసలు ఖరీదుకి కాస్త ఎక్కువే అయినట్టు తేలింది.
ఈ కథకి కొసమెరుపేంటంటే.. ఆ షాప్ కి బెంగుళూరు లో 4-5 బ్రాంచిలున్నాయి. అన్నింటిలోనూ వెండి అందుకుంటూ మా ఫొటోలు పెట్టారు. తెలిస్న వారు కొందరు చూసి.. 'వావ్ ఈ విషయం మాకు చెప్పనే లేదే?' అని జెలస్ గా అంటుంటే.. మేము హి హి హి అని పైకి అంటూ, లోపల మాత్రం తెగ గింజుకుపోతున్నాం. మీరూ చెప్పకండే?
" పక్కింట్లో ముసలావిడ నాలుగు రోజులయ్యింది కనిపించట్లేదు. రోజూ ఎండకి బాల్కనీ లో కనిపించేది కుర్చీలో కూర్చుని ఏవో చదువుకుంటూ.. 'ఏదో ఊరెళ్ళి ఉంటుంది అనుకున్నాను. ఇవ్వాళ్ళే తెలిసింది ఆవిడ పోయిందని!! ఇంట్లోనే ఉన్నాను.. నాకస్సలు తెలియనే లేదు,. అసలు ఎప్పుడు తీసుకెళ్ళారో.. ఎవరొచ్చారో ఏం చేసారో తెలియను కూడా లేదు " అని మా ఫ్రెండ్ బాధ పడుతూ చెప్పింది మొన్నీ మధ్య ఫోన్ లో.
తర్వాత పలకరింపు కని వెళ్ళిందిట .. 'నా చాదస్తం నాది కాని అసలు వాళ్ళు ఏమీ జరగనట్టున్నారు. టీ వీ లో ఏదో ప్రోగ్రాం చూస్తూ.. ఎప్పుడెళ్ళిపోతానా అన్నట్టు మొహాలు పెట్టారు... ఆవిడ కి రొప్పు వస్తే.. హాస్పిటల్ కి తీసుకెళ్ళారట. అక్కడ ఎడ్మిట్ చేసాక 2-3 గంటల్లో పోయారట. మిగిలిన పిల్లలేమో అమెరికాల్లో, ఆస్ట్రేలియాల్లో ఉన్నారట. ఫోన్లు చేస్తే మేము రాలేము..నెమ్మదిగా వస్తాం పదకొండోరోజుకి వీలుంటే.. మీరు కానిచ్చేయండి అన్నారట. ఇంక ఇంటికి తీసుకుని రావటమెందుకని.. అక్కడ్నించే ఎలెక్ట్రిక్ దహనానికి తీసుకెళ్ళి స్నానాలు చేసి వచ్చేసారట ' .. పక్కింటివాళ్ళం ఉన్నాం కనీసం మాకు చెప్పాలని కూడా అనిపించలేదు వాళ్ళకి చూడు కృష్ణా! ' అంది.
నన్నైతే ఆలోచింపచేసింది ఈ విషయం. మా ఇంటి దగ్గర కూడా ఒక 90 దాటిన ముసలావిడ మంచానికి పరిమితమై ఉన్నారు. కొడుకూ, కోడలూ, మనవడి కుటుంబం తో ఉన్నారావిడ. కోడలికే 70 దాటాయి. కూతురికీ అంతే. వారూ పరాధీన లయ్యారు. కాకపోతే రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బు తో కొడుకు మంచి ఇల్లు కొనటం తో ఆవిడ కి ప్రత్యేకం గా ఒక గది, తదితర సదుపాయాలు అమర్చ గలిగారు. పెద్దావిడ కి ఇంకో కొడుకు ఉన్నా.. ఆయన ముంబై లో ఎక్కడో పదో అంతస్థు లో చిన్న ఫ్లాట్ లో ఉండటం మూలాన ఆయన నా వల్ల కాదు అమ్మని చూడటం అనేసారు. కూతురేమో ఇద్దరన్నదమ్ములున్నారు వాళ్ళే చూసుకోవాలి అని నోరు మెదపకుండా ఊరుకుంది.
పెద్దావిడ వల్ల కుటుంబం లో విబేధాలు.. చాలా పెద్ద లెవెల్లో .. పెద్ద కోడలు పెద్ద కసిగా.. దానికి మూడు రెట్ల కసి గా సదరు కోడలుగారి కోడలు.. ఎవరితో మాట్లాడినా వారి వైపే న్యాయం ఉందనిపిస్తుంది. అంత కన్నా వారేం చేయగలరు అని అనిపిస్తుంది కానీ నలిగిపోతుంది మాత్రం జీవన చరమాంకం లో ఉన్న ఆ వృద్ధురాలు. వారు ఆక్రోశం తో ఆవిడ తో మాట్లాడరు. మనం వెళ్ళి మాట్లాడినా 'అదిగో.. ముసలావిడ ఏం చాడీలు చెప్తున్నారో నని ఒక కన్నేసి ఉండటం. ఒక్కోసారి అలాంటి జీవితం కన్నా జైలు జీవితం నయమేమోననిపిస్తుంది. ఆడపడచు ఊళ్ళో ఉండి కూడా రాదని ఈ కుటుంబానికి కోపం. ఆవిడేమో గుండె జబ్బు తో 2 పెద్దాపరేషన్లు చేసుకుని ఏదో ఈడిస్తున్నారు. 70 యేళ్ళ వయసు, భర్త లేడు. కొడుకు వద్ద ఉన్నప్పుడు తన తల్లిని తెచ్చుకుని పెట్టుకోలేని నిస్సహాయురాలు. ఆవిడ కొడుకేమో 'నేను తల్లిదండ్రుల, అత్త మామల బాధ్యత తీసుకున్నాను. అమ్మమ్మ బాధ్యత కూడా ఎలా తీసుకోను? అని..
వైద్యులు ఇంకో వారం కన్నా బతరని చెప్పాక ఇంటికి తెచ్చారు ఆవిడని. ఆరోజు ఆవిడ మనవడి భార్య కనపడింది.. 'నేను మా పుట్టింటికి వెళ్తున్నాను. మళ్ళీ పదో రోజయ్యాక వస్తాను. నా పాప చిన్నది .. చూసి భయపడుతుంది..' అంది. 'ఒహ్ మీ అత్తగారికి మరి సహాయం అవసరమేమో? ' అంటే.. 'ఉన్నారు గా ఆవిడ తోటికోడల్నో, ఆడపడచునో తెప్పించుకుంటుంది.. మా అమ్మా వాళ్ళొచ్చి మా ఇన్ లాస్ ని పలకరించి, నన్నూ, పాపనీ తీసుకెళ్ళిపోతారు.' అంది.
'బాబోయ్.. ఇంకా ఆవిడ బతికుండగానే.. వీళ్ళు పలకరించటానికి రావటం, గుండిగలు మోయక్కరలేదుగా.. కాస్త చేదోడు వాదోడు గా ఉంటే బాగుండే సమయం లో బాధ్యత నుండి తప్పుకుని వెళ్ళిపోతున్న ఈ తరం అమ్మాయి ని ఏమంటాం? మనం.
బిల బిల లాడుతూ అంతా వచ్చారు. డాక్టర్ చెప్పిన వారం ఇంకో రోజులో పూర్తవుతుందనగా.. మళ్ళీ ఆసుపత్రి లో చేర్పించగానే. ఒకటి, రెండు, మూడు.. 10 రోజులైనా ప్రాణం గట్టిది అలాగే ఉన్నారు. ' ప్రస్థుతానికి ఈవిడ బానే ఉంది కానీ 'ఏ క్షణం అయినా పోవచ్చు ప్రాణం..' అనగానే సాయంత్రానికి ఏదో ఒక సాకు చెప్పి అంతా చల్లగా జారుకున్నారు.
నెల రోజులైనా ప్రాణం అలాగే నిలవటం తో పోయాక పదో రోజుకి వస్తానన్న మనవరాలు వెనక్కి వచ్చింది. మళ్ళీ అంతా మామూలే. యూరోప్ లో ఆఫీస్ పని ఉందని మనవడు వెళ్తుంటే.. ఆయన తో భార్యా,పాపా వెళ్ళిపోయారు.
వృద్ధులు మిగిలారు ఇంట్లో పెద్దావిడ ని చూసుకుంటూ. అప్పుడప్పుడూ ఆవిడ కి బ్రేక్ ఇవ్వటానికి నేను ఏదైనా డాక్యుమెంట్ చేసుకోవటానికి వెళ్ళేదాన్ని వాళ్ళింటికి. ఆవిడ కాస్త చల్ల గాలికి తిరిగి వచ్చేది. ఒక రోజు రాత్రి ఫోన్ వచ్చింది.. 'మా అత్తగారు పోయారు..ఇంట్లో ఎవ్వరూ లేరు. ' అని.. నేను వెళ్ళేటప్పటికే ఎవరో నలుగురైదుగురు చేరారు అక్కడ.
ఎక్కడ పుట్టారో, జీవితం లో ఎన్ని చూశారో, ఏం చూశారో తెలియదు కానీ అతి ప్రశాంతం గా పండుటాకు నేలారాలినట్టున్నారావిడ. ఐసుపెట్టె లో ఉన్నారు. అందరూ ఉదయానికి చేరతారన్నారు ట. రాత్రి శవ జాగరణ కి పెద్దగా ఎవరికీ ఇంటరెస్ట్ లేదని గమనించి నేనూ, మా వారూ అక్కడే ఉందామని నిశ్చయం చేసుకున్నాం. పిల్లలు అమ్మమ్మ గారింటికెళ్ళారు అని..
ముగ్గురమో నలుగురమో.. ఉన్నాం. సన్నటి హల్లో పక్కనే ఐస్ బాక్స్. కోడలు సోఫా లో పడుకుంది. అవీ ఇవీ పొంతన లేని కబుర్లు చెప్తోంది .. ముసలావిడ ని డబ్బిచ్చి హాస్పిటల్లో చేర్పించేద్దామనే ప్రపోజల్స్ ని ఎంత తీవ్రం గా అడ్డుకున్నారో, అంత పెద్ద వయసు లో విసుక్కుంటూనో, ఉసూరుమంటూనో సేవ చేసిన విషయం నాకూ తెలుసు.మౌనం గా వింటున్నాం.. 12 కొట్టేసరికి అంతా నిద్ర పోయారు. ఒకళ్ళిద్దరం మాత్రం ఏవోపనులు చేసుకుంటూఉండిపోయాం ..
తెల్లవారుతుండగా ఒక్కొక్కరు గా కుటుంబ సభ్యులు చేరుక్తున్నారని నేనూ నెమ్మదిగా బయట పడదామనుకుటుండగానే.. కాస్త కాఫీ అదీ కాస్తావా అని అడిగారు మొహమాటం గా.. 'సరే అని కాఫీ చేసి అందరికీ ఇచ్చాక అందరం కాఫీ తాగటం లో పడ్డాం. మాట్లాడుతూ పైగా తాగిన కాఫీ కప్ కూడా ఐస్ బక్స్ మీద పెట్టటం గమనిస్తే నవ్వొచ్చింది.
తమిళులు వాళ్ళు... ముసలివారి చావు కల్యానం తో సమానం.. అని సామెత చెప్పారెవరో.. మధ్యాహ్నం పురోహితుడూ వాళ్ళూ వచ్చేదాకా విబేధాల వల్ల బింకం గా గంభీరం గా ఉన్న కుటుంబ సభ్యులు శవాన్ని ఐస్ బాక్స్ లోంచి తీసి కింద పెట్టగానే.. ఒక్కసారి గా ఘొల్లు మన్నారు.
విబేధాలూ అవీ బాధ్యత మోయవలసి రావటం వల్ల ఉత్పన్నమైనవి కానీ కన్నీటితో వాళ్ళ ద్వేషాన్నంత కడిగేసుకుని ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ఆఖరి రోజుల్లో వదిన చేసిన సేవ, చాకిరీ గురించి మాట్లాడుతూ కూతురు కన్నీటి తో వదిన గారి చేతులని అందుకుని కళ్ళదగ్గరకి తీసుకుని. చిన్న కోడలూ, ఇతర మనవలూ కూడా తామింకా చేయవలసి ఉండవలసిందని అనుకున్నారు. ఎక్కువ మందిని పిలవకుండా సింపుల్ గా కానిచ్చినా అందరూ కలిసి కర్మ కాండలు జరిపించారు.
ఎవరిళ్ళకి వారు వెళ్తూ అప్పుడప్పుడూ కలవాలనీ, అలాగ ఒకరికొకరు చెప్పుకుని వెళ్ళిపోయారు. రెండు నెలల్లోనే వారి వారి రొటీన్ లో పడిపోయారనుకోండి. కానీ అందరూ ఒక్కటిగా కనీసం ఒక నాలుగు రోజులు ఉన్నారు.
వారికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటేనో? ఆవిడ ఇంకో నాలుగు నెలలు బతికుంటే ? ఏ 10 లక్షలో ఖర్చు పెడితే ఆవిడ ఇంకో 10 యేళ్ళు బతుకుతుందని డాక్టర్లు అని ఉంటే? ఆవిడ అదృష్టవంతురాలు.. ఇంకా బాగా జరుగుతున్నప్పుడే అస్థమించారు.. మన చరమాంకం ఎలా ఉంటుందో.. సత్తు లేని దినాన మన పరిస్థితేంటి? స్వర్గారోహణ పర్వం లాగా ఐచ్చికం గా మరణాన్ని ఆహ్వానించటమే బెస్టేమో.. ఇలా గజిబిజి గా ఉంది..ఏమో అవన్నీ ఆలోచించ కూడదు బాబూ. అనుకుని ఆ ఆలోచనలని పక్కకి నెట్టేసి నేనూ రొటీన్ లో పడిపోయాను.
అసలే మా పెద్దమ్మాయి కి లెక్కల పరీక్ష .. ఎంత చదివించాలి? ..పైగా ఆఫీస్ డెడ్ లైన్ దగ్గర పడుతోంది..
Subscribe to:
Posts (Atom)