Saturday, June 5, 2010

గేటెడ్ కమ్యూనిటీ కథలు - కొత్త బిచ్చగాడు పొద్దెరగడట..


ఈకాలపు భారత ఎగువ మధ్య తరగతి ప్రజలు గుంపులు గుంపులు గా ఏర్పాటు చేసుకునే త్రిశంకు స్వర్గానికి మరో పేరు 'గేటెడ్ కమ్యూనిటీ' ...

మేమూ, బెంగుళూరుకి రాగానే ఒక ఊరవతల కమ్యూనిటీలో మొత్తానికి సెటిలైపోయాం. వందిళ్ళకీ, 40 ఫీట్ అడుగుల వెడల్పు రహదారీ, రెండువైపులా పచ్చటి చెట్లూ, (బాటసారులకి సత్రాలూ, తాగునీటి చెఱువులూ.. లేకపోయినా..) స్విమ్మింగ్ పూలూ, బాట్మింటన్ కోర్టూ, జిమ్మూ, క్లబ్ హౌజూ, పిల్లల ఆటస్థలం, వృద్ధులకోసం పార్కూ, బెంచీలూ,పచ్చికా.. ఇంటి ముందు లానూ, కరంటు పోయినప్పుడు డీజిల్ తో నడిచే బ్యాకప్పూ, ' ఆహా, భూతల స్వర్గం అంటే ఇదే కదా!! ' అని మిడిసిపడ్డాం కొన్నాళ్ళు.

చేసిన అప్పు ఎక్కడో భయపెడుతున్నా.. ఇంటికొచ్చిన బంధుమిత్రుల ప్రశంసలకి ఉబ్బి తబ్బిబ్బయి,.. 'కొత్త బిచ్చగాడు పొద్దెరగని రీతిన ' ఉన్న ప్రతి సదుపాయాన్నీ మేమే ఉపయోగించుకున్నాం.

పొద్దున్నే అందరి ఇళ్ళ లాన్ అందచందాలు చూస్తూ నడకా, పదేళ్ళు డాక్టర్లు మొత్తుకున్నా వినని మావారు ఉదయం, సాయంత్రం జిమ్ము మొదలు పెట్టేసారు.

మా అత్తగారు (అంతకు మునుపు ఎన్ని ఆహ్వానాలొచ్చినా,..పెద్దగా ప్రతిస్పందించనివారు..) భజన బృందం లో మెంబరైపోయారు. కమ్యూనిటీ భజన హాల్లో, భక్తి పుస్తకాలు పట్టుకుని వెళ్ళటం మొదలు పెట్టారు. పాత సినిమాల్లో పండరీ బాయి లా, ఎండ మండుతున్నా.. పట్టు శాలువా కప్పుకుని.. వృద్ధుల పార్కులో కూర్చున్నారు కొన్నాళ్ళు.

పిల్లలు కళ్ళు తిరిగి వాంతొచ్చేదాకా ఉయ్యాలలూ, గట్రా.. ఆడటం.. చలి కాలం లో కూడా స్విమ్మింగ్ పూల్లో దిగటం.మా పెద్దది, ఎంత పోరినా చదవనిది.. ఒక్కసారి గా.. కాంప్లెక్స్ గ్రంథాలయం లో అందరూ చూసేట్టు గా.. పెద్ద పెద్ద పుస్తకాలు తెచ్చుకుని కొన్నాళ్ళు చదివింది.

నా బ్లాగు కి నేనేగా క్వీన్. అందుకని.. నాకు మాత్రం చాలా స్థితప్రజ్ఞత ఉన్నట్టు రాద్దామనుకున్నాను. కానీ.. కాస్తైనా నమ్మేట్టుండాలని చెప్పేస్తున్నాను. టేబుల్ టెన్నిస్ పెద్దగా రాకపోయినా ఆడేసాను 10 రోజులు. బాట్మింటన్ దగ్గర క్యూలు కట్టి మరీ ఆడాను. బోల్డు ఇంటిపని తో మగ్గిపోతున్నా, మరి లాను ఉపయోగించుకోవాలని, అక్కడ కుర్చీల్లో కూర్చుని తేనీటి సేవనం గావించను. డాబా మీద ' టెర్రస్ గార్డెనింగ్ ' చేసి ఖ్యాతి గాంచాలని కష్టపడి మట్టీ అవీ వేయించి డాబా మీద కూరగాయల మొక్కలు వేసాను.

మొత్తానికి కుటుంబమంతా ఎన్నెన్నో పోజుల్లో నిలబడి నానా రకాల పనులూ చేస్తున్నట్టు గా ఫొటోలు దిగి ముఖ పుస్తకం లో ఎక్కించి సంతృప్తి పడ్డాం.సరే, పదిహేను రోజులయ్యింది, నెమ్మదిగా.. నాకు పనులు పేరుకుపోతున్నాయి. మడతపెట్టుకోవాల్సిన బట్టలు, తెచ్చుకోవాల్సిన వస్తువులు,..ముందు గా లాన్లో టీ కట్. టీ గుక్కలు తాగుతూ, ఉదయం పరుగులెత్తటం,.. చల్లారిందని.. సగం తాగాక మళ్ళీ మైక్రో వేవ్ లో ఓ 20 సెకండ్లు వేడి చేసుకోవటం.. మళ్ళీ ఇంకో నాలుగు గుక్కలు,.. పిల్లలకి టిఫిన్లూ, మళ్ళీ 2 చల్లారిన చప్ప గుక్కలు మింగలేక సింకు లోకి...
తర్వాత కుండపోత వర్షానికి మా డాబా మీద మట్టి గోడల మీదుగా కారి చిరాకయిపోయింది. ఒక వారం బిజీ గా ఉండి శనివారం పైకెక్కి చూస్తే ఏముంది? మొక్కలు ఎండి మసైపోయాయి :-(

ఆఫీస్ కాల్స్ లో పడి టేబుల్ టెన్నిస్, బాట్మింటన్ రాకెట్లు ఎక్కడ పడేసానో వెతికి పట్టుకోవటం కన్నా.. బిన్ లాడెన్ ని వెతకటం తేలిక అనిపించింది. కాల గర్భం లో.. కాదు కాదు.. మా ఇంటి సామాన్ల సాగరం లో కలిసిపోయాయి.

ఇక మా అత్తగారికి, భజనలు బోరు కొట్టి మోకాళ్ళ నొప్పులు మొదలైపోయాయి. పార్కు లో కూడా ఎండాకలం కష్టమని 'పండరీ బాయి ' గెటప్ మార్చేసి 'అన్నపూర్ణమ్మ ' అవతారమెత్తి ఊపిరి పీల్చుకున్నారు.

కొత్త మోజు తీరగానే.. ఉదయపు నడకకి ఎలర్జీల పేరు చెప్పి, రాత్రి నడక కి ఆఫీస్ కాల్స్ సాకు తో ఆపేసారు.
ఇక మిగిలింది పిల్లలు. వాళ్ళు మాత్రం జలుబు,జ్వరం, పరీక్షలు,వర్షాలు, ఎండలు, ఉదయం, రాత్రి, దేశ,కాల,మాన పరిస్థుతులకి అతీతం గా ఆటలాడుతూనే ఉన్నారు.. మేం మాత్రం, మా కాంప్లెక్స్ లో వసతులని ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు మాత్రమే చూపించటానికి తీసుకొస్తూ ఉంటాం.

13 comments:

Sravya Vattikuti said...

భలే రాస్తారు మీరు :)

teresa said...

కళ్ళక్కట్టినట్టు వర్ణించేశారు! పండరీబాయి గెటప్‌ అదుర్స్ :)

మంచు.పల్లకీ said...

Exactly !!!

అవునూ మీ నేటివ్ .. ప గొ జిల్లా లోని నిడదవొలా ?

kvrn said...

bagundandi. taalimpu adiripoyindi.

Krishnapriya said...

ధన్యవాదాలు, నా టపా నచ్చినందుకు.. :-) పండరీబాయి ని సినిమాల్లో చూస్తే.. ఎప్పుడూ నాకు ఆశ్చర్యమే.. అసలు ఆవిడ ఆ పట్టు శాలువా లేకుండా ఊహకి కూడా అందరు.

@ మంచుపల్లకీ,

లేదండీ ఒకటి రెండు సార్లు, చిన్నతనం లో బంధువుల పెళ్ళికి వెళ్ళానేమో, కానీ నిడదవోలు, తణుకు ప్రాంతపు, దగ్గర స్నేహితులు ఉన్నారు నాకు.

GIREESH K. said...

Very well said. మా పరిస్థితి కూడా డిట్టోనే! మా వాడు మాత్రమే అన్ని సదుపాయాలనీ పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాడు. My morning walk is regularly irregular. మా ఆవిడ అప్పుడప్పుడూ జిమ్ముకెళ్తుంటుంది. నాకు ఈత రాదు, నేర్చుకోవాలని క్లాసులో చేరి, ఓ వారం రోజులపాటు వెళ్ళి, మనకు ఈత రాదు అని తేలిపోయాక, నడుం నొప్పిని సాకుగా చూపించి, నిలచిపొయ్యాను. స్విమ్మింగ్ క్లాసులకి కట్టిన Rs. 2500 గురించి మా ఆవిడ ఇప్పటికీ గొణుగుతూనే వుంటుంది. We never use the restaurant in the club. అయితే మా ఆవిడ ఊరెళ్ళినప్పుడు మాత్రం క్లబ్బులోని బార్ చక్కగా ఉపయోగపడుతుంది:)

కాకపోతే, మీరన్నట్లు, మా ఫ్రెండ్స్ సర్కిల్లో, బంధువుల్లో "వీళ్ళు బ్రిగేడ్ మిల్లెన్నియం లో ఉంటార" న్న పేరు మాత్ర ఉంది!

Krishnapriya said...

గిరీశ్ గారూ,

ధన్యవాదాలు. హిందీ లో ఒక సామెత ఉంది. 'హాథీ కే దాంత్ ఖానే కే ఔర్, దిఖానేకే ఔర్ '
(ఏనుగు తినటానికి వాడే పళ్ళు వేరు, చూపించటానికి వేరు) అని... అలాగ.. :-)

కృష్ణప్రియ/

స్ఫురిత said...

భలేగా రాసారండి...పండరీబాయి పట్టు శాలువా చదవగానే office లో వున్నా అని మర్చిపోయి ఫక్కున నవ్వేసాను

భావన said...

బలే రాసేరండీ, చదువుతున్నంత సేపు నవ్వుతూనే వున్నా. పండరీ బాయి పట్టు శాలువా... కి కి క్కి... :-)
మా ఇంట్లో నే అనుకున్నా ఈ భాగోతం అందరు ఇంతేనా ఐతే హమ్మయ్య కొద్దిలో కొద్ది త్రుప్తి. నేను సేమ్ ఫీలింగ్ కలిసొస్తుందని రెండు ప్రింటర్ కార్ట్రిడ్జ్ లు కొని ఆ పైన దానిని వెతకటం కంటే బిన్ లాడెన్ ను వెతికే గ్రూప్ లో చేరొచ్చు అని. అది ఒక్కటేనా మొత్త అన్ని సేమ్ ఫీలింగ్. సూపరండి బాబు.

Krishnapriya said...

స్ఫురిత, భావన,

ధన్యవాదాలు. నేను రాసింది కూడా ఎవరైనా నాలాంటి వాళ్ళు/ ఉంటారని, మేమొక్కళ్ళమే కాదనే నమ్మకం తో :-)

కృష్ణప్రియ/

మధురవాణి said...

ఎంత బాగా రాశారండీ! Too good! :) :)

Krishnapriya said...

@ మధురవాణి,
ధన్యవాదాలు! :-)

Anonymous said...

"చల్లారిందని.. సగం తాగాక మళ్ళీ మైక్రో వేవ్ లో ఓ 20 సెకండ్లు వేడి చేసుకోవటం.. " same here.
chala baga rasaru

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;