Sunday, May 30, 2010

మీరూ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు...



రోజూ బోల్డు మంది ని కలుస్తాం కదా.. రకరకాల మనుషులు ఎదురవుతారు కదా.. ఏనాడైనా మీకిలాంటి వ్యక్తులు ఎదురుపడ్డారా?




1) కనీసం 100 మందిని అయినా టెస్ట్ చేసాను ఈ ప్రశ్న తో..

మీరు : " వావ్!!!! ఈ మధ్య చాలా చిక్కినట్టున్నారు? "
జవాబు: 'ఎక్కడండీ.. చచ్చేంత లావున్నాను.. /ఇంకానయం.. చాలా లావెక్కాను... ' అర్థం లోకొచ్చేవి..


2) ఎవర్నయినా మీ జుట్టు ఎంత వత్తు గా ఉంది? అని అడిగి చూడండి..

మీరు: "అబ్బ! ఎంత బాగుందండీ.. మీ జడ? "
జవాబు: " ఇప్పుడు సగానికి సగం ఊడిపోయిందండీ.. ఈ ఊర్లో నీళ్ళు పడట్లేదు నాకు.. రోజూ టెన్నిస్ బాల్ అంత ఊడిపోతోంది.. "

3) పిల్లల్ని పొగిడామా? అంతే సంగతులు..

మీరు: " మీ పిల్లలా? ఎంత బుద్ధిగా ఉన్నారు? సో నైస్!!"
జవాబు: "ఇంకా నయం.. రాక్షసులండీ.. ఇల్లు పీకి పందిరేస్తున్నారు.. వీళ్ళు పూర్వజన్మ లో వాలి సుగ్రీవులయ్యుంటారనిపిస్తోంది.. వేగలేకపోతున్నాం..' లాంటివి..

4) కొంత మంది ఇల్లు అద్దం లా ఉంచుకుంటారు. కానీ ఇంట్లోకి మనం కాలు పెడుతూనే.. మాత్రం..

వారు : " సారీ.. ఇల్లు చాలా మెస్సీ గా ఉంది ఏమీ అనుకోకండి.. ఎక్కడ వస్తువులు అక్కడే పడేసాను. ఇవ్వాళ్ళ లేట్ గా లేచారు పిల్లలు.. సద్దటానికి ఓపిక లేక మానేసా!!"

మీరు (మనసులో)" వార్నీ.. అస్సలూ సద్దుకోకపోతేనే ఇల్లిలా ఉంటుందా? అసలు సద్దటమంటే..ఇంకా ఏం చేస్తారో? "

5) " మీ అబ్బాయి క్లాస్ ఫస్ట్ వచ్చాడట గా ? " అని అడగండి చూద్దాం.

జవాబు : "అయ్యో! ఏ చెట్టూ లేని చోట..ఆముదం చెట్టే మహా వృక్షం అంటారు కదా ఆ బాబతు.. మా అబ్బాయి! "

6) ఇంక ఆరోగ్యం గురించి అడిగితే?

మీరు : మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఈ మధ్య జ్వరాలు వచ్చి తగ్గాయని విన్నాను. ఇప్పుడు కుదుట పడ్డారా? "
జవాబు: " ఏం కుదుట పడటమో నండీ.. మెట్లెక్కితే ఆయాసం.. ఉదయం టిఫిన్ తినకపోతే ..అబ్బో నీరసమండీ బాబూ.. ' తింటే ఆయాసం.. తినకపోతే నీరసం' .. లా ఉంది నా పరిస్థితి.. అబ్బో పగవాడిక్కూడా ఇలాంటి ఆరోగ్యం ఇవ్వద్దు అమ్మో.. "

లాంటి సమాధానాలు తప్పవు.



7) క్లాస్ ఫస్ట్ వచ్చే పిల్లల్ని నేను స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు ఎప్పుడు పరీక్ష ఎలా రాసావన్నా..ఇదే సమాధానం..

" అనుకున్నంత బాగా రాయలేదు.. ఈసారి ఏంటో ఇలా అయిపోయింది.. :-( "

కానీ వాళ్ళకి 100 కి 100 వచ్చినా ఆశ్చర్యపోవక్కరలేదు. పరీక్షలకి ముందు " ఏరా? ప్రిపరేషన్ ఎలా అవుతోంది? " అని అడిగి చూడండి.. వాళ్ళ తల్లిదండ్రులకి ఏం చెప్తారో తెలియదు కానీ.. మనకి మాత్రం.. " చాలా చాప్టర్లు వదిలేసాను. ఏదయితే అయిందని.. ఆఖరి నిమిషం లో మొదలు పెడితే ఇంతకన్నా ఏం చేయగలం?... " లాంటి చెత్త ఆన్సర్లు చెప్తారు.


8) ఎవరింటికైనా భోజనాలకి ఎళ్ళినప్పుడు.. మీరు ఏమీ వంటకాలను పొగడకుండా మౌనం గా వడ్డించుకోండి.. అప్పుడు ఇల్లాలేమంటుంది?

ఇల్లాలు : మా వంటలు మీకు నచ్చుతాయో, నచ్చవో.. కారాలు నా చేత్తో (ఎక్కువ/తక్కువ) పడతాయి.. పాపం .. మీకు అలవాటుందో లేదో? "

అంటే.. 'అదేంటి.. ఒక్క చిన్న పొగడ్తైనా లేకుండా.. తినేస్తున్నారు? "

లేక.. " మా అమ్మ గారు ఇది చాల బాగా చేస్తారు.. నేను హర్రీ లో ఏదో చేసేసానండీ.. "

ఇక మీరు .. " అబ్బే లేదండీ.. వంటలు సూపర్ గా ఉన్నాయి.. చాల కాలం తర్వాత ఇలాంటి వంట తింటున్నాను " అనక చస్తారా?

7 comments:

మధురవాణి said...

so true! ;-):-D

Ram Krish Reddy Kotla said...

:-)...నిజ్జంగా నిజం

Sravya V said...

ఆ ఐదో ప్రశ్న జవాబు విషయం లో నా కొద్దిగా అనుమానం , మిగిలినవి 100 % మీతో ఏకీభవిస్తా :)

ప్రసాదం said...

మీ పరిశీలనలు బావున్నాయి నిజమే.

మేధ said...

:)

ఇది సమీర లోకం said...

మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం.

కృష్ణప్రియ said...

అందరికీ ధన్యవాదాలు. ఇలాంటివి బోల్డు మనకందరికీ అనుభవమే.. :-) నిన్న సరదాగా ఎవరితోనో మాట్లాడుతూ.. ఈ విషయం వచ్చి కొన్ని అడిగితే.. అందరూ 'నిజమే' అన్నారు. అంతర్జాలం లో మిత్రులేమంటారో చూద్దాం అని ఇంటికి వచ్చి టక టకా.. టైప్ చేసేసి పోస్ట్ చేసాను.

-కృష్ణప్రియ.

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;