Sunday, June 20, 2010

బాసూ, బీరకాయ తొక్కల పచ్చడీ..

అనగా అనగా మాకో జర్మన్ బాసుండేవాడు.

ఆజానుబాహుడు, దాదాపు ఏడడుగుల పొడగరి. క్లియర్ గా జర్మన్ యాస భాషలో. పేరు లోథర్ మ్యూజ్. (మేం ముద్దుగా గా లోఫర్ మ్యావ్ జ్ అని పిలుచుకునే వాళ్ళం అనుకోండి).. ఓ యాభై యేళ్ళుండేవేమో..

ఆయన కి పన్నెండు మందిమి రిపోర్ట్ చేసేవాళ్ళం. ఇన్నేళ్ళ సాఫ్ట్ వేర్ ఉద్యోగం లో నాకెదురైన బాసులలో ఆయన లాంటి వాడు ఎక్కడా దొరకలేదు. చాలా మంచి బాస్! కానీ... అదేదో రవితేజ సినిమాలో చెప్పినట్టు,..హార్ట్ లో అనిపిస్తే.. నోటితో అనేసే రకం!

మామూలప్పుడు ఎంతో చక్కగా మా సమస్యలని తీరుస్తూ,.. లీడ్ చేసేవాడు కానీ.. ఆయన ఏదైనా తింటుంటే మాత్రం మనం ఏదైనా పనితో వెళ్తే అంతే సంగతులు...


ఒకసారి మా డైరెక్టర్ గారు (ఆవిడా యూరోపియనే..) పేద్ద గులాబీ ఉన్న బిగుతైన స్లీవ్ లెస్ టీ షర్ట్ వేసుకొచ్చింది. అందరూ అప్రయత్నం గా ఆ పూవు వైపు చూస్తూ దొరికిపోయారు. నేను.. గిల్టీ గా.. 'నైస్ షర్ట్!' అన్నాను. ఆవిడ ' స్పెయిన్ లో కొన్నాను.. ఇది డిజైనర్ షర్ట్! ఇట్ ఈజ్ వెరీ చీప్.. కెన్ యూ బిలీవ్ ఇట్? ఇత్ ఇస్ జస్ట్ 135 $ !!!!' అంది. నేను.. బాగుండదని ' ఓహ్ వావ్ ' అంది. ఈయన.. '100 $ పెడితే కనీసం స్లీవ్స్ కూడా ఇవ్వలేదు చీప్ గా ఉంది షర్ట్ నిజమే' అన్నాడు.. ఆవిడ అగ్గి మీద గుగ్గిలం అయ్యింది.


ఆయన జాయిన్ అయ్యేటప్పటికి నాకు మూడో నెల. అసలే వేవిళ్ళు. పొద్దున్నే క్యూబ్ దగ్గరకొచ్చి.. 'క్రిష్నా.. ఈరోజు నిప్పుల మీద కాల్చిన పంది మాంసం స్ట్రిప్పులు తిన్నాను.. ఫలానా సాస్ తో.. కొత్త బ్రేక్ ఫాస్ట్ జాయింట్ లో.. కాల్చినప్పుడు దాంట్లోని కొవ్వుతో నే.. వేపబడి.. అబ్బా.. చెప్తుంటే నాకు లాలాజలం కారిపోతోంది ఇప్పుడే.. గాడ్! ' అని ఒకరోజు.. ఇంకోరోజు గొడ్డు మంసం తో చేసిన వంటకం గురించీ.. చెప్పేవాడు..' వెజెటేరియన్ అయిన నాకు, ఆ పరిస్థితి లో కష్టమయ్యేది. ప్రతి రోజూ ఇదే వరస అవటం తో.. ఇంక లాభం లేదని చెప్పేసాను ఆయనకి. 'టాపిక్ మార్చండి ప్లీజ్ ' అని.

ప్రాజెక్ట్ ప్లాన్ వేస్తుంటే.. మరి నా ప్రెగ్నెన్సీ విషయం చెప్పకపోతే బాగుండదు అని వెళ్ళి చెప్పగానే.. రెండు చేతులతో తల పట్టుకుని 'ఓహ్ నో నేనేం చేయను ఇప్పుడు ' అనగానే నాకు చిర్రెత్తింది. 'హలో.. నాకు పెళ్ళయింది! ఒకవేళ కాకపోయినా నాకు నువ్వు తండ్రివీ కాదు.. అంత బాధ పడకు ' అని విసురుగా బయటకొచ్చేసాను.

ఆయన తేరుకుని.. సారీలు చెప్పి, 'అయినా కోపం లో కూడా జోకులు భలే వేస్తావ్ ' అని నవ్వేశాడు. ఆయనకి మంచి తిండి పిచ్చి. ఒక్కోసారి మర్చిపోయేవాడు క్వార్టర్లు ఉంచుకోవటం. 10 దాటాక వచ్చి 'ఇవ్వాళ్ళ చిల్లర లేదు.. ఒక డాలరివ్వవా.. ఒక టోస్ట్ కొనుక్కుంటా' అనేవాడు.

ఆయన రోజూవారీ బాధ పడలేక నా డెస్క్ డ్రా లో బోల్డు చిల్లర పడేసేదాన్ని. ఆయన వచ్చినప్పుడల్లా నాకు పెద్ద లెక్క చెప్పేవాడు. నేను పట్టించుకోకుండా తలాడించేదాన్ని. ఒక ఇరవయ్యో, యాభయ్యో అయ్యాక నోట్లు చేతికిచ్చి.. తలకాయ మీద చేయి పెట్టి బ్లెస్ యూ.. అనేవాడు.. 'అన్నదాతా సుఖీ భవ ' అన్నట్టుగా.

మొన్నీ మధ్య అమితాబ్ సినిమా భూత్ నాథ్ చూశాను. హెడ్ మాస్టర్ పిల్లల టిఫిన్ బాక్సులు తినేస్తూ ఉంటాడు. అలాగ ఈయన కూడా లంచ్ టైంకి వచ్చి 'ఏం తెచ్చావు? ' అని అందర్నీ అడిగి అందరి బాక్సులూ కాస్త కాస్త తినేసేవాడు.

ఒకసారి బీరకాయల తొక్కల పచ్చడి చేశాను. చాలా ఉందని ఒక బాక్స్ లో తెస్తే.. ఆయన టేస్ట్ చేసి.. 'ఇది నాకొదిలేయ్.. అని క్రాకర్ల మీద రాసుకుని హాయిగా తినేశాడు. ఎలా చేస్తారో అడిగి మరీ రాసుకుని ఇండియన్ స్టోర్స్ లో పోపు సామాన్లు కొనుక్కుని చేశాడట.
అడిగిన వాళ్ళకీ అడగని వాళ్ళకీ.. బీరకాయల తొక్కల పచ్చడి ఎంత బాగుంటుందో.. సాండ్ విచ్ లో కూడా ఎలా వాడచ్చో చెప్పేవాడు.. ఇక మా వాళ్ళంతా.. 'అబ్బో చాలా సేవ్ చేస్తున్నట్టున్నారు.. తొక్కల్ని కూడా వదలకుండా' అని నన్ను తెగ ఏడిపించారు ఆరోజుల్లో


ఒకసారి చింతకాయ పచ్చడి జాం బాటిల్ లో ఇచ్చేదాకా ఊరుకోలేదు.


ఆయనకి నలుగురు పిల్లలు. మామగారు జెర్మనీ లో పెద్ద పారిశ్రామిక వేత్తట! వాళ్ళావిడ కి వంట అంటే ఎలర్జీ.

ఆవిడ ఎప్పుడూ ఇంట్లో బట్లర్లూ, కుక్కులతో పెరగడంతో, బ్రెడ్ టోస్ట్ చేయాలన్నా విసుగేట. ఈయనేమో మాంచి భోజన ప్రియుడు. మా మామగారు మా పెళ్ళిరోజులకి బీ ఎం డబల్యూలూ, ఇళ్ళూ అలా గిఫ్టులిస్తుంటే.. ఊర్కున్నా కానీ.. ఇలా వంట చేయని భార్య కి ఏనాడో విడాకులిచ్చేసేవాడ్ని. నా మొదటి భార్యకి విడాకులివ్వటానికి రీజనదే అనేవాడు. వాళ్ళ పెద్దమ్మాయికి ఆయనే స్వయం గా అన్ని వంటలూ నేర్పించాడు. (బీరకాయ తొక్కల పచ్చడి నేర్పించాడో లేదో అడగాలి ఈసారి..)


ఒకసారి పెద్ద కస్టమర్ ప్రాబ్లం వచ్చింది. నాకప్పటికే ఆరోనెల. శని ఆదివారాలంతా ఆఫీసులోనే పడి చేసి చేసి.. సోమవారం.. వేరే టీం సహాయం కావాలి అదీ అని.. నేను 10 నిమిషాలపాటూ ఏకధాటిగా వివరించాను. ఎందుకో అనుమానం వచ్చి.. గమనిస్తే.. ఆయన హాయిగా సూప్ జుర్రుకుంటూ,.. టీ వీ లో వంటల ప్రోగ్రాం లో ఆంకర్ల లాగా 'హ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్' అనుకుంటూ. కోపం వచ్చి విస విసా నడుస్తూ వెళ్ళిపోయాను క్యూబ్ కి... వెనక 'క్రిష్నా.. సారీ ' అంటూ ఆయన!

ఒకసారి ఏదో మీటింగ్ లో కుమార్ అని ఒకతను.. కాఫీ తాగుతూ మధ్యలో బోర్డ్ దగ్గరకెళ్ళి ఏదో గీస్తుంటే.. ఈయన పొరపాట్న.. కుమార్ కాఫీ తాగేసింది చాలక.. కుమార్ 'ఎనీ క్వెష్చన్స్?' అని అడిగితే.. ఈయన..'మాన్.. నీ కాఫీ లో ఇంత చక్కెరా? అది కాఫీ యా పాలా?' అని నిలదీశాడు.

ఆయన ధోరణి ఆయనదే లా ఉండేవాడు. ఒకసారి మాతో పని చేసే అబ్బాయి ఏదో టెక్నికల్ విషయం వివరిస్తుంటే.. చటుక్కున ఆయన నేల మీద కూర్చున్నాడు.

ఏంటి ఇది! అని కంగారు పడితే.. 'మాన్.. ఇన్నేళ్ళొచ్చాయి.. షూ లేసులేసుకోవటం రాదు కదా ఇంక కోడేం రాస్తారయ్యా ' అన్నాడు. అసలు లేసులు కట్టుకోవటానికీ, కోడ్ రాయటానికీ సంబధం ఏంటో అర్థం కాక.. తను చెప్పింది ఒక్క ముక్క కూడా వినలేదని అర్థమయింది అతనికి.

ఒకసారి టీం కోసం స్వయం గా వండి స్పాగెటీ, మీట్ బాల్స్ తెచ్చాడు..ప్రాబ్లెమల్లా.. అందరూ దేశీలే.. ఎవ్వరం తినమాయె .. చాలా ఆక్వర్డ్ గా అందరికీ అనిపించింది. కానీ ఆయన ఏమీ అనుకున్నట్టుగా అనిపించలేదు.. ఆ తర్వాత కూడా.. వంకాయ పులుసులూ, పాలకూర పప్పూ లాంటివి తింటూనే ఉన్నాడు. మాకోసం స్వీట్లూ, చోక్లేట్ల లాంటివి మాత్రమే తేవడం అలవాటు చేసుకున్నాడు.

మెటర్నిటీ లీవ్ తర్వాత మళ్ళీ జాయిన్ అయిన రోజున.. 'క్రిష్నా! సర్ ప్రైజ్ ఫొర్ యూ ' అని వీకెండ్ లో చేసిన తొక్కల పచ్చడి డబ్బా చేతిలో పెట్టాడు.. కళ్ళు చెమర్చాయి.. నవ్వు కూడా వచ్చింది.

అమెరికా వదిలి వచ్చేసాక కూడా... నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పినప్పుడల్లా కాసేపు వంటల గురించి మాట్లాడతాడాయన.

బీరకాయ తొక్కలు పారేసినా, పచ్చడి చేసినా.. ఆయన గుర్తు రాక మానరు నాకు :-)

10 comments:

మరిది మార్తాండ said...

బీరకాయి కూరలో చాలామంది ధనియాలు వేసుకొని ఆహరం వండుకుంటారు

మనం ధనియాల గింజలు (coriander seeds)ని సాధారణంగా బీరకాయల వంటలలో వాడుతాం. ధనియాల మొక్క భాగాల నుంచి ఔషధాలు కూడా తయారు చేస్తారు. ధనియాల మొక్కలు ఎక్కువగా దక్షిణ యూరోప్, ఉత్తర ఆఫ్రికా, నైరుతి ఆసియా దేశాలలో పెరుగుతాయి. ధనియాలలో antioxidant లక్షణం ఉండడం వల్ల వీటిని ఆహారం పాడవ్వకుండా ఉండేందుకు వాడుతారు. ధనియాల ఆకుల నుంచి తీసిన రసాయనాలతో బాక్టీరియాని చంపే మందులు తయారు చేస్తారు. ధనియాలని డయాబెటిస్ చికిత్సకి కూడా వాడుతారు. ధనియాలు డయాబెటిస్ పేషెంట్లలో ఇన్సులిన్ విడుదల చేస్తాయి. ధనియాలలో కొలెస్ట్రాల్ ని తగ్గించే లక్షణం కూడా ఉంది. ధనియాలని పసుపుతో కలిపి చర్మ సౌందర్య సాధనంగా కూడా వాడొచ్చు. ఈ ఔషధాల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ధనియాల వల్ల ఎలర్జీ కూడా వస్తుంది.

Sravya Vattikuti said...

ఎంత మంచి బాసో :)

venuram said...

bavundanDi.. nice post..

భావన said...

చదువుతున్నంత సేపు నవ్వుతూనే వున్నా మీ పాట్లు తలచుకుని ఆయన తో. హ హ హ. అవును కొందరు చాలా ఎక్కువ ఆలోచిస్తారు తిండి గురించి. మా డైరక్టర్ మాతో లంచ్ టేబుల్ దగ్గర కూర్చుని తిని, ఆ పైన మీటింగ్ లలో అంటాడు "వీళ్ళు ప్రతి రోజు లంచ్ టేబుల్ దగ్గర వంటలు అవి చేసే విధానం గురించే ఎప్పుడూనూ మాట్లాడుకుంటారు అమ్మో ఎంత వోపికో" అని మెచ్చుకుంటూన్నాడో వెక్కిరిస్తున్నాడో అర్ధం కాదు మరి సీరియస్ గా మొహం పెట్టీ అంటాడు. ;-)

Krishnapriya said...

శ్రావ్య, వేణురాం, భావన,

ధన్యవాదాలు!

సాధారణంగా అమెరికన్లు..మన లంచులకి 'హ్మ్మ్మ్ స్మెల్స్ గూడ్, లుక్స్ యమ్మీ ' అని తలాడిస్తూ.. రెస్పాన్సులిస్తారు కానీ.. అడిగినా టేస్ట్ కూడా చేయరు.

ఈయన మాత్రం.. చక్కగా ఎంజాయ్ చేసేవారు. ఇంకో రెండేళ్ళుంటే.. జాడీలు కొని ఆవకాయలు పెట్టినా పెట్టేవాడేమో :-)

మార్తాండ గారూ,

:-) ధనియాల గురించి చాలా మంచి విషయాలు చెప్పారు!

కృతజ్ఞతలతో,
కృష్ణప్రియ/

హరే కృష్ణ . said...

హ హ్హ
సూపర్

Krishnapriya said...

హరే కృష్ణ,

:-)

తుంటరి said...

this is good one:
ప్రాజెక్ట్ ప్లాన్ వేస్తుంటే.. మరి నా ప్రెగ్నెన్సీ విషయం చెప్పకపోతే బాగుండదు అని వెళ్ళి చెప్పగానే.. రెండు చేతులతో తల పట్టుకుని 'ఓహ్ నో నేనేం చేయను ఇప్పుడు ' అనగానే నాకు చిర్రెత్తింది. 'హలో.. నాకు పెళ్ళయింది! ఒకవేళ కాకపోయినా నాకు నువ్వు తండ్రివీ కాదు.. అంత బాధ పడకు ' అని విసురుగా బయటకొచ్చేసాను.

కొత్త పాళీ said...

fantastic.
భారతీయ వంటల్నే కాదు, అసలు తినదగినదాన్నేదయినా ఇష్టపడే అభినవ భీమ బకాసుర కుంభకర్ణులు నాకూ పరిచయమే అమెరికాలో. నేనూ కొంచెం అదేటైపులేండి :)
మీరు రాసిన తీరు ఆయా దృశ్యాల్లో లూథర్‌ని కళ్ళముందు నిలిపారు!

Krishnapriya said...

కొత్త పాళీ గారు,

ధన్యవాదాలు..

తుంటరి గారూ, మీకు కూడా..

కృష్ణప్రియ/

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;