Thursday, June 3, 2010

ఫొటోలు నిక్షిప్త పరచలేని అనుభూతి..



హిందీ మాట్లాడేవాళ్ళతా ముస్లింలనీ, గాంధీ, నెహ్రూ ల్లాంటి మహానుభావులు బాత్రూంలకెళ్ళటం లాంటి చెత్తపనులు చేయరనీ,.. అబద్ధాలాడకుండా, బుద్ధిగా చదువుకుంటూ, ఒద్దికగా ఉంటే స్వర్గానికెళ్ళి భరత నాట్యాలు ఏక ధాటిగా చూడాల్సి వస్తుందనీ, .. క్లాస్ టీచరంత గొప్ప వ్యక్తి ప్రపంచం లో లేడనీ, బస్ స్టాండుల్లో దొరికే పాకెట్ సైజు చిట్టి నవలల ప్రపంచంలో తేలిపోతూ,.. టీ వీలూ, ఇంటర్నెట్లూ లేని బాల్యం లో,..అమ్మమ్మగారింట్లో వేసవి సెలవలు గడపటమనేది నా వయసు వారికి దాదాపు అందరికీ ఉన్న అమూల్యమైన జ్ఞాపకం!!

మా అమ్మమ్మగారికి ఏడుగురు సంతానమయ్యేటప్పటికి, ఒక్కోరికీ కనీసం ఇద్దరు పిల్లలయ్యేటప్పటికి,.. అందరికీ సెలవలకి ఇక్కడికే రావలనిపించటం .. మాకందరికీ కావలసినత కాలక్షేపం.. (పెద్దవాళ్ళకి మా అల్లరిని భరించటం నరకంగా ఉండేదేమో అని ఇప్పుడనిపిస్తుంది..) ఆఖరి పరీక్ష కన్నా... సెలవలకి సామాన్లే ఎక్కువ శ్రద్ధగా సద్దుకునేవాళ్ళమేమో..

రైల్లో ప్రయాణం తర్వాత, మళ్ళీ ఎర్రబస్సు ప్రయాణం.. నాలుగూర్ల అవతల, కాలవగట్టు దగ్గర దిగుతూనే.. రిక్షావాళ్ళు గుర్తుపట్టి,.. 'ధర్మం మాస్టారు గారి అమ్మాయిగారేనాండీ??' అని మా అమ్మని అడగగానే.. ఆవిడకి, ఆవిడద్వారా మాకు ప్రాప్తించిన పరపతి కీ, మాకు ఎంత గర్వం గా ఉండేదో.. బురద వచ్చినప్పుడు గుఱ్ఱం బండీ దిగి, రాళ్ళమీద గెంతుతూ నడిచి మళ్ళీ ఎక్కటం,.. తాటితోపులని దాటుతూ ఇంటికి చేరటం.. ఇల్లు ఫర్లాంగు దూరం లో ఉండగానే.. బండీ దిగి పరుగెత్తటం.. ఎలాటి కాం కార్డర్లూ, కామెరాలూ లేకుండానే మా మనసులో ముద్రించుకుపోయాయో ..

మా పిల్లలు వాళ్ళ అత్తలో, పిన్నులో ఎవరైనా ఇంటికి వస్తే.. సిగ్గుగా, నెమ్మదిగా రియాక్ట్ అవుతూ, ఉంటే నాకు నవ్వొస్తుంది. మేమాడ దూరంలో ఉండగానే.. " పిన్నీ వాళ్ళొస్తున్నారోఓఓఓఓఓఓఓ .......!!!!" అని మా పెద్దమ్మ పిల్లలు, గెంతుతూ, అరుస్తూ ముందుకి రావటం.. నలభైల్లో పడ్డ మా అక్క ని ఎప్పుడు చూసినా జ్ఞాపకం వస్తూనే ఉంటుంది.

తాటి తోపుల మధ్య మొహాలు కడగటం, గురుగింజపూసలనేరటం, కోతికొమ్మచ్చులాడటం, పొలాల మధ్య బోరింగ్ పంపులతో స్నానాలూ, ఈతలూ, తాటి ముంజలూ, రాములవారి గుడిలో నాలుగు స్థంబాలాటలూ, తాటాకు బొమ్మలకోసం, నారాయణరావు టైలర్ దుకాణంలో గుడ్డముక్కలు తెచ్చుకోవటం, చింతగింజల టోర్నమెంటులూ, గచ్చకాయలూ, పులీ మేకా,....

నక్కా తాతయ్యగారి దొడ్లో గోడ మీద సినిమాలూ, పది పైసల ఐస్ ఫ్రూట్లూ, హరికథా కాలక్షేపాలూ,.. తోచక వేసిన నాటకాలూ, పాత పత్రికల కట్టలు దుమ్ము దులిపి చదవటాలూ, రంగయ్య కొట్లో ఆయన మద్యాహ్న భోజనానికి ఇంటికెళ్తే.. కూర్చుని బీడీలూ, నిమ్మ బిళ్ళలూ, జీళ్ళూ అమ్మటాలూ.. పాలకి,నీళ్ళకీ, బిందెలతో వెళ్ళటాలూ, ఒక ఎత్తయితే...

పెద్దవాళ్ళు ఎవరో ఒకరు.. పేద్ద బేసిన్ లో ఆవకాయో, మాగాయో, చద్దన్నం లో కలిపి, మట్టు గిన్నెడు నూనె వేసి నారింజ కాయలంత ముద్దలు చేస్తుంటే, 20 మంది పిల్లలం చేతులు చాపి.. ఎలా తినేవాళ్ళమో.. తలచుకుంటే.. ఇంకా ఆ టేస్ట్ గుర్తొచ్చి.. లాలాజలం ఊరి.. ఈ టపాకి కాస్త బ్రేక్ ఇచ్చి ఎర్రావకాయ అలాగే బంతులు చేసి తినేసి వచ్చా..

వీధిలో పేడని ఏరి తెచ్చి బకెట్ లో వేసి నీళ్ళు కలిపి, ఈ గది నాది, లేదా.. ఈ గది లో ఈ భాగం నాది అని పంచుకుని, అలికేవాళ్ళం. మా అమ్మమ్మ లబో దిబో మనేది. 'బాబ్బాబూ, మీ నాన్నలు చూస్తే.. అసహ్యించుకుంటారు. వదిలేయండి.. అని '. ..... మేం వింటే కదా..

ఒకగది నిండా మామిడి పళ్ళు, లేదా, సపోటాలూ, పడేసి.. పిల్లలం లెక్క చూడకుండా తీసి తినటం.. గాడ్!! .. రెండో పండు తింటేనే .. మొహం మొత్తేసే పరిస్థితి ఈరోజు.

సుబ్బారాయడి షష్టికెళ్ళటం, జీడి మామిడి పళ్ళనుండి, జీడిపప్పు తీసి కాల్చే దుకాణాలకెళ్ళటం, బెల్లం తీస్తుంటే.. ఆకులో వేడిగా, కాలుతున్న, నల్లటి బెల్లం ఊదుకుంటూ తినటం,.. తాటి చెట్టు మాట్లాడుకుని, ఒక్కోకాయా కొడుతుంటే.. మూడు కళ్ళూ బొటనవేలు తో పైకి ఎగదోసి తిని/తాగి ఇంకోటి అందుకోవటం..

ఈరోజంటే.. ఇంటర్నెట్లూ, టీవీలూ, వీడియో గేములూ, అవేవీ లేకపోయినా.. సెల్ ఫోన్ లో గేములూ.. ఒక్కళ్ళే ఆడేసుకుంటూ.. పిల్లలు.మేమో? మా అన్నయ్య సెలవలకి వచ్చేముందే.. ఉత్తరాలు రాసి ఆల్ ఇండియా రేడియో కి పడేసేవాడు. 'రంగాపురం నుండి రాజు, సంధ్య,పద్మ,క్రృష్ణ.... రాస్తున్నారు.. ఇంకోసారి మాకు 'పిచ్చిపుల్లయ్య నాటకం ప్రసారం చేయండి.. మాకు ఆ నాటకం ప్రాణప్రదం..' లాంటి లైన్లు వినగానే.. ఆనందం తో ఉప్పొంగిపోయేవాళ్ళం,.. మేమూ గొప్పవాళ్ళమైపోయాం. మా పేర్లు కూడా రేడియో లో వచ్చాయి అని.

మేము మా మా ఊర్లలో నేర్చుకున్న పాటలూ,పద్యాలూ, విషయాలూ, సాయంత్రం ఆరుగంటలకే అన్నాలు తినేసి, ఆరుబయట పక్కలేసుకుని ఒకళ్ళకొకళ్ళు నేర్పించుకుని.. కొత్త కథలు చెప్పుకుని, నిర్మలమైన ఆకాశం లో వేలాది చుక్కలని చూస్తూ, నిద్రలోకి జారుకునేవాళ్ళం. ఒక్కోసారి మా మేనమామ కూతురు చెప్పే చెయిన్ కథలు ఏళ్ళు ఏళ్ళు సాగేవి..

ఆశ్చర్యం ఏంటంటే.. మళ్ళీ హైదరాబాద్ కి వచ్చేటప్పుడు.. అమ్మమ్మ గారింట్లో కుట్టించిన పరికిణీలూ, కజిన్ల నుండి తీసుకున్న పాతబట్టలూ, తెచ్చుకున్న ఆవకాయలూ, ఏడాది పాటూ,.. మాకు వేసవి లో ఒక మంచి గుంపు ఉంది. అక్కడ ఈ విషయం కూడా చర్చించాలి, ఇది నేర్చుకుని చూపాలి..అన్న ఉత్సాహాన్ని ఇచ్చేవి.

నాలుగేళ్ళ క్రితం మేము ఒక పది మంది దాకా కజిన్లం కలిసాం. ఎప్పుడూ ఐదారుగురు ఒక చోట, ఒక పూట కలిస్తే గొప్ప.. అదీ పెళ్ళిళ్ళల్లో కలిస్తే.. మాట్లాడటానికే పెద్ద గా కుదరదు. చిన్ననాటి సంగతులు గుర్తుచేసుకుంటూ.. మా అన్నయ్య.. 'ఏమే.. మీకు పిల్లల్లారా, ఊఊఊఊ పాపల్లారా.. ఊఊఊఊ ' పాట గుర్తుందా? అందరం ఎంత బాగా పాడేవాళ్ళమో అన్నాడు. అంతే.. గబగబా.. కూర్చుని మళ్ళీ పాడాం. చకచకా సెల్ లో రికార్డ్ నొక్కేసాను.

నాకు ఎప్పుడైనా ఒంటరితనం ఆవరిస్తే.. ఒక్కసారి ఆ పాట వింటే.. మనసు తేలికపడుతుంది..

నాకీ అద్భుతమైన అనుభూతిని జీవితాంతం నెమరేసుకోవటానికి మిగిల్చిన మా అమ్మమ్మ గారిల్లు, ఊరు పెరిగి, ఎవరూ చూడటానికి లేక కూలి, అమ్మబడి, రూపాంతరం చెందిందిట. మా తమ్ముళ్ళు బర్త్ సర్టిఫికెట్లకోసం వెళ్ళి ఫోటోలు తీసాం.. అని ముఖ పుస్తకం (ఫేస్ బుక్కు) లో పెట్టారు,

ఒక జూ పార్క్ కెళ్తేనే ఈరోజు రెండు సెల్ కామెరాలతో, ఒక డిజిటల్ కామెరాలతో ఒక వంద ఫొటోలైనా తీస్తాం మేము..

పికాసా ఆల్బముల్లో పెట్టి జనాలు 'చాలా బాగున్నాయి ' అని చెప్పేదాక వదలం.. అలాగే అవతల వాళ్ళవీ చూస్తాం.. అలాంటిది..

ఒక్క క్షణం కూడా ఆలోచించకుండానే.. అరక్షణం చూడకుండానే డిలీట్ చేసి పడేసాను.

అపారమైన అనుభూతిని చిన్న ఫోటో ఎంత వరకు నిక్షిప్తం చేయగలదు? మీరేమంటారు?

17 comments:

రాధిక said...

"చిన్న ఫోటో ఎంత వరకు నిక్షిప్తం చేయగలదు"వెయ్యిశాతం ఒప్పుకుంటాను.నాకిష్టమైన వాటిని నాకళ్ళతో చూస్తేనే ఆనందం.అలా ఫొటోలు తీసి పెట్టానూ అంటే అది మిగతావాళ్ళు చూడడానికే.సెలవులికి వెళ్ళి ఇన్ని జ్ఞాపకాలు మూటగట్టుకున్నారు కదా మరి పుట్టినప్పటినుండీ ఇరవైఏళ్ళూ అక్కడే వున్న నాలాంటి వాళ్ళం ఎంత అదృష్టవంతులమో కదా.[హమ్మయ్య....మీకన్నా నేను గొప్ప అని చెప్పేసాను,ఇప్పుడు ప్రశాంతం గా వుంది.లేకపోతే టపా చాలా బాగారాసాసారు అని మహా కుళ్ళొచ్చేసిందనుకోండి]

SD said...

@radhika

LOL. LOL. LOL. LOL. LOL.

SD said...

ఇవన్నీ ప్లస్ ముంజికాయల బండి (తినేసిన కాయల్తో చేసినది), బొంగరాలు, మధ్యాహ్నం పూట అందరూ వేసవిలో పడుకున్నప్పుడు దొడ్లో వచ్చిన కోతుల్ని చూట్టం, సాయంత్రం గోదావరి ఒడ్డుకి నడుచు కుంటూ పోవటం అన్నీ ఎప్పటికీ మర్చిపోకూడనివి కాదూ మరి?

పనస పళ్ళూ, పనస కాయ కూరా, పొద్దున్నే లేచి కచిక పెట్టుకుని పళ్ళు తోవుకోవడం, పాలేరు పాలు తీస్తూంటే దగ్గిరుండి చూట్టం మర్చిపోయారా? అప్పట్లో వచ్చే తెలుపు నలుపు ఫోటోలకి అంగుళం మందాన పౌడర్ రాస్కుని స్టూడియోలకి వెళ్ళి తీయించుకోవడం :-)

sivaprasad said...
This comment has been removed by the author.
కృష్ణప్రియ said...

రాధిక గారూ,..

నిజంగానే మీరు అదృష్టవంతులు.. సిటీ లైఫ్ లో కాంక్రీటు అడవులు,ట్రాఫిక్ జాములూ, మురిక్కాలవ పక్క పండించిన కూరగాయలూ, 2 వారాల క్రితం కూరగాయలూ,. ఏసీ ఆఫీసులూ, కుండీల్లో మొక్కలూ, డయట్ తో ఎండిన మొహాలూ,.. చూసి చూసి..

I envy you..

కృష్ణప్రియ/

కృష్ణప్రియ said...

డీజీ గారూ,

నిజమే.. బాగా గుర్తు చేసారు. తాటికాయల తోపుడు బండి, పనసపట్టు కూరలూ, పాలు తీసే ప్రయత్నాలూ, 'కచిక ' టూత్ పౌడరూ, జీడి మామిడి కాయల పులుసులూ, పాత కాలపు తీపి పదార్థాలూ, ..

ఈరోజుల్లో పిల్లలు, సోన్ పాపిడీలూ, పూతరేకుల్లాంటివి ఇళ్ళల్లో తయారు చేస్తారు అంటే నమ్మలేరు.


కృష్ణప్రియ/

కృష్ణప్రియ said...

@ శివప్రసాద్,

ధన్యవాదాలు. తప్పకుండా.. పిలవచ్చు..

నా పోస్ట్ నచ్చినందుకు చాలా చాలా సంతోషం..


కృష్ణప్రియ/

Madhu said...

Chaala bavundandi..mallee oka saari good old golden days rewind chesi choosinattuga undi..thank you...

Anonymous said...

చాలాబాగా రాసారండీ.

కృష్ణప్రియ said...

మధు, అభిజ్ఞ్య ,

ధన్యవాదాలు.


కృష్ణప్రియ/

SD said...

ఏదో మీరు తెలుగు బాగానే రాస్తారు అనుకున్నాను. ఇదేమిటండీ?

>> పనసపట్టు

పనస "పొట్టు." ఏమిటి పట్టు? కుస్తీ పట్టా? ఈ బస్తా కాస్త పట్టు భుజానికి ఎత్తుకుంటా ...

See this link....

http://ekalingam.blogspot.com/2010/06/blog-post_03.html

కృష్ణప్రియ said...

:-) సారీ. Comment in a hurry...
p(o)TTu Vs p(a)TTu

కృష్ణప్రియ/

భావన said...

నిజమే నండీ ఏ ఫొటో లు కూడా ఆ బాల్య స్మృతులతో పెనవేసుకున్న రేఖా చిత్రాలను తుడీచెయ్యలేదు. బాగున్నాయి కబుర్లు.

కొత్తావకాయ said...

'పిల్లల్లారా.. ఊ ఊఊఊ' మీరూ పాడేవారా? గాంధీ, నెహ్రూ కాదు కానీ రాజీవ్ గాంధీ గురించి నేనూ అలాగే అనుకొనే దాన్ని. హ హాహ్హా

Nostalgic post. loved it.

కృష్ణప్రియ said...

@ భావన,
మీ కామెంట్ ఇప్పుడే చూస్తున్నా :) థాంక్స్
@ కొత్తావకాయ,
:)మీరూ ఈ పాటే పాడేవారా? నైస్ నైస్.. అప్పట్లో ఇన్ని చాయిస్ లు లేవు కదా సినిమా పాటలు లేదా..రేడియో లో చిత్తరంజన్ గారి లాంటి వారి ప్రైవేట్ పాటలు..

కొత్తావకాయ said...

చాయిస్ లు లేక కాదు కానీ కొన్ని కొన్ని విషయాలు సర్వజనాకర్షకాలనుకుంటా..
పిల్లల్లారా.. లాంటి పాటలు, ఒకాట బీసీ, కాకెంగిలి, నెమలి కన్ను కి పిల్లలు పుట్టడం,
ఏ ప్రాంతానికి వెళ్ళండి, ఎవరిని అడగండి.. "మీకూ తెలుసా!! " అని అడిగితీరుతారు.
"పూవులేరి తేవే చెలి పోవలె కోవెలకు" గుర్తుందా? దూరదర్శన్ లో ద్వారం విజయలక్ష్మి పాడేవారు, దేవులపల్లి వారిదనుకుంటా! పూర్తి సాహిత్యం కానీ గుర్తుందా మీకు?

కృష్ణప్రియ said...

@ కొత్తావకాయ,
:) అవును. మా చెల్లెలి దగ్గర లిరిక్స్ ఉన్నాయి.. ఆ పాట వేదవతీ ప్రభాకర్ పాడారనుకుంటా.. చాలా చాలా మేలోడియస్ పాట.. అదొకటీ, 'అమ్మ దొంగా..నిన్ను చూడకుంటే నాకు బెంగా..'

తను ఇప్పటికీ ఎవరైనా పాట పాడు అంటే.. ఆ పాటే ఎత్తుకుంటుంది. మీకు కావాలంటే కనుక్కుని ఇక్కడో, మీ బ్లాగ్ లోనో ఉంచుతాను...

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;