Tuesday, June 22, 2010

సమీర్ - ఒక కాశ్మీర్ నిర్వాసితుడి కథ..

'డోగ్రాలంటే.. మీరు కశ్మీరీ వాళ్ళా? లేక పంజాబీలా? ' అని అడిగాను.. ఆ అబ్బాయిని. ఒక్కసారి తీక్షణంగా నావైపు చూసి.. 'నేను భారతీయుడ్ని!' అన్నాడు. సిగ్గనిపించింది. ఇదేంటి ఈ కుర్రాడితో చెప్పించుకున్నాను.. అయినా నా ప్రశ్న లో అంత తప్పేముంది? కొత్త గ్రూప్ లో చేరిన మొదటి రోజే.. ఇలా పాఠం చెప్పించుకున్నాను. అనుకుని ఒక మెంటల్ నోట్ చేసుకున్నాను, ఇతని దగ్గర ఎక్కువ తక్కువ వాగకూడదని. అయినా సినిమాల్లో, క్లాస్ రూం లో చెప్పినట్టు.. 'నేను మొదటగా భారతీయుడ్ని ట హహ్ ' అనుకున్నాను.

22 యేళ్ళుంటాయి అతనికి. అదే సమీర్ డోగ్రా ట పేరు. తెల్లగా.. గడ్డం తో.. వత్తయిన జుట్టు, నుదుటన బూడిద, పొడుగ్గా, పల్చగా.. కళ్ళజోడూ..

నా పక్క క్యూబ్ లో నే ఉండటం తో.. రోజూ.. అతని క్యూబ్ మీదుగానే వెళ్ళవలసి వచ్చేది. మనిషెంత మూడీ అంటే.. ఒకరోజు.. 'కృష్ణాజీ.. ' అని నోరారా పిలిచి .. బ్రేక్ రూం లో చాయ్ తాగే వరకూ వదిలిపెట్టేవాడు కాదు. ఒక్కోరోజు అసలు నేనెవరో తెలియనట్టు ప్రవర్తించేవాడు.

నేను అందర్నీ.. టీజ్ చేసేదాన్ని ఏదో టాపిక్ మీద.. మధ్యాహ్నం భోజనం వేళ. అతను చాలా అల్లరి చేస్తూ అందరి మీద జోకులేస్తూ.. నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. కానీ..ఒక్కసారే.. మూడ్ ఆఫ్ అయిపోయేవాడు. నాకు చిత్రం గా ఉండేది.

ఒకసారి మాల్ లో మా కుటుంబం కూర్చుని ఐస్క్రీం తింటుంటే.. కనిపించాడు డోగ్రా, నలుగురైదుగురు స్నేహితులతో. వాళ్ళంతా కూడా అదే తెలుపు తో.. గడ్డాలతో కనిపించారు. బాగా మాట్లాడారు. పిల్లలని పలకరించారు.

మర్నాడు లంచ్ టైం లో సరదాగా అబ్బాయిలంతా సెలవ రోజుల్లో మాల్స్ కెళ్తారని నాకు తెలియదు.. అంటూ ఏదో టీజ్ చేయబోతే.. యమ సీరియస్ గా లుక్కిచ్చాడు. దెబ్బకి మళ్ళీ అలాంటి ప్రయత్నాలెప్పుడూ చేయలేదు.

రాను రానూ, రోజూ అతని పద్ధతి గమనించటం అలవాటైపోయింది. అన్ని గుళ్ళూ తిరిగే వాడు. క్యూబ్ లోంచి ఓంకారం, లేక గాయత్రీ మంత్రం వినబడేది ఎప్పుడూ..మంద్రం గా.

ఫన్ మెయిల్ ఎలియాస్ మొదలు పెట్టాడు. తర్వాత నన్ను ఓనర్ ని చేసి.. పూర్తిగా తప్పుకున్నాడు.

ఒకసారి గ్రూప్ మాగజీన్ ఐడియా ఇచ్చి అంతా ఒంటి చేతిమీద నడిపించాడు. రెండు ఇష్యూలు రాగానే.. అసలు పత్రిక చదవటం కూడా మానేశాడు.

ఒకసారి లంచ్ లు ఎరేంజ్ చేసేవాడు.. అందర్నీ..లాప్ టాప్ లు మూసేసి చేతులు పట్టుకుని లాగి మరీ తీసుకెళ్ళేవాడు.. ఒక్కోసారి గన్ పాయింట్ మీద కూడా వచ్చేవాడు కాడు.

సెలవ మీద జమ్మూ-కాశ్మీర్ కెళ్ళాడు. అక్కడ అమర్ నాథ్ యాత్రీకులని వెళ్ళనీకుండా ఆపి, అప్పట్లో గొడవలయ్యాయి. (2 యేళ్ళ క్రితం) తన ఇంటి బయట మనుషులని చంపడం అవీ జరిగాయిట కూడా. అతను బాగా చలించి.. కాశ్మీరీ పండితుల మీద జరిగిన ఆగడాలు, హిందువులని అమర్ నాథ్ యాత్రలకి వెళ్ళనీయక పోవటం, లాంటివీ, అసలు కాశ్మీర్ సమస్య, పాకిస్తానీ టెర్రరిస్టులు ఎలా కాశ్మీరాన్ని కబళించి వేసారో.. గ్రూప్ కి ఈమెయిల్ రూపం లొ పంపుతూ ఉండేవాడు.

కంపెనీ యాజమాన్యం నుండి వార్నింగ్ వచ్చాక.. ' మన వ్యథ ని అర్థం చేసుకోలేని కంపెనీ కి పని చేస్తే ఏమి? లేకపోతే ఏమి ?' అని బాధ పడ్డాడు. అతన్ని మేము.. ఎన్నో విధాలు గా నచ్చజెప్పాక.. ఇలాంటి ఈ మెయిళ్ళు జీ మెయిల్ గ్రూప్ తయారు చేసి పంపసాగాడు.

అతని బాక్ గ్రౌండ్ తెలిసాక.. అతని పట్ల మాకు సానుభూతి పెరిగి అందరం అతనికి స్నేహితులమైపోయాం. అతని కుటుంబానికి కాశ్మీర్ లో వర్తకం, వ్యవసాయం ఉన్నాయి. వాళ్ళ పెద్దనాన్న కుటుంబం మొత్తం ఊచకోత కోయబడ్డాక, ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని జమ్మూ కి చేరుకుని కొత్త జీవితం మొదలు పెట్టారు అతని తల్లి దండ్రులు. ఇతని చిన్నతనం లో జరిగిన ఈ సంఘటన వల్ల అతను చాలా ఎఫెక్ట్ అయ్యాడు. మన ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి వీరి కుటుంబాన్ని నిలిపింది. ఆర్ ఈ సీ లో ఇంజనీరింగ్ చేసి ఇలా మా కంపెనీ లో చేరాడు.

కాశ్మీర్ ని పాకిస్తాన్ కి ఇచ్చి పడేస్తే సగం శని వదులుతుందనేవాడు. ముస్లిం ల పట్ల అతనికి చాలా వ్యతిరేక భావాలుండేవి. చాలా సార్లు నచ్చ చెప్పేవాళ్ళం.. అలా వద్దని. కానీ ఫలితం శూన్యమనే చెప్పాలి. తాజ్ ఎటాక్ అప్పుడూ, జయ్ పూర్ బ్లాస్టులప్పుడూ, చాలా డిప్రెస్ అయి ప్రభుత్వానికి, ముస్లిం లకీ, పాకిస్తానీయులకీ వ్యతిరేకం గా మాట్లాడేవాడు.

ఒకసారి ఒకబ్బాయి.. ముజఫ్ఫరాబాద్ బీహార్ లో ఉందనుకున్నాడు. ఇతను ఉగ్ర రూపం దాల్చి.. 'అదేంటి ? ఆ మాత్రం తెలియదా? పీ ఓ కే లో ఉంది. అక్కడ జనాలు అంతమంది చస్తుంటే.. మీకు కనీసం ఎక్కడుందో ఐడియా కూడా లేదా ? అని హుంకరించాడు. నేను కలగచేసుకుని.. 'అతనికి తెలియదు.. ఓ కే.. నువ్వు చెప్పు కర్ణాటక సీ ఎం ఎవరో చెప్పు మొదలు..' అంటే చెప్పలేకపోయాడు. మూడేళ్ళపాటు ఉంటున్నావు బెంగళూర్లో. నీకామాత్రం తెలియదు. ..? ' అంటే.. నవ్వేసి.. 'యూ గాట్ మీ ఆన్ దట్ ' అని వెళ్ళిపోయాడు.

కోడింగ్ లో అతను దిట్ట. యాజమాన్యానికి నచ్చిన ఇంజనీర్. సంక్రాంతికి దాదాపు మా గ్రూప్ లో అందరూ సెలవ మీద వెళ్ళారని.. రెండేళ్ళ క్రితం పండుగ భోజనానికి ఇంటికి పిలిస్తే.. అరిటాకు లో ఆనందం గా భోజనం చేసి వెళ్ళాడు. మా పిల్లలతో కలిసి ఆడుతున్న అతన్ని చూస్తే.. చాలా ఆనందం గా అనిపించింది.

హైదరాబాద్ కెళ్ళి వస్తే.. కరాచీ బిస్కట్లు తెస్తే.. 'వాళ్ళు చేసిన బిస్కట్లు తినను.. ఏమీ అనుకోవద్దు క్రిష్నాజీ ' అనేశాడు.

ఇటీవల సానియా పెళ్ళయినప్పుడు మా గ్రూప్ వాళ్ళు 'మీ హైదరాబాదీ అమ్మాయి పెళ్ళి అయింది. నువ్వు కనీసం స్వీట్లైనా తేవా? ' అని పీడించి నా చేత బలవంతం గా కేక్ తెప్పించారు. డోగ్రా 'కంగ్రాట్స్.. ఈవిడ దుబాయ్ కెళ్ళి అక్కడ పిల్లల్ని కంటే సరిపోతుంది.. కనీసం భారతదేశం లో ఒక డజన్ మంది తగ్గుతారు వాళ్ళు ' అన్నాడు. అక్కడ అబ్దుల్ ఉన్నాడు. అతనేమనుకుంటాడో అని అందరం బాధ/భయపడి చూస్తే.. ' డోగ్రా సంగతి తెలిసిందే గా ' అన్నట్టు చిరునవ్వు తో ఉండి పోయాడు అతను. తర్వాత మా బాస్ ఇచ్చాడు లెండి వార్నింగ్.

ఇంటి కెళ్ళి వచ్చాడు. కాఫీ బ్రేక్ లో చెప్పాడు.. వాళ్ళ భూములూ అవీ చూసి వచ్చాడట, కాశ్మీర్ కెళ్ళి, తల్లి దండ్రులకి తెలియకుండా. ' రక్తం ఉడుకుతుంది నాకు ఏదో ఒకటి చేస్తా ' అన్నాడు. అందరం మళ్ళీ నీతి బోధలు చేశాం. విన్నాడో లేదో తెలియదు.

ఈ మధ్య నేనూ బిజీ గా ఉండి పట్టించుకోలేదు. 2 నెలల నుండీ, అందరి తోనూ మాట్లాడటం తగ్గించుకున్నాడు. ఒక్కోసారి అలా జరగటం పరిపాటే కదా.. అని నేనూ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.


ఒక నెల రోజులనుండీ రావట్లేదు పని లోకి. బాస్ నడిగితే ..ఏదో పర్సనల్ ప్రాబ్లమనీ.. సెలవ మీద జమ్మూ కెళ్ళాడని చెప్పాడు. మొన్ననేగా వచ్చాడు.. మళ్ళీ ఏమయ్యిందో అనుకుని నా పని లో పడ్డాను.

ఈరోజు కాస్త జలుబు గా ఉందని ఇంట్లో ఉండిపోయాను సెలవు పెట్టి. సాయంత్రం.. నా జీ మెయిల్ చూడక చాలా రోజులయ్యిందని చూస్తే.. డోగ్రా నుండి గుడ్ బై మెయిల్ నెల క్రితం ది. కొద్ది మంది కే పంపాడు.

ఇదేంటని షాక్ దిని ఫోన్ చేస్తే తెలిసిన విషయాలు చాలా కలవర పరచాయి.

నెల క్రితం 2 రోజులు సెలవ పెట్టాడట. రూం మేట్ కూడా మా గ్రూప్ లోనే చేస్తాడు. అతను సాయంత్రం ఇంటికెళ్తే.. లేడు.. వస్తాడులే అని చూస్తే.. డోగ్రా 2 రోజులు రాలేదు. సెల్ ఫోన్ రూం లోనే వదిలేసాడు. అతని తల్లిదండ్రులకీ తెలియదు. దాంతో కంగారు పడి పోలీస్ రిపోర్ట్ ఇస్తే.. 10 రోజుల తర్వాత తల్లి దండ్రులు ఫోన్ చేసి చెప్పారుట. ఇంటికి ఫోన్ చేస్తున్నాడు కానీ.. ఒక నంబర్ నుండి కాదు. ఎక్కడ్నించి చేస్తున్నాడో చెప్పడు. బాసు మాత్రం ఇంకా ఏదో పర్సనల్ ఎమర్జెన్సీ అనే అనుకుంటున్నాడట.

విషయం తెలిసాక, బాధో, కోపమో,ఆక్రోశమో, బెంగో .. ఏదో తెలియని భావం తో మెదడు మొద్దు బారిపోయింది. ఎక్కడున్నా, ప్రశాంతత అతనికి చేకూరాలని, మంచి దారిలోనే పయనిస్తున్నాడని ఆశిస్తూ...

కృష్ణప్రియ/

23 comments:

సాంబశివుడు said...

నేను డిల్లి లో పని చెస్తున్నపూడు నాకు కొంతమంది కాశ్మీరి వారి తో పరి చయం ఉండేది. వారి కష్టాలు వింట్టున్నపుడు నోట మాట రాదు. అంతా పోగోట్టుకొని చిన్న ఇళ్ళలో ఉంట్టు అపూడప్పుడు మా కాలనీ లో చందాలడుగు తూ ఉండెవారు. మనుషులు చూటటానికి రోజా అరవింద్ స్వామి లా చాలా అందం గా ఉండేవారు కాని ఎమి లాభం వారంత దురదృష్ట వంతులు ఎవ్వరూ ఉండరు ఎందుకంటె వారిని స్వదేశం లో ఉండె హిందువులు కూడా సరి గా అర్థం చేసు కోలేదనే చెప్పాలి. ఎదో మొక్కుబడిగా ప్రభుత్వ సహాయం చేస్తుంది. అన్ని రాజకీయా పార్టిల మైనారిటీ అపీస్మెంట్ వారిని ఉక్కిరిబిక్కిరి చేసి మేము పడుతున్న కష్టాలను చూసి దాని నుంచి మీరు ఎమీ నేర్చుకోరా? అని ఒకతను అన్నాడు. కాని మనం కాశ్మీర్ సమస్యని ఎప్పుడొ ప్రాధాన్యత నుంచి తొలగించి ఎప్పుడు అక్కడ అంతే, బి.జె.పి. వాళ్ళ కింక ఎమీ పని లేదు అక్కడా హిందూ మత రాజకీయాలు చేస్తున్నారని ఒక్క మాట అని ఊరుకుంట్టున్నాం. వారు కుటుంబం తో ఉనంట్టున్నా అనాధలే. ఎప్పుడు తల్లిని చిన్న వయసులో పోగొట్టు కున్న వారిలా దిగులుగా కనిపిస్తారు. వారిని చుస్తే పుట్టిన ఊరిమీద మనిషికి ఇంత ప్రేమ ఉంట్టుందా ? అని అనిపిస్తుంది. మనం ఎన్ని ఊర్లు తిరిగినా, ఎన్నో సంవత్సరాలు బయట ఉన్నా మన ఊరికి ఎప్పుడనుకుంటె అప్పుడు పోగలం అనే భావన మనలో నిరాశను కలుగ జేయదు. కాని వారు ఇంకేన్నటికి వారి స్వస్థలం చూడమన్న భావన క్షణ క్షణం బాధిస్తునంట్టుంది.

Sravya Vattikuti said...

అయ్యో !

Krishnapriya said...

సాంబశివుడు గారు,

మీరు చాలా బాగా సమరైజ్ చేసారు. నేను పదిహేను పారాల్లో వర్ణించిన దాన్ని నాలుగు ముక్కల్లో చెప్పారు!

quoting you.. [వారు కుటుంబం తో ఉనంట్టున్నా అనాధలే. ఎప్పుడు తల్లిని చిన్న వయసులో పోగొట్టు కున్న వారిలా దిగులుగా కనిపిస్తారు. వారిని చుస్తే పుట్టిన ఊరిమీద మనిషికి ఇంత ప్రేమ ఉంట్టుందా ? అని అనిపిస్తుంది.]

చాలా చాలా నిజం ఇది.


శ్రావ్య గారూ,

నిన్నటి హృదయ భారం, ఉదయం లేస్తూనే మీ ఇద్దరి కామెంట్లూ చూస్తూనే కాస్త తగ్గినట్టనిపించింది!

కృతజ్ఞతలతో,
కృష్ణప్రియ/

శిరీష said...

manasu ki tagile debbalu ....hope ur frnd is doing good..

mee narration chala baguntundhi andi...

సాంబశివుడు said...

చిన్నపిల్లలు ఆడుకుంట్టు భయం/ఆపద వస్తె తల్లి దగ్గరికి పరిగీతి చట్టుకున్న పట్టుకుంటారు. ఆమె వెనకాలా దాకుని మెల్ల తొంగి చూస్తారు. వారిని భయ పెట్టిన వారు ఉన్నారా పోయారా అని తెలుసు కోవటానికి. అలాగే పెద్ద ఐన తరువాత మనుషుల తల్లి స్థాన్నాన్ని మనం పెరిగిన ప్రాంతం, ఆ ప్రాంతం లో ఉన్న భాష, సంస్కృతి ఆక్రమిస్తాయి. కాశ్మీరీలు ఇప్పుడు అవి పోగోట్టుకొని సంస్కృతి పరంగా దగ్గరా ఉన్న మన దేశం లోకి వస్తే అక్కడ వారిని భపెట్టిన వారిని ఇక్కడ ఉన్న మనం నెత్తినేకించు కోవటమె కాక వారి గురించి నీకు తెలియదు వ్యతిరేకం గా మాట్లడవద్దు చాలా మంచి వారు అని చెప్పటం వారిని చాల నిరాశకు గురిచేస్తుంది. కారణం అక్కడ మేజారీటి వారి ఐడియాలజి వారిని ఎన్ని బాధలకు గురిచేసిందో పడిన వారికి తెలుస్తుంది. నాకు అభిప్రాయలు చెప్పిన వారు వ్యక్తిగతం గా అవతలి వర్గం వారు వ్యక్తులుగా మనతో పోలిస్తె మంచి వారు కాని వారు గుమిగూడారంటె వారి సైకాలజిని చెప్పలేము అనేవారు.
---------------------------------------------------------------------
మ్మీకు తెలుసో లేదొ మంచి మనుషులు అని అనుకునేవారు వారి నెత్తి మీదకు వస్తె ఎలా మారతారు. స్వాతంత్రం వచ్చిన కొత్తలలో నెహ్రు గారు సెక్యులర్ భాష మాట్లాడుతుండేవారు. ఒకరోజు ఆయన పాత ఢిలి కి వేళ్ళాడు కాందిశికులను పరామర్శించటానికి . అక్కడ ఒకతను ఇందిరాగాంధిని చెయ్యి పట్టుకొని అభ్యంతరకరమైన పద్దతీ లో లాగాడు. నేహ్రూ గారు అతని చెంప చెళ్ళు మనిపించారు. అతను వేంటనె చూడు మహానుభావా నీ కూతురి చెయ్యి పట్టుకొని నేను లాగితె ఇంత ఇది గా రీయాక్ట్ అయినావు అదే వారు నామ్మని, చేళ్ళెలిని అన్ని చేసి ప్రాణాలు తీసారు. నాబోటివారికి నువ్వు రోజూ శాంతి భోదనలు ఎలా చేస్తావు అని అడిగాడు. నేహ్రు గారు ఒక సారి చెప్పి బయట పడ్డారు.

కొండముది సాయికిరణ్ కుమార్ said...

చాలా టచింగ్ పోస్టండి. అఫ్జల్ గురు, కసబ్ లాంటి దేశద్రోహులకు కోర్టులు ఉరిశిక్ష విధించినా, అది అమలు పరిస్తే మైనారిటీ ముస్లీములు "ఫీల్" అవుతారని తీవ్రవాదానికి చేయూతనిచ్చే విధంగా ప్రభుత్వాలు ప్రవర్తించినప్పుడు, "హిందు టెర్రరిజం" కూడా విస్తరించే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే, ఈ దేశంలో ముస్లీముల పరిస్థితి ఏమిటి?

పైగా, తీవ్రవాదులకు, ముస్లీంలకు లేనిపోని లింకులు చుట్టి, భారతీయ ముస్లీములను మన ప్రభుత్వమే అవమానిస్తున్నది, వారి దేశభక్తిని, చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నది.

ముంబాయి మీద పాకిస్తానీ తీవ్రవాదులు దాడి చేసి గట్టిగా సంవత్సరం కాకమునుపే, పాకిస్తాన్ తో క్రీడా సంబంధాలు ఉండాలని షారూఖ్ ఖాన్ కోరితే ఎవరికీ తప్పేమీ కనిపించదు. పైగా, షబాన అజ్మీ, జావేద్ అక్తర్ నుంచి అందరూ ఆ విషయంపై ఉపన్యాసాలు దంచేవారే.

అదే, కాశ్మీరి నిర్వాసితుల కోసం అనుపం ఖేర్ పోరాడుతుంటే, అతన్ని ఎవరూ పట్టించుకోరు. కనీసం మాట వరసకైనా కాశ్మీర్ లో జరుగుతున్న దౌష్ట్యాన్ని ప్రశ్నించరు.

ramnarsimha said...

@Author,

These kind of issues should be discussed regularly..

Some day we can get a conclusion..

TRUTH ALWAYS TRIUMPHS..

Thanks to all..

Yours sincerely,
Ram..

durgeswara said...

లక్షలాదిమంది స్వంత దేశం లోనే కాంది్శీకులుగా బ్రతికే దుస్థితి మనదేశం లో తప్ప మరెక్కడా కనపడదనుకుంటా ప్రపంచమ్ లో . ధర్మం పట్ల నిరాసక్తత ప్రదర్శిస్తే భవిష్యత్తరాలవారికి ఏమి మిగులుతుందో కాశ్మీర్ హిందువుల జీవితాలను మనసుపెట్టి చూస్తే తెలుసుతుంది. అంత తీరిక లేక మన ఉద్యోగాలు,ఆస్తులు ,సౌకర్యాలగూర్చి మాత్రమే ఆలోచిస్తూ కూర్చుంటే మనకు ప్రత్యక్షంగానే తెలిసొచ్చేరోజు దగ్గరలోనే ఉంది . ఒకభారతీయుని గా అలా ఒక కాశ్మీరీ వేదన తొలగిమ్చటానికి నావంతుగా ఏమీ చేయలేనందుకు, ఆయువకుడు మరలా మీకు కనిపిస్తే నన్ను క్షమించమని నాతరపున చెప్పండి

మైత్రేయి said...

చాలా బాగా రాసారు. మససు బాధతో నిండి పోయింది. మా ఆఫీస్ లో ఒక అబ్బాయి ఉండేవాడు. అతను పాకిస్తాన్ ఏర్పడినప్పుడు ఇండియా వచ్చిన ఫామిలీలో వాడు. అతను వాళ్ళ అమ్మమ్మ చెప్పిన కధల ద్వారా విషయాలు తెలుసుకొన్నవాడు, ప్రత్యక్షంగా చూసిన వాడు కాకపోవటంతో , కొంత తక్కువ ఆవేశంగా ఉండేవాడు. కాని బాగా సంపాదించాలి తన తాతలు లాహోర్ లో ఎలా ఉండే వాళ్ళో అలాంటి ఆర్ధిక స్తితి మళ్ళీ పొందాలి అనే కసితో ఉండేవాడు. అయితే అతనిది సక్స్ స్ స్టోరి. అలాగే సంపాదించాడు ఇప్పుడు. స్విమ్మింగ్ పూల్ ఉండే ఇల్లు కట్టాలని అతని డ్రీమ్. లండంన్ లో సెటిల్ అయ్యాడు.

అలాగే కరాచి ప్రాంతం నుండి వచ్చిన సింధీ కుటుంబాలు ఎన్నో గోవా, గుజరాత్ లో పాత ఆస్తులన్నీ పోగొట్టుకొని కొత్త జీవితాలు మొదలు పెట్టారు. అలాగే ఈస్ట్ బెంగాల్ నుండి వలస వచ్చిన వాళ్ళు వెస్ట్ బెంగాలు వారికంటే పేదరికంలో ఉంటారు. ఇప్పటికే చాలా భూమిని మనం పోగొట్టుకొంటాము.

చాణుక్యుడు చెప్పినట్లు తీర ప్రాంతాలు ఆక్రమణకు గురి అవుతుంటే మనకేంలే అని చూస్తూ ఉంటే మద్య ప్రాంతాల వారికి చివరికి కొసన ఉన్న మనకు అదే పరిస్థితి వస్తుంది.

Nrahamthulla said...

కొండముది సాయికిరణ్ కుమార్
బాగా చెప్పారు.అఫ్జల్ గురు, కసబ్ లాంటి దేశద్రోహులకు కోర్టులు ఉరిశిక్ష విధించినప్పుడు వెంటనే ఉరితియ్యాలి.ఉరితీస్తే ముస్లీములు ఏమీ "ఫీల్" కారు.అవుతారేమో అనే అనుమానం నేతలకు రావడమే తప్పు."హిందు టెర్రరిజం" వస్తే ఈ దేశంలో ముస్లీములు మిగలరు.ఇరువర్గాలకు తీవ్ర నష్టం జరుగుతుంది.సామాన్యప్రజల్లో తొంభైతొమ్మిది శాతం మంది మంచివాళ్ళే.
తీవ్రవాదులకు, ముస్లీంలకు లేనిపోని లింకులు చుట్టి, భారతీయ ముస్లీములను మననేతలే అవమానిస్తున్నారు.వారి దేశభక్తిని, చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నారు.

Krishnapriya said...

@శిరీష గారు,

ధన్యవాదాలు! నా స్నేహితుడు సరైన దారి లో నడిచి జీవితం లో స్థిరపడాలనే నా కోరిక!

సాంబశివుడు గారు,

మీరు చెప్పిన కథ బాగుంది. అనుభవిస్తేనే కాని అర్థం కాదు. నిజమే.

కృష్ణప్రియ/

Krishnapriya said...

దుర్గేశ్వర గారూ,

థాంక్స్! వారికి ప్రశాంతత కలగాలని ఆశిద్దాం! స్వంత దేశం లో కాందశీకులు గా బ్రతికే వాళ్ళు.. హ్మ్మ్ వేరే దేశాల్లో కూడా ఉన్నారనుకుంటా.
బాష్కుల గురించీ,..ఇంకా ఎవరి గురించో కూడా చదివాను గుర్తులేదు.

సాంబశివుడు గారు చెప్పినట్టు ఎంతోమంది వారి సొంత ఊరుకి దశాబ్దాల పాటూ వెళ్ళక/వెళ్ళలేక పోయినా.. వెళ్ళగలం అన్న తృప్తి తో జీవితం సాగిపోతుంది. వెళ్ళలేం.. వెళ్ళకూడదు అన్న ఆంక్ష ఉంది అనుకున్నవాళ్ళకి ప్రశాంతత ఎక్కడిది?

కృష్ణప్రియ/

Krishnapriya said...

మైత్రేయి గారూ,

ధన్యవాదాలు,..
సమీర్ గత దీపావళి కి, చిచ్చుబుడ్లు కాలుస్తుంటే.. అదేదో సినిమాలో హీరోయిన్ కనపడినట్టు, మోటర్ సైకిల్ మీద ఇంకో జమ్మూ మిత్రుడితో వచ్చి, మాకు కాడ్బరీస్ సెలబ్రేషన్లు ఇచ్చి, మా అత్తగారికీ, మావారికీ,నాకూ కాళ్ళకి నమస్కరించి, రెండంటే రెండు టపాకాయలు కాల్చి.. 'క్రిష్నాజీ.. ఇంకా చాలా మంది స్నేహితుల ఇళ్ళకెళ్ళాలి ' అని సెలవు తీసుకున్నాడు.

నిన్నంతా నా మనసు మనసులో లేదు.

బునియాద్ సీరియల్ దూర్ దర్శన్ లో చూసి ప్రభావితులవని వారు (హిందీ ఒక మాదిరి గా అర్థమయేవారు) ఆరోజుల్లో ఎవరైనా ఉన్నారా?

కృష్ణప్రియ/

Krishnapriya said...

సాయికిరణ్ కుమార్ గారూ, రహంతుల్లా గారూ,

మీరు చాలా మంచి విషయాలు టచ్ చేశారు.
అన్ని రకాల కులమతజాతుల వారి పట్ల మ్యూచువల్ ట్రస్ట్ మీద సమాజ నిర్మాణం జరగాలి.

ఒక టెర్రరిస్ట్ ని టెర్రరిస్ట్ గానే చూసి ఉరిసిక్ష వేయాలి. కానీ అతని సామాజిక,సాంఘిక, రాజకీయ వర్గం ' ఫీల్ ' అవుతారని ప్రభుత్వం/రాజకీయనాయకులు భావించటం (ఒకవేళ భావిస్తే..) అది దురదృష్టకరం.

మన దేశం లో ఏ ఒక్క వ్యక్తీ, వర్గమూ రక్షణ లేకుండా ఉన్నారంటే.. మనకందరికీ అది సిగ్గుచేటు.

నేపాలీ టెర్రరిస్ట్ ని ఏమన్నా అనాలంటే హిందువులు (ఇప్పుడు కాదనుకోండి. నేపాల్ కమ్యూనిస్ట్ అయిపోయింది గా), పాకిస్తానూ,బంగ్లాదేశ్ టెర్రరిస్టులని ఉరి తీసేముందు ముస్లింలూ, ఇంకో సరిహద్దునుండి వచ్చే టెర్రరిస్టులని శిక్షించే ముందు బౌద్ధులూ, క్రిష్టియన్లూ.. 'ఫీల్ ' అవుతారనుకుంటే.. ఇంక మనం ముందుకెళ్ళినట్టే..

రాం నరిసిం హ గారూ,

ధన్యవాదాలు!

కృష్ణప్రియ/

nagarjuna said...

I almost cried reading the post and the comments. How is that we are neglecting such issues happening on such a large scale.
I pray the almighty to protect sameer...

The world is more sinner than i thought, but do we have enough love to heal its wounds ?

జయ said...

నిజమే, ఇలాంటి జీవితాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ సమ్స్యలు ఎప్పటికీ తీరవనే అనిపిస్తుంది. ముఖ్యంగా కాశ్మీరియువతను తలుచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది. మీరు ఏం రాసినా చాలా బాగా రాస్తారండి.

Krishnapriya said...

నాగార్జున గారూ, జయ గారూ,

ధన్యవాదాలు! Thanks for your kind words..

కృష్ణప్రియ/

కొత్త పాళీ said...

Heartrending.
నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి - ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా?
ఏయే గుండె వెనక ఎన్నెన్ని వ్యధలో!

Indian Minerva said...

చలా ఆర్ద్రంగా చెపారు. మీ డోగ్రా ఆవేశంలో అర్ధం వుంది ఆచరించి చూపించడంలో చెప్పలేనంత గొప్పతనంవుంది.

కృష్ణప్రియ said...

అన్నట్టు మా డోగ్రా తిరిగి వచ్చాడు.. నెమ్మదిగా రాస్తాను..అతని పయనం గురించి..

మైత్రేయి said...

Good news !!
We will wait for your post Krishna ji :)

Mauli said...

బాప్ రే :(

రాజ మల్లేశ్వర్ కొల్లి said...

wow.., That's great news..! How is he doing now?

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;