Friday, May 28, 2010

పట్టు నైటీ మడి

ఇప్పుడే పార్టీ కెళ్ళి వచ్చా.. మా స్నేహితురాలు ప్రభ చాలా రోజులకి కనిపించింది. కుశల ప్రశ్నలయ్యాక మాటల్లో తెలిసింది.. వాళ్ళ అత్తగారూ వాళ్ళూ చాలా ఆచారవంతులట. ఇప్పటికీ స్నానం చేసి మడిగా వంటా అదీ చేయాలంటారట. అఫ్ కోర్స్.. తన కుటుంబం లో కూడా మడీ,అంటూ లాంటివి ఎక్కువే.. కాకపోతే ఒక ఎక్సెప్షన్.. మరీ తడి బట్ట తో కాకుండా, స్నానం చేసి మడి పట్టు చీర విడిగా వాడితే చాలట.

తను దానిక్కూడా కాస్త షార్ట్ కట్ చేసాననీ తన కంచి పట్టు చీర చింపించి నైటీ కుట్టించాననీ, మడి వంట కి అదే వాడతాననీ చెప్పింది. నాకు చచ్చే నవ్వు వచ్చింది. ఈ కాన్సెప్ట్ ఎప్పుడూ వినలేదని. అసలు మడి ఉద్దేశ్యం ఏమిటి? ఎందుకు చేయాలి? ఎందుకు చేస్తున్నాం? అని ఆలోచన కన్నా.. మడి కట్టుకోవటం అంటే 'పట్టు బట్టలు ' కట్టుకోవటం, ఎవర్నీ ముట్టుకోకపోవటం అని అనుకుంటుందనుకున్నాను.

రోజూ వారీ గా ఇళ్ళల్లో మడులు కట్టుకుని వండటం ఎప్పుడో మానేసారు కానీ మా ఇళ్ళల్లో ఇప్పటికీ.. పండగలకీ, పబ్బాలకీ, వైదిక కర్మలకేదైనా సరే మడి గా ప్రసాదం వరకైనా వండటం మామూలే.. పైగా పాత కాలం వాళ్ళెవరైనా వస్తే.. వాళ్ళకోసం..కాస్త ఇంకా కొద్దిగా 'అంతరించిపోతున్న ' ఆచారం సాగుతోంది.

మా చిన్నప్పుడు మా నాయనమ్మ మడి కట్టుకుని వండటం,.. ఆవిడకి ఓపిక తగ్గిపోయాక మా అమ్మ ఆ బాధ్యత తీసుకోవటం, దాంట్లో జరిగే తప్పిదాలకు మా నాయనమ్మ తట్టుకోలేకపోవటం, తర్వాత నెమ్మదిగా మడి స్థాయి తగ్గిపోయి, స్నానం చేసి..వంటగదీ,పొయ్యీ శుద్ధి చేసి వండటమే మడి అని కాలానుగుణమైన మార్పులు మా ఇంట్లో ప్రవేశించటం నాకు తెలుసు.

తలస్నానమాచరించి తడి బట్టలతో మడి కట్టుకోవటం, ఎవరైనా తాకితే.. (పిల్లలు 'అమ్మా' అంటూ చుట్టుకుపోవటం) , ఉసూరుమంటూ మైల పడ్డామని మళ్ళీ రెండు చెంబులు తలన పోసుకుని రావటం లాంటివి మా అత్తయ్యలు చేస్తూ ఎంత కష్టపడ్డారో ఆరోజుల్లో.. మళ్ళీ చిన్న టవున్లలో ఎప్పుడైతే ఇరుకిళ్ళల్లో కాపురం మొదలు పెట్టారో, మడి బట్టలు విడి గా ఆరేసుకోవటం, అవి పొడిబారాక కట్టుకోవటం, పిల్లలు విధివశాత్తూ తాకినా, చూసీ చూడనట్టు ఉండిపోవటం, నుండి.. స్నానం చేసిన తర్వాత వంట గా రూపాంతరం చెందింది మా ఇళ్ళల్లో మడి.

మా నాయనమ్మ ఒక కథ చెప్పేది.. ముగ్గురు ముసలమ్మలు మడి కట్టుకుని కూర్చుని జంతికల పిండి కలిపారట.. మొదటావిడ అందిట,.. ' మా ఇళ్ళల్లో అబ్బో,.. నిప్పులు కడుక్కునే ఆచారం.. ఇప్పుడెవరికుందమ్మా?' అని.

రెండో ఆవిడ తక్కువ తిందా? 'మా ఇళ్ళల్లో ఒకసంవత్సరం,..మడి ఆవకాయ జాడీలు దింపుతుండగా పిల్ల కాకి కావ్ మంటూ కిటికీలో వాలిందని, ఆరు జాడీల మడీఅవకాయా మైలపడిందని తీసేసారు.. ఈకాలం వాళ్ళకి ఏంతెలుసనీ...' అని సాగదీసిందిట.

ఇక మూడో ముసలమ్మ ఊరుకుంటుందా? 'మా ఇళ్ళల్లో మడి తర్వాతే ఎవరిదైనానూ.. మొన్న మడిగా లడ్డూ చుడుతుంటేనూ, పైవసారా లో కూర్చుని బాతాఖానీ చేస్తున్న ఇంగ్లీషు దొర 'అబ్బా.. ఏంటండీ ఇంత గుభాళింపూ' అన్నాడని.. పాకం పెట్టిన బూందీ అంతా మైలపడిందని.. పక్కకి తీసేసాం ' అని కళ్ళెగరేస్తూ చెప్పింది.

మాదంతే కాదు మాదని ఇలా గొడవ పడుతుండగా.. ఒక పిల్లిపిల్ల చటుక్కున కిటికీ లోంచి పిండి గిన్నెలోకి గెంతి.. అలా పోయింది. అంతే.. ఇక మాటల్లేకుండా కారప్పూస చేయటం లో నిమగ్నమయ్యారు.

ఇలాగ అంటూనే.. మా నాయనమ్మ ఇంట్లో మడి సరిగ్గా సాగట్లేదని గొణుగుతూనే ఉండేది. మళ్ళీ.. ' ఎగ్జిబిషన్ లో మెరపకాయ బజ్జీలకుండదర్రా మడి.. ' అంటూ చిన్నప్పుడు మా అందరికీ..నాంపల్లి ఎక్జిబిషన్ లో కొనిపెట్టి తానూ తినేది. అదే మనిషి పదేళ్ళ క్రితం ఏదో ఆరోగ్యరీత్యా హైదరాబాద్ కొచ్చినప్పుడు మూడు రోజులు మడి వంట లేదని అరటిపళ్ళతో గడిపింది.

ఆవిడ బ్రతికున్నంత కాలం ఏదో విధం గా మడి, ఆచారాలు సాగించుకుని, ఎనభయ్యవ పడిలో అస్థమించాక.. జరిగిన ఒక గమ్మత్తు సంఘటన తో ఈ టపా ముగిస్తాను.


ఆవిడ కర్మ కాండలు పన్నెండవ రోజున నలుగురు స్వాములకి భోజనం వడ్డించాలి. వారికోసం మేము మడి ధోవతులు ఆరవేసి ఉంచాం బెడ్రూం బాల్కనీ లో. మా చుట్టాలే స్వాములవటం చేత.. వారంతా దొడ్లో రెండు చెంబులు గుమ్మరించుకుని మడిగట్టుకుని భోజనానికి ఉపక్రమించారు.

ఆరోజున ఒక కజిన్ వస్తానని ఆఖరి నిమిషం లో రాలేకపోవటం చేత.. వంట బ్రాహ్మల్లో ఒకాయనని.. 'బాబ్బాబూ .. నీవంతు వంట మేం చేస్తాం. కాస్త మడి కట్టుకో నాయనా..' అని బతిమలాడుకుంటే.. ఆయన స్నానం చేసి చూస్తే ఏముంది? ఆయన బట్టలన్నీ.. కార్యాలు జరిగాక ఊరెళ్ళిపోవాలి అని ఆరేసుకుంటే.. మా కజిన్లంతా కట్టేసుకున్నారు. ఆయన ఒకటే అరవటం.. 'ఏంటండీ.. మా వంటవాళ్ళ బట్టలన్నీ కట్టేస్తారా? శుభ్రం గా ఉతుక్కుంటేనూ..' అని. తినేవాళ్ళంతా.. మింగలేకా, కక్కలేకా.. పొలమారింది.

మా కజిన్లలో ఒకడైతే ఏడ్చినంత పని చేసాడు. వంటవాడు జిడ్డోడుతూ ఉతుక్కున్న పంచెని.. తన మూడు వేల రూపాయల షర్టూ, బ్రాండెడ్ జీన్సూ విప్పి కట్టుకున్నానా అని.

అప్పుడు.. ఏదో అందరికీ సర్దిచెప్పి,.. ఒప్పించేసరికి తలప్రాణం తోకకొచ్చింది.

ఈరోజుకీ, మా నాయనమ్మ మడి తలచుకున్నప్పుడల్లా, వంటవాళ్ళ ధోవతులు కట్టుకున్న మడి గుర్తుకొచ్చి నవ్వుకుంటాం.

ఈరోజున ఆ రోజూవారీ మడులూ, ఆచారాలూ, చరిత్రపుటల్లో కలిసిపోవటానికి సన్నద్ధమవుతున్నా.. ఉదయానే లేవటం, ఉదయం.. పాలు కాచుకునే ముందే ఒకసారి స్టవ్ కడుక్కోవటం,.. రొటీన్ రోజుల్లో స్నానం తర్వాతే వంటా, తినటమూ, నా పిల్లలకీ.. నేను నేర్పిస్తున్న ఆచారం.. మరి వారెంత వరకూ పాటించగలరో, పాటిస్తారో, కాలమే నిర్ణయిస్తుంది.

8 comments:

Sujata M said...

బావుంది. మీరు ఏమీ అనుకోకండి. ఈ మడి మీద బోల్డన్ని జోకులున్నాయి కదా. వాటిల్లో భానుమతి గారి 'అత్తగారి కధల్లో' అత్త గారి తరహానే మా నానమ్మ ది కూడా. వొంటిల్లు ఆక్రమించుకుని, వేరుగా రుచిగా వంట చేసుకుని, మానవమాత్రుడెవడూ చూడకుండా గుట్టుగా భోంచేసేది నానమ్మ. అయితే మాకు తన వంట ఇష్టం కాబట్టి కొంచెం మాకోసం కూడా చెయ్యడం జరిగేది అపుడపుడూ.

ఇంకో పెద్దావిడ, దొడ్లో ఏవో ఇత్తడి సామాన్లు ఆరబెట్టి, దొంగలు ఎత్తుకుపోకుండా వాటి మీద మడి చీర (ఎవరూ ముట్టుకోరు కదా అని) ఆరబెట్టిందంట. దొంగలు ఆ సామాన్లూ, మడి చీరా, నిక్షేపంగా ఎత్తుకుపోయారు.

ఇలా బోల్డు జ్ఞాపకాలు. చిన్నపుడు వూర్లో నాకు గుర్తుండి, కొళాయి నుంచీ మడి నీళ్ళు తీసుకు రావడం ఒక చిన్న సైజు ప్రహసనం. అవన్నీ గుర్తొచ్చాయి. జై హొ నానమ్మ !

Krishnapriya said...

ధన్యవాదాలు సుజాతగారు,

మా అమ్మమ్మ తల్లిగారు, ఒకసారి మడిగా ఏవో ఎండకి పెట్టగా,ఒకటి రెండు చినుకులు పడ్డట్టనిపించింది,కానీ ఆగిపోయిందిట. మా మేనమామ ఒకాయన, 'అమ్మమ్మా, అవి చినుకులు కాదు, విమానంలో ఎవరో స్నానం చేసినట్టున్నారు,.. అనగానే.. ఆవిడ బిక్కమొహం వేసి ఆరేసిన ముక్కలు ఇక మడికి పనికిరావని తీసేసిందిట.


మా అమ్మ నాయనమ్మ, మా అమ్మావాళ్ళు, మధ్యాహ్నం అన్నానికి ఇంటికొస్తే, స్కూల్ బట్ట విడిచి, రెండు చెంబులు పోసుకుని మడి కట్టుకుంటే కానీ వడ్డించేది కాదట. ఈ మడి కట్టటం, తినటం, వెళ్ళటం లో టైం వేస్ట్ అవుతుందని,.. కొంత కాలం మద్యాహ్నం తిండి పిల్లలు మానేస్తే దిగి వచ్చి.. బట్టలు మార్చుకుని, కాళ్ళూ,చేతులూ,మొహం కడుక్కుని తినటం వరకూ అనుమతించారట...

ఈ మడి నీళ్ళ గొడవలో, కాలు జారి, మా నాయనమ్మగారు, తుంటి ఎముక విరక్కొట్టుకుని.. నెలల తరబడి మంచాన పడటం కూడా గుర్తుంది..
కృష్ణప్రియ

kvrn said...

baavundi. peeta kastaalu peetavi annaru.

సుభద్ర said...

chaalaa baundi..mukyam gaa madi mirchibajji..

సుజాత వేల్పూరి said...

మడి విషయంలో మా అమ్మమ్మ సుప్రీమ్! ఆవిడ మా ఇంట్లోనే ఉండేది. రోజూ కుంపటి తోమి, చిన్న ఇత్తడి గిన్నెలో అన్నం వండుకుని భోజనం చేసేది. ఆవిడ పప్పు వండుతున్నపుడు ఆమె చూడకుండా కుంపటి మీద ఉడికే పప్పును ఒక స్పూనుతో తీసుకుని తినేయడం భలే ఇష్టంగా ఉండేది మాకు.

అమ్మ కూడా బాగానే మడిపాటించేది. "నా మడి మండినట్లే ఉంది"అన్న మాట చాలా తరచూ వినబడుతుండేది ఇంట్లో! జడలు వేసుకోడం రాకో,మరోదానికో అమ్మను ముట్టుకోవాల్సి వచ్చేదిగా మరి!

పెళ్ళయిన కొత్తలో అమ్మ దగ్గరికి వెళితే "మీ ఇంట్లో మడి పాడూ ఉండదు"అని నా సూట్ కేసూ, బాగూ ఓపెన్ చేయించి కాసిన్ని పసుపు నీళ్ళు చిలకరించి లోపల పెట్టేది.

మాలా కుమార్ said...

మా అమ్మమ్మ 85 ఏళ్ళ వరకూ , తన మటుకు కుంపటి మీద వండుకొని తినేది . చివరి పది రోజులు మత్రమే వండుకోలేక పోయింది .
మడి నైటీ బాగుంది .

కృష్ణప్రియ said...

మా ఇంటి ముందు ఉంటారు.. అబ్బాయికో 30 యేళ్ళు. అమ్మాయికో పాతికా. ఉదయం ఆరుగంటలకి కర్టెన్ తీసి చూసేటప్పటికి, అమ్మాయి కాశెపోసి చీరకట్టు తో.. మడిగా తులసి పూజ చేస్తూ ఉంటుంది. భర్త తడి ధోవతి కట్టి, మడిగా, సూర్యుడికి నమస్కారం చేస్తూ కనిపిస్తారు..

కట్ చేస్తే.. 8.30 కి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల అవతారం ఎత్తి.. 'హే..క్రిష్నా! వాట్స్ హాపెనిన్?' అని వేవ్ చేసి ఆఫీస్ కెళ్తూ కనిపిస్తారు. ఇంట్లో మడిగా వంట చేసుకుని తింటే .. మళ్ళీ రాత్రి ఇంట్లోనే తింటారట... మా కాలనీ వాళ్ళందరికీ.. అలవాటైపోయింది.. వాళ్ళు ఉదయం కనపడకపోతే.. వొంట్లో బాగోలేదేమో అనుకుంటారు..

Padmarpita said...

భలే:)

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;